కావ్య పరిమళం-14

1
7

[box type=’note’ fontsize=’16’] సాహిత్య విశిష్టతలోనూ, కథాకథన శిల్పంలోనూ, పద్య రచనా చమత్కృతిలోనూ, శైలి విన్యాసంలోనూ మధురాలైన ప్రాచీన కావ్యాల పరిమళాలను అందిస్తున్నారు డా. రేవూరు అనంతపద్మనాభరావు. [/box]

పోతన భాగవతం

[dropcap]ఆం[/dropcap]ధ్రుల కారధ్య గ్రంథమైన మహాభాగవతం రచించిన బమ్మెర పోతనామాత్యుడు మృదుమధుర కవితా ధారలు వెలయించిన పుణ్యజీవి. శ్రీనాథుని బావగారు. ఆంధ్ర మహాభాగవతాన్ని పోతన 1 నుంచి 4, ఏడు నుంచి పది స్కంధాలను తెనిగించాడు. గంగన ఐదవ స్కంధం, పర్చూరి సింగన ఆరవ స్కంధం, 11, 12 స్కంధాలను వెలిగందల నారయ రచించారు.

“శ్రీ కైవల్య పదంబు చేరుటకై చింతించెదన్” అని భాగవతానువాదం ప్రారంభించాడు పోతన. ఐహిక సుఖ భోగాలను ఆయన కోరలేదు. “ఇమ్మనుజేశ్వరాధముల కిచ్చి” కవితలు చెప్పనని శపథం చేశాడు. నిమీలిత నేత్రుడైన పోతనకు శ్రీరామచంద్రుడు కనిపించి భాగవతం వ్రాయమని ఆదేశించాడు. ‘పలికెడిది భాగవతమట, పలికించెడివాడు రామభద్రుండట!’ అని భక్తి పారవశ్యంతో పులకరించిపోయాడు పోతన. శ్రీరామాంకితంగా భాగవతం రచించాడు.

మొదటి తొమ్మిది స్కంధాల కథ:

భాగవతం కేవలం శ్రీకృష్ణుని చరిత్ర మాత్రమే కాదు. మొదటి రెండు స్కంధాలలో – అర్జునుడు ఉపపాండవులను సంహరించిన అశ్వత్థామను అవమానించడం, శ్రీకృష్ణుడు ఉత్తర గర్భంలో వున్న బిడ్డను (పరీక్షిత్తును) రక్షించడం, భీష్మ నిర్యాణం, శ్రీకృష్ణుడు ద్వారకానగరానికి వెళ్ళి అంతఃపుర కాంతలను చూడడం, పరీక్షిత్తు జననం, గాంధారీ దృతరాష్ట్రుల దేహత్యాగము, శ్రీకృష్ణ నిర్యాణము, ధర్మరాజు పరీక్షిత్తుకు పట్టాభిషేకం చేయడం, పరీక్షిత్తుకు విప్రశాపము మొదలైన ఘట్టాలన్నీ వర్ణింపబడ్డాయి. మూడో స్కంధంలో వరాహావతారంలో హిరాణ్యాక్షుని సంహరించడం, దక్షుని యజ్ఞం వీరభద్రుడు ధ్వంసం చేయడం; నాల్గవ స్కంధంలో ధ్రువుని చరిత్ర, పృథు చక్రవర్తి వృత్తాంతం; ఐదవ స్కంధంలో భరతోపాఖ్యానం; ఆరవ స్కంధంలో అజామీళుని కథ, చిత్రకేతుని కథ; ఏడవ స్కంధంలో ప్రహ్లాద చరిత్ర; ఎనిమిదో స్కంధంలో గజేంద్ర మోక్షణం, క్షీరసాగర మథనం, వామనావతారం, మత్య్సావతారం; తొమ్మిదో స్కంధంలో అంబరీషుని కథ, పరశురాముని చరిత్ర, రంతిదేవుని కథ – ప్రధానాంశాలుగా కొనసాగాయి.

పోతన భక్తి తాత్పర్యాలు:

ఆచార్య పింగళి లక్ష్మీకాంతం పోతన భక్తి భావాన్ని ఇలా వివరించారు: “తెలుగు కవులలో శ్రీకృష్ణ నామాత్మకమైన భాగవత తత్వ ప్రబోధము ప్రారంభించిన భక్త కవి యోగి పోతనయే. అంతే కాదు, వంగదేశమున రాధాకృష్ణ మత సంప్రదాయమును నెలకొల్పి దేశమెల్లెడెల దానిని వ్యాపించజేసిన చైతన్యస్వామి, పోతన తరువాత ఏబది సంవత్సరములకు అవతరించెను. కావున చైతన్యావతారమునకు ముందే ఈ ఆంధ్ర భక్త యోగి కృష్ణ తత్వమును మనదేశమున గానము చేసి ఆంధ్రుల మనోలోకమున ఒక పరివర్తనమును తెచ్చెను.” (ఆంధ్ర సాహిత్య చరిత్ర – పుట 319).

పోతన భోగినీ దండకాన్నీ, వీరభద్ర విజయాన్నీ రచించాడు. “కాటుక కంటనీరు చనుకట్టు పయింబడ ఏల ఏడ్చెదో” అని సరస్వతిని ఓదార్చాడు. అంతే కాదు, “బాల రసాలసాల నవ పల్లవ కోమల కావ్యకన్యకను” పొట్ట కూటి కోసం రాజుల కివ్వడాన్ని నిరసించాడు. వేదమనే కల్పవృక్షం నుంచి భాగవతమనే ఫలం జారిపడింది. భాగవతం పురాణమే అయినా, పోతన కావ్యంలా మలచాడు. మానవ జీవన గమనాన్ని బోధించే భక్తితత్వాన్ని భాగవతంలో నిక్షిప్తం చేశాడు.

“చేతులారంగ శివుని పూజింపడేని
నోరునొవ్వంగ హరికీర్తి నుడువడేని
దయయు సత్యంబు లోనుగా దలపడేని
కలుగనేటికి దల్లుల కడుపుచేటు” – అని చెబుతూ మానవ జన్మకు భగవద్భక్తి తప్పనిసరి అని గుర్తు చేశాడు.

నవవిధ భక్తి తత్వాన్ని విస్తారంగా చెప్పాడు పోతన.

“తను హృద్భాషల సఖ్యమున్, శ్రవణమున్, దాసత్వమున్, వందనా
ర్చనముల్, సేవయు, నాత్మలో ఎఱుకయున్, సంకీర్తనల్, చింతనం
బను నీ తొమ్మిది భక్తి మార్గముల సర్వాత్మున్ హరిన్ నమ్మి స
జ్జనుడై యుండుట భద్రమంచు దలతున్ సత్యంబు దైత్యోత్తమా!”

ప్రహ్లాద చరిత్రలో భక్తి పారమ్యం విశదంగా చెప్పబడింది. బాలభక్తులైన ధ్రువుడు, ప్రహ్లాదుడు భగవంతుని దర్శన భాగ్యం పొందిన వ్యక్తులు. గజేంద్ర మోక్షణం, అంబరీషోపాఖ్యానం, రంతిదేవుని చరిత్ర వంటివి ఉపాఖ్యానాలు ధర్మరీతికి నిదర్శనాలు. దైవ కృప మాత్రమే శరణ్యం అని ఈ కథలు వివరిస్తాయి. ‘నీవే తప్ప ఇతఃపరంబెరుగ’నని శరణు వేడుకోవాలి.

భాగవత మకరందం:

‘మందార మకరంద మాధుర్యం’లో తేలియాడినట్లుగా భాగవత పఠనం ఆనందాన్ని కలుగజేస్తుమ్ది. దశమస్కంధంలో శ్రీకృష్ణుని బాల్య చేష్టలు మొదలు రుక్మిణీ కల్యాణ ఘట్టాదులు ప్రసాద మాధుర్యం కలిగి వుంటాయి. ఆచార్య దివాకర్ల వెంకటావధాని ఇలా ప్రశంసించారు: “తెలుగు భాష మాధుర్యమును చవిచూడవలెనన్న భాగవతమునే పఠింపవలయును. పోతన కవిత్వమున అక్షరరమ్యత మెండు”. శబ్దాలంకారాలు పోతన కవితా మాధుర్యానికి ముఖ్య కారణాలు.

“అడిగెదనని కడువడి జను
అడిగిన తను మగుడ నుడవడని నెడనుడుగన్
వెడవెడ జిడిముడి తడబడ
అడుగిడు అడుగిడదు జడిమ నడుగిడు నెడలన్

గజేంద్ర మోక్షంలో విష్ణువు త్వరగా వెళుతున్నప్పుడు లక్ష్మీదేవి తడబాతును తెలిపే పద్యమిది.

శ్రీకృష్ణుని పాఠకులు కళ్ళముందు నిలబెట్టగాలిగాడు పోతన.
“నల్లనివాడు, పద్మనయనంబులవాడు, కృపారసంబు పై
జల్లెడువాడు, మౌళిపరిసర్పిత పింఛమువాడు, నవ్వు రా
జిల్లెడు మోమువా డొకడు, చెల్వల మానధనంబు తెచ్చెనో
మల్లియలార! మీ పొదలమాటున లేడు కదమ్మ చెప్పరే!”

– ఈ పద్యం హృద్యం.

ఆంధ్రుల నాలుకపై:

పోతన పద్యాలు తెలుగువారికి కంఠోపాఠాలు. పల్లె జనాల నాలుకల మీద నర్తించే పదాలవి.

“ఎవ్వనిచే జనించు జగమెవ్వాని లోపలనుండు” అనే ప్రార్థనా పద్యం పాఠశాలల్లో పారాయణం చేస్తారు. “ఓయమ్మ నీ కుమారుడు, మా యిండ్లను పాలు పెరుగు మననీడమ్మా!” అనే పద్యంలో గోపవనితలు యశోదతో శ్రీకృష్ణుని అల్లరి చేష్టలు ఫిర్యాదు చేస్తారు.

వారిజాక్షులందు వైవాహికము లందు
ప్రాణ విత్త మాన భంగమందు
చకిత గోకులాగ్ర జన్మ రక్షణ మందు
బొంకవచ్చు అఘము పొంద దధిప!

అని శుక్రాచార్యుడు బలిచక్రవర్తితో పలికిన పలుకులు నీతి బోధకాలు. “ఊరకరారు మహాత్ములు, ఇందుగలదండు లేడని, ఇంతింతై వటుడింతయై” అనే నానుడులు లోకంలో ప్రచారం పొందాయి.

పోతన కవితా రీతులు:

“తిక్కన కవితా ప్రతిభ నాటకీయమైనట్లే, పోతనది భావకవితా ప్రతిభ. తిక్కన శైలి బుద్ధిగమ్యము. పోతన శైలి కర్ణపేయము. భాగవతము ప్రధానమైన పురాణమగుటయు, ఈ కవి వతంసుడు మహా భక్తుడగుటయు కారణములుగా అందరి భక్తులతో ఈయన కవితాత్మకు తాదాత్మ్యము కలిగి వారే తానుగా, తానే వారుగా వర్తించుచున్నాడా? అనెడి ఊహను కలిగించుము. అందును భక్తి శృంగార భావ పరిపోషణమునందు పోతన అతి మాత్రమునకు పాల్పడు భావలోలుడు” అని వివరించారు ఆచార్య పింగళి లక్ష్మీకాంతం (ఆంధ్ర సాహిత్య చరిత్ర – పుట 323).

పోతన అనుభవించిన దారిద్ర్యం, దాని నెదుర్కొని పోరాడిన ధీరత్వం ఆశ్చర్యజనకములై ఆయన ఎడ పూజ్యభావాన్ని పాఠకులకు కలిగిస్తాయి. ఆయన కావ్యశిల్ప మర్యాదలకు కట్టుబడినవాడు కాడు. అట్టి ధర్మాలకు అన్నిటికీ అతీతుడైన పరమ భాగవతాగ్రగణ్యుడు. బృందావన విహార వేళలలో పోతన హృదయం ఆనందంతో ఉప్పొంగిన యమునానది వలె శృంగార రస ప్రాధాన్యం వెల్లివిరిసింది. పోతన శృంగారం ప్రబంధ శృంగారం వంటిది కాదని గుర్తించాలి. జీవేశ్వరైక్య ప్రతిపాదకమైన ఆధ్యాత్మిక శృంగారమది. అందువల్ల శృంగార రసరాజం భాగవతంలో పరమ పవిత్రమైంది.

పోతన రచనాశైలిలో భిన్నత్వం కన్పిస్తుంది. తెలుగు, సంస్కృత భాషలు రెండింటిలోను నేను అందరినీ మెప్పిస్తానని పోతన ప్రతిజ్ఞ చేస్తూ, “కొందరికి తెలుగు గుణమగు, కొందరికిని సంస్కృతంబు గుణమగు, నేనందరి మెప్పింతు కృతల నయైయెడలన్” అంటాడు. అష్టమ స్కంధంలో స్వర్గ వర్ణన, దశమ స్కంధంలో శ్రీకృష్ణుని బాల్యక్రీడలు అచ్చతెనుగులో సాగాయి. కొన్ని వర్ణనలు తత్సమ పదాలతో నిండి వున్నాయి. పద సౌకుమార్యం, అనుప్రాసాది అలంకార వైచిత్రి ఆయన పద్యాలకు వన్నె చేకూర్చాయి. ఆయన సహజ పాండిత్యమబ్బిన కవిశేఖరుడు. భక్తి, జ్ఞాన, కర్మయోగాలలో సులభమైన భక్తిమార్గాన్ని పోతన ప్రధానంగా స్వీకరించి అద్వైత తత్వాన్ని వివరించాడు. అందుకే భాగవతం ఆంధ్రుల ఆరాధ్య గ్రంథమైంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here