ఖాన్‌దానీ శఫాఖానా : నిరుత్సాహపరుస్తుంది

0
10

[box type=’note’ fontsize=’16’] “పేపర్ మీద ఇతివృత్తాన్ని చూస్తే ఆసక్తికరంగానే వుంటుంది. కాని సినెమా తీయడం మాత్రం అలా జరగ లేదు” అంటున్నారు పరేష్ ఎన్. దోషిఖాన్‌దానీ శఫాఖానా‘ సినిమాని సమీక్షిస్తూ. [/box]

హిందీలో బోల్డ్ కథనాలు తీసుకుని సినెమాలు తీస్తుండడం మామూలే. ఇందులో కూడా అలాంటి వొక కాథనే తీసుకున్నారు. అది మగవాళ్ళ సెక్సు సమస్యలు. కాని ఈ అంశంతో తీయగల మంచి చిత్రం తీయలేదనే చెప్పాలి. దానికి కారణాలు చాలా వున్నాయి. దర్శకత్వం శిల్పి దాస్‌గుప్తాది. ఇది ఆమె తొలి ప్రయత్నం. కాబట్టే చాలా చెప్పేయాలని ఉబలాటంతో స్క్రీన్‌ప్లే మీద తగినంత శ్రధ్ధ పెట్టలేదు.

పంజాబ్ లోని హోషియార్పుర్ లో వొక కుటుంబం. బేబి బేడి (సోనాక్షి సిన్‌హా) మెడికల్ రెప్ గా పనిచేస్తుంది. తండ్రి చనిపోయాడు. అక్క పెళ్ళైపోయింది. తమ్ముడు మొద్దు. అక్క పెళ్ళికి తీసుకున్న అప్పుల భారం ఆ కుటుంబాన్ని కుంగదీయడమే కాదు అనుక్షణం అభద్రతా భావనలో వుంచుతుంది. బేబి మేనమామ (కుల్‌భూషణ్ ఖరబందా) వొక యునాని క్లినిక్ నడుపుతూ వుంటాడు. అయితే యెక్కువశాతం పేషంట్లు సెక్సు సమస్యల పరిష్కారానికి వస్తుంటారు. అది చాలా రద్దీగా వుండే వ్యాపార స్థలం. అలాంటి చోట ఇది వుండడం ఆ వ్యాపారస్తులకు ఇష్టం వుండదు. యెందుకంటే ప్రజలందరికీ సెక్సు గురించి గోప్యత అంగీకారమే కాని ఇలా బాహాటంగా క్లినిక్ తెరిచి వైద్యం చెయ్యడం మింగుడు పడదు. ఇదే కారణం చేత బేబి తల్లి కూడా అన్నను దూరం పెడుతుంది. చిన్న పాపగా బేబి కి మామయ్య పని పట్ల ఆసక్తి వుండేది. ఇప్పుడైతే తను వొక మెడికల్ రెప్ గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. ఇంతలో మామయ్య చనిపోవడం, తన విల్లులో తన మేనకోడలు గనక ఆర్నెల్లపాటు తన క్లినిక్ ను నడిపితే ఆ స్థలం ఆమె సొంతం, లేదంటే యునానీ రీసెర్చ్ సెంటర్ సొంతమవుతుంది అని వ్రాసి పోతాడు. వ్యాపార స్థలంలో వున్న ఆ క్లినిక్ విలువ కూడా కోటి రూపాయల పైనే వుంటుంది. అది సొంతమైతే తమ కష్టాలు తీరుతాయి అన్న భావనతో బేబి అందరి అయిష్టాన్ని లెక్క చేయకుండా ఆ క్లినిక్ ను నడుపుతుంది. మామయ్య ముందే కొన్ని మందులు తయారు చేసి వుంచాడు, లేబిల్స్ అంటించి. అవి అయిపోయాక అతను వ్రాసి వుంచిన డైరీని అధ్యయనం చేసి మందులు తనే తయారు చేస్తుంది. సాంప్రదాయిక సమాజంలో ఆమె ప్రయత్నం సఫలం అవుతుందా అన్నది మిగతా కథ.

ఇలా పేపర్ మీద ఇతివృత్తాన్ని చూస్తే ఆసక్తికరంగానే వుంటుంది. కాని సినెమా తీయడం మాత్రం అలా జరగ లేదు. సెక్సు సంబంధించిన విషయాల్లో ఇదివరకే విక్కి డోనర్, శుభ మంగల్ సావధాన్ వగైరా మంచి చిత్రాలు వచ్చాయి. ఇది మాత్రం ప్రేక్షకుడి సహనాన్ని పరీక్షిస్తుంది. ఇప్పటికి గైనకాలజిస్టులే కాదు ఆండ్రోలజిస్టులు కూడా ప్రాచుర్యంలో వచ్చారు. ఇదివరకులా కాకుండా మనుషులు తమ సెక్సుపరమైన సమస్యలకు కూడా పధ్ధతిగా వైద్య సహాయం తీసుకుంటున్నారు. మరోపక్క అమాయకులను తప్పుదోవపట్టించి, మోసంచేసి, డబ్బులు దండుకునే దొంగ సెక్సాలజిస్టులకు కూడా కొదవలేదు. దీనికి ముఖ్య పరిష్కారం సెక్సును పరదాల చాటునుంచి బయటకు తీస్సి బాహాటంగా చర్చకు పెట్టడం. వో సిగ్గుపడవలసిన విషయంగా సెక్సు సమస్యలను చూడకుండా ఇతర జబ్బుల వలెనే వైద్యం అవసరమైన్ విషయంగా చర్చించడం. ఈ వొక్క విషయం చెప్పడంలో సినెమా కృతకృత్యం అని చెప్పవచ్చు. మిగతా విషయాల్లో అబ్బే. యునాని వైద్యులు కళ్ళు, నాడీ చూసి జబ్బు చెప్పేయడం లాంటి కామెడి చాలానే వుంది. రిషి పంజాబి చాయాగ్రహణం బాగుంది. ముఖ్యంగా ఆ క్లినిక్ పరిసరాలూ, ఆ పాతకాలం నాటి ఇళ్ళు అవీ. మిగతా సాంకేతిక విషయాలు పెద్దగా చెప్పుకోతగ్గవి కావు. నటన విషయానికి వస్తే సోనాక్షి పర్లేదు. ఆ మాత్రం నటన తన శక్తి మేరా కష్టపడి సాధించింది. అయితే కంటికింపుగా కనబడేది అన్ను కపూర్, నాదిరా బబ్బర్ ల నటన. ఎలాంటి డిగ్రీ లేకుండా క్లినిక్ నడిపిన బేబి మీద కేసు నడుస్తుంది. చివర్న ఆమె పధ్ధతిగా యునాని మెడికల్ కాలేజిలో చదువుకోవడానికి వెళ్ళడంతో ముగించడం న్యాయంగా వుంది. ప్రత్యామ్నాయ వైద్యం మీద వొక పక్క చర్చలు నడుస్తున్నాయి, మరో పక్క ప్రభుత్వం అయిదున్నర సంవత్సరాల చదువు స్థానంలో యేడాదీ, ఆర్నెల్ల శిక్షణతీసుకున్నవారికి కూడా వైద్యం చేయడానికి అనుమతించే సందర్భంలో వున్నాం. ఈ వాస్తవికత, దొంగ సెక్సాలజిస్టులు వున్న వాస్తవికత లను దృష్టిలో పెట్టుకుని ఈ సినెమా చూస్తే ఎంత మంచి చిత్రం తీసివుండొచ్చో తెలుస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here