ఖమ్మంలో జరిగిన పద్యగాన పోటీల విశేషాలు – నివేదిక

0
10

[dropcap]తొ[/dropcap]లి తెలుగు సినీ గేయరచయిత, అష్టావధాని, అపర రామదాసు, శ్రీమాన్ చందాల కేశవదాసుగారి 148వ జయంతి సందర్భంగా, చందాల కేశవదాసు కళాపరిషత్, ఖమ్మం వారు పద్యగాన పోటీలను నిర్వహించారు. ఇవి 23 జూన్ 2024 న ఖమ్మం నగరంలోని శ్రీభక్త రామదాసు కళాక్షేత్రంలో జరిగాయి.

సంస్థ అధ్యక్షులు శ్రీ కొండపల్లి జగన్మోహన రావు, సభానిర్వాహకులు శ్రీ యన్. సుబ్బరాజుగారు, వ్యాఖ్యాత శ్రీ జి. రామారావు గారు ఈ కార్యక్రమాన్ని ఆద్యంతం రసవత్తరంగా నడిపారు.

న్యాయనిర్ణేతలుగా, శ్రీ ఎం.వి. లక్ష్మీనారాయణ, శ్రీ పాణ్యం దత్తశర్మ, శ్రీమతి పాలపర్తి హవీల గారలు, గాయకుల ప్రతిభను పరిశీలించి, మూడు బహుమతులను నిర్ణయించారు.

గుణానుశీలనము, సాహిత్యం, ఉచ్చారణ, శ్రావ్యత, శృతి, పద్యనిర్వహణ మున్నగు అంశాలను న్యాయనిర్ణేతలు పరిగణించి, బహుమతి గ్రహీతలను నిర్ణయించారు.

తొలుత జ్యోతి ప్రజ్వలనంతో సభ ప్రారంభమైంది. జ్యోతి స్వరూప పరమాత్మను ప్రార్థిస్తూ, “సాజ్యం త్రివర్తి సంయుక్తం, వహ్నినా యోజితం మయా” అన్న శ్లోకాన్ని పాణ్యం దత్తశర్మ పాడారు. తర్వాత అందరూ, శ్రీ చందాల కేశవదాసు గారు రచించిన ‘పరబ్రహ్మ, పరమేశ్వర’ అన్న ప్రసిద్ధ ప్రార్థనా గీతాన్ని ఏక కంఠంతో ఆలపించారు.

ఉదయం 11 గంటలకు ప్రారంభమైన కార్యక్రమం మధాహ్నం 3 గంటల వరకు సాగింది. ఎంతోమంది పద్య ప్రేమికులు సభకు హాజరైనారు. పోటీదారులు – శ్రీమతి కల్యాణం, సత్యహరిశ్చంద్ర, బలిబంధనం (కేశవదాసు గారి రచన), చింతామణి, మొదలగు ప్రసిద్ధ నాటకముల నుండి ఒక్కొక్కరు రెండు పద్యాల చొప్పున, పోటీ నిబంధనల ప్రకారం పాడారు. హర్మోనిస్టుగా, సురభి కళాకారుడు శ్రీ కొండల రావుగారు తమ వాద్య సహకారంతో, పద్యగానాలను రక్తి కట్టించారు.

ఈ పోటీలలో మొదటి బహుమతి (₹ 3,116/-) శ్రీ నీలం వెంకటేశ్వర్లునాయుడు (పల్నాడు జిల్లా) గారిని వరించింది. రెండవ బహుమతి (₹ 2116/-)  ఖమ్మం వాస్తవ్యులు శ్రీ ఆర్. ప్రకాశంగారు స్వీకరించారు. మూడవ బహుమతిని శ్రీ ముక్తి భాస్కరరావుగారు దక్కించుకోన్నారు.

చివరగా, న్యాయనిర్ణేతలు ప్రసంగించి, పద్యగానాలలోని గుణదోష విశ్లేషణ చేశారు. పాణ్యం దత్తశర్మగారు ప్రసంగిస్తూ, అసలు పద్యం పాడతానని వచ్చినందుకే బహుమతి ఇవ్వవచ్చునన్నారు. యువతరం పద్యాలను నేర్చుకొని పాడాలన్నారు. సాజిద్ అన్న 16 సంవత్సరాల కుర్రవాడు చక్కగా గానం చేశాడని అతన్ని ఆశీర్వదించారు. గోదాదేవి అన్న ఎనభై సంవత్సరాల మహిళ వేదికనెక్కి కేశవదాసు గారి గురించి చెప్పి, పద్యాన్ని ఆలపించి, సభికులను ఆశ్చర్యచకితులను చేశారు. పోటీదారులలో ముస్లిములు, క్రైస్తవులు కూడా పాల్గొని, కళకు మతం లేదని ఋజువు చేశారు. పోలీసు శాఖ నుండి ఒక ఎ.ఎస్.ఐ, ఒక మహిళా కానిస్టేబులు పాల్గొన్నారు. డిస్ట్రిక్ట్ ట్రైజరీ (విశ్రాంత) అధికారి ఒకాయన చక్కని పద్యాలు పాడారు. వృత్తికి, ప్రవృత్తికి సంబంధం లేదు కదా!

పాణ్యం దత్తశర్మగారిని, ఇతరన్యాయ నిర్ణేతలను నిర్వాహకులు శాలువ, జ్ఞాపికలతో సత్కరించారు. పాణ్యం దత్తశర్మ మాట్లాడుతూ, – 150 సంవత్సరాల తర్వాత కూడ కేశవదాసుగారి ప్రార్థనా గీతం తన వన్నె కోల్పోలేదని, కోల్పోదని అన్నారు. శ్రీకృష్ణతులాభారం లోని ‘భలే మంచి చౌక బేరము’ అను పాట ఆధ్యాత్మిక సౌరభాలను కలిగి ఉన్నదన్నారు. తొలి తెలుగు టాకీ ‘భక్త ప్రహ్లాద’కు పాటలు రాసింది కేశవ దాసుగారేనని, అందులో లీలావతి పాత్రధారిణి శ్రీమతి సురభి కమలాబాయి గారికి రాసిన ‘పరితాప భారంబు’ అన్నపాట, తులాభారంలో ‘మునివరా! తుదకిట్లు ననున్ మోసగింతువా’ అన్న పాట, ‘భలే మంచి చౌక బేరము’ అన్నపాట నిత్య నూతనాలుగా విలసిల్లుతున్నాయని కొనియాడారు.

తర్వాత పాణ్యం దత్తశర్మ గారు తాను చందాల కేశవదాసు గారిపై వ్రాసిన పద్యాన్ని ఆలపించగా, హార్మోనిస్టు శ్రీ కొండల రావు అద్భుతంగా అనుసరించారు.

సీ:
ప్రార్థనా గీతాన పరబ్రహ్మమును గొలిచి
నాటకాలకు నాంది నమర జేసె
చలనచిత్రములలో సాహిత్య సౌరభ
గుమగుమలు పండించి కోమలములు
భద్రాచలమ్ములో బావిని తవ్వించి
భక్తుల దప్పిక బాయ జేసె
చౌక బేరమటంచు శేరి జేరెడు త్రోవ
చూపించి వేదాంత శోభనటుల
తే.గీ.
మహిత వ్యక్తిత్వ పాండిత్య భాసురంబు
తనరు చందాల కేశవదాసు యశము
పాట పద్యములన్నంతవరకు యతని
కీర్తిచంద్రిక విలసిల్లు కేతనముగ

~

తర్వాత, నిర్వాహకులు, సీనియర్ రంగస్థల నటులు, సర్వశ్రీ రంగాచారి, గాబ్రియేలు, న్యాయవాది షేక్ లాల్ జాన్ బాషా గార్లకు సన్మానం చేశారు.

కళాకారులకు, ఆహూతులకు, ప్రేక్షకులకు, నిర్వాహకులు స్థానిక మెస్‍లో చక్కని భోజనం ఏర్పాటు చేయడం విశేషం.

‘కావ్యేషు నాటకం రమ్యమ్’

‘నాటకాంతం హి సాహిత్యమ్’

‘పద్యం హృద్యం నిరంతరమ్’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here