కావ్య పరిమళం-6

0
8

[box type=’note’ fontsize=’16’] సాహిత్య విశిష్టతలోనూ, కథాకథన శిల్పంలోనూ, పద్య రచనా చమత్కృతిలోనూ, శైలి విన్యాసంలోనూ మధురాలైన ప్రాచీన కావ్యాల పరిమళాలను అందిస్తున్నారు డా. రేవూరు అనంతపద్మనాభరావు. [/box]

మొల్ల రామాయణం

[dropcap]రా[/dropcap]మావతారంలో ప్రధాన లక్ష్యం దుష్టశిక్షణ. లోకకంటకుడైన రావణుని వధించడం కోసం రాముడు అవతరించాడు. వాల్మీకి రామాయణం చిరస్థాయిగా నిలిచిపోయింది. అది అన్ని భాషలలోకి అనువదింపబడి కావ్యంగా, నాటకంగా, యక్షగానంగా చిరకాలం నిలిచిపోయింది. తెలుగులో భారత, భాగవతాదులవలె ప్రామాణికంగా నిలిచిన రామాయణం ప్రాచీన కాలంలో రాలేదు. ఎందరో తెలుగు కవులు తమ అభిరుచులకు అనుగుణంగా రామాయణం వ్రాశారు, వ్రాస్తున్నారు. ఈ పరంపరలో వచ్చిన రామాయణ కావ్యాలు ఇవి:

1 తిక్కన – నిర్వచనోత్తర రామాయణం

2 ఎర్రన –  రామాయణం

3 భాస్కరుడు – భాస్కర రామాయణం

4 మొల్ల – రామాయణం

5 అయ్యలరాజు రామభద్రుడు – రామాభ్యుదయం

6 రఘునాథ నాయకుడు – రామాయణం

7 కంకంటి పాపరాజు – ఉత్తర రామాయణం

8 గోగులపాటి కూర్మ కవి – గోపీనాథ రామాయణం

9 కట్ట వరదరాజు – వరదరాజ రామాయణం

ఆధునికులలో ఎందరో వ్రాసినా విశ్వనాథ సత్యనారాయణ ‘రామాయణ కల్పవృక్షం’ జ్ఞానపీఠ బహుమతి నందుకుంది.

ఆతుకూరి మొల్ల:

మొల్ల పుట్టుపూర్వోత్తరాలు ఇదమిత్థంగా తెలియవు. కానీ సాహిత్యకారులు కొంత పరిశ్రమించి కొన్ని విషయాలు సేకరించారు. ఆమె ఆతుకూరి కేసన కుమార్తె. గోపవరపు శ్రీకంఠ మల్లేశుని వరప్రసాదంచే కవిత్వం అబ్బింది. ఈమె కుమ్మరి మొల్లగా ప్రసిద్ధురాలు. గోపవరం నెల్లూరు జిల్లాలో ఉంది. ఈమె తెనాలి రామకృష్ణుని కాలం నాటిదని కొన్ని చాటు గాథలు సృష్టించబడ్డాయి.

తిక్కన్న వరప్రసాదం వల్ల మొల్ల వచన కావ్యంగా రామాయణం రాసిందనీ, దానిని ప్రతాపరుద్రునికి అంకితంగా రాసిందనీ ప్రతీతి. ఆ రాజు ఆమెకు పల్లకీ, నగరీ, నిత్య జీవితము – కట్టడి చేశాడు. 14వ శతాబ్దపు నాటిదని చరిత్రకారుల అభిప్రాయము.

పూర్వకవి స్తుతిలో ఈమె నన్నయను, రంగనాథుని, తిక్కనను, శ్రీనాథుని పేర్కొంది. రామచంద్రుడు తనను ఈ కావ్యం వ్రాయమని కోరాడట!

కం:

చెప్పుమని రామచంద్రుడు
చెప్పించిన పలుకుమీద చెప్పెద<, నే నె
ల్లప్పుడు ఇహపర సాధన
మిప్పుణ్య చరిత్ర తప్పులెంచకుడు కవుల్. (పీఠిక – 13)

పోతన కూడా ‘పలికెడిది భాగవతమట పలికించెడివాడు రామభద్రుండట‘ అని వినయంగా పలికాడు.

మొల్ల తన రామాయణాన్ని కొత్తదనంతో వొడలు పులకించే రీతిలో పుణ్య స్థితి కోసం వ్రాసింది. తేట తెలుగు మాటల్లో సరళంగా చెబుతానని చెప్పింది.

చం:

వలిపపు సన్న పయ్యెదను వాసిగ గందపుఁ బూఁతతోడుతన్‌
గొలదిగఁ గానవచ్చు వలి గుబ్బ చనుంగవ ఠీవి నొప్పఁగాఁ
దెలుఁ గని చెప్పుచోటఁ గడుఁ దేటలఁ మాటలఁ గ్రొత్త రీతులం
బొలుపు వహింపకున్న, మఱి పొందగునే పటహాది శబ్దముల్‌? (పీఠిక-15)

“భక్తికీ, ముక్తికీ మూలమైన రఘురాముని స్తుతించడం తప్పా? అని మనకు ఎదురు ప్రశ్న వేసింది. మొల్ల వినయ స్వభావం గలది. భగవత్ ప్రసాదమైన అసాధారణ కవితా శక్తితో 869 గద్య పద్యాలతో ఆరు కాండలు రచించింది

బాలకాండ వంద పద్యాలు, అయోధ్య 43, అరణ్య 75, కిష్కింద 27, సుందర 249 పద్యాలతో పూర్తి చేసి యుద్ధకాండను 351 పద్యాలలో కూర్చింది. సంస్కృత రామాయణంలో కూడా యుద్ధకాండ సుదీర్ఘంగా ఉంది. కావ్యంలో మొల్ల మహిళా స్వభావ గంభీర శీలత్వాన్ని చక్కగా పోషించింది. శ్రీ రామచరిత్రను కథ చెప్పినట్లు మహా వేగంతో చెప్పుకుంటూ వెళ్ళింది.

రచనా విశిష్టత:

సుందరకాండ వరకు ఏకబిగిన కథను నడపడం వల్ల అనేక ఘట్టాలను మొల్ల వదిలివేసింది. దశరథుని భార్యల ప్రస్తావన మొదట్లో లేదు. పుత్రకామేష్టి సమయంలో కౌసల్య ప్రస్తావన వచ్చింది. పాయసం పంచేటప్పుడు సుమిత్ర, కైక కనిపిస్తారు. అలానే శ్రవణ కుమారుని కథ, మంధర వృత్తాంతము, అహల్య పూర్వ గాథ పరిహరించింది. అహల్యా శాప విమోచనం ప్రస్తావించింది, కబంధ వధ, సుగ్రీవ – రావణ ద్వంద్వ యుద్ధం, ఆదిత్య హృదయం వంటి వృత్తాంతాలు లేవు. లంకలో హనుమంతుడు సీతను వెదికే సన్నివేశాలు తగ్గించింది. మిగతా కవులు కూడా ఇలా కొన్ని పరిహరించారు.

“వర్ణనలు ప్రత్యేకంగా ఉంటాయి. అయోధ్యకాండలోని అంధకార, నిశా వర్ణనలు చాలా హృదయంగమంగా ఉండడమే కాక లౌకిక అనుభవాన్నీ, ప్రకృతి శోభను ఆకళింపు చేసుకోవటంలో ఆమెకుగల ప్రత్యేక వ్యక్తిత్వాన్ని చాటి చెబుతున్నాయి” అంటారు శ్రీమతి ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ.

చీకటిని – “నీటి చందాన ఇంద్రనీల మహిమ” అంటూ నీటితో పోల్చడం నవ్య భావుకత.

“కారు మొగులు రీతిఁ,గాటుక చందాన,
నీటి భాతి, నింద్ర నీల మహిమ,
మాష రాశి పోల్కిఁ, మఱి మఱి యపు డంధ
కార మవని యెల్లఁ గలయఁ బర్వె.”

పరమేశ్వరుడిచ్చిన హక్కుతో వెన్నెలలో స్వేచ్ఛగా విహరిస్తూ, వెన్నెల తీగలను ముక్కున కరచుకొని ప్రియుల నోళ్లకు అందించి ఆనందించాలని తహతహతో మెరుపు తీగల పంచ కళ్యాణుల వలే జక్కవకవలు దౌడు తీస్తున్నాయట!

అసూర్యంపశ్యయై. రాజాంతఃపురంలో మెత్తని పూలరాశిలో అడుగులు వేయడమే భారంగా బాధపడే సుకుమారీ,  నవ శిరీష కుసుమ కోమలాంగీ అయిన సీతమ్మ కఠిన కంటక శిలా పరివృతమైన అడవులలో నడువనేరని కాంత అడుగులు పొక్కులై శర్కర స్థలాలలో విశ్రాంతి తీసుకున్నాయట!

పాపం! తనంత తాను తన బలంపై నడిచే స్థితి కూడా సన్నగిల్లి భర్త కైదండ ఆసరా చేసుకుని మనసులోని చేవ ఊట కాగా తనను అప్రయత్నంగా ముందుకు నెట్టేస్తూ ఉంటే, ప్రతి అడుగుకు దప్పికతో ఎండిన పెదవుల్ని నాలుకతో తడుపుకుంటూ, నీడ ఎక్కడ దొరుకుతుందా అని పరిసరాలు వెతుక్కుంటూ నడవలేక ఈడిగిలబడే పిచ్చి జానకమ్మ బాధ మన మనసును చుట్టేసి కన్నీళ్లు తెప్పిస్తాయి.

హనుమంతుని ద్వారా శ్రీ రామచంద్రునకు ప్రతిసందేశం సీతమ్మ పంపింది. ఆమె మాట్లాడిన ప్రతి మాటలోను కంటికి కడివెడు నీళ్లతో కనబడే సీతమ్మ మనకు కనిపిస్తుంది. మనసు మెత్తన, అంతకంటే తలపు మెత్తన అయిన మొల్ల హృదయంలోంచి సుతిమెత్తని అయినా పలుకు రాక మరొకటి వస్తుందా? మెత్తని ఆ పలుకుల మొత్తంలో ఉండి కొట్టవచ్చినట్లు కనపడే సీతమ్మ ఉత్తమ శీలసంపదని ఎంతో హుందాగా చిత్రించింది మొల్ల. రావణునితో మాట్లాడినప్పుడు మూడో కన్ను తెరిచి మరీ మరీ మాట్లాడింది. హనుమంతుని తోకకు లంకలో నిప్పు అంటించినట్లు విన్న సీత ‘అగ్ని మంత్రము’, ‘బ్రహ్మ మంత్రం’ ఉచ్చరించి హనుమకు చల్లదనం కల్పించింది – అని కవయిత్రి చెప్పడం మాతృ హృదయాన్ని ఆవిష్కరిస్తుంది.

సీత సహజ ధైర్యం:

రావణ సంహారం తరువాత శ్రీ రాముడు ఇలా అన్నాడు:

“కులసతిఁ జెఱ గొనిపోయిన
యలశాత్రవు గెలువ నోపఁ డనుపలుకులకున్‌
గెలిచితిఁ బగ చంపితి నిఁక
నెలఁతా! నీయిచ్చఁ జనుము నే నిన్నొల్లన్‌.” అంటాడు.

చెవులకు కఠినంగా ఆ మాటలు సీతకు వినిపించాయి. ఆమె ధైర్యంగా ఇలా పలికింది:

చం:

నరవర! నాదుచిత్తము మనంబున నీవ యెఱింగియుండియున్‌
బరుషము లాడ నేమిటికిఁ బాపము నాయెడ లేదు కాదుపో
సురలు నుతింప మేటిసొదఁ జొచ్చెద మెచ్చుఁ డటన్న రామభూ
వరునిమనం బొడంబడిన వారిజలోచన సీత యాతఱిన్‌.

(యుద్ధ-తృతీయ-117)

జీవన్మరణ సమస్యగా ఉన్న ఆ విషమ సమయంలో కూడా సీత తన సహజ ధైర్యాన్ని వీడనట్లు మొల్ల చిత్రించింది.

“నా యెడ పాపము లేదు. కాదు పో సొద జొచ్చెద” అని ఆడ సింగం వలె గర్జించింది. “రామో విగ్రహవాన్ ధర్మః” అనిపించుకున్న రామచంద్రుని ధర్మ కవచాన్ని, తన నిర్భయ శీలంతో పగలగొట్టి పారేసింది మొల్ల సీత. శివధనస్సును శ్రీరాముడు నిలిచిన సమయంలో ఇతర రాజులు శిరము వంచి సిగ్గులతో తలలు దించగా, మేను పెంచిన సీత ప్రప్రథమంగా కనిపిస్తుంది. ఈ తుది క్షణాలలో కూడా ధీరంగా మేను వంచకుండానే నిలబడింది. ఆ విధంగా మొల్ల సీత వ్యక్తిత్వ సౌభాగ్యానికీ, ఔన్నత్యానికి జయగీతిక పాడింది.

గుహుడు రాముని పాదాలు కడిగిన సన్నివేశం మనకు సినిమాలో హృద్యంగా చిత్రీకరించబడింది. అది మొల్ల చిత్రణయే.

చం:

“సుడిగొని రాము పాదములు సోఁకిన ధూళి వహించి రాయి యే
ర్పడ నొక కాంత యయ్యె నఁట, పన్నుగ నీతని పాద రేణు వి
య్యెడ వడి నోడసోఁక నిది యేమగునో” యని సంశయాత్ముఁడై
కడిగె గుహుండు రామపద కంజయుగంబు భయమ్ము పెంపునన్‌.”

(అయోధ్య-32)

రాముని పాదధూళి సోకి రాతి నాతిగా మారింది తన పడవకు రాముని పాదధూళి సోకితే ఏమవుతుందోనని గుహుడు భయంతో రాముని రెండు కాళ్లు కడిగాడు. ఇది హృద్యమైన భావన. సందర్భోచితంగా అనల్పశిల్ప రామణీయకతతో పద్యాన్ని మలచి, భావానికి ప్రాణంపోసి ఆ సన్నివేశాన్ని మన కళ్ళ ఎదుట నిలబెట్టి ఆడించగల నేర్పరి మొల్ల!

ఇంతెందుకు, మొల్ల రామాయణం తెరిచి చూద్దాం, తరచి తరిద్దాం!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here