మనస్సు తరువు బహూకరించిన ‘కొన్ని శేఫాలికలు’

0
11

[శ్రీమతి వాడ్రేవు వీరలక్ష్మీదేవి రచించిన ‘కొన్ని శేఫాలికలు’ అనే పుస్తకాన్ని సమీక్షిస్తున్నారు గోపగాని రవీందర్.]

[dropcap]‘తే[/dropcap]నెటీగ ప్రతి పువ్వు నుంచి మకరందాన్ని సంపాదించి తెచ్చి తన పట్టులో దాచుకుంటుంది. నేను కూడా ప్రతి మంచి పుస్తకం నుంచి ప్రభావితం అవుతూ వచ్చాను. తేనెటీగలా కాకుండా ఈ దాచిన మధు కోశం నుంచి నా అనుభవ సారాన్ని మరెంతోమందికి రుచి చూపించి పంచుకోవాలని ఆశపడుతూ ఉంటాను. దాని కారణం కూడా నన్ను ప్రభావితం చేసిన ఈ పుస్తకాలు, ఈ మహానుభావులే’ అన్న ఈ వాక్యాలు ‘నన్ను ప్రభావితం చేసిన పుస్తకం’ అనే వ్యాసంలోనివి.

ప్రసిద్ధ కథా రచయిత్రి, వ్యాసకర్త, ఉపన్యాసకురాలైన వాడ్రేవు వీరలక్ష్మిదేవి గారు రచించిన ‘కొన్ని శేఫాలికలు’ వ్యాస సంపుటిలో 40 వ్యాసాలున్నాయి. ఇందులోని ఏ వ్యాసాన్ని చదవడం మొదలుపెట్టిన సరే చివరి పంక్తి వరకు ఆగకుండా పూర్తి చేస్తాము. సందర్భోచితమైన వర్ణన మనల్ని ఆకట్టుకుంటుంది. ఈ వ్యాసాలన్నీ 2018 నుంచి  ఒక  వెబ్ పత్రికలో ప్రచురితమైనవే. ఈ వ్యాసాలన్నింటినీ ఒక దగ్గరగా చదువుకోవడమొక అనిర్వచనీయమైన అనుభూతిని కల్గిస్తాయి. విస్తృతమైన జీవితానుభవం, విశాల దృక్పథంతో కూడిన సాహిత్య అధ్యయనం, తనను ప్రభావితం చేసిన పుస్తకాలు, ఆలోచనలను మార్చిన గురువులు, రచయితలు, కవులు, సినిమాలు, కావ్యాలు, ప్రబంధాలు అన్నింటినీ, అందరినీ గూర్చి సవినయంగా ఈ వ్యాసాల్లో ప్రస్తావించారు. ప్రాచీన సాహిత్యం నుండి ఆధునిక సాహిత్యం దాక సాగిన తన సాహితీయానాన్ని మన కళ్ళ ముందు దృశ్యమానం చేశారు. కాళిదాసు, భవభూతి రాసిన సంస్కృత కావ్యాల నుండి మొదలుకొని ఇతిహాసాలైన రామాయణం, మహాభారతంలోని కథలను ఈ వ్యాసాల్లో ప్రస్తావిస్తారు. నన్నయ్య నుండి మొదలుకొని గురజాడ, కృష్ణశాస్త్రి, చలం, విశ్వనాథ, శ్రీశ్రీ, జాషువా, పాలగుమ్మి, ఇస్మాయిల్, చినవీరభద్రడు వరకు సందర్భానుసారంగా వారి రచనలను వర్తమాన పరిస్థితులకు అనుసంధానం చేసి విడమర్చి చెప్తారు. వాస్తవ మానవ సంబంధాలు, సాహిత్య సృజనలోని మానవ సంబంధాలు వేరువేరు కాదని ఈ వ్యాసాల ద్వారా నిరూపించారు.

చలం రాసిన ‘శశాంక’ నాటకంలోని కథాంశంతో మనిషిలోని లోపలి స్వేచ్ఛ గురించి ‘చలం చెప్పిన స్వేచ్ఛ’ అంటూ విశ్లేషించారు. ఈ వ్యాసంలో ఇలా అంటారు ‘ఈ నాటకం మొత్తం మీద చలం గారు సూచించిన మరొక ప్రధాన అంశం హృదయ స్పందన ప్రధానంగా స్త్రీ పురుష సంబంధాలు ఏర్పడాలని. అప్పుడే సంబంధం దివ్యమవుతుంది. అటువంటి హృదయ ప్రధానమైన స్త్రీ పురుష సంబంధాల పట్ల చుట్టూ ఉన్న ప్రపంచము ఆయా సమంత వ్యక్తులు ఎంతో ఉదారంగా ఉండగలగాలి. ఏ గొప్ప జ్ఞానమైన అటువంటి దివ్య అనుభవం వలన ఆయా వ్యక్తులకు కలుగుతుంది’. ప్రసిద్ధ కథా రచయిత మునిపల్లె రాజుగారు రాసిన ‘సవతి తమ్ముడు’ కథ గూర్చి ‘మునిపల్లె వారి మేజర్ మూర్తి’ శీర్షికతో రాసిన వ్యాసంలో ఇలా అంటారు. ‘అవును. సాహిత్యం, మనం దాన్ని నిజాయితీగా శ్రద్ధగా తీసుకోవాలే గాని మనని ఎంతైనా మార్చగలదు. స్థిమితపరచగలదు. ఒక సాహిత్యమేనా? ఏ కళారూపమైన అది నిజమైన కళారూపమైతే ఆ పని చెయ్యగలదు. దాన్ని నిరూపించడానికే ఈ రష్యన్ అమ్మాయి గాల్యా కథతో ముడి పడిన మేజర్ మూర్తి కథను మళ్లీమళ్లీ తలుచుకోవాలనుంది’. మనం కూడా ఈ కథ వెంటపడి మన అనుభవాల్ని పదేపదే తలుచుకుంటూనే ఉంటామిక.

ఎన్ ఆర్ చందురు గారి ‘మంగుళూరు మెయిల్’ కథను ఇప్పటికీ మరువలేని తీరును ‘చల్లనివేళా చెల్లించే జ్ఞాపకం’ హృదయాన్ని హత్తుకుంటుంది. ‘చలం అంటే నిజంగా ఈ కథే’ అంటూ ‘ఆమె త్యాగం’ కథను గురించి విస్తృతమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు. ‘మరువలేని ఆ రెండు సినిమాలు’ వ్యాసంలో సంగీతంతో రాణించే దేవదాసీ కుటుంబం నుంచి వచ్చిన బాలిక కథనే ‘భూమిక’ సినిమా. జీ.వి.అయ్యర్ తీసిన ‘హంస గీతే’ కన్నడ సినిమా రెండోది. ఈ రెండు సినిమాల గూర్చిన విశ్లేషణ చదివినంక ఆ సినిమాల్ని ఎప్పుడెప్పుడు చూద్దామని అనిపిస్తుంది.

ప్రపంచ సాహిత్యంలో ప్రసిద్ధి చెందిన రష్యన్ కథా నవలా రచయిత టాల్‌స్టాయ్ రచించిన ‘సంసార సుఖం’ కథ గూర్చి ఇలా అంటారు ‘ ఈ పాతికేళ్ళలో ఆ కథ ఎన్ని మాట్లో చదివాను. నూట ముప్పై రెండు పేజీల కథ. ఇది రాయడానికి నిన్నా మొన్నా మళ్ళీ చదివాను. చదువుతూ మధ్య మధ్య తప్పని పనులు చేస్తూ, అటు ఇటు తిరుగుతూ ఉన్నా.. నేను ఇక్కడ కాకినాడలో మా ఇంట్లో లేను. రష్యాలోని ఒక పల్లెలోని పెద్ద తోట మధ్యలో ఉన్న పాతకాలపు ఇంట్లోనే ఉన్నాను. నేనే కాదు, మీరెవరు ఆ కథ చదివినా ఆ ఇల్లు, అందులో మోగుతూ ఉండే పియానో సంగీతం, పెద్ద పెద్ద కిటికీలకు కట్టిన తెరల పక్కనించి కనిపించే మంచుతో తడుస్తున్న తోటా ఆవహించక మానవు’. మనల్ని కూడా ఆ కథ చుట్టూ తిప్పేస్తారు. అద్భుతమైన ప్రేమ కథను విడమర్చి వివరిస్తారు. టాల్‌స్టాయ్ గారి మరో కథ ‘విషాద సంగీతం’ గూర్చి కూడా రాయలేకుండా ఉండలేకపోయారు. దాని గురించి ‘మెలకువ నిచ్చే అనుభవం ఇది’ అంటూ మనతో ముచ్చటిస్తారు.

రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన ‘ఘారే భరే’ నవల గురించి, దాని ఆధారంగా సత్యజిత్ రాయ్ తీసిన బెంగాల్ సినిమాను చూసిన తర్వాత స్వదేశీ ఉద్యమ నేపథ్యంలో జరిగిన కథ ఇది. మన ప్రాంతంలో జరిగిన ఉద్యమ ఇతివృత్తంతో చలం గారి ‘సుశీల’ కథను గుర్తు చేస్తారు. ‘స్త్రీ స్వేచ్ఛ పురుషుల ప్రేమ కోసం కాదు’ అనే వ్యాసంలో ఇలా అంటారు. ‘స్త్రీలు ఇంటి నుంచి  బయటికి రావాలి ప్రపంచానుభవం కోసం, జ్ఞానానుభవం కోసం. అంతేతప్ప కేవలం పురుషుల కోసం ప్రేమ కోసం వద్దు సుమా అని ఎందుకో మరీ మరి చెప్పాలనిపిస్తోంది’ ఈ వాక్యాలు మనల్ని ఆలోచనలో పడేస్తాయి. ఇంకా ఈ వ్యాస సంపుటిలో ప్రాచీన సాహిత్యంలోని అద్భుతమైన ప్రేమ ఘట్టాలను, మానవీయ కోణంలో ఆలోచించి చెప్పిన తీరుతో ఆకట్టుకుంటాయి.

ప్రకృతి సౌందర్యాన్ని స్త్రీపురుషుల సంబంధాన్ని గురించి ‘ఎన్నటికీ వదలని ఇష్టాలు’, ‘చదువులోని సారం’, ‘అప్పటి ప్రేమ కథలు’, ‘స్త్రీవాదుల అసలు సిసలు మాటలు’ వంటి వ్యాసాలు మనకు తెలియని ఎన్నో విషయాలను తెలుసుకుంటాము. సంస్కృత కవి భాసుడు రాసిన ‘స్వప్న వాసవదత్త’ నాటకం గురించి రాసిన రెండు వ్యాసాల్లో అపూర్వమైన తన అనుభవాలను ముచ్చటిస్తారు. కాటూరి వెంకటేశ్వరరావు సంకలనం చేసిన ‘కావ్య మాల’లో అనసూయ దేవి గారు రాసిన పద్యాలు గురించి ఇలా అంటారు. ‘అనసూయ దేవి పద్యాలు చదివితే నేను మళ్ళీ పాత రోజుల్లోకి వెళ్ళిపోయాను. నిజమే ఆకలితో పసిబిడ్డ స్తన్యం కోసం ముక్కునీ మొహాన్నీ ఏకం చేసుకుని హడావుడి కంగారు గడబిడ పడిపోతూ బుల్లి పెదవుల మధ్య ఇమిడేదాకా పడే అవస్థ. దొరకగానే కంగారు కంగారుగా తాగేసి ఉక్కిరిబిక్కిరి అవడం, ఆయాస పడడం, కాస్త ఆకలి తీరేక నెమ్మదిగా అరమోడ్పు కళ్ళతో నిద్రలోకి జారడం ఇవన్నీ గుర్తొచ్చాయి. కవిత్వం  నన్ను మళ్ళీ బాలింతను చేసింది. అది కదా కవిత్వం అంటే’ అని మాతృ హృదయంతో వివరిస్తారు. పాలగుమ్మి పద్మరాజు గారి హెడ్మాస్టర్ కథ. విమానాల నేపథ్యంతో వచ్చిన పైలెట్ కథ ఇది. ఇదొక పైలెట్ కెప్టెన్ రావు కథ మాత్రమే కాదు మనుషుల మంచితనానికి నెలవైన కథ.

ఈ పుస్తకం నిండా వర్తమాన జీవన సంఘర్షణకు కారణమవుతున్న సమస్యలు ఉంటాయి. వాటిని ఎదుర్కోవడానికి నిన్ను నువ్వు ఎట్లా సన్నద్దం కావాలో సూచించే మార్గాలు ఉంటాయి. అందుకనే వీటిని ఒకటికి పది సార్లు చదివి అవగతం చేసుకోవాలి.  ఇవి  వీరలక్ష్మీదేవి గారిని ప్రభావితం చేసిన రచనలు మాత్రమే కావు, . మనలను కూడా ప్రభావితం చేస్తాయి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. సమాజంలోని మనుషుల్లో సంస్కారవంతమైన ఆలోచనల కోసం అహర్నిశలు కృషి చేస్తున్న సృజనకారులందరు తప్పకుండా చదివి ఆస్వాదించాల్సిన పుస్తకమిది. మనస్సు తరువు బహూకరించిన ఈ ‘కొన్ని శేఫాలికలు’ పరిమళాలను గుండె గదుల్లో పదిలపర్చుకుందాం..!

***

కొన్ని శేఫాలికలు (వ్యాసాలు)
రచన: శ్రీమతి వాడ్రేవు వీరలక్ష్మీదేవి
ప్రచురణ: సాకేత్ ప్రచురణలు
పేజీలు: 240
వెల: ₹250.00
కాపీలకు: అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు
నవోదయ బుక్ హౌస్, కాచీగుడా, హైదరాబాద్.
ఆన్‍లైన్‍లో:
https://www.telugubooks.in/products/konni-shephalikalu
https://www.amazon.in/Shephalikalu-Vadrevu-Veeralakshmi/dp/B0CGXH2DXG/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here