కొడిగట్టిన దీపాలు-24

0
8

[box type=’note’ fontsize=’16’] విశ్రాంత హిందీ ఉపాధ్యాయులు, రచయిత గూడూరు గోపాలకృష్ణమూర్తి గారు వ్రాసిన నవల ‘కొడిగట్టిన దీపాలు‘ పాఠకులకు ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది 22వ భాగం. [/box]

47

మానవుడు జన్మించింది పరమార్థం కోసం. తాను ఆనందపడి ఎదుటివానికి ఆనందం కలగచేయడానికే. ఈ ప్రపంచంలో ఒక ప్రాణి ఆనందపడితే ఆ ఆనందం తన ఆనందమని భావించాలి. అలాగే ఒక ప్రాణి దుఃఖపడితే ఆ దుఃఖం తన దుఃఖం అనుకోవాలి.

తనని ఆదరించి అక్కున చేర్చుకున్నాడు రాజయ్య తాతయ్య. అతను అలా చెయ్యకపోతే తన జీవితం మరోలా ఉండేది. ఇలా ఆలోచిస్తున్న చైతన్య కళ్ళెదుట జరిగిన సంఘటనలు కదలాడుతున్నాయి.

మన జీవితంలో మళ్ళీ మరుపురాని దశ బాల్యం. ఆ దశ ఏ ఆచ్ఛాదన లేనిది, భావ కాలుష్యం లేనిది. స్వచ్ఛమైన అనుభూతుల్తో నిండినది. సుఖదుఃఖాల్తో సంబంధం లేనిది. ఆ దశలో ఆనందం నిత్య ప్రవాహ రూపంగా ఉంటుంది. అందుకే బాల్య దశ అందరికీ ప్రియమైనది. ఆ దశలో ఆనందం నిత్య స్రవంతిగా ఉంటుంది. మనస్సు అవిజ్ఞతమైన ఆనందంలో మునిగిపోతుంది. మనిషి జీవిత పర్యంతమూ గుర్తించుకునేది స్వచ్ఛమైన అనుభూతుల్లో లీలమయ్యేది బాల్యానుభావాలే.

అయితే అందరి బాల్యాలూ అనందరకంగా సుఖమయంగా ఉండవు. పేదరికంలో మగ్గినా సుఖంలో జీవించినా అమ్మ తన పిల్లల కోసం చేసే త్యాగాల్లో జ్ఞాపకముండి మనస్సుని కదిలిస్తూనే ఉంటాయి. బాల్యాన్ని తలుచుకుంటే మన మనస్సులో నిలిచేవి అమ్మ గురించి స్మృతులే. బాల్యంలోని అన్ని కోణాలలోనూ ప్రేమతో పెనవేసుకుని ఉండేది అమ్మయే.

అమ్మ ఒడిలోంచి బడిలోకి అడుగుపెట్టిన రోజుల్లో తోటి చిన్నారులతో ఆడుకున్న ఆటలు, పాడుకున్న పాటలూ, మధుర స్మృతులు, పాఠశాల రోజులు, మనస్సులో మెదిలినప్పుడల్లా మళ్ళీ బాల్యంలోకి వెళ్ళిపోతే ఎంతో బాగుండును అని అనిపిస్తుంది.

“ప్చ్…! తనకి అలాంటి బాల్యం దక్కలేదు. అమ్మ ఒడికి కూడా వంచింపబడ్డాడు. దుఃఖం వచ్చినప్పుడు – కలత చెందినప్పుడు అమ్మ చల్లని ఒడిలో సేద తీర్చుకునే అవకాశం బాల్యంలోనే తనకి లభించలేదు.

తనకి అయిదు సంవత్సరాలు వచ్చి బడికి వెళ్ళివల్సిన వయస్సులో తల్లికి దూరమయ్యాడు. తండ్రి మరో ఏడాది పోయిన తరువాత మళ్ళీ పెళ్ళి చేసుకున్నాడు. సవతి తల్లి తమ్ముడు పుట్టే వరకూ బాగానే చూసుకునేది. ఆ తరువాతే తనకి కష్టాలు ఆరంభమయ్యాయి. ఆమె ప్రవర్తనలో మార్పు తను గ్రహించాడు.

తను స్కూలుకి వెళ్ళి చదువుకోడానికి అవకాశం ఇచ్చేది. కాదు. ఎంత సేపూ తమ్ముడ్ని ఎత్తుకోమనేది. సరియైన తిండి కూడా పెట్టేదికాదు. చీటికీ మాటికీ తన మీద తండ్రికి ఫిర్యాదులు చెప్పేది, కొట్టించేది లేకపోతే తను కొట్టేది.

ఇలా నరకయాతనల్తో మరో అయిదు సంవత్సరాలు గడిచిపోయింది. అప్పుడు తన మనస్సు పది సంవత్సరాలు. ఓ రోజు సవతి తల్లి తనని కొట్టబోయింది. కొట్టనీయకుండా తను ఆమె చేతిని పట్టుకున్నాడు. ఇది ఆమెకి ఊహించని పరిణామం. మొదట విస్మితురాలయింది. ఆ తరువాత తెప్పరిల్లి ఉగ్రురాలు అయింది. నానా తిట్లూ తిడ్తూ రభస చేయడం అరంభించింది. తండ్రితో చెప్తానని బెదిరించింది.

తను తనని రక్షించుకోడానికి ఆమె కొట్టకుండా చేతిని పట్టుకున్నాడు. తనకి భయం పట్టుకుంది. తండ్రితో ఆమె ఏం చెప్తుందో? తండ్రి ఏ విధంగా దండిస్తాడో ఇవన్నీ తలుచుకునే సరికి తన ధైర్యం సడలిపోయింది. తండ్రి రాకుండానే తను ఏదో పని చేయాలి. తనలో ఓ స్థిర నిర్ణయం కదలాడింది. ఫలితం తను ఇల్లు వదిలి వచ్చేసేడు.

ఇల్లు వంటి భద్రతగల స్థానం కష్టమయినా, నష్టమయినా మరోటి లేదు అన్న విషయం ఇల్లు వదిలి వచ్చిన తరువాత తనకి తెలిసింది. తను ఓ ముఠాకి చిక్కుకున్నాడు. వాళ్ళు తనలాంటి మగపిల్లల్నే కాకుండా, ఆడపిల్లల్ని కూడా కిడ్నాప్ చేసే ముఠా అని తనకి ఆ తరువాత తెలిసింది.

ఈ ముఠాల గురించి తను విన్నాడు. ఇలాంటి వాళ్ళు ఆడపిల్లల్ని అయితే వ్యభిచార గృహాలకి అమ్మేస్తారు. మగపిల్లల్ని అయితే అంగవైకల్యం చేసి వాళ్ళ చేత బిక్షమెత్తిస్తారు, లేకపోతే వెట్టు చాకిరీ చేయించుకుంటారు. లేకపోతే చిత్తు కాగితాలు ఏరడానికి పంపుతారు. మరికొందరు వారిని సంఘ విద్రోహ శక్తులుగా మారుస్తారని విన్నాడు.

తనని పట్టుకెళ్ళిన వారు తనని ఓ మందుగుండ సామాన్లు తయారు చేసే వ్యాపారస్తులకి అమ్మేసేరు. అది మరీ భయంకరమైన స్థలం. అక్కడ తనలాగే అనేక మంది బాల కార్మికులు పని చేస్తున్నారు. వీళ్ళందర్నీ ఒక గదిలో బంధించి వాళ్ళ చేత పనులు చేయించుకుంటారు. ప్రమాదాలు జరిగి ఎప్పుడు ఎవరి ప్రాణాలు గాలిలో కలిసిపోతాయో తెలియని పరిస్థితి. ఇక్కడ పని చేసే బాలకార్మికులకి ఎప్పుడు సూర్యోదయం అవుతుందో? ఎప్పుడు రాత్రి అవుతుందో తెలియని పరిస్థితి. ఇలాంటి నరక కూపంలో మ్రగ్గిపోవడమే.

అయితే అనారోగ్యంగా ఉన్నాను (అని మిషతో) వైద్యుడు దగ్గరికి తీసుకెళ్ళమని చెప్పి ఆ తరువాత బయటపడ్డ తాను చాకచక్యంగా వారి నుండి తప్పించుకుని బయటపడ్డాడు. పరిగెత్తి పరిగెత్తి అప్పుడే బయలుదేరుతున్న బస్సు ఎక్కాడు.

మధ్యదారిలో కండక్టరు టిక్కెట్టు లేదన్న మిషతో తనని దించేసేడు బస్సు నుండి. ఒక వేపు నీరసం మరో వేపు ఆకలి. కాళ్ళు ఈడ్చుకుంటూ నడుస్తున్నాడు. నడుస్తున్న తనకి కళ్ళు బైర్లు కమ్మాయి. తూలి పడిపోయాడు. కళ్ళు తెరిచి చూసేప్పటికి ఈ రాజయ్య తాతయ్య చిన్న ఇంటిలో ఉన్నాడు.

“ఇల్లు వదిలి వచ్చేసేవా?” తాతయ్య అడిగిన మొదటి ప్రశ్న. జవాబియ్యకుండా శూన్యంలోకి చూస్తున్నాడు. మాట్లాడ్డానికి కూడా శక్తిలేని పరిస్థితి. తన పరిస్థితి తెలుసుకున్నాడు. కాబోలు రాజయ్య తాతయ్య నాలుగు ఇడ్లీలు టీ తీసుకు వచ్చి ఇచ్చాడు. ఇడ్లీలు తిని, నీళ్ళు త్రాగాడు. ఆ తరువాత తనకి కొంత శక్తి వచ్చింది.

“చైతన్యా! ఏంటిరా ఆలోచన్లు, నిద్రపో మళ్ళీ ఉదయాన్నే లేవాలి,” రాజయ్య అన్నాడు. చైతన్య నిద్రకి ఉపక్రమించాడు.

48

ఉదయం ఆరు గంటల సమయం. సూర్యోదయం అవుతుంది అని సూచనగా తూర్పు దిక్కున ఎర్రదనం అగుపడుతోంది. చల్లని గాలులు వీస్తున్నాయి. ఆ ఉదయ కాల సమయంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది.

రాజయ్య తాతయ్య తను నడుపుతున్న టీ, టిఫిన్ షాపులో కూర్చున్నాడు. మొదట్లో అన్ని పనులూ తనే చేసుకునేవాడు. తొంభై సంవత్సరాలు నిండిపోయాయి. అన్ని పనులూ ఒకడూ చేయలేదు. అందుకే కొంతమంది పనివాళ్ళని కూడా సహాయంగా పెట్టుకున్నాడు.

ఉదయం నిద్ర నుండి లేచిన చైతన్య దైనందిన కార్యక్రమాలు చకచకా చేసుకుంటున్నాడు. జర్నలిస్టుగా మంచి పేరే సంపాదిస్తున్నాడే కాని, పూలు ఉన్న దగ్గర ముళ్ళు కూడా ఉంటాయి అన్నట్టు ఈ జర్నలిస్టులు ఎన్ని ఒత్తిడ్లు ఎదుక్కోవాలో? రాజకీయ వత్తిడ్లు కాకుండా దాడులు, ఇంకా అనేక వాటిని ఎదుర్కోవాలి.

స్నానం చేసి తయారయి వచ్చిన చైతన్య ముందు రాజయ్య తాతయ్య టీ, టిఫెన్ ప్లేటు ముందుంచాడు.

పలహారం అంటూనే అతని మెదడు కూడా పని చేస్తోంది. తిరిగి రాత్రి సగంలో వదిలిపెట్టిన ఆలోచన్లు అతని మెదడులో చోటు చేసుకున్నాయి.

“ఇల్లు వదిలి వచ్చేసేవా?” రాజయ్య తాతయ్య రెట్టించాడు.

“ఊఁ…”

“ఎందుకు?”

తను తను ఇల్లు వదిలి వచ్చేసినందుకు కారణం వివరించాడు. రాజయ్య తాతయ్య గాఢంగా నిట్టూర్పు విడిచాడు. “ఇంచుమించుగా మనలాంటి వాళ్ళందరి జీవితాలు ఇలాగే ఉంటాయి” అని అన్నాడు. అతని మాటలు తనకి పూర్తిగా అర్థం కాలేదు కాని రాజయ్య తాతయ్య జీవితం కూడా ఇంచుమించు తనలాంటి జీవితమేనని తను అనుకున్నాడు.

“నేను చదివిస్తాను చదువుకుంటావా?” అడిగాడు.

“అలాగే” అనబోయిన తను, “నేను నీ టిఫిన్ షాపులో పని చేస్తాను. నీకు సహాయంగా ఉంటాను,” అని అన్నాడు. తన మాటలకి రాజయ్య తాతయ్య ముఖం ఎర్రబడింది. ముఖ కదలికలు మారాయి. “నేను నీ నుండి ఆశించేది ఇలాంటి సమాధానం కాదు. చదువు మధ్యలో వదిలిపెట్టే ఎటువంటి చిక్కులు ఎదుర్కోవల్సి వస్తుందో నా అనుభవం మీద చెప్తున్నాను. నీవు తప్పకుండా చదువుకోవాలి,” స్థిరంగా అన్నాడు.

“అలాగే” అన్నాడు తను.

వెంటనే అతనిలో భావోద్వేగం, “ఏఁటి చదువుతావు?”

“నీ ఇష్టం తాతయ్య?” అన్నాడు తను.

“చైతన్యా! నీవు జర్నలిస్టువు అవాలి. సమాజంలో, దేశంలోని మూలమూలలా జరుగుతున్న అకృత్యాల్ని, అన్యాయాల్ని బయటకి తీయాలి. సమాజంలో పేరుకుపోయిన అవినీతిని, నిర్మూలించడానికి ప్రయత్నించాలి. యథార్థ విషయాలు, బాధితులు కన్నీటి గాధల్ని సమాజం ఎదుట ఉంచాలి. నీకు తెలియదు. సమాజంలో ఎన్ని అన్యాయాలు పేరుకుపోతున్నాయో, పాపం రామశాస్త్రి గారి విషయం తీసుకుంటే అతను పౌరోహిత్యం చేస్తాడు. పేరుకు అగ్రకులమేనా, రిజర్వేషను సదుపాయంలేని అగ్రకులం అతనిది. ఒక విధంగా చెప్పాలంటే అతను అదృష్ట హీనుడు. తన కొడుకుని తనలా పౌరోహిత్యం నేర్పించకుండా చదివించాడు. ఏం లాభం ప్రతిభ ఉన్నా రికమండేషన్లు లేని కుటుంబం. సిఫారసు, లంచం లేకుండా ఉద్యోగాలు రాని ఈ కాలంలో అతని కొడుకు అవతల పౌరోహిత్యం రాక, ఇవతల చదువుకున్నా ఉద్యోగం రాక రెంటికీ చెడ్డ రేవడి అయ్యాడు. తండ్రికి భారం అవకుండా ఆత్మహత్య చేసుకున్నాడు. ఇలాంటి చితికిన బ్రతుకులు సమాజంలో ఎన్నో?

సమాజంలో ధనవంతులు తమ ధన బలం మీద బ్రతికేస్తారు. పేదవాడు తన పేదతనాన్ని చాటుకునేనా బ్రతికేస్తాడు. ఈ మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి మనుష్యులు మాత్రం ఆత్మాభిమానం. ఆత్మ గౌరవం అనే తెరచాటున దాక్కుని అవతల పేద వారిలా బ్రతకలేదు, ధనవంతుల్లా జీవించలేరు. ఇవి మధ్య తరగతి మనుష్యుల సమస్య.

రోజు కూలి చేసుకుని రెక్కాడితే కాని డొక్కాడని నిర్భాగ్యులు ఈ నిమ్న తరగతి మనుష్యులు. అరచేతిలో వైకుంఠం చూపిస్తామంటూ అడుగడుగునా వారికి ఆశలు కల్పిస్తూ ఆ తరువాత మెండిచేయి చూపిస్తూ వారి జీవితంలో ఆటలాడుకుంటున్నారు కొందరు.

ఇలా ప్రతీ వర్గంలోని పరిస్థితి నంతృప్తికరంగా లేదు. అడుగడుగునా లోటే. అడుగడుగునా సమస్యలే. నీవు జర్నలిస్టువయి వాళ్ళ సమస్యల్ని సమాజం ముందు పెట్టాలి.” రాజయ్య తాతయ్య అన్నాడు.

తాతయ్య మాటలు ఆ వయస్సులో తనకి బాగా అర్థం కాలేదు కాని ఇప్పుడు ఆలోచిస్తే అతనిలో తనకి ఓ స్వాతంత్ర్య సమర యోధుడు అగుపిస్తున్నాడు. ఇప్పుడు తను ఆలోచిస్తున్నాడు. తాతయ్య జీవితంలో ఏదో జరిగింది. అతని జీవితం మూసిన పుస్తకంలా ఉంది. దాన్ని తెరిచిన పుస్తకంలా చేయాలి అని తను అనుకుంటున్నాడు.

తాతయ్య కోరిక ప్రకారం తను చదువుకున్నాడు. తాతయ్య తనని చదివించాడు. జర్నలిజం కోర్సు చేశాడు.

“ఏ పని చేస్తున్నా నీకు ఆలోచనే వాటితోనే కడుపు నింపేసుకుంటావు. ముందర పలహారం కానీ.” తాతయ్య మాటలో ఈ లోకంలోకి వచ్చిన చైతన్య పలహారం చేస్తున్నాడు.

“దేని గురించి రా నీ ఆలోచన్లు?”

“నీ గురించే,”

“నా గురించా?”

“అవును. తాతయ్యా! ఒకొక్కక్క పర్యాయం నీ ఆవేశం, నీ మాటలూ, చేతులూ చూస్తుంటే నీలో నాకు ఓ స్వాతంత్ర్య సమర యోధుడు అగుపడ్డాడు. అగుపడ్డమేంటి? నీవు తప్పకుండా స్వాతంత్ర్య సమరయోధుడవే. దయచేసి చెప్పు తాతయ్యా!”

“ఈనాడు -ఎప్పుడూ జేలుకి వెళ్ళకుండా, స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొనకుండా మేము స్వాతంత్ర్య సమరయోధులమని గొప్పలు చెప్పుకుంటూ, సన్మానాలు పొందతూ సత్కారాలు పొందుతూ అందరి చేతా జేజేలు కొట్టించుకుంటూ, సమరయోధులకి లభించవల్సిన సదుపాయాలూ, అనుభవిస్తున్న నకిలీ సమరయోధుల దగ్గర మీలాంటి అసలైన సమరయోధులు మరుగున పడిపోతున్నారు. తెరమరుగు అవుతున్నారు. మీలాంటి వాళ్ళు మట్టిలోనున్న మాణిక్యాలు. తాతయ్యా ఈ రోజు రాత్రి నీ జీవిత సంఘటనలు చెప్పవల్సిందే. లేకపోతే నా మీద ఒట్టే,” ఆవేశంగా అన్నాడు చైతన్య.

రాజయ్య ముఖం గంభీరంగా మారిపోయింది. ‘తన గురించి ఇన్నాళ్ళు ఎవ్వరికీ చెప్పలేదు. గోప్యంగా ఉంచుకున్నాడు. తన గురించి చెప్పడం అతనికిష్టం లేదు. అయితే చైతన్య ఊరుకునేలా లేడు. పైపెచ్చు ఒట్టు అని కూడా అంటున్నాడు. చెప్పక తప్పదు. ఇలా చేస్తే తన మనస్సు కొంతయినా తేలిక పడుండేమో,’ రాజయ్య ఆలోచిస్తున్నాడు.

“సరే! రాత్రి చెప్తాను కాని. మొదట నీవు నీ పని కానీయ్!” రాజయ్య అన్నాడు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here