కొడిగట్టిన దీపాలు-10

0
6

[box type=’note’ fontsize=’16’] విశ్రాంత హిందీ ఉపాధ్యాయులు, రచయిత గూడూరు గోపాలకృష్ణమూర్తి గారు వ్రాసిన నవల ‘కొడిగట్టిన దీపాలు‘ పాఠకులకు ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది 10వ భాగం. [/box]

19

[dropcap]వి[/dropcap]ధి చేతుల్లో మనష్యులు కీలుబొమ్మలు. ఆ విధి మనిషిని ఆటబొమ్మగా చేసుకుని ఆడించి వినోదిస్తుంది. ఆ విధే మానవుని మనుగడపై కటాక్షించని పక్షంలో వారి జీవితాల్లో మిగిలింది విషాదమే. ఆ విషాదానికి ఫలితంగా వారు దుఃఖం – నిరాశ – అసంతృప్తికి లోనవుతారు.

విధి చేతిలో చిత్తుగా ఓడిపోయింది మీనాక్షి. లేమిలో పిల్లలే నా ఆస్తి అని తృప్తి చెందడానికి కూడా అవకాశం ఇవ్వకుండా ఆమె పరాజితురాల్ని చేసి ఆమె తిరిగి తేరుకోలేనటువంటి పరిస్థితి వచ్చింది.

ఛిన్నాభిన్నమైపోతున్న తన జీవితాన్ని తలుచుకుని కుమిలి పోతోందామె. మరదలు సూటిపోటి మాటలు, సాధింపులు విని విని, సహించి సహించి ప్రాణమున్నా ప్రాణం లేని జడపదార్థంలా చలనం లేని దాన్లా ఆమె పరిస్థితి తయారయింది.

ఆమె ప్రవర్తన చూస్తూ మౌనంగా ఉండిపోయిన తమ్ముడు మీద ఆమెకి కోపం లేదు. పైపెచ్చు జాలిలాంటి భావం. అదీ ఎందుకు? తన తమ్ముడు మెతకతనం వల్లనే మరదలు ఇలా ప్రవర్తిస్తోంది. తను గట్టిగా అడగలేని పరిస్థితి. ఒకవేళ తను నిలదీసి అడుగుతే ఇంటిలో కలతలు అశాంతి తప్ప ఏం లేదు.

తను ఎవ్వరినీ ఏఁ అనలేదు. కళ్ళెదుట జరుగుతున్న పరిస్థితుల్ని అలా చూడ్డం తప్పు. తన సంతాన విషయంలోనే తనేం చేయగలిగింది?

పెద్ద కొడుకు చదువు మాని స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నందుకు కాదు ఆమెకి క్షోభ. ఈ కష్టకాలంలో చెట్టంత కొడుకు నీడలో తన జీవితం చల్లగా ఉండే అవకాశం ఆ భగవంతుడు తనకి కల్పించలేదు కదా అనే బాధ తనది.

తన కళ్ళెదుటే ఎన్నో అన్యాయాలు జరిగినా మరదలు తన సంతానాన్ని ఇబ్బందుల పాల్గేస్తున్నా ప్రతిఘటించలేని అసహయరాలు తను. అందుకే శారదకి రెండో పెళ్ళివాడు, అదీ శారదంత కూతురు ఉన్న వాడికి ఇచ్చి పెళ్ళి చేస్తుంటే వారించలేకపోయింది, కన్నీరు కార్చడం తప్ప. మనస్సులోనే శారదకి జరుగుతున్న అన్యాయం తలుచుకుని మౌనంగా రోదించింది మీనాక్షి.

ఇక చిన్న కొడుకు మరదలు ఆగడాలు సహించలేక ఇల్లు వదిలి వెళ్ళిపోయడు. వాడు ఇల్లు వదిలి వెళ్ళడానికి ఒక విధంగా కారకురాలు తను కూడా. వేణు మరదల్ని ఎదిరించి మాట్లాడుతుంటే తను మరదలి తప్పున్నా మరదల్ని ఏం అనలేక వేణుని కొట్టింది. వాడి మనస్సు క్షోభించింది. కళ్ళలో కన్నీరు తళుక్కున మెరుస్తూ ఉండగా బాధతో చెంపల్ని తడుముకుంటూ అచటి నుండి కదిలిపోయడు. అలా వెళ్తున్న చిన్న కొడుకుని బాధగా చూడ్డం తప్ప తనేం చేయలేకపోయింది.

ఆత్మాభిమానం, ఆత్మ గౌరవం – పట్టుదల సమపాళ్ళల్లో రంగరించుకున్న చిన్న కొడుకు ఈ అవమానం భరించలేక ఇల్లు వదిలి వెళ్ళిపోయడు. బ్రతికుండే చచ్చిన వాడిలా అయ్యాడు. చచ్చిపోతే ఒకటి రెండు రోజులు ఏడ్చి ఆ తరువాత మరిచిపోతాం. మరపు భగవంతుడు మనిషికిచ్చిన గొప్పవరం. అయితే బ్రతికి ఉండగానే ఇలా కన్న వాళ్ళకి దూరమవడం రంపపు కోతలా ఉంది తనకి.

ఇలా ఆలోచిస్తున్న మీనాక్షిలో నిర్లిప్తత. చలనం లేని దానిలా కూర్చుండిపోతుంది. కష్టాల మీద కష్టాలు వచ్చిపడుతూ ఉంటే నిర్లిప్తత తప్ప ఇంకేం మిగిలింది? ఆమెకి తన జీవితంలో సంతోషపడ్డానికి – సంబరపడ్డానికి ఇకేఁ మిగిలి ఉన్నాయి కనుక? ఏం చూసుకుని గర్వపడగలదు తను.

ఆమె నడి వయస్సులోనే ఆమెను కుటుంబాన్ని ఏకాకులుగా చేసి భర్త చనిపోయాడు. పెద్ద కూతురు శారద జీవితం బాగుందా అంటే అదీ లేదు. రెండో పెళ్ళివాడితో కాపురం చేస్తూ జీవచ్ఛవంలా ఆశలు అడుగంటిపోయి జీవితంలో రాజీపడి బ్రతికేస్తోంది. అటువంటి కూతురి జీవితం చూస్తే ఆమెకి బాధే తప్ప సంతోషం లేదు.

అభివృద్ధిలోకి రావల్సిన పెద్ద కొడుకు కుటుంబ భారాన్ని తండ్రి తరువాత తన భుజస్కందాలపై వేసుకోవల్సినవాడు ఇలా స్వాతంత్ర్య పోరాటంలో తిరుగుతూ చదువు మానేసినందుకు ఆమెకి మరింత బాధగా ఉంది. ఈ సమయంలో మీనాక్షికి కావల్సింది ఆమె పరిస్థితి చూసి సానుభూతి చూపేవారు కాదు. సానుభూతీ కాదు. అది చూపేవారు సమాజంలో చాలా మంది ఉంటారు.

చితికిన బ్రతుకుల్ని – పేకమేడల్లా కూలిపోయి అస్తవ్యస్తంగా ఉన్న మీనాక్షి జీవితాన్ని ఓ దారికి తీసుకువచ్చే, ఆమెను అదుకునే ఓ చల్లని హస్తం కావాలి. ఈ మధ్య మీనాక్షి ఆరోగ్యం సరిగా ఉండటం లేదు. తన జీవితం చరమ దశలో ఉందా అన్న భయం పట్టుకుంది. ఆమె ఏమయిపోయినా పరవాలేదు. ముక్కు పచ్చలారని పసిదైన చిన్న కూతురు కళ్యాణి గురించే మీనాక్షి బెంగంతా.

మనశ్శాంతి లేదు మీనాక్షికి. చింత ఆమె జీవితాన్ని ఛిద్రం చేస్తోంది. ఆ చింతతోనే ఆమె ఈ మధ్య కృంగిపోతోంది. కృశించిపోతోంది.

మీనాక్షమ్మ అంతరంగంలో క్షోభ. ఆమె ఆలోచిస్తోంది. తను తమ్ముడు దగ్గరకు వచ్చినప్పటి ఆదరణ, గౌరవం ఇప్పుడు లేవు. అప్పుడు శారదా తను, డబ్బు సంపాదించే బంగారు బాతులు. యంత్రాలకన్నా ఎక్కువుగా పని చేస్తూ మరదల్ని సంతృప్తిపరిస్తే తమ మనుగడ సాఫీగా సాగిపోయేది.

ఇప్పుడు పరిస్థితులు తల క్రిందలయ్యాయి. ఇప్పుడు తను పాడి ఆవు కాదు. వట్టిపోయిన గొడ్డు. ఇప్పుడు మరదలకి తన వల్ల ఏం ఉపయోగం లేదు. అందుకే తనంటే ఇంత వివక్ష, ఉపేక్ష. అంతేకాదు తన ఆరోగ్యం రోజు రోజుకి క్షీణిస్తోంది. ఈ మధ్య విశాలగుప్త వచ్చాడు. తన కుటుంబ పరిస్థితి చూసి చాలా బాధపడ్డాడు.

అతనికి తన కుటుంబానికి ఏం సంబంధం ఉంది? రక్త సంబంధం కూడా లేదు. అయినా తన కుటుంబం కోసం ఎంత ఆరాటం పడుతున్నాడు? తామ వద్దు వద్దు అంటున్నా బలవంతంగా హాస్పటల్‌కి తీసుకువెళ్ళాడు.

తమ్ముడూ, మరదలూ అతని ముందు కాకపోయినా వెనక అతని మీద ఎంత చిటపటలాడారు?

హాస్పటల్‌లో పరిక్షలు చేయించాడు. ఆ పరీక్షల్లో తనకి కేన్సరు అని తెలిసి ఎంత బాధపడ్డాడు. తనకి బాధనిపించలేదు. ఎందుకంటే ఈ బాధలు అనుభవించి – అనుభవించి విసిగిపోయింది. ఈ జీవితం నుండి ఎంత త్వరగా విముక్తి కలుగుతుందా అని ఎదురు చూస్తోంది తను. అయితే తన బాధంతా చిన్న పిల్ల కళ్యాణి గురించే.

“వదినమ్మా మా ఇంటికి వచ్చేయండి. అక్కడ మీకు బాగుంటుంది. అక్కడ నుండే వైద్యం చేయించుకోవచ్చు” అన్నాడు విశాలగుప్త. అయితే తన వాళ్ళ మనస్సు చిన్నబుచ్చడం మీనాక్షికి ఇష్టం లేదు. తన జీవిత చరమాంకంలో ఉంది. ఈ అంతిమ సమయంలోనేనా తన వాళ్ళ దగ్గర ఉండాలని మీనాక్షి కోరిక. ఎంతేనా రక్త సంబంధం కదా!

“లేదయ్యా! మీ దగ్గర ఉంటే అప్పటికప్పుడు నా ఆరోగ్యం విషమిస్తే సరియైన వైద్యం లభించదు. అందుకే ఇక్కడే ఉంటాను” అంది మీనాక్షి విశాలగుప్తాతో,

“సరే” అన్న విశాలగుప్తా ఆమె వైద్యానికి, తిండి ఖర్చులకీ బ్యాంకులో మీనాక్షి పేరున దాచిన డబ్బు ఇచ్చాడు. డబ్బు ఇస్తే బాగా చూసుకుంటారని అతని నమ్మకం. ధర్మారావు, నాంచారమ్మ కిమ్మనకుండా డబ్బు తీసుకున్నారు. ఈ ప్రపంచంలో అన్ని సంబంధాలు డబ్బుతోనే అని అనుకున్నాడు విశాలగుప్త.

తండ్రి విషయంలో తనకి తెలియజేయలేదని రాజశేఖరం నిష్ఠూరంగా మాట్లాడేడు తన దగ్గర. తల్లి పరిస్థితి ఇలా ఉందని విశాలగుప్తా తెలియజేద్దామనుకున్నాడు. అయితే మీనాక్షి వారించింది. “అంత అర్జంటు అని అనుకుంటే నేనే చెప్తాను. అప్పుడు తెలియజేయచ్చు” అని అంది మీనాక్షి విశాలగుప్తతో.

20

స్వాతంత్ర్య పోరాట సమయంలో బ్రిటిష్ ప్రభుత్వం రాజశేఖరాన్ని నిర్భందించి జేలులో పెట్టింది. గడువు పూర్తి అయిన తరువాత నిర్భంధం నుండి విడుదలై బయటపడ్డ రాజశేఖరం స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకున్నాడు. విడుదలై వచ్చేడే కాని అతనికి సంతోషంగా లేదు. ముందుంది ముసళ్ళ పండుగ అన్నట్టు ఏ క్షణాన్న తనని తిరిగి ఈ ప్రభుత్వం నిర్భందిస్తుందో తెలియని అయోమయ అస్తవ్యస్థ పరిస్తితి అతనిది. అతనికో లక్ష్యం ఉన్నా గమ్యం చేరుకోడానికి లక్ష్య సిద్ధికి తాపత్రయ పడ్డానికి అనేక అవరోధాలు.

సహృదుయులైన మానవత్వం మెండుగా గల పరంధామయ్య, పార్వతమ్మ దంపతులు రాజశేఖరానికి ఆశ్రయం ఇచ్చారని అంతకు మునుపే చెప్పుకున్నాం.

రాజశేఖరం తన బసకొచ్చి విశ్రాంతి తీసుకుంటున్నాడు. తనకి ఉండడానికి ఆశ్రయం అయితే దొరికింది కాని ఆకలి సమస్యా? జీవితం గడపాలంటే, మనిషి బ్రతకాలంటే తినడానికి తిండి ఉండాలి. అది లేకపోతే జీవన గమనమే కుంటుబడుంది. తన మనుగడే ఆగిపోతుంది. తన జీవన గమనం ఆగిపోయినా పరదాలేదు. కాని తన జీవన లక్ష్యం నెరవేరడానికి కొన ఊపిరి ఉన్నంత వరకూ తను తన వంతు కృషి చేస్తాడు.

ఈ స్వాతంత్ర్య సమరం ఓ హోమ గుండం. దీనిలో తన లాంటి వాళ్ళు సమిధలయిపోవల్సిందే. ఆలోచనలు ఆహారంగా తీసుకుని ఊహ ప్రపంచంలో విహరిస్తున్న రాజశేఖరానికి ఆకలి వేస్తోందన్న స్పృహే లేదు. గదిలోకి సుజాత రాకతో రాజశేఖరం ఆలోచనా ప్రపంచం నుండి బయటపడి యథార్థ ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. అప్పుడు తనకి ఆకలి ఎంత తీవ్రమయినదో, ఎంత తీవ్రంగా తన ప్రభావం మనుష్యులపై చూపిస్తుందో అవగతమయింది.

సుజాత చేతిలో భోజనం కేరియరు చూడగానే అతని మనస్సు ఆ ఆకలి సమయంలో ఎగిరి గంతేసి సంతోషించడానికి బదులు కుంచించుకుపోయింది. తన చేతకానితనాన్ని వేలెత్తి చూపుతున్నట్టు అనిపించింది.

తను ఈ రోజుయితే తను సుజాత తెచ్చిన భోజనం తిని ఆకలి బాధను తాత్కాలికంగా చల్లార్చుకుంటాడు. మరి రోజూ సంగతో? తన జీవితమే తనకి ఓ సమస్యగా తయారయింది. ఈ సమస్యకి పరిష్కార మార్గం వెతకొద్దా? తను ఎన్నాళ్ళు ఎదుటి వాళ్ళ మీద ఆధారపడి బ్రతకగలడు?

అతని ముఖ కవళికలు బట్టి అతని మనోగత భావాలు సుజాత అర్థం చేసుకోడానికి ప్రయత్నిస్తోంది. తను అతని కోసం ఇలా భోజనం తేవడం అతనికిష్టం లేదు. తన ఈ చర్య అతనికి నచ్చలేదు అన్న విషయం ఆమెకి అవగతమయింది.

ఈ ఒక్కమాటు భోజనం అతనికి తేవడానికి తనకెన్ని అవరోధాలేర్పడ్డాయో? ఎంత రాద్దాంత సిద్ధాంతాలు అయ్యాయో? ఎంత రబస అయ్యిందో తలుచుకోడానికే సుజాతకి అసహ్యమేసింది. తనని సీతమ్మ నానా మాటలూ అంది. అంతేకాదు మరి రాధో?

రాధ తనకీ రాజశేఖరానికి నీచమయిన – అపవిత్రమైన సంబంధం అంటగట్టి తన మనస్సు గాయపరిచింది. వాళ్ళు ఇలా ప్రవర్తించడానికి కారకుడు శేషు. అతను సీతమ్మని, రాధని రెచ్చగొట్టాడు. వాళ్ళ మాటలకి సుజాత మనస్సు కలత చెందింది. వాళ్ళకి తన మీద ఎంత కక్షో? తను వాళ్ళకి ఏ హాని చేసాను. ఇలా ఆలోచిస్తున్న ఆమె కళ్ళనిండా కన్నీరు.

ఓ అమృత హస్తం ఆమె తలను ఆప్యాయతగా నిమిరిందంది – ఆమెను ఓదార్చింది. ఆమె కన్నీరు తుడిచింది. ఆమె ఆంతరంగిక భావం గ్రహించి రాజశేఖరానికి భోజనం తీసుకెళ్ళి ఇచ్చిరమ్మనమని భోజనం కేరియర్ తన చేతికిచ్చింది. ఆ అమృత హస్తం తన తండ్రిది. అతని చల్లని చేయి తగలగానే తనకి ఎంతో హాయి అనిపించింది. అంతవరకూ తను పడ్డ మానసిక క్షోభ మరిచిపోయింది.

తన తండ్రి అండ తనకి ఆ మాత్రమేనా ఉంది. కనకనే ఇంటిలో ఆ మాత్రమే నా మసలగలుగుతున్నాను. పదే పది సార్లు తన మనస్సులో అనుకునేది సుజాత.

“సుజా!” అతను పిల్చాడు.

అతని కంఠంలో కదలాడుతున్న నీరసం – నిస్సత్తువ సుజాతను కదిలించింది. అతని వంక ఓ పర్యాయం చూసింది. తను చేసిన పని అతని అభీష్టానికి వ్యతిరేకంగా ఉందనిపించిది సుజాతకి.

“మీ అభీష్టానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తే క్షమించండి” ఆమె కంఠంలో అభ్యర్ధన తొంగి చూసింది. ఎందుకంటే తను ఇలా భోజనం తేవడం అతనికి నచ్చలేదనిపించింది సుజాతకి.

“అబ్బె…బ్బె…బ్బే….!!! అదేం కాదు” తన భావాలు ఆమె పసిగట్టిందని తెల్సుకుని కంగారు పడ్తూ అన్నాడతను.

“నా ఉద్దేశం అది కాదు. ఈ పూటంటే నీవు నా ఆకలి తీరుస్తావు. మరి రేపటి మాటో?” అతని మాటల్లో విచారం అస్పష్టంగా అగుపించింది.

“రేపు అన్న పదాన్ని అవతల పెట్టి ప్రస్తుతం వర్తమాన పరిస్థితి మీద మీ దృష్టిని కేంద్రీకరించండి. జరగబోయే దాన్ని గూర్చి ఆలోచించే కంటే జరుగుతున్న విషయానికి ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రస్తుతం మీకు చాలా ఆకలిగా ఉన్నదన్న విషయం నాకు తెలుసు. మీరు భోజనం చేసి విశ్రాంతి తీసుకోండి” భోజనం అతనికి వడ్డిస్తూ అంది సుజాత.

ఆమె వడ్డన చేస్తుంటే అతను ఆవురావురుమంటూ తింటున్నాడు. అలా తింటున్న రాజశేఖరం వేపు ఓమారు జాలిగా – ఆప్యాయతగా చూసింది సుజాత. ఆమె వడ్డన చేయగా తిన్న ఆ భోజనం అతనికి అమృతంలా అనిపించింది. తాత్కాలికంగా తన ఉనికిని – తన బాధని తాత్కాలికంగా మరిచిపోయిన అతను తృప్తిగా ఊపిరి వదిలాడు.

“బాబూ రాజశేఖరం!” అతనికి ఆశ్రయం ఇచ్చిన ఇంటి యజమాని పరంధామయ్యగారు పిల్చారు. ఉలిక్కిపడిన రాజశేఖరం – సుజాత ఇద్దరూ ఒకే పర్యాయం తల తిప్పి చూశారు. ఎదురుగా పరంధామయ్య అతని భార్య నిలబడి ఉన్నారు.

“ఏంటండీ?” తేరుకుని అడిగాడు రాజశేఖరం.

“నిన్న విశాలగుప్త గారుట అతను వచ్చాడు. మీ అమ్మకి సీరియస్‌గా ఉందని ఆమెకి నిన్ను చూడాలని ఉందని, నిన్ను ఓమారు చూడాలని మీ అమ్మ అంటోంది అని చెప్పి వెళ్ళారు. ఎలాగూ నీవు ఇంటికి వస్తావు చెప్పచ్చు. జేలుకి వచ్చి చెప్తే ఎంత కంగారు పడ్తావో అని చెప్పలేదు” పరంధామయ్య నొచ్చుకుంటూ అన్నాడు. ఆ విషయం రాజశేఖరానికి పిడుగుపాటులా అనిపించింది. అతని నవనాడులూ కృంగిపోయాయి.

“ఈ లోకంలో అన్ని కష్టాలూ మంచి వాళ్ళకి – దురదృష్టవంతులుకీ వస్తాయయ్యా!”

తల్లి పరిస్థితి అతని కళ్ళెదుట అగుపించింది. అతని మనస్సులో బాధ కళ్ళల్లో బాధ వల్ల వచ్చిన కన్నీళ్ళు తన కుటుంబం ఇంత ఛిన్నాభిన్నంగా తయారయింది. ఇలా వీధిన పడింది. ఇన్ని అనర్థాలూ ఒకే పర్యాయం వచ్చాయి. ఇలా వస్తాయని ఊహించలేదు.

పెద్ద కొడుకుగా తను తన కర్తవ్యాన్ని నెరవేర్చాడా? జేలులో ఉండడం వల్ల తనకి ఏ విషయాలూ తెలియలేదు. తన కుటుంబ పరిస్థితికి అతని గుండెలు బాధతో బరువెక్కాయి. బాధ గుండెల్ని పిండి పిండి చేస్తోంది. పొంగిపొర్లు కొస్తున్న దుఃఖాన్ని బలవంతంగా ఆపుచేసుకుంటున్నాడు. అయినా సాధ్యపడలేదు. చిన్న పిల్లడిలా బోరున ఏడుస్తున్నాడు. ఇలా డీలా పడి అతను ఏడవడం చూస్తున్న అక్కడున్న ఆ ముగ్గురు విచలితులయ్యారు. అతడ్ని ఎలా ఓదార్చాలో వాళ్ళకి తెలియలేదు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here