కౌరవపాండవుల అన్యోన్యాభిమానాలు

1
10

[శ్రీ గోనుగుంట మురళీకృష్ణ రచించిన ‘కౌరవపాండవుల అన్యోన్యాభిమానాలు’ అనే వ్యాసాన్ని అందిస్తున్నాము.]

[dropcap]పై [/dropcap]శీర్షిక చూడగానే ‘అదేమిటి? కౌరవ పాండవుల మధ్య అంత అన్యోన్యం ఉంటే కురుక్షేత్ర యుద్ధం ఎందుకు జరుగుతుంది?’ అనుకుంటున్నారా! మీ ఊహ కొంతవరకు కరెక్టే! ధర్మరాజుకి కౌరవుల పట్ల ద్వేషం ఎప్పుడూ లేదు. భీముడు చిన్నతనంలో బాల్యచాపల్యం చేత కొన్ని దుందుడుకు పనులు చేసినా, అన్నగారు చెప్పినట్లే నడచుకున్నాడు. మిగతా పాండవులు కూడా అన్నగారి ఆజ్ఞ అతిక్రమించలేదు. కాబట్టి వారు ధర్మమార్గాన పయనించారనే చెప్పవచ్చు. దుర్యోధనుడు మాత్రం మత్సరంతో పాండవులను అవమానించి, కయ్యానికి కాలుదువ్వాడు. ఆ వైరం ఆమరణాంతం కొనసాగింది. కానీ శరీరం ఉన్నంతవరకే రాగద్వేషాలు! శరీరంతో పాటు అవి కూడా పోతాయి. అతీతమైన లోకానికి చేరుకున్న తర్వాత అలాంటివేమీ ఉండవు. యుద్ధంలో వీరమరణం చెంది స్వర్గానికి వెళ్ళిన కౌరవులు కొంతకాలం తర్వాత ఒక సందర్భంలో పాండవులతో పాటు బంధువులందరినీ కలుసుకుంటారు. ఆనందంగా గడుపుతారు. ఈ ఉదంతం ‘మహాభారతం – ఆశ్రమవాసపర్వం’ లో వస్తుంది. అసలు ఏం జరిగిందంటే —-

ధర్మరాజు అంతఃపుర గవాక్షం నుంచీ బయటకి చూస్తూ కూర్చున్నాడు. గవాక్షం వెలుపల ఉద్యానవనంలో మామిడిచెట్ల మీద కోయిలలు లేమావి చిగుళ్ళు తిని మత్తెక్కి కూస్తున్నాయి. జామచెట్ల మీద చిలుకలు గుంపులు గుంపులుగా వాలి పళ్ళు తింటున్నాయి. సగం కొరికిన జామపళ్ళు ఎర్రగా కనిపిస్తున్నాయి. కొబ్బరిచెట్ల మీద కొంగలు ముత్యాల హారంలా వరసగా కూర్చున్నాయి. సరోవరంలో హంసలు, సారసపక్షులు కోలాహలంగా ఈదులాడుతూ ఉన్నాయి. నెమళ్ళు కేకలు పెడుతూ పరుగెత్తుతున్నాయి. పురివిప్పి ఆడుతున్నాయి. ఆ మనోహర దృశ్యాలు చూస్తూ ఉన్న ధర్మరాజు ముఖం విచారగ్రస్తం అయి ఉంది.

ఇంతలో ద్రౌపది అక్కడికి వచ్చింది. “ఏం మహారాజా! అలా ఉన్నారు?” అడిగింది.

“అటు చూడు పాంచాలీ! పక్షులు సైతం తమ తమ వారితో ఎలా ఆనందంగా, స్వేచ్ఛగా గడుపుతున్నాయో! నాకు అదృష్టం లేదు. నా సోదరులు, కొడుకులు, తండ్రులు, తాతలు, గురువులు అందరూ యుద్ధంలో మరణించారు. ఇప్పటివరకు మా పెదనాన్న దృతరాష్ట్రుల వారిని సేవించుకుంటూ నేను చేసిన పాపానికి పరిహారం చేసుకుంటున్నానని తృప్తి పడ్డాను. ఇప్పుడు వారు కూడా వానప్రస్థం స్వీకరించారు. ఎలా ఉన్నారో!” అన్నాడు.

ఇంతలో అర్జున భీమ నకుల సహదేవులు కూడా అక్కడికి వచ్చారు. గంభీరంగా ఉన్న వారిద్దరినీ చూసి “ఏమిటి వదినా!” అడిగాడు సహదేవుడు ఏం జరిగిందో అర్థం కాక.

“చూడండి నాయనా! ధృతరాష్ట్రుల వారు అడవులకి వెళ్ళిన దగ్గరనుంచీ మీ అన్నగారు నిరంతర నిర్వేదంలో ఉండిపోయారు. మీరైనా చెప్పండి” అన్నది.

“వృద్ధాప్యం వల్ల కృశించిన దేహంతో మనుషులెవరూ లేని కారడవిలో మా పెదనాన్నగారు ఏం బాధలు పడుతున్నారో? సుకుమారులైన తల్లులు గాంధారి, కుంతీదేవిలు అంతఃపుర సౌఖ్యాలను వదలుకొని ఏమి ఇడుములు పడుతున్నారో! ఒక్కసారి వారందందరినీ చూసి రావాలనిపిస్తున్నది” అన్నాడు ధర్మరాజు.

“దీనికింత విచారం ఎందుకన్నయ్యా! మహావీరులం తమ్ములం మేం తోడు ఉన్నాం. ఆపైన మీరు మహారాజు. మీకు అడ్డేముంది? అలాగే వెళ్లి చూద్దాం” అన్నాడు అర్జునుడు.

“అవునన్నయ్యా! ఈ విషయం నేను ఇంతక్రితమే ఆలోచించాను గానీ మీతో చెప్పటానికి సంకోచించాను. గాంధారీ ధృతరాష్ట్రులు ఇంకా కష్టదశలోకి రాకముందే మనం వెళ్లి చూడటం ఉత్తమం” అన్నాడు.

“సహదేవుడు చెప్పింది చాల యుక్తం. కుంతీదేవిని చూడటానికి మేం కోడళ్ళందరం ప్రయాణానికి సిద్ధంగా ఉన్నాం” అన్నది సుభద్ర కూడా.

ప్రోత్సాహకరమైన వారి మాటలతో ధర్మరాజుకి ఉత్సాహం వచ్చింది. వెంటనే సేనాపతులని పిలిపించాడు. “మనం గాంధారీ ధృతరాష్ట్రులను చూడటానికి వెళుతున్నాం. మీరు వెంటనే రథ, గజ, తురంగ, పదాతి దళాలను సిద్ధం చేయండి. అంతఃపుర స్త్రీలు కూర్చోవటానికి పల్లకీలు, ఎడ్లబండ్లు ఏర్పాటు చేయండి. ఇంకా ఇతర వాహనాలు, గుడారాలు, పిండివంటలు తీసుకురావటానికి సేవకులను నియమించండి. పురజనులు ఎవరైనా మాతో వస్తే ఆటంకపరచకండి. వెళ్ళండి” అని ఆదేశించాడు.

ధర్మజుడి ఆనతి ప్రకారం సేనాపతులు తగిన ఏర్పాట్లు చేశారు. నగర సంరక్షణ కోసం కృపాచార్యుడిని, కులగురువు ధౌమ్యుడిని నియోగించాడు. దాసదాసీ జనంతో, అంతఃపుర స్త్రీలతో, తమ్ములతో అరణ్యానికి కలసి బయలుదేరాడు ధర్మజుడు. భీముడు గజబలంతో వస్తున్న వారిని నడిపిస్తున్నాడు. రథాలతో వచ్చేవారిని అర్జునుడు నడిపిస్తున్నాడు. ఆశ్వబలం నకులుడి కనుసన్నల తోనూ, పదాతి దళం (నేలమీద నడిచేవారు) సహదేవుడి ఆనతి తోనూ ప్రయాణం సాగిస్తున్నాయి. పౌరులు కూడా రకరకాల వాహనాలతో వాళ్ళతో పాటు బయలుదేరారు.

అలా కొంతదూరం వెళ్ళిన తర్వాత గంగానదిని దాటి, కురుక్షేత్రంలో ప్రవేశించి ఇంకా ముందుకు ప్రయాణించారు. ఇంకా కొంతదూరం వెళ్ళిన తర్వాత చాలా ఆశ్రమాలు కనిపించాయి. అరటితోపుల మధ్య ఉన్న వాటిని చూస్తూ “అదే నాన్నగారి ఆశ్రమం” అన్నాడు ధర్మరాజు ఉత్సాహంగా. అప్పటికే కొంతమంది మునులు బయటకి వచ్చి దూరంనుంచీ కనిపిస్తున్న ఈ సైన్యాన్ని ఆసక్తిగా చూస్తూ నిలబడి ఉన్నారు.

ధర్మరాజు ఆశ్రమానికి కొంత దూరంలోనే సేనలను నిలిపి, తమ్ములు, భార్యలతో కలసి కాలి నడకన వెళ్ళాడు. “మా తండ్రిగారు ఏరీ!” అని అడిగాడు అక్కడ ఉన్న మునులను.

ఆయన్ని గుర్తించిన మునులు “ధృతరాష్ట్రులవారు, గాంధారీ, కుంతి నదీస్నానానికి వెళ్ళారు” అని చెప్పి, అక్కడనుంచీ యమునా నదికి వెళ్ళే దారి చెప్పారు. అందరూ అదేదారిలో కొద్దిదూరం వెళ్ళగానే స్నానాలు చేసి వస్తున్న ధృతరాష్ట్రుడు, గాంధారి, కుంతి ఎదురుపడ్డారు. వారు ముగ్గురు వడలిన పండుటాకులలాగా బలహీనంగా కనిపించారు దూరంనుంచే. సహదేవుడు గబగబా ముందుకు వెళ్లి “అమ్మా!” అంటూ తల్లి పాదాల మీద పడ్డాడు.

“ఎవరూ సహదేవుడా!” కుంతి సంభ్రమంగా చూస్తూ సహదేవుడిని లేవదీసి, కౌగలించుకుంది. “మనల్ని చూడటానికి సహదేవుడు వచ్చాడా!” తడుముకుంటూ అన్నది గాంధారి.

“తమ్ముడు ఒక్కడే కాదమ్మా! మేం అందరం వచ్చాము” ధర్మరాజు కూడా దగ్గరకి వచ్చి ఆమె చేతిలో నీటిపాత్రను అందుకుంటూ అన్నాడు..

“నాయనా! ధర్మజా! మాకోసం వచ్చావా తండ్రీ!” వణుకుతున్న కంఠంతో ఆనందంగా అన్నాడు ధృతరాష్ట్రుడు. భీమార్జున నకులసహదేవులు, ద్రౌపది మొదలైన అంతఃపుర స్త్రీలందరూ పెద్దల పాదాలకు నమస్కరించారు. అందరూ ఆశ్రమ ప్రాంతానికి తిరిగి వచ్చారు. దూరంగా నిలిపి ఉన్న పౌరులను, మిగతా వారిని అందరినీ దగ్గరకి తీసుకురమ్మని ధర్మరాజు సహదేవుడితో చెప్పాడు.

వచ్చిన వారందరూ నేలమీదే ఆశీనులైయ్యారు. “ధర్మజా! మిమ్మల్ని అందరినీ చూస్తుంటే నాకు హస్తినాపురం లోనే ఉన్నట్లుగా ఉంది” అన్నాడు ధృతరాష్ట్రుడు. వీరందరినీ చూడటానికి చుట్టుపక్కల ఆశ్రమవాసులు అందరూ కూడా వచ్చారు. ధర్మరాజు, బంధువులందరితో నిండిన ఆ ప్రాంతం అంతా నక్షత్రాలతో ప్రకాశిస్తున్న ఆకాశంలా, ఎత్తైన పీటమీద కూర్చున్న ధృతరాష్ట్రుడు చంద్రుడిలా ఉన్నాడు. ద్రౌపది, సుభద్ర, ఉలూచి, చిత్రాంగద మొదలైన స్త్రీ జనం అంతా ఒక పక్కగా నిలబడ్డారు. ఆశ్రమవాసుల కోరిక మీద వారందరినీ పేరుపేరునా పరిచయం చేశాడు సంజయుడు.

“ధర్మజా! నువ్వు క్షేమంగా ఉన్నావు కదా! నీ తమ్ముళ్ళు అందరూ సుఖంగా ఉన్నారా! నువ్వు ధర్మమార్గాన అనుసరిస్తున్నావు కదా! నీ ప్రజలంతా బాగున్నారా!” కుశలప్రశ్నలు వేశాడు ధృతరాష్ట్రుడు.

“మీ దయవలన అందరూ క్షేమంగానే ఉన్నాము నాన్నా! మీరు లేని ఆ రాజ్యం చంద్రికావిహీన శారదరాత్రిలా ఉన్నది. మీకు దూరంగా నేను ఉండలేక పోతున్నాను” అంటూ కురుక్షేత్రంలో చనిపోయిన సోదరులు, తండ్రులు అందరినీ తలచుకుని కన్నీళ్లు పెట్టుకున్నాడు ధర్మరాజు. ధృతరాష్ట్రుడు ఓదార్పుగా అతడి భుజం తట్టాడు. “మన చేతుల్లో ఏముంది నాయనా! అంతా దైవేచ్ఛ. ఇక్కడ మీ ఇష్టం వచ్చినంత కాలం సుఖంగా ఉండండి. మాకేమీ ఇబ్బంది లేదు” అన్నాడు.

అందరూ ఇలా మాట్లాడుకుంటూ ఉండగా సూర్యుడు అస్తమించాడు. “నేను సాయంకాలాఘ్నికాలను చేయవలసి ఉన్నది. మీరంతా విశ్రాంతి తీసుకోండి” అన్నాడు ధృతరాష్ట్రుడు. పాండవులు అందరూ చుట్టుపక్కల ఆశ్రమాలు, చెట్లు, కొండలు, సెలయేళ్ళు చూసివచ్చి, ఆశ్రమవాసులు ఇచ్చిన పండ్లు, కందమూలాలు తిని ఆ రాత్రి సుఖంగా నిద్రపోయారు.

ఆ మర్నాడు వ్యాసమహర్షి అక్కడకు వచ్చాడు. ఆయనని కూర్చోమని అతిథి సత్కారాలు చేసిన తర్వాత “కుమారా! నీ మనసులోని బాధలన్నీ తొలగించి, నీకు ఆనందం కలగజేయటానికే ఇక్కడకు వచ్చాను. నీకేం కావాలో కోరుకో! ఎలాంటి కోరికైనా తీరుస్తాను” అన్నాడు వ్యాసమహర్షి.

“మీకు నా మీద ఉన్న అభిమానానికి చాలా కృతజ్ఞుడిని తండ్రీ! సర్వసంగ పరిత్యాగినై మునివృత్తిలో ఉన్న నాకు కోరికలు ఏముంటాయి? కాకపోతే ఎంతోకాలంగా నా మనసులో ఉన్న ఒక విషయం మీతో చెప్పాలనిపిస్తున్నది” అన్నాడు ధృతరాష్ట్రుడు.

“అదేమిటో చెప్పు. తప్పకుండా చేస్తాను”

“నా నూరుగురు బిడ్డలూ కురుక్షేత్ర యుద్దంలో మరణించి ఇప్పటికి పదహారేళ్ళు అయింది. అప్పటి నుంచీ నేను, గాంధారీ గర్భశోకంతో కుమిలిపోతున్నాము. ధర్మరాజు ఎంత వినయ విధేయతలతో మమ్మల్ని సేవిస్తున్నా ఆ శోకం తీరటం లేదు. దుర్యోధనాదులు మరణించిన తర్వాత ఏమైపోయారు? వాళ్లకి ఏ లోకాలు సిద్ధించాయి? అనేది తెలియకపోవటం వలన నా దుఃఖం తీరటం లేదు. నువ్వు నా బాధను పోగొట్టవలసినది” అన్నాడు. ఆ మాటలు వింటున్న ద్రౌపదికీ, ఇతర కౌరవ స్త్రీలకీ ఆ బాధ అప్పుడే కొత్తగా కలుగుతున్నట్లు అనిపించింది. కుంతికి కూడా కర్ణుడు గుర్తువచ్చి కళ్ళు చెమర్చాయి.

“ధృతరాష్ట్రా! యుద్ధంలో మరణించిన మీ కొడుకులు, మనుమలు సోదరులు యుద్దంలో వీరమరణం పొంది స్వర్గంలో ఉన్నారు. వారందరినీ నా తపోశక్తి చేత ఇక్కడికి రప్పిస్తాను. నాతో రండి” అన్నాడు వ్యాసుడు. ఇలా చెబుతూ వ్యాసమహర్షి లేచాడు. అందరూ ఆయనతో పాటు లేచారు. అందరూ గంగానదికి ప్రయాణమయ్యారు. గంగ ఒడ్డున అందరూ తాత్కాలిక గుడారాలు వేసికుని బస చేశారు..

వ్యాసమహర్షి గంగలో దిగి మూడు మునకలు వేసి, ముక్కు మూసుకుని శ్వాస బంధించి కొద్దిసేపు ధ్యానం చేశాడు. తర్వాత “భారతయుద్ధంలో మరణించిన వీరులందరూ ఇక్కడికి రండి” అన్నాడు పెద్దగా. వెంటనే గంగానదిలో పెద్ద చప్పుడు అయింది. దుర్యోధనుడు, దుశ్శాసనుడు, శకుని ఇతర కౌరవులు వంటి ధృతరాష్ట్రుడి బంధువులు; కర్ణుడు, అభిమన్యుడు, ఉపపాండవులు, ఘటోత్కచుడు మొదలైన పాండురాజు బంధువులు; బాహ్లికుడు, సోమదత్తుడు, విరాటుడు, దుష్టద్యుమ్నుడు, ఉత్తరుడు వంటి కౌరవ వీరులు; ఇంకా భీష్ముడు, ద్రోణుడు వంటి కురువృద్ధులు అందరూ దివ్య దేహాలతో ప్రకాశిస్తూ ఒక్కొక్కరే నీటిలో నుంచీ గట్టు మీదకు నడిచి వచ్చారు. వారందరూ స్వర్గ లోకానికి చెందిన దివ్యమైన వస్త్రాలు, దివ్యమైన అలంకారాలు, పూలమాలలూ, మైపూతలతో తేజరిల్లుతూ ఉన్నారు. భీముడు వారి వంక ఆశ్చర్యంగా చూస్తూ నిలబడ్డాడు.

వ్యాసమహర్షి తపః ప్రభావంతో ధృతరాష్ట్రుడికి చూపు వచ్చింది. గాంధారి కూడా కళ్ళగంతలు విప్పేసింది.“అమ్మా! నాన్నా!” అంటూ దుర్యోధనుడు పాదాభివందనం చేశాడు. ధృతరాష్ట్రుడు ఆనందంగా కొడుకుని గుండెలకు హత్తుకున్నాడు. గాంధారి అతడి ఒళ్ళు అంతా ఆప్యాయంగా నిమిరింది. “మళ్ళీ ఎన్నాళ్ళకు నిన్ను చూడగలిగానురా తండ్రీ!” అన్నది జుట్టు సవరిస్తూ.

“ధర్మజా! నీ అగ్రజుడు కర్ణుడు” కుంతి చూపించింది. కర్ణుడు ధర్మరాజుని పరామర్శించాడు. అర్జునుడిని ఆత్మీయంగా కౌగలించుకున్నారు.

“ఏం భీమసేనా! నా మీద నీకు ఇంకా ఆగ్రహం పోలేదా!” దుర్యోధనుడు నవ్వుతూ భీముడి చెయ్యి పట్టుకున్నాడు. భీముడు బిడియంగా చూస్తూ చెయ్యి కలిపాడు. “అమ్మా! పాంచాలీ! బాగున్నావా తల్లీ!” శకుని పలకరించాడు.

అందరూ వారి వారి బంధువులను, సోదరులను, భర్తలను కలుసుకుని ఆనందించారు. అందరూ నవ్వుతూ, పరిహాసాలు ఆడుకుంటూ శత్రుత్వం లేకుండా కలసిమెలసి తిరిగారు. ఈ విధంగా తల్లులు కొడుకులు, అక్క చెల్లెళ్ళూ, బావమరదులూ, కొడుకు కొడుకులూ, కూతురి కొడుకులూ, గురుశిష్యులూ, భార్యాభర్తలూ, స్నేహితులూ అందరూ అరమరికలు లేకుండా స్నేహంతో గడిపారు. పాండవులు కూడా అందరికీ చేయవలసిన సత్కారాలు చేశారు. ఆ రోజంతా కలిసిమెలిసి వ్యవహరించారు. స్వర్గలోక వాసులు భూలోక వాసులతో కలసి ఉండటం ఆశ్రమ వాసులందరినీ ఆశ్చర్య చకితుల్ని చేసింది.

ఆ మర్నాడు రెండు వర్గాల వాళ్ళు (దివ్యదేహులు, మానుష దేహులు) పరస్పరం వీడ్కోలు తీసుకున్నారు. దివ్యదేహులు మరణానంతరం సంభవించిన ఎవరి లోకాలకు వారు వెళ్ళటానికి మళ్ళీ గంగ నీళ్ళలోకి దిగారు. వ్యాసుడు కూడా దిగి “భర్తలను అనుసరించవలసిన భార్యలు ఎవరైనా ఉంటే వారు కూడా రావచ్చును” అన్నాడు పెద్ద గొంతుతో.

భర్తలను కోల్పోయిన కౌరవుల భార్యలు కొంతమంది ధృతరాష్ట్రుడి, గాంధారి అనుమతి తీసుకుని గంగానదిలోకి దిగారు. గంగలో మునక వేయగానే వారు కూడా మానవ దేహాలను విడిచిపెట్టి దివ్యదేహాలతో భర్తలను కలుసుకున్నారు. దుర్యోధనాదులు అందరూ గంగలో మునక వేయగానే అదృశ్యమైపోయారు. అద్భుత సంఘటన చూసి అక్కడి వారందరి మనసులు ఆశ్చర్యంతో నిండిపోయాయి. ఎవరి ఆశ్రమాలకు వారి తిరిగి వచ్చారు.

తర్వాత వ్యాసమహర్షి ధృతరాష్ట్రుడు, ధర్మరాజు మొదలైన వారికి చెప్పి తపోవనాలకు వెళ్ళిపోయాడు. “నాన్నగారూ! మాకు కూడా సెలవు ఇప్పించండి. రాజ్యాన్ని పరిపాలించాల్సిన బాధ్యత ఉన్నది కదా!” అన్నాడు ధర్మరాజు.

“సంతోషం నాయనా! సుఖంగా వెళ్ళండి.” అన్నాడు ధృతరాష్ట్రుడు. పాండవులు, అంతఃపుర స్త్రీలు ముగ్గురి దగ్గరా సెలవు తీసుకుని తిరుగు ప్రయాణమయ్యారు.

“ఇష్టులైన వారు కలుసుకున్న ఈ వృత్తాంతాన్ని విన్నా, చదివినా వారికి కూడా వ్యాసమహర్షి ప్రభావం వలన ఈ లోకంలోనూ, పరలోకంలోనూ అనేక విధాలుగా అత్యుత్తమమైన కోరికలు నెరవేరుతాయి. వారు కూడా తమతమ బంధువులను కలసుకునే ఆనందకరమైన స్థితిని పొందుతారు” అని వైశంపాయనుడు ఈ వృత్తాంతాన్ని చెప్పగా జనమేజయుడు విని ఎంతో సంతోషించాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here