కావ్య మత్తు జీవితమంతా నన్ను మత్తులోనే ఉంచింది… -2

0
10

[box type=’note’ fontsize=’16’] నీరజ్‌గారితో డా.ప్రేమ్‌కుమార్ జరిపిన సుదీర్ఘ సంభాషణని తెలుగులో అందిస్తున్నారు డా. వసంత టి.సి. ఇది రెండవ భాగం. [/box]

మంచీయ కవిత (కవి సమ్మేళనం) చాలా వరకు దిగజారుతోంది’ అని తెలిసి కూడా మీరు నిరంతరం దానిని నిలబెట్టాలనే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అసలు ఈ కవితకి ఇంత దుస్థితి పట్టడానికి బాధ్యులు ఎవరని మీరు అనుకుంటున్నారు?

“మేం కవి సమ్మేళనాలకి వెళ్ళవల్సిందే. ఎందుకంటే బ్రతుకు తెరువు అదే మాకు. మరో మార్గం లేదు. ఒక వేళ మేం నల్గురైదుగురం పూర్తిగా మానేస్తే ఇక వేదిక పైన కవిత్వం చచ్చిపోతుంది. సోమ్ బేచైన్, నూర్ (అప్పటికి వారు చనిపోలేదు) భరత్ భూషణ్, కిషన్ సరోజ్, నీరజ్, విష్ణు సక్శేనా, దేవల్ ఆశీష్, కీర్తి అను మొదలైన వారు వెళ్ళిపోతే ఇక మిగిలేది రాజకీయులు, చిన్న చితక కావ్య పంక్తులు, వ్యంగ్యం అంతేగా. వ్యంగ్య కివితలు అశోక్ చక్రధర్, మణిక్ వర్మ, ఓంప్రకాష్ ఆదిత్య రాస్తున్నారు. ఇక తక్కిన వాళ్ళు రాసేదాంట్లో పస అసలే లేదు. కాని ఇందులో కవులు దోషులు అని అనలేం, ఎందుకంటే ప్రజల అభిరుచి ననుసరించి రాస్తున్నారు. కిందకి దిగజారిపోతున్నారు. అసలు కవులు ప్రజల అభిరుచిని పై స్థాయికి తీసుకు రావాల్సింది. నిజానికి ఈ డబ్బు ఉందే రక్తాన్ని పీల్చేస్తుంది. ఇందులో నిర్వాహకుడు దోషి. ఎవరిని పిలుస్తున్నారు? నిర్వహణ సరిగ్గా జరగాలి. కవులకు తప్పకుండా ధనం లభించాలి. కాని వాళ్ళ – వాళ్ళ స్థాయిలను కూడా చూడాలి. ఇక ఇప్పుడు అంతా డబ్బుతో ముడివడి ఉంది. ఇప్పుడు నేనోక్కడిని. రెండున్నర మూడు గంటలు ఏకధాటిగా చదువుతున్నాను. నా పేరు మీద ప్రోగ్రాములు ఉంటూనే ఉన్నాయి. నీరజ్ – సంధ్య అనో… నీరజ్ – నిత్ అనో… ఇక కవిత్వానికి కొత్త గుర్తింపు చిన్న చిన్న గోష్ఠిలతో మొదలయింది. మార్పు వస్తోంది. పశువుల సంతలో ఎవరు వింటారు? ఎటూ పోవాలి? పాపం వాళ్ళు నిద్రపోవడానికి టెంట్‌కి వస్తారు.

మొట్ట మొదట్లో మంచీయ కవిత్వనికి, సాహిత్యానికి మధ్య ఎటువంటి అగాధం లేదు. నయీ కవితా ఉద్యమం వాళ్ళు దీనిని మొదలు పెట్టారు. మంచీయ కవులు సాహిత్యకారులు కాదు అని ప్రకటించడం మొదలు పెట్టారు. ప్రజలు ఎక్కువగా ప్రభావితులయ్యారు. ఆ సమయంలో మఖన్ లాల్ చతుర్వేది, మహాదేవి, నిరాలా లాంటి పెద్ద కవులు వేదిక నెక్కి కవితలను చదివేవాళ్ళు. మంచి శ్రేష్ఠమైన రచనలను చదివేవారు. వారిని అందరు ప్రశంసించేవాళ్ళు. అక్కడక్కడ కొన్ని ప్రదేశాలలో కవి సమ్మేళనాలు ప్రసారం అయ్యేవి. దేశం అంతా వినే వాళ్ళు. నేను 1955లో ‘కారవాం గుజర్ గయా…’ మొట్టమొదట లక్నో రేడియో నుండి చదివాను. అంతే ఓవర్‌నైట్ ఆ గీతం ప్రసిద్ది పొందింది. పాకిస్తాన్‌లో కూడా ‘కారవాం గుజ్‌ర్ గయా’ పాడటం మొదలు పెట్టారు. ఇంతకు ముందు టి.వి లేదు. జీ ఉఠే, షాయర్ షలబ్ ఇన్ ఆస్‌ సే,. రాత్ భర్ రో… రోదియా జలతా రహా…. (రాత్రంతా దీపం రోదనతో వెలుగుతోంది, ఈ ఆశతో శలభాలు జీవిస్తున్నాయి…).

బిజిలీ యోం కా చీర్ హహనే థీ నిషా… (రాత్రి మెరుపుల చీర కట్టుకుంది) లాంటి గీతాలు వినేవాళ్ళు, ప్రసంసించేవాళ్ళు. అప్పుడు మధ్యలో ఏ ఆగాధం లేదు. నయీకవితా గ్రూపు మమ్మల్ని ఒప్పుకుని ఉంటే బాగుండేది. వాళ్ళు సమాజంలో అంత పేరు పొందలేకపోయారు. కేవలం బుద్ధి పైనే వాళ్ళ దృష్టి, క్లిష్టత వీటి వలన వాళ్ళు ప్రసిద్ధి పొందలేకపోయారు. కొత్త బింబాలను, ప్రతీకలను వాడారు. కవులు కోకొల్లలుగా పుట్టారు. కాని నిలదొక్కుకోలేకపోయారు. ఇలియట్ ఇట్లా అన్నారు – ‘పోయట్రీ ఈజ్ ఆల్దో ద క్రియేషన్ ఆఫ్ ఇండివిజ్యుయల్ మైండ్ బట్ ఇట్ ఈజ్ గివిన్ టుది నేషనల్ మైండ్’ ఈ నేషనల్ మైండ్ అంటే ఏమిటి? శతాబ్ధాల నుండి వస్తున్న సంస్కారాలతో తయారవుతుంది నేషనల్ మైండ్. కవిత ఎప్పుడైతే దేశీయ సంస్కారాలను స్పర్శిస్తుందో అప్పుడే హృదయంలో ఉండిపోతుంది. కవితకి సంస్కారంతో అవిభాజ్య సంబంధం ఉంటుంది. దాదాపు 5 వేల సంవత్సరాలు నుండి కవిత బతికే ఉంది. నేను ఒక బింబాన్ని ఇస్తున్నాను. “మన ముంగిట్లో ఆ సైతాను దీపాల చేతులు పాల గిన్నెను లాక్కుంటాయి.” ఇది మనది. ఒకవేళ పాల గిన్నె బదులు చాయ్ కప్పు అని అంటే ఎంత హాస్యాస్పదంగా ఉంటుంది?”

కావ్య పంక్తులు చెబుతున్నప్పుడు, దాని విశేషణ చేసేటప్పుడు ఆయన ఉత్సాహం, ఆయనలోని టీచరు రూపం వ్యక్తం అవుతున్నాయి. ఈ టీచరుకి కవితలోని మార్మికత స్వయంగా తెలుసు, అవతలి వాళ్ళకు అర్థం చెప్పడము తెలుసు. కవితలో బింబం, ప్రతీకల స్థానం, భూమికల గురించి నా ప్రశ్నలకి జవాబుగా వెంటనే ఒక కావ్య శాస్త్ర పండితుడిగా అర్థం అయ్యేలా చెప్పడం మొదలుపెట్టారు – “1919లో ఇంగ్లీషులో ‘ఇమేజెస్’ అన్న పేరన ఒక ఉద్యమం నడిచింది. ఏడుగురు కవులు కలిసి రోమాంటిక్ కవుల వ్యతిరేకంగా ఒక ఉద్యమాన్ని నడిపారు. లేవిస్ ఒక ఒరిజినల్ ఇమేజ్ జీవితం అంతా రాసే కవితల కన్నా ఎంతో మెరుగయింది అని అన్నారు. బింబవాదుల సిద్ధాంతం ఇదే. కవిత బింబాన్ని గ్రహించే శక్తిని శుక్లాగారు తన రీతిలో చెప్పారు. నేను కూడా వారితో ఏకీభవిస్తాను. బింబాన్ని గ్రహించే ముందు అసలు బింబ విధానం గురించిన జ్ఞానం తప్పకుండా ఉండాలి. ఇది లోతైన అనుభూతి లేకుండా సాధ్యం కాదు. అసలు మర్యాద లేకపోతే ఎవరు ఏదీ గ్రహించలేరు. బింబాలని, ప్రతీకలని కల్పిస్తాం. కాని అనుభూతి లోపిస్తే వాటి ప్రభావం ఉండదు. క్రొంచే ఇటు చప్పారు. – ఒక వేళ ఫార్మ్ (శైలి – శిల్పం) బలహీనంగా ఉంటే అర్థం విషయం పట్ల లోతైన అనుభూతి కాదు అని మనం తెలుసుకోవాలి. ఫార్మ్‌కి బట్టలు కాదు కావల్సింది స్కిన్ కావాలి. బట్టలు వేరుగా ఉండవచ్చు కాని స్కిన్ మాత్రం కాదు. విషయం – శైలి – శిల్పం లోతైన అనుభూతి లేనిదే అవిభిజ్యంగా ఉండలేవు.”

నీరజ్‌గారు తక్కిన వాళ్ళ కవితలు మధ్య మధ్యలో వినిపిస్తున్నారు. వారిని ఎంతో సహృదయంతో పొగిడారు. అటల్‌బిహారి వాజ్‌పేయి గారి పేరు రాగానే వారి కవితల విషయం రాగానే వారితో హస్టల్‌లో గడిపిన రోజులను గుర్తుచేసుకున్నారు. పుత్ర ప్రేమ వలన వాజ్‌పేయిగారి తండ్రి కూడా హాస్టలో ఏ విధంగా చేరిందీ విశదీకరించారు. వారి కవితల గురించి అడిగితే ఇట్లు అన్నారు – సాఫ్ట్ వాయిస్‌లో వీర రసపు కవితలు. వారి కవితలలో ఫైన్‌నెస్ ఆనాడు లేదు, ఈనాడు లేదు. ‘నయీ కవితా’కి సంబంధించిన కవుల కవితలను చెప్పడం మొదలు పెట్టారు –

“సర్వేశ్వర్ కవితలను చదివాను. భారతి ‘కనుప్రియ’ అజ్ఞేయ్ కొన్ని కావ్య పంక్తులు నాకు ఎంతో నచ్చాయి. భవానీ ప్రసాద్ మిశ్ర్‌లో నాటకీయత ఎక్కువగా ఉంది. ఆయన అంత పెద్ద కవి కాదు. గిరిజాకుమార్ మాథుర్ కవితలలో భౌతికత ఎక్కువగా ఉంది. వారు ఎన్నో గీతాలు రాసారు. కాని వారి ఏ గీతం అంతగా ప్రసిద్ధి చెందలేదు. అమెరికా కవి ఏ.ఈ. హావుస్‌మెన్ విశిష్టత వారిలో కనిపిస్తుంది. ఆ కవి సెక్స్‌ని సబ్‌లైమ్ చేసారు. భారతీ కూడా ఇదే కోవకి చెందిన వారు – భాంసురీ రఖీ హై జ్యో భాగవత్ కే పుష్ఠ్ పర్; రఖ్ దియే, మేరే అధర్ పర్ సంగీత్ సే నిర్మిత్ అధర్ (భాగవతం పేజీ పైన వేణువును పెట్టినట్లుగా నా పెదవులపైన సంగీతంతో నిర్మింపబడిన పెదవులను ఉంచింది).

ఎటువంటి ఇమేజ్ ఇది! ఎంత గొప్పగా ఉంది. కామాన్ని ఆధ్యాత్మికంతో ఉదాత్తతతో ముడి వేసారు. నేను ఇట్లు చెప్పాను – దో గులాబ్ కే ఫూల్ ఛూ గయే జిస్ దిన్ హోఠ్ అపావన్ మేరే; ఐసీ సుగంధీ బసీ మన్ మే సారా జగ్ మధువన్ లగతా హై. (నా అపవిత్ర మైన పెదవులను ఏరోజైతే రెండు గులాబీ పూలు స్పర్శించాయో, నా మనస్సంతా సుగంధంతో నిండిపోయింది, జగమంతా మధువనంలా అనిపిస్తోంది).”

“తుమ్‌ కో ఛూనేకా గునాహ్ కర్ ఐసా పుణ్య్ కర్ గయా మాటీ… జీనా హమే భజన్ లగ్‌తా హై. మర్‌నా హమేం హవన్ లగ్‌తా హై… (నిన్ను స్పర్శించి పాపం చేసినా ఆ మట్టి ఎంత పుణ్యంగా మారిందంటే… బతకటం మాకు భజన అనిపిస్తుంది. చావడం మాకు హవన్ (హోమం) లా అనిపిస్తుంది). ఊర్వశి అంటే ఎవరు? పూర్తిగా కామాధ్యాత్మికం. మాయ సృజన చేసే మహా శక్తి అని మన వాళ్ళు అంటారు. అందరు లోతుగా దీనిని గురించి అధ్యయనం చేయరు. ఏవో రెండు కవితలు రాస్తారు. సన్యాసులు, డబ్బు – దస్కం… పూలు దండలు… చాలు వరకు అయోగ్యులే.

మీ కవితలలో కూడా ప్రేమ, కామం, శృంగారం అధికంగానే ఉంటాయి అని పాఠకులు, శ్రోతలు, విమర్శకుల అభిప్రాయం. మిమ్మల్ని శృంగార కవి అని చాలాసార్లు చాలామంది అన్నారు. మీరు ఏకీభవించలేదు. ఈ విషయంలో మీరు ఏమైనా చెప్పదలిచారా?

నీరజ్ ఈ విషయంలో ఇట్లు చెప్పారు – లలిత్ మోహన్ అవస్థీ రెండు మూడు నా కవితలు చదివి తన పుస్తకంలో నన్ను ఒక శృంగార కవిగా ధ్రువీకరించడానికి ప్రయత్నించారు. దాన్ని చూసి అందరూ నన్ను శృంగార కవిగా చూడటం మొదలు పెట్టారు. నిజానిక నేను ఒక దార్శనిక (తత్వం) కవిని. దర్శనం అంటే అర్థం థాట్ – మహా సత్యం, మానవతా విలువ గురించి వ్యక్తం చేస్తే అధి థాట్ అవుతుంది. దర్శనం కవితా రెక్కలని కత్తిరిస్తుంది అని కీట్స్ అంటారు. కాని నా ఉద్దేశ్యంలో దర్శనం లేకుండా ఉంటే కవిత ఒక బిగ్ జోరో. దర్శనం ఒక నీరసమైన వస్తువు. ఏ విధంగా అయితే పరుశవేదిని తాకితే ఇనుము బంగారం అవుతుందో అదే విధంగా మెంటల్ క్రియేషన్ రొమాంటిక్ బింబం స్పర్శ తగిలి రసభరితం అవుతంది. ఈ ఫ్రేజ్, ఈ బింబిం చూడండి

“ఆజ్ జీ భర్ దేఖ్‌లో తుమ్ చాంద్‌ కో,

క్యా పతా యహ్ రాత్ ఫిర్ ఆయే నా ఆయే….

యహ్ సితారేం సే జడా నీలమ్-నగర్ బస్

తమాషా హై సుబహ్‌ కీ ధూప్ కా,

యహ్ బఢాసా ముస్కార్‌తా చంద్రమా

యహ్ దానా హై సమయ్‌ కా సూప్ జా

 

హై అనిశ్చిత్ హర్ దివస్ హర్ ఏక్ క్షణ్

సిర్ఫ్ నిశ్చిత్ హై అనిశ్చితతా యహాఁ

ఇస్‌లియే సంభవ్ బహుత్ హై, ప్రాణ్!

కల్ చాంద్ ఆయే చాంద్‌నీ లాయే నా లాయే!

(ఈరోజు మనసారా నీవు చంద్రుడిని చూసుకో… ఈ రాత్రి తిరిగి మళ్ళీ వస్తుందో రాదో ఎవరికి తెలుసు… తారలతో నిండిన నీతి-నగరం, పగటి ఎండ తమాషా…. ఈ చిరునవ్వు నవ్వే చంద్రుడు సమయం అనే చాటలో ఒక గింజ మాత్రమే. ప్రతీ రోజూ, ప్రతి క్షణం అనిశ్చతమైనవే (అనిశ్చితమైనదే) నిజానికి అశాశ్వతమైనదే శాశ్వతమైనది. రేపు ఉంటామో ఉండమో తెలియదు. చంద్రుడు వచ్చినా వెన్నెలనూ తెస్తాడో… తేడో…)

దీన్ని మీరేమంటారు… ఇది ఒక యునివర్శల్ ట్రూత్. సార్వభౌమిక సార్వకాలిక సత్యాన్ని అభివ్యక్తం చేస్తోంది.

… దేఖ్‌తీ హీ న దర్పణ్ రహో ప్రాణ్… కౌన్ శృంగార్ పురా యహాఁ కర్ సకా, సేజ్ జో భీ సజీ అధూరీ సజీ, హార్ జో భీ గుంథా సో అధూరా గుంథా, బిన్ జో భీ బజీ సో అధురీ బజీ, హమ్ అధురే, అధురా హమారా సృజన్, పూర్ణ్‌ తో బస్ ఏక్ ఫ్రేమ్ హీ హై యహాఁ, కాంచ్ సే హీ నజరేం మిల్‌తీ రహో, బింబ్ కా మూక్ ప్రతిబింబ్ ఛల్ జాయేగా- (ప్రియతమా! ఈ రోజు అద్దంలో చూస్తూ గడపకు. అసలు ఇక్కడ పూర్తిగా శృంగారం ఎవరు చేసుకున్నారు? ఏ శయ్య అయినా సగం సగమే అలంకరింపబడ్డది. హారాన్ని ఎవరు గుచ్చినా సగం సగమే గుచ్చారు. వీణ మ్రోగినా సగం సగమే మ్రోగింది. మనం అందరం సగం సగమే. మన సృజన సగం సగం సృజనే… ఇక్కడ ప్రేమ ఒక్కటే సంపూర్ణమైనది.)

కాంచ్ సే హీ నజరేం మిల్‌తీ రహో, బింబ్ కా మూక్ ప్రతిబింబ్ ఛల్ జాయేగా-… (అద్దంతోనే చూపులు కలుపుతు ఉండకు, బింబాన్ని మూక బింబం మోసం చేస్తుంది). ఇది శృంగారం ఎంత మాత్రం కాదు. కాల్‌రిజ్ ఇమాజినేషన్ ఈజ్ ద మదర్ ఆఫ్ పోయట్రీ అని అన్నారు. కాని నేను వారితో విభేదిస్తున్నాను. ఉహ(కల్పన) అంటే ఏమిటి? సంచిత స్మృతులకు కొత్త రూపం ఇవ్వడమే ఊహ. ఇదంతా బుద్ధికి సంబంధించింది. కాని కవిత్వం ఫంక్షన్ ఆఫ్ మైండ్‌కి పై స్థాయిలో ఉంటుంది. అది ఆత్మసాక్షాత్కారం. ఒక విజన్. కబీర్ పండితులను సంభోధిస్తూ ఇట్లా అన్నారు – “తూ కహతా కాగజ్ కీ లిఖీ – మై కహతా ఆంఖోం కా దేఖీ – (నీవు కాగితం మీద రాసింది చెబుతావు. నేను కళ్ళతో చూసింది (అంటే అనుభవ జ్ఞానం) చెబుతాను. నేను ఎప్పుడు పద్యాన్ని ఆలోచించి కాని ఎవరో డిమాండ్ చేస్తే కానీ రాయలేదు. మనస్సులో నుండి ఉప్పాంగిన ఉద్వేగం కవితా రూపం ధరిస్తుంది. నాది భావోద్వేగం. అ సమయంలో నేను ఈ లోకంలోనే ఉండను. భార్య భోజనం చేయడానికి లెమ్మంటుంది. అమ్మ ఆమెను ఆపుతుంది – ‘అతడిలో భావం ఉప్పొంగతోంది. కాస్సేపు ఆగు’ – రాత్రంతా నిద్ర ఉండదు. ఏదో తపన. మనస్సు నిండా అలలు. చెప్పలేని అలజడి… అంతే.. ఆత్మలోకం – వెంటనే కవిత్వం ప్రవహించింది. కవికి మూడు లక్షణాలు ఉండాలి. అధ్యయనం, చింతన, మననం. ప్రాచీన సమకాలీన సాహిత్య అధ్యయనం, శాస్త్రాలు, ఛందస్సు మొదలైనవి చింతన – మస్తిష్కం చేసే పని. కాని మననం. ఇదే అసలైనది బ్రూడింగ్ – కోడి గుడ్డు పై కూర్చుంటుంది. దానికి వేడినిస్తుంది. దాని పై సమాధి అవస్థలో ఉన్నట్లు స్థిరంగా ఉంది. అది దాని మీద కూర్చుంది అని మాత్రమే అనుకుంటాం. కాని అది తన ప్రాణంలోని శక్తిని ఆ జలతత్వానికి అందిస్తోంది. ఈ క్రియ వలన గుడ్డులో ప్రాణం వస్తుంది. ఇదే విధంగా ఏదైనా భావాన్ని తీసుకుని కవి తన సంపూర్ణ చైతన్యాన్ని, శక్తిని, వ్యక్తిత్వాన్ని దానిలో చొప్పిస్తాడో అప్పుడు, అంటే అతడు పూర్తిగా మాయం అయినప్పుడు పద్యం తనంతట తానే బయటకి వచ్చేస్తుంది. దీనినే వ్యక్తిత్వ మోక్షం అని నేనంటాను. కవిత అంటే అహం, మోక్షం అని అర్ధం. ఉర్దూలో నాజిల్ అనే శబ్దం ఉంది. ఉర్దూ కవి నేను గజల్ చెప్పాను అని అంటాడు కాని రాసాను అని అనడు. నా విషయంలో కూడా హిందీ కవులలాగా ఇదే జరిగింది. ఇరవై ఆరు సంవత్సరాల వయస్సులో దాదాపు ఇరవై పేజిల దీర్ఘ కవిత ‘మృత్యుగీత్’ రాసాను. ఒకే సిటింగ్‌లో రాసేసాను. మరో సంఘటన గురించి చెబుతాను – నేను అప్పుడు బి.ఎ.లో ఉన్నాను. అరవింద్ కవితలను ట్రాన్స్‌లేషన్ చేస్తున్నాను. ‘గీత’ శరీరం నష్టం అవుతుంది అని అంటుది. కాని అరవింద్ ఈ పదార్ధాన్ని చైతన్యంగా మార్చుకో , అర్త హుడ్… పృధ్వి స్వర్గాన్ని ఏకం చేయండి, అప్పుడు మనిషి మత్యువును జయిస్తాడు. మృత్యుంజయిడు అవుతాడు. ఈ ఆధునిక యుగంలో సైన్స్ దీనిని ప్రూవ్ చేసింది. నేను డిల్లీలో ఉంటాను. టి.వీలో మాట్లాడుతాను, మీరు అలీఘడ్‌లో వింటున్నారు. నా పదార్ధన్ని ఊర్జ (శక్తి)గా మార్చారు. మళ్ళీ ఈ శక్తిని పదార్ధంగా కన్‌వర్ట్ చేసారు. ఇవాళ ఈ రెండు శక్తి, పదార్థం కనవర్ట్ అవుతాయి. విజ్ఞానం ఇదంతా చేయగలిగింది. ఆ అనువాదం చేసేటప్పుడు ప్రయోగించిన బాష ఛందస్సు శైలి ఎంతో అద్భుతమైనవి. అసలు అటువంటి భాషను నేను మళ్ళీ ప్రయోగించలేకపోయాను. అంతే ఆ ప్రేరణ మళ్ళీ రాలేదు. కవిత్వం రాయడం ఆగిపోయింది. ప్రస్తుతం దోహోలు రాస్తున్నాను. అప్పుడప్పుడు షేర్. చాలా సంవత్సరాల నుండి గీతాలు రాయడం లేదు. ఆలోచించి నేను ఏదీ రాయను, రాయాలనుకుంటే రోజూ ఏదో ఒకటి రాయగలను. కాని నా కవితలన్నీ ప్రయత్నం చేసి కుస్తీ బట్టి రాసినవి కావు. హృదయంతరాళలో నుండి పొంగుకు వచ్చాయి. వాటింతట అవి ప్రవహించాయి.

మీరు ఇప్పుడు గజల్ విషయం ఎత్తారు గజళ్ళు మీరు రాసారు. కాని చాలామంది మీరు రాసినవి ప్రధమ శ్రేణి గజళ్ళుగా ఎంచారు. హిందీలో గజళ్ళు రాస్తే ట్రెండ్ ఎక్కువగా కనిపిస్తోంది. ఉర్దూ గజల్‌తో పోలిస్తే హిందీ గజళ్ళ స్తితి ఎట్లా ఉంది? మీరు దీనిని గురించి ఏం అలోచిస్తున్నారు?

నిజానికి గజల్ ముస్లింల రక్తంలో కలిసిపోయింది. అది వాళ్ళ సాహిత్యం, వాళ్ళ కల్చర్. దాదాపు 700 సంవత్సరాల క్రిందటి నుండి వాళ్ళ రక్తంలో గజల్ కలిసిపోయింది. మనం చిన్నప్పటి నుండి తత్వవేత్తలం. హిందీ భాష గజల్‌కి ఉపయుక్తనది కాదు. ప్రపంచంలోని ప్రతీ భాష ప్రతి ఛందస్సు, ప్రతీ ప్రక్రియకు ఉపయుక్తం కాదు. ఇంగ్లీషు వాళ్ళు లేక ఉర్దూ వాళ్ళ చేత 111 ఘనాక్షరి (హిందీ ఛందస్సు) రాయించలేదు. వ్రజ భాషకి ధీటుగా రాయలేరు. ఎందువలన? ఉర్దూ నగరాలలో పుట్టింది, దాని వికాసం అక్కడే జరిగింది. కోర్టులో ఫారసీ ప్రభావం చాలా ఉంది. ఉర్దూ నగరాల భాష, హిందీ గ్రామాల భాష. పొలాల గట్ల, పల్లెల సౌందర్యం, మామిడి పుతలు, నీళ్ళ రేవు మర్రి చెట్టు, రావి చెట్టు, ఆకు పట్టటి పొలాలు, వీటి సౌందర్యాన్ని హిందీలో వర్ణించగలుగుతాం. ఉర్దూలో వర్ణించలేం. మన మాతృభుమి నుండి ఎవరు వేరుకాగలరు? పల్లెల భాష చూడండి – ‘శేర్ భర్ బాజరీ మై సాల్ భర్ ఖావూంగీ పియా, మత్ జయ్యో పరదేశ్’ (శేరు సజ్జలను సంవత్సరం తింటాను కాని నీవు పరాయి దేశానికి వెళ్ళొద్దు.)

అసలు ఇక్కడ ఏ శాస్త్రాలు పనికిరావు.

‘సోహ నాహిం చాహుం మై, చాందీ నహీం చాహుం,… చాహుం బస్ ఇతనా బలమ్ సామ్‌నే తేరే దునియం సే జావుం. బాహోంమే తేరీ తోడూం దమ్ మై… (బంగారం కోరను, వెండీ కోరను. ఇంతే నేసుకోరుకునేది, నీ ఎదురుకుండా ఈలోకం విడిచి వెళ్ళిపోవాలి, నీ బాహువుల్లో ఊపిరి వదిలి వేయాలి…) ఈ విధంగా కేవలం భారతీయ నారే అనగలుగుతుంది.

దీయా కీ బజాయ్ రోజ్ పియా మై జలావూంగీ పియా మత్… (దీపానికి బదులుగా ప్రతీ రోజు మనస్సును వెలిగిస్తాను… ప్రియ! ఒద్దు…) పల్లె వాసులు ఆలోచించి రాస్తారా? ఏ చదువు చదవని ఒక పామరుడి అభి్వ్యక్తి మనలని ఆశ్చర్యచకితులని చేస్తుంది. మిఠాయి దుకాణం కుల్పడ్ (మట్టిపాత్ర)లో పాలు తాగడం గుర్తుచేసుకోండి. రచయిత నాయిక ద్వారా కుల్పడ్‌ని ఈ విదంగా కోప్పడతాడు. ‘రే మాటికే కుల్హడే, దెహూం తుఝె చట్‌కాయ్ జో పియ్ కే హిత్ హై బనే, ఉన్‌సే చిపకత్ జాయ్’ (ఓ మట్టి పాత్రా ప్రియరాలి కోసం చేయబడిన వాటిని అంటుకుంటున్నావు నీకు చురక పెట్టాలి)

దీనికి సుమాధానంగా కుల్హడ్ తను ఏ విధంగా తయారు చేయబడ్డది ఆ క్రియ గురించి ఇట్లు చెబుతుంది – “లాత్ సహీ, ఘూంసా సహే, సహే వార్ పర్ వార్. ఇన్ హోంఠన్ కే వాస్తే సర్ పై ధరే అంగార్” (తన్నులు తిన్నాను, పిడికెళ్ళ దెబ్బలు సహించాను. దెబ్బ మీద దెబ్బ పడ్డా ఊరుకున్నాను. పెదిమల కోసం శిరస్సుపై నిప్పుకణాలను మోసాను) అసలు ఎవరైనా పిహెచ్.డిలు డి.లిట్‌ను ఇట్లా రాయమనండి – “మేరే సైయ్య గులాబియోం కా ఫూల్ హమరే రంగ్ కేసరియా” (నా ప్రియురాలు గులాబి పూవు, మా రంగు కేసరి రంగు). అసలు హిందీ భాషలో ఉన్న అందం ఉర్దూకి వస్తుందా?

హిందీలో ఎందరో ప్రయోగాలు చేస్తున్నారు. అక్కడ తుక్‌బందీ (అంత్యప్రాస చందస్సు) బాగుంటుంది. కాని ఉర్దూలో ఉండే ఆ సౌందర్యం రాదు. ఎందుకంటే గజల్‌కి తనదంటూ ఒక కళ ఉంటుంది. ఒక లయ ఉంటుంది. నా విషయంలో – శబ్ద్ ఝూఠె హైం సభీ సత్య్ కథా‌వోం తరహ్, వక్త్ బేషరమ్ హై వేశ్యావోంకీ అదావోంకీ తరహ్.(శబ్దాలు సత్య కథలలా అబద్ధమైనవి. వేశ్యల చేష్టలలా కాలం సిగ్గు లేనిది). ఇందులో గజల్‌కి ఉండాల్సిన సౌందర్యం లేదు. కాని – “హమ్ తేరీ చాహ్ మే యె యార్ వహాఁ తక్ పహుంచే, హోష్ థే భీ న జహాఁ హై కి కహాఁ తక్ పహుంచే

 ఏక్ సరీ తక్ న వహుం పహుం చే దునియా సారీ. ఏక్ హీ ఘంట్ మే మస్తానే జహం తక్ పహుంచే…” (నీ కోసం (కోరిక) చాలా దూరం వచ్చేసాను. అసలు ఎక్కటి దాకా వెళ్ళాలో నాకే తెలియదు. ఒక గుక్కలో పూలరంగడు ఎక్కడిదాకా చేరతాడో ఒక యుగం అయినా, అక్కడిదాకా ఈ లోకం చేరలేదు….) ఇందులో వచ్చింది. దుష్యంత్ గజళ్ళల్లో ఆ సౌందర్యం ఉంది. మొట్టమొదట గజళ్ళు కీ.శే బలవీర్ సింఘ్ రాసాడు. అందులో తాజాదనం ఉంది.

“ఆబోదానా రహే, న రహే.

చహ్‌చహనా రహే న రహే

హమ్‌ నే గుల్‌షన్‌కి ఖైర్ మాంగీ హై”

(గింజలు నీళ్ళు లేకపోయినా, కుహు కుహూలు ఉన్నా ఉండకపోయినా, మేం మాత్రం తోటలో ఖైదీగా ఉండాలనే అనుకున్నాం)

“ఆషియానా రహే న రహే…” (గూడు ఉండనీ ఉండకపోనీ )

ఇంత పెద్ద రదీఫ్. (గజల్‌లో రధీఫ్ కాఫీయా విధానం ఉంటుంది).

రంగ్‌ కో అంజుమన్ సే నిస్బత్ హై

ఆనా జానా రహె నా రహె

ఇదీ గజల్ అంటే. సమాజవాదాన్ని ఎంత అందంగా చెప్పాడు. రాజేష్ రెడ్డి, హస్తీమల్  హస్తీ, కుంవర్ బేచైన్, అఖిలేష్ తివారి, రాజేంద్ర తివారి, సూర్య భాను గుప్త్, ప్రమోద్ తివారి, సురేష్ చతుర్వేది, జ్ఞాన ప్రకాష్ వివేక్, దీక్షిత్ దనకరీ, నసీమ్, హర్‌దోయ్‌కి చెందిన ఆస్తానాగారు మొదలైన వారికి గజళ్ళు రాయగల కళ అబ్బింది. నేను ‘గజల్’కి ‘గీతికా’ అని పేరు పెట్టాను మత్‌లా కీ ఆరంభికా, మక్తా కీ అంతికా, రదీఫ్‌ కీ సుంతికా, షేర్‌ కీ ద్విపదికా అని హిందీలో పేర్లు పెట్టాను. నాకు ఉర్దూ అంటే విముఖత ఏ మాత్రం లేదు. కాని హిందీలో కూడా పేర్లు ఉండాలి అన్న ఉద్దేశం తోటే పెట్టాను. నేను నా రెండు – మూడు గజళ్ళకి గీతాల మాత్ర ఛందస్సు ఉపయోగించాను. చాలా వరకు గజళ్ళని బహర్ (ఉర్దూలో 19 బపర్లు ఉంటాయి. వీటి లయను ఆధారం చేసుకుని గజళ్ళు రాస్తారు) లోనే రాసాను.”

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here