ఖబడ్దార్!

1
9

[dropcap]పె[/dropcap]ళ్లికూతురు ముక్త గదిలోకి వచ్చేప్పటికి పెళ్ళికొడుకు ముకుందం చేతినిండా ఉన్న నోట్ల కట్టలు లెక్క పెడ్తున్నాడు.

“ఊ, రా రా… నా సెకండ్ హాండ్ పెళ్ళామా… మనకి ఈ ముహూర్తాలు అవీ ఏమీ లేవు”

ఒక్కసారిగా మిన్నువిరిగి మీద పడింది ముక్తకి… తేరుకునేలోపే… బెడ్ దగ్గర ఉన్న స్విచ్ ఆఫ్ చేసాడు.

పరిచయం, స్నేహం, మాటా మంచీ.. ముద్దు మురిపెం…ఇవేవీ తెలియకుండానే… జరిగిపోయింది.

దీన్ని బలవంతం అంటారా? ప్రతిఘటించే అవకాశం ఎక్కడా.. అయినా – అమ్మో ఒకొక్కటీ తులం చొప్పున, రెండు లైసెన్స్ బిళ్ళలు గుండెల మీద వేలాడుతుంటే… అంత సాహసమే!

ముకుందం గదిలోనించే.. “ఏమే ఏదే నా కాఫీ?” అని అరుస్తుంటే – ‘ఓహో భార్యని.. ఇలా కూడా పిలుస్తారా?’ అనుకున్నది ముక్త..

అత్తగారు భద్రమ్మ “ఏమిటీ దిక్కులు చూస్తో నిలబడితే పనులెలా అయితాయి? ఇప్పుడా లేవడం? మేము కాబట్టి సెకండ్ హాండ్ పెళ్లికూతుర్ని చేసుకున్నాము”. మళ్లీ అదే మాట. దెబ్బతిన్న పావురంలా విలవిలలాడిపోయింది ముక్త!

‘నిజమే! ఇంకాస్సేపట్లో పెళ్లి అనగా, మాకేవీ వద్దన్న పెళ్ళికొడుకు తండ్రి, ఒక్కగానొక్క పిల్లనైన తన పేరు, ఆ అబ్బాయి పేరు మీద ఆస్తి రాస్తేనే పెళ్లి అన్నాడు.. ఉదారంగా తన తల్లిదండ్రులకి పదోవంతు వదిలేస్తానన్నాడు. నాన్న దానికి కూడా తయారయ్యాడు, పీటల దాకా వచ్చిన పెళ్లి చెడిపోతే పరువు నష్టం, పిల్లకి పెళ్లి కాదేమోనన్న భయంతో. తాను, మామయ్యనే ఇంతకి తెగించినవాళ్ళు, ఎంతకైనా తెగిస్తారని తెగతెంపులు చేసుకున్నారు.

ముందు చూసి వెళ్లిన వీళ్ళని కదిపితే, ఆరు లక్షల కట్నం, రెండులక్షల లాంఛనాలు, ఇంకా ఇంకా ఇదనీ అదనీ ఏదడిగితే అది ఇచ్చి.. ఛీ నన్ను చూస్తే నాకే సిగ్గేస్తోంది.. ఇలాంటి. వెధవని.. చేసుకున్నానని… కానీ ఏం చేసేది నాన్న ఆత్మహత్యా ప్రయత్నం నన్ను వివశురాల్ని చేసింది.’ ముక్త ఆలోచనలు సాగుతున్నాయి అంతూ దరీ లేకుండా..

సెకండ్ హాండ్ అనిపించుకుంటూనే ముక్తకి రెండు కాలెండర్లు తిరిగాయి. ఎవరి పర్మిషన్ అవసరం లేకుండా పదిహేను రోజులకు ఒకసారి తన వాళ్ళని చూసొస్తుంది. ‘నాన్న చెప్పించిన చదువు,.. మంచి ఉద్యోగానిచ్చింది కనుక 5,6 గంటలు వీళ్ళనుండి విముక్తి’ నిట్టూర్చింది ముక్త.

ఆరోజు ఆఫీసులో బాగా ఆలస్యమయింది. తన కొలీగ్ కారులో వచ్చింది.. ఎన్నడూ తన గురించి పట్టించుకోని మనిషి “ఎవడి కారో ఎక్కి రావాలా? వెధవ బుద్ధులు నువ్వూ.. సెకండ్ హాండ్ పెళ్లి కూతుర్ని చేసుకున్నందుకు బాగా బుద్ధి చెప్తున్నావు.. నీకు అసలు ఒళ్ళు చీరేస్తే గానీ బుద్ధి రాదు”…ఎత్తిన చెయ్యి….. ముక్త లోని ముగ్దత్వం రాక్షసత్వ రూపం దాల్చేట్లు చేసింది!

ఎక్కకడ్నించి వచ్చిందో అంత బలం… ఎత్తిన చెయ్యి విరిచి… మెలి తిప్పి, ముకుందం బాధతో అరుస్తుంటే. “ఇంకా అరు.. ఏమిటీ సెకండ్ హాండ్ పెళ్ళామా.. ఆ పెళ్ళాం తెచ్చిన డబ్బుతోనే చెల్లెళ్ళ పెళ్లి చేసావు, ఇల్లు కొన్నావు…. ఈ మధ్యనే సెకండ్ సెట్ అప్ పెట్టావు (కళ్లల్లో ఆశ్చర్యము, భయం). నువ్వు ఎవడవురా మరి? ఒక్కటే ఒక్క ఫోన్ కాల్‌తో గృహ హింస చట్టం కింద, నిన్ను నీ వాళ్ళని మూయించగలను. సెకండు సెట్ అప్ పెట్టిన శుంఠా! నేను గానీ ఈల వేసి చెప్పానే అనుకో నీ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం గోవిందా…గోవింద. ఇదిగో నిన్ను ఎదిరించి భయంతోనో, బాధ తోనో నీ ఇంటి నుండి పోతాను అనుకుంటావేమో, నేను నిన్ను కొనుక్కున్నాను. నీ చేత, మీ అమ్మ చేతా గాడిద చాకిరీ చేయించద్దూ! పద లోపలికి.” ముక్త తనని తాను చూసుకున్నది… నేను నేనేనా అని!

అత్తగారు, మావగారు తొంగి చూసారు… ఎక్కడా సందులేదని గ్రహించి వెళ్లిపోయారు. అత్తగారు తెలివిగలది, బ్రతకనేర్చిందీను. అప్పుడే గరిట చేతబట్టి, వేపుడు ఒకదానిమీద, సాంబారు ఇంకో దాని మీద, అన్నం మరోదాని మీద… ఎదురు తిరిగిన పిల్లికి అదే పిల్లకి.. సెకండుహాండు పెళ్లికూతురికి, ఫస్టు హాండ్ డిన్నర్ రెడీ ఆయితోంది!

బ్రేవో ముక్తా!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here