కొడిగట్టిన దీపాలు-15

0
9

[box type=’note’ fontsize=’16’] విశ్రాంత హిందీ ఉపాధ్యాయులు, రచయిత గూడూరు గోపాలకృష్ణమూర్తి గారు వ్రాసిన నవల ‘కొడిగట్టిన దీపాలు‘ పాఠకులకు ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది 15వ భాగం. [/box]

29

[dropcap]చిం[/dropcap]త అంత ప్రమాదికరమైన రోగం మరోటి లేదు. చితి నిర్జీవ శరీరాన్ని దహింప చేస్తే చింత జీవంతో ఉన్న శరీరాన్నే క్షీణింప చేస్తుంది, దహింప చేస్తుంది. పరిస్థితులు ఎల్లకాలం ఒకే మాదిరిగా ఉండవు. ఆ పరిస్థితులతో పాటే మానవుల మనుగడలో మార్పు కొట్టొచ్చినట్లు అగుపడుతుంది.

సుజాత ఇల్లు వదిలి వెళ్ళిన తరువాత సుందరామయ్య మానసికంగా కృంగిపోయాడు. సీతమ్మ విషయం ఎలా ఉన్న తను కూతుర్ని ఎంత ప్రేమగా చూసుకున్నాడు. యోగ్యురాలయిన కూతుర్ని చూసి పొంగిపోయాడు. రాజశేఖరంతో పెళ్ళికి కూడా తను ఇష్టపడి ఉండేవాడు. అయితే అతను ఏమయ్యాడో తెలియని పరిస్థితిలో కూతురు సెంటిమెంటుకి పోయి ఎవ్వరినీ పెళ్ళి చేసుకోను అని మొండి పట్టుదల పట్తే తను కఠినంగా వ్యవహరించవల్సి వచ్చింది తప్ప మరేఁలేదు.

కూతురు జీవితం ఇలా మ్రోడులా మిగిలిపోతుందన్న బాధతోనే తను ఇలా కఠినంగా వ్యవహరించాడు. ‘సుజాత అమాయకురాలు. ఆమెను బాధ పెట్టాడు. ఉసురు పెట్టాడు. దానికి ఫలితమే తనకి ఇలా అనారోగ్యం పట్టుకుంది. కూతురు ఉన్నన్నాళ్ళూ సుఖసంతోషాలు, సిరి సంపదలూ, ఆరోగ్యం అన్నీ ఉండేవి. తన చిట్టి తల్లి ఇల్లు వదిలి ఎప్పుడు వెళ్ళిందో ఇంట్లో అన్నీ అనర్థాలే జరుగుతున్నాయి.’ ఇలా ఆలోచించి మథనపడ్తూ కుమిలి పోయే అతని ఆరోగ్యం రోజు రోజుకి క్షీణించడం ఆరంభించింది.

తను ఎన్నాళ్ళో బ్రతకను అన్న అపనమ్మకం అతనిలో రోజు రోజుకి అధికమవడం ఆరంభించింది. తను ఎంత పొరపాటు చేశాడు? ఎంత మూర్ఖంగా ప్రవర్తించాడు? ఇలా మానసిక ఒత్తిడి ఏర్పడడానికి అనారోగ్య పాలవడానికి, అనవసర సమస్యలతో చిక్కుకోవటానికి ముఖ్య కారణం మనం చెప్పిందే అందరూ చేయాలని; మనమాటే పాటించాలని అనుకోకుండా ఎదుటివాళ్ళ ఇష్ట ప్రకారం నడవనిస్తే ఈ సమస్యలేవీ రావు కదా! అందుకే ఎదుటివాళ్ళ మీద పెత్తనం చెలాయించకూడదు అని ఆలోచించిన అతను తిరిగి మరోలా ఆలోచిస్తున్నాడు. తన పనిని సమర్థించుకుంటూ.

అవును నేను చేసిన దాంట్లో తప్పేంటి ఉంది. తన కూతురు జీవితంలో లేనిపోని సెంటిమెంట్లకి పోయి మ్రోడులా మిగిలిపోతుంటే తనకి బాధ కాదా? అందుకే కఠినంగా వ్యవహరించవల్సివచ్చింది.

ఇలా తనని విమర్శించుకుంటూ, సమర్థించుకుంటూ కుమిలి పోయేవాడు ఆయన. అతను మంచం పట్టడంతో, అన్ని పనులూ శేషే చూసుకునేవాడు. ఆస్తిపాస్తులు తరిగిపోతున్నట్లు ఆయనకి అనుమానం వచ్చింది. చేయి జారిపోకూండానే పరిస్థితులు చక్కదిద్దాలనుకున్న ఆయన ఓ రోజు శేషుతో మాట్లాడారు.

“రాధను నీవు పెళ్ళి చేసుకోవాలి నీవు నేనుండగా. తండ్రిగా ఆ బాధ్యతనేనా తీర్చాలి. సుజాత పెళ్ళి చేద్దామన్న నా కోరిక ఎలాగూ తీరలేదు” శేషుతో అన్నారాయన.

అతని మాటలకి అయిష్టంగా ముఖం పెట్టాడు శేషు. అతని ముఖ కవళికల్ని బట్టి రాధను పెళ్ళి చేసుకోవడానికి శేషు విముఖుడుగా ఉన్నాడనిపించింది సుందర్రామయ్యకి. “శేషూ! రాధని పెళ్ళి చేసుకోమని నిన్ను నేను ఆజ్ఞాపించటం లేదు. అంతకన్నా శాసించటం లేదు. అభ్యర్థిస్తున్నాను మాత్రమే” అతి దీనంగా శేషును బ్రతిమాలుతూ తన కోరిక తెలియజేసారు.

బావగారి ప్రస్తావన మొదట శేషుకి నచ్చలేదు. అతను కూడా అవకాశవాది. తనకి ప్రయోజనం లేనిదే ఏ పనీ చేయడు. ఆలోచనల్లో పడ్డాడు. మనిషి మొదట తన ఆలోచనల ద్వారానే ధనవంతుడు అవుతాడు. ఆ ఆలోచనల నుంచి కోరిక జనిస్తుంది. వెంటనే ఆ కోరిక తీర్చుకోవాలన్న తపన కలుగుతుంది. ఆ తపనలోనే వివిధ అవకాశాలు కనిపిస్తాయి. అలాంటి తపన మనిషిలో ఒకసారి కలిగిందంటే ఆ వ్యక్తికి విజయం తథ్యం.

అవకాశవాది అయిన శేషు కూడా సమాజంలో స్వార్థం గల మనిషే. అందుకే స్వార్థంగానే ఆలోచించేడు. తన లాభాపేక్షతో తన బావ సుజాతనే పెళ్ళి చేసుకోమని అడిగి ఉంటే ఎగిరి గంతేసి ఉండేవాడు. అయితే ఆ అవకాశం చేజారిపోయింది. రాధను పెళ్ళి చేసుకోవడం తనకి ఇష్టం లేదు. అంతగా, మనం ఇష్టపడేవాళ్ళ మీదున్న మోజు మనల్ని ఇష్టపడిన వాళ్ళ మీద ఉండదు. రాధ విషయం అదే. తను సుజాతను ఇష్టపడుతూ ఉంటే రాధ తనని ఇష్టపడుతోంది. అయితే అందని వాటి కోసం అర్రులు జాచేకన్నా అందుతున్న అవకాశాన్నేనా సద్వినియోగం చేసుకోవాలి. పరిస్థితులు ప్రకారం నడుచుకోవాలి తన స్వార్థ సిద్ధి కోసం అనుకుంటున్నాడు శేషు.

సుందర్రామయ్య రాధను పెళ్ళి చేసుకోమంటే అందుకే శేషు ఎగిరి గెంతెయ్యలేక పోయాడు. అలా అని వ్యతిరేకత చూపించలేకపోయాడు. అతనికి కావల్సింది ఆస్తి. అది తరిగిపోకుండా తన చేజిక్కించుకోవాలి అలా చేయాలంటే రాధను పెళ్ళి చేసుకోవడం ఇష్టం లేకపోయినా ఇష్టపడాలి, రాజీపడాలి.

ఆస్తి చేతి కొచ్చిన తరువాత రాధ ఇష్టం లేకపోతే వదిలించుకోడానికి అనేక మార్గాలు. సుఖాలు కొనుక్కోడానికి తగినంత డబ్బు దగ్గరుంటుంది, శేషు ఆలోచన్లు ఇవి.

“ఏంటి ఆలోచిస్తున్నావు శేషూ!?”

సుందర్రామయ్య ప్రశ్నకి “రాధను పెళ్ళి చేసుకుంటాను. అయితే ఆస్తి అంతా నా పేరున వ్రాస్తేనే,” శేషు అన్నాడు.

శేషు విధించిన షరతు విని మ్రాన్పడి పోయాడు సుందర్రామయ్య, ‘తనకి ఆ శిక్ష తగినదే. సుజాతను ఇంటి నుండి వెళ్ళగొట్టినందుకు నాకు ఇది తగిన శిక్ష, తను మొదట తన ఆస్తి కూతుళ్ళిద్దరికీ, భార్యకీ, మూడు వాటాలుగా వీలునామా వ్రాయించాడు. అయితే ఇప్పుడు శేషు విపరీతమైన కోరిక కోరుతున్నాడు ఇప్పుడెలా?’

అయితే రాధకి పెళ్ళవాలంటే అతని కోరిక తీర్చక తప్పుదు. ఆస్తినంతా శేషుకి రాసేసి సుజాతకి అన్యాయం చేస్తున్నానేమో అన్న ఆలోచన కూడా అతడ్ని త్రీవ మనస్తాపానికి గురిచేస్తోంది. అయితే రాధ శేషును ఇష్టపడుతోంది.

తిరిగి అతనిలో అనుమానం, శేషు స్వభావం తనకు తెలుసు. నిర్మలమైన మనస్సు కలవాడు కాదు. స్వార్థానికి ప్రతిరూపం శేషు. ఆస్తినంతా తన పేరున వ్రాయించుకుని రేపొద్దున్న శేషు రాధకి, సీతకి అన్యాయం చేస్తే? అయినా తన పిచ్చికాని ఎందుకు అన్యాయం చేస్తాడు. వాళ్ళిద్దరూ శేషుకు పరాయివారా? అతనికి రక్తసంబంధీకు.లు ఎంతటి కఠినాత్ముడయినా రాధకి, సీతకి అన్యాయం చేయడు. ఇలా తర్కవితర్కలో ఆలోచిస్తున్నాడు సుందర్రామయ్య,

“బావగారూ! మీరు నా షరతుని అంగీకరించరని నాకు తెలుసు. మీ నాన్చుడు వ్యవహారమే చెప్తోంది. నా మనోభావాలు, ఆలోచనలు ఎలా ఉన్నా నా అలోచన మాత్రం నాకు ఆస్తి వ్రాసి ఇస్తేనే రాధను నేను పెళ్ళి చేసుకుంటాను.”

నిష్కరగా – నిర్మొహమాటం లేకుండా తన అభిప్రాయం చెప్పున్నందుకు సుందర్రామయ్యకి ఒక వేపు మనస్తాపం, బాధ, దుఃఖం, మరో వేపు పోనీ రాధ పెళ్ళయినా నేను బ్రతికి ఉండగా జరుగుతుందని అన్న సంతోషం కలిగాయి. పైకి ఓ మాట లోపల మరో భావం ఉంచుకునే కన్నా శేషు నిర్భయంగా తన అభిప్రాయం చెప్పడం మంచిదే అని అనిపించింది సుందర్రామయ్యకి.

ఆస్తి శేషు పేరున వ్రాస్తేనే రాధని పెళ్ళి చేసుకుంటానన్నాడు. ‘తనే ఆరోగ్యంగా ఉంటే మరోలా జరిగేది. శేషుని మించిన మంచి పెళ్ళికొడుకుని వెతికి తెచ్చి మంచి సంబంధం తెచ్చి రాధకి పెళ్ళి చేసేవాడు. అయితే తను ఇప్పుడు దుర్బలుడు, అశక్తుడు, బలహీనుడు, అసమర్థత తనని వెంటాడుతోంది. ఈ పరిస్థితిలో శేషే గతి.

‘రక్త సంబంధం ఉంది కాబట్టి తను లేకపోయినా సీతని, రాధని చక్కగా చూసుకుంటాడు. ఇదే పై సంబంధం చేస్తే సీత పరిస్థితి ఎలా ఉంటుందో? ఇటువంటి పరిస్థితిలో శేషే ఈ ఇంటి అల్లుడవడం మంచిది’ తను చేస్తున్న పనిని సమర్థించుకున్నాడు సుందర్రామయ్య

“అలాగే కానీ! అల్లుడనయినా కొడుకువైనా నీకే. ఈ పరిస్థితుల్లో ఆస్తిని నేను పట్టుకుపోను కదా! నీ కోరిక ప్రకారం కానీయ్. రాధని, మీ అక్కయ్యని చక్కగా చూసుకో. వారికి ఏ లోటూ రానీయకు,” అన్నాడు సుందర్రామయ్య, అలా అన్నాడేకాని ఓ మూల సుజాతకి అన్యాయం చేస్తున్నానన్న భావం అతని గుండెల్లో ఓ మూల అలాగే కలుక్కుమంది.

30

మనిషి జీవితమే ఓ గేమ్. అందులో (ఒకరు) ఒకసారి ముందుకు వస్తారు. వెనకబడినవారు మరో పర్యాయం. ముందున్న వాళ్ళు వెనకబడ్డారు. ముందు వెనకల్ని జీవితంలో సహజమే అని సరిపుచ్చుకోవాలి. అంతేకాని నిరాశ పడకూడదు. మనల్ని మనం మన దురదృష్టాన్ని నిందించుకోకూడదు. పరిస్థితులనుకూలంగా మన భావాల్ని, జీవనశైలిని మార్చుకోవాలి.

సుందర్రామయ్య కూడా అలాగే అనుకున్నాడు. ఓనాడు ఆ ఊరులో అతను తిరుగులేని న్యాయవాదిగా పేరు గడించాడు. డబ్బు గడించాడు. మరి ఈనాడో? తన పరిస్థితి తలక్రిందులయింది. తన అసమర్థుడయ్యాడు. శేషుని తన కూతుర్ని పెళ్ళి చేసుకోమని అడగవల్సి వచ్చింది. వెనక నుండే శేషు ముందుకు వస్తే, ముందునుండే తను వెనక్కి నెట్టివేయబడ్డాడు.

జరగవల్సిన కార్యాలు జరగకమానవు. అనుకున్నదే తడవుగా పెళ్ళికి ముహూర్తాలు పెట్టడం జరిగింది. సుజాత మీద మొదట్లో ఉన్న కోపం ఇప్పుడు లేదు. అతని మనస్తత్వంలో మార్పు వస్తోంది. పుట్టగానే తల్లిని పోగొట్టుకున్నాది, తల్లి ప్రేమను అనుభవించలేదని సుజాత మీద అతనికి జాలి. చిన్నప్పటి నుండి తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ సుజాతకి తను పంచి ఇచ్చాడని ఆమె మీద మమకారం. అదే అతడ్ని విచలితుడ్ని చేసింది.

సుజాత మీద ప్రేమ పుట్టుకొచ్చిన ఆయనకి ఓసారి కూతుర్ని చూడాలనిపించింది. పెళ్ళికి పిలుస్తే సుజాత తప్పకుండా వస్తుంది. కూతుర్ని చూసుకునే అవకాశం లభిస్తుంది అని అనుకున్న సుందరామయ్య పెళ్ళికి సుజాతను పిలుద్దాం అని తన కోరికను తన కుటుంబ సభ్యుల ముందుంచాడు. రాధ ఎటూ చెప్పక ఊరుకుంది కాని శేషు, సీతమ్మ ససేమిరా పిలవడానికి వీల్లేదు అన్నారు.

సుజాతను పెళ్ళికి పిలవకుండానే శేషు, రాధ పెళ్ళి జరిగిపోయింది. సుందరామయ్యగారు తన కోరిక నెరవేరనందుకు నిరాశ చెందారు. బాధ పడ్డారు. తన కుటుంబ సభ్యుల్లో అహంకారం ఉంది. ఇది మనిషి దృష్టిని మందగిస్తుంది. జీవితం విషపూరితంగా మారిపోతుంది. ఈ అహంకారానికి అందరూ పనిముట్లలా అగుపడ్డారు. ఈ అహంకారం ఉన్న దగ్గర స్వార్థం తప్ప మరేది ఉండదు. అన్ని తనకు కావాలి. అందరూ తనకే తల వొంచాలన్న దురహంకారం ఉంటుంది. అహంకారంతో అన్ని పనులు జరిగిపోతాయని భ్రమపడతారు. అది పొరపాటు అని తరువాత తెలుసుకుంటారు కాని వినయం వల్లనే అన్ని పనులూ జరగుతాయి.

తన కుటుంబ సభ్యుల తీరుతెన్నులు చూని సుందర్రామయ్య అనుకున్నాడు.

పెళ్ళి అయిన తరువాత ఎన్నో రోజులు అవలేదు. శేషు జీవన సరళి మారిపోయింది. పెళ్ళయిన ఆనందం ఆ కుటుంబ సభ్యుల మనస్సులో ఎంత కాలమో నిలవలేదు. విలాస జీవితానికి అలవాటు పడ్డాడు. జల్సాగా డబ్బు ఖర్చు పెట్టడం, చివరికి తాగుడు, పేకాట, దానికి తోడు డబ్బుతో శారీరిక సుఖం కొనుక్కునే వ్యభిచారిగా మారిపోయడు.

ఎత్తైన కొండ మించి అమాంతంగా పడిపోవడం అనేది ఉండదు. చిన్నరాయి మీద నిర్లక్ష్యంతో వేసిన అడుగువలన కూడా క్రిందకు కూలబడ్డాడు మనిషి జీవితంతోనూ అంతే అమాంతం అధోపాతాళానికి జారిపోవడానికి మనిషి తాలూకా వ్యసనాలు, అతని చెడు అలవాట్లు.

శేషు కూడా ఇలా నైతికంగా పతనమవడానికి అతని చేతిలో నున్న సంపదే కారణం. డప్పులాంటిది సంపద. దాన్ని లయబద్దంగా వాయిస్తేనే మధురమైన ఆనందం పుడుతుంది. అలా కాకపోతే మిక్కిలి దుఃఖం కలుగుతుంది.

శేషులో వచ్చిన ఈ మార్పు చూసి రాధ కుమిలిపోతోంది. సీతమ్మ, సుందర్రామయ్య కూడా కుమిలిపోతున్నారు. రాధలోను, సీతమ్మలోను తాము సుజాత మీద ప్రవర్తించిన తీరు మీద మొదటి సారిగా పశ్చత్తాపం కలిగింది. తమలో నున్న దోషం తెలియ వచ్చింది. ఏమి చేస్తాం. పరిస్థితులు మాకు అనుకూలంగా లేవు. ఎవరూ మాకు సహాయం చేయటం లేదు అని మన దోషాలను ఇతరులపై మోపుతాం కాని, ఇవన్నీ మేము చేచేతులారా చేసుకున్న దానికి ఫలితం అని అనుకోము. రాధ సీతమ్మ పరిస్థితి కూడా ఇదే.

ఇదే నరకం. మరి వేరే నరకం అక్కర్లేదు. తను సుజాతకి చేసిన అన్యాయానికి తగిన శిక్ష నాకిది. పదే పదిసార్లు రోజూ అనుకుంటాడు ఆ న్యాయవాది. తను బ్రతికి ఉండగానే పరిస్థితి ఇలా ఉంది. తను పోయిన తరువాత పరిస్థితి ఎలా ఉంటుందో తలుచుకోడానికే భయమేస్తోంది.

అయినా వీళ్ళకి తగిన పరిస్థితే వచ్చింది. వీళ్ళకి ఇలాంటి జీవితమే తగినది. అసూయ, కపటం ఉన్న వాళ్ళకి ఆ భగవంతుడు ఇలాగే చేస్తాడు. వీళ్ళిద్దరికీ సుజాత మీద జాలి, ప్రేమ, చివరికి మానవత్వం ఉందా? ఊహూఁ లేవు. వీళ్లు మానవత్వం లేని మనుష్యులు.

హే భగవంతుడా? నా కళ్ళెదుటే ఇన్ని అనర్థాలు జరుగుతున్నాయి. నేను సహించలేకపోతున్నాను. ఈ అనర్థాలన్ని చూడక ముందే నన్ను నీ దగ్గరికి తీసుకుపో, ఇక్కడ ఈ నరకాన్ని చూడలేకపోతున్నాను.” సుందర్రామయ్య మనస్సు ఘోషిస్తోంది.

“శేషూ! నేను ఎక్కువ రోజులు బ్రతకను. నా ఒక్క కోరిక తీర్చవూ?” ప్రాధేయపడ్తూ అన్నాడు సుందర్రామయ్య,

“ఏంటి?” నిర్లక్ష్యంగా అన్నాడు శేషు.

“నేను బ్రతికి ఉండగా సుజాతను ఒక్క పర్యాయం చూడాలి.”

ఈ ముసిలాడు తొందరగా చచ్చినా బాగుండును అని మనస్సులో అనుకున్న శేషు పైకి మాత్రం “అలాగే” అని అన్నాడు. అయితే అతనికి సుజాతను పిలవడం ఆమెతో మాట్లాడ్డం ఇష్టం లేదు. దానికి మొదటి కారణం సుజాత తనని తూలనాడి తనని పెళ్ళి చేసుకోడానికి విముఖత చూపించడం. రెండో కారణం ఆమె ఇక్కడికి వస్తే ఆస్తి విషయంలో ఏదేనా గొడవ జరుగుతుందని. అందుకే సుజాతకి అతను తెలియజేయలేదు. కబురు పంపినట్లు అబద్ధం ఆడాడు.

“నా చిట్టి తల్లికి కబురు పంపావా? వస్తానందా?” ఆత్రుతగా అడిగాడు సుందర్రామయ్య. అతడు మృత్యువుతో పోరాడుతున్నాడు.

“ఆఁ కబురు పంపాను. ఇక్కడికి రావడానికి నీ కూతురు ఎంత మాత్రం ఇష్టపడలేదు. సరికదా, నానా మాటలూ అంది. అందర్నీ చివరికి మిమ్మల్ని కూడా వదల్లేదు” శేషు అబద్ధమాడాడు.

“ఆఁ సుజాత రానందా?” ఆ తండ్రి మ్రాన్పడిపోయాడు. బాధపడ్డాడు. అయితే అతని మనస్సులో మాత్రం తన కూతురు అలా అని ఉండదు. ఈ శేషు అబద్ధం ఆడుతున్నాడు అన్న భావం దృఢంగా ఉంది.

అవును అలా సుజాత అని ఉంటే అని ఉండచ్చు. ఎందుకుంటే తను ఆమెకి అన్యాయం చేశాడు. నిర్దాక్షిణ్యంగా ఇంటి నుండి గెంటి వేసినంత పని చేశాడు. అప్పుడు తను ఏ మాత్రం ఆలోచించాడా? ఆడపిల్ల ఎక్కడికి వెళ్ళగలదు? అన్న ఆలోచన ఆ సమయంలో తను విడిచిపెట్టేడు. అలాంటి తనని కూతురు ఇప్పుడు అసహ్యించుకుంటోంది. తనని తండ్రి అని చెప్పుకోడానికి సిగ్గుపడుతోంది. తనని ద్వేషిస్తోంది.

తనకి ఇది తగిన శిక్షే. చిన్నప్పటి నుండి తను ఎంతగా కూతుర్ని ప్రేమగా చూసుకున్నాడో అదంతా తుడిచిపెట్టుకుపోయింది. తన ప్రవర్తన వల్ల తనంటే కూతురికి వెగటు కలిగింది. ఇలా ఆలోచిస్తున్న సుందర్రామయ్యకి విపరీతమైన మనస్తాపం కలిగింది. విపరీతమైన గుండె నొప్పి కూడా వచ్చింది.

“అమ్మా!” అంటూ మెలికలు తిరిగిపోతున్నాడు. మనస్సులో క్షోభ, అశాంతి, బాధ ఒక్కసారి అతనిలో భావోద్వేగాల్ని తట్టిలేపుతున్నాయి. కంగారుగా వైద్యుడ్ని పిలవడానికి బయటకు వెళ్ళాడు అతని దగ్గర పని చేసిన గుమస్తా.

రాధ సీతమ్మ అతని ప్రక్కన కూర్చుని విలపిస్తున్నారు. శేషు ఎదురుగా కూర్చున్నాడు. శవంగా మారిన తరువాత ఆ శవాన్ని పీక్కుని తినడానికి నక్కలు ఎదురు చూస్తున్నట్టుంది శేషు వాలకం.

అతను ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. బాధతో మెలికలు తిరిగిపోతున్న సుందర్రామయ్య ప్రాణాలు పంచభూతాల్లో కలిసిపోయాయి. అతను శాశ్వతంగా కళ్ళు మూసుకున్నాడు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here