కావ్య పరిమళం-5

0
9

[box type=’note’ fontsize=’16’] సాహిత్య విశిష్టతలోనూ, కథాకథన శిల్పంలోనూ, పద్య రచనా చమత్కృతిలోనూ, శైలి విన్యాసంలోనూ మధురాలైన ప్రాచీన కావ్యాల పరిమళాలను అందిస్తున్నారు డా. రేవూరు అనంతపద్మనాభరావు. [/box]

తిక్కన నిర్వచనోత్తర రామాయణం

తిక్కన భారతంలో విరాటపర్వం నుండి 15 పర్వాలు వ్రాయడమే గాక నిర్వచనోత్తర రామాయనమనే కావ్యాన్ని కూడా వ్రాశాడు. ఈ రచనను గూర్చి ఆచార్య పింగళి లక్ష్మీకాంతం తమ ఆంధ్ర సాహిత్య చరిత్రలో (పుట 199) చక్కగా విశ్లేషించారు.

“ఉత్తర రామాయణ కథ రామునకు సంబంధించినంతవరకు వర్తమానము. రావణునికి సంబంధిచినది భూతపూర్వము. భారతమునకు హరివంశము ఎట్టి అనుబంధ పురాణమో ఉత్తరకాండము పూర్వరామాయణమునకు ఇంచుమించు అటువంటి అనుబంధం” – అన్నారు. ఈ గ్రంథమొక్కటే ఆయనకు కీర్తి శిఖరం అంటారు.

నిర్వచనోత్తర రామాయణం పది ఆశ్వాసాల కావ్యం. మనుమసిద్ధికి అంకితంగా తిక్కన వ్రాశాడు.

కం:
“ఏ నిన్ను మామ యనియెడు,
దీనికిఁ దగ నిమ్ము భారతీ కన్యక నా
కీ నర్హుఁడ వగు దనినను,
భూనాయకుపల్కు చిత్తమున కింపుగుడున్.”
(అవతారిక-2)

కావ్యాన్ని కన్యతో పోల్చడం, కృతిభర్తను మామగా, కర్తను అల్లునిగా సంభావించడం తిక్కన చేసిన ఆలోచన. ఆ తర్వాతి కవులు దానిని పాటించారు. నన్నయ ఆంధ్రమహా భారతంలో తొలి శ్లోకం – ‘శ్రీవాణీ గిరిజాశ్చిరాయ’ అనే సంస్కృత రచన. తిక్కన నిర్వచనోత్తర రామాయణంలో కూడా తొలుత సంస్కృత శ్లోకం – ‘శ్రీ రాస్తాం, మనుమక్షితీశ్వర భుజాస్తంభే’ వుంది.

పూర్వరామాయణం వ్రాయకుండా ఉత్తరకాండను కేవలం పద్యాలతో వ్రాయడానికి సాహిత్యచారిత్రకులు అనేక ఉపపత్తులు చూపారు. రంగనాథ రామాయణం గోన బుద్ధారెడ్డి ద్విపదలతో తిక్కనకు ముందు వ్రాశాడు. అది ప్రచారంలో వుంది. అందుకే తిక్కన పూర్వ రామాయణ కథను ప్రథమాశ్వాసంలో క్లుప్తంగా వివరించి ముందుకు సాగాడు.

తిక్కన స్వవిషయం:

తిక్కన తనను గురించి అవతారికలో ఒక పద్యంలో సవివరంగా పేర్కొన్నాడు:

మ:
అమలోదాత్తమనీష నే నుభయ కావ్యప్రౌఢిఁ బాటించు శి
ల్పమునం బారగుఁడం గళావిదుఁడ నాపస్తంబసూత్రుండ గౌ
తమ గోత్రుండ మహేశ్వరాంఘ్రికమల ధ్యానైకశీలుండ న
న్నమకుం గొమ్మనమంత్రికిన్ సుతుఁడఁ దిక్కాంకుండ సన్మాన్యుఁడన్.
(అవతారిక-13)

అన్నమ్మ తల్లి. కొమ్మన తండ్రి. తాను సంస్కృతాంధ్రాలలో దిట్ట.

ఉత్తర రామాయణాన్ని 1798 ప్రాంతం వాడైన కంకంటి పాపరాజు పురాణశైలిలో కాక ప్రబంధశైలిలో వ్రాశాడు. సీతా పరిత్యాగము, రంభారావణ సంవాదం వంటి ఘట్టాలలో తిక్కన అద్భుతంగా సన్నివేశాలు చిత్రించాడు. పాపరాజు కరుణరస పోషణలో దిట్ట. 40 పద్యాలలో పూర్వరామాయణాన్ని సంక్షిప్తంగా తిక్కన చెప్పి ఆ తర్వాతి ఉత్తరకథ వైపు నడక సాగించాడు.

కథా ప్రారంభం:

రామ పట్టాభిషేకానంతరం శ్రీరామచంద్రుడు అయోధ్యను పరిపాలిస్తున్న సమయంలో జనకాదులు రాముని వద్దకు వచ్చారు. అక్కడకు వచ్చిన మునులు రాముని స్తుతిస్తూ రావణ వధ గూర్చి ప్రస్తావించారు. వారి ద్వారా రావణుని వంశవృత్తాంతం తెలుసుకోవాలని రాముడు కుతూహలపడ్డాడు. అగస్త్యుడు కథ వివరంగా చెప్పాడు. ఈ అగస్త్యుడే రామునికి యుద్ధ సమయంలో ఆదిత్య హృదయం బోధించాడు.

పులస్త్య మహర్షి తపస్సు చేసుకొంటున్నాడు. తన ఆశ్రమంలో వున్న దేవ గంధర్వ మనుష్య కన్యలను తనకు దూరంగా వెళ్ళిపొమ్మని కట్టడి చేశాడు. ఎవరైనా నాకు ఎదురుపడితే గర్భం ధరిస్తారని చెప్పాడు. ఒక కన్య ఆ విషయం వినలేదు. ఆమె మునికి ఎదురుపడగానే వెంటనే గర్భచిహ్నాలు కనిపించాయి. వారి విశ్రవసుడు జన్మించాడు. అతడు బ్రహ్మను గూర్చి ఘోర తపస్సు చేశాడు. అతనికి బ్రహ్మ పుష్పక విమానం బహుకరించాడు. అతడు తండ్రి సూచించిన విధంగా లంకా నగరంలో కొలువుతీరాడు.

దేవదానవ సంగ్రామం:

రాక్షసుల బాధ భరించలేక దేవతలు వారిపై యుద్ధానికి వెళ్ళారు. వారికి తోడుగా విష్ణువు సహకరించాడు. మాల్యవంతుడనే రాక్షసుడు ఓడిపోయి, పాతాళానికి వెళ్ళిపోయాడు.

రావణ జననం:

సుమాలి కుమార్తె అయిక కైకసి తండ్రి ఆదేశంతో విశ్రవసుని వద్దకు వెళ్ళి నిలిచింది. వారిద్దరికీ పది తలల రావణుడు జన్మించాడు. ఆ తర్వాత కుంభకర్ణుడు, శూర్పణఖ, విభీషణుడు జన్మించారు. పెరిగి పెద్దవారైన రావణాదులు తపస్సు చేసి వరాలు సంపాదించారు. దేవ దానవ గంధర్వాదులు ఎవ్వరి చేత మరణం లేని వరం పొందాడు. అలాగే విభీషణుడు ధర్మవర్తనతో మెలిగే వరం పొందాడు. కుంభకర్ణుడు ‘నిద్ర’ ప్రసాదించమన్నాడు.

రావణుడు లంకపై దండేత్తి కుబేరుని తరిమివేశాడు. అతడు స్వయాన తన తమ్ముడు. రాజ్యాధికార విషయంలో బంధుత్వ మొహమాటం పనికిరాదని రావణుడు నిష్కర్షగా చెప్పాడు. శూర్పణఖకు విద్యుజ్జిహ్వునితో పెండ్లి చేశారు. అతణ్ణి ఒక యుద్ధంలో పొరబాటున రావణుడే సంహరించాడు. రావణునికి మండోదరితో వివాహమైంది. వారికి ఇంద్రజిత్తు జన్మించాడు.

రావణుడు కుబేరుని పుష్పక విమానాన్ని బలవంతంగా తెచ్చుకున్నాడు. పుష్పకవిమానంపై వెళ్తున్న రావణుడు కైలాసం మీదుగా వెళ్ళినందుకు నందీశ్వరుడు శపించాడు. రావణుడు కైలాసాన్ని పెకిలించబోయాడు. శివుడు కరుణించి విడిచిపెట్టాడు.

వేదవతి శాపం:

హిమాలయాలపై సంచరిస్తూ రావణుడు తపోదీక్షలో వున్న వేదవతి కేశాలు పట్టుకొన్నాడు. ‘నీకు మృత్యువుగా నేను జన్మిస్తా’నని ఆమె శపించింది. రావణుడు దిగ్విజయ యాత్ర చేస్తూ యమలోకానికి వెళ్ళాడు. వాళ్ళిద్దరికీ ద్వంద్వ యుద్ధం జరిగింది.  బ్రహ్మ అడ్డువచ్చి యుద్ధం మాన్పించివేశాడు. అక్కడి నుండి వరుణ లోకంపైకి యుద్ధానికి వెళ్ళాడు. లోకంలోని స్త్రీలను చెరపట్టి తెచ్చి లంకలో పెట్టాడు.

రావణుడు శూర్పణఖకు దండకారణ్యాన్ని దత్తం చేసి, ఖరదూషణాదులను ఆమెకు రక్షగా పంపాడు. ఇంద్రజిత్తు ‘కుంభిల’ అనే యజ్ఞం చేశాడు. ఇంద్రలోకానికి వెళ్ళిన రావణుడు రంభను చూసి మోహించాడు. ఆమెను బలాత్కరించాడు. నలకూబరుడు రావణుని శపించాడు. ‘స్త్రీలను బలాత్కరిస్తే మృత్యువు సంభవిస్తుంద’నేది శాపం!

దేవ దానవ యుద్ధంలో ఇంద్రుణ్ణి రావణుడు బంధించి లంకకు తీసుకెళ్ళాడు. బ్రహ్మదేవుడు వచ్చి ఇంద్రజిత్తుకు వరమిచ్చి ఇంద్రుని విడిపించుకెళ్ళాడు. రావణుడు కార్తవీర్యార్జునితో పోరాడి అతనికి చెరబడ్డాడు. పులస్త్య మహర్షి వచ్చి కార్తవీర్యుని వేడుకొని రావణుని విడిపించుకొని వెళ్ళాడు. కిష్కింధలో వాలిపై యుద్ధానికి వెళ్ళిన రావణుని వాలి చంకలో ఇరికించుకుని నాలుగు సముద్రాలలో ముంచాడు. భంగపడ్డ రావణుడు వాలితో స్నేహం చేశాడు.

హనుమ జననం:

కేసరి భార్య అంజనకు జన్మించిన వాడు హనుమంతుడు. ఆ హనుమ సూర్యుని ఒక ఫలంగా భావించి మింగబోయాడు. అతదు ఇంద్రుని వద్దకు పరుగుతీశాడు. ఇంద్రుడు వజ్రాయుధం ప్రయోగించగా హనుమ మూర్ఛిల్లాడు. తండ్రి బ్రహ్మ వద్దకు వెళ్ళి హనుమను చైతన్యపరిచాడు. ఇంతవరకు కథ చెప్పిన అగస్త్యుడు రాముని వద్ద సెలవు పుచ్చుకుని వెళ్ళిపోయాడు.

సీతారాముల వన విహారం:

అయోధ్యా నగరంలో సీతారాములు ఉల్లాసభరితంగా వనవిహారం చేస్తున్నారు. అలాగే జలవిహారం కూడా చేశారు. క్రమంగా సీతాదేవి గర్భవతి అయింది. ఒకనాడు ఆమె తన పతితో గంగాతీరానికి వనములకు వెళ్ళాలనే కోరిక వెలిబుచ్చింది. ఇంతలో నర్మసచివుల ద్వారా లోకాపవాదాన్ని రాముడు గ్రహించాడు (చాకలి అపవాదు వేశాడని ఎక్కడా లేదు). ఆ అపవాదానికి వెరచి రాముడు సీతను వదిలిపెట్టాలని నిశ్చయించుకున్నాడు.

లక్షణుని వెంట సీతను వనాలకు పంపాడు. అక్కడ ఆమెకు లక్ష్మణుడు రాముని మనస్సు తెలిపాడు. సీత నిష్ఠూరాలాడింది. అది వాల్మీకి ఆశ్రమ ప్రాంతం. వాల్మీకి సీతను చేరదీసి ఆశ్రమానికి చేర్చాడు. వాల్మీకి ఇలా అన్నాడు:

చం.
“ఇది మనయాశ్రమం బిచట నీవు వసింపు తపస్విసుల్ ప్రియం
బొదవఁగ నీకు నెల్ల పనియుం బరమాదరవృత్తి నాచరిం
చెద రిదే నీగృహంబునకుఁ జేరితి గావున నీదుగర్భ మ
భ్యుదయముఁ బొందు దుర్యశము వోవుఁ బదంపడి నమ్ము మెమ్మెయిన్.”
(నవమాశ్వాసం-45)

రాముడు ఏకాంతంలో సీతను తలపోసి చింతించాడు. లవణాసుర సంహారానికై వెళ్ళిన శత్రుఘ్నుడు మునుల సూచనతో లవణుని సంహరించాడు. రాముడు అగస్త్య ముని యజ్ఞాన్ని సందర్శించి అయోధ్యకు వచ్చాడు.

వాల్మీకి ఆశ్రమంలో కుశలవులు జన్మించారు. పెరిగి పెద్దవారైన వారు వాల్మీకి రామాయణాన్ని అశ్వమేధయాగం చేస్తున్న రాముని యాగశాలలో గానం చేశారు. అక్కడికి వాల్మీకి వచ్చి కుశలవులు సీతకు జన్మించిన నీ కుమారులని అప్పగించాడు. ఇక్కడ శపథం చేయమని సీతను రాముడు కోరగా, ఆమె తన తల్లి భూదేవిని ప్రార్థించి ఆమె ఒడిలో చేరిపోయింది. కుశలవులను నగరానికి తెచ్చిన రామచంద్రుడు వారికి రాజవిద్యలు నేర్పించాదు. రామరాజ్యాన్ని స్థాపించి పరిపాలన కొనసాగించాడు.

ఇదీ ఉత్తర రామాయణ గాథ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here