కావ్య పరిమళం-4

1
6

[box type=’note’ fontsize=’16’] సాహిత్య విశిష్టతలోనూ, కథాకథన శిల్పంలోనూ, పద్య రచనా చమత్కృతిలోనూ, శైలి విన్యాసంలోనూ మధురాలైన ప్రాచీన కావ్యాల పరిమళాలను అందిస్తున్నారు డా. రేవూరు అనంతపద్మనాభరావు. [/box]

శ్రీనాథుని హరవిలాసం

[dropcap]శ్రీ[/dropcap]నాథుని రచనలలో ‘హరవిలాసం’ ప్రసిద్ధం. నన్నెచోడుని ‘కుమార సంభవం’లో శివపార్వతుల తపస్సు, వివాహం గూర్చిన వివరణ వుంది. ఈ హరవిలాస కావ్యంలో మూడు, నాలుగు ఆశ్వాసాలలో అదే వృత్తాంతం వుంది. భిన్న శివగాథల సమాహారంగా శ్రీనాథుడు దీనిని వ్రాశాడు. భీమఖండ, కాశీఖండాలు కూడా శివసంబంధాలే.

హరవిలాసం మొదట రెండు ఆశ్వాసాలలో చిరుతొండనంబి కథ విస్తారంగా వుంది. దానికి కారణం ఈ కావ్యాన్ని శ్రీనాథుడు తన బాల్యసఖుడైన అవచి తిప్పయ్యశెట్టికి అంకితమివ్వడమే. అతడు విక్రమసింహపురిలో శ్రేష్ఠుడు, శివభక్తుడు. అతని కిష్టమైన శివ లీలావిలాసాలు ఇందులో కథాభాగమైనాయి.

చిరుతొండనంబి కథ:

దుర్వాస మహాముని బదరికావనంలో తపస్సు చేసుకొంటున్నాడు. దేవతల కిచ్చిన నైవేద్యాన్ని, హోమశేష భాగాలను వాకిట్లో ఉన్న లేడిపిల్లలకు తినిపించేవాడు. ఒకనాడు తుంబురుడు తన భార్యతో విమానంలో ఆకాశంలో తిరుగుతూ అక్కడికి చేరుకున్నాడు. లేడిపిల్లలను మేపుతుండడం చూచి చిటికె వేశాడు. లేడి పిల్లలు బెదిరిపోయాయి. మునికి కోపం వచ్చి – ‘నీవు మనుష్య లోకంలో జన్మించ’మని తుంబురునికి శాపమిచ్చాడు. భార్యాభర్తలిద్దరూ కంచిలో వైశ్యకులంలో పుట్టారు. వారే చిరుతొండనంబి, తిరువెంగనాంచి. వారి కుమారుడు సిరియాళుడు.

చిరుతొండనంబి వీరశైవ జంగముల అతిథిసేవనంలో జీవనం గడుపుతున్నాడు. ఒకసారి ఒక జంగముడు వచ్చి తూమెడు చెరకు రసం కావాలనీ, దానితో శివుడికి అభిషేకం చేస్తానని చిరుతొండనంబిని కోరాడు. చిరుతొండడు మోపెడు చెరకు గడలు కొని నెత్తికెత్తుకొనెను. వొళ్ళంతా చెమటలు పట్టాయి. భక్తుని బాధను నివారించడానికి స్వయంగా శివుడే వచ్చి మోపునెత్తుకున్నాడు. కైలాసంలో శివుడు అప్సర స్త్రీల నాట్యం చూస్తున్న సమయమది. పార్వతి శివుని శరీరంపై చెమటలు చూసి అప్సర స్త్రీలను మోహించాడని అపోహపడింది. శివుడు చిరుతొండనికి సహాయంగా వెళ్ళాలని చెప్పాడు. అయితే ఆ దంపతులని తాను చూడాలని పట్టుపట్టింది పార్వతి.

శివుడు ముదసలి జంగమగా, పార్వతి అతడి గుడ్డి భార్యగా కంచికి వచ్చారు. మూడు వారాలు ముసురువాన పట్టింది. ఇరువది ఒక్కరోజులు జంగములకు తృప్తిగా వండి వడ్డించాడు చిరుతొండనంబి. ఇరువది రెండవ రోజు భోజనం వేళకు ఏ జంగముడు రాలేదు. చిరుతొండడు ఊరంతా గాలించి, అక్కడ పాడుపడిన దేవాలయంలో ఈ జంగమ దంపతులను చూశాడు. ‘నరమాంసంతో నా వ్రతానికి ఉద్యాపన చేయాల’ని జంగముడు షరతు పెట్టాడు.

చిరుతొండనంబి దంపతులు తమ ముద్దు బిడ్డ సిరియాళుని శిరసు ఖండించి వండి వడ్డించారు. ‘నా సరసన నీవు, నీ కుమారుడు కూర్చొని తింటేనే నేను ఔపోసన పడతా’నని జంగముడు మొండికేశాడు. “సిరియాళా!” అని ఎలుగెత్తి పిలవగానే బిడ్డడు సజీవుడై వచ్చాడు. శివపార్వతులు సాక్షాత్కరించారు. చిరుతొండనంబికి శాపవిపోచనం కలిగింది.

గౌరీదేవి వివాహం:

దక్షప్రజాపతి కుమార్తె అయిన సతీదేవి దక్షయజ్ఞ సమయంలో కోపంతో తనంతతానే తగులబడింది. ఆమె మరుజన్మలో హిమవంతుని కూతురు పార్వతిగా జన్మించింది. ఆమె కోసం శివుడు హిమాలయాలలో తపస్సు చేయసాగాడు. శివపార్వతులకు జన్మించబోయే కుమారస్వామి తారకాసురుని సంహరించవలసి వుంది. శివుని పరిచర్యలకు పార్వతిని హిమవంతుడు నియోగించాడు. నారదుడు వచ్చి పార్వతికి శివుడితో వివాహం జరగగలదని ఆశీర్వదించాడు.

దేవతలచే ప్రేరేపింపబడిన ఇంద్రుడు పార్వతీ పరమేశ్వరులకు అనురాగం కల్పించమని మన్మథుని ఆదేశించాడు. రతీ మన్మథులు, వసంతుడు శివుని తపోభూమికి వచ్చారు. స్వామికి పూలదండ సమర్పిస్తున్న పార్వతి మొహం చూడగానే మన్మథ బాణం సోకి శివుడు మనసులో చలించాడు. ఎదురుగా మన్మథుడు కనిపించాడు. మూడో కంటి మంటకు మన్మథుడు మసి బూడిద అయ్యాడు. రతీదేవి భోరున ఏడ్చింది. ‘పార్వతీపరమేశ్వరుల వివాహం కాగానే నీ భర్త బ్రతుకుతాడ’ని ఆకాశవాణి ఓదార్చింది.

ఆ సన్నివేశం చూసి పార్వతి దిగులు పడింది. శివుడు అంతర్ధానమయ్యాడు. శివుని గూర్చి పార్వతి వద్దకు శివుడు వటువు రూపంలో వచ్చాడు. ఆకులు కూడా తినకుండా ‘అపర్ణ’ అయింది. శివుని నిందాలాపాలు చేశాడు. ‘నన్ను పెండ్లాడమ’ని సూచన చేశాడు. పార్వతికి కోపం వచ్చింది.

చంపకమాల

“జిలుగగు వల్కలాంచలము చెన్నయి చన్నులమీఁద జాఱఁగా
నలుకఁ దుషార శైలసుత యవ్వలి మోమయి, నాలుగేన్ పదం
బులు సని భ్రూకుటీ కుటిల ముగ్ధ లలాట ముఖేందు బింబయై
మలఁగి కనుంగొనెన్ భుజగ మండనుఁడైన శఠ ద్విజోత్తమున్.”

వెంటనే శివుడు ప్రత్యక్ష్యమయ్యాడు. శివుడు తనను పెండ్లాడమని పార్వతిని బ్రతిమాలాడు. తండ్రి నడగమని ఆమె సూచించింది. తల్లీదంద్రులు బంధువులు లేని శివుడు సప్తర్షులను, అరుంధతిని పెండ్లిపెద్దలుగా చేసి హిమవంతుని వద్దకు పంపాడు. వివాహం నిశ్చయమైంది.

ఓషధీప్రస్థపురంలో మైత్ర ముహూర్తంలో ఉత్తరఫల్గుణీ నక్షత్రంలో చంద్రయోగంలో పార్వతిని పెళ్ళికూతురుని చేశారు. శివుడు ప్రమథ గణాలతో వచ్చాడు. పార్వతీపరమేశ్వరుల వివాహం వైభవంగా జరిపారు. మన్మథుడు తిరిగి జీవించాడు. ఇల్లరికపుటల్లునిగా శివుడు మామగారింట్లో తిష్ఠవేశాడు. ప్రమథ గణాలు ఊర్లో ఆకతాయి పనులు చేయసాగారు. హిమవంతుడు పార్వతితో విషయం ప్రస్తావించాడు. శివుడు అది తెలిసి, ‘అత్తవారింట్లో యిన్ని రోజులుండరాద’ని దారుకావనంలో వేరే నివాసం ఏర్పర్చుకొన్నాడు.

అర్జునుని పాశుపతాస్త్ర సంపాదనం:

అర్జునుడు ఇంద్రకీలాద్రిపై ఇంద్రుని గురించి తపస్సు చేస్తున్నాడు. వృద్ధ విప్రుని రూపంలో వచ్చిన ఇంద్రుడు అర్జునుని పరీక్షించాడు. అతని ధైర్యానికి మెచ్చి శివుని గూర్చి తపస్సు చేసి రాబోయే రోజులలో జరగబోయే కురుపాండవ యుద్ధంలో శివుని కృప సంపాదించమన్నాడు. అర్జునుడు శివపూజ మొదలెట్టాడు:

మత్తేభం

“అవధానంబునఁ బాకశాసననుతుం డర్ధేండుకోటీరు సం
గవకాలంబునఁ బూజసేయు హిమవాః కర్పూర కస్తురికా
ద్రవకాలాగరుగంధసారసురభి ద్రవ్యంబులం బూవుల
న్లవలీ సర్జరసాగురు ప్రముఖనానాధూపధూమంబులన్.”

అర్జునుని తపస్సును పరీక్షించడానికి శివపార్వతులు చెంచు-చెంచితలై అక్కడికి వచ్చారు. వేదాలు కుక్కలుగా వచ్చాయి. సూకరుడనే రాక్షసుడు పందివలె వచ్చాడు. ఆ పందిని శివుడు అటువైపుగా బాణంతో కొట్టాడు. ఇటువైపు అర్జునుడు బాణం వేయగానే అది చనిపోయింది. శివుడు నేను బాణం వేసి చంపానని మంకు పట్టు పట్టాడు. అర్జునుడు తన పట్టు వదలలేదు.

‘మధ్యాహ్నవేళ అయింది. నా శివార్జనకు సమయమైంది. నీవు శాంతి వహించి, యిక్కడ విశ్రాంతి తీసుకో’మని అర్జునుడు సలహా ఇచ్చాడు.

శివార్జున ద్వంద్వయుద్ధం:

“నీతో యుద్ధం చేయాలని అనిపిస్తోంది. నా భార్య సమక్షంలో నీతో బాణ యుద్ధం చేస్తాను” అన్నాడు చెంచు. అర్జునుడు గాండీవం ధరించాడు. ఇద్దరు పరస్పరం బాణాలు ప్రయోగించారు. పరమశివుని మాయచే అర్జునుడి బాణాలు మాయమయ్యాయి. కోపంతో అర్జునుడు గాండీవంతో శివుని శిరస్సుపై మోదాడు. పక్కనే వున్న పార్వతి వణికిపోయింది.

ఇద్దరూ మల్లయుద్ధానికి దిగి విజృంభించారు. ఇద్దరూ సరిజోడులై ఒకరి వక్షాన్ని మరొకరు పిడికిటితో పొడిచారు. వెంటనే చంద్రశేఖరుడు సాక్షాత్కరించాడు. అర్జునుడు పరమశివుని వేయినోళ్ళతో ప్రస్తుతించాడు.

మత్తేభం

“జయ సర్వేశ్వర! సర్వలోకజనకా! చంద్రార్థచూడామణీ!
జయ కామాంతక! కామితార్థఫలదా! చక్షుశ్శ్రవఃకుండలా!
జయ సంపూర్ణకృపాగుణైకవసతీ! శైలేంద్రజా వల్లభా!
జయ రక్షాధ్వరమర్దనా! జయ గిరీశా! యీశ! రక్షింపవే.”

శివుడు ప్రసన్నుడై అర్జునునకు పాశుపతాస్త్రాన్ని అనుగ్రహించాడు. ఇంతలో మాతలి వచ్చి గగనమార్గంలో అర్జునుని అమరలోకానికి తీసుకెళ్ళాడు. ఇంద్రుడు అర్ధాసనం యిచ్చి అర్జునుని సత్కరించాడు.

ఆ రాత్రి అర్జునునిపై ఊర్వశి మరులుగొని వచ్చి బలవంతం చేసింది. అర్జునుడు ఆమెకు నమస్కరించి ఆమె కోర్కెను తిరస్కరించాడు. “ఒక సంవత్సర కాలం నీవు నపుంసకునిగా జీవించు” అని ఊర్వశి అర్జునుని శపించింది. అర్జునుడు పాశుపతాస్త్రంతో కాలకేయాదులని సంహరించాడు.

ఇదీ స్థూలంగా హరవిలాసంలోని కథాసంవిధానం. శ్రీనాథుడు తన పాండిత్య ప్రకర్షతో కావ్యాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాడు.

విశ్వనాథ సత్యనారాయణ ఇలా ప్రశంసించారు: “నరసభూపాలీయంలో కవులను గూర్చి చెప్పుచూ – ‘శ్రీనాథుడు పద ప్రసిద్ధధారాశుద్ది’ అని కవి శ్లేషతో వాడెను. ఎట్లు వాడినను శ్రీనాథుని రచన గంగా ప్రవాహము వంటిదని సిద్ధించుచున్నది.”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here