కొడిగట్టిన దీపాలు-6

0
5

[box type=’note’ fontsize=’16’] విశ్రాంత హిందీ ఉపాధ్యాయులు, రచయిత గూడూరు గోపాలకృష్ణమూర్తి గారు వ్రాసిన నవల ‘కొడిగట్టిన దీపాలు‘ పాఠకులకు ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది 6వ భాగం. [/box]

11

[dropcap]ఇ[/dropcap]తరులు మనకు చెడు చేసినప్పటికి, నిందించినప్పటికీ, ఆవేశం కలిగే మాటలు అన్నప్పటికీ, మనం వాటిని పట్టించుకోకుండా ఉంటే, సమాధానం ఇవ్వకుండా ఉంటే వైరం ఏర్పడదు. వాటికి సరియైన సమాధానం మౌనమే. జీవితంలో ఉన్నతి, పతనం వస్తూనే ఉంటాయి. ఏ వ్యక్తి తన మనోబలాన్ని స్థిరంగా ఉంచుకోవాలనుకుంటాడో అతడు ఇతరుల విమర్శలకు ఉద్రేకపడకూడదు.

మీనాక్షీ అలాగే అనుకునేది. కూతురు శారదకి కూడా సంయమం పాటించమని చెప్పేది. నాంచారమ్మ వాళ్ళను ఎన్ని నరకయాతనలకి గురి చేస్తున్నా పల్లెత్తు మాట మాట్లేడేది కాదు. ‘ఈ ప్రపంచంలో కొన్ని కష్టాలను ఎదుర్కొనక తప్పదు. వాటిని ధైర్యంతో సహించాలి, అవి పూర్వకర్మల ఫలాలు. వాటిని మనం అనుభవించక తప్పదు. నీవు నీ పని సక్రమంగా పూర్తిచేసి నిర్లిప్తంగా ఉండిపో, కర్మ యొక్క ఫలాన్ని కాలగమనంతో పాటు ప్రవహించనివ్వు. ఇతరుల కర్మలపై మనకు అధికారం లేదు. అందుకే ఇతరులను విమర్శించడం సరియైన పద్ధతి కాదు. ఏదీ ఆశించకుండా, భయపడకుండా ఉంటే అంతా మనకి మంచే జరుగుతుంది’ అని మీనాక్షి కర్మ సిద్ధాంతాన్ని నమ్ముకునేది.

అంతేకాదు ‘ఒక్కొక్కసారి ఇతరులు వచ్చి ఈ కష్టాల నుంచి మనల్ని ఆదుకుంటారు అని అనుకోకూడదు. ఇతరుల మీద ఆధారపడటం అంటే మనల్ని మరింత నిస్సహాయులుగా దుఃఖితులుగా చేస్తుంది. మార్గదర్శనం కొరకు ఇతరుల వైపు కాక మనలో మనమే పరిష్కరించుకోవాలి’ అని కూడా అనుకునేది ఒక్కొక్క పర్యాయం.

నాంచారమ్మ పనిమనిషిని మాన్పించింది. ఇల్లు కడిగి శుభ్రం చేసే పాచిపని, అంట్లు తోమడం, బట్టలు ఉతకడం, వంటపని, ఈ పని, ఆ పనేంటి ఇంటి పన్లు అన్నీ మీనాక్షి, శారద చేత చేయించేది. ఈ పనులకి తోడు బస్తా పేలాలు తీసుకు వచ్చి మీనాక్షి ముందు కుమ్మరించేది. ఆ పేలాల్లో దాన్యం పొల్లు ఏరి శుభ్రం చేసేప్పటికి మీనాక్షికి, శారదకి నడుం నొప్పి కూడా వచ్చేది.

ఆ ఏరిన పేలాల్ని వాళ్ళిద్దరి చేత వడియాలు పెట్టించేది. అప్పడాలు వత్తించేది. అప్పడాలు, వడియాలు తయారయిన తరువాత నాంచారమ్మ భర్త చేత బజారులో అమ్మించేది. ఆ డబ్బులో పావువంతయినా మీనాక్షికి, శారదకి వాళ్ళ ఖర్చుల నిమిత్తం ఇచ్చేది కాదు. ‘ఇంట్లో కూర్చో బెట్టి ఆడబడుచు కుటుంబాన్ని మేపుతున్నాం. ఇంకా డబ్బులు ఎందుకు ఇవ్వాలి’ అన్నదే నాంచారమ్మ ఉద్దేశం.

కళ్యాణి అయితే చిన్న పిల్ల. పరిస్థితుల్ని అర్థం చేసుకోలేని వయస్సు, కాని వేణు పరిస్థితి అలా కాదు. ఇప్పుడిప్పుడే వేణుకి జ్ఞానం వస్తోంది. పరిస్థితుల్ని మనుష్యుల ప్రవర్తనల్ని గమనిస్తున్నాడు. మేనమామ భార్య తన తల్లిని, అక్కని ఇన్ని ఇబ్బందులకి గురి చేస్తుంటే ఎందుకు వాళ్ళు ఎదిరించరు? నోరు విప్పరు? అని అనుకునేవాడు.

మొదట్లో నాంచారమ్మ వేణు చేత అన్ని పనులూ చేయించుకునేది. చివరకు ఆ చిన్న పిల్లడి చేత కాళ్ళు కూడా పట్టించుకునేది. ధర్మారావు భార్య చర్యల్ని గమనిస్తూ ఊరుకునే వాడే కాని, ఆమెను ఏ మాత్రం వారించేవాడు కాదు. మొదట్లే నాంచారమ్మ చెప్పిన పనులన్నీ చేసిన వేణులో పరిస్థితిని అర్థం చేసుకునే జ్ఞానం వస్తోంది. ‘తన కళ్ళెదుట జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించాలి’ అనే తత్వం అతనిలో కలుగుతోంది.

మొదట్లో గంగిరెద్దులా తల ఆడిస్తూ నాంచారమ్మ చెప్పిన పనులన్నీ చేసిన వేణు ఆమెను ఎదిరిస్తూ మాట్లాడం ఆరంభించాడు. ఈ కుర్రకుంక తనని దిక్కరిస్తాడా అనుకున్న నాంచారమ్మ అతడ్ని ద్వేషించడం అరంభించింది. తిట్టడం, చివరికి వేణు మీద చెయ్యి కూడా చేసుకుంది.

తన కళ్ళెదుట జరుగుతున్న అన్యాయాన్ని అలా మౌనంగా చూస్తూ ఉండిపోవడం తప్ప మీనాక్షి ఏం చేయలేకపోతోంది. ఏ విషయం గురించీ బాధపడకూడదు. మనుష్యుల మీద కాకుండా భగవంతునిపై నమ్మకం ఉంచుతే అతడే అన్ని కష్టాల నుండి మనల్ని గట్టెక్కిస్తాడు అని అనుకునేది. ఈ పరిస్థితుల్లో సహన గుణాన్ని అలవరించుకోవాలి. మన స్థితి ఏంటో? మన బాధ్యత ఏంటో గుర్తించి మెలగాలి, అంతే కాని ఇతరుల దోషాలను విమర్శించడం కాదు అని అనుకునేది.

ఓ రోజు నాంచారమ్మ వేణుకి పాచి అన్నం తినడానికి పెట్టింది. నచ్చక తినని మారాం చేశాడు వేణు. ఆమెను తిట్టాడు వేణు. ఈ చిన్న పిల్లడు తనని తిడతాడని ఉక్రోషంలో నాంచారమ్మ వేణుని కొట్టింది. బాధలో తల్లికి ఫిర్యాదు చేశాడు వేణు.

మీనాక్షిది అసహాయ స్థితి. ఎటూ మాట్లాడలేని పరిస్థితి ఆమెకి కూడా నాచాంరమ్మ మీద చాలా కోపం వచ్చింది. అయితే ఆమె తన కోపాన్ని తన పిల్లల మీద తప్ప ఎవరి మీద చూపించగలదు? ఆమె తన కోపాన్ని కొడుకు మీదే చూపించింది. వేణు శరీరంపైనే తన ప్రతాపం చూపించింది. నాంచారమ్మ కొట్టినా వేణు అంత బాధపడలేదు కాని తల్లి తనదే తప్పు అన్నట్టు తననే కొట్టేటప్పటికి సహించలేకపోయాడు. తల్లి మీద చాలా కోపం వచ్చింది. అలిగి పడుకున్నాడు.

కొడుకుని కొట్టినందుకు మీనాక్షమ్మ కూడా చాలా బాధగా ఉంది.

అయితే ఆమె ఏం చేయగలదు? తన బాధను మనస్సులో దాచుకోవడం తప్ప. ఆ రోజు రాత్రి అన్నం తినకుండా పస్తు ఉన్నాడు. తల్లి అతడ్ని సముదాయించడానికి ప్రయత్నించి వొంటి మీద చేయి వేయగా తల్లి చేతిని విసురుగా తోసివేసాడు. కొడుక్కి ఎంత కోపం వచ్చిందో గమనించిన ఆ తల్లి క్షోభ మిగిలింది. తను కూడా తిండి తినకుండా కొడుకు పక్కనే పడుకుంది.

12

శారద స్వభావమే వేరు. ఆమెని చూసిన వాళ్ళు శారద మంచి పిల్ల, నెమ్మదస్తురాలు, అంతేకాకుండా మితభాషి అని అంటారు. ఈ అమ్మాయి కేంటి, నోటిలో నాలుక లేదా అని అంటారు. నోటిలో నాలుక ఉంటేనే మనం మాట్లాడగలం. మన భావాల్ని ఎదుటివాళ్ళకి చెప్పగలం. నాలుక లేనివారు మాట్లాడలేరు. శారద అలా మాట్లాడకుండా మౌనంగా తన పని తాను చేసుకుపోవడం చూసి అందరూ అలా అనుకుంటున్నారేమో అని అనిపిస్తుంది.

అయితే ఆమె అంత నెమ్మదస్తురాలుగా ఉండిపోవడానికి కారణం తన కుటుంబ పరిస్థితులు, తన చుట్టూ ఉన్న వాతావరణం. కుటుంబ ఆర్థిక పరిస్థితులు సంతోషదాయకంగా లేనప్పుడు ఇటువంటి వాతావరణంలో పెరిగిన పిల్లలు సర్దుబాటు గుణాన్ని అలవాటు చేసుకుంటారు. జీవితంలో అడుగడుగునా రాజీపడుతూ, ఆ రాజీనే తన జీవనబాటగా మలుచుకోడానికి ప్రయత్నిస్తారు.

శారద తండ్రి మాధవరావు అంత స్థితిమంతుడు కాదు. బ్రతుకు బాటలో పయనిస్తూ తన కుటుంబ ఆర్థిక అవసరాలు తీర్చడానికి కూరగాయలు, కొద్దిపాటి స్థలంలోనే పండిస్తూ వాటిని అమ్మిన డబ్బుతో కుటుంబ పోషణ చేస్తే, శారద మధ్య తరగతి ఆడపిల్లలాగే పెరిగింది. కష్టాలు, కన్నీళ్ళు లేమిని అన్నిటినీ అనుభవించింది. అందుకే తల్లి అప్పడాలు, వడియాలు తయారు చేసి ఆర్థికంగా కుటుంబ పోషణకి ప్రయత్నిస్తూ ఉంటే తల్లికి సహాయపడేది. మరో వేపు బండెడు ఇంటి చాకిరీ చిన్న పిల్లయినా చేసుకుపోయేది.

తండ్రి చనిపోయి, మేనమామ ఇంటికి వెళ్ళినా ఆమె జీవన చర్యలో ఏ మార్పూలేదు. మరింత ఒత్తిడి, పని భారం మాత్రం పెరిగింది. అయినా నోరు మెదపలేదు. అదే సహనం అదే నెమ్మదితనం. ఆ నెమ్మదితనమే

ఆమె జీవితాన్ని ఛిన్నాభిన్నం చేసింది. మూగగా దుఃఖాన్ని మనస్సులో దాచుకుని జీవితం గడిపింది. ఆమె జీవితంలో జరిగిన సంఘటనలు మనన చేసుకుంటే బాధే తప్ప సుఖం లేదు.

నాంచారమ్మ అక్క కొడుకు సుందరానికి ఈ మధ్యనే భార్య పోయింది. అతనికి శారదంత కూతురూ, అంతకన్నా రెండు సంవత్సరాలు చిన్న వాడయిన కొడుకు ఉన్నారు. నాలుగు పదుల వయస్సులో భార్య కోల్పోయిన సుందరానికి అతనికి శారీరక సుఖాలు ఇచ్చే భార్యకంటే ఇంటి చాకిరీ చేయగలిగే ఓ ఆడది కావాలనిపించింది.

ఓ పర్యాయం తన పిన్నమ్మ నాంచారమ్మ ఇంటికి వచ్చినప్పుడు సుందరం శారద నెమ్మదితనం చూశాడు. ఆమె పని పాట్లు చూశాడు. శారద పరిస్థితి చూశాడు. ఆర్థికంగా ఎదుటివాళ్ళ మీద ఆధారపడి జీవిస్తున్న ఇలాంటి పిల్లని తనను మారు వివాహం చేసుకుంటే తన జీవితం సాఫీగా సాగుతుంది. తన పిల్లల సంరక్షణ బాగా జరుగుతుంది అని సుందరం అలోచించాడే కాని శారద అంత వయస్సు గల కూతురు తనకుంది. శారదని పెళ్ళి చేసుకోవడం అన్యాయం అన్న ఆలోచన సుందరానికి రాలేదు. తన సుఖమే తను చూసుకున్నాడు.

“పిన్నమ్మా! శారదను నేను పెళ్ళి చేసుకుందామనుకుంటున్నాను. ఆ అమ్మాయి ఒప్పుకుంటుందా?” తన మనస్సులో మాట నాంచారమ్మ ముందు పెట్టాడు.

“ఆ విషయం నాకు వదిలి పెట్టేయ్ రా సుందరం. అంతమాట అన్నావు, అదే చాలు. లేకపోతే దాని పెళ్ళి చేసే బాధ్యత మాదే. ఎలా పెళ్ళి చేస్తాము అని మా బాబాయ్ నేనూ రోజూ మథనపడ్డమే. నీవు అలా శారదను పెళ్ళి చేసుకుంటానని అడగడం నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా? గుండెల మీదున్న భారం దింపినట్టుంది. నేను తప్పకుండా వాళ్ళను ఒప్పిస్తాను” సుందరానికి భరోసా ఇచ్చింది నాంచారమ్మ.

శారద నాంచారమ్మ సుందరంతో తన పెళ్ళి ప్రస్తావన తెచ్చినప్పుడు వ్యతిరేకించలేదు, సంతోషించలేదు. ఆ స్థితిలోనూ ఆమె మౌనమే వహించింది. అయితే మీనాక్షి మాత్రం కూతురుకి జరుగుతున్న అన్యాయాన్ని సహించలేకపోయింది.

“శారదంత కూతురున్న అంత వయస్సున్న రెండో పెళ్ళివాడికిచ్చి నా కూతురికి పెళ్ళి చేయడం నాకిష్టం లేదు. అంతేకాదు. నా పెద్ద కొడుకుతోను, విశాలగుప్తతోనూ మాట్లాడి వాళ్ళ నిర్ణయం తీసుకోవాలి” మీనాక్షి అంది.

నాంచారమ్మ గఁయ్ మంది. “మీ పెద్ద కొడుకుతో మాట్లాడుతామన్నారు. బాగానే ఉంది. అయితే ఆ విశాలగుప్తాతో మాట్లేమిటి? అతనేఁ మన చుట్టమా? మన కులంవాడా?” చేతులు గాలిలోకి త్రిప్పుతూ అంది నాంచారమ్మ.

‘బంధుత్వం కంటే స్నేహబంధం ఉంది. విశాలగుప్తాకి. మాకు, మా కష్టాల్లో, కన్నీళ్ళలో, బాధల్లో పాలు పంచుకుంటున్నాడు’ అని అరిచి చెప్పాలనుకుంది మీనాక్షి అయితే ఇలాంటి మనుష్యుల దగ్గర నోరు విప్పడం దండగ అనుకుని మౌనం వహించింది.

“నీ కొడుకు మీద భరోసా ఉందేమో. అయితే నీ కొడుకు సంగతి నీకు తెలీదు. తెలుస్తే అలా మాట్లాడవు. నీ కొడుకు సంగతి చెప్తున్నాను. విను, నీ కొడుకు నిన్నూ, నీ కుటుంబాన్ని ఉద్ధరిస్తాడని ఎదురు చూస్తున్నావేమో. వాడు చదువు మానేసి జెండా పట్టుకుని స్వాతంత్ర్య పోరాటం అని తిరుగుతున్నాడు” ధర్మారావు అన్నాడు.

ఏదో వినరాని మాట విన్నట్టు ఉలిక్కిపడింది మీనాక్షి. ధర్మారావు అదే విషయం రెట్టించి చెప్పేటప్పటికి మ్రాన్పడిపోయింది. ఆమె హృదయంలో బాధ. ఏనాటికైనా కొడుకు వస్తాడు, తమని ఉద్ధరిస్తాడు, తమని బానిసత్వం నుండి విముక్తి చేస్తాడు అని ఆ తల్లి అనుకుంటున్న ఆశలన్నీ అడియాసలయ్యే సరికి మీనాక్షి తట్టుకోలేకపోతోంది.

అయితే ఆమెలో నిర్ణయాలు మారుతున్నాయి. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి. అనవసరంగా ఎక్కువ ఆలోచించడం వల్ల మానసిక ఒత్తిడి పెరుగుతుంది. అందరూ మన వాళ్ళగా ఉండాలని, మనం చెప్పింది చేయాలని అనుకోవడమూ అనవసరమే. ఎలా జరగవల్సింది అలా జరుగుతుంది. తన పెద్ద కొడుకు విషయం తీసుకుంటే నా మాటే వాడు వినాలని లేదు కదా.

ఇప్పుడు తన కూతురు శారద పెళ్ళి విషయం తీసుకుంటే ఈ పరిస్థితుల్లో తను శారదకి మంచి సంబంధం తీసుకు వచ్చే స్థాయిలో కూడా లేదు. తను వ్యతిరేకించినా, పెళ్ళి ఆపరు. జరగవల్సింది జరగకమానదు. జరుగుతున్నది అలా చూడ్డం తప్ప తనేం చేయలేదు.

మీనాక్షి ఇలా ఆలోచిస్తూ ఉంటే మిడిమిడి జ్ఞానంలో ఉన్న వేణు మరో విధంగా ఆలోచిస్తున్నాడు. ఆ సుందరం చాలా పెద్దవాడిలా ఉన్నాడు. అక్క వయస్సుదే అతనికి కూతురుంది. అక్కతో అతనికి పెళ్ళంటే తనకి నచ్చటం లేదు. అందుకే తల్లిని అడగడానికి వెళ్ళాడు.

“అమ్మా!”

అసలే మనస్సు నిలకడగాలేని మీనాక్షి “ఏంటిరా?” విసుగ్గా అంది.

“అదే అమ్మా! ఆ సుందరంతో అక్క పెళ్ళి జరిపించడం నాకిష్టం లేదు.”

అసలే విసుగ్గా ఉన్న మీనాక్షి కొడుకుని కసురుకుంది. “ఇవన్నీ పెద్దవాళ్ళు చూసుకోవల్సిన విషయాలు, నీకెందుకు?”

“నాకు నచ్చటం లేదని చెప్తున్నానా?”

“నీకు నచ్చటంతో సంబంధం ఏంటి? నోరు మూసుకుని ఉండు” మీనాక్షి కొడుకును గదమాయించింది.

వేణు ఊరుకోదల్చుకోలేదు. “ఈ పెళ్ళి జరిగితే నేను ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతాను” బెదిరించాడు.

ఇంత చిన్నవాడు తనని బెదిరించడం ఏంటి? అనుకున్న ఆమెలో అసహనం మరింత పెరిగింది. “పోతే పో!” అని కసురుకుంది. అలా చేయడం వల్ల వేణు తను అన్నంత పని చేస్తాడని ఆ సమయంలో ఆమె ఊహించలేకపోయింది. పెద్ద కొడుకు తీరు అలా ఉంది. కూతురు స్థితి ఇలా ఉంది. అందుకే ఆమెలో అంత అసహనం.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here