కావ్య పరిమళం-10

0
8

[box type=’note’ fontsize=’16’] సాహిత్య విశిష్టతలోనూ, కథాకథన శిల్పంలోనూ, పద్య రచనా చమత్కృతిలోనూ, శైలి విన్యాసంలోనూ మధురాలైన ప్రాచీన కావ్యాల పరిమళాలను అందిస్తున్నారు డా. రేవూరు అనంతపద్మనాభరావు. [/box]

శ్రీనాథుని కాశీఖండం

[dropcap]క[/dropcap]విసార్వభౌమ శ్రీనాథుడు క్రీ.శ. 1380 -1470 మధ్య కాలమున జీవించెను. చిన్నారి పొన్నారి చిరుతకూకటినాడు రచించిన మరుత్తరాట చరిత్ర, నూనూగు మీసల నూత్నయౌవనంలో వ్రాసిన శాలివాహన సప్తశతి, పండితారాధ్య చరిత్రలు అలభ్యం. హర్ష నైషధమును శృంగార నైషధముగా ఆంధ్రీకరించాడు.

నైషధం విద్వదౌషధం – అన్నారు. విద్వాంసులము ఔషధం. కాశీఖండం అయఃపిండం – ఇనుప ముద్ద వంటిది. దానిని శ్రీనాథుడు అనువదించాడు. భీమఖండం, హరవిలాసాలు అద్భుత కావ్యాలు. వయసు మళ్ళకముందు కాశీఖండాన్ని వ్రాశానని చెప్పాడు. క్రీడాభిరామము వీధి నాటకము.

కాశీఖండం:

ఈ కావ్యాన్ని శ్రీనాథుడు రాజమహేంద్రవరాన్ని పాలించిన రెడ్డిరాజు వీరభద్రారెడ్డి కంకితంగా క్రీ.శ. 1440 ప్రాంతాలలో వ్రాసి ఉంటాడని నిడదవోలు వెంకటరావు అభిప్రాయపడ్డారు. స్కాంద పురాణంలో కాశీఖండం 50 ఖండాలలో వుంది. తెలుగులో 1777 గద్యపద్యాలలో ఈ కావ్యాన్ని శ్రీనాథుడు మనోహరంగా తీర్చిదిద్దాడు. శైవతత్వ ప్రతిపాదికమైన గ్రంథమిది.

కేవలం కాశీ క్షేత్ర మహిమయే గాక, అక్కడక్కడా సాముద్రిక, పాతంజల యోగశాస్త్ర, మంత్రశాస్త్ర విశేషాలు కూడా ఇందులో ఉన్నాయి. శ్రీనాథుని తర్వాత కాశీఖండాన్ని మరెవ్వరూ అనువదించలేదు. అయితే 1500 ప్రాంతం వాడైన కంచెర్ల శరభకవి, 1650 ప్రాంతము వాడైన మోచర్ల అన్నయ్య కాశీఖండాన్ని ద్విపదలలో వ్రాశారు. వచనంగా నంజరాజు అనువదించాడు.

సంస్కృత కాశీఖండంలో వ్యాసుడు కాశిని వదిలిపెట్టి వెళ్ళే వృత్తాంతాన్ని తీసుకుని శ్రీనాథుడు దక్షిణకాశియైన దాక్షారామక్షేత్ర మహత్యాన్ని భీమఖండం పేరుతో వ్రాశాడు. ఆంధ్రదేశంలోని దాక్షారామం గొప్పదనం చెప్పడం శ్రీనాథుని ఉద్దేశం. క్షేత్ర మహత్యాలు చెప్పడంలో శ్రీనాథునిది ప్రత్యేకత. 14వ శతాబ్దినాటి ఆంధ్రదేశ రాజకీయ, సాంఘిక, సాహిత్య చరిత్రలకు ఆయన రచనలు ప్రతిబింబాలు.

వేమారెడ్డి శ్రీనాథుని ప్రశంసిస్తూ – వేములవాడ భీమకవి, నన్నయ, తిక్కన, ఎర్రన కవులవలె నైషదాది ప్రబంధాలు చెప్పావన్నాడు. “ఈ క్షోణిన్ నినుబోలు సత్కవులు లే రీనాటి కాలంబున్” – అని గంభీరంగా పొగిడాడు.

పూర్వకవులలో శ్రీనాథుడు తెలుగు కవులలో నన్నయ, తిక్కన, ఎర్రనలను మాత్రమే స్తుతించాడు.

ప్రధాన కథాభాగాలు:

ఈ కథలో మూల పురుషుడు అగస్త్యుడు. ఆయన లోక కల్యాణం కోసం దేవతల కోరికపై కాశీక్షేత్రాన్ని వదలి దక్షిణదేశంలోని కొల్హాపురాది క్షేత్రాలు దర్శించడం ప్రధాన కథ. మేరు పర్వతం మీది అసూయతో వింధ్య పర్వతం విజృంభించి సూర్యుని గమనాన్ని అరికట్టబోయింది. దానికి అడ్డుకట్ట వేయడానికే అగస్త్యుడు కాశీ నుండి బయలుదేరవలసి వచ్చింది. తన భార్య లోపాముద్రతో కలిసి అగస్త్యుడు అనేక తీర్థాలు సేవించాడు.

అందులో భాగంగా స్వామిమల తీర్థంలో కుమారస్వామిని దర్శించి ఆయన ద్వారా అగస్త్యుడు కాశీక్షేత్రం లోని  నానా తీర్థఘట్టాలు, దేవతల గూర్చి తెలుసుకున్నడు. అందులో భాగమే వ్యాసుడు కాశిని వదిలిపెట్టి వెళ్ళడం. కథను ఐదు శీర్షికలతో ఆచార్య పింగళి లక్ష్మీకాంతం విశ్లేషించారు.

  1. వింధ్య పర్వత విజృంభణం
  2. అగస్త్యుడు కాశిని వదలిపెట్టడం
  3. అగస్త్యుడు దక్షిణ దేశంలో తీర్థాలు సేవించడం
  4. కుమారస్వామి కాశీ మాహత్యం చెప్పడం
  5. వ్యాసుడు కాశీని వీడటం

ఈ ఐదు ప్రధాన కథలకు తోడు రెండు, మూడు ఉపాఖ్యానాలు కవి జోడించాడు. అందులో ప్రసిద్ధి గుణనిధి కథ. కుబేరుని పూర్వజన్మ వృత్తాంతమది. గుణనిధి వంటి ధూర్తనాయకులు పలువురు గూర్చి నా పరిశోధనా గ్రంథం ‘కందుకూరి రుద్రకవి’ రచనలలో విపులీకరించాను.

అట్టి ధూర్తనాయకులు – మదాలసుడు, మందేహుడు, సుకుమారుడు, నిరంకుశుడు, నిగమశర్మల రూపంలో ఇతర కావ్యాలలో ప్రత్యక్షమవుతారు. ఆయా క్షేత్ర మాహాత్యాఅల వల్ల, భక్తి విశేషాల వల్ల ముక్తిని పొందుతారు. అందరిలోకి తెనాలి రామకృష్ణుని పాండురంగ మాహాత్యంలోని నిగమశర్మ బహుళ ప్రచారంలోకి వచ్చాడు.

లక్ష్మీదేవిని అగస్త్యుడు స్తుతించిన పద్యం భావగర్భితం. డబ్బున్న వాడిని అందరూ పొగుడుతారంటూ –

ఉ:

ఎవ్వని నేని నీవు దయ నించుక చూచిన వాని జూతు ర
ప్పున్విలు కానిగా సతులు, భూవతిగా, ప్రజ కల్పకంబుగాన్
అన్విబుధా శ్రిత వ్రతతి అంబుధిగా కులగోత్ర, గోత్రముల్‌
కవ్వడిగా పరద్విషులు కర్ణునిగా కవులెల్లన్‌ శ్రీసతీ!

(తృతీయ – 47 వ పద్యం)

వింధ్య పర్వత విజృంభణం:

సాధారణంగా మనుజులకు వలె ఇతరులకును అసూయ సహజం. మేరు పర్వతం ఔన్నత్యాన్ని చూసి వింధ్యపర్వతం సహించలేకపోయింది. వింధ్యుడి మానసిక సంక్షోభం శ్రీనాథుడు వర్ణించాడు. నారదునితో వింధ్యుడిలా చెప్పుకుని బాధపడ్డాడు:

ఉ:

“కంటికి నిద్ర వచ్చునె? సుఖంబగునే రతికేళి? జిహ్వకున్
వంటక మింపునే? ఇతర వైభవముల్ పదివేలు మానసం
బంటునె? మానుషంబుగల యట్టి మనుష్యున కెట్టివానికిన్
కంటకుడైన శాత్రవు డొకండు తనంతటి వాడు కల్గినన్”

(ప్రథమా – 108వ పద్యం)

ఈ మానసికస్థితి విషాద నాటకంలో నాయకుడు పడే అవస్థ వంటిది. అయితే తన దోషం వల్ల తానే పతనానికి గురియై తల ఎత్తుకొని తిరగలేకపోయాడు. దురహంకారపూరితుడైన వింధ్యుడు అగస్త్యుడు తిరిగి వస్తాడని నిత్యం నిరీక్షణ కొనసాగిస్తూ జీవించాడు.

ఈ కథలో శ్రీనాథుడు మయూరుని సూర్యశతకంలోని కొన్ని శ్లోకాలను సందర్భోచితంగా సీస పద్యాలలో పొదిగాడు. సంస్కృత మూలంలో లేకపోయినా కవి జోడించాడు. అగస్త్యుడు లోపాముద్రకు భౌతికమైన తీర్థయాత్రల మహిమలతో పాటు యౌగికములైన ఆంతర తీర్థాలను గూర్చి కూడా విశదీకరించాడు. అనేకానేక లోకాలను గూర్చి వివరించాడు. అనేక ప్రదేశాలను వర్ణించాడు.

కొల్హాపురం, శ్రీశైలం, సప్తపురి, అప్సరాలోకము, సూర్యలోకము, స్వర్గలోకము, నిరృతి లోకము, వరుణ లోకము, ఈశాన లోకము, చంద్రలోకము, నక్షత్ర లోకము, బుధ, శుక్ర, అంగారక, బృహస్పతి, శని, సప్తర్షి లోకాలు, మణికర్ణిక, కాశి వంటి అంశాలు విస్తారంగా వర్ణించబడ్డాయి.

గుణనిధి కథ:

కుబేరుని పూర్వజన్మ వృత్తాంతాన్ని గుణనిధి కథలో శ్రీనాథుడు వివరించాడు. కాంపిల్య పురంలో యజ్ఞదత్తుడనే నైష్ఠికుడున్నాడు. అతనికి మన్మథ సమానుడైన గుణనిధి అనే కుమారుడు కలిగాడు. అతడు ఆచారాలను వదిలిపెట్టి జూదమాడసాగాడు. ఇంట్లో సామానులన్నీ కుదువబెట్టాడు. ఇంటి పనులలో నిమగ్నుడైన తండ్రి కొడుకు నడవడిని పరామర్శించలేదు. అప్పుడప్పుదు భార్యతో కొడుకు గూర్చి వాకబు చేసేవాడు. ఆమె కొడుకు తప్పిదాలను కప్పిపుచ్చింది. కారణం గొడ్రాలికి లేక లేక కలిగిన సంతాన మతడు.

16 ఏళ్ళ వయసులో అతనికి శాస్త్రోక్తంగా వివాహం చేశారు. తల్లి కుమారుని తరచూ మందలిస్తూనే వచ్చింది. ‘మీ నాన్నకు తెలిస్తే కొంప ముగునుతుంద’ని గోల పెట్టింది. తల్లి మాటలను గుణనిధి పెడచెవిని బెట్టి తిరగసాగాడు.

యజ్ఞదత్తుడు తన చేతి ఉంగరాన్ని ఒక జూదరి వ్రేలికి ఉండడం చూశాడు. ఇంటికి వచ్చి సోమిదేవమ్మను ప్రశ్నించాడు:

శా.

“అంగోద్వర్తన వేళ నీవు దరహాసాంకూరముల్ లోచనా
పాంగ ప్రాంతమునం దిగుర్ప నొక సయ్యాటంబు గల్పించి నా
అంగుళ్యాభరణంబు పుచ్చుకొనవా! ఆ యుంగరం బిప్పుడే
శృంగారింపని చేత బావకునకున్ చేయన్ హవిర్దానమున్.”

(చతుర్థా – 104వ పద్యం)

కోపించిన యజ్ఞదత్తుడు భార్యను, కొడుకును త్యజించి వేరొక పెళ్ళి చేసుకొన్నాడు.

గుణనిధి ఇల్లు వదిలి ఆ రాత్రి (శివరాత్రి) నగర బాహ్య ప్రదేశంలోని ఒక శివాలయం చేరుకొన్నాడు. నాలుగు జాములు నిద్ర లేకుండా గడిపాడు. శివరాత్రి వేళ ఉపవాసము, జాగరము, శివలింగ దర్శనం చేసుకొన్న ఫలితంగా అతనికి శివలోక ప్రాప్తి కలిగింది. కొద్దిపాటి పుణ్య విశేషం వల్ల అతడు శివలోకం చేరి మరుజన్మలో కుబేరుడయ్యాడు.

వ్యాసుడు కాశిని ఎడబాయుట:

ఈ కథలో ఇద్దరు మహర్షులు – అగస్త్యుడు, వ్యాసుడు కావ్యం మొదట్లోనూ, చివర్లోనూ కన్పిస్తారు. ఇద్దరూ కాశిని వదలి వెళ్ళవలసిన స్థితి ఏర్పడింది.  వ్యాసుడు చాలా కాలం శిష్య సమేతుడై కాశిలో నివాసమున్నాడు. పరమశివుడు అతని మనస్థైర్యాన్ని పరీక్షించాలని విశాలాక్షితో ఇలా అన్నాడు: “భిక్షాటనలో వ్యాసునకు ఎక్కడా భిక్ష దొరకని విధంగా చూడు”. రోజూ వెళ్ళినట్లే వ్యాసుడు, అతని శిష్యులు పైల, సుమంత, జైమినులు, వైశంపాయనుడు పాత్రలు ధరించి కాశీనగర వీధులలో భిక్షకు వెళ్ళారు. కాశీ విశాలక్షి ప్రయత్నం వల్ల వారికి ఆనాడు భిక్ష లభించలేదు. ఆ రోజు ఉపవాసం చేశారు. ఆ రోజు ఉపవాసం చేశారు. మర్నాడు మధ్యాహ్నం భిక్షాటనకు వెళ్ళినా ఎవ్వరూ భిక్ష పెట్టలేదు.

వ్యాసుడు భిక్షా పాత్రను నడువీధిలో పగలవైచి కోపావేశంతో కాశీ నగరాన్ని శపించబోయాడు. అప్పుడు పార్వతీదేవి పాకృత స్త్రీ వేషంలో వచ్చింది. “ఉన్న వూరు, కన్నతల్లిని శపించడం భావ్యం కాదు. మా యింటికి వచ్చి అందరూ భోం చేయండి” అని తీసుకువెళ్ళింది. వారికి మృష్టాన్న భోజనం పెట్టింది. ఇక్కడ శ్రీనాథుడు తెలిగింటి భోజనం వడ్డించాడు. ఒక్కరోజు అన్నం దొరకలేదని కోపించడం సరికాదని హెచ్చరించింది. శివుడు కోపించి వ్యాసుని కాశి వదలి వెళ్ళమని ఆదేశించాడు.

కవిసార్వభౌముని అద్భుతకావ్య కల్పనాశక్తికి కాశీఖండం మరొక లక్ష్యం. ఆయన నానా శాస్త్ర పరిచయానికీ, లోకవృత్త పరిజ్ఞానానికీ మానవ ప్రకృతి పరిశీలనకు ఈ కావ్యం ప్రత్యక్షర సాక్ష్యం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here