కొడిగట్టిన దీపాలు-11

0
7

[box type=’note’ fontsize=’16’] విశ్రాంత హిందీ ఉపాధ్యాయులు, రచయిత గూడూరు గోపాలకృష్ణమూర్తి గారు వ్రాసిన నవల ‘కొడిగట్టిన దీపాలు‘ పాఠకులకు ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది 11వ భాగం. [/box]

21

[dropcap]త[/dropcap]నకున్న నాలుగు బట్టలూ సంచిలో సర్దుకుని రెక్కలు కట్టుక్కుని తన తల్లి దగ్గర వ్రాలాలన్న తాపత్రయంలో ఆత్రుతలో ఉన్నాడు రాజశేఖరం. చిన్న సూటుకేసుతో ప్రత్యక్షమయింది సుజాత. ఆమె రాక అతని కళ్ళల్లో విషాదం వెనుక విస్మయం.

“నేనూ మీ అమ్మగార్ని చూడ్డానికి వస్తున్నాను.” సుజాత కంఠంలో ఓ స్థిర నిర్ణయం తొణికిసలాడింది.

“నీవు నాతో వస్తావా…?” రాజశేఖరం కంఠంలో ప్రశ్నార్థకంతో పాటు ఆశ్చర్యం.

“రాకూడదా…?

ఆమె హఠాత్తుగా అడిగిన ప్రశ్నకి అతనికి ఏ సమాధానం ఇవ్వాలో ఒక్క క్షణం తోచలేదు.

“రాకూడదని కాదు నా అభిమతం. మీ ఇంటి పరిస్థితి ఎరిగున్న నేను అలా అనడం తప్పు లేదనుకుంటాను.”

“నిజమే! మీరు ఊహించినది ముమ్మాటికీ నిజమే. అయితే భావమనో వికారాల్లో ఒకటి అయిన భయం ఉంది చూశారా, అది మహా చెడ్డది. లోకం రీతి కూడా ఏంటంటే భయపడున్న వాళ్ళని మరింత భయపెడుతుంది. ఆ భయమే మనో వికారాన్ని నా నుండి తరమేసాను. ఇన్నాళ్ళూ నా రచనలో బ్రిటిష్ ప్రభుత్వానికి ఎదురు తిరిగిన నేను ఈ రోజు నా వ్యక్తిత్వాన్ని చాటి చెప్పడానికి నా ఆత్మగౌరవాన్ని తెలియజెప్పడానికి నా వాళ్ళను ఎదిరిస్తున్నాను.”

విప్పారిన నయనాల్తో ఆమె వేపు చూస్తూ ఉండిపోయాడు రాజశేఖరం.

“ముఖ్యంగా మీ కోసం మా వాళ్ళకి ఎదురు తిరిగాను.” అలా అంటున్న సుజాత ముఖంలో స్థిర నిర్ణయం. ఆమె తన కోసం తన వాళ్ళని ఎదిరించడానికేనా సిద్ధపడుతోంది అన్న విషయం అవగతమవగానే అంత విషాదంలోనూ అతని కళ్ళల్లో గర్వరేఖ తళుక్కున మెరిసింది.

అతనూ, ఆమె బస్సులో బయలు దేరారు. బస్సు నల్లని, మెరుస్తున్న తారు రోడ్డు మీద పరుగులు పెడ్తోంది. ఆ బస్సుతో పోటీ పడ్తున్నట్లు రాజశేఖరం సుజాత ఆలోచన్లు పరుగెత్తుతున్నాయి. అతని వదనంలో ఆలోచన చిహ్నాలు అగుపడ్తూ ఉంటే కళ్ళల్లో ఆవేదనా – దుఃఖానికి చిహ్నంగా కన్నీటి తెర తళుక్కున మెరిసింది.

సుజాత వదనంలో ఆవేదనా చిహ్నాలు అగుపిస్తున్నాయి. ఆమె ఆవేదనగా ఆలోచిస్తోంది. రాజశేఖరం కుటుంబం ఇలా తయారవడానికి – ఇంతలా బాగా చితికి పోవడానికి కారకురాలు తను. ఆనాడు అతని మనస్సుని చదువు నుండి ఉద్యమం వేపు మళ్ళించింది తను. అలా తను చేయకపోతే అతను చదువుకుని ప్రయోజకుడయి ఉండేవాడు. ఆర్థిక ఇబ్బందుల్లో ఛిన్నాభిన్నం అయి ఉన్న అతని కుటుంబానికి ఓ ఆధారం దొరికి ఉండేది. బానిన బ్రతుకు బ్రతుకుతున్న తన వారిని ఆదుకుని ఉండేవాడు. దేశాన్ని బానిస సంకెళ్ళ నుండి విడిపించే బదులు మొదట తన దృష్టిని తన వారిపై సారించి, బానిస బ్రతుకు నుండి తన వారిని అదుకునేవాడు.

అనుకోకుండా రాజశేఖరం దృష్టి సుజాతపై నిల్చింది. ఆమె కూడా అనుకోకుండా అతడ్ని చూసింది ఆలోచన్ల నుండి తేరుకుని. ఒకరి భావాలు మరొకరు, ఒకరి ఆవేదన మరొకరు అర్థం చేసుకోడానికి వారిద్దరూ ప్రయత్నిస్తున్నారు.

“శేఖరం గారూ…!” పిల్చిందామె.

“ఊఁ!!!”

“మీ కుటుంబ పరిస్థితి ఇలా తయారవడానికి కారకురాల్ని నేనే కదూ!”

“అలా అని ఎందుకనుకోవాలి? ఇలా జరగాలని వ్రాసిపెట్టి ఉన్నప్పుడు దాన్ని మార్చడానికి ఎవరికీ సాధ్యం కాదు.” ఆమె ఆలోచన్లు అర్థం చేసుకున్న అతను అన్నాడు. ఆమెలో నున్న ఆవేదన తొలగించి మనస్థైర్యాన్ని కలిగించాలన్న తపన రాజశేఖరానిది.

“ఆనాడు మీ మనస్సును చదువు మీద నుండి నేను మళ్ళించకుండా…”

“ప్లీజ్! అలాంటి మాటలు మరో పర్యాయం నేను వినదల్చుకోలేదు. అలా మళ్ళించకుండా ఉండి ఉంటే నేను బాగా చదువుకుని, ప్రయోజకుడ్ని అయి నా వాళ్ళని ఆదుకుని ఉండేవాడినని నీ భావన కదూ సుజా! ఒక్క విషయం. ఆనాడు నీవు నా కర్తవ్యం దేశం ఏడల ఏంటో తెలియజెప్పకపోతే నేను నా కుటుంబం, నేనూ అని అనుకుంటూ ఎంతో స్వార్థపరుడుగా ఉండేవాడిని.

ఇప్పుడు మనకి కావల్సింది వ్యక్తి స్వాతంత్ర్యం కాదు. దేశ స్వాతంత్ర్యం ముఖ్యం. నాకు నా కర్తవ్యాన్ని బాగా తెలియ జేసినందుకు నీకు ఎన్నో విధాల కృతజ్ఞతలు తెలియ చేయాలి నేను. ఏదీ మన చేతుల్లో లేదు. మనం మాత్రం నిమిత్త మాత్రులం. ఎలా జరగవల్సింది జరగకమానదు. అలాంటప్పుడు దీని కంతటి కారకురాలు నీవే అని ఎందుకనుకోవాలి.” వేదాంత దోరణిలో విరక్తిగా అన్నాడు రాజశేఖరం. ,

సుజాత ఏఁ మాట్లాడలేదు.

“ఒక్క విషయం మనుష్యుల్లో కూడా దేవుడిలాంటి వాళ్ళుంటారు. దానికి సాక్ష్యం పరంధామయ్య దంపతులు” రాజశేఖరం అన్నాడు. అతను చెప్పింది నిజమే అని అనిపించింది సుజాతకి. వారు బయలుదేరుతున్న సమయంలో ఆ దంపతులు అన్న మాటలు ఆమె చెవుల్లో ఇప్పటికి కూడా గింగుర్లాడుతున్నాయి.

“శేఖరం బాబూ! అమ్మగారికి కొద్దిగా సులువుగా ఉంటే చెల్లెమ్మని, అమ్మగారిని ఇక్కడికి తీసుకు వచ్చేయ్. మాకేం పదిమంది ఉన్నారు కనుక. మీ ముచ్చకాయ ముగ్గురికి ఇంత తిండి పెట్టినంత మాత్రాన్న మేమేఁ బాధపడము. నీవు ఆత్మాభిమానం గలవాడివి. మోహమాటస్తుడివి. వారాలు చేసుకుని చదువుతానన్నావు. ‘మా ఇంట్లోనే తిని చదువుకోకూడదా’ అని ఆనాడే అందామనుకున్నాము.”

“ఆ దంపతులు మాటల గురించేనా నీ ఆలోచన?”

“ఊఁ…!

“వారి మాటలు వినగానే అంతమంచి మనుష్యులు ఈ రోజుల్లో కూడా ఉన్నారా అని అనిపించింది. కొండంత అండ లభించినంత తృప్తి కలిగింది. వారి మాటలు నాలో ఊపిరి పోసాయి. వారికి చేతులెత్తి ఒకేసారి శతకోటి నమస్కారాలు చేయాలనిపించింది.”

వారి మాటలో – భావాల్తో తనకేం సంబంధం లేనట్లు బస్సు వారు దిగవల్సిన గమ్యస్థానంలో దింపింది. ఆ గ్రామానికి బస్టాండు లేదు. రోడ్డు మీద బస్సు దిగి గ్రామంలోకి నడక సాగించారు సుజాతా – రాజశేఖరం.

ఉదయం పది గంటల సమయం అయింది. ఎండ చురుక్కుమంటోంది ఆ పది గంటల సమయంలోనూ విశాలగుప్తా రోడ్డు మీదకు వచ్చాడు. సుజాతా, రాజశేఖరం గురించి అతను విన్నా అతను ఒకరికి కోసం మరొకరు పుట్టారా అని అనిపించే ముచ్చటైన జంట అని అనుకుంటూ వాళ్ళ వెనకాలే నడుస్తున్నాడు. సుజాత కూడా విశాలగుప్తా గురించి వింది.

రాజశేఖరాన్ని దుఃఖం – బాధ అవేదన చుట్టుముడున్నాయి. ఇల్లు దగ్గర పడున్న కొద్దీ అడుగులు తడబడ్తున్నాయి. అతడ్ని అనుసరిస్తున్న సుజాత అతనికి ధైర్యం చెప్తూ అతని వెనకాలే అడుగులేస్తోంది.

22

సుజాత రాజశేఖరం ముందుకు భారంగా తొట్రుపాటుతో అడుగులు వేస్తుంటే, వాళ్ళముందు నడుస్తున్న విశాలగుప్తా గంభీరంగా ఆలోచిస్తున్నాడు.

‘తల్లికి కేన్సరు వ్యాధి అని రాజుకి తెలియదు. చెప్పదంది వదినమ్మ. తండ్రి అనారోగ్య విషయం తెలయజేయలేదని నిష్ఠూరం ఆడాడు. అప్పుడంటే చదువు పాడవుతుందని తెలియజేయనీయలేదు. ఈసారి స్వాతంత్ర్య పోరాటంలో తిరగడం జేలుకి వెళ్ళడం వాటి వల్ల తల్లి అనారోగ్యం తెలియజేయడానికి అవకాశం లేకపోయింది.

ఇంత సీరియస్‌గా ఉన్నదన్న విషయం తనకి ఎందుకు తెలియజేయనీయలేదు అని రాజశేఖరం మళ్ళీ అదే నిష్ఠూరం మాటలు అన్నాడు. అతనిలో బాధ అలా నిష్ఠూరంగా మాట్లాడించిది.’ ఇలా సాగిపోతున్నాయి విశాలగుప్తా ఆలోచన్లు.

రాజశేఖరం ఆలోచన్లు మరోలా ఉన్నాయి. ప్రపంచం అశాశ్వతం. జీవితం అశాశ్వతం. జీవించి ఉన్నన్నాళ్ళూ సుఖం, దుఃఖం అనివార్యం. విషాదం, ఆనందం, అవమానం, అభినందన, నిరసన ఇవన్ని తప్పనిసరి. వీటి అన్నిటికి అందని, నశించని, నిరంజనమైంది, నిశ్చలమయింది మనలో ఉంది. అదే మన అంతరంగం కేంద్రంలో ఉంది. మన సమస్త చింతల్ని దానిపై కేంద్రీకరిస్తే అక్కడే అంతులేని ఆనందం ఉంది.

ఇలా తను ఆలోచిస్తాడు కాని, తన ఆప్తులన్న వాళ్ళు ఆపదల్లో ఉన్నా మరణా స్థితిలో ఉన్నా, అంత వరకూ ఉన్న ధైర్యం, భావాలు సడలిపోయి, బేలతనం మనలో చోటు చేసుకుంటుంది.

ఇంటి చుట్టూ మూగి ఉన్న జనాన్ని చూసి అప్పుడే రాజశేఖరానికి అనుమానం వచ్చింది. అపనమ్మకం కలిగింది. దానివెంట అధైర్యం కూడా. గుండెల్లో బాధ – ఆవేదన ఒక వేపు. కలత బారిన మనస్సులో ఇంటిని సమీపించాడు. అతడ్ని అతని వెనకాలనున్న సుజాతను చూడగానే జనాలు ప్రక్కకి తప్పుకున్నారు.

మృత్యువుతో పోరాడుతోంది మీనాక్షి. ఆమె శ్వాస ఎగిసెగిసి పడుతోంది. నోటి వెంబడి మాట రావటం లేదు. కళ్ళు మాత్రమూ ఎవరికోసమో నిరీక్షిస్తున్నట్లు పత్తికాయల్లా విచ్చుకున్నాయి.

తల్లి పరిస్థితిని చూసిన రాజశేఖరం విచలితుడయ్యాడు. భావోద్వేగంతో ఊగిపోతున్నాడు. తల్లి మీదపడి బోరున విలపిస్తున్నాడు. అంతవరకూ వేదాంత ధోరణిలో నిర్లిప్తంగా ఆలోచించిన అతని ఆలోచన్లు అన్నీ సడలిపోయాయి.

మీనాక్షి కళ్ళలో నుండి కూడా దారాపాతంగా కన్నీరు పైకి వచ్చింది. దీన్ని బట్టి మాట్లాడ్డానికి అసాధ్యమయినా తన బాధను ఇలా కన్నీటి రూపంలో ఆమె వ్యక్తం చేస్తోంది అని చూసిన వాళ్ళకి తెలుస్తోంది. మాట్లాడలేక పోవడం వల్ల తన మనస్సులో భావం. అవేదన కొడుక్కి వ్యక్తం చేయలేకపోతోంది. మృత్యువుతో పోరాడుతున్న మీనాక్షి.

తల్లి చూపులు చిన్న చెల్లెలు కళ్యాణి పైన, తన పైన ఉండడం చూసి రాజశేఖరం తల్లి అభిప్రాయం గ్రహించాడు. కళ్యాణి బాధ్యత తల్లి తనకి అప్పగిస్తోంది అని గ్రహించాడు.

“అమ్మా! నేను బ్రతికి ఉండినంత వరకూ కళ్యాణికి ఏ లోటూ రానీయనమ్మా. చెల్లెలు బాధ్యత నాదే.” స్థిర కంఠంతో అన్నాడు. అతని కళ్ళల్లో నుండి కన్నీరు తల్లి చేతిని పట్టుకున్న అతని చేతి మీదపడ్డాయి.

మాట వినగానే పూర్తి విశ్వాసం ఆ తల్లికి కలిగినట్టుగా కళ్ళల్లో వింత కాంతి తళుక్కుమంది. తన కొడుకు తనకిచ్చిన మాటను పూర్తిగా నిలబెట్టుకుంటాడనే పూర్తి నమ్మకం ఆమె ముఖంలో అగుపించింది. ఆమె విచ్చుకున్న కనుదోయి నుండి ఆనందం వలన వచ్చిన ఆనంద భాష్పాలు దారగా ఆమె చెంపలపై నుండి జారుతూ క్రిందకు పడ్తున్నాయి.

ఆమె చూపులు సుజాత మీద నిలిచాయి. ఆమె కళ్ళల్లో అనేక సందేహాలు. ఆ సందేహాలు నివృత్తి చేస్తూ “అమ్మా! సుజాత నీకు కాబోయే కోడలు” అన్నాడు. మృత్యువుతో పోరాడుతున్న మీనాక్షి కళ్ళల్లో వింత వెలుగును అక్కడి వాళ్ళు చూడగలిగారు.

సుజాత తన రెండు చేతులూ ఎత్తి మీనాక్షికి నమస్కరించింది. మీనాక్షి కళ్ళల్లో సుజాతను చూడగానే అనేక భావాలు. తను నిశ్చంతగా కళ్ళు మూయవచ్చు. తన కొడుక్కి తగ్గ యోగ్యురాలైన కోడలు. కళ్యాణి బాధ్యత చక్కగా చక్కబెట్ట గలిగే సమర్థురాలు. వినయ విధేయత సమపాళ్ళలో రంగరించుకున్న యోగ్యురాలన్న భావన ఆమె వదనంలో తొణికిసలాడింది.

మరుక్షణమే తను ఆశించినది నెరవేరుతుంది అన్న నమ్మకం ఆమెకి కలిగింది. క్రమంగా ఆమె కనుదోయిలో మెరుపు తగ్గిపోయి నిస్తేజంగా తయారయింది. మృత్యువు తాలూకా నీలినీడలు ఆ కనుదోయిలో కదలాడాయి. మీనాక్షి ఆయాసపడుతోంది. ఎక్కిళ్ళతో ఆమె ఎద ఎగిసిపడుతోంది.

ఒక్కసారి పెద్దగా వెక్కడం ఆమె ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసి పోవడం ఒక్కసారే జరిగాయి. ఆమె కళ్ళు చావు తరువాత కూడా అలా తెరిచే ఉన్నాయి. కళ్ళలో నుండి ప్రాణం పోయింది అని అనుకున్నారు అక్కడ వాళ్ళు.

తల్లి శవం మీద పడి ఏడుస్తున్నారు, రాజశేఖరం, శారద. అందరూ ఎందుకు ఏడుస్తున్నారో తెలియటం లేదు కళ్యాణికి. శారదని, రాజశేఖరాన్ని ఓదారుస్తున్నారు విశాలగుప్తా దంపతులు. చిన్న చెల్లెల్ని, పెద్ద చెల్లెల్ని పట్టుకుని విలపిస్తున్న రాజశేఖరం తలపై మృదువుగా చేయివేసి నిమిరింది సుజాత. అతను తల పైకెత్తి చూశాడు. అతనికి ధైర్యం చెప్పి ఓదార్చే ప్రయత్నంలో ఉన్నట్టు సుజాత అతనికి కనిపించింది.

ఇంతమంది ఇన్ని విధాలుగా బాధపడ్తున్నారు కాని మేనమామ, అతని భార్యలో బాధపడున్న లక్షణాలు అగుపించకపోయే సరికి, రాజశేఖరం, సుజాతే కాకుండా, విశాలగుప్తా దంపతులు కూడా చాలా బాధపడ్డారు. మానవ సంబంధాలన్నీ డబ్బుతోనే ముడిపడి ఉన్నాయనుకుని గాఢంగా నిట్టూర్పు విడిచాడు విశాలగుప్త.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here