కావ్య పరిమళం-11

0
4

“శ్రీవాణీ గిరిజా శ్చిరాయ దధతో వక్షో ముఖాంగేషు యే
లోకానాం స్థితి మావహంత్య విహతాం స్త్రీపుంసయోగోద్భవాం
తే వేదత్రయమూర్తయ స్త్రీపురుషా స్పంపూజితా వస్సురైః
భూయాసుః పురుషోత్తమాంబుజ భవ శ్రీకంధరా శ్శ్రేయసే” –

అనే సంస్కృత శ్లోకంతో తెలుగు సాహిత్యంలో 11వ శతాబ్దిలో ఆదికవి నన్నయ భట్టారకుడు మహాభారత ఆంధ్రీకరణను ప్రారంభించాడు.

నన్నయ చెప్పినట్లు భారతం ధర్మశాస్త్రము, వేదాంత గ్రంథము, నీతి శాస్త్రము, మహా కావ్యము, ఇతిహాసము, పురణాము అని లోకంలో కొనియాడబడింది. నన్నయ వ్యాసభారతాన్ని యథామూలకంగా అనువదించలేదు. అలా అని స్వతంత్రించి దూరంగా వెళ్ళలేదు. నన్నయ ఆది, సభా, అరణ్య పర్వాలలో కొంతభాగం అనువదించాడు. సంస్కృతంలో 17 వేల శ్లోకాలలో వున్న ఆ భాగాన్ని నాలుగు వేల పద్యాలలో చెప్పాడు. తన రచనలో ప్రసన్నకథాకలితార్థ యుక్తి, నానారుచిరార్థసూక్తినిధి, అక్షర రమ్యత ఉంటాయని ధీమాగా పలికాడు.

నన్నయది ప్రధానంగా ఆఖ్యాన శైలి. అక్కడక్కడ  నాటకీయ శైలి కన్పిస్తుంది. నన్నయది కర్ణపేయ శైలి. పద్యం చెవికి ఇంపుగా వినబడుతుంది. ఉదంక స్తోత్రం ఇందుకు ఉదాహరణ.

చం:

బహువన పాదపాబ్ధి కులపర్వత పూర్ణ సరస్సరస్వతీ
సహిత మహామహీభర మజస్ర సహస్ర ఫణాళి దాల్చి దు
స్సహతర మూర్తికిన్‌ జలధిశాయికి పాయక శయ్య యైన అ
య్యహిపతి దుష్కృతాంతకు డనంతుఁడు మాకుఁ ప్రసన్నుడయ్యెడున్‌.
(ఆదిపర్వం, ప్రధమా – 104వ పద్యం)

రాజరాజ నరేంద్రుడు:

క్రీ.శ. 1022 నుంచి 1063 వరకు రాజ్యపరిపాలన చేసిన రాజరాజ నరేంద్రుడు భారతాంధ్రీకరణకు నన్నయను నియోగించాడు. రెండున్నర పర్వాత పద్యాల రచనతో భారతాంధ్రీకరణ ఆగిపోయింది. నన్నయకు సమకాలికులుగా అధర్వణాచార్యులు, వేములవాడ భీమకవి ప్రసిద్ధులు. నారాయణభట్టు నన్నయ రచనకు బాగా తోడ్పడ్డాడు.

నన్నయ తన పూర్వకవి స్తుతిలో వ్యాసవాల్మీకులను మాత్రమే పేర్కొన్నాడు. పద్యవిద్యకు నన్నయ ఆద్యుడు. ఆయన వాగనుశాసనుడు. “ఆంధ్ర సారస్వత మహానగర నిర్మాత నన్నయ” అంటారు విశ్వనాథ సత్యనారాయణ. మహాభారతం పురాణమే అయినా కావ్యపద్ధతిలో నన్నయ వ్రాశాడు.

వ్యాసుని కాలానికీ, నన్నయ కాలానీకి మధ్య పెక్కు వందల సంవత్సరాలు దొర్లిపోయాయి. వారు నివసించిన ప్రాంతాలు వేరు. దేశకాలభేదాల చేత సాంఘికాది సంప్రదాయాలలో, ఆచార వ్యవహారాలలో, ఆహార విహారాలలో వ్యత్యాసాలు ఏర్పడడం సహజం. వాటికనుగుణంగా నన్నయ తన రచనలో కొన్ని మార్పులు ప్రవేశపెట్టాడు. నన్నయ వర్ణనలు ఉదాత్త గంభీరాలుగా ఉంటాయి. మయసభ వర్ణన అందు కుదాహరణ. రసపోషణ విషయంలోనూ ఆయ నిగ్రహవంతుడు. పాత్రపోషణ విషయంలోనూ ఆయన చేయి తిరిగిన ఘనుడు. లోకజ్ఞత, మనస్తత్వ పరిశీలన విషయంలో నన్నయ దిట్ట.

నన్నయ శైలి:

నన్నయకు పూర్వము తెలుగు కావ్యాలు ఏవీ లేవు. కన్నడ కావ్యాలు, సంస్కృత కావ్యాలు ఆయనకు మార్గదర్శకాలు. అందువలన తత్సమబహుళమైన మార్గపద్ధతిని అవలంబించెను. నన్నయది ప్రధానంగా కథాకథన శైలి. సభావర్ణనల సందర్భంలో వర్ణన శైలి, శిశుపాల వధ ఘట్టంలో సంవాదశైలి అనుసరించాడు. శిశుపాల వధ ఘట్టం దృశ్యకావ్యం వలె కొనసాగిందని ఆచార్య దివాకర్ల వెంకటావధాని భావించారు. ‘నా నేర్చు విధంబున్న ఇక్కావ్యంబు రచించెద’నని నన్నయ సవియనంగా పలికాడు. ‘నన్నయరీతి వైదర్భి’ యని డా. పాటిబండ్ల మాధవశర్మ పేర్కొన్నారు.

నన్నయ విపుల శబ్దశాసనుడు. ఆయన రచనలో సంస్కృత శబ్దములే అధికం. ఆయన రచనలో మృదు హాస్యం తొంగి చూచింది. నన్నయ తర్వాత 200 సంవత్సరాలు భారతానువాదం అలానే నిలిచిపోయింది. ఎట్టకేలకు తిక్కన పుట్టి విరాటపర్వ రచనతో మొదలుపెట్టి భారతాంధ్రీకరణం పూర్తి చేశాడు. అరణ్యపర్వ శేషాన్ని గుడ్లూరు నివాసియైన ఎర్రాప్రెగడ పూర్తి చేసి భారతాఖిల పురణమైన హరివంశాన్ని కూడా అనువదించాడు.

భారతకథా సంవిధానం:

మహాభారతం తెలుగులో ఆదిపర్వం నుండి స్వర్గారోహణపర్వం వరకు 18 పర్వాల సమాహారం. ఆదిపర్వంలో ప్రారంభం సరమ వృత్తాంతంతో ఆరంభమవుతుంది. జనమేజయుని తమ్ములు సారమేయుడనే కుక్కును కొట్టారు. దాని తల్లి కోపంతో జనమేజయుని వద్దకు వెళ్ళి ఫిర్యాదు చేసింది. అంటే భారత కథ కుక్కతో ప్రారంభమవుతుంది. ఉద్యంకుడు పౌష్యు మహాదేవి కుండలాలు తీసుకురావడానికి వెళ్తాడు. తక్షకుడు ఆ కుండలాలు అపహరించాడు. ఇంకా మరికొన్ని కథలున్నాయి.

తృతీయాశ్వాసంలో భారత కథ ప్రారంభమవుతుంది. పరాశర ముని మత్స్యగంధి (సత్యవతి)తో సమాగమం చెందాడు. ఆమెకు వేదవ్యాస ముని జన్మించాడు. దేవదానవుల అంశలో భీష్మాది వీరులు జన్మించారు.

శకుంతలా దుష్యంతుల పరిణయం వివరంగా చతుర్థాశ్వాసంలో కన్పిస్తుంది. గంగాశంతనులకు భీష్ముడు జన్మించాడు. వ్యాసుని వలన ధృతరాష్ట్ర పాండురాజ విదురులు జన్మించారు. భీష్ముని సంరక్షకునిలో వారు పెరిగారు.

ధృతరాష్ట్రుడు గాంధారిని, పాండురాజు కుంతీ, మాద్రిలను వివాహమాడారు. వేటకు బోయిన పాండురాజునకు శాపం కలిగింది. పాండురాజు శతశృంగంపై తపో నియమంలో వుండగా కుంతీదేవికి వరప్రసాదంగా ధర్మజ, భీమార్జునులు జన్మించారు. మాద్రికి నకుల సహదేవులు జన్మించారు.

ద్రోణుని వద్ద కౌరవ పాండవులు శస్త్రాస్త విద్యలు అభ్యసించారు. కుమారాస్త్ర విద్యా ప్రదర్శన సమయంలో కర్ణుడు ప్రవేశించి అర్జునుని అధిక్షేపించాడు. దుర్యోధనుడు కర్ణుని అంగరాజ్య పట్టాభిషిక్తుణ్ణి చేశాడు. గురుదక్షిణగా అర్ఝునుడు ద్రుపదుని పట్టి కట్టి తెచ్చాడు. కౌరవ పాండవులమధ్య మత్సరం ఆరంభమైంది.

ధృతరాష్ట్రుని ఆదేశంతో పాండవులు కుంతీసమేతంగా వారణావతం చేరుకుంటారు. అక్కడ లక్క యింటి దహనం నుండి భీముడు పాండవులందరినీ రక్షించాడు. వేదవ్యాసుని సూచనలు పాండవుల కుపకరించాయి. భీమసేనుడు హిడింబను వివాహమాడాడు. వారికి ఘటోత్కచుడు జన్మించాడు. కథాకథనంలో నన్నయ వేగాన్ని ప్రదర్శించాడు. భీముడు బకాసురుని సంహరించాడు.

ద్రౌపదీ వివాహం:

సప్తమాశ్వాసంలో ద్రౌపదీ స్వయంవర వృత్తాంతం ప్రశస్తం. మత్స్య యంత్రాన్ని ఛేదించి అర్జునుదు ద్రౌపదిని జయిస్తాడు. కుంతీదేవి అనుజ్ఞతో ద్రౌపదిని పాండవులు ఐదుగురు భార్యగా స్వీకరిస్తారు. ద్రౌపది వివాహ మహోత్సవాన్ని ద్రుపదుడు వైభవంగా నిర్వహించాడు.

ధృతరాష్ట్రుడు పాండుపుత్రులను హస్తినాపురానికి ఆహ్వానిస్తాడు. నారదుని సూచన మేరకు పాండవులు ఒక్కొక్కరు ఒక్కొక్క ఏడు ద్రౌపదితో సంసారం చేసే ఏర్పాటు చేసి వెళ్ళాడు. అర్జునుడు ద్వారకకు వెళ్ళి సుభద్రను వివాహామాడాడు. సుభద్రార్జునుల ప్రణయాన్ని నన్నయ భట్టారకుడు రమణీయంగా వర్ణించాడు.

అలయక నాడు నాటికి లతాంగి అపూర్వములైన భోజనం
బులు గడుభక్తి పెట్టుచున్, అపూర్వములైన వపుర్విలాసయు
క్తులు వెలయించుచున్‌, ముదముత పెనిచెన్‌ మరి నాడు నాటి క
గ్గల మగుచుండ నెయ్యమును, కామవికారము సవ్యసాచికిన్‌.
(ఆదిపర్వం, అష్టమా – 183వ పద్యం)

సభాపర్వం:

భారత కథాగమనంలో సభాపర్వం ఒక మలుపు. ధర్మరాజు జూదంలో తన తమ్ములను, భార్యను వొడ్డి ఓడిపోయాడు. దుశ్శాసనుడు నిండు సభలో ద్రౌపది కట్టిన పుట్టాన్ని వొలిచాడు. భీమసేనుడు ఉగ్రుడై శపథం పట్టాడు.

మ:

కురువృద్ధుల్‌ గురువృద్ధబాంధవు లనేకుల్‌ సూచుచుండన్‌ మదో
ద్ధురుడై ద్రౌపది నిట్లు సేసిన ఖలున్‌ దుశ్శాసనున్‌ లోకభీ
కరలీలన్‌ వధియించి తద్విపులవక్షశ్శైలరక్తౌఘ ని
ర్ఝర ముర్వీపతి సూచుచుండ నని నాస్వాదింతు నుగ్రాకృతిన్‌.
(సభాపర్వం, ద్వితీయా – 233వ పద్యం)

దృతరాష్ట్రుడు ద్రౌపది కోరిన వరాలిచ్చి పాండవులను దాస్య విముక్తులను చేశాడు. ధర్మరాజు శకునితో రెండో మారు జూదమాడటమ్ గూర్చి పలువురు పలు రకాలుగా విమర్శిస్తారు. చివరకు పాండవులకు అరణ్యవాసం అగత్యమైంది.

సభా పర్వంలోనే మయసభ నిర్మాణం, జరాసంధ వధ, ధర్మజుని రాజసూయ యాగము, శిశుపాల వధ కథాక్రమంలో వస్తాయి.

అరణ్యపర్వం:

పాండవులు ద్వైతవనం చేరుకొన్నారు. అర్జునుడు పాశుపతాస్త్రం సంపాదించాడు. ఈ పర్వంలో నలదమయంతుల కథ ప్రసక్తమైంది. భీముడు సౌగంధికాపహరణం చేశాడు. చతుర్థాశ్వాసంలో 142వ పద్యంలొ నన్నయ రచన పరిసమాప్తమైంది. నన్నయ చివరి పద్యం:

ఉ:

శారదరాత్రు లుజ్జ్వల లసత్తరతారకహారపంక్తులన్
చారుతరంబు లయ్యె వికసన్నవకైరవగంధబంధురో
దార సమీరసౌరభము దాల్చి సుధాంశువికీర్యమాణ క
ర్పూర పరాగపాండు రుచిపూరము లంబరపూరితంబు లై.
(అరణ్యపర్వం, చతుర్థా – 142వ పద్యం)

ఇక్కడ ‘పరపూరితంబులై’ అని సాహిత్యవేత్తలు భావించారు.

ఎర్రన ప్రారంభించిన పద్యంలో – “స్ఫురదరుణాంశురాగరుచి పొంపిరి వోయి” అని వుంది. అరుణాంశు అంటే ఎర్రన స్ఫురిస్తాడు. వేల సంవత్సరాలుగా ఆంధ్రమహాభారతం ఆంధ్రుల కారాధ్య గ్రంథమైంది. రామాయణానువాదాలు చాలా వచ్చాయి గాని, మహాభారతానికి ఆ అవసరం రాలేదు. శ్రీకృష్ణ భారతం మినహాయించి భారతాంధ్రీకరణకు పూనుకోవాల్సిన అగత్యం లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here