సీమ జీవన చిత్రణ కథా కేతనం ఆచార్య కేతు విశ్వనాథరెడ్డి

4
13

[dropcap]“ఇ[/dropcap]క్కడి మనుషులంతా మంచివాళ్లు కదా! నీళ్ళప్రాయంగా ఖూనీలు చేసుకోవడమే ఆశ్చర్యం! ఈ రకం క్రిమినల్ సైకాలజీ ఈ ప్రాంతంలోనే యెక్కువగా యెందుకున్నట్లో!”..

ఆచార్య కేతు విశ్వనాథరెడ్డి కథలో ఒక పాత్ర అంటుందిలా! ఇది నిజమో వ్యంగ్యమో కానీ సినిమాల్లో మాత్రం ‘సీమ కథలు’ ప్రత్యేకం అనుకుంటూ కత్తులు, గొడ్డళ్ళతో రక్తపాతం చిందించి, కోట్లాది రూపాయలు కొల్లగొట్టుకుంటోంది ‘సినీ’ మాయాజాలం. చప్పట్లకీ, కాసులు రాలడానికీ కారణాలు ఏమైనా ఉండవచ్చును కానీ, ఇదంతా సీమలో జరుగుతుందా అన్నది సగటు ప్రేక్షకుడి అనుమానం.

అరసం గుంటూరు జిల్లా శాఖ గౌరవ సంపాదకులుగా పెనుగొండ లక్ష్మీనారాయణ, ప్రధాన సంపాదకులుగా వల్లూరి శివప్రసాద్, సంపాదకులుగా సింగమనేని నారాయణ ప్రచురించిన ‘కథా స్రవంతి’లో కేతు విశ్వనాథరెడ్డి కథలు పదకొండు ఉన్నాయి.

“స్త్రీల పట్ల, దళితుల పట్ల, రైతుల పట్ల, శ్రామికుల పట్ల, కార్మికుల పట్ల, పీడితుల పట్ల, ఉద్యమాల పట్ల, గౌరవాన్ని సంస్కార దృష్టిని కలిగించటం విశ్వనాథ రెడ్డి గారి రచనాశయం” అంటారు సింగమనేని నారాయణ.

దాదాపు అన్నీ మట్టి కథలు. మట్టి మనుషుల కథలు. వాస్తవ జీవితాలకు అద్దం పట్టే కథలివి. రాయలసీమ పల్లెల జీవన చిత్రణ కథలివి. ఎక్కువగా ఆయన ఉత్తమ పురుషలోనే కథలు రాస్తారు. ఉత్తమ పురుషలో చెప్పినప్పుడు రచయిత పాఠకుడికి దగ్గరగా అనిపిస్తాడు.

రాయలసీమలో అన్నిటికన్నా ప్రముఖమైనది ‘వర్షాభావం’. పంటలు లేక, పేదరికంతో, ఆశగా ఆకాశం వంక ‘ఏ పొద్దు వాన కురుస్తుందో’ అని చూస్తున్న రైతులు. వారిని పట్టించుకోక చరచరా కదిలిపోతున్న ‘చెవిటి మేఘాలు’. పెట్టుబడిదారుల దాస్తీకానికి బలైపోయిన బడుగు జీవులు. కోస్తా జిల్లాల్లో లాగా కులమతాల కొట్లాటాల కాలక్షేపాలు, ఆధిపత్యానికి దిగే కడుపు నిండిన వాళ్ళ రాజకీయాలు రాయలసీమలో చాలా తక్కువ. అలాంటి వాతావరణంలోనే పుట్టి పెరిగిన కేతు విశ్వనాథ రెడ్డి సీమ జీవిత చిత్రణే ఎక్కువగా చేశారు తన కథల్లో. అయితే, స్త్రీ వ్యక్తిత్వాన్ని గౌరవిస్తూ రాసిన కథలు ఆయనకు స్త్రీల పట్ల ఉన్న గౌరవం, సహృదయానికి తార్కాణం. అలాంటి అద్భుతమైన ఒక కథ ‘రెక్కలు’.

ఎలక్షన్ డ్యూటీలో స్త్రీలకు ఎదురయ్యే కష్టాలు బయటికి చెప్పుకోలేనివిగా ఉంటాయి ఎలక్షన్ సామాగ్రిని సేకరించుకోవడం, వాటిని తామే మోసుకోవాల్సిన బాధ్యత, లారీల్లో దూర ప్రాంతాలకు వెళ్లడం, అది పల్లెటూరు అయితే – సాధారణంగా ఏ పాఠశాలలోనో ఎలాంటి వసతులు లేని చోటుకు ముందు రాత్రే చేరుకోవడం, లైట్స్ కూడా లేని చోట లాంతర్లు పెట్రోమాక్స్ లైట్లుతో పనిచేసుకోవడం ఒక రకం కష్టమైతే – వాష్ రూమ్స్ సౌకర్యం కూడా లేని చోట భౌతిక మానసిక వేదన చెప్పనలవి కాదు. దీనిని గురించి ప్రముఖ రచయిత్రి ఓల్గా చాన్నాళ్ల క్రితమే ఒక కథలో వర్ణించారు. విశ్వనాథ రెడ్డి ‘రెక్కలు’ కథలో హోంగార్డు పంకజం గురించి తను గమనించిన విషయాల్ని ఆవేదనతో, నిర్మొహమాటంగా చెప్పారు. పంకజం అనే హోంగార్డు చలాకీ అయిన, సందడిగా ఉండే అమ్మాయి. ఎలక్షన్ డ్యూటీలో ఎదుర్కొన్న సమస్యలతో పాటు – ప్రిసైడింగ్ ఆఫీసర్ తోడేలులా పొంచి చూస్తున్న చూపులతో, రాత్రి నిద్రలో ఉన్నప్పుడు చెడ్డ ఉద్దేశంతో తన దగ్గరగా వచ్చినప్పుడు, తెల్లవారుజాము స్నానం చేస్తున్నప్పుడు కావాలని అటుగా రావడం, ఆ పరిస్థితిని పంకజం ఎంత ధైర్యంగా తెలివిగా ఎదుర్కొన్నదో చూసినప్పుడు ఆమె ఆత్మస్థైర్యానికి సంతోషపడతాడు ఎ.పి.వో.

ప్రిసైడింగ్ ఆఫీసర్ ‘నేను ప్యూర్ వెజిటేరియన్’ అని గొప్పగా చెప్పినప్పుడు, కోడికూర తింటూ పంకజం “కూటికి పనికిరాని బ్రాహ్మణ్యం వదిలించుకోవాలని మేం చూస్తుంటే అందులోకి కమ్మ బ్రాహ్మలు, రెడ్డి బ్రాహ్మలని మీరు జొరబడితే ఎట్లా సార్! అవును. మేము అక్షరాల వైఖానసులం, భారద్వాజస గోత్రం, ఇంటి పేరు సేనాధిపత్య. ఇప్పుడు ఇట్లా ఈ హోం గార్డుల సేవలో రోజుకి 15 రూపాయల దిన కూలీలో ఉన్నాననుకోండి” అంటుంది.

నేటి భారతంలో కులం కూడు పెట్టదు. శ్రమ, చెమట చిందించాల్సిందే – అన్న సత్యం పంకజం మాటల్లో గోచరిస్తుంది.

తనకూ ఆ వయసు గల ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఆమె అవస్థల్ని గమనిస్తూ, వెన్నంటి తాను కాపాడుతున్నాను అనుకున్న ఎ.పి.వో. యైన రచయిత చివర్లో పంకజం – “శరీరం వంపుసొంపులు తప్ప, ఏదీ కనిపించని సంస్కారం మగవాళ్లలో ఉన్నంతకాలం నా బాధలైనా, మీ బిడ్డల బాధలైనా, మరొకరివైనా ఇంతేనో ఇంతకన్నా ఘోరమైనవో కదా సార్” అంటుంది.

“మా అమ్మాయిలను ఇన్నాళ్లు కాపాడుతున్నవనుకుంటున్న మా రెక్కలు ఎంత బలహీనమైనవో ఆ క్షణం నాకు తెలిసి వచ్చింది”.. ఇదీ ముగింపు వాక్యం.

“స్త్రీలు తమను తాము రక్షించుకోవడానికి ఇతరుల మీద ఎంతకాలం ఆధారపడతారు – తమ రెక్కల్ని తాము బలంగా విశాలంగా తయారు చేసుకుంటే తప్ప!”

సతి’ మరో అద్భుతమైన కథ. ఈశ్వరమ్మ మంచి పనిమంతురాలు. పట్టుదల లోను గట్టిదే. మొగుడు నారాయణరెడ్డి సాధువుల్లో కలిసిపోయినా తొమ్మిదేళ్ల ఆడపిల్లని, మూలపడిన ముసలిదాన్ని (అత్తని) తన రెక్కల కష్టంతో లాక్కొస్తోంది. కట్టుకున్న పెళ్ళాన్ని, కుటుంబాన్ని వదిలేసి రికామీగా తత్వాలు పాడుతూ, ధ్యానాలు చేస్తూ, చేయిస్తూ, ఊర్లు పట్టుకు తిరుగుతున్న మొగుడి ‘పలాయన వాదం’ గుండెల్లో గుచ్చుతూనే ఉన్నా పొలంలో కలుపు తీసే పనో, ఏదో ఒక పని చేస్తూ, ఆత్మాభిమానంతో బ్రతుకుతుంది ఈశ్వరమ్మ. నారాయణరెడ్డి ‘సాధు నారాయణ’ గా మారి, ఒకరోజు ఊరికి రెండు కిలోమీటర్ల దూరంలో కొండమీద దేవాలయంలో ఉన్నాడని, జనం గుంపులుగా వెళ్తున్నారని తెలిసి కూతురు ‘అచల’ను తీసుకొని వెళ్ళింది ఈశ్వరమ్మ. ఆయన పాడే తత్వ గీతాలు విన్నది. ధ్యానాన్ని చూసింది. జనాల తన్మయత్వాన్ని చూసింది. లేచి నుంచుని “నా గతీ నా పిల్ల గతీ ఏంటి” అని ప్రశ్నించింది గట్టిగా. సమాధానం లేదు. “అట్లా అనకూడదు” అన్నారు జనం. ఏం చేస్తుందో తెలియని ఆవేశంతో పందిరి గుంజ మీద చేతులకున్న గాజులని పటా పటా పగలగొట్టుకొని, బొట్టు చెరుపుకొని, తాళిని తెంచి పారేసి, ఏడుస్తున్న కూతుర్ని బరబరా లాక్కుపోతుంటే అక్కడున్న వారి నోట మాట పెగిలితే ఒట్టు. బాధ్యతల్ని వదిలి, పదిమందిలో పేరు తెచ్చుకోవాలన్న పిరికివాడు, పలాయనవాది యైన భర్తను, బంధాన్ని తిరస్కరించిన ఈశ్వరమ్మ గుండెలో చేతల్లో ఉన్న స్త్రీవాదం మాటల్లో వర్ణించగలమా!

అంత్యాక్షరి కథ. అడాల్సెంట్ వయసులో, సతమతమయ్యే భావాలతో, అర్థం కాని లోకం తీరుతో, అన్నీ తెలుసుకోవాలని ఆకాంక్షతో ఉన్న ‘సుషమ’. తల్లితండ్రులు ఇద్దరూ బిజీ డాక్టర్లు. ఆ ఇంట్లో అన్నీ ఉన్నా ఏదో వెలితి. సుషమకు ఆ వయసులో కోరుకునే అటాచ్మెంట్ తల్లిదండ్రుల దగ్గర దొరకపోవడంతో “బోర్.. బోర్” అంటోందని చుట్టం చూపుగా వచ్చిన అమ్మమ్మ దుర్గమ్మ గమనించింది. కూర్చొని ఆడే ఆటల్లో శారీరక వ్యాయామం, చురుకుదనం లేకపోవడంతో బోర్ కాక ఇంకేం ఉంటుందని అర్థం చేసుకుందామె. ఆఖరికి తాను పెద్దమనిషి అయిన విషయం కూడా తల్లికి చెప్పే ధైర్యం, దగ్గరతనం లేక – తల్లి డ్యూటీకి వెళ్ళిన తర్వాత అమ్మమ్మకి చెప్పింది. హాస్పిటల్ నుండి వచ్చిన కూతురు చేసే హడావుడి పద్ధతులకు, పెట్టే ఆంక్షలకి దుర్గమ్మకే చిరాకేసింది. తమ ఊర్లో ఎన్నో సంబరాలు, తంతులు ఉంటాయి. అవన్నీ ఒకరకంగా గుంపు చలనం. ఇక్కడిది ఒంటిగాళ్ళ చలనం. దేనికి స్థిమితం లేదు. ఆడపిల్లల శరీరంలో జరిగే ఒక మామూలు ప్రకృతి చర్యకు, గ్రహాలకు మధ్య ఉండే సంబంధమేమిటో! ఆమె పల్లెటూరి శూద్ర జీవితంలో ఈ అనుభవము, ఈ జ్ఞానము లేదు. ఈ రకం పట్టింపులు లేవు. డాక్టర్ అయి ఉండి కూడా ఈ సంప్రదాయాలు, జాగ్రత్తలు చెప్తుంటే సుషమ అలవాటుగా ‘బోర్’ అంది. కూతురు బ్రాహ్మణుని పెళ్లి చేసుకోవడం వల్ల నిత్యం తన అత్తా ఆడపడుచుల ఆచారాలకు ఎక్కడ భంగం కలుగుతుందోనని తాపత్రయ పడటం దుర్గమ్మ గమనించింది.

పాప స్నానం సమయానికి శర్మ వాళ్ళ అమ్మానాన్న బంధువులు వచ్చారు. అందరూ బాగా చదువుకున్నవారే. వాళ్ళ మాటలు, ఆ వ్యవహారం అంతా ‘నటన’ అనిపించింది దుర్గమ్మకు. పల్లెటూర్లో కూడా ఇలాంటి తంతులున్నాయి. అవి నలుగురు సంతోషంగా పాల్గొని చేసేవి, పంచుకొని చేసేవి. ఇక్కడ అంతా గొప్ప కోసం ప్రదర్శనమే. అంతా వికృతమే. దుర్గమ్మ తల్లిదండ్రుల బాధ్యత గల పెంపకంలో చదువుకొని టీచర్ ఉద్యోగం సంపాదించుకుంది తన కూతురిని డాక్టర్ని చేసింది. కానీ “మారుతూ వచ్చిన జీవితంలో ఆడపిల్లల బ్రతుకు సూత్రాలు ఎవరి చేతుల్లో ఉన్నాయో! దేని చేతిలో ఉన్నాయో! మరీ సుష్మ లాంటి పసిపిల్లలవి!” అనుకుంది, ఆలోచించింది, ఆవేదన పడింది.

సుషమ తన ఫ్రెండ్‌తో ‘అంతాక్షరి’ ఆడుతూ, “చివరి అక్షరం ‘స్త్రీ’ వచ్చింది. ర కారంతో పాటను మొదలుపెట్టాలి – అంటే “స్త్రీ లోని సకార, తకార, రకారాల్ని విడదీయ కూడదు” అని చెప్పింది దుర్గమ్మ. “స్త్రీ అంటే భార్య, ఆడ జంతువు అనే మరో రెండు అర్థాలు ఉన్నాయని మా సంస్కృతం మాస్టారు చెప్పారు.. బోర్” అంటూ వెర్రి ఆవేశంతో పరిగెత్తింది సుషమ. ఇంత చిన్న పిల్లకే ఆ అర్థాలు బోర్ అయితే పెద్దవారు చదువుకున్న వారు ఏం వివరణ ఇవ్వాలి! రచయిత ఈ ప్రశ్నలన్నీ సమాజానికే వేసారనిపిస్తోంది.

అమ్మవారి నవ్వు కథ. శంకర రెడ్డి, జాఫర్ బాల్య స్నేహితులు. జాఫర్ పూల తోట చక్కగా పెంచడమే కాదు, పెళ్లిళ్లలో వేదికల్ని పూలతో ప్రత్యేక అలంకరణ చాలా బాగా చేస్తాడు అన్న పేరు తెచ్చుకున్నాడు. ఊరి నుండి వచ్చిన శంకర్ రెడ్డి కడపలో తన కూతురు పెళ్లికి కళ్యాణ మండపంలో పూలతో, ఆకులతో అదిరిపోయేలా అలంకరణ చేయాలని చెప్పాడు. పెళ్లిరోజు జాఫర్ చేసిన పుష్ప వేదిక అద్భుతంగా ఉంది. ఆ గంభీర సౌందర్యానికి, కళాభిరుచికి అందరూ ముగ్ధులయ్యారు. దేవలోకంలో సెట్టింగుల్లా, ముఖ్యంగా వేదిక వెనక కొట్టవచ్చినట్టు కనిపిస్తున్న వేంకటేశ్వర పద్మావతుల పుష్ప చిత్రాలైతే మరీ. వియ్యంకుల వారి సద్గురువు ‘సుందర రామానందుల వారు’ పుష్ప చిత్రాలను తదేకంగా చూసి “ఒక గొప్ప హిందూ సంస్కారం ఈ మూర్తుల్లో కనిపిస్తోంది. అమ్మవారి పెదాల మధ్య విరిసీ విరియని ఆ నవ్వును చూపటం సాధకులైన వారికే సాధ్యం. ఎవరు రూపొందించారు?” అని అడిగారు. “మా జాఫర్ చిన్నాయన” అన్నాడు శంకరరెడ్డి కొడుకు. ఆయన నోట మాట రాలేదు. “ఆ నవ్వు..” తనలో అనుకొంటూ ఉండిపోయారు.

“హాలు బయట ఒక మూల ఇరవై ఆరు గంటల ఉపవాసంతో, పనితో అలసిపోయి, గోనెపట్టాలు పరుచుకొని, వాటి మీద జాఫర్ పడి నిద్రపోతున్నాడు” అన్నది అద్భుతమైన ముగింపు.

ఎవరి కులవృత్తి వారిది, ఎవరి సంప్రదాయం వారిది. “ఎదుటివారి సంస్కారాన్ని, శ్రమను, కష్టం చేయటంలోని ఏకాగ్రతను, నాణ్యతను గుర్తించడమే మనిషి తనం” అని ఈ అమ్మవారి చిరునవ్వులోని రహస్యం అని రచయిత ఉద్దేశం.

పాత్రికేయుడుగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించి, తెలుగు అధ్యాపకుడిగా, డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో డైరెక్టర్‌గా, ఎన్.సి.ఇ.ఆర్.టి పాఠ్యపుస్తకాల సంపాదకులుగా, విశాలాంధ్ర ముద్రణాలయం సంపాదకవర్గంలో సభ్యునిగా, కొన్నాళ్లు అరసం రాష్ట్ర అధ్యక్షులుగా వ్యవహరించిన కేతు విశ్వనాథ రెడ్డి పాఠ్య పుస్తకాలు ప్రణాళికలో ప్రముఖ పాత్ర వహించారు. విద్యారంగంలో వివిధ హోదాలలో సుదీర్ఘకాలం పనిచేసిన విశ్వనాథరెడ్డి గారికి టైం స్కేల్, పార్ట్ టైం అధ్యాపకుల ‘గంటల వారి జీతం’ కష్టాలు బాగా తెలుసు. ఈ ‘డైలీ వేజెస్ టీచర్’ కంటే రోజు కూలీ కూడా ఎక్కువ సంపాదిస్తాడు అంటే అతిశయోక్తి కాదు. బి. ఏ, ఎం. ఏ.లు చదివి లెక్కల వారీగా పాఠాలు చెప్పి, కాంపోజిషన్ పుస్తకాలు దిద్దే వారి ‘చాకిరి’కి ఏ ‘లెక్క’ సరిపోతుంది! వైట్ కాలర్ జాబ్ అని సమాజం అనుకొంటుంది కానీ, వీరి చెమటకి ‘ఖరీదు కట్టే షరాబు’లున్నారు కార్పొరేట్ విద్యాసంస్థల్లో.

దూరం కథలో శ్రీరాం బతకలేక బడిపంతులు. కాగితాల్లో కురిపించిన ప్రణాళికలు – దేశాభ్యుదయాన్ని దిద్దాలి. తన ప్రాణ స్నేహితుడు రామచంద్ర చనిపోయాడని టెలిగ్రామ్ వస్తే స్నేహం కంటే ఖాళీ జేబు బరువుగా అనిపించింది. తనకి ఎన్నోసార్లు సాయం చేసిన ఆత్మీయుడు అతడు. శివారెడ్డి కూడా తమ స్నేహితుడే. కానీ అతను తీరే వేరు. ఇసుమంత చేసి కొండంత పబ్లిసిటీ ఇచ్చుకునే రకం. తానేమో ఏదైనా గుండెల్లోనే దాచుకొనే ఇంట్రావర్ట్. హైదరాబాద్ నుండి కాళహస్తికి ‘నడవలేని’ దూరం. ‘రైల్లోనో బస్సులోనో’ వెళ్లేంత దూరం. అతి దగ్గరైన గుండెల మధ్య ‘కాలంలో, స్థలంలో’ దూరం. కొలీగ్ పీటర్ దగ్గర అప్పు తీసుకుని శ్రీరామ్ బయలుదేరి వెళ్లాడు. కూతురుతో రామచంద్ర పెళ్లికి మొదట ఒప్పుకోని యశోధర తండ్రి వచ్చి ఉన్నాడు. శివారెడ్డి ఉన్నాడు. వాళ్ళ ఆడంబరతకీ రామచంద్ర మీద తనకు ఉన్న నిజమైన ప్రేమకి చాలా దూరం. నిరాడంబరుడు, బడుగు జీవి, ఇంట్రావర్ట్ అయిన శ్రీరామ్ మనసులో ఒక రోజులో మెదిలిన అనేక భావాల సంఘర్షణే ‘దూరం’ అనే కథ. నిజానికి దూరం మనుషుల మధ్య కాదు. మనసులు మధ్య, మనస్తత్వాల మధ్య. తను చెప్పే నన్నయ, తెలుగు – వెలుగు పాఠాల్లో, వ్యక్తి స్వాతంత్రం, ప్రణాళికలు- దేశాభ్యుదం అన్న తన పాఠాల ప్రపంచంలో ఎంత బోలుతనం ఉంది – అని శ్రీరాం మాత్రమే కాదు, పేలవమైన పాఠాల రూపకర్తలు, జీతాలివ్వని ప్రభుత్వము, సంస్థలు, తమ స్వార్థం మాత్రమే చూసుకునే నాయకులూ ఆలోచించాలని కేతు గారి ఆలోచనలు.

వెనకా ముందు కథలో మాధవ, వెంకటరెడ్డి, కృష్ణారావు, కాంట్రాక్టర్ బసిరెడ్డి పాత్రలు. వెంకటరెడ్డి తమ్ముడు ఖూనీ కావడం, తల్లీ మరదళ్ల ఏడుపు కంటే – రాజీ పడితే ముట్టే లక్ష రూపాయలు మీద సగటు మనిషి ఆశ కథాంశం. “హత్య మీద హత్యలు చేసుకుంటూ పోతే జైల్లోనూ వల్లకాట్లను తేలాలి” కోపంతో మాధవ అనే మాటల్లో అర్థం ఉంది, విశ్వనాథ రెడ్డి గారి ఆవేదన ఉంది.

పీర్ల సావిడి కథలో మస్తాన్ తన కన్న కొడుక్కి కడుపు నింపకపోయినా కోడి పందేల కోసం కోడిపుంజుకి బాగా తిండిపెట్టి తయారు చేస్తుంటాడు ప్రతి ఏటా. కుక్కి మంచంలో బక్కగా పీలగా ఉండే మస్తాను, పెచ్చులూడిపోయిన పీర్ల సావిడి ఎన్నికలప్పుడే రాజకీయ నాయకులకు గుర్తుకొస్తారు. ఆ పని మీదే అశ్వద్ధారెడ్డి తన అనుచర గణంతో వచ్చి, మస్తాన్ని ఆప్యాయంగా పలకరించి, అతని ‘వర్గం’ వాళ్లందరి ఓట్లు తనకే వేయించమని అడుగుతాడు. పీర్ల సావిడి రిపేర్లు చేసి బాగుచేయిస్తానని చెప్పి, తన చందాగా మొదట పెట్రోమాక్స్ లైటు పంపాడు. గతంలో కాంగ్రెస్‌కు ఓటు అడిగి ఇప్పుడు జనతాకి అడుగుతున్నారు. అయినా సావిడి బాగు పడుతుందని తన బంధువులు సాయిబులకీ, దూదేకుల మిత్రులకు చెప్పి ఒప్పించాడు. సంక్రాంతి వచ్చింది. పందేలు జోరుగా సాగుతున్నాయి. ఎదుటి పార్టీ వారు లేవదీసిన పుకార్లతో పోలీసులు వచ్చారు. కంగారుగా పరిగెత్తుతూ పడిపోయి, గాయాలతో ఆసుపత్రి పాలయ్యాడు మస్తాను. అయితేనేం అతని ప్రచారం పుణ్యమా అని అశ్వత్థ రెడ్డి బలపరిచిన పుల్లారెడ్డి గెలిచాడు. మస్తాన్‌కి ఒక కాలు తీసేసారు. చేతివేళ్లు రెండు తీసేశారు‌. మాట ఇచ్చిన ప్రకారం పీర్ల సావిడి అయినా రిపేర్లు చేశారా అంటే ఏదో పైపైన సున్నం కొట్టారు. లెక్కలు, కూడికలు, తీసివేతలు వేసి ఉదారంగా పదైదు వందలకు మాత్రం నోటు మీద సంతకం చేయించుకున్నారు. మొదట పెట్రోమాక్స్ లైటు వెలుగులో కళకళలాడిన వలి ఇప్పుడు తండ్రి మస్తానును అడిగాడు – “బా! ఎలక్షన్ అప్పుడు లారీలో తిరిగితే డబ్బులు ఇచ్చాడు రెడ్డి. ఒకరోజు తీసుకున్నా. మా కొత్తయ్యవారు లారీలు ఎక్కొద్దన్నాడు. ఎలక్షన్లలో డబ్బుండే వాళ్ళదే రాజ్యం అంట కదా! అయితే మనం ఎందుకు ఓట్లేయడం! ఓట్లు వేసినా నీతో బాండ్ రాయించుకున్నారే! దేనికి?” మస్తాన్ దగ్గర సమాధానం లేదు. కానీ ఆ చిన్ని బుర్రకు అక్రమంగా తోచింది. వాడి రక్తం మరిగిపోయింది. వాడి బాల్య రక్తంలో కోపం రూపుదిద్దుకోవటానికి యాతన పడుతోంది. బహుశా మరో ఫ్యాక్షనిస్ట్ తయారుకాబోతున్నాడేమో!

ఈ ప్రజాస్వామ్యంలో వలి ప్రశ్నకు సమాధానం ఎవరు చెప్తారు? ఓటరు రక్తం మరిగిపోతూనే ఉంటుంది ప్రతి ఎలక్షన్ లోను.

“ఏ మంచి కోసమో, ఏ వెలుతురు కోసమో నిత్యం ఎదురుచూపే మిగులుతోంది” అంటూ సునిశితంగా రాజకీయ తంత్రాన్ని, నాయకుల తీరును బయటపెట్టారు విశ్వనాథ రెడ్డి.

నమ్ముకున్న నేల, శ్రుతి కథల్లో కూడా రాయలసీమలోని ఘోర కలిని వర్ణిస్తారు విశ్వనాథరెడ్డి. జొన్నేగిలి లేదు. కొర్రేగిలి లేదు. శనక్కాయేగిలి లేదు. భూమికి రాజైన రైతు కొత్తగా పెట్టిన సిమెంట్ ఫ్యాక్టరీలకు రోజు కూలీకి పోయే దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడింది. పొలం పోగొట్టుకునే వారి భూమిని కొనే సుబ్బారాయుడు లాంటి ధన దాహం కలవారు ఉంటారు. ఫ్యాక్టరీలో కార్మికుల మధ్య కుల, మతాల్ని రెచ్చగొట్టే నాయకులు, ఎత్తులు పైఎత్తులతో ఎంతటి నీచానికైనా దిగజారే యాజమాన్యం ఉంటారు.

ఎవరు వీరు కథలో ఈ తరం యువతీ యువకుల భావాలు చెప్తారు విశ్వనాథరెడ్డి. ‘క్లయింటేల్’ అనే పదాన్ని సమాజ శాస్త్రంలో ‘ఖాతాదారులు’ అనవచ్చేమో అంటారు రచయిత. అలాంటి సురేఖ, మోహన్‌ల మధ్య సాహిత్యపరమైన చర్చలకు సాక్షి ప్రొఫెసర్ గారు. వారు క్రమంగా దగ్గర అవడం చూసి పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడతారు కూడా. కానీ ఇద్దరు స్వేచ్ఛ ప్రియులే, స్వతంత్ర భావాలు కలవారే. ప్రేమ – డబ్బు – సంస్కారం విషయాల్లో ఇద్దరి అభిప్రాయాలు వేరు కావడంతో ప్రేమలో, జీవితంలో వేర్వేరు అయ్యారు. ఇది ఈ తరం ప్రతినిధులైన యువత కథ.

కేతు విశ్వనాథ రెడ్డి గారికి కుల పరమైన ఆ చివరి పదంతో పిలిపించుకోవడం ఇష్టం లేదు. విశ్వం అనీ, విస్సన్న అనీ అంటే ఇష్టం. ఆప్యాయంగా అందరితో మాట్లాడటం ఇష్టం. ఇంటికెళ్లిన వారికి ఏదైనా తినడానికి పెట్టి గాని పంపేవారు కాదు. వ్యక్తిగా మహోన్నత వ్యక్తిత్వం గలిగి, ప్రత్యక్షంగా పరోక్షంగా ఎందరికో గురు స్థానంలో ఉన్నవారు. సాహితీ లోకానికి ఆప్తబంధువు. రాచమల్లు రామచంద్రారెడ్డి గారిని బాగా అభిమానించేవారు. చదువుకునే రోజుల నుండి వామపక్ష భావాలతో, అనేక సాహితీ సంస్థలతో మమేకమై, బహుముఖ ప్రజ్ఞాశాలిగా, పెద్దదిక్కుగా సలహాలిస్తూ, ‘కేతు విశ్వనాథరెడ్డి కథలు’, ‘ఇచ్ఛాగ్ని’, ‘జప్తు’ అనే మూడు కథల సంపుటాలు, ‘వేర్లు’, ‘బోధి’ అనే నవలలు, ‘దృష్టి’ పేరుతో సాహిత్య వ్యాసాలు వెలువరించారు. ముఖ్యంగా ఆయన పరిశోధన ‘కడప జిల్లాలో ఊర్ల పేర్లు’ కేవలం డిగ్రీ కోసం కాక, ఎంతో శ్రమ కోర్చి, స్థానిక సామాజిక సాంస్కృతిక నేపధ్యాన్ని, స్వరూపాన్ని వెలికితీసి, మంచి థీసిస్‌గా, ఇటువంటి మరెన్నో పరిశోధనలకు మార్గదర్శకంగా నిలిచింది.

కేతు విశ్వనాథ రెడ్డి గారి కథల్లో మొదట కనిపించేది మనిషిలోని ‘ఆర్తి’. రాయలసీమ కావచ్చు, పల్లెలు కావచ్చు, పట్టణాలు కావచ్చు – మనిషిలోని స్వార్థం, ద్రోహ చింతన, మోసపోయిన మనిషిలోని ఆర్తి, ఆవేదన, ఆక్రందన ఎలాంటి దాపరికం లేకుండా చెప్పిన మంచి రచయిత ఆయన. ఈ రైతుల వెతలు కేవలం రాయలసీమకే పరిమితం కాదు. కేంద్ర సాహిత్య అకాడమీ సభ్యుడు మందలపర్తి కిషోర్ మాట్లాడుతూ “తన మిత్రుడు అమెరికాలో ఒక అమెరికన్ స్నేహితుడితో విశ్వనాథ రెడ్డి కథలు గురించి చెప్పినప్పుడు, ఆయన ‘మా రైతు పరిస్థితి కూడా ఇంతకన్నా గొప్పగా లేదు’ అన్నారు” అని చెప్పారు.

గత ఏడాది స్వాధ్యాయ తరుఫున ఇంటర్వ్యూ చేస్తూ కస్తూరి మురళీకృష్ణ “కథ, నవలా రచయిత, విమర్శకులు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత కేతు విశ్వనాథ రెడ్డి ఎంతో సహృదయులు. నేనెంతో గౌరవించే వ్యక్తి. సాహిత్య ప్రపంచంలో రచయిత కంటే మనిషిగా, నిర్ద్వందంగా నిక్కచ్చిగా ఉండే రచయిత” అన్నారు.

ఆచార్య కేతు విశ్వనాథరెడ్డి గారి మాటల్లో చెప్పాలంటే – “రచయిత తన రచనల కంటే ఒక అంగుళం ఎత్తైనా సంస్కారవంతుడిగా ఉంటే ఈ దేశం బాగుపడుతుంది. అలా కానప్పుడు రచన చేయనక్కరలేదు. ఏదో వ్యాపారం చేసుకోవచ్చు. సంస్కారవంతమైన జీవనం, ఒక ఆర్తి రచయితకు ఉండాలి”.

ఇది ఎంత సత్యమైన వాక్కు! రచయితలు గుర్తుపెట్టుకోవాల్సిన బాధ్యతాయుతమైన సందేశం.

కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, వైయస్సార్ జీవిత సాఫల్య పురస్కారం, అజో విభో కందాళం పురస్కారం వంటి ఎన్నో ప్రతిష్టాత్మక మైన పురస్కారాలు అందుకున్నారు.

“ఒక మధ్య తరగతి మేధావి, ఆధునిక రచయిత తన సమాజానికి ఎంత చేయాలో విశ్వనాథ రెడ్డి అంత చేసారు” అని కొనియాడారు ఆచార్య రాచపాళెం చంద్రశేఖరరెడ్డి.

“నేను స్లో రైటర్‌ని” అని చెప్పుకునే విశ్వనాథరెడ్డి గారు మరింత వేగంగా రాసి ఉంటే సాహితీ లోకానికి గొప్ప ‘సాహిత్య నిధి’ దొరికివుండేది.

2023 మే 22 న తన 84వ ఏట కొద్దిపాటి అనారోగ్యంతో సాహితీలోకాన్ని శాశ్వతంగా వదిలివెళతారని ఎవరూ ఊహించలేదు. ఇటీవలే నేను ఆ దంపతులను కలిసినప్పుడు చాలా సేపు మాట్లాడుకున్నాం. ఇంకా ఎన్నో చర్చించాల్సిన, మాట్లాడాల్సిన సాహిత్యాంశాలున్నాయి అన్నారు. ఇంతలో ఇలా..!!

తనదైన వ్యక్తిత్వపు విలువలతో, సామాజిక సంఘర్షణలకు స్పందించే గుణం, స్పష్టమైన భావ ప్రకటనతో , విస్పష్టమైన అభివ్యక్తితో, గొప్ప సామాజిక పరిశీలనాశక్తి కలిగి ఉన్న మంచి వ్యక్తిగా, విద్యావేత్తగా, సాహితీవేత్తగా, నిత్య పఠనాశీలిగా, పరిశోధనాపరునిగా, చిన్నా పెద్దా అందర్నీ ఆప్యాయంగా పలకరించే ఆచార్య కేతు విశ్వనాథ రెడ్డి గారి నిశ్శబ్ద నిష్క్రమణ తీరని లోటని పునః పునః ఆవేదన వ్యక్తపరుస్తూ, నివాళిగా వారి కథలపై ఇది నా సమీక్షా వ్యాసం.

Images Credit: Internet

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here