కీర్తిశ్రీ

6
12

[dropcap]”హ[/dropcap]లో ధరమ్ తేజా! నేను చాణక్యవర్మను మాట్లాడుతున్నాను. నువ్వు రియల్ స్టోరీ కవరేజ్ కోసం ఫీల్డ్‌కెళ్ళి వారం రోజులైయ్యింది. తెలుసా?

మన సత్యం టి.వి. ఛానల్‌కి కీర్తి ప్రతిష్ఠలు పెంచే నీ కవరేజ్ కోసం వేయికళ్ళతో ఎదురుచూస్తున్నాం. చూడు ధరమ్ తేజా! నాకు ఇంకా చాలా పనులున్నాయి. నువ్వు మన ఛానల్ యొక్క విలువైన కాలాన్ని వృథా చేస్తున్నావ్… త్వరగా నేనిచ్చిన టాస్క్ పూర్తి చేసేయ్” అని ఇంకొకసారి సీరియస్‌గా చెప్పి ఫోన్‌ని డిస్కనెక్ట్ చేశాడు సత్యం టి.వి. సి.ఇ.ఓ. చాణక్యవర్మ.

ధరమ్ తేజ కూడా ఏదో చెప్పాలని ప్రయత్నించాడు. కానీ సమయానికి మాట్లాడే ధైర్యం రాలేదు. అసలు ఆయనిచ్చే డొక్కు పనులన్నీ ఇలాగే ఉంటాయి. వాటికి తలాతోకా ఉండవు. అదేదో పెద్ద ప్రాజెక్ట్ అయినట్లు గొప్ప బిల్డప్ మాత్రం ఇస్తాడు. తీరా ప్రాక్టికల్‌గా ఫీల్డ్ లోకి వెళ్ళి చూస్తే, అక్కడ గాడిద గుడ్డు కూడా దొరదు అని తిట్టుకున్నాడు ధరమ్ తేజ.

గాడిద గుడ్డు అంటే గుర్తొచ్చింది. బ్రిటిష్ వారి కాలంలో ఒక ఇంగ్లీషు అధికారి మన తెలుగువాడితో మాట్లాడుతూ “గాట్ ద గుడ్” అన్నాడు. దీన్ని అర్థం ఏమిటంటే ఎలాంటి సందర్భంలోనైనా మంచిని తీసుకో, మంచి విషయం దొరికింది అని అనుకోవాలని చెప్పాడా అధికారి.

అది విన్న మన తెలుగోడికి అర్థంకాక పచ్చి వెలక్కాయ గొంతులో ఇరుక్కుంది. నిజానికి ఆ అధికారి చెప్పిన విషయం ఏ మాత్రము అర్థంకాక, దాన్ని “గాడిద గుడ్డుగా” అర్థం చేసుకున్నాడు. అప్పటి నుండీ అది గాడిద గుడ్డ మన తెలుగుభాషలోకి అడ్డగాడిదలా అడ్డంగా వచ్చేసింది.

ఈ గాడిద గుడ్డు గురించి, మా గాడిద గుడ్డు ఛానల్లో ‘ఇంగ్లీషు పదాలు తెలుగులోకి’ అనే స్పెషల్ ప్రోగ్రామ్‌కి యాంకరింగ్ చేసింది నేనే! అని తన ప్రియమణి సింధూరికి గొప్పగా చెప్పి పడీపడీ నవ్వుకున్నారిద్దరూ.

నిజం చెప్పాలంటే సత్యం టివిలో సహజ వార్తలే ఎక్కువ. ఇక కట్టు కథనాలకు ఏ మాత్రం చోటు ఉండదు. అందుకే మా సత్యం టి.వి. కార్యక్రమాలు ఉదయం తొమ్మిది గంటల నుండి రాత్రి తొమ్మిది గంటలవరకే ఉంటాయని ఎంతో గర్వంగా చెపుతూ ఉంటాడు సి.యి.ఓ. చాణక్యవర్మ. అంతేకాదు టి.వి.సీరియల్ లాంటి వార్తాకథనాలు సత్యం టీవిలో రానే రావని జనమే కితాబిచ్చారు.

అనవసరమైన బ్రేకింగ్ న్యూస్ ఉండనే ఉండవు. ఇలాంటి ప్రత్యేకమైన కారణాలవల్లే సత్యం టివి ఛానల్‌కి అభిమానులు అనూహ్యంగా పెరిగిపోయారు.

ఎంత మేసినా గొర్రెకు బెత్తెడు తోకే కదా! అని డిసైడైపోయాడు. తక్కువ శాలరీ, ఎక్కువ ఎసైన్‌మెంట్లు అనే ఉద్దేశంతోనే హాయిగా సింధూరితో మోహనరాగాలు పాడుకుంటూ వారం రోజుల నుండీ ఎంజాయ్ చేస్తున్నాడు ధరమ్ తేజ.

ఒకరినొకరు వదులుకోలేకపోతున్నారు. ఇక తప్పదన్నట్లు రొటీన్‌లో పడాలని నిర్ణయించుకున్నారు ఇద్దరూ.

సింధూరి వారం రోజుల శెలవు తర్వాత ఒక గంట ఆలస్యంగా ఆఫీసుకెళ్ళింది. ఆఫీసులో బాస్ ఇచ్చే డోస్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. బాస్ తీసుకునే స్పెషల్ క్లాస్ మరీ రూడ్‌గా ఉంటుంది. ‘ఓ మై గాడ్ సేవ్ మి’ అని కళ్ళు మూసుకొని దేవుణ్ణి ప్రార్థిస్తూ తన సిస్టమ్ టేబుల్ దగ్గరకు చేరుకొంది. కానీ బాస్ ఆ రోజు ఆఫీసుకు రాడట! ఆయన నాలుగురోజులు శెలవులో ఉన్నట్లు స్వీట్ న్యూస్ చెప్పింది అమృత.

సత్యం శివం సుందరం అనే పాటను హమ్ చేసుకుంటూ “దేవుడా ఈ ప్రోగ్రామ్‌తోనైనా నాకు ప్రమోషన్ వచ్చేటట్లు చేయి” అంటూ ప్రార్థిస్తూ డొక్కు కారులో ముందుకు సాగిపోతున్నాడు సత్యం టివి రిపోర్టర్ ధరమ్ తేజ.

ధరమ్ తేజ డొక్కు కారు శ్రీశైలం వెళ్ళే రహదారిపై కొంచెం ఇబ్బందిగానే నడుస్తోంది. మధ్యలో ఆగిపోతూ ఉంటుంది. ఎందుకంటే సింధూరి వెళ్ళిపోయినందుకు కారుకి కూడా చెప్పలేనంత విరహంగా ఉంది మరి.

డొక్కు కారుకి ఒక్కసారిగా బ్రేకులు పడ్డాయి. ధరమ్ తేజ చేరాలనుకున్న “ఆమనగల్లు” కుగ్రామం వచ్చేసింది. మెయిన్ రోడ్డుమీద నుండి సరాసరి ఊళ్ళోకి వెళదామనుకున్నాడు. ఇంతలో రోడ్డు పక్కనున్న పాకలో ఒక కడక్ చాయ్ తాగాలనిపించింది. ఇలాచీ చాయ్ తాగేసరికి ఏదో ఒక కొత్త ఉత్సాహం వచ్చినట్లనిపించింది. చిల్లర లేక వంద రూపాయల నోటు ఇచ్చాడు.

“చిల్లర లేదు సార్! మీరు మళ్లీ వచ్చినపుడు ఇవ్వండి” అన్నాడు టీ కొట్టు లక్ష్మయ్య. “మరి నేను మళ్ళీ రాకపోతేనో” అన్నాడు.

“సార్! మీరు మా ఊరికి మళ్ళీ మళ్ళీ రావాలనే మేం కోరుకుంటాం. మా కోసం కాకపోయినా శ్రీశైలం మల్లన్న మొక్కుల కోసం వస్తారుగా! అప్పుడిద్దురుగాని” అని టీ కొట్టు లక్ష్మయ్య అన్న ఆత్మీయమైన మాటలు తల్చుకుంటూ, మళ్లీ హఠాత్తుగా కారుకు బ్రేకులు వేశాడు.

ఇటు మట్టి రోడ్డు నుండీ అటు బీడు పొలాలవైపు వెళుతున్న మేకల మందలు, గొర్రెల గుంపులూ మే! మే! అని అరుస్తూ కారుకి అడ్డంగా వచ్చేశాయి. “ఏయ్ సిటీ మణీసీ, నీకు కళ్ళు కన్పించటం లేదా? మా మూగజీవాలను సంపేత్తావా ఏంటి?” అంటూ కస్సుమంది ఓ చలాకీ అమ్మాయి.

ఆమె చేతిలో ఓ కర్ర, ఒక భుజానికి నీళ్ళకుండ, ఇంకొక భుజానికి అన్నం మూట కట్టుకొని వయ్యారంగా తన వంకే చూస్తోంది. “ఏంటి? నన్ను తినేలా అలా సూత్తావ్? ఓ సిటీ బాబు నేను సెప్పే మాటలు ఇనిపించటం లేదా ఏంటి?” అని ఇంకా గట్టిగా అరుస్తోంది.

“ఎందుకమ్మా అలా చెవి కోసిన మేకలా అరుస్తావ్? నేను ఈ ఊరికి కొత్తగా వచ్చాను. ఏదో చూసుకోలేదులే” అన్నాడు ధరమ్ తేజ.

“ఉత్తినే అలా చూసుకోలేదు అంటే మా ఊళ్ళో కుదరదు. క్షమించమని ఏడుకోవాలి, ఆ తరువాత ఐదుగుంజీలు తీసి టపాటపా లెంపలేసుకోవాల” అని బుంగమూతి పెట్టింది అమ్మడు.

“అలాగేనమ్మా! నన్ను క్షమించు తల్లి” అన్నాడు.

“అంటే నీకు నేను తల్లిలా కనిపించానాంట!” అని మళ్ళీ చిర్రుబుర్రులాడింది. మొత్తానికి ఐదుగుంజీలు తీసి లెంపలేసుకున్నాడు పాపం ధరమ్ తేజ.

“ఇంతకీ నీ పేరేంటి?” అడిగాడు.

“నా పేరు అమ్మాణిగానీ ఇదుగో సిటీబాబు నీ కారులో ఎక్కుతాను కానీ, అలా ఒక చుట్టుకొడతావా” అని అమ్మాణీ అమాయకంగా అడిగేసరికి కాదనలేకపోయాడు ధరమ్ తేజ.

“కారు బాగానే ఉందిగానీ, నన్ను ఒక ఫోటో తీయి” అంది అమ్మాణి.

“అయితే సెల్ఫీ తీసుకుందాం!” అని ఆమె పక్కకు వెళ్ళేసరికి అమ్మాణీ “ఇలాంటి ఫోటోలు నాకొద్దు. నన్ను మాత్రమే సపరేటుగా ఫోటో తీయి. ఎందుకంటే మళ్ళీ నువ్వు సిటీకెళ్ళి పోతావు. నేనేమో ఇక్కడే ఉండిపోతాను. ప్రేమ అనేది మన మనసుల్లో ఉండాలి అంతే!” అని ముక్తాయించింది అమ్మాణి.

ఆమె మేక పిల్ల నెత్తుకొని, అతడు గొర్రెపిల్లనెత్తుకొని ఫోటోలు తీసుకున్నారు. “ఇదుగో నా మేకలు ఎల్లి పోతున్నాయి కానీ మళ్ళీ నువ్వుగానీ మా ఊరొత్తే నా ఫోటోలు తీసుకురా” అంటూ గలగలా నవ్వుతూ వెళ్ళిపోయింది పల్లె సహజ అందాల పడచు అమ్మాణి.

అమ్మాణిని చూస్తూ మంత్రముగ్ధుడైపోయాడు ధరమ్ తేజ. ఆమనగల్లులో ఊళ్ళో ఒక స్కూలు, ఇంకా ముందుకు వెళితే ఒక దేవాలయం ఎంతో కళకళలాడుతున్నాయి. వ్యవసాయ రైతులు వారి వారి పనుల్లో నిమగ్నమై ఉన్నారు.

“ఏమండీ డాకయ్యగారి ఇల్లెక్కడండి?” అని అడిగాడు ఒక పెద్ద మనిషిని.

“మీరు ‘డాకయ్య టీ పాక’ ముందర నుండీ గద వచ్చారు.

“ఔను!”

“అదే డాకయ్యగారి ఇల్లూ టీ కొట్టూ కూడా” అని ఆ వ్యక్తి చెప్పేసరికి ఆశ్చర్యపోయాడు ధరమ్ తేజ.

మళ్ళీ కారు తీసుకొని మెయిన్ రోడ్డుమీదకు వచ్చాడు. కారుని దూరంగా చెట్టు క్రింద పార్క్ చేసి డాకయ్య టీ స్టాల్ లోకి వెళ్ళాడు.

“బాబు ఒక బన్నూ ఒక చాయి ఇవ్వు. ఇంతకీ డాకయ్య అంటే ఎవరు? దయ ఉంచి వారి గురించి వివరంగా చెపుతారా?” అని తన కవరేజీకి వీడియో కెమెరాని సిద్ధం చేసుకున్నాడు.

“సార్! మా నాన్నగారి పేరు డాకయ్య. మా అమ్మగారి పేరు రాజమ్మ. వారికి మేము ఇద్దరు కొడుకులం. మా అన్నయ్య పేరు రామయ్య. నా పేరు లక్ష్మయ్య. మా నాన్న పెద్దగా చదువుకోలేదు కాబట్టి ఇలా చిన్నపాకలో టీకొట్టు పెట్టుకొని జీవనం సాగించాడు.

మా అమ్మ కూడా మా నాన్నకు చేదోడు వాదోడుగా ఉండేది. ఆ రోజుల్లో శ్రీశైలం వెళ్ళే యాత్రికులంతా వాళ్ళ వాహనాలు మా పాక దగ్గర ఆపుకొని బిస్కట్లు, బన్నులు తిని చాయ్ తాగి మళ్ళీ ప్రయాణమై వెళ్ళేవారు. మా నాన్న చాలామంది యాత్రికులకు టీలు, జొన్నరొట్టెలు ఫలహారంగా అందించేవాడు. ఒకవేళ వారిలో ఎవరి దగ్గరైనా డబ్బులు లేకపోతే వాళ్ళకు ఫలహారాలు, టీలు ఉచితంగానే ఇచ్చేవాడు. వాళ్ళలో కొందరు డబ్బులు ఇస్తామని ఇవ్వకపోతే కూడా నాన్న అడిగేవాడు కాదు.

అంతేకాకుండా శ్రీశైలం వెళ్ళే యాత్రికులకు, ఇతర ప్రయాణికులకు కూడా అంతో ఇంతో దారి ఖర్చుల కోసం నాన్నే డబ్బులిచ్చి వాళ్ళను పంపించేవాడు. మా అమ్మ నాన్నలిద్దరిదీ ఒకటే మాట.

ఈ దేహం ఉన్నది సేవ చేయటానికే కదా! తోటి మానవులకు సేవచేయటానికే దేవుడు మనకు ఈ జన్మనిచ్చాడని రోజూ అందరికీ చెపుతూ ఉండేవాడు మా నాన్న డాకయ్య. అలాంటి పుణ్యదంపతులకు మేమిద్దరం జన్మించటం మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం..

మా అమ్మా నాన్నా సాక్షాత్ పార్వతీ పరమేశ్వరులని మా నమ్మకం. మా నాన్నకు కళాకారులంటే చెప్పలేనంత అభిమానం. ఒకసారి సుంకేసుల రోశిరెడ్డి నాట్య బృందంవారి నాటకానికి తెల్లవార్లూ ఇటు నాటక కళాకారులకూ అటు ప్రేక్షకులకూ కూడా సేవా దృక్పథంతో చాయ్, కాఫీలు అందించాడు.

అలాగే భజన బృందాలకు కూడా తనవంతు సేవ చేసిన గొప్ప సేవా తత్పరుడు మా నాన్న డాకయ్య.

ఒకనాడు మా నాన్న బ్రహ్మం అనే టీచరుగారికి పాదాభివందనం చేశాడు.

‘అయినా పెద్దవాడివైన నువ్వెందుకు నాకు నమస్కరించావు’ అని బ్రహ్మం మాష్టారు అడిగాడు. ‘నేను వయసులో పెద్దవాడినైనా, నీ ముందు చాలా చిన్నవాడిని. ఎందుకంటే నీవు టీచరుగా ప్రతి సంవత్సరం సుమారు వందమంది ఉత్తమ శిష్యులను తీర్చిదిద్దిన ఆదర్శ ఉపాధ్యాయుడవ’నీ, ‘నీవు మా ఆమనగల్లు ఊరికే గురువువి’ అని అద్భుతంగా నిర్వచించిన మహామనిషి మా నాన్న..

సార్! అన్నిటికన్నా మించి ఇంకొక ముఖ్య విషయం. శ్రీశైలం ఆలయంలో శ్రీభ్రమరాంబిక మల్లికార్జున స్వామి దర్శనం కోసం వచ్చిన భక్తులు తాము డాకయ్యగారు పంపించగా వచ్చామని చెప్పగానే, వారికి వెంటనే దర్శనం చేయించేవారు ఆలయ కమిటీవారు..”

లక్ష్మయ్య గతంలో కెళ్ళి తన తండ్రి గురించి చెపుతూ ఉంటే అన్నయ్య రామయ్య మామూలుగా అందరికీ టీలు, కాఫీలు అందిస్తున్నాడు.

ధరమ్ తేజ డాకయ్య రియల్ స్టోరీని తన వీడియో కెమేరాలో రికార్డ్ చేస్తున్నాడు. ఇంతలో ఆకాశం ఒక్కసారిగా నల్ల దుప్పటి కప్పుకొంది. అంతలోనే ఉరుముల, మెరుపులతో ప్రకృతి పరవశిస్తోంది.

అది శృతిలయల లీలా, శివతాండవ హేలా! అన్నట్లుంది వాతావరణం. అప్పుడే తళుక్కుమంది ఒక మెరుపు, వెనువెంటనే క్షణాల్లో ఎక్కడో పిడుగుపడింది. ఎక్కడో కాదు ధరమ్ తేజ కారు మీదే పడింది. చూస్తుండగానే డొక్కుకారు కాస్త దగ్గమైపోయింది.

ఇంకా నయం తామున్న డాకయ్య టీ పాక మీద పడలేదు పిడుగు అని నెమ్మదిగా ఊపిరి పీల్చుకుంటూ కాలిపోతున్న కారును కూడా వీడియో కెమేరాతో చిత్రీకరించాడు టి.వి.రిపోర్టర్ ధరమ్ తేజ.

“మొత్తానికి ఇది చాలా గొప్ప ఎసైన్‌మెంటే” అనుకుని ఆర్టీసీ బస్సులో హైదరాబాద్ సిటీకి చేరుకున్నాడు ధరమ్ తేజ.

ధరమ్ తేజ తీసుకొచ్చిన కవరేజీని సత్యం టివిలో ప్రసారం చేశారు. మన మధ్యనున్న గొప్పవారినీ, వారియొక్క కీర్తి ప్రతిష్ఠలను కూడా మనం తప్పక తెలుసుకుని తీరాలి అని చెప్పి, ధరమ్ తేజకు ప్రమోషన్ లెటర్‌తో పాటు లక్ష రూపాయలు క్యాష్ అవార్డును అందించాడు సత్యం సి.ఇ.ఓ. చాణక్యవర్మ.

“థ్యాంక్యూ సార్! నన్ను క్షమించండి. డబ్బుతోపాటు ఉన్నత పదవి ఉంటేనే జీవితం అని భ్రమపడిన వారిలో నేను కూడా ఒకడిని. కానీ డాకయ్యగారి ఆదర్శవంతమైన జీవితం, కీర్తిప్రతిష్ఠల గూర్చి స్వయంగా తెలుసుకున్న తరువాత నా అభిప్రాయాన్ని మార్చుకున్నాను. నాకు తక్కువ శాలరీ ఇస్తున్నందుకూ, సకాలంలో ప్రమోషన్ ఇవ్వనందుకూ కూడా మిమ్మల్ని చాలాసార్లు తిట్టుకున్నాను” అని కన్నీళ్ళు పెట్టుకొని చాణక్యవర్మకు పాదాభివందనం చేశాడు.

“ఓ.కే. ఇట్స్ ఆల్‌రైట్! జరుగుతున్న కాలమే అన్నింటినీ నిర్ణయిస్తుంది” అని హితవు పలికాడు చాణక్యవర్మ. సత్యం టి.వి. సిబ్బంది అందరూ కరతాళ ధ్వనులతో ధరమ్ తేజను అభినందించారు.

“సార్ నాకు ఒకరోజు సెలవు కావాలి అని అడిగాడు ధరమ్ తేజ.

“ఎందుకు మళ్ళీ వారంరోజులవరకూ గైర్హాజరైపోవటానికా!” అని చమత్కరించాడు చాణక్యవర్మ.

“లేదు సార్! మీరిచ్చిన లక్ష రూపాయలూ డాకయ్య ఇద్దరి కొడుకుల ఇంటికోసం సహాయంగా ఇచ్చి వస్తాను” అన్నాడు. అమ్మాణీ ఫోటో తీసుకొని, సింధూరితోపాటు మళ్ళీ ఆమనగల్లుకి ప్రయాణమయ్యాడు ధరమ్ తేజ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here