కావ్య మత్తు జీవితమంతా నన్ను మత్తులోనే ఉంచింది… -5

0
10

[box type=’note’ fontsize=’16’] నీరజ్‌గారితో డా.ప్రేమ్‌కుమార్ జరిపిన సుదీర్ఘ సంభాషణని తెలుగులో అందిస్తున్నారు డా. వసంత టి.సి. ఇది 5వ భాగం. [/box]

మీరు మొట్టమొదట వేదిక మీద నుండి కవిత చదివినప్పుడు మీ అనుభవం ఎట్లా ఉంది? ప్రస్తుతం మీరు ఎప్పుడైనా గుర్తు చేసుకుంటూ ఉంటారా?”

పెద్దగా ఒక్కసారి దగ్గారు. “ఇప్పుడు అవన్నీ ఎందుకు?” అంటూనే అతీతంలోకి వెళ్ళిపోయారు. తన అమాయకత్వం, బాల్యం పైన నచ్చే వ్యక్తిలా చెప్పడం మొదలు పెట్టారు. – “మొట్ట మొదట సోహన్ లాల్ ద్వివేదీ అద్యక్షన ఏటూలో జరిగిన కార్యక్రమంలో కవితను చదివాను. అప్పుడు నేను 9వ క్లాసు చదువుతున్నాను. 1942లో ఢిల్లీలో ఒక కవి సమ్మేళనం జరిగింది. వెతుక్కుంటూ వెళ్ళి నిర్వాకుడిని నేను కవిత చదువుతాను అని అడిగాను. ఆయన నా పేరు అడిగారు – ‘భావుక్’ అని చెప్పాను. సరే ముందే నీకు ఛాన్స్ ఇస్తాను.” అని అన్నారు. ‘ఎక్కడి నుండి వచ్చావు?’ అని అడిగారు. ‘ఇటువా’ అని చెప్పాను. ‘నేనూ ఇటువా వాడినే’ అని అన్నారు. నేను కవితను చదివాను. అందరూ వన్స్ మోర్ అని అరిచారు. నా కంఠం అందరికి నచ్చింది. 5 రూపాయలు బహుమతిగా ఇచ్చారు. నాకు చాలా ఆనందం కలిగింది. ఢిల్లీలో మొట్టమొదటిసారిగా చదివాను. పేరు వచ్చింది. నిజానికి పేరు ఒక సుగంధంలా వ్యపిస్తుంది. చాలా చోట్ల నుండి పిలుపులు వచ్చాయి. మొట్టమొదట్లో ‘భావుక్, ఇటువా’ అన్న పేరుతో చదివేవాడిని. తరువాత ‘నీరజ్’ అని పేరు పెట్టుకున్నాను. ఇటువాలోని కొందరు మిత్రులు ‘భావుక్’ పేరు బాగా లేదు అని అన్నారు. అప్పుడు నీరజ్ అని పెట్టుకున్నాను. న్యూమరాలజీ, నా జాతకం ప్రకారం ఈ పేరు సరియైనది.”

సింగ్ సింగ్ వచ్చాడు. కూరలు, పిండి మొదలైన వాటి గురించి మాట్లడాటం మొదలు పెట్టాడు. రాజ్ కూలివాళ్ళకి ఏవో సూచనలివ్వడానికి రమ్మన్నాడు. నేను ఆయన ఇంటి విషయంలో చూపించే శ్రద్ధని చూసాను. ప్రతి పనిలో ఆయన తన్మయత్వాన్ని చూసాను. వారు వెళ్తున్నప్పుడు నేను అడిగాను  ‘మీ సూటిదనానికి ఈ రూపం? మీ ఈ వేగం?’ అని. వారు నవ్వుతూ అన్నారు.

“నేను తప్పితే ఈ ఇంటి విషయం పట్టించుకునే వాళ్ళు ఎవరు?  అందరి గురించి  నేనే ఆలోచించాలి. కిరసనాయిలు, జనరేటర్ ఆయిల్, కరెంటు, నీళ్ళు, ఉప్పు-పప్పులు, కారు, టెలిఫోన్ అన్నింటి గురించి ఆలోచించాలి.”

ఆరోజు ప్రొద్దున్న నీరజ్ ఉదాసీనంగా ఉన్నారు. ఆయన ముఖంలో అలసట కనిపింస్తోంది. ఉత్తరాలు రాస్తున్నారు. రాత్రి ఆ వచ్చిన గాలి వానకు కరెంటు, నీళ్ళు, రవాణా అన్నీ ఆగిపోయాయి. నన్ను చూస్తూ అన్నారు – “ఇవాళ మూడ్ లేదు. ఏం చేయను? ఫోన్లు కలవడం లేదు. దారిలో చెట్లు విరిగి పడిపోయాయి. ఎట్లా వెళ్ళను? నువ్వు చదివే ఉంటావు. ములాయమ్ సింగ్ భార్య స్వర్గస్థురాలయింది. ఆమె చాలా అమాయకురాలు. మంచిది.”  ఉత్తరం రాసాక నన్ను చూడమన్నారు. పెద్ద ఉత్తరం. ఓదార్పు, వాళ్ళు కొడుకుకి కూడా ధైర్యాన్నిచ్చే శబ్బాలు. ఉత్తరంలో కవిత్వం కూడా ఉంది –  ‘రుకే నహీఁ కోయి యహాఁ నామీ హోకే అనామ్. కోయి జాయో సుబహ్ కో, కోయి జాయే షామ్.’ (ఇక్కడ ఎవరు ఉండిపోరు. పేరున్న వాళ్ళైనా సరే. అనామకులైనా సరే. ప్రొద్దున్న ఒకళ్ళు వెళ్ళిపోతే, సాయంత్రం మరొకరు.) అవకాశం వచ్చింది కాబట్టి ములాయమ్ సింగ్‌తో  ఆయనకున్న సంబంధం, లాభాలు, లోభాలు, రాజనీతిని గురించి అడిగాను. నీరజ్ అటువంటి మనఃస్థితిలో కూడా చెప్పడం మొదలు పెట్టారు. “ములాయమ్ సింగ్‌తో నా సంబంధం చాలా పాతది. దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. వారు మా ఇటవాకి గౌరవప్రదమైన వారు. ఇటావాలో ఆయన లాంటి రాజకీయ నాయకుడు పుట్టలేదు. ఆయన రైతు కుటుంబంలో పుట్టారు. ఆయన మొదట్లో చాలా సంఘర్షణకి గురయ్యారు. ఊళ్ళోకి వెళ్ళడానికి బస్ లేదు. అటు నుండి వెళ్ళే బస్ చాలా దూరంలో ఆగేది. ఆయన సామాన్లను భుజాల మీద పెట్టుకుని మోసుకుంటూ వెళ్ళేవారు. నాకింకా ఇప్పటికి గుర్తు. ఆయనని ధరతీ పుత్ర్ అని అంటారు. ఇది ఆయనకి  సరి అయిన పేరే. నేకు 6 సంవత్సరములు ఉండగా మా నాన్నగారు స్వర్గస్థులయ్యారు. అమ్మ బీదతనం వలన నన్ను తన దగ్గర కూడా ఉంచుకోలోకపోయింది. దాదాపు 10 సంవత్సరాలు సోదరులకు దూరంగా ఏటూలో మేనత్త దగ్గర ఉన్నాను. అక్కడే హైస్కూల్ దాకా చదువుకున్నాను. ఉద్యోగం దొరకక పోవడం వలన ట్యూషన్లు చెప్పాను. కచహరీలో టైపిస్ట్‌గా పని చేసాను. పాన్-బీడా దుకాణం పెట్టాను. అప్పుడప్పుడు యమునలో మునిగితేలుతూ అందులో డబ్బులు వెతికి తీస్తూ గడిపాను. ఇవాళ నాకు ఉన్న చోటికి ఎవరి చేయి పట్టుకుని రాలేదు. శ్రమ పడ్డాను. ఎన్ని అభాండాలు వేసినా ధైర్యంగా అడుగు ముందుకు వేసాను. ఎంతో మంది రాజకీయ నాయకులు ఉన్నారు. వాళ్ళకు తండ్రి అండన్నా దొరికింది. నేతల అండ అన్నా ఉంది. డ్రాయింగ్ రూమ్ రాజనీతి జరిపే ఆర్మడ్ చైయర్ పోలిటీషియన్స్ ఇక్కడ ఎక్కువ. ఎక్కువగా శ్రమపడేవాళ్ళు లేరు. నాకు సమాజవాదీ పార్డీ సిద్ధాంతాలు నచ్చుతాయి. నేను ఏ పార్టీ లోను నెంబర్‌ని కాను. జయప్రకాష్, లోహియా, నరేంద్ర దేవ్‌గారు పట్ల నాకు గౌరవం ఉంది. వారు ఇంకా సిద్ధాంతాల కోసం పోరాడుతునే ఉన్నారు. వాళ్ళు ఏం చెబుతారో దాన్ని ఆచరణలో చూపిస్తారు. తక్కినవాళ్ళు చెప్పేదొకటి, చేసేదొకటి. ఆయన ఇటావా వాసి అయినందుకు నన్ను ఒక పెద్ద అన్నయ్యలా చూసారు. కవులు, సాహిత్యకారులు, కళాకారులు మొదలైన వారి పట్ల వారికి ఎంతో గౌరవం ఉంది. తక్కిన రాజకీయ నేతలతో నేను ఇటువంటి భావాన్ని చూడలేదు. ఆయన ఫస్ట్‌ టైమ్ ముఖ్యమంత్రి అయినప్పుడు హిందీ, ఉర్దూ సినిమాలతో సంబంధం ఉన్న వారిని ఎంతో గౌరవించారు. ‘యష్ భారతి’ని ఇచ్చారు. మరి వారితో మేం ఎందుకు కలవకూడదు. నేను రాజకీయ రంగంలో లేను. ఒకసారి నేను పార్టీలో చేరతానని చెప్పాను. “మేం పార్టీ కోసం పని చేస్తాం. మీరు దేశం కోసం. పార్టీ బయట ఉంది  మీరు మాలో ఉన్న లొసుగులను వేలెత్తి చూపిస్తారు. అర్థం చేసుకుంటారు. మీరు పార్టీ బయట ఉండి పార్టీ సిద్ధాంతాల కోసం దేశ కళ్యాణం కోసం సాయపడవచ్చు” అని ఆయన అన్నారు. నాకు చాలా మంది రాజకీయ నాయకులకు గౌరవం ఇస్తారు. కాని నేను పార్టీ స్పోక్స్‌మన్‌ని కాను. ములాయమ్ సింగ్ రక్షణమంత్రి అయినప్పుడు, పశువులను మేపే ఈ పశువుల కాపరి దేశాన్ని ఏం రక్షిస్తాడు అని అందరు హేళన చేసేవాళ్ళు. నాగరికత రథాన్ని ఒక కొత్త మలుపు తిప్పిన వాళ్ళు, కొత్త కాలిబాటలు వేసిన వాళ్ళు పశువుల కాపర్లే అని నేనన్నాను. కృష్ణుడు ఆవులను మేపేవాడు. క్రీస్తు గొర్రెలను కాచేవాడు. మహమ్మద్ సాహెబ్ గొర్రెలు గాడిదలను మేపేవాడు. సమాజానికి నేతృత్వాన్ని వహించిన వాళ్ళు వీళ్ళందరు. కాని ఇప్పుడు గొర్రెలు వాటి దోవన అవి వెళ్ళిపోతున్నాయి. గాడిదలు ఎక్కడ ఉన్నాయో అక్కడే నిలబడ్డాయి, వాటిని సరిగ్గా తోలేవాళ్ళే ఇప్పుడు లేరు.”

ఎర్రగా అందంగా ఉండే నేపాలీ యువకుడు సింగ్-సింగ్ ఆయన దగ్గర పని చేసేవాడు. ఇంటి బాధ్యత అంతా అతని నెత్తి మీదే. అతడు వంటవాడు, డ్రైవర్ కూడా. అతడిలో గుణాలు ఉన్నాయి. చిన్న పిల్లవాడిలా అమాయకంగా ప్రవర్తిస్తాడు. సలహాలు ఇస్తాడు. నీరజ్ నవ్వుతూ సహజంగా – “మా సింగ్ సింగ్ పెళ్ళి చేయండి. ఎంత అందంగా ఉన్నాడో చూసారు కదా. పెళ్ళి చేసుకోనంటాడు. ఒక సారి నేను పట్టుపట్టాను. నరం కోసుకుంటానని బెదిరించాడు. తను పెళ్ళి చేసుకోనంటాడు. ఇతని పెళ్ళి కోసం నేను 25 వేలు దాచి ఉంచాను. ఐదు ఆరు మంచి చీరలు కొని పెట్టాను. కారులో తీసుకువెళ్తే వంద రూపాయలు తీసుకుంటాడు. కొందరు ఇంటికి వచ్చే అతిథులు కూడా ఇస్తూ ఉంటారు. ఒక రికరింగ్ ఉంది. ఎల్.ఐ.సి పాలసీ చేయించాను. అన్నీ ఉన్నాయి. ఒక మంచి అమ్మాయిని చూడండి” అన్నారు. సింగ్-సింగ్ సిగ్గుపడుతూ లోపలికి వెళ్ళిపోయాడు.

ఇవాళ మీ వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకోవాలని ఉంది. మీ మీద పడ్డ అభాండాలు గురించి తెలుసుకోవాలని ఉంది. అసలు మీరు మౌనంగా ఉండటం వలనే వీటన్నించికీ ఇంకా ఎక్కువ సెగ తగిలింది.”

నీరజ్ ఎంతో ఉత్సాహంగా,జరిగిన వాటిని గురించి చెప్పడం మొదలు పెట్టారు.

మీరు కవి సమ్మేళనాలలో రాజకీయం చేస్తారని, మీ మూడ్ మీ ఇష్టం ప్రకారం అవతలి వాళ్ళను సక్సెస్ చేయడం చేయకపోవడంలో మీది పెద్ద చెయ్యి అని, కొన్ని కులాల వాళ్ళనే మీరు ప్రోత్సహిస్తారని అంటుంటే విన్నాను. మీరు కొంచెం వివరంగా చెప్పండి.”

“అసలు ఇట్లాంటిది ఏదీ లేదు. ఎవరైనా పేరు ప్రతిష్ఠలు సంపాదిస్తే వాళ్ళ గురించి ఇట్లాగే అవాకులు-చవాకులు వస్తూ ఉంటాయి. ఆయనతో పాటు పని చేసేవాళ్ళు, తోటి సాహితీవేత్తలు చెడు ప్రచారం చేస్తారు. ఇదంతా ప్రొఫెషనల్ జెలసీ. నేనెప్పుడు వీటి గురించి పట్టించుకోలేదు. కామెంట్ చేయలేదు. ఎవరిలో శక్తి ఉంటుందో వాళ్ళనే నిందిస్తారు. నిందలని అందరు ఎంతో సంతోషంగా వింటూ ఉంటారు. ఈ విధంగా వ్యక్తి వివాదస్పదం అవుతాడు. బురద చల్లడం వలన ఆ వ్యక్తి గల్లీ గల్లీలో, నగరం-నగరంలో విమర్సలకు గురి అవుతాడు. రజనీష్ పట్ల కూడా ఇదే జరిగింది. నన్ను ఎంతగా అగౌరవం పాలు చేసారో అంతగా నా పేరు ప్రతిష్టలు పెరిగాయి. ఆ… ఇక కాయస్థుల (ఉత్తర ప్రదేశంలో ఒక కులంవాళ్ళు) విషయానికి వస్తే నేను విమర్శకుడిని కాను. నాకు ఏ గ్రూపు లేదు. నేను కొత్తవాళ్ళకు అప్పుడప్పుడే పుంజుకుంటున్న వాళ్ళకు ప్రోత్సాహం ఇచ్చాను. సోమ్ ఠాకుర్, భరత్ భూషణ్‌లను ప్రోత్సహించాను. ముకుట్ బిహారీ సరోజ్, మాసుమ్ రజూ రాహీ కాయస్థులు కారు కదా!  వాళ్ళ మొదటి పుస్తకాలను అచ్చు వేయించాను. కువర్ బేచైన్, విష్ణుసక్సేనా, కిషన్ సరాజ్ ఈ కవులందరు పేరు ప్రతిష్ఠలు సంపాదించారు. దేవల్ ఆశీష్ పట్ల నాకు గౌరవం ఉంది. ఆశోక్ చక్రధర్ పది సంవత్సరాల పిల్లవాడుగా ఉన్నప్పుడు ఎర్రకోటలో కవితని చదివినప్పుడు నేను వెన్ను తట్టాను. బహుమతి ఇచ్చాను. అశోక్ నాజపేమ్‌కి కూడా బహుమతి ఇచ్చాను. వీళ్ళందరు ఈనాడు శిఖరాగ్రంలో ఉన్నారు. ఎవరి చేయో పట్టుకుని ఎవరు పైకి రాలేదు. వాళ్ళలో ప్రతిభ ఉండాలి. ఏ మహిళలో అయినా నాకు ప్రతిభ కనిపిస్తే నేను రికమెండ్ చేస్తాను. ఎవరు ఎవరిని చేయి పట్టుకుని ముందుకు నడిపించలేరు. ప్రోత్సహిం ఇవ్వడం మన ధర్మం. అసలు హిందీ కవయిత్రులు ఎంత మంది ఉన్నారని? ఇందిరా ఇందు చనిపోయింది. బాగా రాసేది. బాగా చదివేది. సుమిత్రా కుమారి, సుధాగారు, విద్యావతికోకిల ఆ సమయంలో పేరున్న రచయిత్రులు. కోకిలా కయితే సిన్హా తరువాత గాయకురాలైంది. కవితలు రాయడం మానేసింది. ఆవిడ పాటల గురించి చర్చ జరుగుతూ ఉండేది.”

మీ సురా (మధువు) సుందరి ప్రేమ గురించి ఎన్నో విమర్శలు వస్తూ ఉండేవి. చర్చలు కూడా వాళ్ళు ఎంతో ఆనందిస్తూ చేస్తూ ఉంటారు. ఈ విషయంలో  నిజా నిజాలు గురించి చెబుతారా?”

“నేను మందు తాగుతానని చాలా ప్రచారం జరిగింది. మీరు నాకు ఎంతో దగ్గరి వారు. మీరు చూస్తూనే ఉన్నారుగా నేను ఎప్పుడు ఎంత తాగుతానో. నేను తాగను అని చెప్పడం లేదు. కాని నేను తాగి తూలడం ఎవరైనా చూసారా?  కవి సమ్మేళనాలలో నా పేరు మీద బాటిల్స్ తెప్పించేవారు. కాని వాళ్ళే తాగేవాళ్ళు.  నేను ఒకటి  రెండు గుక్కలు తాగుతాను. (భ్రీఫ్ కేస్ తెరిచి ఒక చిన్న బాటిల్ బయటకి తీసారు.) ఇది ఫ్లైట్‌లో ఇచ్చే సీసా. నేను సగం సగం డ్రింక్ కలుపుకుని తాగుతాను. నాకు జలుబు తరుచు చేస్తూ ఉంటుంది. ఇది తీసుకుంటే కంఠం బాగుపడుతుంది. నేను తాగి కవితలని చదువుతాను అని అందరు అనుకుంటారు. అసలు నా జివితం బీదరికం, సంఘర్షణలలోనే సాగింది. డ్రింక్స్‌కి చాలా డబ్బులు కావాలి. నేను ఎఫర్డ్ చేయలేను.

ఎంతో మంది తాగి తాగి బతుకులని నాశనం చేసుకున్నారని నాకు తెలుసు. నాకు బీడీలు తాగే అలవాటు ఉండేది. ఇక మరే అలవాటు లేదు. ఏడు సంవత్సరాల వయస్సు నుండి నేను బీడి తాగేవాడిని…. బాల్యంలో కడుపులో బాగా నొప్పి వస్తూ ఉండేది. అప్పుడు అందరూ బీడీ తాగమన్నారు. చరస్, భంగ్, గాంజా, మధువు అన్నింటిని రుచి చూసాను. జీవితంలో కవిత తప్పితే మరేవీ నాకు మత్తు ఇవ్వలేదు. రాయడం, కొంత పొందడం! కవితా మత్తు నన్ను జీవితాంతం సృహ లేకుండా చేసింది. ఈ మత్తులో నేను రాసినవన్నీ మధువు అని అనుకున్నారు. నా చేతులలో ఉన్న పాత్రలో మధువు కాదు కవితా రసం ఉంది. ఇది తాగాక కవి కొంచెం సేపు మృత్యువును దాటిపోతాడు. దానినే నేను వ్యక్తి మోక్షం అహం మోక్షం అని అంటాను.

ఆడ పిల్లల విషయంలో, నా వెనక చాలా మంది పడేవాళ్ళు, ఇప్పటికీ, నాకు 80 సంవత్సరాలు వచ్చాయి, చాలామంది ఉత్తరాలు రాస్తూ ఉంటారు. వాళ్ళ పోటోలు పంపిస్తారు. ఒక వేళ జవాబు ఇవ్వకపోతే ఆద్‌మీ హూఁ, ఆద్‍మీ సే ప్యార్ కరతా హుం అని రాస్తారుగా అని అడుగుతారు.  కాని ఏం చేయను? కొంత నా పేరు వలన, నా చదివే రీతి వలన, నా కవితలలో ఉన్న కరుణ వలన, ఉన్నదున్నట్లుగా చెప్పే నా నైజం వలన, యవ్వనంలో అందంగా ఉండేవాడిని, ఇవన్నీ కారణాలు, నేను పైన కప్పు మీద నిల్చుని పాడుతున్నప్పుడు రామలీల సమయంలో, మిఠాయి దొరుకుతుందన్న ఆశతో, పాడుతున్నప్పుడు జనం గుమిగూడేవారు. ఇదంతా కిందటి జన్మ సంస్కారం. నేను ఇట్లు రాసాను. “జీస్ నే దేఖీ, బస్ మేరీ డోలీ దేఖీ…. తన్ కే తీర్ తైర్ నే వాలే మితా సభీ, మనకే ఘట్ నహనే వాలా నహీం మిలా…” (ఎవరు చూసినా నా డోలీ చూసారు. దేహం ఒడ్డున ఈదే వాళ్ళే కనిపించారు. మానస ఒడ్డున స్నానం చేసే వాళ్ళు కనిపించలేదు.) ఇదంతా నా బాధ. నేనేమిటో నాకు తెలుసు. ప్రజలు నన్ను సరిగ్గా అర్థం చేసుకోలేదు. సుర సుందరిలతో నన్ను గట్టిగా ముడిపెట్టారు.”

ఏ మహిళతో అయినా మీ ప్రేమ జీవితం గురించి ప్రత్యేకమైన విశేషాలు ఏమన్నా ఉన్నాయా? చెప్పడానికి ఇష్టపడతారా?”

“నా జీవితంలో ఎప్పుడూ ఏదీ దాచలేదు. కుండ బద్దలు కొట్టినట్లు చెప్పే నైజం కూడా ఉంది. హిపోక్రసీ ఎంత మాత్రం లేదు. లోపల ఒకటి పైనకి ఒకటి నేను చెప్పను. నేను వేదిక పైన బీడీ తాగుతాను. మార్మిక కవి అందరి నుండి దోచుకోగలుగుతాడు కాని తన సృజన నుండి దాక్కోలేడు. కాని సీదాసాదాగా ఉన్నా ఈ రోజుల్లో కష్టమే. నేనెప్పుడు ఏ పని దాస్తూ చేయలేదు. నిజానికి నాకు నిజమైన  ప్రేమ ఒక గుజరాతీ మహిళ దగ్గర నుండి లభించింది. ఆమె పెద్ద రచయిత్రి.  ఆమె నాకు ఆధ్యాత్మికంగా దగ్గర అయింది. ఆమె నాకు చాలా ఉత్తరాలు రాసింది. ఉత్తరాలు స్టాండర్డ్‌గా ఉండేవి. అవన్నీ “లిఖ్  లిఖ్ భేజత్ పాతీ” అన్న పేరన పుస్తకంగా ప్రచురింపబడ్డాయి. ఆ ఉత్తరాలు వలన చాలా మంది ఆడపిల్లలకు లేఖలు రాయడానికి ప్రేరణ కలిగింది. దానికి ప్రత్యుత్తరంగా ‘నీరజ్ కీ పాతీ’ రాసాను. ఆమెకే సమర్పణ చేసాను. ఆ రోజుల్లో ఆ పుస్తకానికి ఎంతో పేరు వచ్చింది. ప్రజలు పేరున్న కవితో ఉండాలనే అనుకుంటారు. కాని పేరు వలన కొంత దుష్పరిణామం కూడా జరిగింది. నాకు ఆడపిల్లలకి లేఖలు రాయడంలోనే సగం జీవితం గడిచింది. ఏభై సంవత్సరాల వయస్సుకు ముందు కవికి పేరు రాకూడదని ఇవాళ నేను అనుకుంటున్నాను. ఆడపిల్లలు నా పేరు వలన కవయిత్రులు అవడం వలన నా పట్ల ఆకర్షితులయ్యారు. ఒక వేళ ఇట్లు కాకపోతే  ఇప్పటికి 50 పుస్తకాలు రాసి ఉండేవాడిని. ఒక సమయంలో నన్ను ‘మంచ్ కా రాజా’  (వేదిక రాజా) అని పిలిచే వాళ్ళు నా కవితలలో ఉన్న కరుణ నేను చదివే తీరే దీనికి కారణం. నన్ను చెడుగా విమర్శించేవాళ్ళే బాత్ రూమ్‌లో వీటిని పాడుకునేవాళ్ళు, ఇదే గీతంలో కవిలో ఉండే శక్తి. (బనారస్‌లో నరేష్ మెహతా అధ్యక్షన జరిగిన సమ్మేళనాన్ని, వారి భార్య ప్రశంసించిన తీరును ఆయన గుర్తు చేసుకున్నారు.) ఒక సారి ట్రైన్‌లో నేనూ, దిన్‌కర్ కలకతాకి వెళ్తున్నాము. కవితల గురించి దాదాపు 3 గంటలు మాట్లాడుకున్నాము. “నీరజ్! నేను నీవు ఏదో గాయకుడివి అని అనుకునేవాడిని. ఇవాళ తెలుసుకున్నాను. నీకు కావ్యాల విషయంలో ఎంత జ్ఞానం ఉందో. నీ ఆలోచన సరియైనదే. ఇక ఇప్పుడు నేను కవి సమ్మేళనంలో కవితల చదవను. కేవలం అధ్యక్షత వహిస్తాను” అని ఆయన అన్నారు. (బచ్చన్ గారిని గుర్తు చేసుకున్నారు) బచ్చన్ గారు ఆరోజుల్లో చాలా పేరున్న కవి. ఆడపిల్లలు ఆయన వెనక పడేవాళ్ళు. ఒక సారి కాన్‌పూర్ నుండి బాందాకి వెళ్ళాల్సి వచ్చింది. కవులందరికి మినీ బస్ ఏర్పాటు చేసారు. అదే బస్సులో బచ్చన్ గారు ఉన్నారు. నాకు కూర్చోడానికి చోటు దొరకలేదు. బచ్చన్ గారు తన ఒళ్ళో కూర్చోమని అన్నారు. “మీరు నన్ను దత్తత తీకుకుంటున్నారు. మీ అంత ఎదగాలని నాకు ఆశీర్వాదం ఇవ్వండి”  అని నేనన్నాను. ఈనాటి వరకు వారు ఇచ్చిన ఆశీర్వాదాలు నా వెంట ఉన్నాయి. (వారి ముఖంలో ఎన్నో రకాల భావలు వ్యక్తం అవుతున్నాయి. ఎంతో భావుకుడై పోయారు.) ఒ సంఘటన గురించి మీకు చెప్పనా? ఇప్పుడు గుర్తు చేసుకుంటే నవ్వు వస్తుంది. గవర్నమెంటు కాలేజ్, ఆజ్‌మీర్‌లో ఒక సమ్మేళనం జరుగుతోంది. బచ్చన్ గారు ఉన్నారు. నేను ఉన్నాను. సమ్మేళనం తరువాత రోజు మేము కాలేజీ ప్రిన్సిపాల్ మమ్మల్ని కాలేజీకి పిలిచారు. ఆ కాలేజీలో పెద్దింటి పిల్లలు, రాజకుమారిలు చదివేవారు. ప్రొద్దున టిఫిన్ తీసుకునే సమయంలో ఒక రాజకుమారి మాటి మాటికి వస్తోంది. మాకు సర్వ్ చేస్తోంది. బచ్చన్ ‘నా ఎదురుకుండా ఆ రాజకుమారిని ముద్దు పెట్టుకో’ అని వేళకోళం చేస్తూ అన్నారు. ‘ఒక వేళ అట్లా చేస్తే  ఏమి ఇస్తారు’ అని నేనడిగాను. వంద రూపాయలు ఇస్తానని ఆయన అన్నారు. నేను ఆమె చేతి నుండి తీసుకుని ఆమెకే తినిపించాను. అందరి ఎదుట ఆమెను ముద్దు పెట్టుకున్నాను. ఆమె ఒక స్టేట్‌కి రాజకుమారి. తరువాత బచ్చన్  గారు 100 రూపాయలు ఇచ్చారు. చాలా కాలం వరకు ఆమె లేఖలు రాస్తూ ఉండేది. ‘మృత్యుగీత్’ చదివాక ఆడపిల్లలు ఏడ్చేసేవాళ్ళు. లక్నో విశ్వవిద్యాలయంలో అవస్థీగారూ ఉండేరు. ఆడపిల్లలు ఏడుస్తున్నప్పుడు ఆయన అన్నారు ‘నేను నీ గొంతు కొసేస్తాను. నీవు ఆడపిల్లలని ఏడిపిస్తావా?’ అని.  మజుజ్, హఫీజ్ జులంధరీ, జోహ్, ఫిరాక్, జిగర్ కతీత్ లాంటి పెద్ద పెద్ద దిగ్గజాల ప్రేమ ఆశీర్వాదం నాకు లభించాయి. ఈనాడు ఉర్దూ కవులు నన్ను ఇంకా ప్రేమిస్తూనే ఉన్నారు.

మీరు తరచుగా మీ భార్యామణి గుణగణాలను ప్రశంసిస్తూ ఉంటారు. కాని మీకు దగ్గరి వాళ్ళు ఆమెకు మీ పట్ల కోపం ఉండేది అని అంటూ ఉంటారు. ఇప్పుడు మీకు రెండో భార్య ఉందని బయట పెట్టారు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని కారణాలు, వీటి వలన వచ్చిన పరిణామాల గురించి చెబుతారా?”

పేరు వదిలేయండి. నాకు రెండో భార్య ఉంది. ఆవిడ ఆగ్రాలో ఉంటుంది. దాదాపు 45,46 సంవత్సరాల నుండి ఆమె బాధ్యతను నిర్వర్తిస్తున్నాను. పిల్లలు కూడా ఉన్నారు. ఆమె చాలా అందమైనది. అప్పుడు గుజరాతీ మహిళ పన్నెండేళ్ళ సంబంధం తెగిపోయింది. ఆమె పట్ల నాకెంతో ఇష్టం ఉండేది. కాని విడిపోవాల్సి వచ్చింది. నా మనస్సంతా సంఘర్షణ, బాధ. అటువంటి సమయంలో ఈమెతో సంబంధం ఏర్పడటం అతి సహజం. నేను ఎంతో నిష్ఠతో ఆ సంబంధాన్ని నిర్వర్తించాను. నా భార్య ఎక్కువగా చదువుకోలేదు. ఆమాయకురాలు. ఎంత పిసినారి అంటే నన్ను కూరలు కొనడానికి కూడా పంపేది కాదు. నీవు ఆఠన్నా(ఎనిమిది అణాలు) ఎక్కువ ఇచ్చేస్తావు అని అంటూ ఉండేది. ఆమె కూడా తినేది కాదు. కాని ఎందరో బీద ఆడపిల్లలకు పెళ్ళి చేసింది. ఈ మందిరం చూస్తున్నారు కదా. ఆవిడదే. నేను పూజ చేయను కాని మందిరాన్ని శుభ్రంగా పెట్టడం పూర్వం లాగానే అన్నీ చేస్తున్నాను. ఆవిడ ధార్మిక కార్యక్రమాలు ఎన్నో చేసేది. అంతా పుణ్యమే చేసుకుంది. పుణ్యం ఫలించింది. చచ్చిపోయేటప్పుడు వినడం లేదు. చూడడం లేదు. ఏ సేవ లేదు. సరిపోయే డబ్బులు ఉన్నాయి, అంతా జరుగుతుంది అని చెప్పింది. మీ చేత ఏమీ చేయించుకోను అని కూడా  అన్నది. ఆవిడ తండ్రి స్వతంత్ర సేనాని. బీద ఇంటి నుండి వచ్చింది. ‘ఎప్పుడు నేను నా బాల్యాన్ని బీదతనాన్ని మరచిపోను, మీరు మరచిపోతే మరచిపోండి’ అని అంటూ ఉండేది. పెళ్ళైనప్పుడు నేను హై స్కూల్లో ఉన్నాను. ఆమె ఎనిమిదోక్లాసు పాస్ అయింది. నేను ఆ తరువాత చదువుకున్నాను. నేను ఎంతో చెప్పాను. కాని ఆమె చదువుకోలేదు. నేను చాలా బాధపడతాను. నా మూలంగా ఆమె బాదపడ్డది. కాని ఎప్పుడు నేను ఆమెను చిన్నచూపు చూడలేదు. విడిపడాలని అనుకోలేదు. ఒకవేళ ఆమె నా భర్తకి దేశంలో పెద్ద పేరు ఉంది. ఆడపిల్లలు వెంబడి పడ్డారు కాని ఇందులో ఆయన తప్పు ఏమీ లేదు అని ఆలోచించి ఉంటే బాగుండేది. ఆమె బాధ పడేది కాదు. ఎవరు ఉన్నా ఆమె చోటు ఎవరు తీసుకోలేరు. ఈ సత్యం ఆమె తెలుసుకొని వుంటే ఇంతగా బాధపడేది కాదు. ఇటువంటి ఆలోచన ఆడవాళ్ళల్లో ఉండదు. ముఖ్యంగా భారతీయ స్త్రీలలో. నా రెండో భార్య నేను ఎప్పుడు ఆమె తోనే ఉండాలి అని అనుకుంటుంది.

రెండు రోజుల క్రితం వచ్చింది. గొడవలు పెట్టింది. ఈ ముసలి వయస్సులో నా మీద అజమాయిషీ. ఈ సంబంధం సీతాకోక చిలుకలకన్నా నాజుకు. ఆయన ప్రేమ అధికారాల భారం… మెల్ల మెల్లగా ఈ సంబంధం బానిసత్వానికి దారి తీస్తుంది. ప్రేమ లుప్తం అవుతుంది. కేవలం కర్తవ్య భావం మిగిలిపోతుంది. విదేశాలలో అభిప్రాయ బేధాలు వచ్చాయంటే డైవర్స్.  మన దగ్గర జన్మంతా ఈ సంబంధం తెగిపోదు. అక్కడ ప్రేమ మళ్ళీ వివాహం. ఇక్కడ మొదట పెళ్ళి తరువాత ప్రేమ. ప్రేమ అయినా సరే ద్వేషం అయినా సరే ఎప్పటికి ఉండే సెంటిమెంట్స్ కావు. అక్కడ ప్రేమ ఆధారంగా పెళ్ళిళ్ళు జరుగుతాయి. అందువలనే డైవర్స్. ఇక్కడ కర్తవ్యం తరువాతే వివాహం. ఆ తరువాతే ప్రేమ, కర్తవ్యం, వివేకం, అధారం పైన ప్రేమ భావం.

ఈ వయస్సులో మీరు చేసిన ఏ పనికైనా మనస్సులో పశ్చాతాపం కలిగిందా?

పశ్చాతాపం… నా భార్య కారణంగా… ఎంతో మంచిది, అమాయకురాలు…. చివరి దశలో ఆమె కోమాలోకి వెళ్ళిపోయింది. నేను క్షమించమని కూడా అడగలేకపోయాను. ఈ పశ్చాత్తాపం జీవితాంతం ఉంటుంది. “మేరే కారణ్ హీ సహే తుమ్ నే కష్ట్ అపార్. చైన్ న దేగా ఉమ్ర్ భర్, ముఝకో యహి విచార్.” (నా కారణంగా నీవెన్నో కష్టాలు పడ్డావు. జీవితాంతం ఈ ఆలోచన నాకు శాంతినివ్వదు.)

ఒక షేర్ రాసాను.  “జబ్ తక్ తుమ్ థీ ముఝే యే ఘర్ మేరే ఘర్ సా లగా. అబ్ నహీఁ తో  ఫిర్ యే ఏక్ ఖండహర్ సా లగా.” (నువ్వు ఉన్నంత వరకు నాకు ఈ ఇల్లు నా ఇల్లులా  అనిపించింది. ఇప్పుడు నీవు లేనప్పుడు ఈ ఇల్లు ఒక శిథిలంలా అనిపిస్తోంది.) కుందన్ పట్ల నేను ప్రవర్తించిన తీరు వలన కూడా పశ్చాత్తాప పడుతున్నాను. మొట్టమొదట ఆవిడ అవివాహిత. తరువాత ఒక గుజరాతీ రైటర్‌ని పెళ్ళి చేసుకుంది. నేను ఎప్పుడు ఆమెని ఆపలేదు. నేను సావిత్రిని బాధపెట్టి ఆమెను పెళ్ళి చేసుకోలేను. ఆవిడకి ఉబ్బస రోగం ఉంది. ఒంటరిది. నేను తనతోనే ఉండాలని ఆమె కోరిక. కాని ఆమెతో నేను ఉండే పరిస్థితి లేదు.

నా జీవితంలో అది ఒక పెద్ద అనుభవం. ఆమె వెళ్ళిపోయినప్పుడు నాకు చాలా కోపం వచ్చింది. పిచ్చివాడినై పోయాను. ఆమెను ఏవేవో మాటలు అన్నాను. ఇప్పుడు చాలా పశ్చాత్తాప పడుతున్నాను. ఆమె భర్త చనిపోయాడు అని తెలిసింది. ఆమెను క్షమించమని అడగ లేకపోయాను.”

మీకు ఎప్పుడైనా ప్రబంధకావ్యం కాని మహాకావ్యం కాని రాయాలని అనిపించలేదా?”

“ఒకసారి నాకు అనిపించింది ‘శాంతిలోక్’ అన్న పేరన రాయాలని అనుకున్నాను.  కొంత మొదలు పెట్టాను. కాని అసలు తీరిక దొరకితే కదా రాసేది. కవి సమ్మేళనాల కోసం ఉరుకులు, పరుగులు. ‘దో గీత్’ అన్న పేరన రాసిన సంకలనంలో ‘జీవనగీత్ ’ ఉంది. అది ‘శాంతిలోక్’ లోని కొంత భాగం. ఉద్యోగాల గోల, ఈతి బాధలు, ఉరుకులు పరుగులు, ఇంటి బాధ్యత, ఆడపిల్లల ప్రేమలేఖలు, వీటన్నింటిలో ఎంత తలమునకలయ్యానంటే అసలు దేనికి సమయమే దొరకలేదు. మహాకావ్యం రాయాలంటే మనస్సుకి శాంతి కలగాలి. శాంతి యుతమైన వాతావరణం ఉండాలి.  ‘కామాయని’లాంటి కావ్యం రాయాలని అనుకున్నాను.

‘కామయని’ కావ్యం గురించి చెప్పడం మొదలు పెట్టారు నీరజ్. అసలు ఆశ్చర్యం ఏమిటంటే ఏ కాలేజీలో ఆయన పని చేసి రిటైర్ అయ్యారో అదే కాలేజీలో పని చేసిన ఒక లెక్చరర్ ‘కామాయని’ నీరజ్ భోధిస్తుంటే వింటున్నాడు. ఆయన చదివే తీరు, భావర్థం చెప్పే తీరు అంతా… అంతా ప్రశంసనీయమే. ‘హిమగిరికే ఉత్తుంగ్ శిఖర్ పర్… ఉత్తుంగ్ క్యా ఊంచా… సర్యోచ్చ?’ అని అనలేదు. పంచకోశాల ఈ శరీరమే హిమాలయం. మన మూడో ఉపత్య మనోమయకోశంలో ఉండే సుఖదుఃఖాలు, అన్నీ మనస్సులోనే. మనస్సు లోపల  ఏ ప్రళయ ప్రవాహం ఉందో… సంసారంలో ఈతి బాధలు… ఇక్కడ సుఖదుఃఖాల ఉత్పత్తి. అందువలన నేత్రాలు తడిసిపోయాయి. కింద జలం, పైన హిమము – ఒకటే తత్వం. ద్వందం అంతా ఇక్కడే ఉంది. అసలు ఎందుకు తడిసిపోయాయి  నేత్రాలు? ఎందుకంటే… (సంస్కృతం గురించి చెప్పడం మొదలు పెట్టారు).

ధర్మక్షేత్రే కురుక్షేత్రే… గీత ప్రథమ శ్లోకం… మహా భారతానికి  కారణం… సంజయుని ఏమడిగారు… నా పాండుపుత్రులు ఏం చేసారు సంజయా? నీ నా బేధం ఎక్కడ మొదలువుతుందో అక్కడ మహాభారతం మొదలవుతుంది. ఇదంతా ఎవరు చేసారు?  ఫార్మ్‌ని చూస్తాడు. శరీరాన్ని, అకృతులను చూస్తాడు. ఆత్మని కాదు. సంజయుడు లెక్క చెబుతున్నాడు. ఇటువంటి దృష్టి గుడ్డిది. అందువలనే గుడ్డివాడు ధృతరాష్రుడు. ఒక రకంగా కేవలం శరీరాన్ని చూసే మనం అందరం గుడ్డివాళ్ళమే. అందువలన ఇవాళ్టికి కూడా అవిరామంగా నిరంతరంగా మహాభారత్ నడుస్తూనే ఉంది. ఇదే మన ట్రాజెడీ. నా రజనీష్ రాసిన గీత మీద భాష్యం చదివారు మీరు?

ఇంకా ఇంకా మంచివి రాయాలని నా మనసు కోరుతునే ఉంది. ఆరోగ్యం పాడైయింది. లోపల శక్తి ఉడిగపోయింది. ఎన్నో సంవత్సరాలయింది గీతాలు రాసి. ఎప్పుడు ఆ పని  పని,  ఉరుకులు పరుగులు… మంచి పెద్ద రచన చేయాలని నా కోరిక. ఇప్పుడు దోహాలు రాస్తూన్నాను. హైకూలు రాయాలనుకంటున్నాను. ఇక ఇప్పుడు వానప్రస్థాం స్వీకరిస్తాను. గ్రాహస్థ్వం అయ్యాక వానప్రస్థం, ఆ తరువాత సన్యాసం. సన్యాసి కావాలంటే ముందు ఈ ఇల్లు అమ్మేయ్యాలి. అసలు అంతా ఎవరి మీద వదిలివేయను?  బయట ఒక గది కడుతున్నాను. ఆ తరువాత ఈ ఇంటిలోకి ఇక వెళ్ళను. అజ్ఞేయ్ గారు చెట్టు మీద ఇల్లు కట్టుకున్నారు. నేను చెట్టు కింద కట్టుకుంటున్నాను. ఇక ఇప్పుడు ఎవరితోను సంబంధం లేదు.”

పశ్చాత్తాపం, వానప్రస్థం గురించి మాట్లాడేటప్పుడు నీరజ్‌గారు ఉదాసీనులుగా అయిపోయారు. ఒంటరితనం వారి ముఖకవళికళలో కనిపించింది. ఆ గదిలో గోడల మీద ఉన్న ఫోటోల పైన నా దృష్టి పడ్డది. ఓహో, మదర్ తెరిసా, ఆనందమయిమా, కృష్ణుడు, ఒక పెద్దావిడ. ఆ పెద్దవిడ తన తల్లి అని చెప్పారు.

ఒంటరితనం మిమ్మల్ని బాధపెట్టడం లేదా?”

“అసలు ఒంటరిగా ఎక్కడ ఉన్నాను. అప్పుడప్పుడు ఎవరైనా చాలా సేపు కూర్చుంటే కొంచెం కోపం కూడా వస్తుంది. ఒంటరిగా ఉన్నప్పుడు మనం ఆత్మ పరీక్షని చేసుకోవచ్చు. చదువుకోడం, రాసుకోవడం ప్రొద్దుటి నుండే ప్రారంభం అవుతాయి. పనులు… అసలు సమయం ఎక్కడ దొరుకుతుంది. సాయంత్రం నలుగురైదుగురు వస్తారు. వాళ్ళతో కాస్సేపు పేక ఆడకుంటాను. మనోరంజకం అవుతుంది. తరువాత భోజనం… నిద్ర పోవడం… ఇక ఒంటరితనం ఎక్కడ ఉంది? నా కవిత్వంలో సంత్‌ల తత్వం వచ్చిందంటే ఊరికే వచ్చిందా? నేను దేశంలో ఎంతో మంది సంత్ మహాత్మలని కలిసాను. అరవింద్, మా ఓషో, మహార్ బాబా, ప్రభోదానంద్‌గారు, స్వామీ ముక్తానంద్ వీళ్ళందరి సాన్నిధ్యం నాకు లభించింది. వాళ్ళు కూడా నా వైపు ఆకర్షితులవడానికి ఏదో కారణం ఉండి ఉండవచ్చు. అందువలనే నేను కుళ్ళిపోయిన ఆచారాలను, ధార్మిక సామాజిక గుడ్డినమ్మకాలను ఎదిరించగలిగాను. మా అమ్మ భక్తురాలు. ఆవిడ కంఠం చాలా బాగుండేది. భజనలు చాలా చేసేది. సాయంత్రం ఆవిడ పాడుతుంటే నేను వింటూ ఉండేవాడిని. ఆవిడ గుణం నాకు వచ్చింది. అప్పట్లో మామయ్య నెలకు 5 రూపాయలు పంపించేవారు. కొంత వరకు అప్పు చేయాల్సి వచ్చేది. ఆవిడ ఒకవేళ తీసుకున్నా అప్పు తీర్చలేకపోతే వచ్చే జన్మలో ఇవ్వాల్సి వస్తుంది అని అనేది. అందువలన తరువాత నేను ఎప్పుడు అప్పు చేయలేదు. ఇంట్లో విరిగిన ద్వారాలు, కిటికీలు, చూసి మేం భయపడే వాళ్ళం. అప్పుడు అమ్మ ‘రాముడి చేకీ (పూజ) పెట్టాను. భయపడాల్సిన అవసరం లేదు’ అనేది. ఆవిడకి దేవుడి పైన ఎంతో నమ్మకం. 36 సంవత్సరాలు వైధవ్యాన్ని ఆవిడ ఈ నమ్మకంతోనే మోసింది. బతికింది. మేం అన్నదమ్ములు చేసే అల్లరిని చూసి ‘వీళ్ళు నీ కోసం ఏం చేస్తారు. అంతా నాశనం అయిపోతుంది’ అని అందరూ అంటూ ఉండేవాళ్లు.  ‘మా వంట ఇంట్లో నాలుగు గిన్నెలు వీళ్ళు. ఒకటైనా పనిని వస్తే జీవితం గడిచిపోతుంది’ అని ఆవిడ అనేది. ఆవిడ ఎప్పుడు నిస్పృహ చెందలేదు. ఈనాటికి ఆవిడ ఆశీర్వాదం నా మీద ఉంది. నేను బయటకి  వెళ్ళేటప్పుడు ఆవిడ ఫోటోకి దండం పెట్టకునే వెళ్తాను. మౌరిస్ మైటర్‌లింక్ రాసిన ‘బ్లూబర్డ్’ అనే పుస్తకాన్ని ‘నీల్ పంఖీ’ అన్న పేరన అనువాదం చేసాను. చిన్నదే కాని చాలా అద్భుతమైన పుస్తకం. (మొత్తం కథ చెప్పడం మొదలు పెట్టారు.)  అందులో ఒక పిల్లాడు ఉన్నాడు. గ్రేవ్‌యార్డ్ ఉంది. ఆ పిల్లవాడి పైన ఓ ప్రత్యేకమైన గ్లాసు ఉంది… ‘వెన్ పీపుల్ లివింగ్ ఆన్ ది ఎర్త్ రిమెంబర్ అజ్, లైఫ్ కమ్స్ బ్యాక్ టు అజ్’ అని పిల్లాడి చనిపోయిన నాయనమ్మ అంటుంది. మా అమ్మ కూడా ఎక్కడికి వెళ్ళిపోలేదు. జ్ఞాపకాలలో ఆమె ప్రతిసారి మళ్ళీ బతుకుతూ ఉంటుంది.”

ఈ సమాధానంతో ఈ సుదీర్ఘమైన సంభాషణ ముగిసింది.

(సమాప్తం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here