కవి సమ్మేళనాలలో మరి కొన్ని అనుభవాలు

0
10

[box type=’note’ fontsize=’16’] సుప్రసిద్ధ కవి నీరజ్ గారి అనుభవాలపై హిందీలో డా. ప్రేమ్‍కుమార్ రచించిన వ్యాసాన్ని తెలుగులో అనువదించి అందిస్తున్నారు డా. టి.సి. వసంత. [/box]

[dropcap]క[/dropcap]వి సమ్మేళనాలలో ఎన్నో చేదు అనుభవాలు అయ్యాయి. మనస్సు బాధ పడ్డది. ఒకసారి ‘మవురానీపూర్’లో చేదు అనుభవం అయింది. మరోసారి మధ్యప్రదేశ్‌లోని సీధీలో మవురానీపూర్‌లో కొందరు పాత్రికేయులు కవి సమ్మేళనాలని ఏర్పాటు చేసారు. కవి సమ్మేళనం ముగిసింది. వాళ్ళు నాకు డబ్బులు ఈయలేదు. మాన ధనం ఇవ్వలేదు. కాని నా చేత బలవంతంగా కాగితం పైన సంతకం చేయించుకున్నారు. ఆ రోజు ఇక నేను ఎప్పుడు మవురానీపూర్ వెళ్ళనని ఒట్టు వేసుకున్నాను. ఇప్పటిదాకా నేను కాలు పెట్టలేదు. సీధీలో ఒక కవి సమ్మేళనం అయింది. నిర్వాహకులు నాతో పాటు మరో కవిని కూడా తీసుకురమ్మన్నారు. ఆయనకి ఒక వేయి రూపాయలు ఇస్తానని చెప్పారు. డా.వీరేంద్ర తరుణ్‌ని నాతో తీసుకు వెళ్ళాను. కవి సమ్మేళనం అయ్యాక నాకు ఇచ్చే డబ్బుల కోసం పోట్లాడవలసి వచ్చింది. నాతో వచ్చిన అతనికి ఒక్క పైసా ఇవ్వలేదు. నేను ఆయనకి డబ్బులు ఇచ్చాను. అ ఊరి పేరు సీధీ. కాని రోడ్లన్నీ ఎగుడు దిగుడులే, పగుళ్ళే. బహుశ ఇప్పుడు రోడ్లు బాగు పడి ఉండి ఉండవచ్చు. నేను నా తోటి కవులకు అక్కడికి వెళ్ళాలంటే బాగా ఆలోచించి వెళ్ళండి అని సలహా ఇస్తాను. అసలు మవూరానీపూర్, సీధీ నివాసులు కవులకు ఏ మాత్రం గౌరవం ఇవ్వరు. పైగా కవుల పేరన ధనాన్ని దోచుకుంటున్నారు.

ఉర్దూ ముషాయిరాలలో నిర్వాహకులు కవులను ఎంతో గౌరవిస్తారు. ఒక సంఘటన నాకు గుర్తుకు వస్తోంది. ఉత్తరప్రదేశ్ బీహార్ బార్డర్‌లో ఒక ఊరు ఉంది. పేరు గుర్తుకి రావడం లేదు. అక్కడ ముషాయిరాని ఏర్పాటు చేసారు. నేను పాల్గొన్నాను. రాత్రంతా ముషాయిరా నడిచింది. తెల్లవారు ఝామున అయిపోయింది. అందరు బయటకి వస్తున్నారు. అప్పుడే భోపాల్‌లో ప్రసిద్ధి చెందిన కైఫ్ భోపాలీ టాక్సీ నుండి దిగారు. సమ్మేళనం అయిపోతున్న తరుణంలో ఆయన రావడం చూసి నిర్వాహకులకు నోట మాట రాలేదు. “నేను వెంటనే వెళ్ళాలి మగధశిలా ట్రైన్‌లో వెళ్ళాలి. ఆలస్యం అయితే ప్లాట్‌ఫారమ్ మీదే ఉండాల్సి వస్తుంది” అని ఆయన అన్నారు. నిర్వాహకులు అందరి కన్నా ముందే ఆయనకి పేమెంట్ చేసారు, టాక్సీకి కూడా ఇచ్చారు. ఈ సంఘటన వలన ముషాయిరాలో షాయర్లకి ఎంతగా గౌరవం ఇస్తారో తెలుస్తోంది.

1941 నుండి నేను కవి సమ్మేళనాలలో పాల్గొంటూనే ఉన్నాను. ముషాయిరాలలో కూడా… నేను సీనియర్‌ని కాబట్టి నన్ను అధ్యక్షత వహించమన్నారు. ముషాయిరాలలో ఒక సదర్, ఒక సంచాలక్ ఉంటారు. మంచి మంచి షేర్‌లు చదువుతారు. శ్రోతలు వాహ్… వాహ్… అంటూ ప్రశంసిస్తారు. హిందీ కవి సమ్మేళనాలలో ఇప్పుడు ఇటువంటి వాతావరణం లేదు. అధ్యక్షుడు మాయం అవుతాడు. సంచాలక్‌దే అంతా బాధ్యత. వీటిని కవి సమ్మేళనాలు అని అనకుండా విదూషక్ (హాస్యగాళ్ళ)ల కవి సమ్మేళనాలు అని అంటే ఇంకా బాగుంటుంది. ఆయన ముఖంలో ఆక్రోశం, బాధ వ్యక్తం అవుతున్నాయి.

కవి సమ్మేళనాల గురించి నీరజ్ ఏమాత్రం వెరవకుండా స్పష్టంగా తన అభిప్రాయలను వ్యక్తం చేసారు. వినడం నాకూ కొత్త అనుభవం. ఇన్నేళ్ళ నుండి మీరు కవి సమ్మేళనాలకి వెళ్తున్నారు. ఇప్పటికీ ఇంకా వెళ్తునే ఉన్నారు. విలువలలో వచ్చిన దిగజారుడుతనం వలన సాహిత్యాన్ని వెలుగులోకి తెచ్చే వేదికలకు ఎంతో నష్టం కలిగింది. ఇటువంటి వేదికలపై కావ్య-పఠనం చేసే నీరజ్‌గారికి, ఇటువంటి ఆలోచనలే గల తోటి కవులకు ఎంత బాధ కలుగుతుందో మనం ఊహించగలం.

నీరజ్ దీర్ఘశ్వాస తీసుకున్నారు. మళ్ళీ చెప్పడం మొదలు పెట్టారు. ఆయన కంఠంలో ఆ బాధ వ్యక్తం అవుతోంది – “నేను కవి సమ్మేళాలలో నిరాలా గారు, పంత్ గారు, మహాదేవిగారు, దిన్‌కర్‌గారు, నవీన్‌గారు, డా.అమర్‌నాథ్‌ ఝా గారూ, అన్నయ్య మైధిలీశరణ్‌గుప్త్, మఖన్‌లాల్‌ చతుర్వేది, శివమంగళ్ సింహ్ ‘సుమన్’ మొదలైన మహానుభావులని చూసాను. వీళ్ళందరు ప్రసిద్ధి చెందిన సాహిత్యకారులు. వీళ్ళు అధ్యక్షత వహించే వాళ్ళు. ఆ రోజుల్లో వేదిక పైన చదివే కవితలు ఎంతో స్డాండర్డ్‌గా ఉండేవి. శ్రోతులలో కూడా విజ్ఞులు ఉండేవారు. వేదిక మీద శ్రేష్ఠమైన కవితలు కవులు చదివేవారు. హాస్యరస కవులు గోపాల్‌ప్రసాద్‌వ్యాస్, రమయీకాకా, బేధడక్ బెనారసీ, మొదలైన వారి కవితలను శ్రోతలు అంతగా వినేవారు కాదు. వారు కవితలలో మంచి భావాలు ఉండేవి. వారు ఎంతో శ్రావ్యంగా చదివేవారు. బేధడక్ బెనారసీ రాసిన కవితలో నాలుగు పంక్తులు గుర్తుకు వస్తున్నాయి.

“జిందగీ క్యా హై ఏక్ సెంటెన్స్”- సెంటెన్స్ కి రెండర్థాలు వస్తాయి. శిక్ష, వాక్యం!
జిందగీ క్యాహై ఏక్ సెంటెన్స్, అపనే ఆప్ సమఝో
జిసే కే అర్థమే హీ పుణ్య ఔర్ పాప్ సమఝో
కి జవానీ క్యాహై – డైష్, బుఢాపా కామా
బెధడక్ మౌత్ కో తుమ్ ఏక్ పుల్ స్టాప్ సమఝో

[జీవితం అంటే ఏమిటి ఏక్ సెంటెన్స్ (వాక్యం శిక్ష), నీ అంతట నీవే తెలుసుకో. దాని శబ్ధార్థంలోనే పుణ్యం పాపాలున్నాయి తెలుసుకో, యవ్వనం అంటే ఏమిటి డాష్, మసలితనం కామా, బేధడక్ మృత్యువు అంటే ఒక ఫుల్‌స్టాప్ అని తెలుసుకో]

కాని ఈ రోజుల్లో హాస్యం పేరు మీద అవాకులు, చవాకులు, నాటకాలు, మిమిక్రీ మొదలైన వాటినే మనం చూస్తున్నాము. కొందరు అసలు కవితలే చదవడం లేదు. లతీఫాలు చదువుతున్నారు. ఇప్పుడు కవితా సమ్మేళనాలు వికృతంగా మారాయి. నేను పాత కవితలను చదువుతున్నాను. కొత్తగా రాసి చదివే పరిస్థితి లేదు. సాహిత్యంలో ఇంటరెస్ట్ ఉన్నవాళ్ళే ఇది వరకు కవి సమ్మేళనాలను నిర్వహించేవారు. వాళ్ళకి పరంపర తెలుసు. ఒకప్పుడు మహా విద్యాలయాలలో, విశ్వవిద్యాలయాలలో, పెద్ద పెద్ద సాహిత్య వేదికల మీద సమ్మేళనాలని నిర్వర్తించేవాళ్లు. అప్పుడు ఏదో వినాలని వచ్చేవాళ్ళ గుంపు తక్కువగా ఉండేది. సాహిత్య సమీక్షకులు ఉండేవాళ్ళు. మెల్లి-మెల్లిగా రాజనీతి ఈ పెద్ద-పెద్ద కాలేజీలలో ప్రవేశించింది. ఎలక్షన్లు కూడా జరుగుతున్నాయి. ఎలక్షన్లలో గెలిచిన పార్టీ సమ్మేళనాన్ని ఏర్పాటు చేస్తే, అపోజిషన్ పార్టీ వాళ్ళు కార్యక్రమం జరగకుండా చూసే వాళ్ళు. గొడవ చేసే వాళ్ళు. దీని వలన కాలేజీలలో జరగడం లేదు. లయన్స్, రోటరీ క్లబ్లలో జరుగుతున్నాయి. ఈ ప్రదర్శనలలో విజ్ఞులైన శ్రోతలు ఉండరు. ఒక వేళ ఉన్నా చాలా తక్కువగా ఉంటారు. నిర్వాహకులు బాగా ధనవంతులై ఉంటారు. అందువలన ఎంతసేపు వాళ్ళు దృష్టి డబ్బులమీదే ఉంటుంది. సాహిత్యపు విలువలు వాళ్ళకి తెలియవు. వాళ్ళల్లో చాలా మంది హాస్యకవులను, ఏవో మామూలుగా రాసే వాళ్ళను పిలుస్తారు. ఎందుకంటే శ్రోతల స్టాండర్డ్ అంత వరకే ఉంటుంది. గీతాలు, కవితలు చదివే కవులు చాలా తగ్గిపోయారు. నలుగురైదుగురు, 50 సంవత్సరాల నుండి వాళ్ళు రాస్తున్నారు. వాళ్ళనే పిలుస్తూ ఉంటారు.

అసలు యుగపు ధర్మం భ్రష్టు పట్టిపోయింది. ఆయన ఆవేశంగా మాట్లాడుతున్నారు. ఆయన గొంతులో కోపం, బాధ, దుఃఖం వ్యక్తం అవుతున్నాయి – అసలు లోక తంత్ర్ అంటున్నారు గాని అది లూట్ తంత్ర్. భ్రష్టాచారాలని ప్రజలు శిష్టాచారాలు అని అంటున్నారు. ఏ కాలంలో అయితే అబద్ధాలు, లంచాలు, అన్యాయాలు, దోపిడీ, ధర్మం అవుతుందో అప్పుడు కవిత లుప్తం అయిపోతుంది. ఈ యుగం అర్థ్ యుగం. అంతా డబ్బుతోనే ముడి పడి ఉంది. గ్లోబలైజేషన్ ఉపయోగితా వాదానికి జన్మ నిచ్చింది. అందుకే ప్రతీ వస్తువును ఉపయోగం, లాభం దృష్టితోనే చూస్తున్నారు. ఇండస్ట్రియలైజేషన్ ఒక వలలా మారింది. ఇది వరకు రాజనీతి ప్రజాసేవ కోసం. ఇప్పుడు అది ఒక వ్యాపారం. ధర్మం అంటే మానవతా విలువలు. కాని ధర్మం కూడా నేడు డబ్బు వెనక పరుగెడుతోంది. ఇది వరకుటి కాలంలో ఉన్న సంత్‌లు, పరమహంసలు ఎక్కడ ఉన్నారు? అసలు మంచివాళ్ళు కరువయ్యారు. అప్పటి నాయకులు లేరు. ధర్మాచార్యులు లేదు. స్వతంత్రం లభించాక “సత్యమేవ జయతే” అని నినాదం చేసాము. కాని ఈ రోజు 60 ఏళ్ళ యాత్ర తరువాత “అసత్యమేవజయతే” అనే మజిలీకి చేరుకున్నాం! ఎందుకు? ఎందుకంటే “నేతావోం నే గాంధీకి కసమ్ తక్ బేచీ, కవియోం నే నిరాలా కీ కలమ్ తక్ బేచీ, మత్ పూచ్ కి ఇస్ దేర్ మే క్యా- క్యా న బికా, ఇన్‌సానోంనే, ఆంఖోంకి షర్మ్ తక్ బేచీ” (నేతలు గాంధీ ఒట్టును సైతం అమ్మేసారు. కవులు నిరాలా కలాన్ని సైతం అమ్మేసారు, ఈ కాలంలో ఏమేమి అమ్మబడ్డయో మరి అడగగకు, మనుష్యులు కళ్ళల్లోని లజ్జ – సిగ్గులను సైతం అమ్మేసారు) ప్రతీ చోట రాజనీతి ప్రవేశించింది. అందుకే సిగ్గు లజ్జలకి అమ్మేస్తున్నారు. ధర్మ నిరపేక్షత అంటే, సెక్యులర్ అంటే అర్థం ఇది కాదు, ధర్మం ద్వారా స్థాపింపబడిన మూల్యాలని దేశం నుండి వేరు చేయడం కాదు, రాజనీతి దేశంలోని అన్ని పూలదండలని తన మెడలో వేయించుకుంది. ఈ దేశంలోని జ్ఞానులు, సంత్‌లు, మహా పురుషులు, సాహిత్యకారులు, కవులు,. పండితులు అవమానాలకు గురి అవుతున్నారు. రాజనీతి కేవలం దేశ శారీరక నిర్మణం చేయగలదు. రోడ్లు వేస్తుంది, చట్టాలను తెస్తుంది, విద్యాలయాలను, అసుపత్రులను తెరుస్తుంది. ఏ దేశపు ఆత్మ నిర్మాణాన్ని రాజనీతి చేయలేదు. ధర్మం, ధర్శనాలు, కళ – సాహిత్యాలు మాత్రమే ఆత్మను నిర్మిస్తాయి. ఇవి సంస్కృతికి నాలుగు స్తంభాలు. ఏ దేశంలో అయితే ఆత్మ చచ్చిపోతుందో, శరీరం బలపడుతుందో, ఆ దేశంలో భ్రష్టాచారాలు తేలికగా ప్రవేశిస్తాయి. ఓషో, రజనీష్ లాంటి మహాజ్ఞానులు పుట్టారు. అవమానాలకు గురి అయ్యారు. వెళ్ళిపోయారు. నేటి భారత స్థితిగతులను దుర్దశలను చూసి కేవలం కన్నీటిని మాత్రమే కార్చగలను. అంత కన్నా ఏం చేయలేను. లోకం నిద్రపోతున్నప్పుడు కవి మేల్కోని ఉంటాడని నానుడి ఉంది. కాని ఈనాడు కవి మేల్కోని మాత్రం ఏం చేయగలుగుతాడు. కొందరు కవులు కలాలని అమ్మేసుకుంటున్నారు. ఎమర్జెన్సీ టైమ్‌లో నేను చూసాను. నేటికి కూడా మేల్కొన్న కవులు, సాహిత్యకారులు ఉన్నారు. వాళ్ళు గొంతులు ఎక్కడో పాతాళంలో వినిపిస్తున్నాయి. వాళ్ళతో ప్రింట్ మీడియా కాని, ఎలట్రానిక్ మీడియా కాని లేదు. ప్రింట్ మీడియా ఎంత సేపు ఎడ్వర్టైజ్‌మెంటులకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తుంది. దానిని లోక్ తంత్ర్‌కి నాల్గో సంభం అని అంటున్నారు. కాని అది స్తంభం ఎట్లా అవుతుంది? అది వేరే వాళ్ళ దయాదాక్షిణ్యాలపైన ఆధారపడి ఉంది. వేరే వాళ్ళ నుండి చంక కర్రలు అడిగి తీసుకోవాల్సిన పరిస్థితి. శ్రీ పరాడ్‌కర్, గణాష్ శంకర్ విద్యార్థి, మాఖన్‍లాల్ చతుర్వేది లాంటి పాత్రికేయులు ఎక్కడ ఉన్నారు? ఎలక్ట్రానిక్ మీడియా అంటే టి.వి, ప్రచార ప్రసారాలకి అది పెద్ద పీట అయింది. భారత సంస్కృతి నిర్మాణంలో సహాయ పడకుండా, సంస్కృతిని నష్ట-భ్రష్టం చేస్తోంది. రెండు వందల సంవత్సరాలలో ఇంగ్లీషు వాళ్ళు చేయలేని పని టి.వి 20 సంవత్సరాలలో చేసి చూపెట్టింది. అందుకే నాకు ఇట్లా రాయాల్సి వచ్చింది. “టి.వి నే హమ్ పర్ యుం చుప్-చుప్ కర్ వార్, సంస్కృతి సబ్ ఘాయల్ హువా బినా తీర్ తలవార్” (టి.వి మనపైన దొంగతనంగా దాడి చేస్తోంది, సంస్కృతి అంతా గాయపడ్డది, కత్తులు – కటారు లేకుండానే బాణాలు వేయకుండానే…)

ఏ దేశాన్నైనా భ్రష్టం కాకుండా కాపాడేవి ధర్మం, రాజనీతి, కళ, సాహిత్యాలే. కాని ఏ దేశంలో అయితే రాజనీతి భ్రష్టం అయిపోతుందో, మూల్యం నుండి దూరం అయిపోతుందో అక్కడ కళ, సంస్కృతి, సాహిత్యాలు కూడా పూర్తిగా నష్టం అయిపోతాయి. ఈనాడు ఓట్ల రాజనీతి అన్నింటిని కబళించేస్తోంది. రాజకీయ నాయకులు, వాళ్ళ వర్గం వాళ్ళు, ఎటువంటి నేరాలైనా చేయడానికి వెరవడం లేదు. హత్య కేసుల్లో అపరాధాలు చేసి జైళ్ళల్లో ఉన్న నేరస్థులు సైతం ఎన్నికల్లో నిలబడటానికి అనుమతి ఇస్తున్నారు. ఈ స్వార్థపరమైన రాజకీయాలు దేశాన్ని ఎటు వైపు తీసుకువెళ్తున్నాయో ఎవరికి తెలుసు. కులాలు, మతాలు, సంప్రదాయాల పేరిట రాజకీయం చేసే నాయకులు పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నారు.

ఇంగ్లీషు వాళ్ళు దేశాన్ని కేవలం మూడు ముక్కలుగానే విభజించారు. కాని ఇప్పుటి నాయకులు దేశాన్ని ఎన్నెన్నో ముక్కలు – చెక్కలు చేస్తున్నారు. మన రాజ్యాంగం కూడా ఈ దేశాన్ని నాలుగు ముక్కలు చేసింది. బహు సంఖ్యులు, అల్ప సంఖ్యులు, వెనకబడ్డ జాతులు, అనుసూచిత జాతులు! ఆనాడు రాజా మహారాజుల వద్ద ధన ధాన్యాలు ఉండేవి. కాని ఇప్పటి రాజకీయ నాయకుల దగ్గర వేల వేల కోట్లు మురుగుతున్నాయి. డా.రాజేంద్ర ప్రసాద్, కలామ్ లాంటి రాష్ట్రపతులు, లాల్ బహదూర్ శాస్త్రి లాంటి ప్రధానమంత్రులు మచ్చుకకి కూడా కనిపించరు. ఈ రాజనీతి ఇట్లాగా దేశాన్ని ముక్కులు చెక్కలుగా చేస్తే ఇరవై – ఏభై సంవత్సరాలలో మళ్ళీ దేశ విభజన జరుగుతుంది. “రాజనీతి ఏ ఓట్‌కీ, ఏ కుర్సీకీ చాహ్, కర్ దేగీ నిశ్చిత్ హమేం ఏ ఇక్ రోజ్ తబాహ్”- (ఈ ఓట్ల రాజనీతి, ఈ కుర్చీ మోహం ఏదో ఒక రోజు, మనల్ని నాశనం చేస్తాయి). ఈ వినాశనం నిండి మనం ఎట్లా తప్పించుకోగలం, దేశాన్ని ప్రేమించే వాళ్ళందరు ఆలోచించాలి. ఆయన గొంతులో అలసట కనిపించింది. లోపలి నుండి వచ్చిన ఆక్రోశం – బాధ వలన ఆయన ముఖంలో రంగు మారింది. ఆగకుండా ఒకే తీరుగా మాట్లాడం వలన ఆయన బాగా అలసిపోయారు. ఆయన కళ్ళు మూసుకుని కాస్సేపు పడుకున్నారు. ఇవాళ ఆయన కవి సమ్మేళనాల గురించి చెబుతూ చెబుతూ దేశం, ధర్మం, సాహిత్యం, కళల విలువలు, ఉద్దేశాలు, మర్యాదలు మొదలైన వాటి గురించి చెప్పారు. నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. విరక్తి చెంది ఎంతో బాధపడ్డారు. మాటల ప్రవాహంలో కొట్టుకుపోవడం నిజానికి ఆయనకున్న కళ అని అందిరికి తెలుసు. కాని ఈ రోజు ఈ విధంగా మాట్లాడటం కేవలం ఆయన కళ కాదు. కళకు మించి మరేదో… చెప్పలేను.

~

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here