కావ్య పరిమళం-33

0
9

[box type=’note’ fontsize=’16’] సాహిత్య విశిష్టతలోనూ, కథాకథన శిల్పంలోనూ, పద్య రచనా చమత్కృతిలోనూ, శైలి విన్యాసంలోనూ మధురాలైన ప్రాచీన కావ్యాల పరిమళాలను అందిస్తున్నారు డా. రేవూరు అనంతపద్మనాభరావు. [/box]

శ్రీనాథుని క్రీడాభిరామం

[dropcap]క్రీ[/dropcap]డాభిరామమనే ‘వీధి’ నాటకం శ్రీనాథ విరచితంగా లోకంలో ప్రచారంలో ఉంది. ఆచార్య పింగళి లక్ష్మీకాంతం ఈ విషయంలో వాదోపవాదాలు ప్రస్తావించి వేటూరి ప్రభాకర శాస్త్రి సిద్ధాంత వాక్యాలనే తమ ఆంధ్ర సాహిత్య చరిత్రలో ఉటంకించారు.

“క్రీడాభిరామమున పద సంవిధానము, అన్వయచక్రము, కారక ప్రయోగవైచిత్రి, పద్యోపక్రమ నిర్వాహములు, ప్రతి పదము శ్రీనాథుని పేరుగ్గడించుచున్నవి.” (పుట 284).

ఈ గ్రంథకర్త వినుకొండ వల్లభామాత్యుడని ప్రస్తావన లోనూ, భరతవాక్యంలోనూ గద్యలో స్పష్టంగా వుంది. “ఇది శ్రీమన్మహామంత్రిశేఖర వినుకొండ తిప్పయామాత్య నందన చందమాంబా గర్భపుణ్యోదయ సుకవి జనని విధేయ వల్లభరాయ ప్రణీతంబైన క్రీడారామంబను వీధినాటకంబున సర్వంబు ఏకాశ్వాసము.”

దీనిని బట్టి ఇది వల్లభరాయని రచనయని అనదగును. విద్వత్కవుల ఆక్షేపణలను భరించుటకు వల్లభరాయుడు అంగీకరించి శ్రీనాథుని రచనను వల్లభరాయడు తన పేరనే వెలయించి వుండవచ్చునని పరిశోధకుల అభిప్రాయం.

ఏకాశ్వాసం:

ఎమెస్కో సంప్రదాయ సాహితిలో బి.వి. సింగరాచార్య పీఠికతో క్రీడాభిరామం 2009లో ప్రచురితమైంది. ఇటువంటి కావ్యం తెలుగులో మరొకటి రాలేదు. 295 పద్యగద్యలలో ఏకాశ్వాస ప్రబంధంగా వెలువడింది. సమకాలీన ప్రజాజీవన విధానాలను ప్రతిఫలించడం దీని ముఖ్యోద్దేశం. 14వ శతాబ్ది తొలిపాదంలోని ఓరుగల్లు పట్టణము, అందులో వివిధ వర్గాల ప్రజల విశ్వాసాలు, మూఢ విశ్వాసాలు, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, భోగాసక్తులు, క్రీడలు, వినోదాలు ఈ రచనలో అత్యక్షర సత్యం. ఆనాటి శిష్టాచార దుష్ట సంప్రదాయాలను కవి ఎద్దేవా చేశాడు.

కావ్యం చదివినంత సేపూ పాఠకుడు ఓరుగల్లు పట్టణంపైన విహంగ వీక్షణంగా చక్రభ్రమణం చేస్తూ అక్కడి విశేషాలు అవలోకనం చేస్తూ ఆనందించినట్లు తోస్తుంది. ఇందులో కథ చాలా తక్కువ. ప్రధాన పాత్రలైన మంచనశర్మ, టిట్టిభసెట్టి ఓరుగల్లు నగరంలోకి వెళుతూ దారిలో వారి చూపుల నాకర్షించిన దృశ్యాలను వర్ణిస్తూ పోతారు. దారిలో ఎదురుపడిన వేశ్యల శృంగారాలు, వ్యభిచారిణుల సోయగాలు పసందైన వర్ణనలతో పాఠకునికి మత్తెక్కిస్తాయి. శృంగారం పచ్చిగా కనిపిస్తుంది. అయితే రసజ్ఞత లోపించలేదు. అందుకే ‘క్రీడాభిరామం ప్రౌఢిమయిన బహురసజ్ఞ పండిత మనోజ్ఞ ప్రశస్త కావ్యమ’ని వేటురి వారు కితాబిచ్చారు.

విశిష్టత:

ఈ క్రీడాభిరామానికి నాయకుడు గోవింద మంచనశర్మ. నాయిక కామమంజరి అనే వితంతు యువతి. వారిరువురు పరస్పరానురక్తులు. మంచనశర్మ ఆంధ్రవిష్ణు నగరమైన శ్రీకాకుళంలో కాకుళేశ్వరుని తిరునాళ్ళ చూడటానికి వెళ్ళాడు.

ఏవో పనుల హడావిడిలో అక్కడే కొంతకాలం వుండిపోయాడు. కామమంజరి విరహవ్యథ ననుభవించింది. మంచనశర్మకు తన పర్యటన సమయంలో టిట్టిభసెట్టి అనే స్నేహితుడు లభించాడు. అతడు తనవెంట టిట్టిభసెట్టిని ఏకశిలా నగరానికి తెచ్చాడు. దారిలో ఆ నగర విశేషాలు చూపిస్తూ రోజంతా గడిపాడు. మధ్యాహ్న సమయంలో ఒక పూటకూటి ఇంట్లో భోంచేశారు. అంటే ఇప్పటి హోటళ్ళ వంటివి. అవి అన్నీ ఒకే వీధిలో ఉండేవి. ఆ వీధి పేరు అక్కలవాడ. మృష్టాన్న భోజనం ఒక్క రూకకే షడ్రషోపేతంగా లభించింది. అది ఎలా వుందంటే…

ఉ:
“కప్పురభోగి వంటకము, కమ్మని గోధుమపిండి వంటయున్
గుప్పెడు పంచదారయును, కొత్తగ కాచిన ఆలనే పెసర్
పప్పును, క్రొమ్మునల్లనటి పండ్లును, నాలుగునైదు నంజులున్
లప్పలతోడ క్రొంబెరుగు లక్ష్మణవజ్ణల ఇంట రూకకున్.” (1-166)

ఈ విషయాన్ని వీరికి ఒక విటముఖ్యుడు తెలియజేశాడు. అయితే అతడొక ప్రశ్న వేశాడు. “ఆహారా విహారాలకొ, ఆహారంబునకునొ, విహారంబునకొ బేహారము” అని ప్రశ్నించాడు. అంటే boarding and lodging రెండూ కలిసి వుండే ప్రదేశాలున్నాయి. కోయిల పంచమ స్వరంలొ చక్కగా రామాయణం ఆరు కాండలు అచ్యుత జాగర వేళ పాడగల వితంతువులున్నారక్కడ. వారు ‘నమశ్శివాయ, శాంతాయ, సమస్తదోషాపహరణాయ’ అనగల ధీమతులు. మంచనశర్మ, టిట్టిభుడు కుత్తుకబంటి తిన్నారు. ’చంకలబంటి గామోస’ని శ్రీనాథుడు చమత్కరించాడు. ఇంకోమారు వస్తామని, చాలా కార్యభారం వుందనీ బయటపడ్డారు.

అక్కడి నుంచి పురదర్శనానికి బయలుదేరారు. రాత్రి వేళ అయ్యేసరికి మంచనశర్మ ఒక సంకేతస్థలంలో కామమంజరి పడక చేరాడు. టిట్టిభసెట్టికి మరో యువతి పొందు ఏర్పాటు చేసి స్నేహభావాన్ని సార్థకం చేసుకొన్నాడు. మిత్రులిద్దరూ ఆ రోజు తెల్లవారినది మొదలు రాత్రి వరకు ఏకశిలానగరంలో చూచిన వింతలు, వినోదాలు ఈ వీధి నాటకంలో ప్రసక్తమయ్యాయి. సంఘ జీవితము పామర జనరంజకంగా వర్ణించబడింది. అలాంటి వ్యక్తులు లఘువర్తన్లు, రాజాస్థానానికి, పండిత సభలకు దూరంగా వుండేవారని భావించాలి.

ఇందులో ప్రస్తావించబడిన వ్యక్తులు మహానగరంలో రాజవీధుల్లో నివసించేవారు కాదు. సందుగొందు వాడలలో అల్పాదాయ వర్గాలకు చెంది జీవితం గడుపుకునేవారు. మాచల్దేవి అనే వేశ్య ప్రతాపరుద్రుని వద్ద గోష్టిలో పారంగతురాలు. ఆమె చిత్రశాలలో ప్రవేశించడం ఇందులో వర్ణించబడింది. ఆమె చరిత్రను నాటకంగా ఆడేవారు. మాచల్దేవిని మంచన ఇలా ప్రశంసించాడు:

తే:
“కల్ల చెప్పము; విను, నీకు గల ప్రసిధ్ధి
ఢిల్లి సురతాణికిని లేదు పల్లవోష్ఠి!
ఆదిలక్ష్మికి – నీకును భేదమేమి?
ఉదధి జనియించ కుండుట ఒకటి దక్క.” (1-185)

ఎంత గొప్ప ప్రశంస. నేను అబద్ధమాడను. నీకుండే ప్రశస్తి ఢిల్లీ రాణికి కూడా లేదు. ఆదిలక్ష్మికీ నీకూ ఒకటే తేడా. ఆమె సముద్రంలో పుట్టింది, నీవు భూమిపై పుట్టావు.

మాచల్దేవికి మంచనశర్మకు సరస సంభాషణ మన్మథుని శౌర్యం తెలిపే చిత్రశాలలో నడిచింది.

కథాసంవిధానం:

గోవింద మంచనశర్మ, టిట్టిభసెట్టి (రంగస్థలంపై) ప్రవేశిస్తారు. మంచనశర్మ మన్మథుని వంటివాడు. తెలతెలవారే వేళ పుష్య మాఘ మాస శీతల వేళ బయలుదేరారు. శీతాకాల వర్ణన చేశారు. వారికి శుభ శకునం వలె నెమలి షడ్జమ స్వరంలో కూసింది. అది ‘కొంగు బంగారమ’ని బావించారు. కోడి కూత వినిపించింది. శీతాకాలంలో పల్లెటూరి భోజన సౌష్టవాన్ని వివరించారు. ఇంతలో గోవిందునకు తన ప్రియురాలైన కామమంజరి అలుక చేసిన విషయం గుర్తుకువచ్చింది. అందుకు కారణం గోవిందుడు మరొక భామ పేరు పొరపాటున ఉచ్చరించడమే. ఇంతలో తెల్లవారి సూర్యోదయమైంది.

వారిద్దరు వెలిపాళెంలో కట్టకడపటి కుటీరాల వద్దకు చేరారు. అక్కడ మేదరకరణ వేశ్య. కర్ణాట కలికి, కాపుటిల్లాలు, సంపెంగి నూనె అమ్మే కరణకాంత, ములికినాటి జోటి, పసుపు నూరే పడతి కనిపించారు. కుట్టుపని వాని (tailor) కొంటె చూపులు గమనించారు. రవిక కుట్టే నెపంతో ఎగాదిగా చూస్తాడు:

చం:
“కొలుచును, జేనవెట్టు, కుచకుంభ యుగం బెగడిగ్గ కన్ను గ్రే
నల పరికించు, కక్షముల వైచును దృష్టులు మాటిమాటికిన్
కలికితనంబునన్ తరచుగా నగు సాచిక పల్లవుండు కం
చెల, వెసగుట్టి ఈడు వెల చేడియకున్‌, విషయాభిలాషియై.”(1-106)

ఏకశిలానగర వైభవం:

మిత్రులిద్దరూ ఏకశిలానగర రాజమార్గం ప్రవేశించారు. అక్కడ పల్నాటి వీరగాథాభినయం జరుగుతోంది. శ్రీనాథుని పల్నాటి వీరచరిత్ర ప్రసిద్ధం. పల్నాటి వీరుల చరిత్ర ప్రస్తావించబడింది. ఏకవీరాదేవి, ముహురమ్మ, కామవల్లి స్తుతి, అక్కల ఆరాధనము, మైలారవీరభటుల సాహసకృత్యాలు, మైలారదేవస్తుతి, నగరంలో నానావిధ దేవాలయాలు దర్శించారు. అక్కడ భైరవుని మంచన ప్రస్తుతించాడు.

ఇంతలో నిప్పులు చెరిగే బీరెండ వచ్చింది. గడియారం రాజవీధిలో ఆకాశమార్గంలో వేలాడుతూ రెండు ఎనిమిదులు (16) ఘడియలు సూచిస్తూ మోగింది. అది మధ్యాహ్న భోజన సమయానికి సూచకము. ఇంతలో ఓ విప్రుడు కనిపిస్తే పూటకూటింటి ప్రస్తావన చేసి భోంచేశారు.

మంచనశర్మకు మాచల్దేవి అభ్యంతర మందిరంలో అర్ఘ్యపాద్యాది సముచిత సత్కారాలు చేసింది. ‘ఈ రోజు అపర్ణాహ వేళలో పుష్యమి నక్షత్రంలో నా ముద్దుల కూతురు అద్దంలో చూచే ముకుర వీక్షణ సమయంలో మీరు ఆశీర్వదించమ’ని మాచల్దేవి మంచనను అర్థించింది. తథాస్తు అని – ‘శ్రీ వర్థస్వంబు’ అని చెప్పి ఒక వెండి నాణెం పసుపునకు కానుకగా మంచనశర్మ అందించాడు.

శ్రీకాకుళం తిరునాళ్లలో మదనుడు స్వైర విహారం చేశాడు. అక్కడ స్వైర విహారధీరలైన చారిణులకు మంచన దీవెనలందించాడు. నాలుగు ఘడియల వేళ నాగస్వరం వినిపించింది. పాములాటలో నాగస్వర నైపుణి పరికించారు. అక్కడే పొట్టేళ్ళ పోరు పందెములు గమనించారు. పల్లె వాతావరణం వారిని ఉత్తేజపరిచింది. కోడి పందెముల తంతు రసవత్తరంగా సాగింది.

అక్కడ మాధవశర్మ కూతురు మధుమావతి తొలి, మలి జన్మరహస్య వృత్తాంతాలు తలపోసుకున్నారు. ఇంతలో సాయంకాలమైంది. బాలల బంగరు బంతుల ఆట తిలకించారు. నటుని కోడలితో మంచన చతురోక్తులాడాడు. జార ధర్మాసనంలో మంచన న్యాయనిర్ణయం చేశాడు.

గోవిందుడు కామమంజరి సాంగత్యంలో మురిసిపోతూ ఆమెను ఇలా ప్రశంసించాడు:

మ:
“అరవిందాస్య! తలంచి చూడనిది అత్యాశ్చర్యమో కాని, నీ
సరసాలాపము లాదరించి వినగా సంభావనం జూడగన్‌
ఖరపాకంబయి కర్ణరంధ్రముల కంగారంబుగా, బిట్టు ని
ష్ఠురముల్‌ పల్కెడు రాజకీరములు గండుం కోయిలల్ వీణియల్‌.”

ఇలా నడిచింది కథాప్రస్థానం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here