కొంప మునిగింది..

0
10

[శ్రీ గంగాధర్ వడ్లమన్నాటి రచించిన ‘కొంప మునిగింది’ అనే కథని పాఠకులకి అందిస్తున్నాము.]

[dropcap]బ[/dropcap]స్సు కాస్త నెమ్మది అవగానే, “ఆర్.టీ.సీ. కాంప్లెక్స్ దిగేవాళ్లు రండి, ఆర్.టీ.సీ. కాంప్లెక్స్” అంటూ గొంతు చించుకు అరిచాడు డ్రైవరు పక్కనున్న అసిస్టెంట్. అతని అరుపు వినగానే, ‘మొబైల్ జేబులోనే ఉంది కదా’ అని ఓ సారి జేబుని తడిమి చూసుకున్నాడు మధు. అలాగే కళ్ళద్దాలు తడుముకుని, కళ్లకే ఉండటంతో హమ్మయ్య అనుకున్నాడు. తను కూర్చున్న సీటు చుట్టు పక్కల కూడా ఓ సారి చూసుకుని, ‘ఇంకేం లేవు’ అనుకున్నాడు.

ఆ బస్ అతను కాస్త అసహనంగా, “ఎంత సేపు సార్ అలా తాత్సారం చేస్తారు, మీ గురించి బస్సు గంటల తరబడి ఈ ఒక్క స్టాపులోనే ఆగదు, త్వరగా వచ్చి దిగండి” అన్నాడు ముఖం చిట్లిస్తూ.

మధు ఇంకా బ్యాగ్ బుజానికి తగిలించుకుంటున్నాడు. పక్కన కూర్చున్న వ్యక్తి, “చూసారాండీ అతని కావరం, మిమ్మల్ని త్వరగా బ్యాగ్ సర్దుకు దిగమని ఎలా అరుస్తున్నాడో. నేను కళ్ళతో  చూశాను కనుక మీకు చెప్తున్నాను. ఇలాంటి పొగరుబోతుల్ని ఊరికే వదలకూడదండీ” అన్నాడు.

అతని మాటలతో, కొంత అసహనంగా ఆ బస్ అసిస్టెంట్ వంక చూస్తూ, “ఏంటయ్యా నువ్వు, మీరు గంటలు లేట్‌గా వచ్చినా పర్వాలేదు కానీ, నేను దిగడానికి నిమిషాలు ఆలస్యం చేస్తే మాత్రం చిరాకు పడిపోతున్నావ్” అడిగాడు మధు, లేచి బస్ డోర్ దగ్గరకి నడిచి వెళ్ళి, అతని వంక తినేసేలా చూస్తూ.

ఆ మాటలకి అతను బిత్తరపోయి చూస్తూ, “అయ్యో, మీ పక్కన కూర్చున్న వ్యక్తి నా వైపు మాత్రమే చూసి అలా అర్థం చేసుకున్నాడు. అతని మాటలు విని నన్ను తిట్టకండి సార్. నేను అన్నది మిమ్మల్ని కాదు, మీ వెనకాయన ఇంకా బ్యాగ్‌లో బ్లాంకెట్‌ని నెమ్మదిగా కుక్కుతున్నారు చూడండి. ఆయన్ని ఉద్దేశించి అన్నాను” చెప్పాడు బిక్క మొహంతో

“అలాగా” అని ఒకసారి వెనక్కి తిరిగి చూసి, “ఔనయ్యా, నేనే ఓ సారి వెనక్కి తిరిగి, చూసి కన్ఫర్మ్ చేసుకోవాల్సింది. అలా చేయకుండా, అతని మాటలు నమ్మేసి నిన్ను ఏదేదో అనేసాను. అవి బుర్రలో పెట్టుకుని వర్రీ అవకు” అని తన బ్యాగ్‌తో పాటు స్టాప్‌లో దిగిపోయాడు మధు. ట్రావెల్ బస్సు దిగగానే, చేతికున్న వాచీ చూసుకున్నాడు. సరిగ్గా పది గంటలవుతోంది.

“ఛ, ఛ, ఎప్పుడో ఎనిమిది గంటలకి వైజాగ్ రావాల్సిన బస్సు, రెండు గంటలు ఆలస్యం చేసి తగలడ్డాడు” అని అటూ ఇటూ చూసి, అటుగా వెళ్తున్న ఓ ఆటోని పిలిచాడు.

ఆటో అతను మధుకి దగ్గరగా ఆపి, “ఎక్కడికి వెళ్ళాలి సార్” అడిగాడు.

“అదీ” అని చెప్పీ, చెప్పబోతూ ఒక్కసారే షాక్ కొట్టిన మనిషిలా ఆగిపోయాడు. ఎదురుగా ఉన్న మూడంతస్తుల జ్యూయలరీ షాపుని అలానే కళ్ళప్పగించి మరీ చూస్తూ ఉండిపోయాడు.

ఆ ఆటో అతను బుర్ర గోక్కుని, “సార్ మిమ్మల్నే, ఎక్కడికి వెళ్ళాలి” కాస్త గట్టిగా అరిచాడు

ఆ అరుపుకి ఒక్కసారే తేరుకుని, “సారీ బ్రదర్, నేను ఇపుడు రాలేను. నువ్వు వెళ్ళిపో” చెప్పాడు ఆ జ్యూయలరీ షాప్ వైపే చూస్తూ.

“భలే వారు సార్” అని  మధు వంక చిరాగ్గా చూసి వెళ్ళిపోయాడు. ఇంకా ఆ జ్యూయలరీ షాప్ వైపే చూస్తూ మరీ ఆలోచిస్తూ, ‘కొంప ముంచాను. అసలు విషయం మరిచేపోయాను, ఈరోజు లలిత పుట్టిన రోజు, పైగా నెక్లెస్ కొంటానని కొద్ది నెలల క్రితమే ఒకటికి రెండు సార్లు చెప్పాను కూడా. కొని తీసుకు వెళదామా వద్దా?’ అని అనుకుంటూ, ‘దీనికి ఎందుకు ఇంతగా సతమతమైపోవడం. అసలు లలిత మూడ్ ఎలా ఉందో తెలుసుకుంటే, దానిని బట్టి నెక్లెస్ కొనాలో లేదో నిర్ణయించుకోవచ్చు’ అనుకుని జేబులోంచి మొబైల్ తీసి, ఇంట్లో ఉన్న తల్లికి ఫోన్ చేశాడు.

ఆమె ఫోన్ ఎత్తి, “మధూ, ఎక్కడున్నావురా. ఉదయమే వచ్చేస్తా అని కోడలికి చెప్పావటగా. ఇందాక నే వెళ్ళి, మధు ఫోన్ చేసాడామ్మా అని అడిగితే, ఇంకా నాకు పుట్టిన రోజు విషెస్ కూడా చెప్పలేదు అత్తయ్యా, అసలు ఆయనికి గుర్తు ఉందో లేదో అంటూ కళ్ళు తుడుచుకుంది. తొందరగా వచ్చేయి. అమ్మాయి బాధపడుతోందిక్కడ” చెప్పింది.

“అలాగా! ఇప్పుడే బస్సు దిగాను. రెండు గంటలు ఆలస్యంగా వచ్చింది. ఇదిగో వచ్చేస్తున్నాను” అని ఫోన్ పెట్టేసాడు.

ఓ క్షణం పాటు ఆకాశం వైపు చూసి ఆలోచించి “మా అమ్మ చెప్పిన దాన్ని బట్టి చూస్తే, పరిస్థితి అంత బావున్నట్టు లేదు. పైగా లలిత, కన్నీళ్ళు కూడా పెట్టుకుందని అమ్మ చెబుతోంది. ఇపుడు కానీ ఇలా ఒట్టి చేతులతో వెళితే, లలిత నాకు గడ్డి పెట్టే అవకాశం లేకపోలేదు. కనుక ఇంకా ఆలోచించి ఆలస్యం చేయకూడదు. డబ్బు పోతే పోయింది, నెక్లెస్ కొని ఇచ్చేస్తే, తను ఐస్ అయిపోతుంది, నేను సేఫ్ అయిపోతాను” అనుకుని చక చకా రోడ్డు దాటేసి, ఆ బంగారం షాపులోకి వెళ్ళాడు. అక్కడ ఉన్న నగలన్నీ ఓ సారి చూసి, ఓ లక్షలో లక్షణమైన ఓ నెక్లెస్ తీసుకున్నాడు. తర్వాత దాన్ని దిల్ కుష్ అయ్యేంత అందంగా గిఫ్టు ప్యాక్ చేయించుకుని ఇంటికెళ్ళాడు.

లలిత కనడబడగానే, “ఏ వెరీ హ్యాపీ బర్త్ డే” అని పెద్ద నవ్వుతో ఆ నెక్లెస్ బాక్స్ ఆమెకి అందించాడు.

ఆమె ఓ క్షణం అలానే చూస్తూ, “థాంక్ యు సో మచ్. నేనసలు ఊహించలేదు” అంది కళ్ళు తుడుచుకుంటూ.

ఆమె కళ్ల వంక చూస్తూనే, “ఏవైంది, కళ్ళు అలా ఎర్రగా ఉన్నాయేంటి” అడిగాడు.

“అవునండీ, ఇందాక రైతు బజార్‌కి వెళ్ళి వచ్చేప్పుడు, కళ్ళలో ఏదో డస్ట్ పడింది. అప్పటి నుండీ ఇలా కళ్ల నుండి నీరు కారుతోంది. ఇందాకే ఐ డ్రాప్స్ కూడా వేసాను. ఇపుడు కొంత పర్లేదు. కానీ కళ్ల నుండి చుక్కలుగా నీరు మాత్రం కొంచెం వస్తోంది. ఇందాక కంటే ఇప్పుడు పర్వాలేదు. ఇప్పుడు కాస్త నొప్పి అదీ కొంచెం తగ్గింది. మరో సారి డ్రాప్స్ వేస్తే అదే పూర్తిగా తగ్గుతుంది. ఉండండి దీనిని అత్తయ్యకి చూపించి, అలానే మీకో మంచి కాఫీ కలిపి తెస్తాను” చెప్పి చిన్నగా నవ్వుతూ వంటగది వైపు నడిచింది.

‘కొంప మునిగింది. అంటే ఈ కన్నీరుని ఆ కన్నీరు అనుకుని, అమ్మ నాతో చెప్పీ చెప్పగానే, నేను హడిలి చచ్చి, ఏదేదో ఊహించి, లక్ష వెచ్చించి, ఈ నెక్లెస్ కొనిచ్చి, పిచ్చి పుల్లయ్య అయ్యానన్నమాట’ అనుకున్నాడు పోయిన లక్షని బాధగా తలుచుకుంటూ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here