కూచిపూడి నృత్య సంగీత రీతులు!

0
7

[dropcap]న[/dropcap]వ్య నాటక సమితి 65వ వార్షికోత్సవ సందర్భంగా, ‘భారతీయ శాస్త్రీయ నృత్య సంగీతరీతుల’ పరిశోధనాత్మక ప్రసంగ పరంపరలో భాగంగా కూచిపూడి నృత్య సంగీతం మీద, 2023 మే 27వ తేదీ శనివారం నాడు, ఉదయం 9:45 నిమిషాలకు ‘శ్రీకృష్ణదేవరాయ తెలుగుభాషా నిలయం’, హైదరాబాదులో ప్రముఖ నృత్య సంగీత దర్శకులు శ్రీ డి.ఎస్.వి శాస్త్రి గారిచేత అద్భుతమైన ప్రసంగం జరిగింది. వారికి మృదంగం మీద శ్రీ కే.రాజగోపాలచార్య, వయొలిన్ మీద శ్రీ ఆర్ దినకర్, ఫ్లూట్ శ్రీ వి బి ఎస్ మురళి, శ్రీ డి జై కుమార్ ఆచార్య పర్కషన్స్‌తో అద్భుతమైన వాద్య సహకారాన్ని అందించారు. ముఖ్య అతిథి, అసోసియేట్ ప్రొఫెసర్ సంగీత శాఖ, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం డాక్టర్ రాధా సారంగపాణి గారు.  గౌరవ అతిథులు శ్రీమతి జి.వసుంధర, డిప్యూటీ డైరెక్టర్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్, అభినవ సత్యభామ, శ్రీ కళా కృష్ణ, విశ్రాంత ఆచార్యులు, తెలుగు విశ్వవిద్యాలయం డాక్టర్ భాగవతుల సేతురామ్ గారు.

నవ్యనాటక సమితి తనదైన ప్రత్యేకమైన ధోరణిలో, ఈ 65వ వార్షికోత్సవ సందర్భంగా, అటు సంగీతంలోనూ, ఇటు నృత్యంలోనూ అద్భుతమైన లెక్చర్ డిమానిస్ట్రేషన్లతో చాలా అద్భుతమైన కార్యక్రమాలు,  గత కొన్ని రోజులుగా చేసుకుంటూ పోతున్నది.  సాంస్కృతిక సంస్థలంటే కేవలం సన్మానాలు, బిరుదు ప్రదానాలు మాత్రమేగా సాగిపోతున్న నేపథ్యంలోఈ రకంగా కళలకు నిజమైన సేవ అనిపించే ఇటువంటి పరిశోధనాత్మక ప్రసంగాలు, అటు కళాకారులకూ,  కళలనభ్యసించే విద్యార్ధులకూ,  ఇటు సామాన్య ప్రజానీకానికి కూడా మన భారతదేశ సంగీత, నృత్యరీతుల్లో ఉన్న వైశిష్ట్యాన్ని తెలిపినట్లే అవుతుంది. ఆ రకంగా ఈ లలిత కళలకు వారు చేస్తున్న మహోపకారం ఎనలేనిది. గత కొన్ని నెలలుగా శ్రీకృష్ణదేవరాయ భాష నిలయంలో  వీరి ఆధ్వర్యంలో జరుగుతున్న అనేక కార్యక్రమాలను గమనిస్తూ ఉంటే, నిజంగా భాషా నిలయము పునీతమైపోయింది అనిపిస్తుంది. ఈ భాషానిలయాన్ని ఏ ఉద్దేశంతో అయితే మహానుభావులు దాదాపు 122 సంవత్సరాల క్రితం స్థాపించారో, ఆ పెద్దల ఆశయం నెరవేరినట్టు అనుకోవచ్చు. స్వర్గీయ శ్రీ వేమరాజు నరసింహారావు గారు నవ్య నాటక, నవ్య సాహితీ సంస్థలను స్థాపించినప్పుడు, ఎంతటి సదాశయంతో వీటిని రూపకల్పన చేశారో, ఎంతటి ఉదాత్తమైన రీతిలో వాటిని నిర్వహించుకుంటూ వెళ్లారో చూస్తే ఇప్పుడు వారి కుమారుడు శ్రీ వేమరాజు విజయకుమార్ గారు, ఈ ఆధునిక కాలంలో కూడా, అదే హుందాతనంతో, అదే ఉదాత్తతతో అంతకంటే అద్భుతమైన రీతిలో వీటిని ఇలా కొనసాగించడం అన్నది ఎంతో ముదావహమైన విషయం! నాకు వ్యక్తిగతంగా చాలా చాలా ఆనందంగా అనిపిస్తుంది, శ్రీ వేమరాజు విజయకుమార్ గారు సదా అభినందనీయులు! స్వర్గంలో ఉన్న వారి నాన్నగారి ఆత్మఆనందంతో ఆశీస్సుల వర్షం కురిపిస్తుంది!

ఈనాటి శ్రీ డిఎస్‍వి శాస్త్రి గారి ప్రసంగం దగ్గరకు వస్తే, వారి గురించి ప్రఖ్యాత నాట్యాచార్యిణి, డా. అరుణ భిక్షు గారి ప్రసంగంలో చెప్పిన వ్యాఖ్య నాకు గుర్తుకొస్తుంది. శాస్త్రి గారు పాట పాడుతుంటే నర్తకి, కొత్త కొత్త విభిన్న రీతుల్లో, ప్రయోగాత్మకంగా నృత్యాన్ని ప్రదర్శించాలని స్ఫూర్తి కలుగుతుందని అన్నారు. శాస్త్రి గారు అందుబాటులో లేని పరిస్థితిలో తాను నృత్య ప్రదర్శనకు ఇష్టపడనని కూడా చెప్పిన విషయం నాకు గుర్తుకొస్తుంది. శ్రీ డిఎస్‌వి శాస్త్రి గారి గాత్ర మాధుర్యం చెప్పనలవి కాదు. తెలుగు భాషా ఉచ్చారణలో వారికి ఉన్న సాధికారత, వారి సంగీతానికి వన్నెలు దిద్దింది. రకరకాల భావ ప్రకటనలో వారు సంగీతాన్ని మలచుకున్న విధానం, వాడుకున్న విధానం, శ్రోతల్ని ఆనందంలో ఉర్రూతలూగిస్తుంది. చక్కటి సంగీత, నృత్య నేపథ్యమున్న, సంస్కారవంతమైన  కుటుంబం నుంచి వచ్చిన శ్రీ డి ఎస్ వి శాస్త్రి గారు, ఆ లక్షణాలన్నీకూడా వారసత్వ సంపదగా పుణికి పుచ్చుకున్నారు. వారి తాతగారు ఎన్నో యక్షగానాలు రచించిన వాగ్గేయకారులని చెప్పారు. తనకు తెలుగు సంగీతంలో మొదటగా స్వర్గీయ ఘంటసాల గారు, తరువాత డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారూ ఆదర్శమని చెప్పారు.

శాస్త్రీయ సంగీతం, రాగ ప్రధానం, మనోధర్మ ప్రధానం అయితే, నృత్యంలో సాహిత్య ప్రధానం అవుతుందన్నారు. దానికి భాషా ఉచ్చారణ ప్రాణం అన్నారు. నృత్యానికి పాడేటప్పుడు, ఒక రాగంలోంచి మరొక రాగంలోకి వేగంగా మారాలి, వాద్యసహకారం కోసం ఆగకుండా. గాయకుడికి సంగీతం మీద ఎంతో పట్టు వుంటే కానీ సాధ్యం కాదు. అలాగ నృత్యసంగీతం గురించి ఎన్నో విలువయిన విషయాలు చెప్పారు. మోహనరాగం, ఆనందభైరవి, తోడి, హిందోళ రాగాలతో వారు వినిపించినటువంటి చక్కటి కీర్తనలు లయసమన్వితాలై, గాత్ర మాధుర్యంతో అద్భుతంగా అలరించాయి. తాళగతులు మారుస్తూ, చక్కటి జతులతో వారు అందిస్తున్న నట్టువాంగం నర్తకికి ఎంత సహకారం అందిస్తుందో క్షుణ్ణంగా అర్థమైంది. వారికి పక్కనున్న వాద్య బృందం పరిపూర్ణమైన సహకారాన్నిఇవ్వటంతో ఆనాటి సభ ఎంతో రంజికంగా సాగింది.

మండు వేసవిలో మల్లెల జల్లులా,  శీతల చిరుజల్లుల వర్షంలా చాలా చాలా అద్భుతమైన ప్రోగ్రాములు చేసుకుంటూ పోతున్నశ్రీ వేమరాజు విజయకుమార్ గారు సదా అభినందనీయులు! వారికి భగవంతుడు మరింత శక్తి సామర్ధ్యాలనిచ్చి, మరిన్ని మంచి కార్యక్రమాలు వారి చేత జరిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.  వారికి సర్వదా సహకారాన్ని అందిస్తున్న మిత్రులు ప్రఖ్యాత నాట్యాచార్యులు సుధామాల గారు, రోహిణి గారు తదితర నృత్యకళాకారులందరూ అభినందనీయులు! ఈ కార్యక్రమాలు మరింత అద్భుతంగా, ప్రయోజనకారులుగా, మరిన్నిముందు కాలంలో జరగాలని మనస్పూర్తిగా కోరుకుంటూ, ధన్యవాదాలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here