కొడిగట్టిన దీపాలు-9

0
6

[box type=’note’ fontsize=’16’] విశ్రాంత హిందీ ఉపాధ్యాయులు, రచయిత గూడూరు గోపాలకృష్ణమూర్తి గారు వ్రాసిన నవల ‘కొడిగట్టిన దీపాలు‘ పాఠకులకు ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది 9వ భాగం. [/box]

17

[dropcap]ఉ[/dropcap]దయాచల రథంపై ఆసీనుడైన బాలభానుడు పుడమి వేపు పయనిస్తున్న సమయంలో ఆ బాలభానుడి నుండి వెలువడుతున్న తెల్లని కాంతి పుంజాలు ముత్యాలసరాల్లా నింగి నుండి వసుధ వేపు దూసుకు వస్తున్నాయి.

రాత్రంతా కలత నిద్రతో – వికలమైన మనస్సుతో సరియైన నిద్ర లేకుండా గడిపింది సుజాత. అపవాదుల సుడిగుండంలో చిక్కిన ఆమె మనస్సుకి స్వస్థత కరువయింది. గుండెలు ఆవేదనతో తిరిగి బరువెక్కాయి. సరిగా నిద్ర లేకపోవడం వల్ల కళ్ళు మండుతున్నాయి. ఉదయాన్నే చల్లని నీటితో స్నానం చేస్తుంటే ఆమె శరీరానికి – మనస్సుకి కొద్దిగా స్వస్థత చేకూరింది. తలారా స్నానం చేసిందామె. చల్లటి నీరు తలపై నుండి వొంటి మీద పడ్తూ ఉంటే శరీరం దూది పింజలా తేలిపోతున్నట్లు అనిపించింది.

ఇంటి నుండి బయటకు వచ్చిన సుజాతను చూసిన సుజాతను చూసిన సీతమ్మ బుగ్గలు నొక్కుకుంది. బొత్తిగా నా మాటంటే దీనికి లక్ష్యమే లేదు. తన మాటంటే ఇంత నిర్లక్ష్యమా? తన భర్తయినా కూతుర్ని మందలిస్తాడనుకుంది. తను అనుకున్నది జరగలేదు. భర్త నోరు మెదిపినట్లు లేదు. అంతేకాదు కూతుర్ని ఓదార్చి ఉండచ్చు. అందుకే సుజాతకి అంత మిడిసిపాటు.

తను ఏమయినా అంటే సవితి తల్లి ఆడిపోసుకుంటోంది అని తనని అందరూ ఆడిపోసుకుంటారు. అన్ని విషయాల్లో తన మాట వింటున్న భర్త సుజాత విషయంలో తన మాట లక్ష్యపెట్టడం లేదు. ఆ తండ్రి దన్ను చూసుకునే సుజాత బరితెగిస్తోంది.

ఇదంతా చూస్తుంటే ఇంటి పరువు ప్రతిష్ఠలు మంటగలిసిపోయే రోజులు అట్టే దూరంలో లేవు. ఏంటో విచిత్రమైన మనుష్యులు. విపరీతమైన బుద్ధులు. ఇంటి పరువు ప్రతిష్ఠలు బజారు పాలయితే రేపొద్దున్న తన కూతురు రాధ పరిస్థితి ఏంటి? దాన్ని ఎవరైనా పెళ్ళి చేసుకోడానికి ముందుకు వస్తారా?

తనకి చెడ్డ పేరు వస్తేరాని కాని, ఈ ఆటలు సాగనీయకూడదు. అలా చూస్తూ ఊరుకునే స్వభావం నాది కాదు. తాడో పేడో ఏదో తేల్చే వేసిందే. శేషు ఆ సుజాతను ఇష్టపడున్నట్లు తనకి అనిపిస్తోంది. వాడిచేత మూడు ముళ్ళూ వేయించెస్తే తిక్క కుదురుతుంది. శేషుతో పెళ్ళికి తన భర్త ఒప్పుకోకపోవచ్చు. అయితే తను ఒప్పించాలి – ఇలా ఆలోచిస్తున్న సీతమ్మ మెటికలు విరిచింది. ఉక్రోషం పట్టలేక కక్కలేక మ్రింగలేక తెగబాధ పడిపోతోంది.

కొంతమంది స్వభావమే అంత. అందరూ తమ చెప్పు చేతల్లో ఉండాలని చూస్తారు. తమ అభీష్టానికి వ్యతిరేకంగా ఉంటే తట్టుకోలేరు. అసంతృప్తులవుతారు.

కొంతమంది మనస్సు చాలా సున్నితమయినది. చాలా విచిత్రమయినది. సున్నిత మనస్కులు ఎటువంటి అపవాదునయినా సహించలేరు. ఎదుటివాళ్ళ అపవాదులకి వాళ్ళ హృదయం గాయపడ్తుంది. బాధతో విలవిల్లాడుతుంది. తమ గుండెల్ని ఎవరో పిండి పిండి చేస్తున్నట్లు ఈ సున్నిత మనస్కులు విలవిల్లాడిపోతారు. ఆ కోవకు చెందినదే సుజాత. ఆత్మాభిమానం – ఆత్మగౌరవం, సున్నిత మనస్సు. దేశభక్తి, స్నేహ సౌజన్యత అనే గుణాలు పంచతత్వాల పంచభూతాల నుండి గ్రహించి మలచబడ్డ మానవత్వం మెండుగాగల మానవతా మూర్తి ఆమె.

తన సవతి తల్లి తనపై మోపిన అభాండాలకి ఆమె హృదయం బాగా గాయపడింది. అవమానాగ్నిలో దహించుకుపోతోంది. తండ్రికి తనపై ఎటువంటి చెడు అభిప్రాయం లేదు. అయితే దాన్తో సరిపోతుందా? సరిపోదు. ఎందుకంటే నాలుకకి నరం లేదంటారు. సమాజంలో నున్న సీతమ్మలాంటి మనుష్యులుంటారు. తనని వేలెత్తి చూపిస్తూ తనని అపహాస్యం చేస్తుంటే బాధపడేది. ఒక్క క్షణం నేనేఁ తప్పు చేయలేదు అనుకుని తనని తాను సమర్థించుకునేది మరోక్షణంలో.

ఎందుకంటే రాజశేఖరం చాలా మంచివాడు. ఉత్తమ ఆదర్శ భావాలు కలిగిన మనిషి, తను అతనితో కలిసి తిరగడం – మాట్లాడం అతనితో స్నేహంగా మసలడం తప్పా? ఈ సమాజంలో మనిషి మనస్తత్వంలో ఈ సంకుచిత వైఖరి పోయి మార్పురాదా? విశాల దృక్పథం ఏర్పడదా? ఆడ, మగ కలిసి మాట్లాడుకున్నంత మాత్రాన వారి మధ్య ఏదో అపవిత్రమైన సంబంధం ఉందని ప్రచారం చేసే ఈ ఛాందస మనుష్యుల మనస్తత్వం మారదా?

ఈ స్వాతంత్ర్య పోరాటంలో ఆడ మగ అన్న బేధం లేకుండా అందరూ పాల్గొంటున్నారు కదా! ఈ సమాజం వారి అందరికి సంబంధం అంటగట్టగలదా? తననే ఇంత అవమానాల పాల్జేస్తోంది ఈ సమాజం. సమాజం అంటే సమాజం కాదు. సమాజంలో కొంతమంది సంకుచిత మనుష్యులు. తను ఎంతో మానసిక సంఘర్షణలో నలిగిపోతోంది.

అశాంతితో మనస్సు దహించుకుపోతున్న సమయంలో శాంతి కోసం పరితపిస్తూ ఆ శాంతి కోసం తాత్కాలికంగానైనా అశాంతిని మరిచిపోవడానికి శాంతిమయ వాతావరణాన్ని వెతుక్కుంటూ బయలుదేరుతాడు మనిషి. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క చోట శాంతి లభిస్తుంది.

సుజాత శాంతిని వెతుక్కుంటూ తన ఇంటిలో తనకి కరువయిన శాంతిని అన్వేషిస్తూ బయలుదేరింది. ఇంటిలో నుండి అలా బయటకు వచ్చిన ఆమెకి ఎక్కడికి వెళ్ళాలి? అన్న ఆలోచన వచ్చింది. వెంటనే ఆమె ముఖంపై స్థిరమైన నిర్ణయం. వెంటనే పవిత్రమైన దేవాలయం వేపు అడుగు లేస్తోంది. ఆ దైవ సన్నిధిలో తనకి తప్పకుండా శాంతి లభిస్తుంది అన్నది ఆమె ప్రబలమైన విశ్వాసం. దాన్ని సాకారం చేసుకోడానికి ఆమె ఆ దైవ సన్నిధి వేపు గబగబా అడుగులు వేసింది.

ఇవతల సుజాత పరిస్థితి ఇలాగుంటే అవతల రాజశేఖరం పరిస్థితి మరోలా ఉంది. చితికిపోయిన ఛిన్నాభిన్నమైన ఇడుములపాలై అతిదారుణంగా యాతనలకి గురవుతూ బానిస బ్రతుకు బ్రతుకుతున్న తల్లి చిన్న చెల్లి కళ్యాణి అగుపించారు. శారద పరిస్థితి అలాగయింది. వేణు సంగతి అలా అయింది. మిగిలిన ఇద్దరినేనా తను సుఖంగా ఉంచగలడా? ఉంచగలిగే స్థాయికి తను ఎదగలేదు. తనకే ఢోకా లేదు. తనే ఎదుటి వాళ్ళమీద ఆధారపడి బ్రతుకు సాగిస్తున్నాడు.

తన వాళ్ళను ఆదుకోవాలన్న ఆశ – ఆదుకునే అర్హత తనకి లేదే అన్న ఆవేదన. ‘తన జీవితానికి స్వాతంత్ర్యం రాలేదు. తను దేశ స్వాతంత్ర్యం కోసం బయలుదేరాడు. అంతలోనే అతనిలోని భావాలు మారాయి. తనేంటి ఇంత సంకుచితంగా అలోచిస్తున్నాడు? దేశ సౌభాగ్యమే తనకి సర్వోపరి. దేశానికి నేనేపాటి సేవ చేశాను? దేశం యడల నా కర్తవ్యాన్ని నేను నిర్వర్తించేనా? నిర్వర్తిస్తున్నానా’ తిరిగి ఆత్మ విమర్శ చేసుకున్నాడు. .

ఇలాంటి ఆలోచన్లతో రాజశేఖరానికి కూడా రాత్రంతా నిద్ర పట్టలేదు. శరీరం అంతా చాలా నీరసంగా, మత్తుగా ఉంది. రెండు రోజులు తిండి తినక పోయినా ఉండవచ్చు కాని ఒక్క రోజు నిద్ర లేకపోతే ఉండలేం అని అనుకున్నాడు.

చల్లటి నీటితో స్నానం చేసిన అతని మనస్సు కొంత తేలిక పడినట్లు అయింది. మనస్సు ఆవేదనతో అలమటిస్తున్నప్పుడు ప్రశాంతత కోసం చాలా మంది వెతుక్కునేది దైవ సన్నిధి. అక్కడ తన హృదయ వేదన తాత్కాలికంగానైనా మరిచిపోయి శాంతి పొందడానికి ప్రయత్నిస్తాడు మనిషి రాజశేఖరం కూడా అదే చేశాడు. మందిరం వేపు అడుగులేస్తున్నాడు.

దూది పింజల్లా మేఘాలు తేలిపోతూ ప్రక్కకి తప్పుకుంటూ ఉంటే వాటి మాటు నుండి బయటకు వచ్చిన బాలభానుడు కాంతిపుంజాలు ప్రకృతిని కాంతిమయం చేస్తున్నాయి. అటువంటి ప్రభాత సమయం రాజశేఖరం మనస్సు కూడా దూది పింజిలా తేలికపడింది.

18

ఆలయం నుండి భక్తిరసం ఉట్టిపడే శ్రావ్యమైన భక్తి గీతాలు మనస్సును రంజింప చేస్తున్న సమయంలో గుళ్ళో గంటలు విరామం లేకుండా అదే పనిగా మ్రోగుతున్నాయి. కొబ్బరికాయలు, అరటిపళ్ళ దుకాణాలు ఆకాశంలో తారకల్లా గుడి ముందున్న పరిసరాలని సందడితో నింపుతున్నాయి. రేలు బోగిల్లా భగవత్ దర్శనానికి వచ్చిన జనాలు ఒకరి వెనకాల మరొకరు దైవ దర్శనం చేసుకోడానికి తహతహలాడుతున్నారు.

కళ్యాణ మండపం ప్రక్కనే ఉన్న వటవృక్షం శాఖోపశాఖలుగా చీలి రావణాసురుడి పది శిరస్సుల్ని జ్ఞప్తికి తెస్తోంది. బ్రహ్మ రాక్షసి జడల్లా ఊడలు క్రిందకి వ్రేలాడుతున్నాయి. ఆ వృక్షంపై నివాస మేర్పరుచుకుని బ్రతుకుతున్న పక్షులు ఆహారాన్వేషణ కోసం ఎగిరిపోతున్నాయి. పక్షి పిల్లలు అరుపులు కర్ణపుటాల్లోకి చొచ్చుకుపోతున్నాయి.

పరిసరాలను పరికిస్తూ ఆ వటవృక్షం క్రింద ఆసీనురాలయింది సుజాత. అదే సమయంలో రాజశేఖరం కూడా దేవాలయ ప్రాంగణంలోకి అడుగుపెట్టాడు. ఆ వృక్ష ఛాయలో కూర్చుని శాంతి పొందుదాం అని అనుకున్న అతనికి చాలా ఆశ్చర్యం కలిగించిన దృశ్యం అగుపించింది. కను రెప్పలు కూడా కదల్చకుండా ఆ దృశ్యాన్నే చూస్తున్నాడు.

విచార వదనంతో – అతిదీనంగా జాలిగొలిపే భంగిమలో ఆలోచనా ప్రపంచంలో మునిగి తేలుతున్న సుజాత అతనికి అశోక వనంలో దీనంగా ఉన్న సీతాదేవిలా అగుపించింది.

చింతాక్రాంతుడయిన తనని క్రితం సాయంత్రమే ఓదార్చి తనలో ధైర్యం – ఆత్మవిశ్వాసం, మనోనిబ్బరం నింపిన సుజాత ఈ ఉదయం కాలంలో ఇలా ఒంటరిగా ఆలోచనా ప్రపంచంలో మునిగి తేలడానికి కారణమేమిటి చెప్మా? అతని అంతరంగం ఆలోచిస్తోంది.

అతను అలా చూడ్డం భగవత్ దర్శనానికి వచ్చిన జనాలకి విస్మయాన్ని కలిగిస్తోంది. ఎవరి చూపుల్ని లక్ష్య పెట్టకుండా ఆమె ఉన్న వేపు అడుగులేసాడు.

“సుజాత గారూ!”

మార్దవం, ప్రేమ, ఆప్యాయతా – అనురాగం మిళితమైన ఆ పిలుపుకి ఒక్కసారి ఆమె విచలితురాలయింది. ఆలోచనా ప్రపంచం నుండి బయటపడ్డ ఆమె అంత ఆప్యాయత ఉట్టిపడే స్వరంతో తనని పిలిచిన వారెవరు? అని తల ప్రక్కకి తిప్పి చూసింది. ఆమెకి ఎదురుగా రాజశేఖరాన్ని చూసి ఒక్క పర్యాయం ఉలిక్కిపడింది.

ఆమె వదనంలో తొంగిచూస్తున్న విషాద ఛాయలు అతడ్ని చూడగానే తాత్కాలికంగా మటు మాయమయినా అతని ముఖంలో అగుపడున్న నిరాశా, నిస్పృహ – అసహాయత – చింతా భావాలు ఆమె చదవగలుగుతోంది.

“మీరు… మీరు…!”

“ఆఁ నేనే,” అంది ఆమె నిర్లిప్తంగా. .

“అవును మీరే! ఇలా డీలాపడి ఒంటరిగా ఏదో ఆలోచిస్తున్నారు. నేను కారణం తెలుసుకోవచ్చా? అదీ మీకు ఇష్టమయితేనే చెప్పండి.

“అబ్బే…! ఏం లేదండి.”

“చెప్పడం నాకు ఇష్టం లేనట్లుంది. చెప్పడం ఇష్టం లేకపోతే లేక కష్టమనిపిస్తే మానేయండి” ఇలా అంటున్న సమయంలో అతని గొంతుకలో నిష్ఠూరం తొంగి చూసింది.

“మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు. నేను చెప్పిన విషయం తెలిస్తే మీరూ బాధపడవల్సి వస్తోంది. నేను పడున్న బాధ చాలక మిమ్మల్ని కూడా బాధ పెట్టడం నాకిష్టం లేదు.”

“బాధలకి అలవాటు పడిపోయాను. బాధలు నాకు నేస్తాలు. ఎలాగూ మీ జీవితంతో పాటు పంచుకునే అదృష్టం నాకు ఎలాగూ లేదు మీ బాధలోనైనా భాగం పంచుకునే అవకాశం నాకివ్వండి.”

అతని మాటలకి సుజాత ఉలిక్కిపడింది. అతని మాటలు ఆమెకు వింతగా అనిపించింది. అతని వంక నిశితంగా చూసింది సుజాత. ఆమె చూపులకి తట్టుకోలేనట్టు అతను తన ముఖాన్ని ప్రక్కకి త్రిప్పుకున్నాడు.

అతని మాటల్నే ఆలోచిస్తోంది ఆమె.

“క్షమించండి.”

“ఎందుకు?”

“నా మనస్సులోనున్న నా భావాన్ని నా ఉద్దేశాన్ని మరుగుపర్చలేక పోయాను. ఆశ మహా చెడ్డది. జీవితంలో ఎన్నో ఆశిస్తూ ఉంటాము. ఆశించినవన్నీ జరగాలని లేదు కదా! నేనేఁ తప్పుగా మాట్లాడి ఉంటే క్షమించండి” మరో పర్యాయం అన్నాడు.

సుజాత అతనికేఁ జవాబియ్యకుండా వటవృక్షం పొడల వంక చూస్తోంది. కొంత సేపు నిశ్శబ్దం అక్కడ తాండవించింది. ఆమె గొంతు సవరించుకుంది. ఇంటిలో జరిగినదంతా అతనికి వివరించింది. విన్న తరువాత క్రమేపి అతని వదనంలో రంగులు మారుతున్నాయి. రోషం – ఆవేశంతో అతని పెదవులు వణుకుతున్నాయి. అతని హృదయంలో దాగి వున్న క్రోధ భావాలు ముఖమండలంపై సంచరించిన కారణం చేత అతని దవడ ఎముక ఒక్క క్షణం కదిలింది.

అతని వాలకం చూసి ఆమె కంగారు పడింది. తను ఈ విషయాన్ని చెప్పకపోయినా బాగుండేది అని అనుకుంటోంది. తుఫాను వచ్చే ముందు ప్రకృతిలో కలిగిన – కలుగుతున్న మార్పులా వారిద్దరి మధ్యా భయంకరమైన – నిశ్శబ్ధత తాండవించింది. కోపంతో అరుణిమ దాల్చిన అతని వదనం క్రమేపి మార్పు వస్తోంది.

సూర్యాస్తమయంలో భాస్కరుడు తన తేజస్సు కోల్పోయినట్టు అతని వదనంలో ఎర్రదనానికి బదులు నల్లని మేఘాల్లాంటి విషాద ఛాయలు పరుగులు తీయడం ఆరంభించాయి. ఆ భావాలు నిలకడగా లేవు. వెను వెంటనే ఓ స్థిరమైన నిర్ణయానికి వచ్చినట్లు అతని దవడ ఎముక కదిలింది. కళ్ళలో స్థిరమైన భావం తొంగి చూసింది.

అతను ఒక్క ఉదుటున లేచి గుడివేపు అడుగులు వేస్తున్నాడు. అయోమయంగా ఆశ్చరంగా అతని వంక చూస్తోంది ఆమె. ఒకటి… రెండు… పది నిమిషాలు గడిచాయి. అతను తిరిగి వస్తున్నాడు. అతని చేతిలో రక్తాన్ని కూడా మైమరిపించే ఎర్రని కుంకం. అతని అడుగులు ఓ వంక తొట్రుపాటు తోను, మరోవంక ఆనందతోనూ తడబడున్నాయి. అతని చూపుల్లో స్థిర నిర్ణయంతో పాటు ప్రేమానురాగాలు మిళితమై ఉన్నాయి. ఎర్రని ఆ కుంకం తీసి ఆమె పాపిడిలో ఉంచాడతను.

“సుజా!!!”

అతని చర్యలు – అతని సంబోధనా ఆమెకి క్రొత్తగా అనిపిస్తోంది. ఈ రోజు తను క్రొత్త రాజశేఖరాన్ని చూడ్డం లేదు కదా! విస్మయంలో మునిగితేలుతున్న సుజాతను అవలోకిస్తున్న అతను చిన్నగా నవ్వాడు. అతని ప్రవర్తన ఆమెకి చిరాకు పరచటం లేదు, కోపం తెప్పించటం లేదు. అతడ్ని అర్థం చేసుకోడానికి ప్రయత్నిస్తోంది.

“నా ప్రవర్తన నీకు ఆశ్చర్యం కలిగిస్తోంది కదూ సుజా!” అతని కంఠంలో మార్దవం – లాలన – ఓదార్పు అన్ని మిళితమై ఉన్నాయి. ఆమె బదులు పలకలేదు.

“లోకులు మనల్ని గురించి పలు పలు విధాలుగా అనుకోడానికి వీల్లేదు. విన్నావా, ఓ సంప్రదాయం గురించి విన్నావా? సాంప్రదాయం ప్రకారం మగవాడు ఆడదాని పాపిడిలో కుంకమేనా, సింధూరమైనా ఉంచాడంటే దానికి అర్థం ఏంటో తెలుసా? వాళ్ళిద్దరూ దంపతులయ్యారన్న మాట. ఏ శక్తి వాళ్ళిద్దర్నీ – వాళ్ళ పవిత్ర బంధాన్ని విడదీయలేదు.

పవిత్రమైన భగవత్ సన్నిధిలో అమ్మవారి దగ్గరున్న కుంకంతో మనిద్దరికీ  పెళ్ళి అయినట్టు లెక్క. భగవత్ దర్శనానికి వచ్చిన ఈ జనాలందరూ సాక్షులు మనం భార్యాభర్తలం అయినట్లు. ఆలయం నుండి వినవస్తున్న మంత్రాలు మన పెళ్ళి మంత్రాలు. వటవృక్షంపై కలకల ధ్వనులు చేస్తున్న విహంగాల కూజితాలు బాజాబజంత్రీలు” రాజశేఖరం సుజాత వంక చూస్తూ ఇలా చెప్పుకుపోతున్నాడు.

“అయితే లోకులందరూ నానా విధాలుగా అంటారనా మీరీ పని చేసింది” ఆమె అతడ్ని నిశితంగా పరికిస్తూ అంది. ఆమె కంఠంలో కనబడ్తున్న అస్పష్టంగా అగుపడుతున్న తీక్షణతకి అతను ఒక్క క్షణం కలవరపడ్డాడు.

“నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు. మీతో పరిచయం ఏర్పడిన సమయంలోనే మీలాంటి జీవిత భాగస్వామి నా జీవితంలోకి అడుగుపెట్టే ఎంత బాగుండును అని అనుకున్నాను. మీరు నా జీవిత భాగస్వామి అయినట్లు ఊహించుకుంటూ ఊహా ప్రపంచంలో తేలియాడుతూ తన్మయత్వం చెందుతుండే వాడిని. అయితే మన చుట్టూ ఉన్న ఈ ఇనప సంకెళ్ళులాంటి పరిస్థితులు నా హృదయంలోని దాగి ఉన్న నా భావాల్ని వ్యక్తం చేయడానికి అవకాశం ఈయలేదు.

ఇప్పుడయినా నాఎదుట ఓకటే భావన మనం జన్మించిన జన్మభూమికి స్వాతంత్ర్యం తేవాలి. భానిసత్వాన్ని పారద్రోలి దేశంలో ప్రజాసామ్యాన్ని పునరుద్ధరించాలి. భారతమాత కాళ్ళకి – చేతులకి ఉన్న ఈ విదేశ పరిపాలన అనే సంకెళ్ళను తెంచాలి. అలా అయిన తరువాత అందరి సమక్షంలో నీ మెడలో మూడు ముళ్ళూ వేసి నా దానిగా చేసుకోవాలన్నదేనా ఆశ. నా కోరిక కాదనకు ప్లీజ్…!”

అమాయకంగా కళంకం లేని నిర్మలమైన మనస్సుతో చిన్న పిల్లడిలా అభ్యర్థిస్తున్న అతని అభ్యర్థనను ఆమె ఏ కారణం చేతనో కాదన లేకపోయింది. తమ స్నేహం, సన్నిహిత సాగత్యం – సంబంధం ఈనాటిది కాదు. జన్మజన్మల అనుబంధంగా అనిపించింది ఆమెకి ఆ సమయంలో.

అంతవరకూ తను అనుభవించిన ఆవేదనకి ఓదార్పు – తనకి ఓ బలమైన ఆశ్రయం – రక్షణ లభించినంత తృప్తి కలిగింది. అతని నీడలో అతని దృఢమైన వ్యక్తిత్వం మాటున తన జీవిత నావ చక్కగా సాగిపోగలదనే పరిపూర్ణమైన విశ్వాసం ఆమెలో కలిగింది.

తన జీవితానికి ఓ పరమార్గం, ఓ బాట – గమ్యం, ఉనికి బోధపడింది. అదే దేవాలయ ప్రాంగణం అయిపోయింది కాని అదే ఏకాంత ప్రదేశమయితే అతని హృదయంలో తలదూర్చి ఇంతవరకూ తను అనుభవించిన నరకయాతన మరిచి ఆనంద డోలికల్లో తేలియాడేది.

“ఏంటి ఆ దీర్ఘాలోచన? నీ మౌనాన్ని భరించలేనంత కుతుహలం నాలో కలుగుతోంది. నీ అభిప్రాయం నిర్మొహమాటంగా – నిర్భయంగా ఎటువంటి సంకోచం లేకుండా చెప్పేయ్!” అతను అలా అన్నాడే కాని ఆమె వదనంలో దోబూచులాడుతున్న సంతోషం తరంగాలను బట్టే ఆమె అంతరంగం అతనికి అవగతమయింది.

“నేను చాలా అదృష్టవంతురాల్ని” నోరు ఎలాగో పెగల్చుకుని ఆమె అంది.

“నేను మాత్రం దురదృష్టవంతుడ్నా?” అతను పకపకా నవ్వాడు. అతని ఆ నవ్వుతో ఆమె కూడా శృతి కలిపింది.

“ఈ విషయంలో ఇప్పటికి మనం అదృష్టవంతులమైనా ఎన్నో దురదృష్ట ఘడియలు మనకోసం మనకోసం ఎదురు చూస్తున్నాయి” తిరిగి రాజశేఖరం అన్నాడు.

“ఈ సంతోష సమయంలో తాత్కాలికంగానేనా ఈ ఘడియల్ని జ్ఞాపకం తెచ్చుకోడానికి ప్రయత్నించద్దు. ఇద్దరం ఆ జ్ఞాపకాల్ని – ఆ ఆలోచనని ఒక దగ్గరుంచి తాళం వేసెద్దాం. ఈ ఆహ్లాదకరమైన సుఖ స్వప్నాన్ని భగ్నం కానీకూడదు” ఇలాగే కొంత సమయం వరకూ ఉండాలన్న కాంక్షతో అందామె.

“అలాగే!” అంటూ అతను ఆమె చేతిని పట్టుకుని తన ప్రేమను తెలియజేస్తూ నెమ్మదిగా వొత్తి వదుల్తూ అన్నాడు. వారి చర్యలు వింతగా అవలోకిస్తున్నారు దేవాలయానికి వచ్చిన జనాలు. వారిని గమనించిన అతనూ, ఆమె కొద్దిగా సిగ్గు పడ్డారు. తమ తమ నివాసాలకి వెళ్ళడానికి లేచారు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here