కేశ సునామీ తైలం

0
8

[dropcap]సు[/dropcap]బ్బారావ్ గబగబా హాల్లోకి నడిచి వస్తూ, “ఇందాకటి నుండి, భోజనానికి పిలుస్తావేమో అని, కాలే కడుపుతో ఎదురు చూస్తుంటే, నువ్ టి‌వి చూస్తూ గడుపుతున్నావా” అన్నాడు భార్యతో.

“కేశ సునామీ ఆయిల్ టి.వి ప్రోగ్రామ్‌కి ఫోన్ చేస్తున్నానండీ” చెప్పింది సుధ.

“అవునా, వాటిలో చాలా వరకు పనికి రాని ప్రోడక్ట్స్. వాటిని ఇలా టీ.వి. చానల్స్‌తో కుమ్మక్కై బాగా పబ్లిసిటీ చేసి, ఎందుకూ పనికి రాని వాటిని, వేలల్లో అమ్మి కోట్లలో సంపాదిస్తున్నారు. అయినా నాకు తెలియక అడుగుతాను, అంతగా జుత్తు ఊడటమో, చర్మ ఇబ్బందులో ఉంటే డాక్టర్ దగ్గరికి పోయి చక్కగా సరైన వైద్యo చేయించుకోక, ఇలా టివీల్లో ఎవరో ఏదో చెప్పి వాడమంటే గొర్రెల్లా వాడేయడమేనా. ముందు వచ్చి కొంచెం అన్నం వడ్డించు” చెప్పాడు చిరాగ్గా.

“ఉండండీ వచ్చేస్తాను” అంటూ మళ్ళీ ఫోన్ ట్రై చేస్తోంది. చిరాగ్గా, “నువ్ మారవ్” అని అక్కడినుండి వెళ్లిపోయాడు సుబ్బారావ్.

రోజూ సరిగ్గా మిట్ట మధ్యాహ్నం టైమ్‌కి, బ్రేకింగ్ న్యూస్ చానెల్‌లో వచ్చే కేశ సునామీ ఆయిల్ వారి సలహాలూ, సూచనల ప్రోగ్రాంకి డైల్ చేస్తోంది సుధ. ఫోన్ మోగడంతోనే ఆమె ముఖం చిచ్చుబుడ్డిలా వెలిగిపోయింది. అవతల టి.వీ.లో ఫోన్ ఎత్తి ఎత్తగానే, “నమస్కారవండీ, నేను విశాఖపట్నం నుండి ఫోన్ చేస్తున్నానండీ. కేశబాల గారితో మాట్లాడాలి” చెప్పింది ఉత్సాహంగా

“ఇస్తాను, ఇంతకీ ఏవిటి మీ సమస్య” అడిగింది యాంకర్.

 “నా జుట్టు ఈ మద్య బాగా ఊడిపోయింది. అందరూ నాది ఉంగరాల జుట్టు అనేవారు. ఆఖరికి ఆ జుట్టంతా పోయి ఉంగరాలు మాత్రం మిగిలాయి. దాంతో ఇలా అబ్బాయిల క్రాఫ్‌లా తయారైంది. ఎన్నో చిట్కాలు వాడాను, ప్రయోజనం లేదు. కనుక మీరే ఏదొకటి చేసి నా జుట్టు పెరిగేలా చేయాలి. ఎక్కడికైనా వెళితే, విగ్గు పెట్టుకుని వెళ్తున్నాను. ఏదో మాది విగ్గుల వ్యాపారం కనుక, నానా రకాల విగ్గులూ వాడి నెట్టుకొస్తున్నాను” చెప్పింది సుధ కళ్ళు తుడుచుకుంటూ

చిన్న నవ్వు నవ్వి, “డోంట్ వర్రీ సుధ గారూ, మా కేశ సునామి ఆయిల్ వాడండి. ఓ బాటిల్ ఇరవై వేలు మాత్రమే. మీ జుట్టు జామ్ అంటూ పెరిగిపోతుంది” చెప్పింది ఆ హెయిర్ క్లినిక్ ఓనర్ కేశబాల.

ఆమె మాటలు వింటూనే, “ఇరవై వేలా” అంటూ కళ్ళు తేలేసింది సుధ.

“డబ్బు గురించి ఆలోచించకండి మేడమ్, జుట్టు గురించి ఆలోచించండి. నిన్న పోయిన జుట్టు నేడు రాదు. రేపు మీ జుట్టు ముళ్ళ పొదలా పెరగాలంటే, నేడే మా ఆయిల్ కొనండి, రేపు పెరగబోయే మీ జుత్తుని మీరే నమ్మలేరు. ఎంతో మంది ముందు ఇలానే సందేహిస్తూ కొన్నారు. తర్వాత మళ్లీ తైలం కావాలని ఒకటే ఫోన్లు” చెప్పింది కేశబాల.

“అంత డబ్బు పెట్టి కొన్నాక, నా జుట్టు పెరగక పోతే” అనుమానంగా అడిగింది సుధ

“ఇంత విన్నాక కూడా నమ్మకం కలగడం లేదా! అయితే లాభం లేదు. మీకు ప్రూఫ్ చూపించాల్సిందే. మా దగ్గర జస్ట్ ఓ నలభై వేలు పెట్టి రెండు సీసాల కేశ సునామీ తైలం కొని వాడిన పద్మజ గారితో మిమ్మల్ని మాట్లాడిస్తాను ఉండండి” అనగానే ఒక అమ్మాయి వచ్చి కేశబాల పక్కన కూర్చుంది. “ఈమెనీ, ఈమె జుట్టునీ చూస్తే మీరే ఒప్పుకుంటారు” చెప్పింది కేశబాల.

ఆ అమ్మాయిని టి.వీ.లో చూసిన సుధ తెగ ఆశ్చర్య పోయింది. ఏవీ మాట్లాడలేదు. అది గమనించిన కేశబాల, “చూసారా మేడమ్ మా దగ్గర ఆయిల్ తీసుకున్న పద్మజ గారి జుత్తుని ఇలా టి.వీ.లో చూసే మీరు ఇంత ఆశ్చర్యపోయారు. వెంటనే మీ నోట మాట కూడా రాలేదు. ఇక నేరుగా ఆమె జుత్తుని చూస్తే ఓ పది, పదిహేను కేశ సునామీ తైలం సీసాలు కొనేస్తారు” అని ఓ పెద్ద నవ్వు నవ్వి, “పద్మజ గారూ నమస్తే, మీరు మన కేశ సునామీ తైలం వాడక ముందు వాడిన తరువాత ఏం జరిగిందో మా దగ్గర కొత్తగా తైలం కొనబోతున్న సుధా గారికి కాస్త వివరంగా చెప్పండి.” అంది.

ఆమె ఓ క్షణం నవ్వి, “సుధ గారూ నమస్కారం, నేనూ మీలాగే ఇది కొనే ముందు చాలా సార్లు ఆలోచించాను. ఆ టెన్షన్‌తో మరి కాస్త జుట్టు పోయింది. పోతే పోనీ, అంత డబ్బు పెట్టడం ఎందుకు అని కొనలేదు” అని కళ్ళు తుడుచుకుని, తర్వాత పైకే చూస్తూ, “తర్వాత నాకు అనుకోకుండా టైఫాయిడ్ వచ్చి, నా జుట్టంతా కుక్క బొచ్చులా రాలిపోయింది. అందరూ నా వంక జాలిగా చూసేవారు. జడ వేసుకోవాలని ఉన్నా, అంత జుత్తు లేకపోవడంతో పిలక అల్లి, రబ్బరు బ్యాండ్ మాత్రమే పెట్టుకుని తిరిగేదాన్ని. మా వారు కూడా నా జుట్టు వంక అదోలా చూసేవారు. అప్పుడే నేను టి.వీ.లో ఈ కేశ సునామీ గురించి చూశాను. సరే ఓ చిన్న బాటిల్ కొన్నాను. ఆశ్చర్యం, రోజు రోజుకీ నా జుట్టు గడ్డి పెరిగినట్టు ఒత్తుగా బలంగా బారెడు పెరిగిపోయింది. దాంతో ఆ చుట్టు పక్కల వాళ్ళు నా జుట్టు చూసి కుళ్లుకునేవారు. ఓ సారి మా ఎదురింటి వాళ్ళు బట్టలారేసుకునే తాడు తెగిపోయింది. దాంతో వారు నా రెండు మూడు శిరోజాలు అడిగి పట్టుకెళ్లారు. వాటిని పేని, వాటి మీదే బట్టలారేసుకున్నారు. మా నాలుగేళ్ల బాబిగాడు, మర్రి చెట్టు ఊడలు పట్టుకుని చెట్టు ఎక్కినట్టు, నా జుట్టు పట్టుకుని పైకి వచ్చి, వాడే నా సంకలో కూర్చుంటున్నాడు” అని ఆమె ఇంకా ఏదో చెప్పేంతలో

“స్టాపిట్, నాకు జుట్టు మాత్రమే పోయింది. బుర్ర కాదు. అవ్వ, ఇంత మరీ పచ్చి అబద్దాలా! ఎవరైనా వింటే ముక్కుతో నవ్వుతారు” అడిగింది సుధ అసహనంగా

“అయ్యో ఆంటీ, ఇవన్నీ పచ్చి నిజాలు, కావాలంటే చూడండి” అని తన జుత్తుని మొత్తం ముందుకు వేసుకుంది పద్మజ.

అది చూస్తూనే, “టి.వీ లో దెయ్యం” అని జడుసుకుని, ఇంకా కోపంగా “చాలు ఇక ఆపేయ్. నువ్వెన్ని చేసినా, నేను నమ్మను, నిన్ను చూడగానే నిజం తెలిసింది. కానీ ఏం చెప్తావో విందావని ఇప్పటి దాకా ఆగాను” చెప్పింది సుధ.

“నిజవా, నా గురించా, ఏవిటది” అడిగింది పద్మజ.

“నువ్వు రామ్‌నగరం రెండో వీధిలో, మూడో షాపుకి వచ్చి విగ్గులు కొనుక్కు పోతుంటావ్ చూడూ, ఆ షాప్ ఓనర్ నేనే. నువ్వు ఇప్పుడు సిగ్గులేకుండా పెట్టుకున్న విగ్గు కొనుక్కున్నది కూడా మా షాప్ లోనే” చెప్పడంతో పద్మజ లేచి, పరిగెట్టుకుంటూ కెమెరా ఫ్రేమ్ లోనుండి పక్కకు పారిపోయింది. ఆ తర్వాత, ఆ ప్రోగ్రాం మరిక ఏ టీవీలోనూ రాలేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here