ప్రాంతీయ సినిమా -7: కొంకణికి ఫెస్టివల్స్ ఫార్ములా!

    0
    5

    [box type=’note’ fontsize=’16’] “చాలా ప్రాంతీయ సినిమాలు వాస్తవికత బాట వీడి కమర్షియలైజ్ అయిపోయినా, కొంకణి సినిమాలని మాత్రం నిర్మాతలు పూర్తిగా ఆ దృష్టితో తీయడం లేదు. స్థానిక సమస్యలపై, జీవితాలపై దృష్టి పెడుతున్నారు” అని వివరిస్తున్నారు సికందర్, కొంకణి సినిమాలని విశ్లేషిస్తూ. [/box]

    [dropcap]అ[/dropcap]తి చిన్నది, పరిశ్రమ అన్న పేరే లేదు, లాభార్జనే లేదు, ఆపేక్షతోనే సినిమాలు తీస్తారు, చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శించుకుని ప్రేక్షకుల్లోకి తీసికెళ్తారు… ఐదు లక్షలే జనాభా, రెండు లక్షల మంది కూడా చూడరు, పేరుకి గోవాకి అంతర్జాతీయ ఖ్యాతి వుంది, అయినా గోవాలో నిర్మించే స్థానిక కొంకణి సినిమాలకి స్థానికంగానే మార్కెట్ కష్టమవుతోంది…

    మరి కొంకణి సినిమా ఇవాళ్ళ పుట్టలేదు. సుమారు ఏడు దశాబ్దాల క్రితమే 1950 లోనే పుట్టింది. అయినా ఇప్పటికీ నిలదొక్కుకోలేదు. ఏడాదికి ఒకటి రెండు నిర్మిస్తే మహా ఎక్కువ. కానీ నిర్మించే ఆ ఒకటీ రెండూ ఘనంగా జాతీయ అంతర్జాతీయ పురస్కారాల్ని సొంతం చేసుకునేవే. గత మూడేళ్ళలో మూడు జాతీయ అవార్డులు సాధించాయి.

    1950లో ‘మొగచో అన్వడ్డో’ (ప్రేమ తృష్ణ) మొదటి కొంకణి సినిమా. డబ్బున్న ఆవారా కుర్రాడికీ, పేదరాలైన అమ్మాయికీ మధ్య ప్రేమ కథ. దీని నిర్మాత, దర్శకుడు అల్ జెర్రీ బ్రగాంజా. తనే హీరో కూడా. హీరోయిన్ ఇరీన్ అమరల్. దీన్ని గోవాలోని మపుసాలోనూ, ముంబాయి లోని మాతుంగా, మజగావ్ లలోనూ ప్రదర్శించారు. ఆ తర్వాత 1963 వరకూ రెండో కొంకణి సినిమా లేదు. కొంకణి భాష మాట్లాడే తక్కువ జనాభాతో సినిమా లాభసాటి వ్యాపారం కాలేక పదమూడేళ్ళూ ఎవరూ సినిమాల జోలికి పోలేదు. 1963లో ‘అంచెమ్ నక్సిబ్’ (మన అదృష్టం) విడుదలై హిట్టయింది. ఇందులోని ఏడు పాటలూ ఎవర్ గ్రీన్ హిట్టయ్యాయి. ఫ్రాన్సిస్ ఫెర్నాండెజ్ నిర్మాతగా వ్యవహరిస్తే, ఎ.సలాం దర్శకత్వం వహించాడు. సి.అల్వేర్స్, ఒపీలియాలు హీరో హీరోయిన్లుగా నటించారు. దీని తర్వాత 1966లో ఇదే నిర్మాత, దర్శకుడు కలిసి ‘నిర్మోన్’ (విధి) తీశారు. దీనికి రెండు జాతీయ అవార్డులు లభించాయి. అలా 1966లోనే కొంకణి సినిమా తన అవార్డుల ఖాతా తెరచింది. ఇందులో హీరో హీరోయిన్లుగా సి అల్వేర్స్, శాలినీ మల్దోల్కర్‌లు నటించారు. ప్రసిద్ధ బాలీవుడ్ బ్యానర్ రాజశ్రీ ప్రొడక్షన్స్ దీన్ని హిందీలో ఇదే దర్శకుడితో ‘తక్దీర్’గా రీమేక్ చేసి, ఏడు భాషల్లో అనువదించారు. అప్పట్నుంచి ఇప్పటికి చూసుకుంటే కొంకణి సినిమాలు ఓ 40 వరకూ వచ్చాయి.

    కొంకణి మాట్లాడే ప్రజలు గోవాతో బాటు, మహారాష్ట్ర, కేరళ, కర్నాటకల్లో వున్నారు. గోవాలో 14 లక్షల మంది జనాభాలో కొంకణి మాట్లాడేవారు 5 లక్షల మందే. గోవా రాష్ట్ర అధికార భాష కొంకణియే అయినా కొంకణి సినిమాలు ఒక పరిశ్రమగా రూపొందలేదు. పొరుగు రాష్ట్రాల్లో కొంకణి జనాభా కూడా అతితక్కువ. కొంకణి సినిమాలు తీస్తే గోవా మార్కెట్లోనే దాని లాభనష్టాలు చూసుకోవాలి. నష్టాలే ఎక్కువ.

    ఐతే చాలా ప్రాంతీయ సినిమాలు వాస్తవికత బాట వీడి కమర్షియలైజ్ అయిపోయినా, కొంకణి సినిమాలని మాత్రం నిర్మాతలు పూర్తిగా ఆ దృష్టితో తీయడం లేదు. స్థానిక సమస్యలపై, జీవితాలపై దృష్టి పెడుతున్నారు. మైనింగ్ స్కామ్ మీద ‘ఆలీషా’, అస్తిత్వ సమస్య మీద ‘ఓ మరియా’, రాత్రికి రాత్రి పేరు ప్రఖ్యాతులు గడించాలనుకునే నేటి యువతపై ‘అంతర్నాద్’, ‘సావలి’… ఇలా వాస్తవిక సినిమాల సరళినే నమ్ముకుంటున్నారు. ఐతే ఎంత తక్కువలో తీయాలన్నా బడ్జెట్ 30 లక్షలవుతుంది. ఈ మొత్తం కూడా ప్రేక్షకుల నుంచి రాబట్టుకునే పరిస్థితి లేదు. ప్రభుత్వం 50 శాతం గ్రాంట్ ఇస్తున్నా వర్కౌట్ కావడం లేదు.

    ఇక సరైన నటీనటులు కూడా లేరు. సినిమా నటనని ఒక వృత్తిగా ఎవరూ భావించక పోవడం కారణం. స్టేజి నటులే కొంకణి సినిమాలకి దిక్కు. స్టేజి నటి అయిన డాక్టర్ మీనాక్షీ మార్టిన్స్ హిందీ సీరియల్స్‌లో పాపులర్. ఆమె ‘ఓ మరియా’లో నటించారు. డబ్బుకోసం కాకుండా మాతృ భాష మీద అభిమానంతో.

    1966లో ‘నిర్మోన్’ తర్వాత ఆ దశాబ్దంలో మరో రెండు సినిమాలే నిర్మించారు. ఆ తర్వాత, 70లలో ఆరు, 80లలో ఆరు, 90లలో ఒకటి మాత్రమే నిర్మించి, మళ్ళీ 2003 వరకూ అస్త్రసన్యాసం చేశారు. గోవాలో కొన్ని థియేటర్లు వున్నా వాటిని భరించే పరిస్థితి లేక సినిమాలు తీయడం మానుకున్నారు. గోవాలో హిందీ సినిమాలకే ఆదరణ ఎక్కువ.

    2004లో గోవాలో ఒక చారిత్రక పరిణామం సంభవించింది. అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలకి గోవా శాశ్వత వేదికయ్యింది. వివిధ దేశ విదేశాల ప్రతినిధులూ, వాళ్ళ సినిమాలూ గోవాలో కళ్ళముందు హడావిడీ చేస్తూంటే, కొంకణి సినిమాలని ఇక ప్రమోట్ చేసుకోవాలంటే ఇంతకంటే మంచి అవకాశం లేదనుకున్నారు నిర్మాతలు. ఈ ఫార్ములాని కనిపెట్టింది ప్రముఖ కొంకణి నిర్మాత, దర్శకుడు రాజేంద్ర తలక్. లాభనష్టాల సంగతి తర్వాత, ముందు ఈ ఫెస్టివల్స్ నుపయోగించుకుని కొంకణి జీవితాన్ని ప్రపంచానికి చూపెట్టాలన్న లక్ష్యంతో ‘ఆలీషా’ (2004) తీశారు. దీన్ని ఫెస్టివల్స్‌లో ఇండియన్ పనోరమాలో ప్రదర్శించడంతో బాటు, 52వ జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శించి ఉత్తమ ప్రాంతీయ సినిమా అవార్డు నందుకున్నారు. దీని తర్వాత 2006లో ‘అంతర్నాద్’ తీశారు, 2011లో ‘ఓ మరియా’ తీశారు. రాజేంద్ర తలక్ వేసిన బాటలో మరెందరో నిర్మాతలు, దర్శకులూ ఫెస్టివల్స్ ఫార్ములాని అనుసరిస్తూ విజయాలు సాధిస్తున్నారు. ఏడాదికి రెండే తీసినా రెగ్యులర్‌గా తీసి ఫెస్టివల్స్‌లో ప్రదర్శిస్తున్నారు. గత సంవత్సరం ఉన్నట్టుండి 9 తీశారు.

    ఈ సంవత్సరం ఇప్పటికే ‘జాన్వాయ్ నంబర్ వన్’, ‘సెవెన్ డేస్’ అనే రెండు తీశారు. ప్రతీ సంవత్సరమూ జాతీయమో, అంతర్జాతీయమో ఏదో ఒక అవార్డు నందుకుంటున్నారు. 2009లో లక్ష్మీ కాంత్ షెట్గోంకర్ తీసిన ‘పల్టా డాచో మునిస్’ (వారధి ఆవల మనిషి) దేశవిదేశాల్లో ఎన్నో అవార్డులు అందుకోవడమే గాక, ప్రపంచ అత్యుత్తమ చిత్రాల జాబితాలో చోటు సంపాదించుకుంది.

    ఫెస్టివల్స్ ఫార్ములా ప్రకారం ఫెస్టివల్స్‌లో ప్రదర్శించి హడావిడీ అదీ చేశాక, ప్రజల దృష్టిలో పడుతుంది. అప్పుడు థియేటర్లలో విడుదల చేసి వసూళ్లు రాబట్టుకుంటున్నారు. ‘ఆలీషా’, ‘అంతర్వాద్’లు ఇలా హిట్టయినవే. ‘ఓ మరియా’ మల్టీప్లెక్స్‌లో సిల్వర్ జూబ్లీ ఆడింది.

    గోవాలో ఫిలిమ్ స్కూల్స్ లేవు. దేనికీ శిక్షణలు లేవు. కష్టపడి స్వయంగా నేర్చుకుని సినిమాలు తీస్తున్నారు. వాస్తవిక సినిమాలు తీసేవాళ్ళు తీస్తూండగా, వివిధ జానర్స్ లో కమర్షియల్స్ తీసే వాళ్ళు తీస్తూనే వున్నారు. అయితే ఇవి చవకబారు మసాలా సినిమాలు కావు. మంచి క్వాలిటీతో ఎక్కువగా థ్రిల్లర్స్, హారర్స్, సైన్స్ ఫిక్షన్లు తీస్తున్నారు. భూ కుంభకోణం మీద ‘హోం స్వీట్ హోమ్’ తీసిన స్వప్నిల్ షెట్కర్, దీని సీక్వెల్ కూడా తీసి హిట్ చేశారు.

             

    కొంకణి సినిమాలకి ప్రధాన పోటీ, టియాటర్ అనే సంప్రదాయ సంగీత రూపకం. ఇవి హౌస్‌ఫుల్స్‌తో ఆడుతూంటాయి. వీటికి ప్రభుత్వ సహకారం కూడా అవసరం లేదు. ఇవి వంద షోలకు లక్ష టికెట్లు అమ్ముడుపోతాయి. వీటి వైపు అసూయతో చూస్తూ కూడా సినిమాలు తీస్తూ, హిట్ చేసుకునే మార్గాలు కనుగొంటూ ముందుకు సాగుతున్నారు మాతృభాష మీద అంతులేని మమకారమున్న నిర్మాతలు.

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here