కొడిగట్టిన దీపాలు-28

1
8

[box type=’note’ fontsize=’16’] విశ్రాంత హిందీ ఉపాధ్యాయులు, రచయిత గూడూరు గోపాలకృష్ణమూర్తి గారు వ్రాసిన నవల ‘కొడిగట్టిన దీపాలు‘ పాఠకులకు ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది 28వ, చివరి భాగం. [/box]

55

[dropcap]“రా[/dropcap]జేష్!”

“ఏఁటి కళ్యాణీ!”

“నా మనసులో ఓ ఆలోచన వచ్చింది. అది ఉచితమవచ్చు, అనుచితమవచ్చు. ఇది నా ఆలోచన మాత్రమే. పెళ్ళి చేస్తారు మొదట పెళ్ళి కొడుక్కి పెళ్ళి కూతురికి, ఆ పెళ్ళి అనే బంధంతో ఒకటవుతారు వాళ్ళు. సంసార బంధంలో చిక్కుకుని, ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కుని, కష్ట సుఖాల్ని చవిచూసి పరిపక్వం చెందుతారు భార్యాభర్తలు.

తిరిగి రెండోసారి షష్టిపూర్తి అనే పేరుతో అరువది సంవత్సరాలు నిండిన తరువాత పెళ్ళంత తంతు చేస్తారు. అది వాళ్ళ పిల్లలు చేస్తారు. ఇప్పుడు నాలో ఆలోచన వచ్చింది.

ఆనాడు కోవెల్లో అన్నయ్య దేఁవుడి సన్నిధిలో వదిన పాపిడిలో కుంకం పెట్టి, ‘మన పెళ్ళి అయింది. మనం భార్యాభర్తలం. దేశ స్వాతంత్ర్యం వచ్చిన తరువాత శాస్త్రోక్తంగా పెళ్ళి చేసుకుందాం’ అని అన్నాడని విన్నాను. ఇప్పుడు వాళ్ళకి శాస్త్రోక్తంగా పెళ్ళి చేస్తే” కళ్యాణి అంది.

“కళ్యాణీ! నీ ఆలోచన మనస్సులోనే ఉంచేసుకో. నీ ఆలోచన నాకు సబువుగా ఉందనిపించటం లేదు. తొమ్మిది పదులు దాటిన ఈమె వయస్సులో వాళ్ళకి పెళ్ళి చేయడమేంటి? అదీ కాక మీ వదిన కాలు విరిగి మంచంలో ఉన్నారు. మీ వదిన ఆరోగ్యం ఏమి బాగులేదు కూడా.”

“నా మాటలు కొట్టిపారేస్తున్నారు మీరు రాజేష్. వాళ్ళిద్దరూ శారీరకంగా ఒకటి కానప్పటికీ, మానసికంగా ఎప్పుడో భార్యాభర్తలయ్యారు కదా! దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఒకటవుదామనుకున్నారు కదా! వాళ్ళకి పరిచయం అయినప్పటి నుండి ఒకటిగానే మోలిగారు కదా.

స్వాతంత్ర్య పోరాటంలో అడుగులో అడుగు కలిపి ముందుకు కదిలారు. ఖద్దరు ప్రచారం, హిందీ ప్రచారంలో పాల్గొన్నారు. సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొన్నారు. విదేశీ వస్తు బహిష్కరణలో పాల్గొన్నారు. అన్ని ఉద్యమాల్లో కలిసి నడిచారు కదా!”

“నిజమే! అది వాళ్ళు వయస్సులో ఉన్నప్పుడు. ఇప్పుడు వాళ్ళ వయస్సు గురించి ఆలోచించు. వాళ్ళ ఆరోగ్య స్థితి గురించి ఆలోచించు. ఇప్పుడు వాళ్ళ మానసిక స్థితి గురించి ఆలోచించు.”

“నిజమే! అయితే వారి ఇద్దరి మధ్య ఉన్న సంబంధం పవిత్రమయినది. వాళ్ళిద్దరి మధ్యనున్న ప్రేమ పవిత్రమయినది. వాళ్ళిద్దరూ తమ జీవితాల్లో తమ ఇద్దరికీ తప్ప ఇంకొకరికి తావీయలేదు. ఇంత పవిత్రమైన ప్రేమలో ఒకరి కోసం, మరొకరు నిరీక్షణలోనే జీవితం గడిపేసేరు. ఈ రోజు వాళ్ళిద్దరు మధ్యా ఏ బంధం లేదంటే అది నటన మాత్రమే. ఒకర్ని మరొకరు మోసగించడమే.”

కళ్యాణి భావాలు అర్థం చేసుకున్నాడు. రాజేష్ అమె మనోభావాలు అర్థం చేసుకున్నాడు. అయితే ఆమె ఆలోచనలో ఏదో పొరపాటు ఉందనుకున్నాడు. జీవిత మలి సంధ్యలో ఉన్న వాళ్ళకి పెళ్ళేంటి? హాస్యాస్పదంగా ఉంటుంది కాని, హుందాగా ఉండదు. ఇదే రాజేష్ భావం.

అయితే కళ్యాణి కూడా బాగా ఆలోచించింది. రాజేష్ మాటల్లో కూడా యథార్థం ఉందనిపించింది. అందుకే తన మనస్సులో కలిగిన ఆ కోరికను కోరికగానే ఉంచేసుకుంది.

***

సుజాతమ్మ ఆరోగ్య పరిస్థితి అంత సంతృప్తికరంగా లేదు. మగతగా అలా మంచంపై పడి ఉంది. ఆమె మాట్లాడలేకపోతోంది. క్రమంగా మనుష్యుల్ని కూడా పోల్చుకోలేని స్థితిలో ఉంది. కళ్ళు తెరిచి నా అందర్నీ చూస్తున్నా పోల్చుకోలేని పరిస్థితి.

రెండు మూడు రోజులకే ఆమెలో ఎంత మార్పు? ఆమె స్థితి ఇంత విషమంగా ఇంత త్వరగా మారుతుందని ఎవ్వరూ ఊహించలేదు. ఆమె సన్నగా కొట్టుకుంటున్న గుండె చప్పుడు బట్టి ఆమె బ్రతికే ఉంది అని నిర్ధారించవచ్చు. సుజాతమ్మ పరిస్థితిని చైతన్యకి తెలియజేసాడు రాజశేఖరం. అతను కూడా వచ్చాడు.

సుజాతమ్మ మంచం చెంతనే కూర్చుని కన్నీళ్ళతో నిండిన కళ్ళతో ఆమెను చూస్తున్నాడు రాజశేఖరం. ఆమె తన జీవితం చివర దశలో ఇలా ముడిపడి ఉండడం రాజశేఖరానికి యథార్థంలా అనిపించటం లేదు. కలలా అనిపిస్తోంది. ఇన్నాళ్ళూ తను ఒంటరి, తనకెవ్వరూ లేరు, ఉండి కూడా లేనివాడినయ్యాడు అని కుమిలిపోయాడు.

అయితే ఈనాడు తనకి అందరూ ఉన్నారు. తను ఆరాధించిన తనకిష్టమైన మనిషి సుజాత ఉంది. తన చెల్లెలు కళ్యాణి ఉంది. తన మంచిని, శ్రేయస్సును కోరే వారు ఉన్నారు. ముఖ్యంగా తనని కంటికి రెప్పలా చూసుకుంటున్న చైతన్య ఉన్నాడు.

చూస్తుండగానే సుజాతమ్మ ఆరోగ్య స్థితి క్షీణిస్తోంది.

క్రమంగా ఆమె గుండె కొట్టుకోవడం ఆగిపోయింది. శరీరం చల్లగా తగిలింది.

“ప్చ్…!” అంటూ పెదవి విరిచాడు మోహను కృష్ణ. కళ్యాణి చూసింది. రాజేష్ చూశాడు. అందరిదీ ఒకటే సమాధానం.

‘పంచ భూతాల నుండి పంచతత్వాలు సేకరించి తయారయిన మానవ శరీరం, మరణంతో ఆ వంచతత్వాలు తిరిగి పంచ భూతాల్లో కలిపిపోయాయి. పుట్టుక, చావు మధ్యనున్న కాలమే జీవితం. ఈ మూన్నాళ్ళ నీటి బుడగలాంటి క్షణభంగురమైన జీవితంలో నేను, నా వాళ్ళు అని వ్యామోహం పెంచుకుంటాం.

ఈ బంధాలు శాశ్వతమైనవి కావు. ఇవి అశాశ్వతమైనవి అని తెలిసి ఉండి కూడా తెలియనట్టు ప్రవర్తిస్తాం. పుట్టినప్పుడు ఒంటరిగానే పుట్టాము. మృత్యు సమయంలో కూడా ఒంటరిగానే పోతున్నాం అన్న విషయం మరిచిపోయి బంధాల వ్యామోహంలో ఎడబాటును సహించలేక విలపిస్తాం,’ అనుకుంటున్నారు రాజశేఖరం విరక్తిగా.

‘ముళ్ళ పానుపులాంటి ఈ జీవితంలో మనకు మిగిలేది. విషాదకరమైన సంఘటనలు – చింతలూ – చికాకులూ, ఆ విషమ ఘడియలో మనకి తోడుగా నిల్చినవారు మనల్ని విడిచి వెళ్ళిపోయారు కదా అని దుఃఖిస్తాం,’ తిరిగి అనుకున్నాడు.

ఎవరు చూసినా, ఎవరు ప్రయత్నించినా పోయిన ఆ జీవుడు తిరిగి రాని స్థలానికి ఎగిరిపోయింది. అందరూ గొల్లుమన్నారు.

వేదాంత ధోరణిలో తను కొన్ని క్షణాల క్రితమే ఆలోచించాడు కాని, అతనూ భావోద్వేగాలకి లోనయిన మనిషి. అందుకే రాజశేఖరం కూడా సుజాతమ్మ మరణానికి వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. చిన్న పిల్లవాడిలా. ఆశ్రమవాసులు సరే సరి. ఓ కన్న తల్లిని పోగొట్టుకున్నట్టు ఏడుస్తున్నారు.

“ఇలా ఏడుస్తూ కూర్చుంటే ముందు జరగవల్సిన తంతు ఎలా జరుగుతుంది. మీరు పెద్దవాళ్ళు నా కన్నా వయస్సులో. మీకు నేను చెప్పేటంతటి వాడిని కాదు. మీకు సర్వం తెల్సు. మిగతా కార్యక్రమం చూడాలి,” చైతన్య అందరితోనూ అన్నాడు. అందరికీ అతను చెప్పింది నిజమే అని అనిపించింది.

దుఃఖాన్ని దిగమ్రింగుకుని రాధ కళ్యాణి సుజాతమ్మ నిర్జీవ శరీరానికి స్నానం చేయించారు. సుమంగళిగా ఆమెను అలంకరించారు. మంత్రార్చన కార్యక్రమం ముగిసిన తరువాత ఆశ్రమవాసులు, కన్నీటితో అశ్రుతర్పణం చేసారు. బాధతప్త హృదయాల్లో అంతిమ వీడ్కోలు పలుకుతున్నారు.

ఆమె ఋణాన్ని తీర్చుకోడానికి కొంతమంది ముందుకు వచ్చి కట్టెను భుజానికి ఎత్తుకున్నారు. భౌతికంగా తనకి దూరమయిపోతున్న సుజాతమ్మ నిర్జీవ శరీరాన్ని కడసారిగా చూస్తున్న అందరూ విలపిస్తున్నారు.

దుఃఖంతో చేతులు వొణుకుతుండగా – అడుగులు తడబడ్తూ ఉండగా అగ్ని కుండ పట్టుకుని రాజశేఖరం ముందుకు నడుస్తూ ఉంటే అతని చేతిని పట్టుకుని చైతన్య ముందుకు నడిపిస్తున్నాడు. ఆ వెనక పరిచయస్థులు, ఆశ్రమవాసులూ, బంధువులు నడుస్తున్నారు. ఆమె మంచితనమే అందర్నీ అలా శ్మశానం వరకూ రప్పించింది. ఆమె మంచితనమే అంత. ఉన్నన్నాళ్ళూ అందరి చేత మంచనిపించుకుని మంచిగా బ్రతికిందామె.

చితిపై ఉంచిన సుజాతమ్మ నిర్జీవ శరీరానికి దహన సంస్కారం చేయడానికి నిప్పంటించాడు రాజశేఖరం. తన విప్లవ పూరితమైన రచనలో అందర్నీ చైతన్యుల్ని చేసిన ఆ కోమలమైన హస్తాలు ఆ అగ్ని జ్వాలలకి మాడి మసి అవుతున్నాయి. కాలిపోతున్నాయి. పిడికెడు బూడిద కాబోతున్నాయి.

పతితులకి – బాట తప్పిన బ్రతుకులు గల వాళ్ళని, అనాథల్ని, వికలాంగులకి, వీళ్ళూ వాళ్ళూ లేరు, అందరికీ ఆశ్రయం ఇచ్చి వారికి తన అమృత హస్తాల్లో వారి బాధను చిటికెలో తీర్చిన ఆమె అగ్నికి ఆహుతి అయిపోయి పిడికెడు బూడిదగా మారిపోతోంది. కన్నీళ్ళు తుడుచుకుని నిర్వికారంగా అగ్ని జ్వాలల వేపు చూస్తున్న రాజశేఖరం ఎదురుగా ఉన్న చెట్టుకి చేరగిలబడ్డాడు. అతని జారగిలబడ్డ మర్రి చెట్టు ఊడలు బ్రహ్మ రాక్షసిని గుర్తుకు తెస్తున్నాయి.

తనలో ఉన్న శక్తినంతా ఎవరో ఎత్తుకు పోతున్నట్లనిపించింది రాజశేఖరానికి. అతనికి మిక్కిలి నీరసంగా ఉంది. కళ్ళు బైర్లు క్రమ్ముతున్నాయి. కాలుతున్న చితి వేపు చూస్తున్న అతను భావోద్వేగంతో ఊగిపోతున్నాడు. అతనిలో అనేక ఆలోచన్లు. అలా ఆలోచిస్తూనే చెట్టుకి చేరగిల్లి కళ్ళు మూసుకున్నాడు.

రాజేష్, మోహను కృష్ణ, చైతన్య అతడ్ని సమీపించారు. “తాతయ్యా!” అంటూ చైతన్య రాజశేఖరం భుజం మీద చేయి వేసాడు. అతని శరీరం చల్లగా తగిలింది. అతని నిర్జీవ శరీరం ప్రక్కకి వొరిగిపోయింది.

“తాతయ్యా… తాతయ్యా!” కంగారుగా తిరిగి పిలుస్తున్నాడు చైతన్య.  రాజేష్, మోహను కృష్ణ వచ్చి చూశారు. రాజశేఖరం కూడా సుజాతమ్మ దగ్గరకే వెళ్ళాడు అని నిర్ధారించేరు. ఈ విషయం తెలుసుకున్న చైతన్య కంట్లో కన్నీరు. హృదయంలో బాధ.

‘తనని తాతయ్య ఎంతగా ఆదుకున్నాడు. అతను లేకపోతే తన జీవితం చుక్కాని లేని నావలా ఉండేది. వీళ్ళిద్దరిదీ ఎంత పవిత్రమైన ప్రేమ. ప్రేమ బంధంతో ఈ వసుధపై ఒకటయ్యారు. ఆ మృత్యు బంధంలో కూడా ఒకర్ని మరొకరు విడవకుండా ఒకటయ్యారు,’ అనుకుని గాఢంగా నిట్టూర్పు విడిచాడు.

“తాతయ్య నన్ను పోషించి, నన్ను యోగ్యుడిగా చేశాడు. అతను నాకు తండ్రిలాంటివాడు. అతనికి నేను తలకొరివి పెడ్తాను.” అన్నాడు చైతన్య.

“అలాగే కానివ్!” అన్నారు రాజేష్, మోహను కృష్ణ.

అగ్ని జ్వాలలకి ఆహుతి అయిపోతున్న రాజశేఖరం శరీరాన్ని నిట్టూర్పుల మధ్య అలాగే చూస్తూ ఉండిపోయారు అక్కడున్నవారు. ఇద్దరికి ఇద్దరి జీవితాలూ కొడిగట్టిన దీపాలు అని అనుకున్నారు.

(సమాప్తం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here