కాటూరివారి పౌలస్త్య హృదయము

2
11

[ఈ వ్యాసంలో వ్రాసిన చాలా విషయాలు, సుమారు 44 సంవత్సరాల క్రితం మా గురువుగార్లలో ఒకరైన కీ. శే. లక్కరాజు శ్రీనివాసరావుగారు నాకు చెప్పినవి. ఆ రోజుల్లో వారు విజయవాడలో ‘ఆంధ్రపత్రిక’లో ఉపసంపాదకులుగా పనిచేసేవారు. సాహిత్యాభిలాష చేత వారికి కాటూరి వేంకటేశ్వరరావుగారితో చాల దగ్గర అనుబంధం ఉండేది. శ్రీనివాసరావుగారికి వేంకటేశ్వరరావుగారు పెదమామగారు కూడా అవుతారు. అందుచేత, ఈ వ్యాసం శ్రీనివాసరావుగారి దివ్యస్మృతికి అంకితం.]

పౌలస్త్య హృదయము తొలి ముద్రణ 1944వ సంవత్సరంలో మచిలీపట్నంలో ప్రకటించబడింది. ఇందులో గ్రంథకర్తలు పింగళి లక్ష్మీకాంతంగారు, కాటూరి వేంకటేశ్వరరావుగారు. వీరిరువురూ జంట కవులు. ఇప్పుడు నాకు వెబ్సైట్లో (website) దొరికిన ముద్రణ 2016వ సంవత్సరంది. ఇందులో, కృతి కర్త ఒక్కరే. ఆయనే కాటూరి వేంకటేశ్వరరావుగారు. దీన్ని బట్టి, మొదట ఇద్దరి పేర్ల మీద ప్రకటించినా, అసలు కృతికర్త కాటూరి వేంకటేశ్వరరావుగారు అని తెలుస్తోంది. మొదట్లో, ఎందుకు ఇద్దరి పేర్ల మీద ప్రకటించారో కారణాలు తెలియవు.

కవిత్రయంలో మూడవ వాడైన ఎర్రాప్రగడ తన వంశదీపకుడని చెప్పుకున్న కాటూరివారు, ఐదు పద్యాలో తమ అన్నగారైన రామకృష్ణయ్యగారికి వినయ విధేయతలతో ‘పౌలస్త్య హృదయము’ కృతిసమర్పణము చేశారు. వీటిల్లో మొదటి పద్యంలో “ఇరువదేండ్లాయె, బౌలస్త్య హృదయమును రచించి” అని చెప్పుకున్నారు. భారతి సాహిత్యమాస పత్రిక ఫిబ్రవరి 1959 సంచికలో ‘కాటూరి ఖండకావ్యాలు’ అన్న శీర్షికతో శ్రీ పి. గణపతిశాస్త్రి గారు “ఈ కవి ఇతః పూర్వమే రచించిన ‘పౌలస్త్య హృదయము’ ఒక చిన్న పుస్తక రూపంలో వెలువడింది. ఇటీవల మచిలీపట్టణంలో త్రివేణీ ప్రకాశకులు ‘గుడి గంటలు’, ‘పౌలస్త్య హృదయము’ కలిపి ప్రత్యేకంగా ఒక కవితా సంపుటి ప్రకటించారు.” అని వ్రాశారు. అంటే, 1958-59 ప్రాంతాల్లో ఈ సంపుటి ప్రచురింపబడి ఉండవచ్చు. అక్కడి నుండి 20 సంవత్సరాలు వెనక్కి వెళితే, ‘పౌలస్త్య హృదయము’ రచనాకాలము 1938-39 అయి ఉండవచ్చు.

కాటూరి వేంకటేశ్వరరావు గారు (1895-1962) వ్రాసిన ‘పౌలస్త్య హృదయము’ ఒక విలక్షణమైన ఖండకావ్యము. పులస్త్య బ్రహ్మ కుమారుడైన రావణ బ్రహ్మ అంతరంగాన్ని చక్కగా ఆవిష్కరించిన అరుదైన ఘనత ఈ కావ్యానికి ఉంది. ఈ కావ్యంలో వస్తువే కాక దాన్ని వ్యక్తీకరించిన పద్ధతి కూడా ఒక అపూర్వమైన అనుభూతిని పాఠకులకు కలిగిస్తుంది. తెనుఁగులెంక తుమ్మల సీతారామమూర్తిగారు కాటూరివారిని ప్రశంసిస్తూ చెప్పిన 15 పద్యాలలో, ఒక పద్యం పౌలస్త్య హృదయం కావ్యం గురించినది. రావణుని వైరభక్తిపై వ్రాసిన కావ్యం చిన్నదయినా, అది ఒక్కటీ చాలు, ఆయన అపర వాల్మీకిగా నాలుగు దిశలా కీర్తింపబడడానికి, అని చెప్పారు. ఆ పద్యం క్రింద ఇవ్వబడింది.

తే.గీ.
రావణుని వైరభక్తిపై వ్రాసినట్టి
కబ్బ మితనిది చిన్నదౌఁ గాక, యదియ
చాలు నపర వాల్మీకినా నేల నాల్గు
దిశల నితఁ డజరామరయశము నంద.

ఆంగ్ల సాహిత్యంలో ‘సాలిలాక్వి’ (soliloquy) అంటే ‘స్వగతము’ అని, నాటకాలలో, ముఖ్యంగా షేక్స్పియర్ (1564-1616) నాటకాల్లో, ఒక ప్రక్రియ క్రీ.శ. 17వ శతాబ్దం నుండి చాలా ప్రజాదరణ, ప్రాముఖ్యత సంతరించుకుంది. సాలిలాక్వి (స్వగతము) అంటే నాటకంలో ఒక పాత్ర తనతో తనే కొన్ని మాటలు చెప్పుకోవడం.

షేక్స్పియర్ నాటకాల్లో అలాంటి స్వగతాలు స్వతంత్ర కవితాఖండాలుగా నిలిచాయి. షేక్స్పియర్ నాటకాలు పూర్తిగా చదవని వాళ్ళు కూడా, వాటిల్లో ఉన్న స్వగతాలను లేదా వాటి భాగాలను, వేరువేరు సందర్భాలలో ఉదాహరించడానికి పనికొచ్చే నిత్యసత్యాలుగా భావించారు. ఆ సాలిలాక్వీలు విద్యార్థులకు పాఠ్యాంశాలుగా ఉంటూ వచ్చాయి. తెలుగులో, ‘స్వగతము’ అన్న పదానికి ‘తన గడచిన కాలము’ అని అర్థము. నాటక సాహిత్యంలో ‘స్వగతము’ అంటే తనలో తాను మాట్లాడుకోవడము లేక తనకు తానే తలపోసుకోవడము. తెలుగు నాటకాల్లో, స్టేజిమీద ఒక పాత్ర ఒకటి-రెండు మాటలు తనలో తాను అనుకుని (మెల్లగా, ప్రేక్షకులకి మాత్రమే తెలియాలి అన్నట్లుగా), తర్వాత బిగ్గరగా (ప్రకాశముగా) ఇతర పాత్రలతో ఏదో చెప్పినట్లుగా చూపిస్తారు. పాత్ర మనసులో ఉన్న భావం, వాళ్ళ మానసిక సంఘర్షణ, ప్రేక్షకులకి తెలియజెప్పడానికి ఈ స్వగతాలు ఉపయోగపడ్డాయి.

ఇంచుమించు, సాలిలాక్వీల లాంటివే తెలుగులో స్వగతాలు లేక ఏకపాత్ర రూపకాలు కూడా. 1920 దశకంలో బందరులో (మచిలీపట్నంలో), తెలుగులో ఏకపాత్ర రూపకాలు (‘మయసభ’ లాంటివి), షేక్స్పియర్ నాటకాలలోని ప్రసిద్ధ ఘట్టాలు (ఒక్కరే అభినయించేవి) ప్రదర్శింపబడేవిట. ఆ తర్వాత, ఏకపాత్ర రూపకాలు (జనసామాన్యంలో, వాటిని ఏక పాత్రాభినయాలు అంటారు) చాలా ప్రాచుర్యంలోకి వచ్చాయి. కాటూరి వారు అదే కాలంలో బందరులో పనిజేయడం వలన, వీటి ప్రభావం కచ్చితంగా వారిమీద ఉండి ఉండాలి. నాటకాల్లోనే కాకుండా, కేవలం కవితాత్మకంగా ఉండే స్వగతాలు కూడా తెలుగులో వ్రాయబడ్డాయి. పద్యరూపంలో కూడా కొన్ని స్వగతాలు తెలుగులో వచ్చాయి. ఇవన్నీ, ‘పౌలస్త్య హృదయము’ వ్రాయడంలో కాటూరివారిపై ప్రభావం చూపి ఉండవచ్చు. ఎందుకంటే, ‘పౌలస్త్య హృదయము’ ఒక స్వగతము. రావణుడు తన గోడు చెప్పుకోవడమే ‘పౌలస్త్య హృదయము’ లోని కథాంశము. ఇందులో ఉన్న కథకి మూలం ఏ పురాణంలోనూ దొరకదు. కథ ఈ కావ్యంలో కూడా స్పష్టంగా చెప్పబడలేదు. కాకపోతే, కథకి ప్రేరణ నిచ్చేవి మాత్రం, భాగవత పురాణంలోను, వాల్మీకి రామాయణం ఉత్తరాకాండములోను ఉన్నాయి.

వైకుంఠంలో శ్రీమహావిష్ణువు దగ్గర ద్వార పాలకులుగా ఉన్న జయ విజయులు, సనక సనందనాదుల శాపం కారణంగా మూడు సార్లు మహావిష్ణువుకి ఆగర్భ శత్రువులుగా ఆయనకు సమానమైన శక్తివంతులుగా జన్మించి ఆయన చేతిలోనే మరణం పొంది వైకుంఠానికి తిరిగి వస్తారని భాగవత పురాణంలో ఉంది. ఆ ప్రకారమే వారు కృతయుగంలో హిరణ్యాక్ష హిరణ్య కశిపులుగా, త్రేతాయుగంలో రావణ కుంభకర్ణులుగా, ద్వాపర యుగంలో శిశుపాల దంతవక్త్రులుగా జన్మించి తిరిగి విష్ణు సాన్నిధ్యం పొందుతారు.

వాల్మీకి రామాయణంలో అనేకానేక ప్రక్షిప్తములు (తరువాత చేర్చబడినవి) ఉన్నాయని అంటారు. ఉత్తర రామాయణంలో 37వ, 38వ సర్గలకు మధ్య 5 సర్గలు ప్రక్షిప్తము చేశారని అంటారు. అలా ప్రక్షిప్తము చేసిన భాగంలో, రాముడితో అగస్త్యుడు చెప్పినట్లుగా కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు ఉన్నాయి. అందులో ఒకటి రావణ సనత్కుమారుల మధ్య కృతయుగంలో జరిగిన సంభాషణ ఉంటుంది.

రావణుడికి సనత్కుమారుడు అనేక విషయాలు చెబుతాడు. అందులో ముఖ్యమైనది ఏమిటంటే, విష్ణువు చేతిలో మరణించినవారికి తరువాతి పుట్టుకలు, చావులు ఉండవని, నేరుగా వైకుంఠానికి వెళతారని. అది వినగానే, రావణుడి మనస్సులో ‘విష్ణువు చేతిలో చావడం ఎలాగా’ అనే అలోచన మొదలవుతుంది. అది పసిగట్టిన, సనత్కుమారుడు, విష్ణువు గురించి చెబుతూ, త్రేతాయుగంలో విష్ణువు రాముడుగా పుట్టడం, లక్ష్మీదేవి సీతగా పుట్టడం, వివాహానంతరం కారణాంతరాల వల్ల వారు దండకారణ్యానికి వెళ్ళవలసి రావడం, వారు పర్ణశాలలో నివాసం చేయడం జరుగుతాయని చెప్పాడు.

అప్పటినుంచి, రావణుడు జననమరణ చక్రం తప్పించుకోవడానికి రామావతారంలో విష్ణువుతో ఎలా వైరం పెట్టుకోవాలి, విష్ణువు చేతిలో ఎలా మరణించాలి అని ఆలోచింపసాగాడు. ఆ అవకాశం సీతారామలక్ష్మణులు దండకారణ్యంలో పర్ణశాలలో ఉన్నప్పుడు దక్కింది. మారీచుడి సాయంతో రామలక్ష్మణులని బయటికి పంపి సీత ఒంటరిగా ఉండగా అపహరించి రామునికి ఆగ్రహం కలిగించి రామునితో వైరం తెచ్చుకున్నాడు.

ఇదంతా రామునికి అగస్త్యుడు చెబుతూ – “రామా, నీకు తెలియక పోయినా నీవు విష్ణువువని రావణునికి తెలుసు. నీ చేతిలో మరణించడానికే నీ భార్య సీతని అపహరించాడు.” అని చెప్పాడు. పైగా, రావణుడు సీతను లంకలో ఉంచి జాగ్రత్తగా రక్షించాడని, ఒక తల్లిని కొడుకు ఎలా చూసుకుంటాడో అలా చూసుకున్నాడు రావణుడనీ చెప్పాడు. విష్ణువు చేతిలో మరణిస్తే జననమరణ చక్రం నుండి విముక్తి లభిస్తుంది అని సనత్కుమారుడు చెప్పడం, రావణుడు అలా మరణించినా కూడా, భాగవత పురాణంలో చెప్పినట్లుగా మళ్ళీ ద్వాపర యుగంలో శిశుపాలుడుగా పుట్టడం, వీటి మధ్య వైరుధ్యం కొట్టొచ్చినట్లుగా కనబడుతుంది. ఏది ఏమైనా, ఈ వృత్తాంతము కాటూరివారి అందమైన కల్పనకి ఆధారమైంది.

‘పౌలస్త్య హృదయము’ లో పౌలస్త్యుడు అంటే పులస్త్య బ్రహ్మవంశమువాడు, అనగా రావణుడు, ‘హృదయము’ అంటే అంతఃకరణము లేక మనస్సు. ‘పౌలస్త్య హృదయము’ అంటే రావణుని అంతఃకరణము. సందర్భ మేమిటంటే సముద్రుడు వచ్చి రాముడు లంకపై యుద్ధానికి వచ్చాడని రావణునికి చెప్పినపుడు, దానికి రావణుని ప్రతిస్పందన. ఈ సముద్రుడు అన్నది రావణుడి లంకా రాజ్యానికి ఆనుకునే ఉన్న సముద్రాని కిచ్చిన మానవ రాపము. సముద్రుడు ఒక మనిషి అయినట్లు అతనికి మనుషుల్లాగే కష్టసుఖాలు పంచుకునే తత్వం ఉన్నట్లు, ఒక మంచి పొరుగువాడి లాగా, మిత్రుడి లాగా రావణుని దగ్గరికి వచ్చి నీకేదో కొంప లంటుకుంటున్నాయని చెప్పడం (అంటే కొంప మీదికి ఎవరో పోట్లాటకి వచ్చారని), దానికి సమాధానంగా రావణుడు ఒక చిరకాల మిత్రునికి చెప్పినట్లు సముద్రునికి తన గోడంతా చెప్పడం, ఇందులోని కథాంశం. సముద్రుడిది కల్పిత పాత్ర కాబట్టి, అతనికి మాటలు ఏమీ లేవు కాబట్టి, ఇది రావణుని స్వగతము, ఏకపాత్ర పద్య రూపకము. ఈ ఖండకావ్యం లోని 39 పద్యాలలో రావణుని అంతరంగం ఆవిష్కరించబడింది.

ఈ సందర్భం మన నిత్య జీవితంలో ఎలా ఉంటుందో చూద్దాము. మనం ఒకళ్ళ దగ్గిర అదివరకు కొంతకాలం పనిజేసి మానేశాము. తర్వాత వేరే ఎక్కడో బ్రతుకుతూ అంత వాళ్ళమయ్యాము. ఆ తర్వాత, ఆ పాత యజామనితో కావాలని ఏదో తగువు పెట్టుకున్నాము. ఇప్పుడు ఆ యజమాని మనతో పోట్లాటకి వస్తున్నాడన్న కబురు తెలిస్తే మనకి అతనితో ఉన్న అనుబంధంలో మంచి విషయాలు, చెడు విషయాలు అన్నీ వరసగా గుర్తొస్తాయి. ఆ కబురు తెచ్చింది మిత్రుడైతే, అతనితో మన ఆలోచనలు, అక్కసు అన్నీ పంచుకుంటాము. రావణుడి స్వగతము కూడా సరిగ్గా అలాగే ఉంటుంది. ఆ ధోరణి ఎలా ఉంటుందో ఇంకొంచెం వివరంగా చూద్దాం.

రానీ నువ్వెందుకు భయపడతావు. మనిద్దరం ఏమన్నా తక్కువ వాళ్ళమా. చేతకాని వాళ్ళమా. ఎప్పుడన్నా, దేనికయినా భయపడ్డామా. ఏది ఏమయినా, మనం అమర్యాదగా ఉండద్దు. ఆయన వచ్చినప్పుడు, చక్కగా స్వాగతించు. ఎంతమందిని తీసుకొస్తాడో తీసుకుని రానీ. ఈ విధంగా అయినా అయన్ని మళ్ళీ చూసే భాగ్యం నాకు కలుగుతోంది. ఆయన్ని తొందరగా రప్పించడానికి నేను ఏమేమి పనులు చేశానో తెలుసా. ఆయనకి ఒళ్ళు మండే పనులన్నీ చేశాను. అయినా, ఇంత ఆలశ్యం చేస్తాడా, రావడానికి. అవును, నువ్వెందుకు కంగారు పడతావు. అసలు ఎవరతోనన్నా, గొడవైతేనే కదా మన గొప్ప ఏమిటో ప్రపంచానికి తెలిసేది. ఆయనకి నేను పెట్టిన కష్టానికి, ఎక్కడెక్కడికో వెళుతున్నాడు, ఎవరెవరినో కలుస్తున్నాడు, అంతా తెలుసుకుంటూనే ఉన్నాను. నా సాయం అడగచ్చుగా. అంత కానివాణ్ణయి పోయానా, నేను? అసలు నన్ను ఆయన తప్పించుకు తిరుగుతుంటే ఆయన్ని రెచ్చగొట్టే పనులు చాలా చేశా. అయినా, లాభం లేకపోయింది. ఇప్పుడెక్కడికి పోతాడు. ఈసారి మాత్రం అయనకి బాగా ఒళ్ళుమండే పని ఒకటి చేశా. ఇప్పుడు నాకు చాలా తృప్తిగా ఉంది. ఆయన్ని రప్పించాలని ఇదంతా నేను చేస్తే, ఆయన నాకు నమ్మక ద్రోహం చేస్తాడా. అది చూసి నేను ఊరుకుంటానా. నీకు తెలియదు కానీ, అసలు మొదట్లో బానే ఉండేవాడు. ఎందుకో, ఈమధ్యే ఇలా అయిపోయాడు. సరే వస్తున్నాడుగా, రానీ. ఆయన పోట్లాటకి వచ్చినా, మనం మంచిగానే ఉందాం. బాగానే, మన స్థాయికి తగ్గట్లుగా, స్వాగతిద్దాం. తర్వాత, ఏం జరిగితే అది జరుగుతుంది. అంతగా, గొడవకి సిద్ధమయితే మన తడాఖా చూపిద్దాం. ఇలా సాగుతాయి రావణుడి మిశ్రమ భావోద్వేగాలు (mixed emotions) కూడా. ఇవన్నీ, వరసగా తన పద్యాలలో మనోహరంగా, అక్కడక్కడా వ్యంగ్యంగా, కాటూరివారు ఎలా చూపించారో, చూద్దాం.

మొదటి పద్యంలో, “ఎందుకిలా నురుగులు కక్కుకుంటూ, రొప్పుకుంటూ, కంగారుగా, భయంగా వస్తున్నావు? ఎవరివల్ల నీకీ స్థితి కలిగింది? చెప్పవయ్యా సముద్రుడా” అని రావణుడంటాడు. ఇక్కడ పద్య నిర్మాణం, సహజంగా ఉండే సముద్రఘోషని, పరిస్థితికి తగ్గట్టుగా అన్వయిస్తూ కాటూరివారు ఎలా అభివర్ణించారో చూడండి.

మ.
నురుఁగుల్ గ్రక్కుచు నూర్పుసందడులు మిన్నుల్ ముట్ట నొక్కుమ్మడిన్
బరుగుల్ ద్రొక్కుచు శీర్ణ కేశముల నుద్బాహుండవై వచ్చు త
త్తరమున్ గాంచిన నుత్తలంపడెడిఁ జిత్తం, బీ భయోద్వేగ మె
వ్వరిచే, నీ కొనఁగూడె నర్ణవపతీ! వాక్రుచ్చవయ్యా! వెసన్. ( 1)

ఇద్దరు మిత్రులు కలుసుకున్నపుడు, వాళ్ళిద్దరు మాత్రమే గొప్పగా ఉన్నట్లు, మిగిలిన ప్రపంచం సరిగాలేనట్లు, చెప్పుకోవడం పరిపాటి. దానికి తగ్గట్లుగానే, రావణుడు ఇలా అంటున్నాడు, – “మనిద్దరం మమూలు వాళ్ళమా! మనం కళ్ళెర్రజేస్తే మూడులోకాలు వణుకుతాయి. నీకేం కావాలన్నా, నా ఇరవై చేతులతో సాయం చేయడానికి నేనున్నాను. నాకు (నా లంకా రాజ్యానికి) అండగా పెద్దపెద్ద అలలతో ఒక పెట్టని కోటలాగా నువ్వున్నావు. మనం ఎవ్వరికీ భయపడాల్సిన పనిలేదు.”. ఈ భావాన్నే 2వ పద్యంలో ఎలా పలికించారో చూడండి.

తే.గీ.
భ్రుకుటి మాత్రముచే మూడు భువనములకు
విలయము ఘటించు జగదేక వీరుల మఁట!
నీకు మద్బాహువింశతి, నాకు నీదు
వీచికాకోటి యఁట కోట! వెఱ పిఁకేల? (2)

“ఎందుకు భయం? ఏమన్నా కొంప లంటుకుంటున్నాయా? ఆకాశమేమన్నా ఊడి పడుతోందా?” అని అంటాము కదా. అదే విధంగా, రావణుడు అంటున్నాడు. సూర్యుడి ప్రకాశంలో గాని, గాలి వీచడంలో గాని, ఏమన్నా మార్పుందా? ప్రళయం వచ్చినట్లుగా మేఘాలు గర్జిస్తున్నాయా? చుక్కలు రాలడంలేదు కదా? దేనికి భయం? అసలు భయం అనే మాట మనం ఏనాడైనా ఎరుగుదుమా? ఈ విధంగా రావణుడి చేత పలికించిన మాటలు 3వ పద్యంలో చూడండి.

శా.
నాకున్నీకు భయం బఁటన్న నుడి యెన్నండైన విన్నామ? నేఁ
డీ కంపమ్మునకున్ గతమ్ము కనరాదే! సుంతయున్ భాస్కరుం
డేకాకారత వెల్గు, వాయువును మున్నె ట్టట్టులే వీచు, లే
దే కల్పాంత పయోద గర్జ, కనరాదే తారకల్ రాలుటల్. (3)

ఆ భయం తాలూకు తెచ్చిపెట్టుకున్న గాంభీర్యం ప్రదర్శిస్తూ రావణుడు “నా కత్తి (చంద్రహాసం) నా చెయ్యి జారలేదు, నీ లోపల బడబాగ్ని ఆరలేదు, శ్రీరాముడు ధనుష్టంకారం ఇంకా చేయనే లేదు” అని అంటున్నాడు. ఇది 4వ పద్యంలో చూడవచ్చు.

తే.గీ.
చంద్రహాసము నా చేయి జాఱలేదు
ఔర్వశిఖియు నీ జఠరమం దాఱలేదు
సజ్యకార్ముకుఁడై రామచంద్రమూర్తి
శింజినీటాంకృతియు నింత సేయ లేదు. (4)

ఇంకాస్త విషయాన్ని ముందుకు తీసుకుని వెళ్ళి, రావణుడు “ఏమీ భయపడకు. రామలక్ష్మణులకీ, సుగ్రీవుడికీ, హనుమకీ, వాళ్ళ వానర సైన్యానికీ చక్కగా రావడానికి త్రోవ ఇవ్వు.” అని అంటున్నాడు. ఇది 5వ పద్యంలోని సారాంశం.

తే.గీ.
ఎట్లు! చెప్పవు? రాఘవుఁడే! మఱేల!
విడువు కంపము, త్రోవ రా విడువు మతని
కనుజ సౌమిత్రితో, సూర్యతనయు తోడ,
హనుమతోఁ దరుచర వరూధినుల తోడ. (5)

వాళ్ళు యుద్ధానికి వస్తున్నారని వాళ్ళని చూడవచ్చని ఉత్సాహం చూపిస్తూ, రావణుడు “ఎన్నాళ్ళకెన్నాళ్ళకు. నాకు ఇరవై కళ్ళున్నందుకు ఫలితం రాబోతోంది. నా భుజపరాక్రమం చరితార్ధమయే సుముహూర్తం వచ్చింది.” అని అంటున్నాడు. మామూలుగా అయితే రెండు కళ్ళతో చూస్తాము. ఇరవై కళ్ళతో అంటే, ఇంకా బాగా చూడవచ్చని భావం. ఇది 6వ పద్యంలో చెప్పిన విషయం.

కం.
ఎన్నాళ్ళకు! ఎన్నాళ్ళకు!
కన్నులు వింశతియు, నాకుఁ గల్గిన ఫల మా
సన్నమయి వచ్చె! భుజ గ
ర్వోన్నతి, చరితార్ధమగు ముహూర్తము వచ్చెన్. (6)

వెనకటి విషయాలు గుర్తు చేసుకుంటూ, అంటే, విష్ణువు తనే స్వయంగా వచ్చి చంపుతాను అన్న మాటలు గుర్తు చేసుకుంటూ (వాచ్యంగా చెప్పకుండా), రావణుడు “వైకుంఠంలో తనన్న మాటలు ఇప్పుడు గుర్తొచ్చాయా నా స్వామికి. చాలా ఆలస్యం చేసి ప్రభువు నన్ను దగా చేశాడుగా.” అని వాపోతున్నాడు. 7వ పద్యంలో చెప్పిందిదే.

కం.
నాఁటికి నేఁడా? తలపున
నాటెను సామికి, వికుంఠ నగరోదితమౌ
మాటలు, దీర్ఘ విలంబము
వాటించి విభుండు నన్ను వంచించెఁ గదే. (7)

వాణ్ణి కొట్టాను, వీడ్ని తన్నాను, వేరొకణ్ణి గజగజలాడించాను అని దర్పంగా కొంతమంది చెబుతారు కదా. అలాగే, రావణుడు, స్వామి ఆలస్యం చేసినా, ఆయన్ని తొందరగా రప్పించడానికి తాను ఏమేమి చేశాడో చెబుతున్నాడు. ఏమని అంటే “పాతాళంలో సర్పరాజు తోక తొక్కాను. ఇంద్రుణ్ణి జుట్టు పట్టుకుని ఆడించాను. శివుడు, పార్వతి సమేతంగా వెండికొండని అల్లల్లాడించాను. మరి, నా సంగతి తెలిసి ఈ విశ్వవిక్షోభాన్ని స్వామి ఎందుకు తప్పింపడు?”. ఈ విధంగా 8వ పద్యంలో రావణుడి చేత పలికించారు.

శా.
పాతాలాధిపు తోఁకఁ ద్రొక్కితి, శచీ ప్రాణేశు కైశ్యమ్ము డా
చేతం బట్టితి, వెండి కొండ శివుతో శీతాచలేంద్రాత్మజో
పేతం బల్లల నాడఁ జేసితిఁ గదా! యీ విశ్వవిక్షోభ మే
లా తప్పింపఁడు సామి నన్నెఱిగి? మేలా నన్ను వంచించుటల్. (8)

స్వామిని రప్పించడానికి ఇంకా ఏం చేశాడో చెప్పే ముందు దానికి నేపథ్యము ఏమిటో చెబుతున్నాడు రావణుడు. ఏమని అంటే ““శివుడి విల్లు విరిచాడు, సీతను చేపట్టాడు రాముడు” అన్నప్పుడే, అది విష్ణువు చేసిన పని అని అర్ధమయింది. పరశురామ గర్వభంగం అయిన నాటినుండి దినమొక సంవత్సరంగా గడుపుతూ అసహనంతో అవివేకంతో కన్నుగానక, కీడు తలపెట్టాను.”. ఆ కీడు ఏమిటో తర్వాత వస్తుంది. 9వ పద్యంలో చెప్పిన విషయం ఇది.

మ.
“శివ కోదండముఁ ద్రుంచె, సీత వరియించెన్ రాముఁ” డన్నప్డె మా
ధవు కార్యం బనుకొంటి భార్గవ భుజాదర్పాపహారక్రియా
శ్రవణంబున్ సరిదాకఁగా దినము వర్షంబైన యుత్కంఠచే
నవివేకమ్మునఁ గన్నుగాన కటు ద్రోహారంభమున్ జేసితిన్. (9)

‘ఎక్కడ, నా జానకి’ అంటూ, దండకారణ్యంలో బిగ్గరగా ఏడుస్తూ, చెట్ల వెంట పుట్టల వెంట వెతుకుతూ, మృగాల్ని పక్షుల్నీ ఆపి అడుగుతూ నా స్వామి అన్వేషించాడుట. కాని నన్ను మాత్రం అడగడం మరచిపోయాడు. ఇది 10వ పద్యంలో రావణుడన్న మాటలు.

తే.గీ.
“దేవి! జానకీ! యెచటనే దేవి!” యనుచు
దండకాటవి నెల్గెత్తి తరుల గిరుల
నెమకి, మృగముల ఖగముల నిలిపి యడిగి,
యుఱక వాపోయెనఁట! నన్ను మఱచి విభుఁడు. (10)

అలా, తమ్ముడి భుజాల మీద చేతులేసి గుండెలు అదిరేలా ఏడుస్తూ తిరుగుతున్న నా స్వామి జాలి గొలిపే రూపం నాకు కనబడుతోంది, అని 11వ పద్యంలో రావణుడి చేత చెప్పించారు.

తే.గీ.
తమ్ముఁ గుఱ్ఱ మూపునఁ గేలుఁదమ్మి మోపి
ఉబుకు వక్షమ్ము బాష్పమ్ము లొలుకు కనులు
నగుచు నా తండ్రి యార్తిమై నడలు నాఁటి
జాలి రూపు నా మోమున వ్రేలు నేఁడు. (11)

తొలి ముద్రణలో, ఈ 11వ పద్యం ఆఖరి లైన్లో ‘జాలి చూపు’ అని ఉంది. దాన్ని కాటూరివారు, తర్వాతి ముద్రణలో ‘జాలి రూపు’గా మార్చినట్లు తెలుస్తోంది.

సీతని నేను అపహరించినట్లుగా జటాయువు చెప్పగా విని, నామీద కోపంతో ఊగిపోతూ ‘రావణా’ అని నా పేరెత్తి ప్రతిజ్ఞ చేసినప్పుడే కదా, నాకు మనశ్శాంతి దొరికింది, అని 12వ పద్యంలో స్వామిని రప్పించడానికి తాను ఏమి చేశాడో అసలు విషయం రావణుడు బయట పెట్టాడు.

తే.గీ.
పుడమి కానుపు నే నట్లు పుడికి తెచ్చు
టలు జటాయువుచే విని, విలులితాశ్రు
కలుషిత కపోలములఁ గెంపు దొలుకఁ గ్రోధ
ముద్రితాననుఁడై రామభద్రమూర్తి
“రావణా” యని నన్నుఁ, బేర్వాడి ప్రతిన
సలిపినపుడు గదా మనశ్శాంతి దొరకె. (12)

స్వామిని తన దగ్గరకు రప్పించుకోవడానికి ఇంకా ఏం చేశాడో చెబుతున్నాడు రావణుడు. ఏమని అంటే, “అంతమందిలో నన్ను గుర్తుపడతాడో లేదో అని అన్నిలోకాల్లో పరాక్రమవంతుడుగా పేరు తెచ్చుకొని పిచ్చి పనులు చాలా చేశాను. నలుగురిచేత రాక్షసుడనని నింద మోపించుకున్నాను. అయినా కూడా, అంత నిశ్చింతా? నన్ను మరచాడు. ఎంత దయలేనివాడో విష్ణువు, చూశావా?”. ఈ మాటలు 13వ పద్యంలో చెప్పబడ్డాయి.

చం.
పదుగుర లోన, నన్ గుఱుతు పట్టునొ, లేదొ యటంచు సర్వ భూ
విదిత పరాక్రముండనయి వీఱిడిసేఁతలు పెక్కు చేసితిన్
బదుగురు, ‘వీడు రక్కసుఁడ’నన్ వెడ నిందల కగ్గ మైతిఁ, దా
మదిమదినుండి నన్ మఱచె మాధవుఁ డెంతటి క్రూరచిత్తుఁడో! (13)

తాను చేసి పనులని రావణుడు సమర్థించుకుంటూ ఏమంటున్నాడంటే, “మునులని హింసించడం నాకేమన్నా ఇష్టమా? స్త్రీలను చెరపట్టడానికి నేనేమన్నా పశువునా? ఇదంతా ఎందుకు చేస్తున్నానంటే, దాసజనులని వెతకడంలో ప్రభువుకి శ్రమ తగ్గించడం కోసమే. క్రూర కర్మలు చేస్తే తొందరగా గుర్తింపు వస్తుంది కదా? అంతే గాని వేరే ఉద్దేశ్యం కాదు.” మామూలుగా బడి పిల్లలు కొందరు బాగా అల్లరి చేసి మాష్టారి దృష్టిని ఆకర్షిద్దామని చూస్తారు. ఇది కూడా అలాగే ఉంది. ఈ వైరభక్తి స్ఫోరకమైన మాటలు 14వ పద్యంలో ఉన్నాయి.

తే.గీ.
మునుల హింసించుటలు నాకు మనసొ? సతులఁ
జెఱ నిడుట కేను బశువునో? సెప్పు మీవె!
ఇటులు దాసు నృశంసుఁ జేయుటలు గూడఁ
బ్రభునకు వినోదమైన గావచ్చు దాస
జన గవేషణాయాసము దనకు గూర్చు
క్రూరకర్మము మాత్ర మే నేర నిజము. (14)

మొదటి ముద్రణలో, ఈ పద్యంలో “జెఱ నిడుట కెను బశువునో?” అని ఉంది. “ఎను బశువు” అన్న ప్రయోగం “దున్నపోతు” అన్న అర్థంలో ఇక్కడ వాడినట్లు తెలుస్తోంది. ఛందస్సు ప్రకారం ఈ ప్రయోగం సరేయైనా, తరువాతి ముద్రణలో “జెఱ నిడుట కేను బశువునో?”, అన్నప్పుడు “జెఱ నిడుటకు నేను పశువునో” అని ధ్వనించడం ఇంకా బాగుంది అని కాటూరి వారికి అనిపించి ఉంటుంది. ఇంకో విషయం, పద్యం నాల్గవ లైనులో మొదటి ముద్రణలో “బ్రభునకు” అని ఉంటే, తరువాతి ముద్రణలో “బ్రభువునకు” అని ఉంది. ఛందస్సు ప్రకారం, “బ్రభువునకు” అనడం కుదరదు కాబట్టి, “బ్రభునకు” అన్న ప్రయోగమే తీసుకోవడం జరిగింది. బహుశా, ఇది టైపు చేయడంలో వచ్చిన తప్పు కావచ్చు.

ఎన్ని దుష్టకార్యాలు చేసినా స్వామి స్పందించడం లేదని దోషం ఆయన మీదకు నెట్టుతూ, రావణుడు ఏమంటున్నాడంటే, “ఇంత చేసినా, ఏమన్నా ఫలితం దక్కిందా? ఆఖరికి, సీతమ్మ తల్లిని అపహరింపక తప్పలేదు. నాకేమైనా, మంచి దక్కనిచ్చాడా విష్ణువు?”. ఈ భావన 15వ పద్యంలో చెప్పబడింది. “ఒక తల్లిని కొడుకు ఎలా చూసుకుంటాడో అలా సీతను చూసుకున్నాడు రావణుడు” అని అగస్త్యుడు రాముడుకి చెప్పిన మాటను ఇక్కడ రావణుడి చేత పరోక్షంగా చెప్పించారు కాటూరివారు.

తే.గీ.
ఇంత జేసినఁగాని నాకించుకంత,
మంచి దక్కఁగ నీఁడాయె మాధవుండు,
సాగరా! యేమి వచియింతు? జానకమ్మ
తల్లినే హరియింపక తప్పదాయె. (15)

“ఈ మనుషుల రాజనీతి ఎలా ఉంటుందో విన్నావా? వైకుంఠంలో తను నాకిచ్చిన వాగ్దానం మరచిపోయాడు, విష్ణువు. ఆఖరికి, నా చేత స్వామిద్రోహం చేయించాడు. అయినా, గుడ్డిలోకం ఆయన్నే మెచ్చుకుంది. తప్పులన్ని నామీద రుద్దింది” అన్న రావణుడి దెప్పిపొడుపు మాటలు 16వ పద్యంలో వింటాము.

శా.
స్వామిద్రోహము కూడ నేర్పెఁ దుదకున్ వైకుంఠుఁ డౌరౌర! తా
నేమో నా కిడు బాసలోఁ దలఁపఁడాయెన్, గ్రుడ్డి లోకమ్ము త
న్నే మెచ్చెన్ దొసఁగెల్లఁ జాల్పుదలలన్ నిల్పెన్ మహాంభోనిధి
స్వామీ! మర్త్యుల రాజనీతి నిపుణత్వం బెల్ల విన్నావుగా. (16)

దెప్పిపొడవడం కొనసాగిస్తూ, ఇంకా రావణుడు ఏమంటున్నాడంటే, “నేమేమైనా ఇక్కడ ఉట్టిగట్టి ఊరేగబోతున్నానా? నాకేమిటి భయం? మంచి అంతా ఆయనకే దక్కనీ. ఆయనకి నేనెవరో తెలిస్తే నాకంతే చాలు”. ఈ మాటలు 17వ పద్యంలో చూస్తాము.

ఆ.వె.
ఉట్టిగట్టి యిచట నూరేగ నుంటినా
యేమి? లోకభీతి యేల నాకు?
దక్క నిమ్ము మంచితన మెల్ల విభునకే,
అతఁడు నన్నెఱుంగు టదియ చాలు. (17)

“అన్నీ తెలిసి కూడా, అప్పుడప్పుడూ, ఏమీ ఎరగనట్లుగా ఉంటాడు విష్ణువు. తెలిసీతెలియక సీతను అపహరించి, నేను మోసపోయాను.” అని రావణుడు చేసిన ఆరోపణలు 18వ పద్యంలో చూస్తాము.

ఆ.వె.
ఎల్ల యెఱిఁగియుండి యేమి నెరుంగని
యట్లు హరి చరించు నప్పుడపుడు;
ఎఱిఁగియెఱుఁగ లేక యే నక్కటా! భూమి
పుత్రి నపహరించి మోస పోతి. (18)

ఇద్దరికీ పూర్వపరిచయం ఉన్నట్లుగా స్వాధీనత (possessiveness) ప్రదర్శిస్తూ, రావణుడు ఏం చెబుతున్నాడంటే, “వైకుంఠంలో ఉన్నప్పుడు నిజంగా పరమాత్మలాగా దర్శనం ఇచ్చేవాడు, స్వామి. అప్పుడాయనకి, ఈ మాయలు, నటనలు తెలియవు. భూమిమీదకి వచ్చిన తరువాతే, ఇవన్నీ మొదలయ్యాయి.” ఈ హాస్యపు పలుకులు 19వ పద్యంలో చెప్పబడ్డాయి.

ఆ.వె.
ఇంట నున్న యప్పు డీ మాయనటనముల్
లేవు కేశవునకుఁ, గేవలుఁ డయి
దర్శన మ్మొసంగు తండ్రి నే నెఱుగనే!
మాయదారి యయ్యె మహికి డిగ్గి. (19)

“నేను తనకి చేరువయ్యే మార్గాలన్నీ మూసియుంచినా సహించాను. కాని, ఆయన నన్ను సమీపించే మార్గాలన్నీ తెరచియుంచి, రావణుడంటే భయంలేని నేల సూదిమొనంత కూడా మిగల్చకుండా చేశాను. అయినా, ఎందుకింత ఆలస్యం చేశాడు, విష్ణువు?” అని 20వ పద్యంలో రావణుడు వాపోవడం చూస్తాము.

చం.
తన దరి కేను రాఁదగిన దారుల నన్నిటి మూసి యుంచినన్
మనమున నోర్చి, నన్ దరియు మార్గము లన్నిటి విప్పియుంచి, రా
వణ భయదాంఘ్రిముద్ర కనుపట్టని సూది మొనంత నేలయున్
దనకు మిగుల్ప నైతిని గదా! విభుఁ డేటికి జాగు జేసెనో. (20)

భగవంతుణ్ణి చేరడానికి భాగవతంలో శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం అన్న నవవిధ భక్తి మార్గాలు చెప్పబడ్డాయి. ఇవేవీ రావణుడికి నచ్చలేదు. అందుకే, ఆ అధ్వములు (మార్గములు) తనకు అభిగాములు (పోవునవి) కావని అంటున్నాడు. మరి, ఆయన కనిపెట్టిన కొత్త మార్గము ఏమిటంటే, భగవంతుడితో విరోధము పెట్టుకుని, ఆయన ఆగ్రహానికి ఆహుతి అయ్యి ఆ విధంగా ఆయనని చేరుకోవడం. అదే, వైరభక్తి. భగవంతుణ్ణి చేరడానికి ఉన్న ఇతర మార్గాలు తనకు వల్లకాదని, సీతను అపహరించడమే తనకు సరియైన వైరభక్తి మార్గమని రావణుడు అనుకున్నట్లుగా మనకు తోస్తుంది. “అన్ని మార్గాలు నాకు చేతనయినవి కావని నాకు తెలుసు. నా స్వామి మాయలు నా దగ్గరా? నన్ను ఇబ్బందులు పెడితే నేనూరుకుంటానా? అందుకే, సీత నపహరించాను. అదే నాకు రాచబాట అనిపించింది”, అని 21వ పద్యంలో రావణుడు అన్నట్లుగా చూస్తాము.

చం.
కల సకలాధ్వముల్ మదభిగాములు గావు టెఱింగి భ్రాంతిమై
నిలుచునొ పాలు వోవ కని నిక్కపు మార్గ మొకండె చేసితిన్,
తొలఁగని రాచబాటగద తొయ్యలి నేఁ గొనిచన్న దారి, న
న్నలమట బెట్టినన్ విడుతునా! తన మాయలు చెల్ల నిత్తునా? (21)

“రావణుడంటే, రాయి రప్పా కాదు. జాలి చూపించి రక్షించడానికి నాతి (అహల్య), కోతి (సుగ్రీవుడు), కాకి (కాకాసురుడు), గ్రద్ద (జటాయువు) కాదు. లోకాలని గడగడలాడించిన, స్వాభిమానం గల రావణు డిక్కడ. యుద్ధం చేసి విజయమో వీరస్వర్గమో చూసుకుంటాడు కాని, కాళ్ళావేళ్ళా పడతాడా” అని రావణుడు స్వాతిశయంతో అన్నట్లుగా 22వ పద్యంలో ఉంది. “రాయీ రప్పను కానే కాను, మామూలు మణిసిని నేను” అని ఒక సినీకవి అంటే, ఇక్కడ రావణుడు “రాయీ రప్పను కానే కాను మామూలు మణిసిని కూడా కాను” అంటున్నాడు.

ఉ.
రావణుఁ డన్నఁ గాళ్ళఁ బడు రాయియు ఱప్పయుఁ గాదు, జాలిమైఁ
గావగ నాఁతి కోఁతియును గాకియు గ్రద్దయుఁ గాదు, లోక వి
ద్రావణుఁ డుగ్రవీర చరితప్రథితుం డతి మానియౌ దశ
గ్రీవుడు, పోరిలోఁ బొడిచి గెల్చును జచ్చును గాక, వేడునే? (22)

“నువ్వు స్వామిని చూశావు కదా, ఎలా ఉన్నాడు? సీతావియోగం చేత తపిస్తూ చిక్కిపోయాడా లేక విల్లెక్కు పెట్టి రావణుని తలలు త్రుంచుతానని కోపంతో ఉన్నాడా?” అని భావోద్వేగంతో రావణుడు అన్నట్లుగా 23వ పద్యంలో ఉంది.

ఉ.
చూడుము నెచ్చెలీ! విభునిఁ జూచితివేకద! చెప్పు మెట్టు లు
న్నాడొ రఘూద్వహుండు, లలనా విరహవ్యధఁ గ్రాఁగి చిక్కి యు
న్నాఁడొ? దశాస్యకంఠదళనప్రవణాగ్రహవృత్తి వెల్గుచు
న్నాఁడొ? అధిజ్యధన్వుఁ డరుణద్యుతిరంజితనేత్ర కోణుఁడై. (23)

“రాముని పరాక్రమం గురించిన కథలు మారీచుడు, శూర్పణఖ, హనుమ, సీత చెప్పగా విన్నాను.” అని రావణుడు అన్నట్లుగా 24వ పద్యంలో చూస్తాము.

కం.
వింటిని మారీచునిచే
వింటిని శూర్పణఖ చేత, వింటి హనుమచే
వింటిని జనకాత్మజచే
వింటిని రఘువీరు బాహువీర్య కథనముల్. (24)

“పాలుగారు చెక్కిళ్ళ వయసులో మునియాజ్ఞతో తాటకను సంహరించుట, జులపాలు వ్రేలాడే వయసులో శివధనుర్భంగము చేసిన శృంగార వీరత్వము, పసుపు బట్టలతో పరశురామ గర్వభంగము చేయుట, సీతావియోగంతో బాధపడుతున్న కొత్తల్లో ఒకే బాణంతో వాలిని వధించడం, వీటిని గురించి విన్నాను. వీటన్నిటికంటే, రాజ్యాన్ని త్యజించి నార బట్టలు కట్టి అడవికి వెళ్ళడంలో ఉన్న ధీరత్వము, స్వామికే చెల్లింది” అన్న రావణుని స్వామిభక్తి స్ఫోరకములైన మాటలు 25వ పద్యంలో చూస్తాము.

సీ.
వసవల్చు చెక్కిళ్ళ వయసున లజ్జమై
ముని యాజ్ఞఁ దాటకఁ దునుము సొగసు
జునపాలు వ్రేలు నీడున శైవచాపమ్ము
విఱిచిన శృంగార వీర మహిమ
పసపు బట్టల నిగ్గు పస భార్గవక్రోధ
సంధ్య మాయించిన శౌర్యసార
మాలిఁ బాసిన క్రొత్త యలఁతమై వజ్రసా
రుని వాలి నొక కోలఁ దునుము పటిమ
తే.గీ.
వింటయే కాని – ఇన్నింటి కంటె రాచ
పట్టము దొరంగి నారలు గట్టి కాన
మెట్టినట్టి వెక్కసమైన దిట్టతనము
వింటి – సామికే తగుననుకొంటెగాని. (25)

రాముని అందచందాలు వర్ణిస్తూ, వైరం కారణంగా ఇతరుల లాగా తాను ఆ అందం చూసి తరించే అదృష్టం చేసుకోలేదని రావణుడు వాపోతూ, ఏమంటున్నాడంటే, “ముందే, స్వామిని యుద్ధానికి ఆహ్వానించడం వల్ల, ఆ నీలమేఘశ్యాముని దివ్యమంగళ విగ్రహము కనులార చూచుటకు మీలాగా నేను నోచుకోలేదు కదా”. ఈ భావన 26వ పద్యంలో ఉంది. ఆ ఆహ్వానం ఒక యజ్ఞానికి ఆహ్వానం లాగా రావణుడు అభివర్ణిస్తున్నాడు.

ఉ.
శ్యామలకాంతి మోహనము సౌమ్య గభీరము సుప్రసన్న రే
ఖామృదుహాస భాసురము, గన్నుల పండువు నైన రాము నె
మ్మోమును మిమ్మువోలెఁ గన నోమను గాదె, కఠోర వృత్తినై
సామిని మున్నె ఘోర రణసత్ర నిమంత్రితుఁ జేసి యుంచుటన్. (26)

“అద్దమై తళతళా వెలిగే చంద్రహాసమే (రావణుని ఖడ్గము) రావణుని విశ్వవిజయకీర్తిని తెలుపుతుంది. నేను, రాముడు పరస్పరం కలియుదుము గాక” అని జరగబోయే యుద్ధానికి ఉత్సాహంగా రావణుడన్న మాటలు 27వ పద్యంలో చెప్పబడ్డాయి.

తే.గీ.
వినుము, దశకంధరుని విశ్వవిజయకీర్తి
దర్పణంబయి తళతళత్తళ వెలుంగు
చంద్రహాసమె శ్రీరామచంద్రునకును
నాకు ఘటియించుత మిథోవలోకనమ్ము. (27)

“ఓ! సముద్రుడా! నీవు ధన్యుడవు. మునుపు, మత్స్య కూర్మ అవతారములు ఎత్తినపుడు స్వామి నీ గర్భంలో ఈత కొట్టాడు. మళ్ళీ ఇప్పుడు, నిన్ను దాటడానికి వస్తున్నాడు. ఇదంతా అయిన తర్వాత, మళ్ళీ నీలోనే పవళించి నీ తరంగాలలో సేదతీరుతాడు.” అన్న రావణుని మాటలు 28వ పద్యంలో చూస్తాము. అంటే, నన్ను సంహరించిన తరువాత మళ్ళీ వైకుంఠానికి వెళ్ళి పాలసముద్రంలో సేదతీరుతాడు అని రావణుడు అన్నట్లుగా ధ్వనిస్తుంది. ఇది “చేసిందంతా చేసి ఏమీ ఎరగనట్లు కూర్చున్నాడు” అని అల్లరి పిల్లల గురించి మన కుటుంబాలలో మామూలుగా చెప్పుకునే వ్యంగ్యం లాగా ఉంది.

తే.గీ.
తోయధీ! ధన్యుఁడవు నీవు, తొల్లి మత్స్య
కమఠ రూపత నీదె నీ గర్భము హరి,
నేఁడు వెండి దరింప నున్నాఁడు నిన్ను,
నెల్లి నినుఁ జేరి పవళించు నేమి యెఱుఁగ
నట్టులు తరంగలాలితుం డగుచు శౌరి. (28)

“మీలాంటి వాళ్ళు చరితార్ధులవుతారు. కాదనను కాని, తన మోము ముద్దాడిన దశరథుని కంటె, పాలిచ్చి పెంచిన తల్లి కంటె, అర్ధాంగి సీత కంటె, పరిచర్యలు చేసిన తమ్ముని కంటె, ఈ జగదేక కంటకుడే స్వామికి ఎక్కువ ఇష్టము.” అని ప్రకటించిన రావణుని వైరభక్తి 29వ పద్యంలో చూస్తాము.

చం.
అగుదురు మిమ్ముబోంట్లు చరితార్థులు, కాదనఁ గాని, మోము ము
ద్దు గొనిన తండ్రి కంటె, దయతోఁ జను గ్రోల్చిన తల్లి కంటె, మై
సగమగు సీత కంటెఁ, బరిచర్య లొనర్చిన తమ్ము కంటె నీ
జగదభిఘాతి రక్కసుఁడె సామికి మిక్కిలిఁ గూర్చు నెచ్చెలీ! (29)

“తల్లి, తండ్రి, భార్య, తమ్ముడు, మీరందరు స్వామి వేసిన బంధంలో ఉన్నారు. కాని, స్వామికి నేనే పెను లంకె వేశాను. ఆ విషయం నాకూ ఆ పరమాత్ముడికే తెలుసు.” అని తాను రాముని ఏ విధంగా తన దోవకు తెచ్చుకున్నాడో రావణుడు దర్పంగా చెప్పడం 30వ పద్యంలో చూస్తాము.

ఆ.వె.
తల్లి దండ్రి యాలు దమ్ముండు మొదలు మీ
కెల్ల లంకె వైచె వల్లభుండు
వల్లభునకు నేనె వైచితిఁ బెనులంకె
నొరు లెఱుంగ రిద్ది పరుఁడె యెఱుఁగు. (30)

“ఆశ్రితుల కభయముద్రలో దర్శన మొసంగు స్వామిని ప్రళయ కాలంలో భయముద్రలో చూచే భాగ్యము నాదే. ఆ అద్వ్వైతము అన్యులకు దుర్లభము.” అని రావణుడు విష్ణువుతో తనకున్న సాన్నిహిత్యాన్ని గురించి చెప్పడం 31వ పద్యంలో చూస్తాము.

కం.
ప్రియ దర్శనుఁడై శ్రితుల క
భయముద్ర ధరించు సర్వభద్రుని భయ వి
స్మయకారి విలయసమయా
ద్వయభావం బన్యదుర్లభము నేఁ గందున్. (31)

“ఇప్పుడాలోచిస్తుంటే, సీతను అపహరించడం ఎంత మంచి పనో అని అనిపిస్తొంది. ఇంతకుముందు ఎవ్వరూ ఈవిధంగా స్వామికి అపకారం చేయలేదు. అందుచేత, నాకు ఎవ్వరికీ దక్కని లోతైన లోకాలు దక్కుతాయి.” అని రావణుడన్న మాటలు 32వ పద్యంలో చూస్తాము.

తే.గీ.
ఎంచి చూడ జానకి హరియించు టెంత
మంచి పని యయ్యె! స్వాత్మ కిమ్మాడ్కిఁ దొల్లి
ఎవ్వ రపచార మొనరించి? రెవ్వరికిని
దొరకని యగాధతలములు దొరకు నాకు. (32)

అన్ని జన్మల కన్నా మానవ జన్మ ఉత్తమమైనదని అంటారు. భగవంతుడు అలాంటి మానవ జన్మ ఎత్తాలంటే, మామూలు వాళ్ళకోసమైతే ఎత్తుతాడా. “కింద పడ్డా మాదే పైచేయి” అని మాట్లాడే వాళ్ళు ఎలా ఉంటారో రావణుడు కూడా అలానే ఉన్నాడు. ప్రతికూలతలో అనుకూలత వెతుక్కుంటున్నాడు. ఎలాగో చూడండి. “యుద్ధం స్వామికి కొత్తేమీ కాదుగా. మధుకైటభాది రాక్షసులను వధించాడు. అంతకు ముందు, వరాహ నృసింహ అవతారాలు ఎత్తిన స్వామి, ఇప్పుడు నాకోసం మానవావతారం (జంతువుగా కాకుండా) ఎత్తి నాకు గౌరవ మిచ్చాడు. అందుచేత, ఆయనకు నా పరాక్రమంతో అపూర్వమైన విందు చెయ్యాలి.” అని స్వామిభక్తి చూపిస్తూనే రావణుడు తన గొప్ప తాను చెప్పుకున్నట్లు 33వ పద్యంలో వ్యంగ్య ధోరణి చూస్తాము.

ఉ.
పోరు లెఱుంగఁడో, దనుజ పుంగవులన్ మధుకైటభాదులన్
జీఱి వధింపఁడో, కిటి నృసింహ ముఖాకృతులన్ ధరింపఁడో,
గౌరవ మిట్లొనర్చె దశకంఠున కీ పురుషోత్తమాకృతిన్,
శౌరి కపూర్వ విక్రమ రసమ్మునఁ బారణ సేయఁగావలెన్. (33)

“శచీదేవికి పతిభిక్ష పెట్టి, కుబేరుని బంధించి, కైలాస పర్వతము పెకలించి నా తల ఖండించి ఈశ్వరార్పణము చేసినట్లు గాదు, విష్ణువును ఆరాధించుట. ఓ చంద్రహాస ఖడ్గమా! ఇది ఒక మేటి పండుగ.” అని రావణుడు తన దర్పాన్ని, విష్ణువు ప్రత్యేకతని 34వ పద్యంలో చెప్పినట్లుగా ఉంది.

మ.
పతిభిక్షన్ శచి కిచ్చి, గుహ్యకపతిన్ బంధించి, కైలాస ప
ర్వతమున్ బాఁతగలించి కంఠదళనారంభమ్ముచే నీశుఁ ద
ర్పితుఁ గావించిన యట్లుగాదు, మురవైరిన్ శ్రీశు నాత్మేశు న
ర్చితుఁ గావించెడి మేటి పండు విదె వచ్చెన్ జంద్రహాసాసిరో! (34)

“నేను కట్టుబడ్డ వీరవ్రతానికి పక్వదశ, వైర సంబంధానికి ప్రయోజనం నెరవేరేది ఇదే. అనేక యుద్ధము లందు ప్రియత్వము చూపించిన చంద్రహాసమా! స్వామికి కదన భిక్ష ఎలా కల్పిస్తావో?” అని రావణుడు అన్నట్లుగా 35వ పద్యంలో చెప్పబడింది. ఎవరైనా స్వామీజీ వస్తే భిక్ష ఇవ్వడం పరిపాటి. ఇక్కడ, రావణుడు ఇవ్వదలుచుకున్న భిక్ష రణమే.

కం.
స్వీకృత వీరవ్రత పరి
పాకము వైరానుబంధ ఫలసిద్ధి యిదే
నైకరణప్రణయిని! యెటు
కాకుత్స్థున కాజి భిక్ష కల్పించెదవో. (35)

“గరుడ వాహనం లేకుండా, పాంచజన్యము, కౌమోదకి, సుదర్శనము లేకుండా ఉత్త చేతులతో రావణుని గెలవాలని వచ్చాడు, ఎంత తెలివో. నా ఇరవై చేతులు కదనరంగంలో పరాక్రమించి, ఆ ఆయుధములు స్వామి ధరించేటట్లుగా చేస్తాయి.” అని ఊరికే చేతు లూపుకుంటూ విష్ణువు యుద్ధానికి వచ్చాడని రావణుడు పరిహాసం చేయడం 36వ పద్యంలో చూస్తాము. ఈ పద్యం చూస్తే, భారత యుద్ధంలో ఆయుధం పట్టనన్న కృష్ణుడి చేత ఆయుధం పట్టించి తీరుతానన్న భీష్ముడి మాటలు గుర్తొస్తాయి.

ఉ.
లేదు పతంగ వాహనము, లేవు కరంబులఁ బాంచజన్య కౌ
మోదకులున్, సుదర్శనము పూనడు, రావణు గెల్వ వచ్చె, దా
మోదరుఁ డెంత నేరుపరియో! పదిజంటల చేతులార! ఆ
కైదువు లాజి వేళ హరి కైకొను మాడ్కిఁ బరాక్రమింపుఁడీ. (36)

యుద్ధం జరిగినట్లు, అక్కడ తనకు విజయం ప్రాప్తించినట్లు పగటి కలలు కంటున్నాడు రావణుడు. “ఒంటి విలుకాడవై వచ్చి నన్ను ఓడించే సాహసానికి పూనుకోవద్దు. అయ్యో, నీ పాదాల మీద ఒట్టు, నన్ను నా దేవుణ్ణి చంపే పాపాత్ముని చెయ్యద్దు.” అని రావణుడు దయనీయంగా వేడుకోవడం 37వ పద్యంలో చూస్తాము.

తే.గీ.
ఒంటి విలుకాడవై నన్ను నోర్చు తెగువ
వలదురా! రాఘవా, రాఘవా! దశాస్యు
నక్కటా! క్రూర విక్రము, స్వాత్మహనన
పాతకుని జేయకుముర! నీ పాదమాన. (37)

“చాల కాలం నుండి విరహాగ్నితో ప్రజ్వలించే పెరిగే మంటల నిప్పులగుంట లాగా బగ్గుబగ్గుమనే ఇరవై చేతులతో కలిపి పట్టి పదితలలు అంటుకుని రావణుడనే అగ్ని పలు విధాల కాలుస్తుంటే, రణయజ్ఞము అయిపోయేసరికి రాముడో రావణుడో ఎవరో ఒకరే స్థిరత్వము పొందుతారు.” అని రావణుడన్న మాటలు 38వ పద్యంలో చెప్పబడ్డాయి. 26వ పద్యంలో ‘రణసత్ర’ అని చెప్పడం వల్ల, రావణుడు యుద్ధాన్ని ఒక యజ్ఞం లాగా చూస్తున్నాడని తెలుస్తుంది. ఈ పద్యంలో రావణుడు ఏమంటున్నాడంటే, ఆ యజ్ఞాంతానికి నేనో, స్వామియో ఒకళ్ళే మిగులుతారు.

చం.
చిర విరహాగ్నిఁ గ్రాఁగు నడచిచ్చుల గుండము వోలె బగ్గు బ
గ్గురనెడి చేతు లిర్వదిటఁ గూరిచిపట్టి, దశాస్యమండలిన్
దరికొని రావణాగ్ని బహుధా దహియింప, సవాంతమందు దా
శరథియొ పంక్తికంధరుఁడొ శాశ్వత భావము గాంచుఁగావుతన్. (38)

“వెళ్ళు స్నేహితుడా! రాముని కెదురేగి ముత్యాల ముగ్గు పెట్టి, ఎత్తైన గంభీరమైన నీ అలల సింహాసనముపై కూర్చుండబెట్టి, సీత కంటె, కౌస్తుభాదుల కంటె ప్రియమైన మణులు చూపి లంకకు పంపుము. ఈ రావణుడు లక్ష్మీదేవి కొలుచు విష్ణువక్షమును తన చంద్రహాస ఖడ్గముతో చీల్చి, ఆ గంటు (చీలిక) వెంట ఆయన హృదయమును చేరి ఏకాంతముగా స్వాగతము పల్కునని చెప్పుము. మనకు అక్కడే పునర్దర్శనమగు గాక.” అని అవేదనతో, పరిపూర్ణ వైరభక్తితో, రావణుడన్న ఆఖరి పలుకులు 39వ పద్యంలో చెప్పబడ్డాయి. అంటే, రాముడుకి ఘనస్వాగతం ఇచ్చి లంకకు పంపమని సముద్రుడికి చెబుతూ, తాను చెప్పే స్వాగతము తన స్థాయికి తగ్గట్టుగా యుద్ధంలో ఆయన గుండెలు చీల్చి హృదయంలో చేరి అక్కడ చెబుతానని రావణుడు అంటున్నాడు.

సీ.
పొమ్ము నెచ్చెలి! రామమూర్తికి నెదురేగి
పుట్టుముత్తియముల మ్రుగ్గు వెట్టి
అత్యున్నతమ్మును నతి గభీరమ్మైన
గర్భవీచిమతల్లి గద్దె వెట్టి
రమకంటెఁ గౌస్తుభ రత్నంబుకంటె గా
రామైన మణులు దర్శన మొసంగి
లంకకుఁ బంపు, పౌలస్త్యుండు సిరి కొల్వు
చవికయౌ వక్షమ్ము చంద్రహాస
తే.గీ.
దారిత మొనర్చి, ఆ గంటు దారి వెంట
హృదయమున్ జొచ్చి, యేకాంత మిచ్చగించి
స్వాగతముఁ బల్కునని విన్నపమ్ము సల్పు –
మచటనే పునర్దర్శన మగుత మనకు. (39)

ఈ విధంగా, సముద్రుని లోని భయం పోగొట్టి ఉత్సాహపరచడం, స్వోత్కర్ష, స్వామికి ద్రోహము చేయడానికి పన్నాగము, దోషము విష్ణువు పైకి నెట్టడం, రాజసం, విష్ణుదర్శన కాంక్ష, బల ప్రదర్శనాకాంక్ష, రామాయణంలో ప్రముఖ ఘట్టాలు తనకి అనుకూలంగా ఉండేట్లు చెప్పడం, స్వామి తన్ను మరచాడన్న ఆవేదన, ఒక పక్క రావణుని మీద సానుభూతి కలిగిస్తూనే హాస్యం పండించడం, వైరభక్తి, అన్న అంశాలు ఈ కావ్యంలో రసవత్తరంగా పోషింపబడి రావణుని అంతరంగాన్ని ఆవిష్కరించాయి. ఇలా సాగిన రావణుని స్వగతంలో, అవసరమయిన చోట కఠినమైన సంస్కృత పదాలతో సమాసాలను గుప్పిస్తూనే, అచ్చమైన తెనుగుతనాన్ని మేళవించారు కాటూరివారు. ఈ మిశ్రమశైలికి ఆద్యుడు తిక్కనసోమయాజి. కాటూరివారి వంశదీపకుడైన ఎర్రాప్రగడ, తరువాతి కవులు కొందరు, దాన్ని చక్కగా పరిపోషించారు. అదే బాటలో కాటూరివారు కూడా నడిచారు.

భారత శిక్షాస్మృతి (Indian Penal Code) ప్రకారం, ఎవరైనా ఒక నేరం చేస్తే, న్యాయస్థానాలు ఆ నేరస్థుడి నేరం చేయడానికి కల కారణాలు, అపరాధి మనస్సు తప్పకుండా అన్వేషిస్తాయి. వాటినే న్యాయ శాస్త్రంలో మెన్స్ రియా (Mens rea) అని అంటారు. ఈ కావ్యంలో రావణుడు తనే నేరస్థుణ్ణని చెప్పి, దానికి కారణాలు కూడా తనే చెప్పి, తన మనస్సును మన ముందు ఆవిష్కరిస్తున్నాడు.

సినిమాల లోకి రాక ముందు, ప్రసిద్ధ సినీ దర్శకులు శ్రీ కమలాకర కామేశ్వరరావు గారు కృష్ణా పత్రికలో కొంత కాలం పని చేశారు. బహుశా, అక్కడ ఆయనకి కాటూరి వారితో పరిచయం, తద్వారా పౌలస్త్య హృదయము అనే వారు వ్రాసిన కావ్యం గురించిన పరిచయం కలిగి ఉంటాయి. ఈ కావ్యం ఆధారంగా, తాను దర్శకత్వం వహించిన ‘సీతారామ వనవాసము’ అన్న చిత్రంలో కొన్ని ఘట్టాలు రూపొందించబడ్డాయి, అని కామేశ్వరరావు గారు ఈటీవీ వారి ‘స్వగతాలు’ అన్న ఇంటర్వూలో చెప్పారు.

తన్ను తానే విమర్శించుకోగల సంస్కారి కాటూరివారు. కృతి సమర్పణకి ఆయన వ్రాసిన ఐదు పద్యాలలో “చెల్లె బదియు నైదు వర్షము, లొక పద్యమైన మరల జెప్పినది లేదు, కవినంట సిగ్గు గాదె” అనీ, “ఆలుం బిడ్డలు పైరుపచ్చ లనకే యాగమ్మ కాకిం బలెన్ గా లిచ్చం దిరుగాడు దుర్వ్యసని” అనీ తనపై తనే విమర్శలు గుప్పించారు.

సంస్కృత సమాసాల ప్రయోగం మాట అటుంచి, మామూలుగా మనం మాట్లాడుకునే మాటలు, సూక్తులు తన కావ్యంలో సందర్భానుసారంగా ప్రయోగించారు కాటూరివారు. ఉదాహరణకి, “ఆగమ్మ కాకిం బలెన్”, “ఎవ్వరిచే నీ కొనగూడె”, “వెర పికేల”, “నాకున్నీకు భయం బటన్న నుడి యెన్నండైన విన్నామ”, “ఎన్నాళ్ళకు! ఎన్నాళ్ళకు!”, “నన్ను వంచించె గదే”, “దినము వర్షంబైన యుత్కంఠచే”, “యుఱక వాపోయె నట”, “నన్ను బేర్వాడి ప్రతిన సలిపినపుడు గదా”, “ఎంతటి క్రూరచిత్తుడో”, “హింసించుటలు నాకు మనసొ”, “మంచి దక్కగ నీడాయె”, “నా కిడు బాసలో తలపడాయెన్”, “మర్త్యుల రాజనీతి నిపుణత్వం బెల్ల విన్నావుగా”, “ఉట్టి గట్టి యిచట నూరేగ నుంటినా యేమి”, “లోకభీతి యేల నాకు”, “ఎల్ల యెఱిగియుండి, యేమి నెరుంగని యట్లు”, “ఇంట నున్నయప్పుడీ మాయ నటనముల్ లేవు”, “మాయదారి యయ్యె మహికి డిగ్గి”, “విభుడేటికి జాగు జేసెనో”, “నన్నలమట బెట్టినన్ విడుతునా”, “తన మాయలు చెల్ల నిత్తునా”, “పోరిలో బొడిచి గెల్చును జచ్చును గాక! వేడునే”, “వల్లభునకు నేనె వైచితి బెనులంకె”, “ఎంత మంచి పని యయ్యె”, ఇలాంటి పదప్రయోగాలు మామూలు భాషలో తెలుగునాట వింటూనే ఉంటాము. ఈ మాటలకి చక్కని కావ్య మర్యాద కలిగించారు కాటూరివారు.

గొల్లపూడి ప్రకాశరావుగారు వ్రాసిన ‘భారతీయ సాహిత్య నిర్మాతలు పింగళి – కాటూరి’ (సాహిత్య అకాడమీ ముద్రణ) అన్న పుస్తకంలో ‘పౌలస్త్య హృదయము’ గురించి ప్రస్తావిస్తూ ఈ క్రింది విధంగా చెప్పారు:

“నిజాని కీ కావ్యం రూపంలో సన్నదైనా కవితా దీపంగా మిన్నయైనది. …వస్తు స్వీకరణలో, వస్తు నిర్వహణలో ఈ కావ్యం ప్రత్యేకతను సంతరించుకున్నది. ….రామాయణంలో రామునికి ప్రాధాన్యం. పౌలస్త్య హృదయంలో రావణునికి ప్రాధాన్యం. రామాయణంలో రావణుడు దుర్మార్గ ప్రతినాయకుడు. పౌలస్త్య హృదయంలో రావణుడు ఉదాత్త ప్రతినాయకుడు. ….రావణునిపై పాఠకులకున్న పూర్వభావాల నన్నింటినీ తొలగించి రావణుని పట్ల సానుభూతిని కలిగించే కావ్యం పౌలస్త్య హృదయం. ….తక్కువ పద్యాలలో ఎక్కువ ప్రభావం చూపే రచనలు చేయటంలో కాటూరి వారు మిక్కిలి సమర్థులు. ….”

భారతి మాసపత్రిక ఫిబ్రవరి 1959 సంచికలో ‘కాటూరికవి ఖండకావ్యాలు’ అన్న వ్యాసాన్ని శ్రీ పి. గణపతిశాస్త్రిగారు గారు వ్రాశారు. ఈ వ్యాసంలో వారు ఈ క్రింది విధంగా అన్నారు:

“పౌలస్త్య హృదయం ప్రారంభించగానే మొట్టమొదట ఈ కావ్య ధోరణి మన కెంతయినా ఆశ్చర్యం కలిగిస్తుంది. ….రావణు డొక విధంగా అత్యాధునికుడయిన పరమేశ్వర భక్తుడు. కనుకనే అన్ని అనుబంధాలకన్న భీషణ విద్వేషానుబంధమే పరమేశ్వరుని కతి సన్నిహితమయినదని ప్రతిపాదిస్తున్నాడు. …ఈ కవి రచనలలో గాంధీయాదర్శం స్ఫురిస్తున్నదని ఇంతకు పూర్వం పేర్కొన్నాను. ఆ అభినివేశమే ఈ ఖండకృతి రచనకు ప్రోద్బలం కలిగించి ఉండవచ్చును. గాంధీ దృష్టిలో సర్వులు మిత్రులే గాని మరి శత్రువు లెవ్వరు లేరు. …..”

ఈ కావ్యం గురించి, కవి గురించి, పద్యరూపంలో చెప్పాలని చిన్న ప్రయత్నం చేసి క్లుప్తముగా క్రింది విధంగా చెబుతున్నాను. ఈ పద్యకుసుమాంజలి సభక్తికంగా కాటూరి మహాకవికి సమర్పిస్తున్నాను.

శా.
స్వామిద్రోహము తానె జేసి, దొసగున్ స్వాత్మేశుపై బెట్టుచున్,
స్వామిన్ జేరగ వేచి వేసరిన రాజై జెప్పె, కల్లోలినీ
స్వామిన్ మిత్రుగ జేసి రావణుడు తత్స్వాంతమ్ము, పౌలస్త్యునిన్
స్వామిన్ వైరిగ గొల్చు భక్తునిగ ప్రస్తావించు కావ్యమ్మిదే. (i)

తనే స్వామికి కీడు తలపెట్టి, తప్పు తన ఆత్మేశునిపై పెడుతూ, ఆయన్ని చేరడానికి నిరీక్షించి విసిగి పోయిన రాజుగా సముద్రుణ్ణి మిత్రునిగా చేసుకుని రావణుడు తన మనస్సును విశదపరచాడు. ప్రభువును శత్రువుగా ఆరాధించే భక్తుడుగా రావణుని చూపించే కావ్యము ఇదే.

శా.
ఔచిత్యం బిట కావ్యనామము, కథన్ వాచ్యంబుగా గాక, పా
త్రౌచిత్యంబు, నిగూఢ వ్యంగ్య సరళిన్, రౌద్రంపు స్వోత్కర్షలన్,
వైచిత్యంబును, వైరభక్తిని, కడున్ ప్రత్యేకతన్ జూపుచున్,
సూచింపన్ స్వగతమ్ము రూపమున, తేజోదాత్తు పౌలస్త్యునిన్. (ii)

కథను వాచ్యంగా కాక, పాత్రౌచిత్యము, అంతర్లీనమైన వ్యంగ్య ధోరణులతో భయంకరమైన స్వంత ఔన్నత్యము, వేదన, వైరభక్తి అనే అంశాలను మిక్కిలి వైశిష్ఠ్యంగా చూపుతూ, స్వగతం రూపంలో ఉగ్రస్వభావము, ఉదారత్వము రావణుని యందు సూచించడం వల్ల, ఇక్కడ ‘పౌలస్త్య హృదయము’ సరియైన కావ్యనామము.

కం.
పౌలస్త్యహృదయ మొక దివి
టీలా, కాటూరి వేంకటేశ్వర కవికిన్,
చాల యశమ్ము నిడెను, ప్రతి
కూలుని, కావ్యమున భక్త కోవిదు జేయన్. (iii)

శత్రువును కావ్యంలో ఒక భక్త మేధావిగా చూపడం వల్ల, ‘పౌలస్త్య హృదయము’ ఒక కాగడాలా, కాటూరి వేంకటేశ్వర కవికి చాలా కీర్తిని ఇచ్చింది.

ఉ.
రావణు మానసంబున పురాకృత కర్మల జ్ఞాన మున్న యే
భావన లుండునో, యతని పక్షము నిల్చి, సహేతుకంబుగన్
ఠీవియు దర్పమున్ యురవడింపగ జెప్పగ జేయు, కావ్యమున్
నీవు రచించు తీరు గణనీయము, మాన్యము వైరభక్తికిన్,
భావి కవిత్వమందు నవ ప్రక్రియగా స్వగతమ్ము జేరగన్,
తావిని పెంచితీవు కవితావని, కాటురి వేంకటేశ్వరా! (iv)

రావణుని మనస్సులో తన పూర్వజన్మమందు చేయఁబడిన కర్మల గురించిన జ్ఞానము ఉంటే, ఆయనలో ఏ రకమైన ఆలోచనలు ఉంటాయో, అతని పక్షాన నిలబడి, కారణ సహితంగా, అతని వైభవము, గర్వము అతిశయించే విధంగా చెప్పేటట్లు చేసే కావ్యాన్ని నీవు రచించిన విధానము ఎంచదగినది. వైరభక్తి విషయంలో సమ్మానింపదగినది. ఓ కాటూరి వేంకటేశ్వరా! భవిష్యత్తులో రాబోయే కవిత్వంలో ఒక కొత్త ప్రకరణముగా స్వగతము అనేది చేరడం వల్ల నీవు కవితాలోకంలో పరిమళాన్ని పెంచావు.

ఉ.
రాతిని దైవమున్ గనెడు లక్షణ మున్న మహార్ష సంస్కృతిన్,
రాతి మనస్కు రావణుని, రాక్షస రూపము లోన యున్న, యా
రాతిని ధిక్కరించు, నొక లక్ష్యసమన్వితు, వైరభక్తికిన్
ప్రీతుని జూపు, యీ రచన ప్రేరణయౌ, స్వగతమ్ము లల్లగన్. (v)

రాతిలో దైవాన్ని చూసే లక్షణమున్న గొప్ప ఋషిప్రోక్తమైన నాగరికతలో, రాయిలాంటి మనస్సు ఉన్న రావణుని రాక్షస రూపము లోపల ఉన్న ఆ శత్రువును ప్రతిఘటిస్తూ, ఒక లక్ష్యాన్ని కూడగట్టుకున్న వాడిని, వైరభక్తి యందు ఇష్టము ఉన్న వాడిని, చూపించే ఈ రచన స్వగతాలు ఇంకెన్నో వ్రాయడానికి ప్రేరణగా ఉంటుంది.

‘పౌలస్త్య హృదయము’ పోకడలో మనకున్న మంచి మంచి పాత్రల మనోవిశ్లేషణ కావ్య రూపంలో వస్తే బాగుంటుందని నా అభిలాష.

రిఫరెన్సు గ్రంథాల జాబితా:

(1) శ్రీ పింగళి లక్ష్మీకాంతము శ్రీ కాటూరి వేంకటేశ్వరరావు గార్లు రచించి జనవరి 1944లో ప్రకటించిన “పౌలస్త్య హృదయము” అన్న కావ్యం.

(2) శ్రీ కాటూరి వేంకటేశ్వరరావు గారు రచించగా 05-04-2016న ప్రకటించిన “పౌలస్త్య హృదయము” అన్న కావ్యం. అందుబాటులో ఉన్న లింకు – https://andhrabharati.com/kavitalu/kATUri/paulastya_hRidayamu.html

(3) శ్రీ పి. గణపతి శాస్త్రిగారు రచించిన భారతి సాహిత్య మాసపత్రికలో (ఫిబ్రవరి 1959) ప్రచురించిన “కాటూరికవి ఖండ కావ్యాలు” అన్న వ్యాసం.

 (4) తెనుగు లెంక తుమ్మల సీతారామమూర్తిగారు రచించిన “సుకవి స్తుతి” అన్న కావ్యం (37వ పేజీ) అందుబాటులో ఉన్న లింకు – https://kamyasiddhi.wordpress.com/wp-content/uploads/2019/02/kavisthuthulu_final.pdf

(5) శ్రీ గొల్లపూడి ప్రకాశరావుగారు రచించగా సాహిత్య అకాడమీ ప్రచురించిన “భారతీయ సాహిత్య నిర్మాతలు పింగళి – కాటూరి” అన్న గ్రంథం అందుబాటులో ఉన్న లింకు – https://dn790003.ca.archive.org/0/items/in.ernet.dli.2015.386273/2015.386273.pingali-kaatuuri.pdf

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here