కోకిల కూతలు

0
10

[dropcap]కో[/dropcap]కిలమ్మను నేను!
కొమ్మల నూగే, గాన మాధురీ రెమ్మను నేను
ఆమని ముద్దు బిడ్డ నేను,
ఆయమ అనురాగ స్పర్శ నేను!
వసంత రాణికి, వలపుల జోడు నేను
పల్లవాల పల్లకిలో ఊరేగే
నెనరు పల్లవుల పాటను నేను!

కోకిలమ్మను నేను, కొమ్మల నూగే
గాన మాధురీ రెమ్మను నేను

వయారాల కులికే లతలు,
వన్నెల మెరిసే పూతీగలు
వేకువలో కెంజాయ కాంతులు,
వెచ్చవెచ్చని రవి కిరణాలు
స్వాగతిస్తున్నాయి నన్ను
సరిగమల రాగం పాడమంటూ,
సరదాల తీరం చేరమంటూ

కోకిలమ్మను నేను, కొమ్మల నూగే
గాన మాధురీ రెమ్మను నేను

మామిడి తోపుల సుగంధాలు,
మల్లెల సొగసుల పరిమళాలు
వేప పూతల సువాసనలు,
విరిసే నవ్యంపు నెత్తావులు
రమ్మంటున్నాయి నన్ను
రంజిల్లు శోభ నందించమంటూ,
విరజిమ్ము భావుకత కమ్మంటూ

కోకిలమ్మను నేను, కొమ్మల నూగే
గాన మాధురీ రెమ్మను నేను

కొత్త వత్సరపు ఆగమనాన,
కోరికల తోరణాల ప్రాంగణాన
కోటల, పేటల జనులందరికోసం,
కోరి కోరి కూస్తున్నా
ఆశల పంటలు పండాలని
హాయిగా అందరూ ఉండాలని

కోకిలమ్మను నేను, కొమ్మల నూగే
గాన మాధురీ రెమ్మను నేను

అభిలాషలేవీ నాకు లేవు ప్రత్యేకంగా
ఆకుపచ్చని ప్రకృతి నిలిస్తే చాలు నిండుగా
ఆరు ఋతువులూ ఆమని వేళలే కానక్కరలేదు
అవనీతలమంతా నాకివ్వనక్కరలేదు
అకాల విపరీతాలు నిలువరిస్తే,
కాకి గూళ్ళను నిలువనిస్తే,
ఆ పై ఏడాదికి నను మీరు రానిస్తే
మీ కోసమే పాడతాను, మీతోనే ఉంటాను

కోకిలమ్మను నేను, కొమ్మల నూగే
గాన మాధురీ రెమ్మను నేను

రాబోయే వత్సరానికి,
కాబోయే కలల సాకారానికి
నిండబోయే సిరుల కాసారానికి
మీ అందరకూ ఇవే నా శుభకామనల కూతలు!
మారుమ్రోగాలి విజయ దుందుభుల మోతలు!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here