కావ్య పరిమళం-29

0
7

[box type=’note’ fontsize=’16’] సాహిత్య విశిష్టతలోనూ, కథాకథన శిల్పంలోనూ, పద్య రచనా చమత్కృతిలోనూ, శైలి విన్యాసంలోనూ మధురాలైన ప్రాచీన కావ్యాల పరిమళాలను అందిస్తున్నారు డా. రేవూరు అనంతపద్మనాభరావు. [/box]

రుద్రకవి నిరంకుశోపాఖ్యానం

[dropcap]కం[/dropcap]దుకూరు రుద్రకవి ప్రస్తుత ప్రకాశం జిల్లా చింతలపాళెం గ్రామ వాస్తవ్యులు. మల్కిభరాం రుద్రకవికి చింతలపాళెం గ్రామాన్ని అగ్రహారంగా ఇచ్చాడని తెలిపే తామ్రశాసనం లభిస్తోంది. రుద్రకవి రాయల ఆస్థానం భువనవిజయం సభలో ఈశాన్య పీఠంలో 12 సంవత్సరాలు ఆశీనుడైనాడని చాటువులు చెబుతున్నాయి.

రుద్రకవి రచనలపై నేను (అనంతపద్మనాభరావు) పరిశోధన చేసి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం నుండి 1976లో పి.హెచ్.డి. పట్టా పొందాను. లభించిన ఆధారాల ద్వారా రుద్రకవి క్రీ.శ. 1480-1560 మధ్యకాలము వాడని నిర్ధారించాను. ఆచార్య కొర్లపాటి శ్రీరామమూర్తి తమ సాహిత్య చరిత్రలో దీనిని అంగీకరించారు.

రుద్రకవి రచనలు:

రుద్రకవి నిరంకుశోపాఖ్యాన కావ్యాన్ని, సుగ్రీవ విజయం యక్షగానాన్ని, జనార్దనాష్టకాన్ని, బలవదరీశతకాన్ని వ్రాశాడు. శతకంలో ఒక పద్యం బాగా ప్రసిద్ధం. వేటూరి ప్రభాకరశాస్త్రి గారు మూడు పద్యాలు ప్రకటించారు. పాలసముద్రంలో శేషతల్పం మీద (బుసలు కొడుతుంటే) నీకెలా నిద్ర పడుతుందని కవి ప్రశ్నిస్తాడు:

కలశ పయోధి మీద తరగల్ మరి హోయని మ్రోయ వేయుభం
గుల తలపాన్పు పాము బుసకొట్టగ నేగతి నిద్రజెందెదో
అలసత తండ్రి! చీమ చిటుకన్నను నిద్దురరాదు మాకు ఓ
బలవదరీ దరీకగహర భాస్వదరీ యదరీదరీ! హరీ!

శతకం గాక సరస మనోరంజనమనే మరో గ్రంథం రుద్రకవి వ్రాసినట్లు స్వర్ణసుబ్రమణ్యకవి పేర్కొన్నారు. రుద్రకవి ‘జనార్దనాష్టకం’ ఎన్నటికీ వాడని ‘పుష్పమంజరి’ యని ఆచార్య పింగళి లక్ష్మికాంతం ప్రశంసించారు. మత్తకోకిలకు మాత్రాఛందస్సులో ఈ పద్యాలు కూర్చబడ్డాయి. పది పద్యాలను ఆరుద్ర పీఠికతో బాపు బొమ్మలతో ప్రచురించారు. రెండో దఫా నా  పీఠిక కూడా కలిపి యస్.పి.బాలసుబ్రహ్మణ్యం సౌజన్యంతో ముద్రింపబడింది. అద్భుత శృంగారం, దక్షిణ నాయకుని అధిక్షేపన ఇందులో ప్రధానం.

సిరులు మించిన పసిడి బంగరు జిలుగు దుప్పటి జారగా
చరణపద్మము మీద దేహము చంద్రకాంతులు దేరగా
మురువు జూపుచు వచ్చినావో! మోహనాకృతి మీరగా
గరుడవాహన! దనుజమర్దన! కందుకూరి జనార్దనా!
తెలుగులో అష్టక సాహిత్యం అంతగా ఆదరణకు నోచుకోలేదు.

నిరంకుశోపాఖ్యానం:

కథాసరిత్సాగరంలోని ఒక ఉపకథ ఆధారంగా రుద్రకవి ఈ ప్రబంధాన్ని అష్టాదశ వర్ణనలతో తీర్చిదిద్దాడు. కావ్యాన్ని కందుకూరు లోని సోమేశ్వరస్వామికి అంకితమిచ్చాడు. సుగ్రీవ విజయం యక్షగానాన్ని కందుకూరులోని జనార్దన స్వామికి అంకితమిచ్చాడు. నిరంకుశోపాఖ్యానం నాలుగాశ్వాసాల కావ్యం. తెలుగు విశ్వవిద్యాలయం 1999లో సుబ్రహ్మణ్య కవి సుధా తరంగిణీ వ్యాఖ్యానంతో ప్రచురించింది. ఇందులో కల్పిత కథ అద్భుతం.

రుద్రకవి తన గురించి వివరిస్తూ పెదలింగన కుమారుడననీ, కాళికాంబా వరప్రసాద కవిత్వ చాతుర్య ధార్యుడననీ పలికాడు. తిక్కనకు, రాయలకు, తదితర కవులకు స్వప్నంలో భగవంతుడు కన్పించి ఆయా కావ్యాలు వ్రాయమని పలికినట్లు రుద్రకవికి సోమేశ్వరుడు కన్పించి కృతిభర్తగా వుండటానికి అంగీకరించాడు. ‘ఇంతకంటేను సౌభాగ్యమెందు గలదు?’ అని ఆయురారోగ్య సుప్రసిద్ధులకై రుద్రకవి కావ్య నిర్మాణానికి పూనుకున్నాడు. నన్నయ అక్షర రమ్యత, నానా రుచితార్థ సూక్తి నిధిత్వం, ప్రసన్నకథా కలితార్థ యుక్తి – భారతంలో వుంటాయని చెప్పాడు. రుద్రకవి ఇలా పేర్కొన్నాడు:

“కోమల వర్ణధామయును, కోవిద సంస్తవనీయ లక్షణ
స్తోమఫలాభిరామయును, శుంభదలంకరణ ప్రసాధన
స్థేమయు, అప్రతర్క్య గుణసీమయునైన మదీయ కావ్యక
న్యామణి నిచ్చి మంచుమల అల్లుని అల్లునిగా నొనర్చెదన్. (1-19)
అని గంభీరంగా పలికాడు.

‘ఆఖ్యానం’ అనే పేరుతో వచ్చిన తెలుగు కావ్యాలు తక్కువ. ఈ కావ్యంలో ప్రధాన రసం శృంగారం. ఇందులో నాయకుడు నిరంకుశుడు. ధీరశాంతుడు. నాయిక ముగ్ధ.

నిరంకుశోపాఖ్యానంలో ఇంద్రుడు, రంభ, నారదుడు ఇంద్రలోక పాత్రలు. భూలోకానికీ, ఇంద్రలోకానికీ వారధిగా నారదుడు కథను నడిపించాడు. వేశ్యాలోలత్వం ఎక్కువగా చెప్పబడి ఏదో ఒక మాహాత్యం చేత భగవత్ సాక్షాత్కారం పొందబడడం ఇందులోని విశేషం. ఇందులో నాయకుడు ధూర్త నాయకుడు. ఇలాంటి పాత్రలు ఇతర కావ్యాలలో సమాంతరంగా కన్పిస్తాయి:

  1. పాల్కురికి సోమన – పండితారాధ్య చరిత్ర – మల్హణుడు
  2. ఎడపాటి ఎర్రన – మల్హణ చరిత్ర – మల్హణుడు
  3. శ్రీనాథుడు – శివరాత్రి మాహాత్యం – సుకుమారుడు
  4. శ్రీనాథుడు – కాశీఖండం – గుణనిధి
  5. పోతన – మహాభాగవతం – అజామీళుడు
  6. తెనాలి రామకృష్ణుడు – పాండురంగ మాహాత్యం – నిగమశర్మ
  7. తెనాలి రామకృష్ణుడు – ఉద్భటారాధ్య చరిత్ర – మదాలసుడు
  8. తెనాలి రామకృష్ణుడు – ఘటికాచల మాహాత్యం – హరిశర్మ
  9. హరిభట్టు – నారసింహ పురాణం – మందేహుడు
  10. రుద్రకవి – నిరంకుశోపాఖ్యానం – నిరంకుశుడు

ఈ పదిమంది సమ ఉజ్జీలు. తమ అవగుణాల ఊబిలో దిగి ఏదో ఒక లవలేశ పుణ్య పరిపాక విశేషంతో సుగతులు పొందడం విశేషం. నా పరిశోధనా గ్రంథంలో వారి తారతమ్యాలు సుదీర్ఘంగా చర్చించాను.

కథాకథనం:

ద్వాపర యుగంలో భూలోకంలో మాణిక్యపురంలో సురశర్మ అనే నైష్ఠికుడున్నాడు. అతడు మహా పండితుడు. విష్ణుసేవా పరతంత్రుడు. అనుకూలవతి యైన భార్య. అతిథి సేవనంలో వారిద్దరూ జీవనం కొనసాగిస్తున్నారు. కాని, సంతానలేమి వారిని బాధిస్తోంది. విష్ణుని ప్రార్థించారు. ఒకనాటి వేకువ జామున సురశర్మకు కలలో శ్రీ మహావిష్ణువు కనిపించి – ‘లక్ష్మీకుచగంధలిప్తమగు హస్తం’తో ఒక పండు ఇచ్చాడు. ఆ కల విషయం భార్యకు చెబితే ఆమె సంతోషించింది. ఆమె కొన్నాళ్ళకు గర్భవతియై ఒకానొక శుభదినాన కుమారుని ప్రసవించింది. నామకరణ సమయంలో పెద్దలిలా సెలావిచ్చారు:

మ:
అశసప్రగ్రహ దానధర్మ సురశర్మా! కర్మసంపన్న పం
చశరాకారుడు నీ కుమారుడు వచ స్సంభార దుర్వారుడై
విశదానర్గళ శేముషీమహిమచే వేదాది విద్యానిరం
కుశుడౌనన్న నిరంకుశుండె యనియెన్ క్షోణీసురుం డాఖ్యయన్. (ప్రథమా-91).

అతడు దినదిన ప్రవర్ధమానుడై వేదశాస్త్రాది విద్యలు నేర్చాడు. సంగీత కవిత్వాలు నేర్చుకున్నాడు. చక్కని అందం గల గుణవంతురాలైన కన్యను తెచ్చి తల్లిదండ్రులు పెళ్ళి చేశారు.

విద్యా ప్రభావంతో నిరంకుశుడు దశదిశాకీర్తిమండలు డయ్యాడు. యౌవనోదయమైంది. అతని అందం మన్మథుని సైతం ధిక్కరిస్తోంది. ఆ పడుచు ప్రాయంలో అతడు వైదికాచారాలు కట్టిపెట్టి విటచర్య మీద మనసు పెట్తాడు. కాముకులతో స్నేహం చేశాడు. వేశ్యల కోసం ధనదాన్యాలు, సొమ్ములు హరింపజేశాడు. వేశ్యామణులతో చంపకగంధ విలాస సంభ్రమాలు నిరంకుశుని ఆకర్షించాయి. వేశ్యమాత విటుల ప్రాణాలు తీసే పరమ రాక్షసి. ఇలా చాలా సంవత్సరాలు గడిచాయి. నిరంకుశుని భార్య అత్తగారిని ఝాడించి వదిలిపెట్టింది. “ఏమమ్మా! నీ కొడుకు దుర్వృత్తిని నీవు ఆపలేవా?” అని నిలదీసింది.

నిరంకుశుడు ఒకనాటి అర్ధరాత్రి ఇంటికి వచ్చాడు. తల్లి నీతి బోధ చేస్తూ –

శా:
లేరా భోగపరాయణుల్ జగతిలో లీలావినోదంబుగా
పోరా వేశ్యలయిండ్లకున్ వివిధసంభోగార్థులై, గుట్టుతో
రారా, వైదిక ధర్మమార్గపధిక ప్రావీణ్యమున్ చూపరా
ఏరా! తండ్రి! పరిత్యజింతురటరా! యీరీతి సత్కర్మముల్ (ద్వితీయా-84).
అని పలికింది.

శయన మందిరంలోకి తాంబూల వీడెంతో వచ్చిన భార్యకు పెడమోము బెట్టి పడుకున్నాడు నిరంకుశుడు. వేకువ జామునే లేచి భార్య మెడలో నల్లపూసాదిగా బంగారం వొల్చుకుని చంపకగంధి ఇంటికెళ్ళి సమర్పించాడు. చంపకగంధి గర్భవతి అయింది. వేశ్యమాత నిరంకుశుని మెడ బెట్టి గెంటివేసింది.

నిరంకుశుడు నిరాశ్రయుడై ఒక భయంకరారణ్యంలో పాడుబడ్డ గుడికి చేరాడు. అక్కడ వెలిగిపోతున్న శివలింగాన్ని చూశాడు. శివుడితో జూదమాడాడు. ఓడినవారు గెలిచినవారికి ‘లంజ’ను పందెంగా ఇవ్వాలని షరతు. ఇద్దరి పందెములు ఇతడే ఒడ్డాడు. శివుడు ఓడిపోయాడు. తన మెడలో ఉత్తరీయం తీసి శివుని లింగానికి చుట్టి పొగడదండ శిక్ష వేశాడు. శివుడు వృషభ వాహనంపై వచ్చి ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మ, విష్ణువు, ఇంద్రుడు, మిగతా దేవతలు వెంట వచ్చారు. నిరంకుశుడు తనకు మోక్షమిమ్మన్నాడు. నీవు కోరిన వేశ్యనే ఇస్తానని ఇంద్రునితో చెప్పి రంభను భూలోకానికి పంపే ఏర్పాటును శివుడు చేశాడు.

రంభానిరంకుశులు స్వేచ్ఛగా రతిక్రీడల ననుభవించారు. ఒక రోజు రంభ – “నీతో నలకూబరాదులు కూడ సాటి రారు” అని నిరంకుశుని ప్రశంసించింది. ఆ దారిన వెళుతున్న నారదుడా మాట ఇంద్రుని చెవిన వేశాడు. ఇంద్రుడు రంభను తన సభకు పిలిపించి – ‘నీవు భయంకరమైన పాషాణంగా పడి వుండ’మని శపించాడు. ఆ శిలను నుగ్గు నుగ్గు చేసినపుడు శాపవిమోచనం కలుగుతుందని చెప్పాడు.

ఆ శతతాళ ప్రమాణంలో వున్న శిలను చూసి ఆ పట్టణమేలే అరిందముడనే రాజు భయపడ్డాడు. పక్కనే రావి చెట్టుపై కూచొన్న బ్రహ్మరాక్షసుడు ఆ రాజును ఆవహించాడు. రాజుకు పిశాచోచ్చాటానికి భూతవైద్యులు ఎందరో ప్రయత్నించి విఫలమయ్యారు. నిరంకుశుడు రాజాస్థానానికి వచ్చి ఆ పెద్ద శిలను పిండి పిండి చేస్తే రాజును పట్టిన పిశాచం వదులుతుందని జోస్యం చెప్పాడు.

మంత్రులు ఆ  పాషాణం పగలగొట్టగా రంభకు శాపవిమోచనం కలిగింది. రంభ ఇంద్రలోకానికి వెళ్ళిపోయింది. నిరంకుశుని తెలివితేటలను ప్రశంసించిన ఇంద్రుడు నిరంకుశుని వద్దకు వచ్చాడు. నిరంకుశుడు రాజు పిశాచ బాధను తొలగించమని కోరాడు. మరో వరం కోరుకోమంటే రంభ మీద మక్కువ తగ్గలేదన్నాడు. రంభ భూలోకానికి వస్తూ పోతూ వుంటుందని ఇంద్రుడు వరమిచ్చాడు. నిరంకుశుని తల్లిదండ్రులు అతని గొప్పతనాన్ని కొనియాడారు. తన భార్య ద్వారా బిడ్డలను పొంది నిరంకుశుడు ధన్యడయ్యాడు. ఇదీ రసవత్తర కథ!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here