కొడిగట్టిన దీపాలు-1

0
6

[box type=’note’ fontsize=’16’] విశ్రాంత హిందీ ఉపాధ్యాయులు, రచయిత గూడూరు గోపాలకృష్ణమూర్తి గారు వ్రాసిన నవల ‘కొడిగట్టిన దీపాలు‘ పాఠకులకు ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది మొదటి భాగం. [/box]

1

[dropcap]శీ[/dropcap]తాకాలం వేళ. ఉదయం పదిగంటల సమయం అవుతుంది. నును వెచ్చని పచ్చని ఎండ వసుధనంతా పరుచుకుని ఉంది. ఆ ఆహ్లాదకరమైన వాతావరణం. అటువంటి సమయంలో మైదానమంతా మహా సందడిగా ఉంది. రంగురంగుల కాగితాల తోరణాలు ఆ మహానాయకుడికి స్వాగతం పలకడానికి రెపరెపలాడుతున్నాయి.

ఆ మహానాయకుడెవరో కాదు. అందరి భారతీయుల్లో దేశభక్తిని నింపి పరాయి ప్రభుత్వ పాలనలో మనం స్వేచ్ఛా, స్వతంత్రంగా జీవించలేక ఎలా బానిస బ్రతుకులు బ్రతుకుతున్నామో తనవంతు ప్రయత్నం చేస్తూ అందర్నీ స్వాతంత్ర్య సమరంవేపు నడిపిస్తున్న మన దేశ రథసారథే బాపూజీ.

అతను ఎంతగా ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించాడంటే అందరూ అతని అడుగులో అడుగులు వేస్తూ ముందుకు కదులుతున్నారు. ప్రపంచంలో పేరుగాంచిన మహాపురుషులు, మహానాయకులందరూ మొదట్లో మామూలు స్థాయి, మామూలు అర్హత, మామూలు సామర్థ్యాలు కలిగిన వారే, అయినప్పటికి వారు తమ ఆత్మ విశ్వాశాన్ని ఆత్మసైర్యాన్ని కోల్పోలేదు. ఆశని ఆసరాగా చేసుకుని ముందుకు కదిలారే కాని, నిరాశని దరిదాపులకి రానీయలేదు. ఆ ఆత్మవిశ్వాసంతోనే నిరంతరం కృషిచేస్తూ పురోగమించారు.

తమకి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా తమ లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకున్నారు. ఆ పరిస్థితులకి చలించలేదు. దేశం, ధర్మం, సమాజం, మానవమాత్రుల సేవ ఇవే అతని కళ్ళ ఎదుట నిలిచాయి. పరిస్థితుల్ని చక్కబరచడానికి జీవితాన్నే సమిధగా మార్చి స్వాతంత్ర్య సమరం అనే యజ్ఞ గుండంలో ఆహుతి అవడానికే సంకల్పించాడు ఆ మహానాయుడు. అతని అడుగు జాడల్లో నడిచారు. భారతవాసులు. కోట్లాది ప్రజల హృదయాల్లో దేశభక్తి అనే చిరుదివ్వెలు వెలిగించారు ఆయన.

అటువంటి మహాత్ముడ్ని దర్శించుకోవాలన్నదే సుజాత భావన. అతని కోసం ఆమె ఎదురుచూపులు. నీవు ఖాళీగా ఉన్నావు కాని నేను మాత్రం ఖాళీగా లేను అని ఆమెను హెచ్చరిస్తున్న మనస్సు రకరకాల ఆలోచనల వేపు పరుగులు తీయిస్తోంది. మనిషిలో స్వార్థం, ఐక్యతలేమి, పరోపకార కొరత, విశాల దృక్పథం లేకపోవడం వీటి అన్నిటి వల్ల దేశానికి, మానవావళికి ఎంతో నష్టం. వీటిలోటు వల్లే మనం ఇన్ని శతాబ్దాల నుండి భానిస బ్రతుకులు బ్రతుకుతున్నాం. కర్రపుల్ల ఒకటి ఉంటే దాన్ని సులువుగా విరిచి వేయగలం. అలాంటి కర్ర పుల్లలు ఒక మోపులా ఉంటే విరవడం అసాధ్యం.

అలాగే మన భారతీయుల్లో ఐక్యత లోపించింది కాబట్టి ఒకళ్ళని నయాన్న, మరొకరిని భయాన్న, లేక ప్రలోభపెట్టి, ఆశ చూపించి మన దేశానికి వచ్చిన విదేశస్తులు మనల్ని విడదీసి పాలించారు. తమ పబ్బం గడుపుకున్నారు. దేశం పరాయి వాళ్ళ పాలయింది.

నాన్నమ్మ మాటలు ఆమె చెవిలో గింగిర్లాడుతున్నాయి. నాన్నమ్మ చెప్పిన మాటలు నిజమే. చరిత్ర పుటలు తిరగేస్తే అఖండ భారతదేశం. ఆసేతు హిమాచలం వరకూ సమస్త దేశం చిన్న చిన్న భాగాలుగా విభజింపబడి ఉండేదట. ఒక్కొక్క భాగాన్ని ఒక్కొక్క పరిపాలకుడు పరిపాలించేవారట. వారిలో ఐక్యత లోపించింది. ఒకరిని అణచివేయడానికి మరొకరు ప్రయత్నించేవారట. తమ సోదరుల్లాంటి పొరుగు పరిపాలకుల్ని ఓడించడానికి విదేశాల నుండి వచ్చిన విదేశీయులతో చేతులు కలిపారు. దానికి ఫలితమే దేశం పరాధీనత చెందింది.

“బాపూజీకీ జయ్, …… మహాత్మాగాంధీకి జయ్” అనే నినాదాలు విన్న ఆమె ఆలోచనా ప్రపంచం నుండి బయటపడింది. బాపూజీ వచ్చేస్తున్నారు. తను అతని సమీపానికి వెళ్ళగలదా? ఇంత జన సమూహంలో, అతనితో మాట్లాడగలదా? ఆమె మదినిండా ఇలాంటి అలోచనే.

ఇంత మంది ప్రజల మనస్సుల్ని దోచుకున్న బావూజీ ఎంత నిరాడంబరంగా ఉన్నారు? ఖద్దరు గావంచా కట్టుకుని, కండువా భుజం మీద వేసుకుని కళ్ళద్దాల మాటున పరిసరాలను పరికిస్తూ, బోసి నవ్వులు చిందిస్తూ చేతి కర్రతో వడివడిగా అడుగులు వేసుకుంటూ వస్తున్న గాంధీజీని కన్నార్పకుండా చూస్తోంది సుజాత.

బాపూజీతో అందరూ మాట్లాడుతున్నారు. అందరు చెప్పింది వింటున్నారు ఆయన. అందరికీ సలహాలిస్తూనే అతను పరిసరాలను తన తీక్షణమైన వాడియైన చూపుల్తో పరికిస్తున్నారు. ఒక దగ్గర ఆయన చూపులు నిలిచిపోయాయి.

ఎర్ర అంచు తెల్లని ఖద్దరు చీరలో ముద్దమందారంలా వెలిగిపోతున్న సుజాత రూపం ఆయన్ని ముగ్ధుడ్ని చేసింది. ఎవ్వరితో కలవకుండా ఒంటరిగా నిలబడి గంభీరంగా ఆలోచిస్తోంది సుజాత. బాపూజీ ఆమె వేపు గబగబా అడుగులు వేస్తూ వస్తున్నారు. ఆయన్ని అనుసరిస్తున్నారు స్థానిక నాయకులు.

“బాపూ! అఫ్ కో మైఁ నే పహలే బతాదియానా యేహీ సుజాతా బహిన్. డిగ్రీ పఢ్ రహీ హై. ఆప్ కే రచనాత్మక్ కార్యక్రమ్ ఖాదీ ప్రచార్, హిందీ ప్రచార్ అదీ ప్రచార కర్నే కే అలావా జోష్ పూర్ణ్ అపనీ దేశ్ భక్తి కీ కవితావోం కే ద్వారా సబ్ మే దేశభక్తి భర్ రహీ హై” (బాపూ! మీకు నేను మొదటి చెప్పేను కదా. ఈమే సోదరి సుజాత. డిగ్రీ చదువుతోంది. మీ రచనాత్మక కార్యక్రమాల్లో భాగమయిన ఖద్దర్ ప్రచారం, హిందీ ప్రచారం మొదలైనవి ప్రచారం చేయడమే కాకుండా ఆవేశపూరితమైన దేశభక్తి కవితల ద్వారా అందరిలో దేశభక్తిని నింపుతోంది.) స్థానిక నాయకుడు గాంధీజీకి సుజాత గురించి వివరిస్తున్నాడు.

గాంధీజీ సుజాతనయితే చూడలేదు కాని, స్థానిక నాయకుల ద్వారా ఆమె గురించి విన్నారు. ఆమె వ్రాసిన దేశభక్తి గీతాలకి కినుక వహించి విదేశీ ప్రభుత్వం ఆమెను అరెస్టు చేసి జేలుకి పంపడం విన్నారు. ఖద్దరు ప్రచారాన్ని హిందీ ప్రచారాన్ని, విదేశీ వస్తు బహిష్కరణ ఈ కార్యక్రమాల్ని ఆమె ఎంత సమర్థవంతంగా నెరవేరుస్తోందో అన్ని విషయాలూ విన్నారు.

“బేటీ తుఁమారీ కార్యదీక్షా సే మైఁ బహుత్ ఖుష్ హో రహా హుఁ. అబ్ దేశ్ కో తుఁమారీ జైసీ నవ్ పీడీకీ ఆవశ్యకతా హై. (అమ్మాయ్! నేను నీ కార్యదీక్షకి చాలా సంతోషిస్తున్నాను. ఇప్పుడు దేశానికి నీలాంటి నవతరం అవసరం ఎంతేనా ఉంది..) సుజాతను తన ప్రశంసల్లో ముంచెత్తుతూ గాంధీజీ అన్నారు.

“మైఁ బహుత్ ధన్య్ హోగయీ బాపూ. ఆప్ కే దర్శన్ పాకర్” (మీ దర్శన భాగ్యం నాకు కలిగింది, నేను చాలా ధన్యురాలినీయ్యను.) గాంధీజీతో సుజాత అంది. అతని నుండి వీడ్కోలు తీసుకుంటున్న సమయంలో..

నిజంగా బాపూజీ తన దగ్గరికి వచ్చి తనని ఇలా ప్రశంసలో ముంచెత్తుతారని ఆమె ఊహించనైనా ఊహించలేదు. అనుకోని సంఘటన ఎదురయ్యేసరికి ఆమె హృదయంలో ఆనంద తరంగాలు ఉవ్వెత్తున విరుచుకు పడున్నాయి. ఆ ఆనందాన్ని మనస్సులోనే దాచుకుని ఇంటి వేపు అడుగులు వేస్తోంది.

2

అది ప్రశాంతమైన పల్లె. స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన నీరు, కల్లాకపటం తెలియని మనుష్యులు. ఒకరి మీద మరొకరు చూపిస్తున్న ప్రేమాభిమానాలూ, అమాయకులైన పల్లె జనాలు. ఇదీ ఆ పల్లె వాతావరణం.

అటువంటి పల్లెలో మాధవరావు తనకున్న అర ఎకరం పొలంలో కూరగాయ మొక్కలు, పూల మొక్కలకి గొప్పులు త్రవ్వుతూ, వాటికి నీరు పోస్తూ నుదుటిన పట్టిన చెమటను తుడుచుకుంటూ అరటి చెట్లకి నీరు పారిస్తున్నాడు.

మనిషి తను బ్రతకాలి. తనని అంటి పెట్టుకుని ఉన్న వాళ్ళని బ్రతికించాలి అని అనుకుంటే బాగా డబ్బు సంపాదించాలి. ఆ డబ్బుకి మనిషికి అవినాభావ సంబంధం ఉంది. అందుకే అంటారు అందరూ డబ్బుకి లోకం దాసోహమని. ప్రపంచంలో ఏ పని కూడా డబ్బు లేకపోతే జరగదు. ఆ డబ్బు సంపాదించి తన కుటుంబం ఎటువంటి వొడిదొడుకులు లేకుండా జీవించాలనేదే మాధవరావు తాపత్రయం. అందుకోసమే అతను రాత్రీ, పగలూ కష్టించి పనిచేస్తున్నాడు.

తనకి కష్టం వచ్చినప్పుడే, సమస్య ఎదురయినప్పుడు తను ఒంటరిగా ఉండాలనుకుంటాడు. ఆ సమస్య ఎందుకొచ్చిందో విశ్లేషించి కారణం వెతుక్కోడానికి, దానికి పరిష్కారం ఆలోచించి అది దొరికే వరకూ అతను తన గూటిలోనే ఉండడానికి ప్రయత్నిస్తాడు. అతని దృష్టిలో తన సమస్య – ఇతరులకి చెప్పేకంటే తన సమస్యను పరిష్కరించుకునే సత్తా తనకే ఉంది అని ఆలోచిస్తాడు.

తన తోటలో పండిన కూరగాయల్ని, పూలని చూస్తూ తన సమస్యల్ని మరిచిపోతాడు. తను పడ్డ శ్రమను మరిచిపోతాడు. ఇలా సాఫీగా సాగిపోతోంది అతని కుటుంబ జీవితం. అయితే రోజులు ఎప్పుడూ ఒకే మాదిరిగా ఉండవు. విధి ఆడించిన వింత నాటకంలో పావు అవుతున్నాడు మనిషి. విధి వక్రీభవిస్తే మనిషి జీవితం అస్తవ్యస్తమవడమే కాకుండా సర్వనాశన చివర అంచుల్లోకి మనిషి చేరుకుంటాడు. దాన్నే మనం నుదుటి వ్రాత అని అంటాము. సాధ్యం కానివి సాధ్యం అవచ్చు, సాధ్యం అవుతాయి అని అనుకొన్నవి సాధ్యం కాకపోవచ్చు. ధనికుడు పేదవాడవ్వచ్చు, పేదవాడు శ్రీమంతుడు అవ్వచ్చు. ఆరోగ్యవంతుడు రోగగ్రస్తుడవ్వచ్చు. అలాగే రోగగ్రస్తుడు ఆరోగ్యవంతుడవ్వచ్చు. అదే విధి ఆడించిన వింత నాటకం.

చాలా చక్కగా ఏ చీకూ చింత లేకుండా ఆడంబరంగా కాకపోయినా నిరాడంబరంగానైనా సాగిపోతున్న మాధవరావు జీవితంలో అపశృతి చోటు చేసుకుంది. అవి విధి మొక్క పంజా దెబ్బకి నిన్న మొన్నటి వరకూ ఎంతో చక్కగా, హాయిగా తన పనులు చక్కపెట్టకుంటూ, పెరట్లో కూరగాయల

మొక్కలు, పాదులు, పూల మొక్కల పని చూసుకుంటూ, పండిన కూరగాయల్ని, పూలని అమ్మకానికి తనకి నమ్మిన బంటులా ఉన్న విశాలగుప్తా దుకాణానికి చేరవేసేవాడు మాధవరావు. అతను ఇచ్చిన డబ్బును ఇంటి ఖర్చులకి వినియోగిస్తూ, ఇంటిలో ఆడవాళ్ళు తయారు చేసిన అప్పడాలు, వడియాలూ పట్టణానికి తీసుకెళ్ళి అమ్మి సొమ్ము చేసుకునేవాడు. ఆ డబ్బుతో కుటుంబ అవసరాలు తీర్చుకునే మాధవరావుకి ఈ మధ్య ఆరోగ్యం సరిగాలేదు. శరీరంలో ఏదో నిస్సత్తువ. కడుపులో ఏదో వికారం. ఏదో తెలియని బాధ.

“అన్నాయ్!” అని ఆప్యాయంగా మాధవరావును పిలిచే విశాలగుప్తా, మాధవరావు వారిస్తున్నా వినకుండా అతడికి వైద్య పరీక్షలు చేయించడానికి పట్నం తీసుకెళ్ళాడు. పట్నంలో మాధవరావుకి వైద్యం చేయించాడు. పరీక్షల్లో మాధవరావుకి కేన్సరు అని తేలింది.

ఈ వార్త వినగానే మాధవరావు కుటుంబం డీలా పడిపోయింది. వాళ్ళ జీవన నౌక విచ్చిన్నమవుతున్నట్టు విలవిల్లాడిపోయారు ఆ కుటుంబ సభ్యులు. ఇక్కడి విషయాలేవీ కొడుకు రాజశేఖరానికి తెలియజేయవద్దని ఇంట్లో వాళ్ళకి చెప్పాడు మాధవరావు. విశాలగుప్తాకి కూడా ఇదే విషయం చెప్పాడు. ఎందుకంటే ఈ విషయం తెలుస్తే కొడుకు రాజశేఖరం చదువు సక్రమంగా సాగదు అని అతని ఉద్దేశం. రాజశేఖరం పట్నంలో వారాలు చేసుకుంటూ డిగ్రీ చదువుతున్నాడు.

మాధవరావుకి తను చనిపోతే కుటుంబ పరిస్థితి అస్తవ్యస్తంగా తయారవుతుంది. తన కుటుంబ చిన్నాభిన్నం అవుతుందని చింత, దిగులు కూడా. చింత చాలా కర్కశమయినది. కఠినమయినది. చితి నిర్జీవ శరీరాన్ని దహించి వేస్తే చింత జీవితంలో ఉన్న శరీరాన్నే దహించి వేస్తుంది. ఆ చింతతోనే రోజు రోజుకి కృంగిపోతున్నాడు. మాధవరావు. విశాలగుప్తా మాత్రం రోజూ అతనింటికి వచ్చి అతనికి ధైర్యం చెప్తున్నాడు.

‘ఈ మానవ సమాజంలో ఇంకా విశాలగుప్తా లాంటి మానవత్వం మెండుగా ఉండే మంచి మనుష్యులు ఉన్నారు. అతను ఇలా తనని తన కుటుంబాన్ని ఈ కష్టకాలంలో ఆదుకుంటున్నాడు. అలా ఆదుకోబోతే తన కుటుంబ పరిస్థితి చాలా హీనంగా, దుర్భరంగా ఉండేది’ అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాడు మాధవరావు.

భార్య మీనాక్షి, పెద్ద కూతురు శారద అతను చేయవల్సిన పనులన్ని నిర్వర్తిస్తున్నారు. ఆ ఆడవాళ్ళిద్దరూ మొక్కలకి, పాదులకీ గొప్పులు త్రవ్వడం, పెంట గెత్తం మొక్కలకి వేయడం, వాటికి నీరు పెట్టడం మాధవరావు చేసిన పనులన్నీ చేస్తున్నారు.

పండిన వంకాయలు, చిక్కుడు, దొండకాయలు, టమాటా పళ్ళు ఇంటి అవసరానికి ఉంచుకుని మిగతావి విశాలగుప్తా దుకాణానికి ఇస్తున్నారు. విశాలగుప్తా మీనాక్షి, శారద తయారు చేసిన అప్పడాలు, వడియాలు పట్నానికి వెళ్ళి వాటిని దుకాణాలకిచ్చి వాళ్ళు ఇచ్చిన డబ్బులు మీనాక్షికి ఇచ్చేవాడు. మాధవరావు చేసే పని అతను చేసేవాడు.

“దేఁవుడంటే ఎక్కడో లేడు. నీవే మా దేఁవుడవి” అని మీనాక్షి విశాలగుప్తాను కృతజ్ఞత తెలియజేస్తూ అంటుంది. “అదేంటి వదినమ్మా! మనం ఒక దగ్గర కలిసిమెలసి ఉంటున్నవాళ్ళము. ఆపాటి సాయం చేసుకోవడం గొప్పా! అదేఁ గొప్ప విషయం ఏమి కాదు” అని నవ్వుతూ అనేవాడు విశాలగుప్తా. అంతే కాదు మాధవరావు వైద్య ఖర్చుల నిమిత్తం అడపాదడపా డబ్బు ఇచ్చేవాడు. అతను ఇచ్చిన ప్రతీ పైసా మాధవరావు ఓ పుస్తకంలో వ్రాసుకునేవాడు.

సమాజంలో ఏ మనిషీ ఎదుటివాళ్ళ సహాయం తీసుకోకుండా బ్రతకలేడు. జీవితంలో ఎప్పుడేనా ఒకరి సహకారం మరొకరికి అవసరమవుతుంది. ఎందుకంటే మనం సామాజిక ప్రాణులం. అందులోను రోగగ్రస్తుడై ఉన్న మాధవరావుకి ఎదుటివాళ్ళ సహాయం తీసుకోవడం ఎంతో అవసరం.

సహాయం తీసుకోడంలోనూ నమ్మకం ప్రధానపాత్ర పోషిస్తుంది. ఆ నమ్మకమే ప్రధానం. మాధవరావు విశాలగుప్తాను నమ్మాడు. అతని నమ్మకాన్ని వమ్ము చేయలేదు విశాలగుప్తా..

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here