కావ్య పరిమళం-3

0
9

[box type=’note’ fontsize=’16’] సాహిత్య విశిష్టతలోనూ, కథాకథన శిల్పంలోనూ, పద్య రచనా చమత్కృతిలోనూ, శైలి విన్యాసంలోనూ మధురాలైన ప్రాచీన కావ్యాల పరిమళాలను అందిస్తున్నారు డా. రేవూరు అనంతపద్మనాభరావు. [/box]

కుమార సంభవం

[dropcap]కు[/dropcap]మార సంభవ కావ్య నిర్మాత నన్నెచోడుని గూర్చి జరిగినన్ని సాహిత్య చర్చలు మరే కవిని గూర్చి ఆధునిక కాలంలో జరగలేదు. దానికి కారణం కవి తన గ్రంథంలో కాలం పేర్కొనకపోవడమే. నన్నెచోడుడు టెంకణాదిత్యుడు. అతని తండ్రి చోడబల్లి. తల్లి శ్రీసతి. గురువు శైవాచార్యుడైన మల్లికార్జున యోగి. అతనికే కావ్యం అంకితమీయబడింది. నన్నెచోడుడు క్రీ.శ. 1160 ప్రాంతము వాడని పరిశోధకులు భావించారు. కుమార సంభవంలో ప్రబంధ లక్షణాలు విస్తారంగా ఉన్నాయి. సంస్కృతంలో కాళిదాస కుమార సంభవం ప్రసిద్ధం. నన్నెచోడుడు స్వతంత్ర రచనగా ఈ కావ్యాన్ని తీర్చిదిద్దాడు.

కాళిదాసుని సంస్కృత కుమార సంభవంలో కథ హిమాలయ వర్ణనతో ప్రారంభమై పార్వతీ జననం వివరిస్తుంది. తారకాసుర సంహారంతో సంస్కృత కావ్యం ముగుస్తుంది. కాళిదాసు కవిత్వము ఆర్షము, నన్నెచోడునిది లౌకికము – అని ఆచార్య పింగళి లక్ష్మీకాంతం తమ ఆంధ్ర సాహిత్య చరిత్రలో పేర్కొన్నారు. మొదటి రెండాశ్వాసాలలో నన్నెచోడుడు స్వతంత్రంగా నడిచినా మూడో ఆశ్వాసం నుంచి కాళిదాస క్రమంతోనే సాగింది. ఆంగ్ల భాషలో ఈ ఆర్ష, లౌకికాలను Classicism and Romanticism – అని వింగడించారు.

తన కావ్యంలో వర్ణనలు, సూక్తులు మధుమృదుత్వంగా చెవికింపుగా వుంటాయని నన్నెచోడుడు ప్రస్తావనలో చెప్పాడు:

“సరళముగాఁగ భావములు జానుదెనంగున నింపుపెంపుతోఁ
బిరిగొన, వర్ణనల్, ఫణితి పేర్కొన, నర్థము లొత్తగిల్ల, బం
ధురముగఁ బ్రాణముల్ మధుమృదుత్వరసంబునఁ గందళింప, న
క్షరములు సూక్తు లార్యులకుఁ గర్ణరసాయనలీలఁ గ్రాలఁగాన్.”
(అవతారిక – 35)

తనకు గురువైన జంగమ మల్లికార్జునునికి అంకితంగా కావ్యం చెబుతూ అతను వేదశాస్త్ర పండితుడనీ, వృద్ధాచారుడనీ, పుణ్యనిధియని ప్రస్తుతించాడు. వ్యాస, వాల్మీకులను, కాళీదాసభారవులను, ఉద్షటుని, బాణుని పూర్వకవిస్తుతిలో ప్రశంసించాడు. ఇది 12 ఆశ్వాసాల కావ్యం.

కథాక్రమం:

దక్ష ప్రజాపతి విశ్వసృష్టి చేయడానికి సంకల్పించి పరమేశ్వరిని ధ్యానించాడు. ఆమె ప్రత్యక్షమై వరం కోరుకోమంది. “నీవు నా పుత్రికగా జన్మించి శివుని పత్నివి కావాలి” అని కోరాడు దక్షుడు. అతడు ధ్యానం చేసి పరమేశ్వరుని ప్రత్యక్ష్యం చేసుకుని తన కుమార్తెయైన సతీదేవిని శివునికి పత్నిగా ఇచ్చాడు.

దక్షునికి 50 మంది సంతానం కలిగారు. అందులో పదముగ్గురు కన్యలను కశ్యప ప్రజాపతికిచ్చి వివాహం చేశాడు. 27మందిని చంద్రునికిచ్చడు. సతీ పరమేశ్వరులు నవయౌవనంలో కామకేళీ విలాసాలతో కైలాస పర్వతంపై సంచరించారు. ఆ పర్వతంపైకి ఏనుగుల గుంపులు వచ్చి ఆ వనమంతా కామకేళితో తిరగసాగాయి. అది చూచిన సతీదేవి తాము కూడా ఆడ ఏనుగు, మగ ఏనుగు రూపంలో సంచరించాలనే కోరిక వెలిబుచ్చింది. పరమశివుడు సంతోషంగా అంగీకరించాడు.

ఆ ఏనుగుల జంటకు మరుగుజ్జు రూపంలో లంబోదరుడు పుట్టాడు. దేవతలు ఆ సమయంలో పుష్పవృష్టి కురిపించారు. పరమేశ్వరుడు గణపతికి యువరాజు పట్టం గట్టాడు. సృష్టికార్యం పూర్తి చేసిన దక్ష ప్రజాపతి తన కుమార్తెలను చూడాలని బయలుదేరాడు.

ముందుగా అల్లుడైన కశ్యప్ ప్రజాపతి వద్దకు వెళ్ళాడు. అతడు ఆర్ఘ్యపాద్యాదులతో మామగారైన దక్షుని సమ్మానించాడు. అక్కడ నుండి మరో అల్లుడైన యమధర్మరాజు వద్దకు బయల్దేరాడు దక్షుడు. అతడు భార్యా సమేతంగా వచ్చి ఆతిథ్యమిచ్చాడు. అక్కడి నుంచి దక్షుడు చంద్రలోకాని కెళ్ళాడు. అక్కడి సపర్యలకు సంతుష్టుడై దక్షుడు కైలాస పర్వతానికి శివుని జూడటానికి బయలుదేరాడు.

దురభిమానంతో అహంకరించిన దక్షుని చూసి శివుడు నిర్లక్ష్యంగా ఉన్నాడు. అందరు అల్లుళ్ళు గౌరవిస్తే, పెద్ద అల్లుడు నిరాదరించినందుకు బాధపడిన దక్షుడు తన నగరానికి వెళ్ళి భార్యతో మనస్తాపం వెల్లడించాడు. ‘తల్లిదండ్రులు లేనివానికి అత్తమామలంటే విలువ తెలియదు. అక్కడ యిచ్చిన మన బిడ్డ మనది కాదని ఉండ’మని హితవు పలికింది.

ఈ స్వభావ చిత్రణ సహజంగా వుంది. మన పిల్లకూ, మనకూ ఇంతటితో సంబంధం తెగిపోయిందని చెప్పిన భావన తెలుగుతనానికి దగ్గరగా వుంది. దక్షుడు శివునిపై కోపం తీర్చుకోవడానికి ఒక గొప్ప యజ్ఞం ప్రారంభించి పదునాలుగు లోకాల జనులను ఆహ్వానించాడు. అల్లుళ్ళు అయిన కశ్యపుడు, యముడు, చంద్రుడు సకుటుంబంగా ఉత్సాహంగా వచ్చారు. బ్రహ్మవిష్ణులు విచ్చేశారు.

దక్షుడు తన వైభవాన్ని చూపడానికి సతీదేవిని పిలవనంపాడు.

సతీదేవి విమానంలో వచ్చి తండ్రితో ఇలా అంది:

“హరి పితామహా దివిజేశ్వరాది దిగధి
పతుల సుర ముని ద్విజుల రాఁ బనిచి వరదు
నభవుఁ బరమేశు రావింపవైతి! నీవు
దలఁచి పిలిచిన భక్తవత్సలుఁడు రాఁడే?”
(ద్వితీయ. 19)

“బ్రహ్మ, విష్ణువు మొదలైన దేవతలందరినీ పిలిచావు. శివునకు ఆహ్వానం పంపితే వచ్చేవాడు గదా!” అంతి సతీదేవి తండ్రితో.

దక్షుడు ఆక్షేపంగా మాట్లాడి శివుని నిందించాడు. సతీదేవికీ దక్షునికీ మధ్య వాగ్వాదం జరిగింది. సతీదేవి కోపించి కోపాగ్నిలో భస్మమైపోయింది. నారదుని ద్వారా ఈ వార్త విన్న శివుడు ఉగ్రుడయ్యాడు. ఇంతలో గణపతి దక్షుని యజ్ఞం ధ్వంసం చేసి వస్తానని తండ్రి అనుమతి కోరాడు. ప్రమధ గణాలు యజ్ఞవాటికను చెరి దేవతలను తరిమి తోలారు. మృగాన్ని పట్టుకొని వచ్చినట్టు దక్షుని పట్టి తెచ్చి శివుని ముందు నిలబెట్టారు. దక్షపత్ని శివునికి మొరలిడింది. శివుడు దయతో దక్షుని వైపు చూశాడు. దక్షుడు శివుని బహుముఖాలుగా స్తుతించాడు.

అక్కడ హిమాలయంపై హిమవంతుడు భార్య మేనకతో ధ్యానం చేస్తున్నాడు. అతనికి సతీదేవి కూతురుగా జన్మించింది. ఆమెకు పార్వతి అని నామకరణం చేశారు. ఆమె యవ్వనవతి అయింది. ఆమెకు తగిన వరుని కొసం హిమవంతుడు వెదుకుతున్న సమయంలో నారదుడు విచ్చేశాడు. “పార్వతి పరమశివునికి భార్యయై ఇంద్రాది దేవతలతో పూజింపబడుతుంది” అని నారదుడు సెలవిచ్చ్డు.

ఇంతలో సతీదేవి వియోగంతో పరమేశ్వరుడు తపస్సు చేయడానికి హిమాలయానికి విచ్చేశాడు. హిమవంతుడు కుమార్తెతో కలిసి వచ్చి శివుని పూజించాడు. పరిచర్యలు చేస్తూ సేవలందిమ్చడానికి శివుని వద్ద పార్వతిని వదిలి వెళ్ళాడు. భక్తి శ్రద్ధలతో పార్వతి శుశ్రూష చేస్తోంది.

అక్కడ ఇంద్రాది దేవతలు తారకాసురుని వలన బాధలను అనుభవిస్తూ బ్రహ్మ దగ్గరకు వెళ్ళి మొరపెట్టుకొన్నారు. అతనిని చంపడానికి పార్వతీ పరమేశ్వరులకు జన్మించిన కుమారుడే సమర్థుడని బ్రహ్మ భావించాడు. ఆ కార్యం చక్కబెట్టడానికి మన్మథుడిని ప్రోత్సహించాడు ఇంద్రుడు. మన్మథుడు ప్రతిజ్ఞ చేశాడు. ఆ వార్త విన్న రతీదేవి భర్తను పలువిధాలుగా వారించింది.

కామదహనం:

వసంతుడు తోడురాగా  మన్మథుడు హిమవత్ పర్వత ప్రాంతానికి వెళ్ళి పరమశివుడు తపస్సు చేస్తున్న ప్రదేశంలో సమయం కోసం వేచి పొంచివున్నాడు. ఇంతలో పార్వతి శివుని సమీపించి మదనాస్త్ర పీడితయై నిలిచింది. పరమశివుని మనసు చలించింది. వెంటనే దానికి కారణం ఏమిటా అని ఎదుట నిలిచిన మదనుని వైపు మూడో కంటితో చూశాడు.

శివుని కంటి మంటలో మదనుడు భస్మమయ్యాడు. రతీదేవి విలపించడం చూసి ఆకాశవాణి అభయమిచ్చి – శివుడే నీ పతిని రక్షిస్తాడు. నీవు సహగమనాన్ని విరమించమని కోరింది. రతీదేవి పరమేశ్వరుని ఆరాధించింది.

పార్వతి విరహంతో బాధపడి తపోభూమికి వెళ్ళింది. అక్కడ జంగమ మల్లికార్జునుని వద్ద ఉపదేశం పొంది పార్వతి తపోదీక్షలో కూర్చుంది. గౌరి ఘోర తప్పస్సు కాలంలో ఋతువులు అతిక్రమించాయి. అక్కడ పరమశివుడు వియోగ బాధ ననుభవిస్తూ వటుని రూపంలో గౌరి ముందుకు వచ్చాడు. ఆమె చెలికత్త చతురిక శివునితో మాట్లాడింది. వటుడు శివనిందకు పూనుకొన్నాడు. గౌరి కోపంతో వెనుదిరిగి బయలుదేరింది. అప్పుడు శివుడు సాక్షాత్కరించాడు. పరస్పరం ప్రణయాసక్తులయ్యారు.

కైలాసానికి విచ్చేసిన శివుడు సప్తర్షులను హిమవంతుని దగ్గరకు కన్యావరణానికి పంపాడు. వారు హిమవంతుని అంగీకారాన్ని తెలుసుకొని పరమశివునకు ఆ వార్త తెలిపారు. వివాహ నిమిత్తమై శివుడు హిమాలయానికి వైభవంగా బయలుదేరాడు. సప్తర్షుల సాక్షిగా పార్వతీ పరమేశ్వరుల వివాహం జరిగింది. వారుభయులూ రతిలోలురై సంతోషిస్తున్నారు. వారి రతిక్రీడా ప్రదేశానికి వచ్చిన అగ్నిదేవుడు భంగపడ్డాడు. శివుని వీర్యంతో కుమారస్వామి జన్మించాడు.

కుమారునకు శివుడు యౌవరాజ్య పట్టాభిషేకం జరిపించాడు. తారకాసురునిపై యుద్ధానికి కుమారుడు దేవతలతో కలిసి బయలుదేరాదు. యుద్ధం ఘోరంగా జరిగింది. తారకాసురుని సంహరించి కుమారుడు శివపురానికి వచ్చాడు. పరమశివుడు కుమారునకు జ్ఞానోపదేశం చేశాడు.

ఈ విధంగా కావ్యం రసవత్తరంగా కొనసాగింది. విరహంలో వున్న పార్వతికి శివుని రూపం ఎలా కనిపించిందో హృద్యంగా వర్ణించాడు నన్నెచోడుడు:

“కలకల నవ్వునట్లు, సమకంబునఁ గల్గవ విచ్చి భ్రూలతల్
పొలయఁగఁ జూచునట్లు, తనివోవఁగఁ దెల్చియుఁ గౌఁగిలింపఁజే
తులు పచరించున, ట్లడటుతో రతికేళికి నప్పళించు న
ట్లెలమి నటించుచుండె సతి కీశ్వరురూ పెదురం బ్రసన్నమై.”
(పంచమా -119)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here