కవి ‘శిఖరం’

0
6

[box type=’note’ fontsize=’16’] “రాజకీయ జీవితంలో తలమునకలైనా కవిత్వసాధనను విడిచి పెట్టని గొప్ప కవి అటల్ వాజ్‌పేయి గారు. సామాన్యుడి నుండి దూరం కావద్దని కోరుకున్న అత్యున్నత ప్రజ్ఞా శిఖరం వారు” అంటున్నారు శ్రీమతి రాజేశ్వరి దివాకర్లశిఖరం‘ అనే ఈ పుస్తక విశ్లేషణలో. [/box]

[dropcap]ప్ర[/dropcap]ధానమంత్రి పదవిని నిర్వర్తిస్తూ కూడా కవిత్వం రాయగలగడం శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి లాంటి వారికి సాధ్యమైంది.

రాజకీయ జీవితంలో తలమునకలైనా కవిత్వసాధనను విడిచి పెట్టని గొప్ప కవి అటల్ వాజ్‌పేయి గారు. సామాన్యుడి నుండి దూరం కావద్దని కోరుకున్న అత్యున్నత ప్రజ్ఞా శిఖరం వారు.

“నాకు ఇంతటి ఎత్తు ఎప్పుడూ ఇవ్వకు
ఇతరులను గుండెలకు హత్తుకోనంతగా
అంతటి హృదయ కాఠిన్యాన్ని
ఎప్పుడూ నాకు ఇవ్వకు…

అని తమ మొదటి కవిత ‘తాజ్ మహల్’లో కోరుకున్న అభ్యుదయమే వారి ప్రవృత్తి. తనవాళ్ళకు దూరంగా గాలి గోపురంలా మిగిలి పోవడం గొప్పకాదు. పర్వతంలా ఎత్తులకు తాకి శూన్యంలో ఏకాకిగా మిగలడం ఒక నిస్సహాయత. అలా దూరమైనప్పుడు ఒంటరితనం వేధిస్తుందని చెప్పారు. అలాంటి నిస్సహాయత తనకు వద్దంటారు.

‘ఓ దేవుడా!
సామాన్యుడి స్వరం వినలేనంత స్థాయికి నన్ను ఎదగనివ్వకు..
ఆ స్థితికి నన్ను దిగజారనివ్వకు..
అలాంటి పరిస్థితి నుంచి నన్నెప్పుడూ విముక్తుడిని చేయి’

– 1992లో పద్మ విభూషణ్‌ అందుకుంటూ తాను రాసిన కవితను తానే గుర్తు చేసుకున్నారు. వాజ్‌పేయిగారు. ఎంత ఎదిగినా ఒదిగే ఉన్నారు. సామాన్యుడి హృదయంపై చెరగని ముద్ర వేశారు.

“ఎత్తయిన పర్వతాలపై
చెట్లు ఎదగవు
మొక్కలు మొలకెత్తవు
గడ్డి పరక కూడా పరచుకోదు”..

అని చెప్పిన సునిశిత సున్నిత హృదయశీలి .

~

రుతువులు ఏవైనా
వసంతం కాని హేమంతం కాని, గొప్పదనం చాటుకుని
నిశ్శబ్దంగా మిగిలి పోయినవే.

సమూహానికి దూరమైన ఘనత తనకు వద్దని కోరుకున్న తాత్విక శిఖరం వాజపేయి గారు.

లక్ష్య సాధనలో దీక్ష వారిచ్చిన సందేశం.. ఏ వ్యక్తి నిరాశకు లోను కాకూడదని, నిశా వక్షాన్ని చీల్చుకుని సూర్యునిలా ఉదయించాలని, కిరణమే చీకటిరాత్రి సవాలుగా విసిరిన చివరి అస్త్రమని భావించారు.

~

మూడు సార్లు ప్రధాన మంత్రిగా పనిచేసిన అటల్ బిహారీ వాజ్‌పేయి గారు మంచి వక్త. ప్రసంగాల్లో చమత్కారాలు ఆయనకు కవిత్వం నుంచి వచ్చినవే. పార్లమెంటు లేదా బహిరంగసభల్లో లేదా పార్టీ సమావేశాల్లో నిత్యనూతనమైన ఛలోక్తులు విసిరేవారాయన. ఎన్టీఆర్ ఏ.పీ సీ.ఎంగా ఉన్నరోజుల్లో కాంగ్రేసేతర పక్షాలను ఒకతాటి మీదకు తెచ్చేందుకు ప్రయత్నించారు. తరచుగా విపక్షాల సదస్సులు ఏర్పాటు చేసేవారు. అలాంటి ఒక సదస్సుకు పలువురు జాతీయ నేతలతోపాటుగా వాజపేయి హాజరయ్యారు. భోజనాల వేళ ఎన్టీఆర్ తనదైన శైలిలో వారందిరికీ బకెట్లో వెన్నతెచ్చి స్వయంగా వడ్డిస్తున్నారు. అప్పుడు వాజపేయి సరదాగా రామారావు సాబ్‌నే హమ్‌కో మస్కా లగారహా హై (రామారావుగారు మనకు మస్కా కొడుతున్నారు) అని చెణుకు విసిరితే అంతా నవ్వుల్లోమునిగిపోయారట. శ్రీ పి.వి నరసింహారావు గారు వాజ్‌పేయి గారిని కవిగా అభిమానించి గౌరవించేవారు.

వాజ్‌పేయి గారి పితామహులు పండిట్ శ్యాంలాల్ వాజ్‌పేయి సంస్కృత పండితులు. అటల్ గారి తండ్రి పండిట్ కృష్ణ బిహారీ కవిగా సుప్రసిద్ధులు. వారు గ్వాలియర్ ప్రాంతంలో ఒక ఉపాధ్యాయులు. జయంతి ప్రతాప్ అనే పత్రికలో ఆయన కవితలు ప్రచురితమయ్యాయి. అటల్ గారి పెద్దన్న పండిట్ అవధ్ బిహారీ వాజ్‌పేయి కూడా కవిత్వం రచించేవారు. ఇంట్లో ఉండే సాహిత్య వాతావరణం ఆయనను కవిత్వంపై వైపు నడిపించింది.

ప్రాచీనతను ఆధునికతను మేళవించి చెప్పిన గొప్ప కవిత తప్పెవరిది?ఒప్పెవరిది?

ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు
కౌరువులెవరు? పాండవులెవరు?
ఇది కఠినమైన ప్రశ్న అని అంటారు
ఇరువైపులా శకుని మాయాజాలం ఉంది.
ధర్మరాజు కూడా జూద మోహ క్రీడలను ఒదులు కోలేదు కదా.
అందుకే జూద పంకిలం అంటుకొన్నది.
ప్రతి పంచాయతిలో పాంచాలి అయినా
నిరు పేద స్త్రీ అయినా అవమానితలే కదా!
ప్రాచీన కాలం నుంచీ జరిగే సంగతిని తెలిపారు.
ఇప్పుడు కృష్ణుడు లేని మహా భారతం కావాలి

ప్రజాస్వామ్యంలో ప్రజలే నిర్ణేతలు. ప్రజా భావ సంపద పెరగాలి. ప్రశ్నించే గుణం రావాలి. అందుకే కృష్ణుడు లేని రాజ్యం కావాలి. ధర్మ నియతి లేని రాజ్యం లో రాజు ఎవరయితేనేం? అని ప్రశ్నించారు.

వారు రాసిన ‘సామూహిక అత్యాచారం’ కవిత కదలలేని స్థితిలో సైతం వారిని కలచి వేసిన దుర్ఘటనను చిత్రిస్తుంది. “నా చితా భస్మం నుంచి భవిషత్తును కాపాడు”. అమ్మా నేను బతకాలనుకుంటున్నాను అన్న ఆ యువతి వేదనను మనో నేత్రంతో దర్శించారు. అతి సామాన్యునిలా దుఖించారు.

‘ఒకనాటికి నేను మాజీ ప్రధానిని కావచ్చు… కాని మాజీ కవిని మాత్రం కాలేను’ అని తన శాశ్వత కవి హోదాను తలచిన ఉదాత్త మనీషి వాజ్‌పేయి గారు. వాజ్‌పేయి గారితో రాజకీయాలు, సాహిత్యం ఒకదాన్నొకటి సుసంపన్నం చేసుకున్నాయి.

‘ఓటమిని ఒప్పుకోను.. పోరుకు వెనుకాడను..
కాలం నుదిటిపై పాతను చెరిపేస్తా..
కొత్త రాతను లిఖిస్తా.. నూతన గీతాన్ని ఆలపిస్తా..’

జీవితంపై వాజ్‌పేయి సమరశంఖారావం ఇది. జీవితంలో పైకెదగాలనుకునే ప్రతి ఒక్కరికీ అన్వయించే స్ఫూర్తిమంత్రం.

వాజ పేయి గారు హిందీ భాషలో రచించిన అనేక కవితలను ‘శిఖరం’ పేరుతో తెలుగులోకి అనువదించారు పాలమూరు సాహితీ కెరటం ‘జలజం సత్యనారాయణ’ గారు. వారు తెలంగాణా రాష్ట్రానికి చెందిన విద్యావేత్త, సాహిత్యవేత్త, అనువాదకులు. తెలంగాణ ఉద్యమనాయకులు. అలాగే కబీరు కవితలను, కబీర్ గీత అనే పేరుతో, ఫైజ్ మహ్మద్ గ్రంథాలను కూడా తెలుగునకు అనువదించారు. పన్నెండు హిందీ పుస్తకాలను తెలుగులోకి అనువదించారు. వాజపేయి కవిత్వంలో విశ్లేషణలు ఉండవంటారు జలజం గారు. కేవలం అభివ్యక్తి మాత్రమే ఉండటం ఒక విశేషమని, వాజ్‌పేయి గారి కవిత్వంలో పదాలు నీటి మీద కాగితం పడవల్లా కదలి పోతుంటాయని వారన్నారు.

అనుసృజనలో సత్యనారాయణ గారు వాజ్‌పేయి గారి కవితలకు ప్రాణప్రతిష్ఠ చేశారు. కవి గారి అనంత ఆవేదనలను ‘శిఖరం’గా మలిచినతీరు శిఖరాయమానమైనదని చదివిన వారందరూ ఒప్పుకుంటారు. తెలుగు సాహిత్యంలో వాజపేయి గారి కవిత్వానువాద గ్రంథం ఇదొక్కటే కావడం విశేషం.

ప్రధానమంత్రి పదవి అనేది కేవలం అనుభవించదగిన ఒక వస్తువు కాదని, గ్వాలియర్‌లో బడిపంతులు కుటుంబంలో జన్మించిన తాము దేశ ప్రధానమంత్రి అయి నిరూపించారు వాజ్‌పేయి గారు.

దొంగలా అడుగుల సవ్వడి లేకుండా రావద్దు.. రా.. ఎదురుగా వచ్చి పోరాడు.. అంటూ మృత్యువుకే సవాల్ విసిరిన ధీశాలి అటల్ గారు. ‘చావు.. నీ ఆయుష్షు ఎంత? రెండు క్షణాలు కూడా ఉండదు’ అంటూ చావును కడిగి పారేశారు. ‘జీవితం అన్నది ప్రగతిశీలం.. అది ఒకటి రెండు రోజుల్లో ముగిసిపోదు..’ అంటూ జీవిత సత్యాన్ని నర్మగర్భంగా చెప్పారు

జీవిత ప్రయాణంలో మృత్యువు ఎప్పుడొస్తుందో తెలియదు..
అందుకే దానిపై పోరాటానికి సిద్ధపడి లేను..
కానీ ఇప్పుడు మృత్యువుతో పోరాటం అనివార్యం…
మరణం నన్ను భయపెట్టడానికి ప్రయత్నిస్తోంది…
అయినా పోరాడకుండా ఓటమిని అంగీకరించను..
ఓ మృత్యువా దొంగలా అడుగుల సవ్వడి లేకుండా రావద్దు..
రా! ఎదురుగా వచ్చి పోరాడు..

..అంటూ తన కవిత్వంలో చెప్పినట్లుగానే మరణంతో ధైర్యంగా పోరాడి అనంత లోకాలకు వెళ్లిపోయారు అటల్‌ బిహారీ వాజ్‌పేయీ గారు.

2012లో ది హిస్టరీ ఛానల్, రిలయన్స్ మొబైల్ భాగస్వామ్యంతో ‘అవుట్‌లుక్’ మ్యాగజైన్ నిర్వహించిన ది గ్రేటెస్ట్ ఇండియన్ పోల్ లో భారత అత్యుత్తమ వ్యక్తిగా ఎన్నిక అయ్యారు. స్వతహాగా కవి అయిన వాజపేయి తాను వ్రాసిన కవితల గూర్చి “తన కవిత్వం ఓడిపోయిన సైనికుడి నిరాశావాద గుండె చప్పుడు కాదని, విజయం సాధించి తీరు తాననే పోరాట యోధుని అచంచల ఆత్మవిశ్వాసమని” అన్నారు. కవిత్వం ప్రజల్లో కర్తవ్యాన్ని తట్టిలేపాలని, సామాజిక బాధ్యతను గుర్తు చేయాలని వాజ్‌పేయి గారు నమ్మారు. తన పార్లమెంటు జీవితంపై ‘మేరీ సన్సదీయ యాత్ర’గా నాలుగు సంపుటాలు రచించారు. ‘మేరీ ఇక్యావన్ కవితాయే” సంకల్ప్‌ కాల్‌’, ‘శక్తి సే శాంతి’, ‘ఫోర్‌ డెకేడ్స్‌ ఇన్‌ పార్లమెంట్‌ (పార్లమెంటు ప్రసంగాలు),‘ లోక్‌సభ మే అటల్‌జీ’ (ప్రసంగాల సంకలనం),‘ మృత్యు యా హత్య’, ‘అమర్‌ బలిదాన్‌’, ‘జన్‌సంఘ్‌ ఔర్‌ ముసల్మాన్‌’, ‘క్యా ఖోయా క్యా పాయా’, ‘కుచ్‌ లేఖ్‌..కుచ్‌ బాషన్‌’, ‘నయీ చునోతి– నయా అవసర్‌’ తదితర రచనలను కావించారు. కేరళ లోని కుమర కోం రిజార్ట్స్ లో తామున్నప్పుడు దేశం ఎదుర్కొంటున్న సమస్యలను గూర్చి కుమరకోం మ్యూజింగ్స్‌ను రాసారు.

వాజపేయిగారు నమిత అనే అమ్మాయిని దత్తత తీసుకున్నారు. ఆయనకు భారతీయ సంగీతం మరియు నాట్యం అంటే ఇష్టం. ప్రకృతి ప్రేమికుడైన వాజపేయి గారికి హిమాచల ప్రదేశ్ లోని మనాలీ ప్రాంతమంటే ఎనలేని ఇష్టం. పేరులో కఠినత్వం (అటల్‌) ఉన్నా ప్రేమ, ఆప్యాయతలను పంచడంలో ఆయన తర్వాతే ఎవరైనా అనిపించుకున్నారు. దేశాన్ని గురించి కఠిన నిర్ణయాలను తీసుకొనేటప్పుడు (అటల్) బలమైన, నిశ్చలమైన నిర్ణయాలను తీసుకున్నారు.

వాజ్‌పేయి గారి జన్మదినాన్ని(డిసెంబర్‌ 25) కేంద్రం ‘సుపరిపాలన దినోత్సవం’గా నిర్వహిస్తోంది. 2018 ఆగస్టు 16న తిరిగిరాని లోకాలకు తరలిపోయారు.

శిఖరం ఒంటరిది. ఎవరూ రారు హత్తుకోవడానికి. అధిరోహించడానికి బాగుంటుంది. కాని తోడు నిలవడానికి ఒక్కరూ ఉండరు’ అని రాసిన వాజ్‌పేయి గారు శిఖర స్థాయిని నిరాకరించారు. మానవతా శిఖరాలను అధిరోహించారు.

***

శిఖరం (అటల్‌ బిహారీ వాజ్‌పేయి కవిత్వం)
అనుసృజన: జలజం సత్యనారాయణ
పేజీలు : 96
వెల : ₹ 100
ప్రచురణ: ధ్వని పబ్లికేషన్స్, మహబూబ్‌నగర్
ప్రతులకు :
నవోదయ బుక్ హౌజ్, కాచీగుడా, హైదరాబాద్.
ఇంకా 98494 44944

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here