కొడిగట్టిన దీపాలు-18

0
8

[box type=’note’ fontsize=’16’] విశ్రాంత హిందీ ఉపాధ్యాయులు, రచయిత గూడూరు గోపాలకృష్ణమూర్తి గారు వ్రాసిన నవల ‘కొడిగట్టిన దీపాలు‘ పాఠకులకు ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది 18వ భాగం. [/box]

35

[dropcap]సం[/dropcap]ధ్యా సమయం. ఆశ్రమంలో పూల మొక్కలకి నీళ్ళు పోస్తూ పూల సౌందర్యాన్ని తదేకంగా చూస్తూ నిలబడింది రాధ. ఆశ్రమంలోని వృద్ధులన్ని ఓ పర్యాయం పరీక్షించడానికి వచ్చాడు మోహను కృష్ణ,

రాధ అతని రాక గమనించలేదు. మొక్క మీద ఆకాశంలో మెరుస్తున్న తారకల్లా అగుపడున్న పూల సౌందర్యాన్ని అవలోకిస్తూ ఆలోచిస్తోంది.

మనిషి ఎప్పుడూ ఖాళీగా ఉండలేడు. నిశ్శబ్ద మాధుర్యాన్ని చవిచూడలేడు. ఏమి చేయకుండా కూచుని మనసులో కదిలే ఆలోచనల్ని మనకు సంబంధించినవి కావని అనుకోము. ఆలోచనలకి ఉద్వేగాలకి మనిషి బానిస. ఆ ఆలోచనలోనే తన చుట్టూరా ఉన్న పరిసరాలను కూడా మరిచిపోతాడు మనిషి. రాధ కూడా ఆలోచనతోనే కడుపు నింపుకుంటోంది.

ఆమె ఏకాగ్రతను భంగం కలిగించకుండా ఆమెనే చూస్తూ నిలబడి ఉన్నాడు మోహను కృష్ణ. అతను కూడా ఆలోచన్ల స్రవంతిలో ఈదులాడుతున్నాడు.

సుజాత గారు తన పెళ్ళి ప్రస్తావన తెచ్చే వరకూ తనకి ఆ తలంపే లేదు. ఆమె పెళ్ళి ప్రస్తావన తెచ్చినప్పుడు మానుతున్న గాయాన్ని కెలుకుతున్నట్లు అనిపించి తను చాలా బాధపడాడు. తన భార్య జ్ఞాపకాలు తనని మనస్తాపానికి గురి చేశాయి. తను ఆమెను ఎంతో ప్రేమించాడు. ఆరాధించాడు ఆమెతోనే తన లోకం అని అనుకునేవాడు.

అలాంటి తన జీవన సహచరిణి చావు తనని బాగా కృంగదీనింది. భార్య చనిపోయిన తరువాత తను పిచ్చివాడయ్యాడు. చాలా రోజుల వరకూ తేరుకోలేకపోయాడు. పరిసరాలు, వాతావరణం మారితే మానసిక స్థితిలో మార్పు వస్తుందని తన శ్రేయోభిలాషులు చెప్పగా ఇలా ఊరు దాటి ఈ ప్రాంతానికి వచ్చి విధులు నిర్వహిస్తున్నాడు.

రాధ వేపు చూశాడు. ఆమె ఇంకా ఆలోచనలోనే తేలియాడుతోంది. పాపం రాధ జీవితం ఎలా తయారయింది. వ్యసనపరుడు భర్త వలన ఎంత నరకం అనుభవించింది. తనది ఓ విధమైన బాధ అయితే రాధది మరో విధమైన బాధ.

మోహను కృష్ణ ఆలోచన్లు అలా సాగిపోతుంటే రాధ ఆలోచన్లు మరోలా ఉన్నాయి. తన జీవితం అప్పుడెలా ఉండేది ఇప్పుడెలా ఉంది? తను సుజాతను ద్వేషించింది. ఈర్వ పడింది. అసహ్యించుకుంది. శేషు సుజాత మీద మోజు పడ్డం చూసి అసూయపడింది.

తను అప్పుడు ఎవరినయితే ద్వేషిచిందో ఆ సుజాతే తన కష్ట కాలంలో తనకి అండగా నిలిచింది. అంతేకాదు ఒక అడుగు ముందుకేసి మ్రోడు బారిపోతున్న తన జీవితాన్ని చిగురింప చేయడానికి ప్రయత్నిస్తోంది. తిరిగి తనకి రెండో పెళ్ళి చేయాలని చూస్తోంది.

బాపూజీ అన్నారట. ఎవరైనా మీకు అపకారం చేస్తే అలా అపకారం చేసిన వాళ్ళకి ఉపకారం చేయి. ఎవరైనా ఒక చెంప మీద దెబ్బకొత్తే, రెండో చెంప చూపు అని అన్నారుట. అలాగే సుజాత కూడా బాపూజీ సిద్ధాంతాన్నే పాటిస్తోంది. తనకి అపకారం తలపెట్టిన వారికి ఉపకారం చేస్తోంది. తనని ద్వేషించిన వాళ్ళకి ప్రేమను పంచి ఇస్తోంది.

తదేకంగా పూల వంక – పూల మొక్కల వేపు చూస్తున్న రాధ తల ప్రక్కకి త్రిప్పి ఒక్కసారి అవాక్కయింది. కంగారు పడింది. ఎదురుగా మోహను కృష్ణ,

 “రాధ గారూ!” పిలిచాడు మోహను కృష్ణ, తల పైకెత్తి అతని వేపు చూసింది రాధ. “సుజాత గారు మీతో మాట్లాడేరు అనుకుంటాను.”

“దేని గురించి?”

“మీ పెళ్ళి గురించి.”

రాధ తల వొంచుకుంది.

“నాతో కూడా మాట్లాడేరు.”

“విన్నాను.”

“మీకు ఈ పెళ్ళి ఇష్టమేనా రాధా! ఎందుకంటే పెళ్ళంటే ఇద్దరు మనుష్యుల జీవితాల సమస్య. అందుకే ఆచితూచి అడుగు వేయాలి. తొందర బాటు పనికిరాదు ఈ విషయంలో”

అతను చెప్తున్నది వింటోంది రాధ. అతని దగ్గర ఎక్కువ చనువు లేదు. అందుకే అతనితో చనువుగా ఉండలేక పోతోంది. బెరుకు బెరుకుగ ఉంది ఆమెకి.

“మీకు ఇబ్బందిగా ఉందా?”

“లేదు… లేదు…!

“చనువు తీసుకుని మాట్లాడుతున్నానని తప్పుగా భావించవద్దు. మీకు ఈ పెళ్ళి మనస్ఫూర్తిగా ఇష్టమయితేను ముందుకు వెళ్లాం. నా గురించి చెప్పడానికి ఏంలేదు. నా జీవితం తెరిచిన పుస్తకం. అయినా నా గురించి మీ అక్కగారు అన్ని చెప్పి ఉంటారు. అలాగే మీ గురించి కూడా నాకు సుజాత గారు చెప్పేరు. ఇద్దరూ ఒకే గూటి పక్షులం.

పెళ్ళి చేసుకోబోతున్న ఇద్దరి అభిరుచులు, ఆశయాలు, ఆలోచన్లు అన్నీ కలుస్తేనే జీవితం సుఖంగా సాఫీగా సాగిపోతుంది.”

మరేఁ మాట్లాడలేకపోతోంది రాధ. ఆమెకి బిడియం మాటి మాటికి అడ్డు వస్తోంది.

“ఈ పెళ్ళి విషయంలో ఏఁ బలవంతం లేదు. ఇద్దరికీ ఇష్టమయితేనే పెళ్ళి. ఇష్టం కష్టంగా ఉండకూడదు. రాత్రి బాగా ఆలోచించండి.” మోహను కృష్ణ రాధతో అన్నాడు. ‘అలాగే’ అన్నాది రాధ తలూపుతూ.

36

కాలచక్రం గిర్రున తిరుగుతోంది. ఆ కాలచక్రాన్ని ఆపగలిగే శక్తి ఎవ్వరికీ లేదు. కాలంతో పాటే మానవుల మనుగడలో కూడా అనేక మార్పులు – చేర్పులు. ఒక దగ్గర క్షణకాలం కూర్చుని గడిచిపోయిన కాలం గురించి నెమరు వేసుకుంటే జీవితంలో ఇన్ని మార్పులు మేమే అనుభవించామా? ఇన్ని అవస్థలు మేమే పడ్డామా? ఇన్ని కష్టాల్ని మేమే ఎదుర్కున్నామా? సుఖాల్ని చవిచూశామా? మధుర క్షణాల్లో ఆనందం అనుభవించామా అని అనిపించకమానదు.

సుజాతకి కూడా అలా ఆలోచించుకోడానికి సమయం చిక్కింది. ఆశ్రమం ప్రాంతంలో చిన్న పూలతోట. అక్కడ వివిధ రకాల పుష్పాలు తమ సౌరభాల్ని వెదజల్లుతున్నాయి. మల్లెలు నవ్వుతున్నట్లు స్వచ్ఛమైన తెల్ల రంగులో మెరిసిపోతున్నాయి. సన్నజాజులు ముచ్చల్లాడుతున్నాయి. గులాబీలు గుబాళిస్తున్నాయి. చేమంతులు చేతులు జాచి ఆహ్వానం పలుకుతున్నాయి. ఈ ప్రకృతి సౌందర్యాన్ని తనివితీరా అవలోకిస్తూ పులకరింతలో తనని తానే మరచిపోయి తన్మయత్వం చెందుతోంది సుజాత.

ఆమె మదినిండా ఆలోచన్లు. ఆమె చుట్టూ అలోచన్లు. ఆమె నిలువెల్లా ఆలోచన్లు. ఆ ఆలోచన్లు కూడా భూతకాల ఆలోచన్లు. వర్తమానకాల ఆలోచన్లు.

రాధ మోహను కృష్ణ వైవాహిక జీవితం చక్కగా సాఫీగా సాగిపోతోంది. వారి దాంపత్య జీవితానికి గుర్తుగా రత్నాల్లాంటి ఇద్దరు పిల్లలు పుట్టుకొచ్చారు. మ్రోడు బారిన రాధ జీవితం నందనవనంగా మారింది. సీతమ్మ జీవితం తన చేతుల మీదే సవ్యంగా వెళ్ళి పోయింది.

విధి చాలా విచిత్రమయినది. విధి ఆడించిన వింత నాటకంలో మనం పావులం మాత్రమే. పరంధామయ్య గారు తన ఇల్లు సుజాత పేరున వ్రాసి ఇచ్చారు. “నా పేరున వ్రాయించడమేంటి?” అని తను అడుగుతే నాకు ఎలాగూ పిల్లలు లేరు. రాజశేఖరం ఉంటే అతని పేరునే వ్రాయించే వాడిని ఇంటిని. అతను ఎక్కడ ఉన్నాడో తెలియదు. అందుకే నీ పేరున ఇల్లు రిజిష్టరు చేయించాను. రాజశేఖరం ఎప్పుడో ఒకప్పుడు తప్పకుండా వస్తాడు. ఆ నమ్మకం నాకుంది.” అని వక్కాణించి అతను అన్నారు తనతో.

“మీ మాటల చలవవల్ల రాజశేఖరం గారు తిరిగి వస్తే నా వంటి అదృష్టవంతురాలు వేరే ఉండరు,” అంది తను పరంధామయ్య గారితో. ఆ తరువాత ఎన్ని పరిణామాలు సంభవించాయి. పరంధామయ్య గారు కూడా తమ అందరికీ దూరమయ్యారు.

“ఆయన నాకు తండ్రిలాంటివారు. నా తండ్రిని నేను చిన్నప్పుడే పోగొట్టుకున్నాను. ఇతడ్నే నేను తండ్రి అనుకుంటాను. నేను పరంధామయ్య గారి చితికి నిప్పు పెడ్తాను,” అన్నాడు మోహను కృష్ణ,

ఏది ఎవరికి ప్రాప్తమో, ఎవరి సేవ ఎవరికి ప్రాప్తమో? తను కన్న తల్లిని ఎరగదు. అందుకే సీతమ్మనే తన తల్లిగా భావించి ఋణానుబంధం తీర్చుకుంది. మోహను కృష్ణ కూడా తండ్రిని చిన్నప్పుడే పోగొట్టుకున్నాడు. అతను పరంధామయ్యగార్ని తండ్రిగా భావించి కర్మకాండ జరిపించాడు.

శ్రమకి తగ్గ ఫలితం లభించినట్టు కళ్యాణి వైద్య విద్య పూర్తి చేసింది. ఇంక ప్రాక్టీసు పెడ్తుంది.

“అమ్మా! మీకు ఉత్తరం వచ్చిందమ్మా!” అంటూ నరసమ్మ ఓ కవరు తీసుకువచ్చింది. బహుశా కళ్యాణి దగ్గర నుండి వచ్చి ఉంటుంది. ఇలా అనుకున్న సుజాత కవరు అందుకుంది.

“ఆఁ, తను అనుకున్నది నిజమే. కళ్యాణే వ్రాసింది,” అనుకుంటూ కవరు చించి చదవడం ఆరంభించింది.

“పూజ్యనీయురాలైన వదినకి,”

కళ్యాణి ఆ సంబోధనకి ఉలిక్కిపడిన సుజాత – ఇదేఁటి కళ్యాణి ఈ క్రొత్త సంబోధన. ఇంతకు పూర్వం ఇలా సంబోధించలేదే? అక్కా… అక్కా…! అని పిలిచేది. అలాంటి కళ్యాణి ఇలా సంబోధిస్తోందేంటి? విస్మయం చెందిన సుజాత తేరుకుని, తిరిగి ఉత్తరం లోని పంతుల మీద దృష్టి నిలిపింది.

“నేను వదినా అని సంబోధిస్తూ ఉత్తరం వ్రాయడం నీకు ఆశ్చర్యం కలిగిస్తోంది కదూ! నీవు ఆశ్చర్యపోయి ఉంటావు. కళ్యాణికి ఏం మతిపోయిందా ఏఁటని? ఇన్నాళ్ళూ అక్కా అని సంబోధించే కళ్యాణి ఇలా సంబోధిస్తోందేంటని? ఇలా నిన్ను ఎందుకు సంబోధిస్తున్నానో చెప్తాను తొందర పడకమ్మా వదినమ్మా!

అయితే వదినా ఒక్క విషయం. క్రొవ్వొత్తి తాను కాలి కరిగిపోతూ తన చుట్టు ప్రక్కలకి వెలుగు ప్రసాదిస్తుంది. నిన్ను చూస్తుంటే నాకు క్రొవ్వొతి జ్ఞప్తికి వస్తోంది.

వదినా! నీవు ఎన్ని కష్టాలు, నిష్ఠూరాలూ భరించేవు? ఎన్ని ఆటుపోట్లని ఎదుర్కున్నావు? స్వాతంత్ర్య పోరాటంలో ఎంత ధైర్యంగా పాల్గొన్నావు? నీ రచన ద్వారా అందరి మనస్సుల్లో దేశ భక్తిని దేశ ప్రేమను నింపావు. అంతేకాదు నిన్ను ఆశ్రయించిన వారికి నువ్వు స్థాపించిన ఆశ్రమంలో ఇంత చోటునిచ్చి అందరికీ సహాయకారిగా నిలబడ్డావు.

నీవు అన్నయ్యను ప్రేమించావు. అభిమానించావు. అన్నయ్య కూడా నిన్ను ఇష్టపడ్డాడు. అయితే దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఇద్దరూ ఒకటవుదామని బాస చేసుకున్నారు. కాని ఆ బాస బాసగానే మిగిలిపోయింది. మీరు కన్న కలలు కలలుగానే మిగిలిపోయాయి. మీ ఆశా సౌధాలు కూలిపోయాయి. మీ కోరికలు పేక మేడల్లా కూలిపోయాయి అన్నయ్య జాడ తెలియకపోయే సరికి.

అన్నయ్య ఉనికి తెలియని రోజుల్లో నేను చాలా చిన్నదాన్ని. అన్నయ్య వస్తాడని నీవు నన్ను మభ్య పెట్టావు. నన్ను నమ్మించడానికి ప్రయత్నించావు. అప్పుడు నేను చాలా చిన్నపిల్లని కాబట్టి యథార్థం గ్రహించలేకపోయాను.

నిజం తెలియని నేను అవును కాబోలు అనుకున్నాను.

ఊహ తెల్సిన తరువాత యథార్థాన్ని ఊహించేను. ఇప్పుడయితే నేను చిన్నప్పటి కళ్యాణిని కాను, నన్ను మభ్యపెట్టడానికి. అందుకే నేను ఇప్పుడు ఇన్ని విషయాలు తెలుసుకోగలిగాను. ఊహించుకోగలిగాను.

వదినా! మీ ఇద్దరి ప్రేమ చాలా పవిత్రమయినది. ఈనాడు స్త్రీ పురుషుడు ప్రేమ పేరుతో పచ్చి శృంగార క్రీడల్లో ఓలలాడుతూ – లైంగికానందం అనుభవిస్తూ ఇదే నిజమైన ప్రేమని ఆ ప్రేమకి విపరీతార్థం ఇస్తున్న ఈ రోజుల్లో తుచ్ఛమైన కామానికి – క్షణికమైన శారీరక వాంఛ తీర్చుకోవాలనే కోరికకు తావివ్వకుండా పవిత్రలతో ఒకరిపై మరొకరు ప్రేమని – అనురాగాన్ని – ఆశని పెంచుకున్న మీ ప్రేమను గురించి విన్నప్పుడు నీ సమీపంలో లేకపోయినా నీకు చేతులెత్తి నమస్కారం చేయాలన్న భావం నాకు కలిగింది.

తుచ్ఛమైన క్షణికానందం కోసం ప్రేమ పేరుతో లైంగికానందం పొందుతున్న ఈ రోజుల్లో కూడా అప్పటి మీ పవిత్ర ప్రేమలాంటి ప్రేమనే హృదయంలో దాచుకున్న ఈ కళ్యాణి, రాజేష్ పవిత్ర ప్రేమ గురించి వింటావు కదా!

రాజేష్ ఎవరు? ఏఁటా కథా అని అనుకుంటున్నావు కదూ! నిజమే తప్పకుండా నీలో ఆ సందేహం కలుగుతుంది. నీ సందేహాన్ని నివృత్తి చేస్తున్నాను విను.

రాజేష్ కూడా నాతో వైద్య విద్య అభ్యసిస్తున్నాడు. అతని గురించి చెప్పాలంటే ఓ మంచి మానవత్వం ఉన్న మనిషి. ఉత్తమ గుణాలున్న ఉత్తముడు అని చెప్పక తప్పదు. అతను నాకన్నా ఒక సంవత్సరం సీనియర్.

అతనితో నాకు పరిచయం ఎలా అయిందని కదూ నీ ఆలోచన. బెరుకు బెరుకుగా కాలేజీలోకి అడుగు బెడున్న జూనియర్ మెడికల్ స్టూడెంట్ అయిన నన్ను ర్యాగింగ్ అనే పైశాచికమైన, అతి హింసతో కూడిన ఆ భూతం నుండి కాపాడడానికి ప్రయత్నించాడు. నాకు ధైర్యం చెప్తూ నాలో ఉన్న బెరుకు తనను పోగొట్టాడు.

ఆనాడు కూడా జూనియర్స్‌లో బెరుకుతనం పొగొట్టడానికి ర్యాంగింగ్ ఉండేది. అయితే అది ఆహ్లాదకరంగా ఉండేది. వినోదపరంగా ఉండేది. అయితే కొంతమంది హింసాత్మక మనస్తత్వం గల మనుష్యుల వల్ల ఆ ప్రక్రియలో హింస చోటు చేసుకోవడం ఆరంభించింది.

అసలు విషయానికి వస్తున్నాను. రాజేష్‌ మంచితనానికి నేను ముగ్ధురాలినయ్యాను. మానవత్వం – మమతానురాగాలు – సహృదయత – ఆత్మాభిమానం – ఆత్మగౌరవం సమపాళ్ళలో పంచుకుని పుట్టిన ఓ మహానీయుడేమో అని నాకనిపిస్తుంది.

దిక్కులేని నన్ను చేరదీసి నన్ను యోగ్యురాలిగా నీవెలా చేశావో అలాగే రాజేష్ కూడా అనాథలను అక్కున చేర్చుకుని వాళ్ళని యోగ్యులుగా చేసే సంస్థ ప్రేమ సమాజంలో పెరిగి వారి ఆర్థిక సహాయంతో ఉన్నత స్థాయికి ఎదిగిన గొప్ప మనిషి. ప్రేమ సమాజంలో ఉన్నవాళ్ళే అతని వాళ్ళు.

అటువంటి పవిత్రమైన మంచి వాతావరణంలో పెరగడం వల్లనేమో అతనిలో అన్ని సమస్త ఉత్తమమైన మంచి గుణాలు చోటు చేసుకున్నాయి.

తుచ్ఛమైన నీచమైన కోరికలకి తావివ్వకుండా మేమిద్దరం మా ఉన్నతకి కారకులయిన వారి అనుమతి తీసుకున్న తరువాతే ఒకటవుదామని బాస చేసుకున్నాం.

వదినా! నేను నీ గురించి రాజేష్‌కి గర్వంగా చెప్తూ ఉంటే రాజేష్ ఏంటంటాడో తెలుసా? ‘కళ్యాణీ! మీ వదిన మానవమాత్రురాలు కాదు. శాపవశాన్న మానవ జన్మ ఎత్తిన దేవతామూర్తి’ అంటాడు. ఇది నిన్ను పొగడం కాదు, అతిశయోక్తి కాదు. నిజం, అని నాకు కూడా అనిపిస్తుంది.

ఇంకా ఏమన్నాడో తెలుసా? అటువంటి ఉత్తమురాలు, పవిత్రురాలు, ఆదర్శవాది అయిన మీ వదినను ఓసారి చూడాలని నాకనిపిస్తోంది అని అన్నాడు. నిన్ను ఇలా మేము పొగుడుతూ ఉంటే ఆ పొగడ్తలు నీకు ఇష్టం ఉండవని నాకు తెలుసుకాని అయితే నీకు తెలియదు కాని నీవు ఎంత మంచి మనిషివో? త్యాగమూర్తివో తెలియజేస్తున్నానంతే. నీ గురించి అన్ని విషయాలూ నాకెలా తెలుసునని కుతుహలపడుతున్నావు కదూ! మనం కలుసుకున్నప్పుడు అన్ని విషయాలూ చెప్తాను.

మేము త్వరలోనే వస్తున్నాం. ఎప్పుడు వస్తున్నది వెంటనే వస్తున్నప్పుడు తెలియచేస్తాను. స్టేషనుకి వస్తావు కదూ! రాకపోతే అలుగుతాను. కోప్పడతాను. అడబిడ్డ అంటే మజాకావా?

మీ ముద్దుల మరదలు

కళ్యాణి”

ఉత్తరం చదవడం ముగించిన సుజాతకి ఆనందం – ఆనందంతోపాటు ఆశ్చర్యం అవధుల్లేకుండా కలిగాయి. నిన్నటి మొన్నటి వరకూ తన సంరక్షణలో పెరిగి, తను ఏ మాత్రం విసుకున్నా ఏడుపు ముఖం పెట్టి కన్నీరు పెట్టుకున్న కళ్యాణేనా ఇలా ఆరిందాలా వ్రాసింది. ఎంతయినా ఆడపిల్లలు ఇంత త్వరగా మానసికంగా శారీరికంగా ఎదిగిపోతారు. ఈ కళ్యాణికి మా ఇద్దరి గురించి ఎలా తెలుసు? ఎవరు చెప్పారు సుమా. చాలా తమాషాగా ఉంది.

కళ్యాణి రాజేష్ గురించి వ్రాసిన దాని బట్టి చూస్తే ఆ రాజేష్ చాలా ఉత్తముడని తనకనిపిస్తోంది. ‘వాళ్ళిద్దరూ దంపతులయి సంసార నావను లాగుతూ జీవన యాత్ర చేద్దామని సంకల్పించుకున్నారు. కాబట్టి తొందరగా ఆ మూడు ముళ్ళూ వేయించాలి. తమిద్దరి ప్రేమలో చివరికి ఏం మిగిలింది? విషాదం తప్ప తమ ఇద్దరి జీవితాల్లా తమిద్దరి ప్రేమ లాంటిది కాకూడదు. కళ్యాణి, రాజేష్ ప్రేమ. రాజేష్‌ని తను చూడకపోయినా కళ్యాణి వ్రాసిన ఉత్తరం బట్టి అతను ఉత్తముడనిపిస్తోంది.

ఏది అయితే నేమి వాళ్ళిద్దరి వైవాహిక జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లాలి. వాళ్ళు కట్టుకున్న అందాల హరివిల్లు ఛిన్నాభిన్నం అవకూడదు. వారి ఆశలు – ఆశయాలూ సఫలీకృతమవాలి. కోరికలు నెరవేరలి. కలలు సఫలమవాలి. వాళ్ళ కోరికలు నెరవేరాలి. వాళ్ళ జీవితం ఆనందమయం అవాలి’ అనుకుంది సుజాత. ఆలోచన్ల నుండి బయట పడి బాహ్య ప్రపంచంలోకి అడుగుపెట్టిన సుజాత అద్దం ముందర కూర్చుని తలదువ్వుకుంటోంది.

చెంపలు నెరిసినట్లు తెల్ల వెంట్రుకలు అగుపించాయి. తన శిరోజాలలో తెలుపు నలుపు వెంట్రుకలు చూసిన ఆమె ’నేను ముసలిదాన్ని అయిపోతున్నాను’ అనుకుని పిచ్చిగా నవ్వుకుంది.

‘నా కళ్ళ ముందు చిన్న పిల్లగా అమాయకంగా తిరిగిన కళ్యాణి ఎంతగా పెరిగి పెద్దదయిపోయింది? పెద్ద వైద్యురాలుగా తనకి అగుపడబోతోంది. కళ్యాణే అంత పెద్దదయినప్పుడు నేను ముసలిదాన్ని అయిపోనా? ఇందులో ఆశ్చర్యపోవల్సింది ఏఁలేదు. తనకీ నలభై ఏళ్ళు నిండిపోయాయి కూడా’ అనుకుంటూ నిట్టూర్పు విడిచింది.

‘ఏఁటో? ఏదీ మన చేతుల్లో లేదు. మనం అనుకున్నవి జరగదు. ఒక్కొక్క సమయంలో మనం అనుకోని సంఘటనలు ఒక్కొక్క పర్యాయం జరుగుతూ ఉంటాయి. తన జీవితం ఇలా ఉంటుందని తమ ఎప్పుడేనా అనుకుందా?’ ఇలా సాగుతున్నాయి సుజాత ఆలోచన్లు.

బయటికి వెళ్ళిన పక్షులు తిరిగి గూళ్ళకి చేరుకున్నాయన్న సూచనగా వాటి కిలకిల ధ్వనులు వినిపిస్తున్నాయి. ఆ ధ్వనులు బట్టి సంధ్య చీకట్లు వ్యాపిస్తున్నాయి అని అనుకుంది సుజాత.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here