కాయిలా

10
8

[dropcap]”క[/dropcap][dropcap][/dropcap]రోనా వైరస్ కాయిలా వచ్చిందని సర్కారు వాళ్ళు
దేశమంతా మూపిచ్చి (లాక్‌డౌన్ చేసి) జనాలని ఇండ్లలానే
వుండాలని చెప్పిండారు కదనా, ఏల ఇట్ల చేసిరినా?” అంటా
అన్నని అడిగితిని.

“అదేల అట్ల చేసిరని చెప్పతాను కాని నువ్వు రవంత
దూరంగా వుండి మాట్లాడరా” అదో మాద్రిగా అనె అన్న.

“నాది కాయకష్టం చేసే బతుకునా, ఆ కరోనా గిరోనా
పని నా తావ అయ్యేల్లే” ఇంగో మాద్రిగా అంట్ని.

“ఊ… ఊ… నీ మాద్రిగానే బూలోక దేశాల దొరలు
మాది అందరికంటే పెద్ద దుడ్డు (ఆర్థిక) దేశం. మాది కత్తి
కటార్ల (ఆయుధ శక్తి) దేశం. మమ్మల్ని ఎవురూ ఏమీ చేసేకి
అయ్యేల్లే అని ఎగురలాడి దుమకలాడిరి. అట్లా వాళ్ళకే ఇబుడు
ప్రకృతమ్మ కరోనా పేరులా పాఠాలు నేర్పుతా వుంది. గడ గడ
లాడిస్తా వుంది. ఇంగ నువ్వేంతరా” అనె.

అన్న అట్లంటేనే నా వళ్లు సల్లగా అయిపోయ
మెల్లిగా లేసి రవంత దూరంలా పోయి కూకొంట్ని.

“అట్లరా దొవకి” అని అన్న చెప్పేకి సురువు చేసే.

“రేయ్! రామాయణ కాలములా రామరావణాసుర
యుద్దము జరిగేతబుడు మేఘనాధుదు రామలచ్చుమణుల
పైన బ్రహ్మాస్త్రము ఏస్తే (ప్రయోగిస్తే) దాన్ని తట్టుకొని
నిలవాలంటే తమ చేతిలా అయ్యే పని కాదని తలసి
తమ తావ (వద్ద) వుండిన విల్లు, అంబులను పారేసి ఆ అస్త్రానికి
చేతులెత్తి దండము పెట్టిరంట. తనకి ఎదురు నిలసి యుద్దము
చేయనోళ్ళని ఏమీ చేయలేని ఆ అస్త్రము కలకుండా వచ్చిన
దోవలోనే ఎల్లీసినంట. ఈ కత తెలుసా నీకి?” అనె.

“ఊనా, తెలుసునా” అని అంట్ని.

“అట్లే మహాభారత యుద్ధంలో కూడా ద్రోణాచార్యుని
చంపిందానికి రేగిపోయిన కొడుకు అశ్వత్థామ నారాయణ అస్త్రాని
పాండవుల సైన్యము పైన ఏస్తే, అబుడు శ్రీకృష్ణుడు ‘అందరు
మీ తావ వుండే కత్తులు, కటార్లు నేలపైన పారేసి చేతులు కట్టు
కొని నిలుసుకొండా’ అని చెప్పిందానికి అంద్రూ అట్లే చేసిరంట.
చేతిలా ఆయుధం లేని, పోరాడలేని వాళ్లని ఏమీ చేయని
నారాయణ అస్త్రము ఎవుర్ని ఏమీ చేయకుండా నేలపైన పడి
పోయినంట. ఇది తెలుసునా?” అంటా అడిగే.

“తెలుసునా, అయినా ఇబుడు ఆ కతలు ఏమిటికి
చెప్పతా వుండావునా?

“ఏమిటికా ఈ కరోనా వైరస్ అనేది కూడా ఈ అస్త్రాల
మాద్రినే (లాంటిదే). దీన్ని ఎదురిచ్చి నిలసేకి, బతికి బట్టకట్టేకి
బూలోక జనాల చేతిలా అయ్యేలే. దాన్నింకానే సర్కారు వాళ్లు
ఇట్ల చేసిండేది. ఏడంటే ఆడ పారాడి కరోనా అస్త్రానికి చిక్కి
బలి కావొద్దండా, ఇండ్లలానే వుండండా అని చెప్పిండేది” అసలు
సమాచారము ఇలావరిగ చెప్పే అన్న.

సర్కారు వాళ్ళ లోగుట్టు అబుడు అర్థము అయేనాకి.
“ఇవతలికి వచ్చేది ఏలా కరోనా చేతిలా చిక్కి చచ్చేది
ఏల?” అని మనసులానే అనుకొని ఆడనింకా లేసి ఇంట్లాకి పారిస్తిని.


కాయిలా = రోగం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here