కొండ అంచు

0
8

[box type=’note’ fontsize=’16’] కావలి సాహిత్య సంస్థ నిర్వహించిన పోటీలో బహుమతి గెలుచుకున్న స్థానిక రెడ్‌ఫీల్డ్స్ హైస్కూల్ 10వ తరగతి విద్యార్థిని వి. అనులాస్య వ్రాసిన కథ “కొండ అంచు”. బాల/యువ రచయితలను ప్రోత్సహించే పథకంలో భాగంగా ఈ కథను అందిస్తున్నాము. [/box]

“నేత్ర, ఎంత సేపు సర్దుకుంటావు? తొందరగా సర్దు. మనం వెళ్ళాలి” అనింది నేత్ర వాళ్ళ అమ్మ.

“అమ్మా అయిపోయింది, వచ్చేస్తున్నా. దేవ్ సర్దుకున్నాడా? అడిగింది నేత్ర. ఇంతలోగా నేత్ర తమ్ముడు దేవ్ వచ్చాడు.

“నేత్రా నేను నీలాగా గంటలు గంటలు సర్దుకోను” అన్నాడు. అప్పుడు నేత్ర “ఆపు దేవ్, నాది కూడా అయిపోతుంది. పద మనం వెళ్ళాలి” అనింది.

ఇక దేవ్, నేత్ర ఇంకా వాళ్ళ అమ్మ, నాన్న అందరూ కలసి కార్ ఎక్కి బయలుదేరారు. వాళ్ళు నిజానికి శ్రీశైలం వెళ్తున్నారు. అక్కడ గుడిని, ఇంకా అక్కడ ఉండేవన్నీ చూడడానికి వెళ్తున్నారు. అందరూ కార్‌లో ఆడుతూ పాడుతూ శ్రీశైలం కొండ సగం వరకు వెళ్ళారు. ఇంతలో కార్‌లో ఏదో సమస్య వచ్చింది. వాళ్ళ నాన్న సునీల్ కార్ దిగి ఏమైందో చూస్తూ ఉన్నారు. ఇక వాళ్ళ అమ్మ సుప్రియ, నేత్ర, దేవ్ కిందకు దిగారు.

ఇంతలో వాళ్ళ నాన్న “సుప్రియా నాకు మంచి నీళ్ళు తెచ్చివ్వు” అని అడిగారు. వాళ్ళ అమ్మ వెళ్ళి వాటర్ బాటిల్ తెచ్చేలోపే దేవ్ గోడ దగ్గరకి వెళ్ళి ఎగురతూ జారి కిందపడబోయాడు. ఈ లోగా నేత్ర తన చెయ్యి గట్టిగా పట్టుకుంది. “దేవ్ నా చెయ్యి గట్టిగా పట్టుకో అమ్మా, నాన్నా ఒక సారి ఇటు రండి” అని గట్టిగా అరిచింది. వాళ్ళ అమ్మ, నాన్న ఒక్కసారిగా పరిగెత్తారు. కానీ ఈలోగా నేత్ర, దేవ్ కింద పడిపోయారు. వాళ్ళ అమ్మ కళ్ళు తిరిగి పడిపోయింది. వాళ్ళ నాన్నకు ఏం చెయ్యాలో అర్థం కాలేదు. ఆయన పోలీసులకి ఫోన్ చేశారు. కొంత సేపటికి సుప్రియ కళ్ళు తెరిచింది. తన కంటి నిండా నీరు. ఇంతలో పోలీసులు వచ్చారు. అప్పటికే సాయంత్రం 6.30 అయ్యింది. చీకటి పడింది. పోలీసులు సునీల్, సుప్రియ దగ్గరకు వెళ్ళి “సార్, ఇప్పటికే చీకటి పడింది. కింద అడవి ఉంది. అది ఇక్కడికి 26 అడుగుల కింద ఉంది. ఇప్పుడు వెళ్ళడం చాలా కష్టం. రేపు పొద్దున 7.00 గంటలకు అందరం ఇక్కడికి వస్తాము. మీరు కూడా వచ్చేయండి.  మా సిబ్బంది కిందకు దిగి పిల్లలను వెతుకుతారు. మేడమ్ ఇప్పటికే మీరు బాగా అలసిపోయినట్టున్నారు. శ్రీశైలంలో మీరు తీసుకున్న రూమ్‌కి వెళ్ళండి” అని చెప్తారు. కానీ సుప్రియ “సార్ మాకు మా పిల్లలు  ఇప్పుడే కావాలి. మీరు ఏం చేస్తారో నాకు తెలియదు” అని గట్టిగా అరిచింది. అప్పుడు సునీల్ “సుప్రియా ప్లీజ్ వాళ్ళని అరవకు. సార్ మేము పొద్దున వస్తాము” అని చెప్పి వాళ్ళ రూమ్‌కి వెళ్తారు. వాళ్ళ బాధకి హద్దులే లేవు.

ఒక పక్క అలా ఉంటే, ఇటు నేత్ర, దేవ్ సంగతికి వద్దాము.

వాళ్ళు ఎంత అదృష్టవంతులంటే  ఇద్దరూ బాగా తవ్వి మెత్తగా ఉన్న నేల మీద పడ్డారు. వాళ్ళకి బాగా దెబ్బలు తగిలాయి. ఇద్దరూ ఏడుస్తూ “అమ్మా, నాన్నా” అని పిలుస్తూ ఉన్నారు. కానీ దాని వల్ల ఉపయోగం లేదు. వాళ్ళిద్దరికి ఏం చెయ్యాలో అర్థం కాలేదు. చిన్నగా ఏడుస్తూ వాళ్ళ దెబ్బలు చూస్తూ ఉండగా అటు పక్క పొదలలోంచి ఏదో శబ్ధం వచ్చింది. ఒక్క సారిగా ఒక అడవి మనిషి పొదలలోంచి దూకాడు. ఆ పిల్లలు అతన్ని చూసి భయపడసాగారు. అతడు “పిల్లలూ మీరు ఎవరు? ఎందుకు వచ్చారు?” అని అడిగాడు. ఆ పిల్లలు జరిగినదంతా చెప్పారు. అప్పుడు అతను “పిల్లలూ మీరు భయపడవద్దు. మీరు మా ఇంటికి రండి. నేను మీ దెబ్బలకు వైద్యం చేస్తాను” అని చెప్పాడు. నేత్రకి దేవ్‌కి ఏం చెయ్యాలో అర్థం కాక అతనితో పాటు వాళ్ళ ఇంటికి వెళ్ళారు. అక్కడ అతని భార్య మరియు రెండేళ్ళ పిల్లాడు ఉన్నారు. అప్పుడు ఆ అడవి మనిషి భార్య “ఈ పిల్లలు ఎవరు?” అని అడిగింది. అతడు జరిగినదంతా చెప్పాడు. ఆమె బాధపడింది. ఆ పిల్లలకు  ఆమె ఆకుతో దెబ్బలకు వైద్యం చేసింది. అందరూ భోజనం మొదలు పెట్టారు. ఆమె తన పిల్లడికి అన్న తినిపిస్తూ “పిల్లలూ! ఈ అడవిలో చాలా మంది ఆటవికులం ఉన్నాము. ఇప్పటికే చెట్లు కొట్టేయడం వల్ల మాక ఇళ్ళు లేకుండా పోతున్నాయి. మా నాయకుడు ఇక్కడికి మీ లాంటి వారిని రానివ్వడు. అది ఒక్కటే అతను చేసే మంచి పని. అతను చెడ్డవాడు. మిమ్మల్ని చాలా హింసిస్తారు. పెద్ద శిక్షలు వేస్తారు. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. బయటకి వెళ్ళొద్దు. అది మనందరికి ప్రమాదం” అని చెప్పసాగింది. ఆ పిల్లలకు కొంచం భయమేసింది. వాళ్ళకి వాళ్ళ అమ్మా నాన్న గుర్తొచ్చారు. వాళ్ళు పడిన చోటు నుండి చాలా దూరం వచ్చేసారు. ఇక వాళ్ళ దగ్గరకి ఎలా వెళ్ళాలి అనుకుంటూ చిన్నగా నిద్రలోకి జారుకున్నారు.

తెల్లవారింది. ఒక పక్క పోలీసులు కిందికి  వెళ్ళి పిల్లలను తీసుకొని రావడానికి ప్రయత్నాలు చేస్తుంటే, మరో పక్క పిల్లలు, అడవి మనిషి భార్య కలిసి బయటకు ఎలా వెళ్ళాలని ఆలోచిస్తూ ఉంటారు. చివరకు ఆమెకు ఒక ఆలోచన వచ్చింది. అప్పుడు ఆమె “పిల్లలూ రేపు ఏదో పని మీద మా వాళ్ళంతా పెద్ద బస్తాలతో ఇసుక మోసుకొని కొండ దగ్గరకి వెళ్తారు. అక్కడ నుంచి కొంత దూరం పరిగెత్తితే ఊరు వస్తుంది. మీరు ఆ బస్తాలో కూర్చుని వెళ్ళిపోండి” అని చెప్పింది. పిల్లలు చాలా సంతోషించారు. రేపటి దాకా ఆగారు.

అటు పోలీసులు కిందకి దిగి అంతా వెతకసాగారు. కొంచం దూరం వెళ్ళాక వారు వెనక్కి వచ్చి “సార్ కొంత దూరం వెళ్ళాము. ఆ తరువాత అది అటవీ ప్రాంతము. అక్కడి మనుషులకి దొరికితే మన ప్రాణాలకే ప్రమాదము. అందుకే మేము అటు పక్కకు వెళ్ళలేదు” అని చెప్పారు.

ఆ తరువాత రోజు అనుకున్నట్టే పిల్లలిద్దరూ బస్తాలో ఎక్కి కూర్చున్నారు. వెళ్ళేటప్పుడు ఆమెకు ధన్యవాదాలు చెప్పారు. ఇక అందరూ బయలుదేరారు. కొండ దగ్గరకి చేరుకొని అక్కడ ఆగంగానే పిల్లలు ఒక్క సారిగా దూకి అతనికి ధన్యవాదాలు చెప్పి పరిగెత్తి వెళ్ళిపోతారు. కొంత సేపటికి వారు ఒక ఊరికి చేరుకుంటారు. అక్కడ ఎవరిదో ఫోన్ తీసుకుని వాళ్ళ అమ్మకి ఫోన్ చేస్తారు. పిల్లల గొంతు వినగానే వాళ్ళ అమ్మ నోట మాట రాదు. ఆనంద భాష్పాలు కంటి నుంచి కారిపోతాయి. వెంటనే సునీల్, సుప్రియా ఇద్దరూ క్షణం ఆగకుండా కార్ తీసుకుని పిల్లలు ఉన్న చోటుకి వస్తారు. నలుగురూ ఒకసారిగా ఆలింగనం చేసుకుంటారు. అప్పుడు పోలీసులు కూడా వస్తారు. వాళ్ళకి కూడా జరిగిందంతా చెప్తారు. అందరూ సంతోషిస్తారు. నేత్ర, దేవ్ ఇద్దరూ వాళ్ళ అమ్మా నాన్నతో పాటు రూమ్‌కి వచ్చి తయారయ్యి గుడికి వెళ్తారు.

వి. అనులాస్య, పదవ తరగతి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here