కావ్య పరిమళం-24

1
6

[box type=’note’ fontsize=’16’] సాహిత్య విశిష్టతలోనూ, కథాకథన శిల్పంలోనూ, పద్య రచనా చమత్కృతిలోనూ, శైలి విన్యాసంలోనూ మధురాలైన ప్రాచీన కావ్యాల పరిమళాలను అందిస్తున్నారు డా. రేవూరు అనంతపద్మనాభరావు. [/box]

సూరన ప్రభావతీ ప్రద్యుమ్నం

[dropcap]పిం[/dropcap]గళి సూరన కవిత్వ జీవితాన్ని ఆచార్య పింగళి లక్ష్మీకాంతం 1540-70ల మధ్య కాలంగా ఆంధ్ర సాహిత్య చరిత్రలో నిర్ధారించారు. సూరన రచించిన మూడు గ్రంథాలు విశిష్టమైనవి – కళాపూర్ణోదయము, రాఘవపాండవీయము, ప్రభావతీ ప్రద్యుమ్నం. ప్రభావతీ ప్రద్యుమ్నాన్ని సూరన తన తండ్రి యైన అమరామాత్యునికే అంకితమివ్వడం విశేషం. సంస్కృత హరివంశంలో వజ్రనాభ వధ వృత్తాంతం వుంది. విష్ణుపర్వంలో ఈ కథ వుంది. మలయాళంలో రవివర్మ అనే రాజు ప్రభావతీ ప్రద్యుమ్నాన్ని నాటకంగా వ్రాశాడు. సూరన వ్రాసిన కావ్యాన్ని కొంచెం మార్పులతో నాటకంగా చేయవచ్చు. కథా సన్నివేశాలు, శైలి నాటకీయంగా ఉన్నాయి. పాత్ర నిర్మాణం విషయంలో శుచిముఖి పాత్ర సజీవం. శ్రీనాథుని శృంగార నైషధంలో హంసదూత్యం వలె ఇక్కడ శుచిముఖి రాయబారం నడిపింది.

శుచిముఖి:

శుచిముఖి ఈ కావ్యంలో ప్రధాన పాత్ర. ఈ హంస ఇంద్రునికే ఉపాయం చెప్పగల దిట్ట. నాయికానాయకులైన ప్రభావతీ ప్రద్యుమ్నులకు తన సంభాషణా చతురతతో కలిపింది. వజ్రనాభుని దేవతలచే చంపించింది. బుద్ధిబలంలో తాను అసామాన్యమైనది. సూరన మాటల్లో శుచిముఖి:

“శుచిముఖి యండ్రు దానిని వచో నిపుణత్వమునందు సత్కథా
రచనలయందు నీతివిధురత్వమునందు బహుశ్రవోవలో
క చరణతయందు ఎందు సరిగానము, దానికి వేయునేల? దా
ని చతురతా విశేషములు నీవె కనన్ వలయునన్ మహాత్మకా” (4-57)

దాని మాట నేర్పరితనం ఇంద్రుని సంతోషపరిచింది. శుచిముఖి కోసమే సూరన ఈ కావ్యం వ్రాశాడని పండితుల అభిప్రాయం. శుచిముఖిని పెంచి పెద్ద చేసింది సరస్వతీదేవి. అందువలన బుద్ధికుశలత, వాగ్ధాటి అలవడ్డాయి.

పరిశోధన:

ప్రభావతీ ప్రద్యుమ్న కావ్య విమర్శ పేర రాచపాళెం చంద్రశేఖరరెడ్డి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆచార్య జి.యన్.రెడ్డి పర్యవేక్షణలో పరిశోధన చేసి ‘శిల్ప ప్రభావతి’ అనే గ్రంథాన్ని 1980లో ప్రచురించారు. సూరన శైలిని గూర్చి ఆయన విశ్లేషిస్తూ – “రాఘవపాండవీయములో సూరన కవల శబ్దశక్తినే చూపినాడు. ప్రభావతీ ప్రద్యుమ్నములో భావసంపద దానిమ్మ గింజ వలె గర్భీకృతమై ఉన్నది” (పుట-253). “సూరన కవితా శైలి ఈ కావ్యం నాటికి పండిన పసుపు వలెనైనది. ప్రభావతీ ప్రద్యుమ్నంలో తన ప్రస్తర పదార్థము నంతటిని తొలగించుకొని, 16వ శతాబ్దాపు శిల్పకళవలె చూడముచ్చటైనది. శబ్దప్రయోగము, నుడికారపు సొంపు, సంభాషణా చాతుర్యము, కథాకథనము – వీనిలో ముడులు వీడి ప్రభావతీ ప్రద్యుమ్నము ‘పులుగడుగంగబడ్డ ముత్య’మైనది. భావ ప్రకటనలో స్పష్టత, పద్యరచనలో నాగరికత ఎక్కువైనవి… సంపూర్ణ శ్లేష కావ్యమును (రాఘవపాండవీయము) రచించిన సూరన కళాపూర్ణోదయములో 90 పాళ్ళు తగ్గించి, ప్రభావతీ ప్రద్యుమ్నములో ఆ శ్లేషను దాదాపు అమావాస్య నాటి చంద్రుని చేసినాడు” అని చంద్రశేఖరరెడ్డి అభిప్రాయపడ్డారు (పుట 254).

ప్రభావతీ ప్రద్యుమ్న కావ్యాన్ని 2008లో ఎమెస్కో ప్రచురణ సంస్థ విశ్వనాథవారి కమనీయ పీఠికతో ప్రచురించింది. ఈ కావ్య శిల్ప లక్షణాన్ని విశ్వనాథ ఇలా విశ్లేషించారు: “ఈ కావ్యములోని ప్రధాన విషయములో శుచిముఖి యన్న ఆడహంసను చిత్రించుట ప్రధానం. ఇంకొక విశేషం భద్రుడనే నటుని ప్రవేశపెట్టడం. ఆ భద్రుని నుండి వజ్రపురీ ప్రవేశమార్గాలని విచారించి నిర్ణయించడం. దీనిని ఉపశ్రుతి యందురు. ఇది ఒక శిల్ప లక్షణం. కావ్యం మొదలుపెట్టుచూ ఇంద్రుడును, మాతలియు వచ్చి ద్వారకా నగర వర్ణన చేయుట మరొక శిల్ప లక్షణం. కథను ఏదియో మలుపు మలగించి చమత్కారంగా చెప్పడం ఈ కవి కెక్కువ ఇష్టం. ఇది తత్పూర్వ కవుల మార్గం కాదు. ఈయన ప్రత్యేకత.” (పుట 21,22).

కథాకథనం:

రుక్మిణీ కృష్ణుల కుమారుడు ప్రద్యుమ్నుడు. ఆయన పూర్వజన్మలో మన్మథుడు. ఆయన శివుని కంటిమంటలో మసియాయెను. ఆయనకు ఇన్నాళ్ళ వరకు శరీరమే లేదు. ఈ జన్మలో ఇలా శరీరం వచ్చింది. మన్మథుని అందం ప్రద్యుమ్నునిలో వచ్చింది. ఇక నాయికయైన ప్రభావతి వజ్రనాభుడనే రాక్షసరాజు కూతురు. ఆయన వజ్రనాభపురానికి అధిపతి. శత్రువులు జోరరాని పట్టణమది. పార్వతీదేవి వరం వలన ఆయనకు ప్రభావతి కుమార్తెగా పుట్టింది. వజ్రనాభుడు ఇంద్రునితో తగవు పడిన రాక్షసుడు. మరి దేవతలకు చెందిన ప్రద్యుమ్నునికీ, రాక్షస వనిత ప్రభావతికీ పెళ్ళి జరుగుతుందని పార్వతి చెప్పింది. అది ఎలా సాధ్యం? ఈ ఉత్కంఠ ఈ కథలో ప్రధానం.

బ్రహ్మ యిచ్చిన వరాల గర్వంతో మత్తెక్కిన వజ్రనాభుడు ఇంద్రలోకానికి వెళ్ళి ఇంద్రుని సభలో ఆసనాలన్నింటినీ ఆక్రమించాడు. ఇంద్రుడు ఎంత బ్రతిమాలినా వినలేదు ఆ రాక్షసుడు. “నీవెన్నాళ్ళు రాజ్యం చేశావో అన్నాళ్ళు నేనూ రాజ్యం చేస్తా”నని మొండి పట్టు పట్టాడు.

ఇద్దరికీ కశ్యప ప్రజాపతి తండ్రి. ఆ తండ్రి వద్దకు వెళ్ళి వీరు తమ తగాదా చెప్పారు. ఆయన అప్పుడు యజ్ఞం చేస్తున్నాడు. ప్రస్తుతానికి నీవు మీ పట్టణానికి వెళ్ళిపొమ్మని వజ్రనాభునికి హితవు చెప్పాడు. ఈలోగా ఇంద్రుడు శ్రీకృష్ణుని వద్దకు వెళ్ళి తన గోడు విన్నవించుకొన్నాడు. శ్రీకృష్ణుడు అతన్ని ఓదార్చాడు.

ఆ సమయంలో వసుదేవుడు యజ్ఞం చేస్తున్నాడు. అక్కడికొక నటుడు – భద్రుడనేవాడు – తన విద్యా ప్రదర్శనకు వచ్చాడు. అతని విద్యకు మునులు సంతోషించి వరాలిచ్చారు. కృష్ణునకొక ఆలోచన వచ్చింది. భద్రుని వజ్రనాభపురానికి పంపి తన కార్యం చక్కబెట్టుకోవాలని భావించాడు. అదే సమయంలో దేవలోకంలో హంసయిన శుచిముఖి ఇంద్రుని కంటపడింది. ఆ ఆడహంస ద్వారా పని చక్కబెట్టవలెననే ఆలోచన అతనికి కలిగింది.

రాక్షస రాజ్యంలో ప్రభావతికి ఒక స్వప్నం వచ్చింది. పార్వతిదేవి కనిపించి “నీకు ప్రద్యుమ్నునితో వివాహం కాగలదు. అతడు వజ్రనాభపురానికి పట్టాభిషిక్తుడు కాగలడు” అని ఆశీర్వదించి ప్రద్యుమ్ముని చిత్రపటాన్ని బహుకరించింది. – ఈ కథను శుచిముఖి ఇంద్రునికి తెలిపింది. శుచిముఖి బ్రహ్మదేవుని గుర్రములలో ఒకడైన సారంగధరుని బిడ్డ. సరస్వతి దానిని పెంచింది. ఇంద్రుడు ఆ శుచిముఖి శ్రీకృష్ణుని వద్దకు పంపి భవిష్యత్ కార్యక్రమం చక్కదిద్దమన్నాడు.

శుచిముఖి కృష్ణుని ఉద్యానవనంలో సంచరిస్తూ ఇంద్రుని వర్తమానం తెలియజేసింది. తిరుగుప్రయాణంలో ప్రద్యుమ్నుని కలిసి ప్రభావతీ సౌందర్యాన్ని వర్ణించింది. ప్రద్యుమ్నుడు ప్రభావతి పట్ల అనురాగం పెంచుకున్నాడు. ఆమెకొక ఉత్తరం తయారుచేసి ఒక చిలుక రెక్కలతో దాచి బిగించికట్టి ప్రభావతి కడకు పంపాడు. అక్కడ ప్రభావతి ప్రద్యుమ్నునిపై విరహంతో తపిస్తోంది. పార్వతి యిచ్చిన ప్రద్యుమ్నుని చిత్రపటాన్ని చూసి పరవశిస్తోంది.

“కలకల నవ్వినట్లు, తెలికన్నుల నిక్కమ చూచినట్ల, తో
పలుక కడింగినట్లు, కడు భావ గంభీరత లబ్బినట్ల, పెం
పొలయ తనర్చి జీవకళ యుట్టిపడన్ శివ వ్రాసినట్టి ఆ
చెలువన కాభిముఖ్యము భజింప తలంకెను తాను, బోటియున్.” (1-138).

ఆ చిత్రపటాన్ని చూచి ప్రభావతి మదనోద్రేకం పొందింది. అదే సమయంలో శుచిముఖి ఆమెను సమీపించి ప్రద్యుమ్నుడు పూర్వజన్మమున మన్మథుడని వివరించింది. ద్వారకలో అతని నివాసమనీ, రుక్మిణీకృష్ణుల కుమారుడనీ తెలిసింది. చిలుక ద్వారా ప్రద్యుమ్నుడు పంపిన ఉత్తరం ప్రభావతి అందుకొంది.

వజ్రనాభునికి ఒక తమ్ముడు సునాభుడు. అతనికి చంద్రవతి, గుణవతి – అని ఇద్దరు కుమార్తెలు. వారికి యదువంశంలో జన్మించిన గదుడు, సాంబుడు భర్తలు కాగలరని నారదుడు చెప్పాడు. వారు తమ భర్తలను గూర్చి విరహపడుచుండగా ఈ చిలుక వారి సంగతి ద్వారకకు వెళ్ళి కనుగొని వస్తానని హితవు పలికింది. ప్రభావతి ద్వారా శుచిముఖి వజ్రనాభుని వద్దకు చేరుకొంది.

శుచిముఖి ద్వారా భద్రుడనే నటుని విశేషాలు తెలుసుకొన్న రాక్షసరాజు భద్రుని తన కొలువులో ప్రదర్శనకు ఆహ్వానించాడు. భద్రుని నటవర్గంలో పాత్రధారులుగా ప్రద్యుమ్నుడు, గదుడు, సాంబుడు నగరం ప్రవేశం చేశారు. మారువేషాలతో వారు నాటకంలో నటించారు. అంతఃపుర స్త్రీలు వారి నటనను తెరచాటు నుంఛి గమనిస్తూ వచ్చారు. ఆ రాత్రి ప్రభావతి వద్దకు ప్రద్యుమ్నుడు అంతఃపురంలో తుమ్మెద వలె ఒక పూవు వలె దాగి ప్రవేశించాడు. వారి కలయిక జరిగింది. ప్రద్యుమ్నుడు తమ విడిది ప్రవేశం నుండి నేలలో ఒక పెద్ద సొరంగం ప్రభావతి అంతఃపురం వరకు త్రవ్వి రాకపోకలు గదునితో, సాంబునితో యథేచ్ఛగా సాగించాడు.

అంతఃపుర ద్రోహాన్ని తెలుసుకొన్న వజ్రనాభుడు మండిపడ్డాడు. ప్రద్యుమ్నాదులు రాక్షససైన్యాన్ని నుగ్గునూచ చేశారు. ప్రభావతి అనుమతితో ప్రద్యుమ్నుడు వజ్రనాభునితో తలపడ్డాడు. అతనికి ఇంద్రోపేంద్రులు సాయపడ్డారు. విజయం వరించింది. ప్ర్రభావతి, చంద్రవతి, గుణవతి గర్భవతులయ్యారు. వారికి మగపిల్లలు కలిగారు. పుట్టగానే వారు యౌవనవంతులయ్యారు.

ఈ విధమైన కథాసంవిధానాన్ని సూరన అద్భుతంగా నిర్వహించాడు. ఈ కావ్యంలో మొత్తం 806 గద్యపద్యాలున్నాయి. అందులో 460 పద్యగద్యాలు సంభాషణ రూపంలో వుండి జాజిపందిరి విచ్చినట్లు పరిమళించాయి. కొన్ని నాటక పరిభాషలో ప్రశ్నోత్తర రూపంలో ఉన్నాయి. ఇందులో శృంగారం అంగిరసం. వీరం ప్రధానాంగ రసం.

శుచిముఖి కవిత్వాన్ని సరస్వతి మెచ్చి బిరుదప్రదానం చేసిన ఘట్టం అద్భుతం.

“నలినజో రాణివాస మొకనాడు ననున్ తనచేతి ప్రోది రా
చిలుకను వాడుకున్ కవిత చెప్పగ తా నియమించి, అందునా
పలుకుల కొంత వాసి గని భావమునన్ కడు మెచ్చుచున్ సఖా
చలమున నాదు రెక్క నులిచక్కగ దువ్వుచు గారవించుచున్.” (2-91).

“ఉపమాతిశయోక్తి కామధేను” బిరుదమిచ్చిందట. ఆ బిరుడు పింగళి సూరనకు సరిపోతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here