కొడిగట్టిన దీపాలు-8

0
7

[box type=’note’ fontsize=’16’] విశ్రాంత హిందీ ఉపాధ్యాయులు, రచయిత గూడూరు గోపాలకృష్ణమూర్తి గారు వ్రాసిన నవల ‘కొడిగట్టిన దీపాలు‘ పాఠకులకు ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది 8వ భాగం. [/box]

15

[dropcap]త[/dropcap]న కుటుంబ పరిస్థితులు అధ్వానంగా తయారయ్యాయని తెలిసిన తరువాత రాజశేఖరం భావోద్వేగానికి లోనయ్యాడు. మన సంస్కృతీ సంప్రదాయాలలో ఆచార వ్యవహారంలో సామాజిక మైత్రి బంధాలలో రక్త సంబంధాలలో ఈ భావోద్వేగాలు ప్రముఖపాత్ర పోషిస్తాయి. ఈ భావోద్వేగాల వల్ల ఆనందం కలగచ్చు, బాధ కలగచ్చు. అలాగే జీవితం నుండి పారిపోవడమేనా జరగచ్చు. లేదా సమాజంలో ఉంటూ పోరాడడమైనా జరుగుతుంది. ఒక విధంగా మన సంక్షేమాన్ని కాపుకాసేవి మన భావోద్వేగాలే.

రాజశేఖరానికి ఈ భావోద్వేగాలు ఫలితంగా బాధ కలుగుతోంది. దుఃఖం వస్తోంది. ఆ దుఃఖం కన్నీటి రూపంలో పైకుబకబోతోంది. మనస్సు అశాంతిగా ఉంది.

మనస్సు అశాంతిగా ఉన్న సమయంలో కష్టాల్లో ఉన్న సమయంలో మనిషికి భగవంతుడు గుర్తుకు వస్తాడు. మానవ జన్మ ఎత్తింది కేవలం భౌతిక సుఖాలను అనుభవించడం కాదు. భగవత్ చింతన కూడా అవసరమే. ఆ భగవత్ చింతనలో మనిషి మనస్సు తేలిక పడుతుంది. తాత్కాలికంగానైనా కష్టాల్ని మరిచిపోయి శాంతి పొందుతాడు.

రాజశేఖరం కూడా భగవత్ సన్నిధిలోనేనా తాను కోల్పోయిన శాంతి లభిస్తుంది అని మందిరం వేపు అడుగులు వేసాడు. విశాలమైన గుడి ఆవరణంలో ఎంతమందినయినా తనలో ఇముడ్చుకుంటాను అన్న ధీమాను వ్యక్తం చేస్తూ ఠీవీగా – దరాగా నిలబడి ఉన్న ఎత్తైన అశోక వృక్షంలా నిలబడి వుంది ఆ మందిరం.

దాని ముఖద్వారం చెంతనే కళ్యాణ మండపం, దాని ప్రక్కనే శాఖోపశాఖలుగా విస్తరించి ఉన్న వటవృక్షం.

ఆ వృక్షాన్ని ఆశ్రయించుకుని బ్రతుకుతున్న అనేక జీవరాశులు. ఆ వృక్షానంతా ఆకులు దట్టంగా అల్లుకుని పోయినట్లుండగా అక్కడక్కడ ఆ ఆకుల మాటునుండి, క్రిందకి జాలువారుతున్న సూర్యకిరణాలు. అటువంటి సమయంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది.

ఆ వృక్ష ఛాయలో కూర్చుని ఆలోచనా స్రవంతిలో మునిగి తెలున్నాడు రాజశేఖరం. అతని వదనంపై విషాద ఛాయలు దోబూచులాడుతున్నాయి. అతని మదినిండా తన కుటుంబ ఆలోచనలే. తన కుటుంబం గురించి అలోచిస్తూ ఉంటే మనస్సులో అంతులేని ఆవేదన. తన గుండెల్ని ఎవరో పిండి చేస్తున్నారా అన్న భావన. వేదనకి తోడు మరోవంక ఆకలి తోడయింది. అతడి పరిస్థితిని అతడ్ని మరింత కృంగదీస్తున్నాయి.

కళ్యాణ మండపం ప్రక్కనే నున్న పంపు దగ్గరికి నడిచిన అతను మంచినీరు కరువుదీరా త్రాగాడు. ఆకలి బాధకి ఉపశమనం కలిగింది కాని ఆవేదన అలాగే ఉంది.

గుడి మెట్లు దిగి ఇంటి దారిపట్టాడు. నాలుగడుగులు వేయగానే “రాజశేఖరం గారూ …… రాజశేఖరం గారూ!” అన్న పిలుపు వినగానే యాంత్రికంగా టక్కున ఆగిపోయాడు. ఎదురుగా సుజాత. వడలి, వాడిపోయిన అతని ముఖమండలంపై ధైన్యం, కళ్ళలో తళుక్కున మెరుస్తున్న కనిపించీ కనబడ్తున్న కన్నీటి తెర, విషాదం, పెదవులపై బలవంతాన్న తెచ్చి పెట్టుకున్న విషాద భరితమైన నవ్వు, నీరసంతో తడబద్దున్న నడకల్ని అతనిలో సుజాత గమనించింది.

“మీ కోసమే వెతుక్కుంటూ బయలుదేరాను. మీరు ఎక్కడా కనిపించకపోయేటప్పటికి చాలా కంగారు పడ్డాను” ఆమె మాటల్లో నిజాయితీ అతనికి అగుపడింది. ఆత్రుత ఆందోళన కూడా అగుపడ్డాయి. రాజశేఖరం ఆమె ముఖంలో భావాలు గమనిస్తున్నాడు. ఆమె మనస్ఫూర్తిగా మాట్లాడుతోంది. ఆ మాటల్లో నిష్కల్మషం అగుపిస్తోంది. కల్లాకపటం లేని మాటలు. ఇలా సుజాత మాటల గురించి ఆలోచిస్తున్న అతని వదనంపై కాంతిరేఖ తళుక్కుమంది. అతను ఆమెను అంత విషాదకరమైన పరిస్థితిలో కూడా ఆశ్చర్యంగా అపురూపంగా చూస్తున్నాడు.

“ఎందుకలా నీరసంగా ఉన్నారు?”

“ఏంలేదు.”

“ఏదో దాస్తున్నారు నా దగ్గర. మన సమస్య. మన కష్టం ఎదుటి వాళ్ళుకి చెప్తే ఉపశమనం కలుగుతుంది. మనస్సు తేలిక పడుతుంది. మనం సమాజంలో ఉన్నాం. ఈ సమాజంలో మనిషి ఒంటరిగా ఉండలేడు. ఒకరి సహకారం మరొకరికి అవసరం అవుతుంది.

పుట్టిన మానవులందరూ సుఖదుఃఖాలు రెండింటని అనుభవింపక తప్పదు. ఇవి రెండూ ఒకదానికి మరొకటి వ్యతిరేక పదాలు. కష్టకాలం ఎప్పటికీ ఉండదు. కష్టం, సుఖం సంచరించే మేఘాల్లాంటివి. చుట్టం చూపుగా వచ్చే బంధువుల్లాంటివి కూడా. అందరూ సుఖం కావాలని కోరుకుంటారు. కష్టాలు తమ దరిదాపులకి రాకూడదు అని అనుకుంటారు కూడా. ఇది సహజం కూడా. మరికొంత మంది కషాల్ని కోరుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. మనిషికి కష్టసుఖాలు వారి నడవడి, ప్రవర్తన బట్టి లభిస్తాయంటారు. మనిషికి తన కోరికల వల్లే దుఃఖం కలుగుతుంది. ఆ కోరికలే అన్ని దుఃఖాలకి మూలం.”

ఆమె మాటలకి విరక్తిగా నవ్వాడు. “నాకే కోరికలు లేవు సుజాత గారూ!”

“మరైతే ఎందుకు అలా ఉన్నారు? చెప్పుకుంటే మీ బాధ తగ్గుతుంది” ఆప్యాయతగా అడుగుతున్న ఆమెకి చిన్నాభిన్నమయిన కుటుంబ పరిస్థితి చెప్పకుండా ఉండలేకపోయాడు. “పదండి ఆ చెట్టు నీడలో కూర్చుని మాట్లాడుకుందాం” అంది సుజాత. చెట్టు నీడలో కూర్చున్నారు. చక్కటి – చిక్కటి నీడ నేల మీద పరుచుకుని ఉంది. ఆ నీడలో దట్టంగా మొలిచిన గడ్డిమీద చతికిల పడ్డారు రాజశేఖరం, సుజాత.

అతని వదనంపై అలుముకున్న విషాద ఛాయల నీలి నీడల్ని ఆమె గమనిస్తోంది. అతని బాధ, వ్యాకులత ఎలా పొగొట్టాలో అమెకి అవగతమవడం లేదు. అతని వ్యాకులతకి గల కారణాలు తెలుసు కోవాలనుకుంటోంది. ‘అతని ఆంతరిక విషయాలు తనకి చెప్తాడా?’ తిరిగి ఆమె సందేహం.

“మీ మనస్తాపానికి కారణం నేను తెలుసుకోవచ్చా? ఏదేనా అభ్యంతరమా?” ఆమె అడిగింది.

“లేదు.”

“అయితే చెప్పండి. ఒక్క విషయం. ఎప్పుడూ గంభీరంగా ఉండకండి. నీరియస్‌గా ఉండకండి. అలా ఉండడం ప్రకృతికి వ్యతిరేకమయింది. అందుకే నవ్వుతూ ఉండాలి. మనిషి సాధించిన మహోన్నతమైన విషయం నవ్వు, సత్యం, సంతోషం, దైవం ఇవన్నీ మనలోనే ఉన్నాయి. ఇంకా మనస్ఫూర్తిగా నవ్వటంలో ఉంది సంతోషం. దీని కోసం మనం బయట అన్వేషించటం మానేసి మన లోపలికి వెళ్ళాలి. లోపలికి ప్రయాణించాలి అక్కడ సత్యాన్ని చూసి ఆశ్చర్యపోతాం.”

సుజాత మాటలు రాజశేఖరానికి కొన్ని అర్థమవుతున్నాయి. మరి కొన్ని అర్థం అవటం లేదు. ఒక్కటి మాత్రం మనస్సులో అనుకున్నాడు తనున్న పరిస్థితిలో తనకి గంభీరంగా ఉండటం తప్ప నవ్వు ఎలా వస్తుంది? సంతోషం ఎలా కలుగుతుంది?

కొంతమంది మగవాళ్ళకి కష్టం, ఆపద, సమస్య వచ్చినప్పుడు మనిషి ఒంటరిగా ఉండాలని ఆశిస్తారు. ఆ సమస్య ఎందుకు వచ్చిందో విశ్లేషించి కారణం వెతుక్కోడానికి దానికి పరిష్కారం ఆలోచించి అది దొరకే వరకూ అతడు ఒంటరిగా తన గూట్లోనే ఉండడానికి ప్రయత్నిస్తారు. అతడి దృష్టిలో తన సమస్య ఇతరులకి చెప్ప దగ్గది కాదు. అసలు ఇతరులకు చెప్పకూడదు. తన సమస్య పరిష్కరించుకోగల శక్తి సామర్థ్యం తనకుంది. ఇంకా చెప్పాలంటే తనకి అంత పెద్ద సమస్య వచ్చిందని అవతల వారు చూడకూడదు.

రేపు దాన్ని తను ఒక్కడే తన ఆలోచనలతోనే తన తెలివితేటలూ, సామర్థ్యంతోనే సొంతంగా ఎవరి సహాయ సహకారాలు లేకుండా పరిష్కరించు కోవాలనుకుంటాడు. రాజశేఖరం మొదట అలాగే అనుకున్నాడు. అయితే సుజాత అంత ఆర్తిగా, ప్రేమగా అడుగుతుంటే కాదనకలేకపోయాడు.

తన కుటుంబ పరిస్థితి తండ్రి ఆకస్మికంగా చనిపోవడం, విశాలగుప్తకి తన ఇంటితో అనుబంధం, తండ్రి చనిపోయిన తరువాత అస్తవ్యస్తంగా మారిన తన కుటుంబ స్థితిగతులు, మామయ్య ఇంటిలో తన కుటుంబ సభ్యులు పడిన పాట్లు, వేణు ఇల్లు విడిచిపెట్టిన పరిస్థితులు, శారద వివాహం ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా రెండో పెళ్ళివాడితో జరిగిన విధానం, వేణు ఇల్లు విడిచి పెట్టి వెళ్ళిన తరువాత, శారద పెళ్ళి తరువాత తల్లి ఆరోగ్యం క్షీణించడం, విశాలగుప్త ద్వారా ఈ విషయాలన్నీ తనకి తెలిసిన వైనం సుజాతకి చెప్పుకొచ్చాడు రాజశేఖరం కళ్ళల్లో కన్నీటితెర చిప్పిలాడుతూ ఉండగా.

అతని కుటుంబ పరిస్థితులు తెలుసుకున్న సుజాత గుండెల్లో సన్నటి బాధ. ఆమె కళ్ళు కూడా చమర్చాయి. “మీ వెనుక ఇన్ని బాధ్యతలు ఉన్నాయి. నాకు తెలియదు. తెలిసి ఉంటే మిమ్మల్ని రెచ్చగొట్టి ఈ స్వాతంత్ర్య ఆందోళనలోకి దింపడానికి కారకురాలినయ్యే దాన్ని కాదు. నన్ను – క్షమించాలి” పశ్చాత్తాపం ఆమె మాటల్లో తొంగి చూసింది.

“అబ్బే…! అలాంటిదేం లేదు. నేనే మీకు ఋణపడి ఉన్నాను. నా కుటుంబం – నా శ్రేయస్సు అనుకుని స్వార్థంలోనున్న నాకు దేశం యడల నా కర్తవ్యం ఏంటో తెలియ చేసారు. నాలో మరుగుపడిన దేశభక్తిని పైకి తెచ్చారు. నేనే మీకు కృతజ్ఞత తెలియచేయాలి” అతని మాటల్లో ఆమెకి నిజాయితీ అగుపించింది.

“దేశానికి స్వాతంత్ర్యం కావాలి. మీ కుటుంబ పరిస్థితి ఓ కొలిక్కి రావాలి. ఈ రెండు విషయాల్లో మీకు నేను అండగా ఉంటాను. మీకు సహకరిస్తాను.”

“నేను చాలా అదృష్టవంతుడ్ని మీ అండదండలు, సహకారం నాకు లభించిననాడు విషాన్నేనా అమృతం అనుకుని మ్రింగేస్తాను, సుజాతగారూ!”

అతని మాటలకి ఆమె తాత్కాలికంగా విషాదాన్ని మరిచిపోయి గలగల నవ్వింది. అతను అయోమయంగా ఆమె వంక చూశాడు.

“కొంపదీసి విషాన్ని కూడా అమృతమని మ్రింగేస్తే చచ్చి ఊరుకుంటారు” తిరిగి చిన్నగా నవ్వుతూ అంది, సుజాత. ఆమె మాటల్లో అర్థం తెలుసుకున్న తేలిగ్గా శ్వాస విడిచి తాత్కాలికంగా తన విషాధాన్ని – విషాధకరమైన పరిస్థితుల్ని మరిచిపోయి అతనూ చిన్నగా నవ్వాడు.

“మీ దుఃఖం నీరసంతో వడలిపోయి ఉంది. మీరు భోజనం చేశారా?”

“లేదు.”

“ఎందుకని?”

“నిజం చెప్పమంటారా? నేను తిండి తిని రెండు రోజులయింది” ఇలా అంటున్న సమయంలో కంఠంలో దుఃఖజీర అగుపించింది.

“అయ్యో!!!” ఆమె తన బాధ వ్యక్తం చేసింది.

“పరవాలేదు. మీరు నాకు అండగా ఉంటే మీ అమృత పూరితమైన తియ్యని పలుకులు, ఓదార్పు మాటలు వింటూ ఆకల్ని మరిచిపోయి ఎన్ని రోజులయినా – యుగాలయినా గడిపేయగలను.”

“నాకు కావల్సింది – నేను ఆశిస్తున్నది మీ నుండి ఇలాంటి మాటలు కాదు. ఎందుకు తిండి తినలేదు?”

“వారాలు ఇచ్చిన వాళ్ళకి నేను స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొనటం నచ్చలేదు. అందుకే వాళ్ళు నాకు తిండి పెట్టమన్నారు” అలా అంటున్న సమయంలో అతని గొంతుకలో విషాదం. కళ్ళలో కన్నీటి తడి. ఆమె కూడా విచలితురాలయింది.

“పోనీ మీరు మా ఇంటిలో” ఆమె ఆ మాటలు పూర్తి చేయలేదు. అతను మధ్యలోనే అడ్డుతగిలాడు.

“వద్దండి.”

ఆమెకి అతని మాటల్లో స్వాభిమానం కనిపించింది. అతని ముఖం ఒక్కసారి ఆత్మాభిమానంతో ఎర్రబడింది.

“వారాలు చేసుకుని బ్రతుకుతున్న నాకు మీ ఇంట్లో ఇప్పుడు తిండి తినడానికేం అభ్యంతరం లేదు కాని, ఏంటో నాకు ఆకలిగా లేదు. ఆకలి ఏనాడో చచ్చిపోయింది. ఆకల్ని దప్పికను కూడా మరిచిపోయి పరిస్థితులకి అనుకూలంగా నా జీవన విధానాన్ని మార్చుకుంటూ బ్రతుకు వెళ్ళదీస్తున్నాను. నేను ఇలా అంటున్నానని మీరు బాధపడకండి. నన్ను బాధ పెట్టకండి. ప్లీజ్! నన్ను అర్థం చేసుకోండి.”

రాజశేఖరం ఆత్మాభిమానం మరో పర్యాయం సుజాతకి అర్థం అయింది. “మీకు బాధకలిగించే పని నేను చేయను. మీ అభీష్టానికి వ్యతిరేకంగా ఏఁ మాట్లాను. సరేనా?” సుజాత అంది అతనికి వీడ్కోలు ఇస్తున్న సమయంలో.

16

మనిషి ఆలోచనలు, ఆచరణలు ఎప్పుడూ ఒక్కలాగే ఉండిపోవు. వాటిలో మార్పు ఉంటుంది. ఆ మార్పునే పరివర్తన అని కూడా అంటాము. న్యాయవాది సుందర్రామయ్యలో కూడా ఇటువంటి మార్పు అదే పరివర్తన వచ్చింది. ఇంత వరకూ నా కుటుంబం సుఖవంతంగా ఉండాలి. దాని కోసం డబ్బు సంపాదించాలి. ఇవే అతని ఆలోచనలో ఉండేవి.

ఇప్పుడు అతని ఆలోచనా విధానంలో మార్పు. ఇప్పుడు అతను నా కుటుంబం అంటూ సంకుచితంగా ఆలోచించే కంటే నా దేశం, ఆ దేశంలో మనుష్యులు వాళ్ళ గురించే ఆలోచన అతనిలో కలిగింది. అందుకే అతనూ తన న్యాయవాద వృత్తిని వదిలిపెట్టి స్వాతంత్ర్య పోరాటానికి తన మద్దతు తెలపసాగాడు.

భర్త నిక్షేపం లాంటి ప్రాక్టీసు వదిలి పెట్టి స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొనడం సీతమ్మకి ఎంత మాత్రం ఇష్టం లేదు. ఈ స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొంటే ఈ పోరాటం తిండి పెడ్తుందా? జీవితావసరాలు తీరుస్తుందా? అవి అన్నీ తీరాలంటే డబ్బు ఉండాలి. డబ్బు ఉండాలంటే భర్త న్యాయవాదిగా తన వృత్తిని నిర్వర్తించాలి. అతను న్యాయవాది వృత్తిని వదిలి పెట్టి స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొనడానికి కారకురాలు సవతి కూతురు సుజాత. ఆమె తన కవితల ద్వారా అందర్నీ పోరాటంలో పాల్గొనేటట్టు చేస్తోంది అని సీతమ్మ ప్రగాఢ విశ్వాసం.

ఆ కారణం చేతనే సుజాత అంటే అమెకి మంటగా ఉంది. సుజాత చదువు విషయంలో భర్త తన మాట వినలేదు. ఆ తరువాత న్యాయవాది వృత్తి వదిలి పెట్టడానికి కారణం సుజాత ప్రేరణ. అందుకే భావ మనో వికారాల్లో ప్రముఖ పాత్ర పోషిస్తున్న ఈర్ష్య, ద్వేషం, కోపం ఇవన్నీ సుజాత మీద చూసిస్తోంది. సమయం దొరుకుతే చాలు ఆమెను తన మాటలో చేతలో నొప్పించడానికి ప్రయత్నించేది. అయినా సుజాత అంతగా పట్టించుకోలేదు.

సుజాతలో ఉన్న దోషాలు వేలెత్తి చూపడానికే సీతమ్మ ప్రయత్నిస్తోంది కాని తనలో ఏదైనా చెడు ఉందా? లోపం ఉందా అని చూడటం లేదు. ముందు దానిని తొలగించుకుని ఇతరులను నిందించదు. సమాజంలో కొంతమంది నైజమంతే. అగ్నికి ఆజ్యం పోసినట్లు ప్రక్కింటి పాపాయమ్మ రాజశేఖరం, సుజాత కలిసి తిరగడం, మాట్లాడుకోవడం చూసింది. ఇక ఆమెకి చేతినిండా పనే. కడుపు ఉబ్బరం తీర్చుకోడానికి రాజశేఖరం, సుజాత గురించి చిలవలు పలవలూ అల్లి సీతమ్మ చెవిలో ఊదింది. సీతమ్మకి సుజాత మీద తన అక్కసు తీర్చుకోడానికి మంచి అవకాశం కలిగింది. ఆ అక్కసుకి కారణం ఉంది. తన కూతురుకి చదువు అబ్బలేదు. సుజాత చక్కగా చదువుకుంటోంది. అంతేకాదు. చాలా తెలివైనది, యోగ్యురాలు.

తన అక్కసు తీర్చుకునే సమయం వచ్చింది సీతమ్మకి. ఎదుటి వాళ్ళమీద నిందలు వేస్తున్నప్పుడు అందులో నిజం ఎంత వరకూ ఉంది? వాస్తవం ఏంటి? తను విన్నది నిజమేనా అని ఆలోచించి ఎదుటి వాళ్ళ మీద పదునైన మాటల బాణాలు వదలాలి. అయితే సీతమ్మ అలా చేయలేదు. చెప్పుడు మాటలు విని సుజాతను నిందించాలనుకుంది.

సుజాత భోజనం చేస్తున్న సమయంలో “ఏమమ్మా తల్లీ! నీ తిరుగుళ్ళకి ఓ హద్దు ఉందా? నీ గురించి అందరూ ఏం అనుకుంటున్నారో ఆలోచించావా? ఛీ… ఛీ… నీ గురించి చెప్పిన వాళ్ళ మాటలు వింటే నా వొళ్లు సిగ్గుతో చితికిపోతోంది. ఆ రాసక్రీడలేవో చాటుమాటుగా సాగించకుండా ఇంత బరితెగించి బట్టబయలు చేస్తున్నావు. నీవు చేస్తున్న సిగ్గుమాలిన పనులకి మా పరువేఁకాను. మా గౌరవం ఏంటవుతుంది? నీలాంటి దాని వల్ల వంశానికి మచ్చే. అయినా నిన్ను అని లాభమేంటి? నిన్ను ఇలా నెత్తికెక్కించుకున్న నీ తండ్రిని అనాలి” ఈసడింపుగా – నిష్టూరంగా మాట్లాడుతున్న నీతమ్మ మాటలకి వేటగాడి బాణం దెబ్బకి విలవిల్లాడిన లేడి పిల్లలా విలవిల్లాడుతూ “అమ్మా!!!” గట్టిగా బాధగా మూలుగుతున్నట్లు అరిచింది సుజాత. ఆమెకి తిండి తినాలనిపించటం లేదు. మనస్సులో బాధ కళ్ళల్లో చిప్పిల్లాడుతున్న కన్నీరు.

తనకి కన్న తల్లి అయితే అలాంటి అభియోగం తన మీద మోపేదా? ఎంతేనా అడదనిపించుకుంది. ముఖ్యంగా ఆడదానికే ఈర్ష్య, స్వార్థం పాలెక్కువ అని తను వింది. అదే రాధని అలా అనగలదా? ఆమె తనపై మోపిన అభియోగానికి ఆమె గుండెల్ని ఎవరో పిండుతున్నారా అన్నంత బాధ.

“ఎందుకలా అరుస్తావు. నేనన్న మాటల్లో నిజం లేదా? నేనే కాదు, ఇంటి బయట అందరూ ఇదే మాటలు చెప్పుకుంటున్నారు. నీవు గట్టిగా అరిచినంత మాత్రాన్న నేనేఁ భయపడనమ్మాయ్! నిజం నిర్భయంగా చెప్తాను. నీ భాగోతం బట్టబయలయిందని కాబోలు నీ బాధ” గట్టిగా అరుస్తున్నట్లు అంది సీతమ్మ.

భార్య గట్టిగా అరుస్తున్న అరుపుల్ని సుందరామయ్య విన్నాడు. ఇంకెవరి మీద అరుస్తుంది. పాపం సుజాత మీదే అయి ఉంటాయి అని అనుకున్నాడు. సుజాత మీద అతనికి అభిమానం. ఆ అభిమానాన్ని బాహాటంగా వెల్లడి చేయలేని పరిస్థితి అతనిది. దానికి కారణం సీతమ్మ వాగ్ధాటి. తన వాదనలో ఆ కోర్టులో అందర్నీ హడలెత్తించి సింహం అని పేరు పొందిన ఆయన తన ఇంటిలో మాత్రం పిల్లే అంటూ ఉంటారు. అతడ్ని ఎరిగిన వారందరూ. ఆ ఇంటిలో నీతమ్మదే పైచేయి. ఏఁ చేయలేక పరిస్థితుల్ని గమనిస్తూ తన అసహనాన్ని మనస్సులోనే దాచుకున్న సగటు మనిషి, భార్యని ఎదురించి, సుజాత యడల నీవు అలా ప్రవర్తించడం నాకు నచ్చలేదు అని చెప్పాలనుకుంటాడు ఒక్కొక్క పర్యాయం. కాని అలా చెప్పలేకపోతున్న నిస్సహయుడు అతను.

“ఏంటర్రా ఈ గోల? ఎప్పుడూ ఇంట్లో ఏదో ఒక గోలేనా? అబ్బ… అబ్బ…  ఇంట్లో ఎప్పుడూ ఏదో గొడవే. సుఖం, శాంతీ ఉండవు” విసుక్కుంటూ అక్కడికి వచ్చాడు సుందరామయ్య.

“మీకన్నీ గొడవలుగానే ఉంటాయి. మీ విసుగంతా నా మీదే కదా! మీ ముద్దుల కూతురు వ్యవహారం రోజు రోజుకి వెర్రితలలు వేస్తోంది. మీలాంటి వాడే ఇల్లు తగలబడిపోతూ ఉంటే వీధిలో వీరంగం వేశాడుట. అలా ఉంది ఈ వ్యవహారం” చేతులు గాలిలోకి త్రిప్పుతూ భర్తతో అంటోంది సీతమ్మ

సుందరామయ్యలో అసహనం పెరిగిపోతోంది. “ఏంటో నీ సొద? ఆ అరుపులు మానేసి అసలు విషయం చెప్పకూడదా?” తనేఁ అపరాధం చేయకపోయినా అపరాధిలా కళ్ళలో ధైన్యత నింపుకుని నీతమ్మ ఎదురుగా కళ్ళల్లో కన్నీరు చిప్పిల్లాడుతున్న కూతురు సుజాత ముఖం చూస్తూ భార్యనడిగాడు అతను.

సుజాత సంగతి ఆ తండ్రికి తెలుసు. తన కూతురు ఎప్పుడూ తప్పుడు మార్గం పట్టదు. తప్పుడు నిర్ణయాలు తీసుకోదు అన్న విషయం కూడా సుందర్రామయ్యకి తెలుసు. అలాగే సీతమ్మ విషయం కూడా తెలుసు. ఆమె విచిత్రమైన మనస్తత్వం గూర్చి కూడా అతనికి బాగా తెలుసు. ఎప్పుడూ తన మాట, తన వాదన నెగ్గించుకోవాలని చూస్తుంది అన్న విషయం తెలుసు. తనదే పైచేయిగా ఉండడానికి ఇష్టపడుతుంది ఆమె. అధికారం, ఆధిపత్యం చూపించడానికే ప్రయత్నిస్తుంది. ఎవరికేనా అధికారం చూపించడం అంటే వ్యామోహమే కదా!

సుజాత మీద అజ్ఞాతంగా తన భార్యకి ద్వేషముంది. ఆ ద్వేషానికి పలు కారణాలున్నాయి. ద్వేషంతో ఉన్న వ్యక్తుల్లో సంబంధం ఉన్నా వాళ్ళ ద్వేషాన్ని మార్చే అవకాశం కూడా ఉంది. ద్వేషాన్ని తలక్రిందులు చేస్తే ప్రేమ ఉంటుంది అని కూడా సుందర్రామయ్య అప్పుడప్పుడు ఆలోచిస్తాడు.

“నా మీద విసుక్కునే బదులు మీ ముద్దుల కూతురు భాగోతం నన్నడిగే కంటే ఆమెనే అడగండి. వినండి. ఛీ… ఛీ…! నీతిలేని మనుష్యులు, నీతి లేని పనులు” చీత్కారంగా అంటూ విసవిస నడుచుకుంటూ అక్కడ నుండి కదిలిపోయింది సీతమ్మ. ఆమె వెళ్ళిన వేపు చూస్తున్న సుందర్రామయ్య తన చూపులు కూతురు వేపు త్రిప్పాడు.

సుజాత హృదయం బాధతో బరువెక్కింది. తన పై మోపబడిన అభియోగం అలాంటిది, ఇలాంటిది కాదు. తన శీలాన్ని శంకించే అభియోగం. ఆ అభియోగాన్ని ఆమె తట్టుకోలేకపోతోంది. ఆమె మనస్సు మనస్తాపానికి గురయింది. బాధను బలవంతాన్న అణచుకుంటూ భారమైన అడుగులు వేస్తూ తన గది వేపు నడిచిందామె.

గదిలోకి ఎలా వచ్చిందో ఆమెకే తెలియదు. తిండి తినకపోయినా ఆకలి వేస్తున్నా, ఆ ఆకలి బాధకంటే తన మీద మోపబడిన అభియోగం బాధే ఆమెకి ఎక్కువుగా ఉంది. బాధవల్ల దుఃఖం వస్తోంది. దుఃఖం వల్ల కన్నీరు కళ్ళ నుండి క్రిందకు జారుతోంది. తల వొంచి దిండులో తల దూర్చి వెక్కి వెక్కి ఏడుస్తోంది.

ఓ చల్లని అమృత హస్తం అమె తలను అప్యాయతగా నిమిరింది. ఏడుస్తున్న ఆమె తలపైకెత్తి చూసింది. ఎదురుగా తన వేపు వాత్సల్య పూరితంగా ప్రేమగా చూస్తున్న తండ్రి. అతడ్ని చూడగానే అంత వరకూ గుండెల్లో దాచుకున్న ఆవేదనంతా గట్టు ట్రెంచుకుని పైకి పొంగి పొర్లుకొచ్చింది. ఆవేదన వల్ల వచ్చిన కన్నీరు కనుల వెంబడి దారలా దిండును తడుపుతోంది.

ఒక్క ఉదుటున లేచి తండ్రి గుండెల మీద తల ఆన్చి వెక్కి వెక్కి ఏడుస్తోంది. “నేను తప్పు చేయలేదు… తప్పు చేయలేదు” వెక్కిళ్ళ మధ్య సుజాత నోటి వెంబడి ఆ మాటలు వెలువడ్డాయి.

“నాకు తెలుసు తల్లీ!” తండ్రి మాటలు వినగానే అంత వరకూ తను అనుభవించిన చిత్ర క్షోభను మరిచిపోయింది సుజాత. విప్పారిన నయనాలతో బాధను మరిచి తేలికపడ్డ మనస్సుతో తండ్రి వేపు ఓ మారు చూసింది.

“అవునమ్మా! నా మాటల మీద నీకు నమ్మకం లేదా? అలాంటి చరిత్రహీనమైన పనులు నా కూతురు ఎప్పటికీ చేయదని నాకు పూర్తి విశ్వాసముంది. ఒక్క మాట విను. ఇతరులు ఎవరైనా మనకి చెడు చేయడానికి ప్రయత్నించినా, నిందించినప్పటికీ మనకి బాధ కలిగించే ఆవేశ పూరితమైన మాటలు అన్నప్పటికి మనం వాటిని పట్టించుకోకుండా ఉంటే వైరం ఏర్పడదు. వాటిరి సరియైన సమాధానం మౌనమే”.

“మీరు నా మీదుంచిన ఆపాటి నమ్మకం నాకు నా మీదుంది. అది చాలు నాన్నగారూ! ఎవరు నమ్మినా నమ్మకపోయినా మీరు నమ్ముతే చాలు, నేను ఎప్పుడూ మీ పరువుకి భంగం కలిగించే పరువు తక్కువ పనులు చేయను. నలుగురూ వేలెత్తి చూపించి నవ్వుకునే ఏ చర్యకూ నేను పాల్పడను.”

“అందుకే నీవు అందరి దగ్గరా అంత సౌమ్యురాలిగా – యోగ్యురాలిగా పేరు సంపాదించగలిగావు. చదువుకున్న దానివైన నీవు ఎప్పుడూ ఉన్నతంగా ఆదర్శవంతురాలిగా నిలవాలని నా అభిలాష” సుందరామయ్య కూతురుతో అన్నాడు.

“మీ అభిలాష నెరవేరుస్తానని మీకు నేను మాట ఇస్తున్నాను.” ఆమె స్థిర కంఠంతో అంది. గుండెల్లో గూడు కట్టుకున్న బాధంతా తగ్గి ఆ తండ్రి కూతురు మనస్సులు తేలికపడ్డాయి. కొద్దిసేపటికి ఆమె ప్రశాంతమైన నిద్రలోకి జారుకుంది సుజాత.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here