[box type=’note’ fontsize=’16’] “పేపర్ మీద ఇతివృత్తాన్ని చూస్తే ఆసక్తికరంగానే వుంటుంది. కాని సినెమా తీయడం మాత్రం అలా జరగ లేదు” అంటున్నారు పరేష్ ఎన్. దోషి ‘ఖాన్‌దానీ శఫాఖానా‘ సినిమాని సమీక్షిస్తూ. [/box]
హిందీలో బోల్డ్ కథనాలు తీసుకుని సినెమాలు తీస్తుండడం మామూలే. ఇందులో కూడా అలాంటి వొక కాథనే తీసుకున్నారు. అది మగవాళ్ళ సెక్సు సమస్యలు. కాని ఈ అంశంతో తీయగల మంచి చిత్రం తీయలేదనే చెప్పాలి. దానికి కారణాలు చాలా వున్నాయి. దర్శకత్వం శిల్పి దాస్‌గుప్తాది. ఇది ఆమె తొలి ప్రయత్నం. కాబట్టే చాలా చెప్పేయాలని ఉబలాటంతో స్క్రీన్‌ప్లే మీద తగినంత శ్రధ్ధ పెట్టలేదు.
పంజాబ్ లోని హోషియార్పుర్ లో వొక కుటుంబం. బేబి బేడి (సోనాక్షి సిన్‌హా) మెడికల్ రెప్ గా పనిచేస్తుంది. తండ్రి చనిపోయాడు. అక్క పెళ్ళైపోయింది. తమ్ముడు మొద్దు. అక్క పెళ్ళికి తీసుకున్న అప్పుల భారం ఆ కుటుంబాన్ని కుంగదీయడమే కాదు అనుక్షణం అభద్రతా భావనలో వుంచుతుంది. బేబి మేనమామ (కుల్‌భూషణ్ ఖరబందా) వొక యునాని క్లినిక్ నడుపుతూ వుంటాడు. అయితే యెక్కువశాతం పేషంట్లు సెక్సు సమస్యల పరిష్కారానికి వస్తుంటారు. అది చాలా రద్దీగా వుండే వ్యాపార స్థలం. అలాంటి చోట ఇది వుండడం ఆ వ్యాపారస్తులకు ఇష్టం వుండదు. యెందుకంటే ప్రజలందరికీ సెక్సు గురించి గోప్యత అంగీకారమే కాని ఇలా బాహాటంగా క్లినిక్ తెరిచి వైద్యం చెయ్యడం మింగుడు పడదు. ఇదే కారణం చేత బేబి తల్లి కూడా అన్నను దూరం పెడుతుంది. చిన్న పాపగా బేబి కి మామయ్య పని పట్ల ఆసక్తి వుండేది. ఇప్పుడైతే తను వొక మెడికల్ రెప్ గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. ఇంతలో మామయ్య చనిపోవడం, తన విల్లులో తన మేనకోడలు గనక ఆర్నెల్లపాటు తన క్లినిక్ ను నడిపితే ఆ స్థలం ఆమె సొంతం, లేదంటే యునానీ రీసెర్చ్ సెంటర్ సొంతమవుతుంది అని వ్రాసి పోతాడు. వ్యాపార స్థలంలో వున్న ఆ క్లినిక్ విలువ కూడా కోటి రూపాయల పైనే వుంటుంది. అది సొంతమైతే తమ కష్టాలు తీరుతాయి అన్న భావనతో బేబి అందరి అయిష్టాన్ని లెక్క చేయకుండా ఆ క్లినిక్ ను నడుపుతుంది. మామయ్య ముందే కొన్ని మందులు తయారు చేసి వుంచాడు, లేబిల్స్ అంటించి. అవి అయిపోయాక అతను వ్రాసి వుంచిన డైరీని అధ్యయనం చేసి మందులు తనే తయారు చేస్తుంది. సాంప్రదాయిక సమాజంలో ఆమె ప్రయత్నం సఫలం అవుతుందా అన్నది మిగతా కథ.