కవిత్వాధ్యయనం

0
9

[డా. జి.వి. సుబ్రహ్మణ్యం రచించిన ఈ వ్యాసాన్ని ప్రత్యేక వ్యాసంగా అందిస్తున్నాము. ఈ వ్యాసం యువభారతి వారి ‘సాహిత్యాధ్యయనం’ (1977) లో తొలిసారిగా ప్రచురితం. 1983లో యువభారతి ప్రచురించిన ‘అభినవ లోచనం’ అనే వ్యాస సంపుటిలోనూ చోటు చేసుకుంది.]

[dropcap]క[/dropcap]విత్వాన్ని వ్రాయటం వేరు, చదవటం వేరు, అధ్యయనం చేయటం వేరు. అధ్యయనమంటే గ్రుడ్డిగా అరాధించటం కాదు అసలైన తత్వాన్ని అన్వేషించటం. అన్వేషించటం మరలా రెండు విధాలు, ఒకటి – తాను కోరుకున్నది కవిత్వంలో ఉందా లేదో అని తరచిచూడటం. రెండు – కవితలో ఉన్న పరమార్థాన్ని సమతతో చూడటం. మొదటిదాన్ని సాపేక్షాధ్యయనమనీ, రెండవదాన్ని నిరపేక్షాధ్యయనమనీ పిలవ్వచ్చు. సాపేక్షాధ్యయనం ప్రధానంగా సహృదయుని, ప్రవృత్తి మీద ఆధారపడి ఉంటుంది. నిరపేక్షాధ్యయనం మౌలికంగా సహృదయుని సంస్కారం మీద ఆధారపడి ఉంటుంది. ప్రవృత్తి అంటే పఠిత ఇష్టానిష్టాల వలన ఏర్పడిన అభిరుచి విశేషం. సంస్కారమంటే జన్మతః సహృదయునిలో ఉండే రసికత్వం.

అధ్యయనానికి ముందు మెట్టు ఆస్వాదనం. ఆస్వాదనాన్ని ఆధునికులు అనుభూతి అంటున్నారు. కవిత్వాన్ని మొదట, సహృదయు డాస్వ్వాదించాలి. తరువాత అధ్యయనం చేయాలి. ఆస్వాదనకు కావలసింది కూడా సంస్కారమే. సంస్కారం వాసనారూపంగా ఉంటుందనీ, ఆ వాసనాబలం వల్ల సహృదయుడు కవిత్వంలోని రసభావాల నాస్వాదింపగలుతాడనీ, వాసనలేని వాడు పాషాణతుల్యుడనీ అభినవగుప్తుడు చెప్పాడు. పాశ్చాత్యులు వాసనాసిద్ధాంతాన్ని భావించకపోయినా సహృదయునికి సాహిత్యరసికత్వం – లేక – సహృదయత్వం ఉండాలని అంగీకరించారు. దీన్ని సాహిత్యాభిరుచి అనకూడదా అని ఒక ప్రశ్న రావచ్చు. ఆ సమాసంలో అభిరుచి అనే పదానికి సహృదయత్వమనే అర్థం. అయితే మనం ఇంక పూర్వం అనుకున్న అభిరుచి విశేషమైన ప్రవృత్తి ఇంతకంటే భిన్న మైందని గ్రహించాలి. ఒకరికి ఒక వస్తువంటే మక్కువ ఉండవచ్చు. ఒక సిద్ధాంత మంటే అభిమాన ముండవచ్చు. అటువంటప్పుడు అతడు తనకు నచ్చినదాన్నే ఆస్వాదించ గలుగుతాడు. అంటే అతడు కొన్ని ఆవరణాలకు లోబడినాడన్నమాట. కొన్ని ఇష్టానిష్టాలకు బద్ధుడై నాడన్నమాట. మరి అటువంటివాళ్ళు కవిత్వాన్ని ఆస్వాదించలేరా అని మరొక్క ప్రశ్న పుడుతుంది. నిజానికి కొందరికి కవిత్వమే కిట్టదనుకోండి. వారికి కవిత్వం వినిపించి ప్రయోజనమేంటి? వారికి రక్తికి బదులు విరక్తే కలుగుతుంది. మరికొందరికి కవిత్వమంటే ఇష్టమే. కాని, కవిత్వంలో తాననుకున్న దృక్పథమే ఉండాలని భావించారనుకోండి. వారికి వారి భావాని కనుగుణంగా వ్రాసిన కవిత్వమే ఆస్వాదనీయం కావచ్చు. మరొకమాటలో చెప్పాలంటే లోకంలో కొందరు కవిత్వానికీ తమకూ మధ్య తామే అడ్డం నిలబడుతున్నారన్నమాట. అటువంటివారిని నూటికి నూరు పాళ్లు సహృదయు లంటానికి వీల్లేదు.

కవిత్వాన్ని ఆస్వాదించటానికి పఠిత తనంతట తాను అడ్డం నిలిచే ప్రవృత్తిని తొలగించుకోవాలి. అంటే తన్మయత్వాన్ని పొందే చిత్తవృత్తిని అలవరచుకోవాలి. దీన్నే లాక్షణికభాషలో విశ్వజనీనత్వం అంటారు. పరగత సుఖ దుఃఖాలను తనవిగా భావించి తన్మయు డయ్యే అవస్థ అది. అప్పుడు పఠితల్లో అత్మ ప్రత్యయం ఉండదు. విశ్వజనీనుడైన ఆత్మగా భాసిస్తాడు. ఇతరుల అవస్థల్లో లీనమౌతాడు. అంటే, తన్ను తాను మరిచిపోతాడు. అనుభూతిలో తన్మయుడౌతాడు. అనందాన్ని అనుభవిస్తాడు. దీన్నే లాక్షణికభాషలో చెపితే రసానంద మంటారు. కవిత్వం ప్రధానంగా రసానందం కోసమే పుట్టుతుంది. అనుభూతిలో నుంచి ఆకృతి జనించి అనుభూతిలో లయమై పోతుంది. అసలీ అనుభూతిని అంగీకరించక పోతే కవితాత్మను కాదన్నట్లే. కవితను చదివేవాడు మొదట అనుభూతి కోసమే చదువుతాడు. నిరపేక్షాధ్యయనానికి ఈ అనుభవ మార్గం ప్రాతిపదిక.

ఇక సాపేక్షమార్గాన్ని గురించి ఆలోచిద్దాం. ఆధునికుల్లో అభ్యుదయవాదులు-విప్లవవాదులు ఉన్నారు. వీరు కవితను మార్క్స్ దృక్పథంతో చూస్తారు. ఆ దృక్పథంతో వ్రాసిన కవిత కవిత్వమంటారు. తదితరమైంది కవిత అయినా దాన్ని గణనకు తీనుకోరు. ఇందులో మరో విశేషముంది. కవిత్వంలో వస్తువు ఉంటుంది, ప్రక్రియ ఉంటుంది, అనుభవం ఉంటుంది. వస్తువు ఏదైనా, ప్రక్రియ ఏదైనా, ఆ రెండూ అనుభవానికి సాధకాలే. సాధ్యమెన అనుభూతిని అందుకోవటానికి అభ్యుదయ కవిత ఒక సాధనం. అయితే ఆ సాధనస్వరూప స్వభావా లెలాగుండాలి అన్న అభిప్రాయంలో అభ్యుదయవాదులకు కొన్ని ఖచ్చితమైన అభిప్రాయా లున్నాయి. సమాజంలోని కుళ్ళును వెలికితీసి విమర్శించటం, సామ్యవాద దృక్పథంతో వస్తువు నెన్నుకొని చిత్రించటం, వీలైనంతవరకు సంప్రదాయంగా తాము భావించే ఛందస్సును నియమాలను పరిత్యజించటం మొదలైనవి వారి అభిప్రాయాలు. పద్యంలో కవిత వ్రాస్తే చేదని కాదు. సీతోరాముల శోకం విషమనీ కాదు కాని, అవి తమ సిద్ధాంతాలకు పతాకలుగా నిలవ్వు. అందువల్ల ఆ వస్తువులో, ప్రక్రియలో వారి చిత్తం రమించదు. ఆది వారి ప్రవృత్తి. అభ్యుదయ కవిత్వంలోనూ, ప్రాచీనసాహిత్యంలోనూ పక్షపాతం లేని సహృదయభావంతో రసాస్వాదనం చేసే రసికుడున్నా డనుకుందాం. వాడే జాతికి చెందుతాడో? ఎవరెలా అనుకున్నా – సహృదయజాతి వాడిది. అలా సహృదయుడు కాలేకపోతే కవిత్వాన్ని రెండు కన్నులతో చూడలేడు. సమచిత్తంతో ఆస్వాదించలేడు.

ఆధునికులు ఆస్వాదనను రెండు విధాలుగా వింతడిస్తున్నారు. ఒకటి: హృదయంతో ఆస్వాదించటం. రెండు: మేధతో ఆస్వాదించటం, ఆస్వాదన లోని అనుభూతి – తన్మయత్వం కాదు. తత్ప్రభావం కవిత చదివితే పఠిత కన్నీరు కార్చటం కాదు ప్రధానం. కవితలోని భావంతో సానుభూతి ప్రకటించటం – లేదా – కవిత ప్రతిపాదించే భావంతో ప్రభావితుడు కావటం. సామాజికుల్లో సానుభూతి కలగాలని కవితలో అభివ్యక్తి శిల్పాన్ని బలంగా వాడుకుంటున్నాడు ఆధునిక కవి. పఠితను ప్రభావితుణ్ణి చేయాలని సిద్ధాంతాలను శంఖంలా పూరిస్తున్నాడు. అభివ్యక్తి శిల్పంలో రచనాచమత్కారం రాణిస్తోంది; సిద్ధాంత కవిత్వంలో సూత్రాలూ భాష్యాలూ వినిపిస్తున్నాయి. కవిత్వాన్ని కళగా కంటె ప్రచార సాధనంగా ఉపయోగించుకొనే రాజకీయ చైతన్యం ప్రపంచంలో ప్రబలిన తర్వాత వచ్చిన పరిణామాల్లో పరిగణింపదగింది ఇది. దీనికి యాంత్రిక యుగం వాతావరణం తోడయింది. ఎలెక్ట్రానిక్‌ బ్రెయిన్‌ ఆలోచిస్తుంది తప్ప అనుభవించదు. యాంత్రిక నాగరికత మెదడు మీద పనిచేసినంతగా గుండె మీద పని చేయదు. దీనికి రాజకీయ ఆర్థిక దృక్పథాలు తోడైతే ఇక చెప్పాలా? ఎండకు వడగాలి తోడైనట్టు, రాజకీయ ప్రయోజనాలకు వెలువడే సిద్ధాంతాలకు రాజ్యాలు లక్ష్యాలు: కవితలు మంత్రాంగాలు. ఇక ఆర్థిక సమానత్వాన్ని బోధించటానికీ కవిత ప్రబోధసాధనం, ప్రచార ఆయుధం. ప్రబోధంలో బీదల బాధల కరుణామయ చిత్రాలు కన్నీరు కార్పించి దాని కన్న సానుభూతిని కలిగిస్తాయి. ప్రచార కవిత్వంలో ప్రణాళికలే పదివేల అవతారా లెత్తుతాయి. ఏమైనా ఆధునికుడు కవిత్వాన్ని ఆర్ద్రంగా సృష్టించటం లేదు; ఆర్ద్రంగా అనుభవించటం లేదు, ఆవేశంతో రచిస్తున్నాడు, ఆవేగాన్ని అభివ్యక్తం చేస్తున్నాడు. ఈ రెండూ పఠితలో ఆలోచన రేకెత్తించా లంటున్నాడు. ఆధునికయుగం కవితను ఆరాధించటం లేదు; అనుభవించటం లేదు; ఆయుధంగా ఉపయోగించుకొంటోంది. ఆ ఆయుధం చాల వరకు తుపాకి. ఆ తుపాకీ గుండెలమీద పేలదు; మెదళ్ళ మీద పేలుతుంది. అందులోని మందు – ప్రేలుడు మందు సిద్ధాంతం. మరో పేరు దానికి – ఇజం. ఇజం మెదడును పలుపుకట్టి ముందుకు లాక్కెళ్ళుతుంది. హృదయం లేగలా దాని వెంట పరుగెడుతుంది.

అనుభూతి లేనిది అధ్యయనం లేదనుకున్నామే. మరి అనుభూతి అంటే సహానుభూతి కాదు, సానుభూతి అనుకున్నా తాదాత్మ్యభావం గాదు- తత్ప్రభావ మనుకున్నా ఆర్ద్రత కాదు; ఆవేశమనుకున్నా ఆనందం కాదు. ఆలోచన అనుకున్నా, అది లేంది అధ్యయనం లేదు. అయితే, మనసుతో పొందే అనుభూతి లోచూపు ప్రసరింప చేస్తుంది; మెదడుతో పొందే అనుభూతి పైచూపు నిస్తుంది. తనలో విశ్వాన్ని చూచుకొనేది లోచూపు. విశ్వాత్మలో తనను చూచుకొనేది పైచూపు. ఏ చూపుతోనైనా అన్వేషణ ప్రారంభించవచ్చు అధ్యయనం సాగించవచ్చు.

అయితే కవితకు అధ్యయనం అవసరమా? అని కొందరు సూటిగా ప్రశ్నించవచ్చు. వనితను కోరేవాడికి వయసుంటే చాలు వలపెందు కన్నట్టుంటుంది ఈ ప్రశ్న. అధ్యయనం కవితలు వ్రాయటానికి తోడ్పడుతుంది. తిరుపతి వేంకటకవులన్నట్లు –

‘చదువగావలె శబ్దశాస్త్రాదికమ్మును
వీక్షింపగా వలె విద్య లెల్లఁ
జూడగావలె రాజ చూడామణుల సభల్‌
పొందగా వలె మహా భోగములును
దిరుగగావలె దేశదేశాల వెంబడిఁ
బడవలెఁ బడరాని పాటు లెల్ల
వినగా వలెను పూర్వ విద్వచ్చరిత్రముల్‌
దర్శింపవలెను ఛందః ప్రశంస
కవులు కవులన్న మ్మాతన కవులు గారు
ఎంత భారమ్ము గలదొ కవీశ్వరులకు
నెఱుఁగకుందురె మీ వంటి నృపతిమణులు
శ్రీ మదానంద గణపతి క్షితితలేంద్ర!’

ఇంత వ్యుత్పత్తిని సంపాదించి దాని సారాన్ని ప్రతిభామయం చేసి కవిత్వంగా తీర్చిదిద్దాలి. వ్రాయటాని కింత అధ్యయనం కావలిసివస్తే ఇక ఆ కవిత్వాన్ని అవగాహన చేసుకోవటానికి అధ్యయనం అవసరం లేదా!

‘మందార మకరంద మాధుర్యమునఁ; దేలు
మధుపంబు బోవునే మదనములకు
నిర్మల మందాకినీ వీచికలఁ దూఁగు
రాయంచ జనునె తరంగిణులకు?
లలిత రసాల పల్లవ ఖాదియై చొక్కు
కోయిల చేరునే కుటజములకు
బూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరక
మరుగునే సాంద్ర నీహారములకు?

అంబుజోదర దివ్య పాదారవింద
చింత నామృత పాన విశేష మత్త
చిత్త మే రీతి నితరంబుఁ జేర నేర్చు?
వినుతగుణశీల మాటలు వేయునేల?’

పోతనగారి పద్యం చదివితే పాముపాట విన్నట్టుగా తలలూపే తెలుగువారున్నారు – కోట్లకు పైబడి, కాని, ఆ కోట్లలో ఏ లక్షకో దాన్ని తెలిసి తలలూపే శక్తి ఉండవచ్చు. సామగానంలా వినవచ్మే శబ్ద మాధుర్యం వేరు – సోమపానంలా కనవచ్చే దాని భక్తిభావం వేరు. పద్యభావం తెలిస్తే కాని, భక్తిభావం అర్థం కాదు. అందువల్లనే ప్రాచీను లన్నారు –

‘సంగీత మపి సాహిత్యం సరస్వత్యాః స్తనద్వయం
ఏకమాపాతమధుర మన్యదాలోచనామృతం’.

సాహిత్యంలో అనుభూతి ఆలోచనల వల్లే వస్తుంది. ఆలోచనం అర్హత వల్ల వస్తుంది. అర్హత అంటే విద్యార్హత కాదు; అధ్యయన శక్తి. అధ్యయనమంటే విద్యార్థులు ప్రతిపదార్థ తాత్పర్యం, పకృతి వికృతులూ, సంధి సూత్రాలో అని భయపడి పోతారు. ప్రాచీన లక్షణ గ్రంథాలూ; సాహిత్య మర్మాలూ, సమాసాలూ, శబ్దకోశాలూ, శాస్త్రవ్యుత్పత్తులూ – ఇవ్వేమో ననుకుని ఈసడించుకుంటారు అభ్యుదయ కవులు. కాని, ఆధునిక కవిత్వం అర్థం కావాలన్నా అంతో – ఇంతో అధ్యయనం కాహలని వారే అంటారు. “అధునికాంధ్ర కవుల రచనలను సరిగా అర్థం చేసుకోవడానికి వాటి వెనుక బాసటగా నిలిచిన ఇతర దేశాల సాహిత్య వ్యవసాయాలను గమనించక తప్పదు. నేటి రచనలను విశ్వపర్యాప్తమైన విశాల జీవితంతో సమన్వయించి నిజమైన కవిత్వ మేదో, కేవలం నిర్జీవ శుష్కానుకరణ మేదో గుర్తించాలి” అని శ్రీశ్రీ అన్నాడు.

‘ఏ దేళ చరిత్ర చూచినా ఏమున్నది గర్వకారణం
నరజాతి చరిత్ర సమన్తం పరపీడన పరాయణత్వం’.

ఈ చరణాలకు ప్రతిపదార్థ తాత్పర్యం అవసరం లేదు. ప్రతిపాదితార్థ తత్వం తెలియాలి. గతి భౌతిక తార్కికవాద దృకృథం తెలిస్తే గేయంలోని భావం తేట పడుతుంది. కవితను ఆస్వాదించాలంటే అర్థం అవసరం. అర్థం పదార్థమే కాదు. అంతకంటె కవితలో చెప్పే పరమార్థం, అధ్యయనం శబ్దార్థాలకు సంబంధించింది కాదు. శాస్త్రానికి సంబంభథించింది. తాత్పర్య జ్ఞానమే. కాదు; తత్త్వచింతనం!

అధ్యయనం అనుభూతికైన అన్వేషణం కావచ్చు; అనుభూతి విశ్లేషణం కావచ్చు. కవిత్వంలో రమణీయమైన భావం ఉంటుంది. కాని, అది చదవగానే వెంటనే సామాన్య పఠితకు స్ఫురింపక పోవచ్చు. కొంచెం విడమరిచి జెప్పితే ఇతడు దాన్ని ఆస్వాదింప గలుగుతాడు.

‘స్వైర విహార ధీరలగు సారసలోచనలున్న చోటికిన్
భోరున లాతివారు చొరఁబూనినచో రసభంగ మంచు, నేఁ
జేరక పువ్వుఁ దీవియల చెంతనె నిల్చి లతాంగి రూపు క
న్నారఁగఁ జూచి వచ్చితి నవాంబు రుహాంబక నీకు దెల్పగన్!’.

ఇందులో ‘సారసలోచన’ లనే సమాసంలో ‘రస’ భంగమైతే ‘సాలోచనలు’ అనే పదం ఏర్పడుతుందన్న చమత్కారం తెలిస్తే సహృదయుడు సంతోషపడతాడు. దానికి కొంత పరిశ్రమ తప్పదు. అందువల్ల అనుభూతికై అన్వేషణ చేయటంలో పఠితకు గురువూ, మిత్రుడూ, వాఖ్యానం, విమర్శా తోడుపడుతుంటాయి.

ఇక అనుభూతి విశ్లేషణం గూర్చి విచారిద్దాం. ఒక కవిత చదివితే ఒక అనుభూతి కలుగుతుంది. ఆ అనుభూతి ఎలా కలుగుతుంది? దానికి తోడుపడుతున్న కవితాద్రవ్యా లేమిటి? అవి ఎలా ఆ అనుభూతిని కలిగిస్తాయి? మొదలైన ప్రశ్నలు వివేకవంతునికి కలుగుతాయి. వాటికి సమాధానం తనంతట తాను చెప్పుకొనే స్థితిలో ఉంటే సహృదయుడు ధన్యుడే. అది అంత తేలికైన పని కాదు. రుచి చూడటం తేలికేగాని, ఆ రుచి ఎలా ఏర్పడుతుందో వివేచించటం ఆంత తేలిగ్గాదు. ఇలా వివేచించే పద్ధతినే ప్రపంచంలో కావ్య సౌందర్య దర్శన శాస్త్రమంటారు. ఆలంకారశాస్త్ర మంటే ఆధునికులకు ఆగ్రహం గాని పేరు మార్చుకున్నా ప్రయోజనం మాత్రం ఒకటే. సౌందర్య స్వరూప స్వభావాలు కవి కెంత తెలియాలో పఠితకూ అంతే తెలిసి ఉండాలి.

‘యెనకజల్మంలోన యేవరమో నంటి
సి గ్గొచ్చి నవ్వింది సిలక నా యెంకి
ముందు మన కేజల్మ ముందోలె యంటి
తెల తెల బోయింది పిల్ల నాయెంకి
ఎన్నాళ్లు మనకోలె యీ సుకము లంటి
కంట నీ రెట్టింది జంట నా యెంకి!’

ఈ పాట వింటే కమ్మగా ఉంటుంది. దానిలో కమ్మదనాన్ని కలిగించే అంశాల నన్వేషిస్తే ఆనంతంగా ఉంది. నర్జన్మ సిద్ధాంతం నుంచి పల్లెవారి మనస్తత్వం వరకూ ఎన్నో విషయాలు తెలియాలి. తెలియకపోతే ఏమౌతుందంటే మన మనస్సును మనమే దివాలా చేసుకుంటాము. అంత దూరం వద్దు. జీవితాన్ని ప్రకృతినీ ఒకచోట ముచ్చటగా ముడివేసి మనముందు కవితను ఒక కవి ఉంచాడనుకోండి. ఉదా॥ విశ్వనాథ వారి ‘చిన్ని మబ్బులు’.

‘కన్నె కాటుక కళ్ళు – చిన్ని నాథుని చూచి
కదలు లాడిన వేళ – కందళించిన వేళ
ఆకాశమధ్యాన – అట నొక్క తెలి మబ్బు
మెరపులా మెరిసిందిలే! – వెలుగులో వొరిసిందిలే!’
~
‘తొలిచిన్ని చూలాలు – కొలసిగ్గు ప్రేమతో
విభుని చూచిన వేళ – విన్నబోయిన వేళ
బఱపు మిన్నులలోన – ఒక నీలి తెరమబ్బు
సంజలో తారిందిలే! – జాలుగామారిందిలే!’
~
‘తొలికాన్పు పసిపాప – సాకనేరని బాల
తెలవోయి పతి జూచి – కళవళించిన వేళ
తూర్పుకోనలో – తొంగిలించిన మబ్బు
తెగ పరుగులె త్తిందిలే – సొగసుల్లు పోయిందిలే!’

ఈ కన్నె జీవితానికిన్నీ – ఆ కన్నె మబ్బులకున్నూ ఉన్న సంబంధం సౌందర్య దృష్టీ సంస్కార శక్తీ ఉంటేనే గాని అవగతం కాదు. సౌందర్యం ప్రతి వాడినీ సంతోషపెడుతుంది. మరి ఎవడికో గాని దాని తత్వం బోధపడదు.

‘చావు పుట్టుకల మధ్య సందేహం లాంటి
జీవితంలో నలువైపులా అంధకారం
మంచిగంధంలాగా పరిమళించే మానవత్వం
మా కున్న ఓకే ఒక అలంకారం!’

అన్న తిలక్‌ కవిత భావనారమణీయంగా ఉంటుంది. కాని ‘చావు పుట్టుకల మధ్య సందేహం లాంటి’ అన్న ఉపమానాన్ని ఆందుకోవటానికి ఉపజ్ఞతోపాబు ఊహా బలం కూడా ఉండాలి. శ్రీశ్రీ గారి అవతారాన్ని చదివితే కలిగే అనుభూతిని విశ్లేషించుకోవటానికి ఎంత పిండి ఉండాలి?

‘యముని మహిషపు లోహ ఘంటలు
మబ్బుచాటున – ఖణేల్‌ మన్నాయి
నరకలోకపు జాగిలమ్ములు
గొలుసు త్రెంచుకు ఉరికిపడ్డాయి..
పుడమితల్లికి పురుటి నొప్పులు
కొత్త సృష్టిని స్ఫురింపించాయి.’

అనుభూతికై అన్వేషణ మనిషిలోని రసికత్వానికి చిహ్నం! అనుభూతి విశ్లేషణ మనిషిలోని జిజ్ఞాసకు ప్రతిబింబం! ఈ రెండూ అధ్యయనానికి రెండు రెక్కలు, బొమ్మా బొరుసూ. ఏ యుగంలోని కవిత అయినా అధ్యయనం లేకపోతే అంతరించిపోతుంది.

ప్రాచీన కవితను అధ్యయనం చేయాలంటే పాండిత్య ముండాలి. ఆధునిక కవితను అధ్యయనం చేయాలంటే సామాజిక స్పృహ ఉండాలి, ప్రాచీన గ్రంథాల్లో కొన్ని రస ప్రధానాలూ, జీవితంలోని చైతన్యాన్ని గాఢంగా చిత్రించిన కావ్యాలూ ఉన్నాయి. మరికొన్ని ప్రతి పద్య శిల్పమని పేరుపెట్టి ప్రతిభా వ్యుత్పత్తులను పండించి పాండిత్య శౌండీర్యాన్ని ప్రబంధ రచనలో ప్రదర్శించినవీ ఉన్నాయి. ప్రాచీన సాహిత్యం జీవిత పరమార్థాన్ని చిత్రించినంతగా జీవిత గాథను చిత్రించలేదు. సమకాలీనవృత్తం సర్వథా పరిత్యాజంగా ఉండేది. అందువల్ల కవి పురాణకథలో ప్రచ్ఛన్నంగా తననాటి వాతావరణాన్ని ప్రదర్శింస్తుండేవాడు. అయినా అతని దృష్టి కథ మీదా, సమాజ వ్యథ మీదా కాదు ఉంది. బోధన మీదా పద్యంలోని శిల్పశోధన మీదా ప్రధానంగా ప్రసారమయ్యేది.

వారికి భిన్నంగా ఆధునికులు చెప్పుకోతగ్గ నవ్యతను సంపాదించారు. సాహిత్యం సమాజానికి ప్రతిబింబంగా ఉండాలనీ, సామాజిక చైతన్యానికి సాధకంగా ఉండాలనీ వారు భావిస్తారు. సమాజ వ్యవస్థను సామ్యవాద దృక్పథంతో సమీక్షించి వర్గ సంఘర్షణను విప్లవం ద్వారా వారించి సమసమాజాన్ని నిర్మించాలన్న స్పృహను కవితలో వస్తువులో కళాత్మకంగా సాధిస్తున్నారు. ఈనాటి సాహిత్యం మనం బతుకుతున్న సమాజానికి సమీక్ష. అయితే, ఆధునికుల్లో కొందరు జీవితంలోని ఆర్థిక రాజకీయ సమస్యలకే ప్రాధాన్యమిచ్చి అదే జీవిత మంటున్నారు. ఆర్థికంగా అభివృద్ధి చెందినా జాతి ఆధ్యాత్మికంగా అభివృద్ధి కాకపోతే వికాసం సంపూర్ణం కాదు. తిండీబట్టా అందరికీ దొరికినా జీవిత గమ్యం తెలియకపోతే జాతి పురోగతి లక్ష్యం లేకుండా పోతుంది. బ్రతుక్కు వైశాల్యం ఏర్పడవచ్చును గాని లోతు ఏర్పడదు. సామాజిక స్పృహ సౌమాజికావహన వల్లనే ఏర్పడుతుంది. ఆధ్యాత్మిక స్పృహ జీవిత తత్వాన్ని దర్శించటంవల్ల యేర్పడుతుంది. ఆ అవగాహనకు గూడా అధ్యయనం కావాలి. చైతన్యం చింతనం వలన వస్తుంది. అధ్యయనం అవగాహన వలన ఏర్పడుతుంది.

వచనకవులు కొందరు కవితను ప్రజావాణిగా పలికిస్తున్నారు. సామాన్యుని కందుబాటులో ఉండేటట్లు సారళ్యంతో వచనకవిత వెలయించటం వీరి ఆశయం. కవితకు సారళ్యం రావాలంటే ప్రౌఢమైన ప్రాచీన కవిత్వం చదవ్వద్దని యువతరానికి బోధిస్తున్నారు వీరు. పాండిత్యం పరిశ్రమకు సంబంధించినది. ప్రౌఢి వేరు పాండిత్యం వేరు. తేటతెలుగులో కవిత చెప్పినా ప్రౌఢంగా చెప్పటం నేర్పు. వచనకవులు సమాసాలను చూచి భయపడతారు. సంప్రదాయమంటే సానుభూతి చూపరు. వస్తువులో సమాజం, గుణంలో సారళ్యం, ప్రక్రియలో వచనం వారి త్రిశరణాలు. సమాజం కోసం కవిత వ్రాస్తున్నప్పుడు దానికి సారళ్యం ప్రధాన ధర్మంగా ఉండాలి. అసలు ఆంధ్రసాహిత్య చరిత్ర నొక్కసారి సమీక్షిస్తే సారవంతమైన రచనకూ సరళమైన రచనకూ పోటాపోటీలు సాగివస్తూనే ఉన్నాయి.

ఒకదాని తరువాత మరొకటి చక్రారరపంక్తిలా తిరుగుతూనే ఉన్నాయి. నన్నయ మార్గకవిత్వం తరువాత శివకవుల జానుతెనుగు కవిత్వం, తిక్కన తెలుగు కవిత్వం తరువాత శ్రీనాథుని ప్రౌఢసాహిత్యం, పోతన భక్తికవిత్వం తరువాత ప్రబంధాల ఆలంకారిక కవిత్వం, పదకవుల భక్తిగీతాల వెనుక శ్లేషబంధ నిర్జీవ కవిత్వం, తిరుపతి వేంకటకవుల ఆశుకవిత్వం తరువాత భావకవుల శిల్పకవిత్వం, భావకవుల పద్య కవిత్వం తరువాత శ్రీశ్రీ గేయకవిత్వం, ఆ తరువాత వచన కవుల సరళకవిత్వం- ఇలా ఈ వర్గ సంఘర్షణ సాగివస్తూనే ఉంది. చమత్కార మేమంటే పద్యగేయాలు వ్రాసేవారు వచనకవులకు పాలకవర్గం వంటివారు. వారు స్వయంగా పీడితవర్గంలా బాధపడతారు. సాహిత్యరంగంలో కూడా వర్గ భేధాన్ని పాటిస్తారు అభ్యుదయవాదులు. అదే వారికి ఆయుస్సూతం. విప్లవం వస్తుందో రాదో విస్సన్న కెరుక గాని, సాహిత్యసహృదయభావంలో మాత్రం సమైక్యత లేకుండా పోతోంది.

వచన కవిత అయితేనేం, ప్రాచీనకవిత అయితేనేం అరస కవిత్వ మైతేనేం, విరస కవిత్వ మైతేనేం – కవిత్వాన్ని అధ్యయనం చేయకపోతే అది కటాక్షించటం కల్ల! వచన కవిత్వానికి కూడా కొంత నియతి ఉండాలి, అది రచయిత, సామాజికుడు తెలిసి సృశించాలి, సమర్థించాలి అని శ్రీ కుందుర్తి గారు భావిస్తూండడం అధ్యయనాన్ని ఆహ్వానించటమే! అధ్యయనమే అభ్యుదయానికి చిహ్నం. అభ్యుదయ మనే మాటకు అర్థాన్ని తెలుసుకోవాలన్నా, అభ్యుదయ వాదంలోని అంతరార్థాన్ని తెలుసుకోవాలన్నా ఆధ్యయనం చేయాలి, అధ్యయనం చేయాలి. అధ్యయనానికి అరలు లేవు పొరలు లేవు – సీమలు లేవు కామాలు లేవు – నిషేధాలు లేవు నిందలు లేవు- పద్య మనీ లేదు గద్య మనీ లేదు. కళ్ళకు గంతలు కడితే సాగదు అధ్యయనం. నిగ్గు తేల్చడమే నిజమైన అధ్యయనం. నిజం చెప్పటమే నిలిచే అధ్యయనం! కవితలోని లోతును, ఎత్తును దర్శించేది అధ్యయనం! మనిషిలోని మమతను, మనీషిని చూపించేది అధ్యయనం!

కవితకు అధ్యయనం సమతకు సందర్శనం!
కవితకు అధ్యయనం నవతకు అభ్యుదయం!

– డా. జి.వి. సుబ్రహ్మణ్యం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here