కూతురంటే కూతురే మరి

55
8

[dropcap]“నా[/dropcap] సంతోషం, సుఖం ఏదీ చూసుకోకుండా దీని మీదే ముప్పై సంవత్సరాల నుండీ ప్రాణాలన్నీ పెట్టుకుని, ఒంటరిగా ఉద్యోగం చేసుకుంటూ బ్రతికింది ఈ మాటలు వినటానికా?” అంటూ గుండెలవిసేలా ఏడవసాగింది.

“అక్కా ప్లీజ్ ఏడవకు.. దాని మాటలు పట్టించుకోవద్దు.” అంటూ భారతి కళ్ళు తుడుస్తూ కౌగిలించుకుంది రాణి.

ఒక వారం తర్వాత రాణి బస్సెక్కుతూ “అక్కా.. ఏమీ పట్టించుకోకూ.. అదింకా చిన్న పిల్ల. నీకు వీలైనప్పుడల్లా మా ఇంటికి వచ్చేయి.” అంది.

ఆ రాత్రి పడుకుని ఉండగా కూతురి మాటలు గుర్తొచ్చి గతమంతా కళ్ళ ముందు తిరుగ సాగింది..

***

అప్పుడే పెళ్లి చూపుల కార్యక్రమం అయిపోయి అబ్బాయి, వారి తరఫు వారు ఆటోలు ఎక్కి వెళ్లి పోయారు. అనసూయ, భర్త రాఘవయ్యతో కలిసి వెను తిరిగి ఇంట్లోకి అడుగులు వేసింది.

“అమ్మా.. అక్కకు రంగారావు నచ్చలేదట.” అంది గదిలో నుండీ బయటకు వచ్చిన భారతి చెల్లెలు రాణి.

“ఏమైందిట అబ్బాయికి” చిరాకుగా అంది అనసూయ కూతురు భారతిని చూసి.

“చూస్తే తాగుబోతులాగా వున్నాడు. చూపులు కూడా బాగాలేవు. నాకు వద్దు.” అంది భారతి కోపంగా.

 “సరేలే, పోనీలే అమ్మడు. వేరే సంబందం చూద్దాం” అన్నాడు రాఘవయ్య ప్రేమగా .

 “చాల్లే సంబరం. ఊరుకోండి. మీరిచ్చే కట్నాలకు ఇంతకంటే గొప్ప సంబంధాలు ఎక్కడొస్తాయి. పేకాటకు డబ్బులన్నీ తగిలేయకుండా ఉంటే కాస్తో కూస్తో ఇవ్వగలిగే వాళ్ళం.” అంది గయ్యిన అరుస్తూ.

ఆ మాటతో బయటకు వెళ్లిపోయాడు రాఘవయ్య .

“అమ్మా.. వినవే” అంది భారతి, నిస్సహాయంగా బాధతో

“నోరు మూసుకో.. సినిమా హీరోలొస్తారేంటీ? నీ తర్వాత ముగ్గురున్నారు ఇంకా పెళ్ళికి” పెద్దగా అరిచింది అనసూయ.

అందులో ఒక తల్లి అసహాయత, కోపం కనపడుతూ వుంది.. అది విని భారతి గుండెల్లోనుండీ దుఃఖం ఎగదన్నింది.

ఆ నెలలో ఒక ముహూర్తంలో భారతికి రంగారావుతో వివాహం అతి మామూలుగా వెంకటేశ్వరుడి గుడిలో జరిగిపోయింది.

అత్తారింట్లోకి అడుగుపెట్టింది భారతి. ఇంటి ముందు ఆటో రిక్షా ఒక పక్కన నిలిపి వుంది. ఇల్లంతా వస్తువులు చిందర వందరగా పడివున్నాయి. మూడు గదుల ఇల్లు అది. పొలం గట్టున చిన్నగా కట్టారు. ఇంటి కప్పు వేపు పైకి చూసింది. అక్కడక్కడా పెంకులు పగిలి పోయి, అందులోనుండి సూర్యరశ్మి నేలమీదకు ప్రసరిస్తూ వుంది.

రాత్రి అత్తా, మామలు తినేసి పడుకుండి పోయారు. ఇంట్లోకి వచ్చిన కాసేపటికే బయటకు వెళ్లిపోయిన భర్త కొరకు ఎదురు చూస్తూ మంచం మీద పడుకుంది భారతి.

ఊరికి దూరంగా వున్న సావిత్రి ఇంట్లో నుండీ తల జుత్తు సర్దుకుంటూ బయటకు వచ్చాడు రంగారావు. “జాగ్రత్తగా వెళ్ళు” అని తలుపులేసుకుంది సావిత్రి.

మెల్లిగా అడుగులేసుకుంటూ ఇంటి దారి పట్టాడు రంగారావు. ఊరంతా సద్దుమణిగింది. అక్కడక్కడా కుక్కలు మొరుగుతున్నాయి. వీధంతా నిర్మానుష్యంగా వుంది. జేబులో నుండీ సిగరెట్ తీసి కాలుస్తూ, ఇంటి ముందు తలుపు కొట్టాడు.

అప్పుడే మాగన్నుగా నిద్ర పోయిన భారతి తలుపు చప్పుడుతో ఉలిక్కి పడి లేచింది. వెంటనే గబగబా వెళ్లి తలుపు తీసింది. లోనికి అడుగు పెట్టిన రంగారావు కాస్త తూలి, సంబాళించుకుని వెళ్లి మంచం మీద పడుకున్నాడు.

“భోజనం వడ్డించనా” అంది.

“అవసరం లేదు” అని పక్కకు తిరిగి పడుకున్నాడు రంగారావు. అతని నోటినుండీ నాటు సారా వాసన గుబాళించింది.

వంటింట్లో అన్నీ సర్ది, బాటిల్‍లో నీళ్లు తీసుకుని గది లోకి వెళ్లి చూసింది భారతి. వెల్లకిలా పడుకుని గురక పెడుతూ నిద్ర పోతున్నాడు రంగారావు. నిట్టూర్చి, నీళ్ల బాటిల్ పక్కన పెట్టి పెళ్లి చీర సర్దుకుని పక్కలో ఒరిగింది.

అర్ధరాత్రి మీద పడిన బరువుకి మెలకువ వచ్చింది. పది నిముషాల తర్వాత తన కోరిక తీర్చుకుని పడుకున్న భర్త వేపు చూసింది..

ఉదయం లేచి బయటకు వచ్చేసరికి అత్త రత్తమ్మ ఎదురొచ్చింది. కోడలి వేపు చూసి “పశువులకు దాణా, గడ్డి పెట్టు. ఆ తర్వాత అక్కడున్న గిన్నెలు కడుగు” అంది.

పనులన్నీ పూర్తయ్యేటప్పటికీ మధ్యాన్నం పన్నెండు దాటింది. స్నానం చేసేప్పుడు ఒంటి మీద నీళ్లు పోసుకోగానే ఒళ్ళంతా మంటలు మొదలయ్యాయి. అప్పుడు గుర్తొచ్చింది, ఎంత వారించినా వినకుండా భర్త గోళ్ళతో రక్కి, పళ్లతో కొరికిన విషయం.

అన్నం తిని బయటకు వెళ్ళిపోయాడు రంగారావు.

అత్తా, మామ గారు ఇద్దరూ కలిసి పొలానికి వెళ్లిపోయారు. ఇంట్లో వంటరిగా మిగిలి పోయింది భారతి. ఇంటి బయటకొచ్చి నిలబడి చుట్టూ చూసింది. దూరంగా ఊరు కనపడుతోంది. ఇరుగుపొరుగు ఎవరూ లేరు.

లోపలికి వెళ్లి టీవీ ముందు కూర్చుంది. పాత టీవీ కావటంతో సరిగ్గా కనపడటం లేదు. లేచి ఇల్లంతా శుభ్రం చేయసాగింది.

సాయంకాలం వంట చేసి అత్తా మామ తిన్న తర్వాత బయట మెట్ల మీద కూర్చొని చీకట్లో భర్త కొరకు ఎదురు చూడసాగింది. చల్లగా చలి మొదలయ్యింది. కొంగు వంటి నిండా కప్పుకుని ఆలోచించ సాగింది. ‘పెళ్లి, భర్త గురించి ఎన్ని కలలు కన్నాను? అసలు వైవాహిక జీవితం అంటే ఇంతేనా’ అనుకుంది. కానీ అంతలో గతేడాది పెళ్లయిన వాణి గుర్తొచ్చింది. ‘వాణి ఎంతో ఆనందంగా వుందిగా? పైగా అందంగా కూడా లేదు. మరి నాకెందుకిలా, నేనందంగా వున్నానుగా మరి భర్త అసలు మాట్లాడకుండా ఎందుకుంటాడు’ అని ప్రశ్నించుకోసాగింది.

అందరూ తన అందం పొగిడేవారు ఒకప్పుడు, కానీ భర్త కు తానెందుకు నచ్చలేదు, ఎందుకు పట్టించుకోడు అనుకుంది.

చీకటి పడింది. చాలా సేపు ఎదురు చూసి ఇంట్లోకి వెళ్లి మంచం మీద పడుకోగానే నిద్రతో కళ్ళు మూసుకున్నాయి.

మంచి నిద్రలో ఉండగా ఊపిరి పట్టేసినట్లయి మెలకువ వచ్చింది భారతికి. సగం నిద్రలో వుంది, ఏమీ తెలీటం లేదు. కొద్దిసేపటిలో అర్థం అయ్యింది పైన పడింది భర్త అని. భర్త బరువు తట్టుకోలేక కాస్త పెనుగు లాడింది.

“కదలకు ల.. ము..” అన్నాడు రంగారావు. రెండు రోజులుగా స్నానం లేని అతని ఒంట్లోని దుర్గంధం భరించ లేకుండా వుంది. అతని శ్వాస సారా వాసనను వెద జల్లుతోంది.. తన పశువాంఛ ఎప్పటిలా తీర్చుకుని లేచి, పక్కకు తిరిగి నిద్ర పోయాడు.

పొద్దున్న లేచి తలంటి స్నానం చేసుకుని, బక్కెట్ లో వేణ్ణీళ్ళు పోసి రంగారావు దగ్గరకు వెళ్లి “నీళ్లు పెట్టాను. స్నానం చేయండి” అంది భారతి.

చిరాకుగా చూసాడు భార్య వేపు.

“ఎందుకు. స్నానం చేయకుంటే నాతో పడుకోవా” అంటూ వెకిలిగా నవ్వాడు.

మాట్లాడకుండా వెళ్లిపోతున్న భార్య ను చూసి “అందంగా వున్నాను.. చదువుకున్నాను.. అని నా దగ్గర వేషాలు వేయకు.” అన్నాడు.

వెనుతిరిగి భర్త వేపు బాధగా చూసింది భారతి.

“కట్నం ఇవ్వక పోయినా, పోనీలే అని చేసుకున్నాను. అది మరవకు” అన్నాడు పళ్ళు నూరుతూ.

వారం తర్వాత ఒక రోజు పోస్ట్‌లో వుత్తరం వచ్చిందంటూ పోస్ట్‌మ్యాన్ అరిచాడు. వెళ్లి తీసుకుని చూసింది. పైన తన పేరే ఉండటంతో సంతోషంగా విప్పి చదవసాగింది. పూర్తి చేసిన తర్వాత ఆమె మొహంలో రంగు వెలిసి పోయింది.

ఆ రోజు రంగారావు త్వరగా ఇంటికి వచ్చాడు. ఆ వచ్చిన ఉత్తరం అతని చేతిలో పెట్టింది. అది చదివి “ఇంతకూ వీడెవడు?” అన్నాడు కోపంగా.

“నాకు తెలీదు” అంది.

“తెలీకుంటే నీకు ప్రేమలేఖ ఎందుకు రాసాడు చెప్పు, ఇంతకీ నీ ఉద్దేశం ఏమిటి” కాస్త గట్టిగా అరిచాడు..

భయంతో అతడిని చూసి “నిజంగా తెలీదు ఎవరో. ఎవరు రాశారో నాకర్థం కావట్లేదు” అంది.

ఆమె మొహంలో కంగారు, భయం చూసి మనసులో నవ్వుకున్నాడు రంగారావు. సంతోషాన్ని అణుచుకుంటూ బయటకు మాత్రం కోపంగా చూసి “ఇవీ వున్నాయన్న మాట. ఇంకా ఎన్ని కళలు ఉన్నాయో నీ దగ్గర” అన్నాడు అదో రకంగా చూసి.

“అయ్యో అవేం మాటలు. నాకలాంటివేవీ లేవు” అంది ఆందోళనగా.

“రేపు మీ అమ్మా, నాన్న లకు ఫోన్ చేస్తాను ఇలాగయితే” అన్నాడు బెదిరింపుగా.

“స్నానానికి నీళ్లు తోడనా.. నాలుగు రోజులయ్యింది స్నానం చేయకుండా” అంది.

“నా బదులుగా నువ్ చేస్తున్నావుగా.. త్వరగా రా. మొగుడు వున్నాడని అక్కడే ఆలస్యం చేయకు” అని పడక గదిలోకి వెళ్లి పోయాడు.

ప్రతీ రాత్రి జరిగే ఆ భయంకర నరకానికి మనసుని గట్టి చేసుకుని గది లోకి వెళ్ళింది భారతి.

ఆ నెలంతా అదే విధమైన ఉత్తరాలు రావటం, అవి చూసి రంగారావు వెర్రెత్తి పోయి అరవటం జరిగింది.

ఒక రోజు ఎందుకో కడుపులో తిప్పినట్లుగా అనిపించి ఏమీ తినకుండా పగలు అలాగే పడుకుంది భారతి. కాసేపటిలో కడుపులో తిప్పి వాంతులు మొదలయ్యాయి. అప్పుడు గుర్తొచ్చింది భారతికి, తనకు నెల రోజులుగా నెలసరి కాలేదని.

మనసంతా దిగులు అలుముకుంది. మెల్లిగా కడుపు నిమురుకుంది.

ఆ రాత్రి రంగారావు భోజనం చేస్తుండగా మెల్లిగా చెప్పింది.

అతని మొహంలో సంతోషం కనపడ లేదు. ముభావంగా అన్నం తిని లేచి వెళ్లి పడుకున్నాడు.

భారతి గుండెలు బరువుగా వున్నాయి. పడుకుని ఆలోచిస్తున్న భర్త పక్కలో పడుకుని కళ్ళు మూసుకుంది.

అప్పుడన్నాడు రంగారావు “ఎన్నో నెల?”

“ఒకటవ నెల”

“నీ ప్రేమికుడికి చెప్పావా?” అన్నాడు ఎకసెక్కంగా.

ఏమీ సమాధానం చెప్పకుండా మళ్ళీ కళ్ళు మూసుకుంది భారతి.

“పట్నం వెళ్లి డాక్టర్ ను కలుద్దాం” అన్నాడు పైన ఇంటి కప్పును చూస్తూ.

“సరే ఎప్పుడు వెళదాం. మందులుకూడా వాడాలి” అంది తృప్తిగా.

“మందులు అవసరం లేదు. కడుపు తీసేయటానికి మందు లెందుకు” అన్నాడు.

ఉలిక్కి పడి లేచి కూర్చుంది భారతి. “ఎందుకు” అంది నీరసంగా. ఆమె గొంతులో ఎక్కడా బలం లేదు.

“నాకిప్పుడే పిల్లలు అవసరం లేదు.” అన్నాడు కర్కశంగా.

పక్కకు తిరిగి కళ్ళు మూసుకుని నిద్ర పోవటానికి యత్నించింది.

ఉదయాన్నే మెలకువ వచ్చి తనకు వస్తున్న ఉత్తరాల గురించి ఆలోచించ సాగింది. కాసేపటికి వెళ్లి ఆ ఉత్తరాలన్నీ తీసి మళ్ళీ చదవ సాగింది. వాటి పై నున్న పోస్ట్ ఆఫీస్ స్టాంప్ చూసింది. రెండు వైపులా ఒకే ఊరి స్టాంప్‍లు వున్నాయి.

అప్పుడొచ్చింది అనుమానం. రంగారావు రాసుకుంటున్న లెక్కల పుస్తకం తీసి చూసి విస్తుపోయింది. తన కళ్ళను తానే నమ్మలేక పోయింది. ఉత్తరాల దస్తూరి రంగారావు దస్తూరి పూర్తిగా ఒకేలా వుంది.

గబ గబా వెళ్లి రంగా రావు ముందు ఆ రెండు పెట్టి, “చూడండి ఇవి మీరే రాశారు కదూ?” అంది.

వాటిని తేరిపార చూసి లేచి నిలబడి పెద్దగా అరుస్తూ భారతి చెంప పగిలేలా అరచేతిని విసిరాడు.

ఆ దెబ్బ తాకిడికి, కెవ్వున అరచి దూరంగా కింద పడిపోయింది భారతి.

ఆ అరుపుకి పరుగెత్తుకొచ్చిన రత్తమ్మ కోడలిని లేపి బయటకు తీసుకెళ్లింది.

మెట్ల మీద అత్తను పట్టుకుని చాలా సేపు ఏడిచింది భారతి.

“పదివేలు పడేసి లాయర్‍తో డివోర్స్ తెప్పించేగలను.. ఏమనుకున్నావో” అంటూ వీధిలోకి వెళ్ళిపోయాడు రంగారావు.

“అత్తమ్మా.. నేను పుట్టింటికెళ్తాను, నేనుండను” అంది వెక్కి వెక్కి ఏడుస్తూ.

“సరేనమ్మా.. పెళ్లి చేస్తే వీడు బాగవుతాడు అనుకున్నాం. మాదే తప్పు. నిన్ను బస్సెక్కిస్తాను. వాడికి నేను చెప్తాలే. జాగ్రత్త. ఒత్తి మనిషివి కాదు. కొద్దీ రోజులుండి వచ్చెయ్యి. ఈ లోగా వాడికి తెలిసొస్తుంది” అంది నోట్లో కొంగు పెట్టుకుని.

ఆ రోజు అన్నం తిని బస్సెక్కి కూర్చుని, అది కదలగానే వెనక్కి వెళ్ళిపోతున్న ఊరిని బస్సు టైర్ల దుమ్ములో నుండీ చూడ సాగింది.

ఇంట్లోకి అడుగు వేసి బ్యాగ్,  సూటుకేస్ ముందు గదిలో పెట్టగానే తల్లి వంట గదిలోనుండీ వచ్చి చూసి “ఏంటే ఇలా చెప్పా పెట్టకుండా వచ్చేసావు” అంది. కూతురి మొహం చూడగానే ఆమె మనసు ఏదో కీడు శంకిస్తూ వుంది.

తల్లిని బాధగా చూసింది భారతి. “ముందు నా క్కాస్త అన్నం పెట్టు” అంది.

పళ్లెంలో పెట్టిన అన్నం కడుపు నిండా తిని చాప పరుచుకుని పడుకుంది భారతి.

“నెల తప్పింది” అంది తల్లి వేపు చూసి.

“అదేమిటీ అలా చెప్తావు. ముందు కాస్త దాని నోట్లో కాస్త పంచదార వేయండి” అంది కూతుళ్లను చూసి.

“అదేమీ అక్కరలేదు” అంది నీరసంగా.

“ఏమైయ్యిందే, బావ రాలేదా” అడిగింది రమ్య, భారతి భుజం పట్టుకుని.

అంతలో రాఘవయ్య ఇంట్లోకి వచ్చాడు. తండ్రిని చూడగానే వెంటనే వెళ్లి గట్టిగా కౌగిలించుకుంది భారతి.

“ఎప్పుడొచ్చావమ్మా.. అంత బాగేనా?” అని తల నిమిరాడు.

ప్రేమ, ఆప్యాయత కరువైపోయిన భారతి గుండె ఆ మాటతో కరిగి పోయి, తండ్రిని గట్టిగా పట్టుకుని రోదించసాగింది.

ఏనాడు కూతురి కన్నీళ్లను ఆ విధంగా చూడని తండ్రి గుండెలు జారిపోయాయి.

“ఏమైయింది రా అమ్మా చెప్పు.. ఏడవకు.. నా తల్లీ” అని సముదాయించసాగాడు. అతని గుండె నీరయిపోయింది.

“నెల తప్పిందనగానే కొట్టాడు నాన్నా.. డివోర్స్ ఇస్తానన్నాడు.. రోజూ నరకమే” అంటూ వివరంగా చెప్పసాగింది.

అవి విని అక్కడున్న కుటుంబం మొత్తం కొయ్యబారి పోయింది. అనసూయ కాళ్లలో నీరసం వచ్చి కింద కూలబడింది.

ముందుగా తేరుకున్న రాఘవయ్య “నువ్వేం బాధపడకు తల్లి, నేనున్నానుగా, అంతా చూసుకుంటా” అని భారతికి చెప్పి, వెనక్కి భార్య వేపు తిరిగి “రేపు డాక్టరమ్మ దగ్గరకు తీసుకెళ్లి ఆరోగ్యం చూపించి, ఏమేం వాడాలో రాయించుకో” అన్నాడు.

తండ్రి మాటలు విన్న భారతి బరువుగా ఊపిరి పీల్చుకుంది. భారతికి ఒక నెల రోజులు ప్రశాంతంగా గడిచిపోయాయి. ఒక రోజు పొద్దునే విడాకుల నోటీసు అందుకుంది భారతి.

అమ్మ, నాన్నా, చెల్లెల్లు అందరూ భారతి ముందు కూర్చుని ఆలోచిస్తున్నారు.

“అతను కావాలని నన్ను హింసిస్తున్నాడు. వారం పాటు స్నానం చేయడు, కొన్ని రోజులు పళ్ళు తోముకోడు, పశువు లాగ మీద పడి నరకం చూపిస్తున్నాడు. నేను బ్రతకలేను నాన్నా. మీకు బరువైతే ట్రైన్ కింద పడి చస్తాను’’ అంది భారతి.

“అలా అంటే ఎలాగే.. ఇంకా ఇద్దరు అమ్మాయిల పెళ్లిళ్లు కావాలి.” అంది అనసూయ.

“బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలమ్మా.. తొందరేం లేదు. నువ్వే ట్రైన్ కింద పోవాల్సిన అవసరం లేదు. ధైర్యంగా ఉండాలి” అన్నాడు రాఘవయ్య కళ్ళు మూసుకుని ఆలోచిస్తూ.

“అమ్మాయి కడుపులో పెరుగుతున్న బిడ్డ సంగతెలా” అంది అనసూయ

ఎవరూ మాట్లాడ లేదు.

అప్పుడంది అనసూయ “రెండవ నెలే కదా ఎవరికీ తెలీకుండా తీయించేద్దాం” కూతురి కళ్ళలోకి చూడకుండా.

“పుట్టిన బిడ్డను నేను పెంచుకుంటాను” అంది భారతి దృఢమైన స్వరంతో.

నమ్మలేనట్లుగా చూసారందరూ.

“అవును. నాతో బాటు నాకు పుట్టిన బిడ్డ ఉంటుంది. నా బిడ్డను చంపనివ్వను.” అంది భారతి.

“డివోర్స్ అయ్యాక బాబో, పాపో పుడితే మళ్ళీ నీకు పెళ్లి చేయాలంటే కష్టం. లేని పోనీ ఇబ్బందులు తేవద్దు” అంది అనసూయ కూతుర్ని హెచ్చరిస్తూ.

“నా పెళ్ళితోటే నా బ్రతుకు అయిపోయింది. ఇంకో పెళ్లి నాకసలు వద్దు. ఇంకొకడితో మళ్ళీ ఈ బాధలు పడలేను. చాలు.. నాకు ఈ జీవితానికి సరిపడే శిక్ష పడింది. మళ్ళీ ఆ వచ్చే వాడితో కొత్త నరకం నా వల్ల కాదు” అని కరాఖండిగా చెప్తున్న కూతురుని చూసి “సరేనమ్మా” అని చెప్పి అందరి వంక చూసాడు రాఘవయ్య, ఎవరూ మాటలాడ వద్దని సైగ చేస్తూ.

కాల చక్రం ఎవరికోసం ఆగకుండా రివ్వున తిరిగి పోతూ వుంది. నాన్న ఇస్తున్న ధైర్యంతో రోజులు గడుపుతోంది భారతి.

ఒక రాత్రి నొప్పులు మొదలయ్యాయి . వెంటనే ఆసుపత్రి లో చేర్పించారు భారతిని. తెల్లారేసరికి పండంటి అమ్మాయిని ప్రసవించింది.

***

ఇక తన జీవితం ఎలా బాగుపడాలి అని బాగా అలోచించి గట్టి నిర్ణయం తీసుకుంది భారతి. కానీ అది ఇన్నేళ్ల తర్వాత సాధ్యమేనా అని భయపడింది. అది చేయగలనా? అని ఆలోచించింది.

చెల్లెలు రాణిని పిలిచి “డిగ్రీ పుస్తకాలున్నాయా నీవి?” అడిగింది.

“ఎందుకే” అంది రాణి.

“మూడు సంవత్సరాల డిగ్రీ పరీక్షలు ఒకటే సారి రాసేస్తాను” అంది భారతి.

“కష్టం అక్కా” అంది రాణి అనుమానంగా.

“రాస్తాను “అంది భారతి.

ఆమె గొంతులో పట్టుదల చూసి మౌనంగా ఉండిపోయింది రాణి.

ఆ పట్టుదలే భారతి జీవితానికి మంచి దారి చూపిస్తుందని ఎవరూ ఊహించలేక పోయారు.

కూతురి పేరు స్వాతి అని పెట్టింది భారతి. దగ్గరలో తెలిసిన లెక్చరర్ దగ్గరకు వెళ్లి కొన్ని సబ్జక్ట్స్ చెప్పించుకుంది. పాప నిద్ర పోయే సమయంలో పుస్తకాలు చదువుకుంటూ, ఇంటి పనిలో అమ్మకు సహాయం చేస్తూ ఉండగా సంవత్సరం గడిచి పోయింది.

రాత్రుళ్ళు అందరూ నిద్ర పోయాక కూడా పుస్తకాలు ముందేసుకుని రాస్తూ కూర్చుంది భారతి. మధ్య రాత్రులు అప్పుడప్పుడు రాఘవయ్య వచ్చి చూసి వెళ్లిపోయేవాడు.

భారతి మాత్రం ఎప్పుడూ తన బాధను వెలిపుచ్చేది కాదు. తప్పటడుగులు వేస్తున్న కూతురిని చూసి అన్నీ మర్చిపోయేది. డిగ్రీ పాస్ అయినట్లుగా ఫలితాలు వచ్చాయి. వాటిని చూసి నిర్లిప్తంగా ఉండిపోయింది భారతి.

అప్పుడు భారతి తన జీవితంలో బావ రఘు రూపంలో ఒక కొత్త కోణం చూసింది.

మరుసటి రోజు వార్తా పత్రికలో పడిన ఉద్యోగావకాశాలను చూసి పెన్సిల్‍తో రాసుకోసాగింది భారతి. ఆ సమయంలో ఇంట్లోకి చిరునవ్వుతో అడుగు పెట్టాడు మేనబావ రఘు.

అతన్ని చూసి “ రండి.. బావా .. అందరూ క్షేమమేనా” అంది భారతి.

“ఏంటలా చిక్కి పోయావు? ఎలా వుండేదానివి” అన్నాడు రఘు కాస్త బాధగా.

“జీవితమంటే అంతే.. ఒకసారిలా మరొక సారి అలా.. కూర్చో కాఫీ తెస్తాను” అంది నవ్వలేక నవ్వుతూ.

అప్పుడే నిద్ర లేచి కూర్చున్న కూతురిని చేతుల్లోకి తీసుకుని “నా కూతురు” అంది భారతి.

“ఇలా ఒంటరి జీవితం ఎలా? “ అన్నాడు రఘు.

నిర్లిప్తంగా రఘుని చూసింది భారతి.

“ఎవరూ లేరా..ఇంట్లో” అన్నాడు.

“పొలం వెళ్లారు” అంది.

“నువ్వేం బాధ పడకు.. నేను చూసుకుంటా నిన్ను” అన్నాడు రఘు.

అతని గొంతులో తేడా గమనించిన భారతి తీక్షణంగా చూసిందతడి కళ్ళలోకి.

“సరే మీ ఆవిడతో కలిసి మాట్లాడుతాను ఈ విషయం” అంది.

భారతి గొంతులోని కోపాన్ని గ్రహించిన రఘు తత్తరపడి లేచి నుంచుని “మళ్ళీ కలుస్తాను” అని బయటకు అడుగులు వేసాడు.

వెనక్కి చూడకుండా వెళ్తున్న అతడిని చూసి గమ్మత్తుగా నవ్వుకుంది భారతి.

ఇంట్లో ఒక్క క్షణం ఆగకుండా అల్లరితో కలియ తిరుగుతున్న చిన్న పాపతో అందరికీ రోజంతా సంతోషంగా గడిచి పోతూ వుంది.

ఎన్నో ఉద్యోగ పరీక్షలు రాస్తూ వుంది భారతి కానీ వాటి ఫలితాలు రావటం లేదు.

వారం తర్వాత ఇంటికొచ్చిన చిన్ననాటి స్నేహితురాలు లతతో కూర్చుని “మీ ఆఫీస్‍లో ఏదైనా పని ఉంటే చెప్పు లత” అంది.

“ఉంటాయి.. కానీ జీతం చాలా తక్కువగా ఉంటుంది. చేయగలవా” ప్రశ్నించింది.

“చేస్తాను.. ఏదో ఒకటి చేసుకోవాలి కదా.. ఇలా ఎన్ని రోజులుంటాను” అంది భారతి.

“రేపు కనుక్కుని చెప్తాను” అంది లత.

రెండు రోజుల తర్వాత లత చెప్పినట్లుగా ఆఫీస్‍కు బయలు దేరింది భారతి. వెళ్లే ముందు కూతురికి పాలిచ్చి, తాను బయటకు వెళ్తుంటే గుక్క పట్టి ఏడుస్తున్న కూతురిని వెనక్కి తిరిగి చూసి, గుండెలు మెలి తిప్పుతుంటే, మనసుని గట్టి చేసుకుని ఆఫీస్ వేపు అడుగులు వేసింది.

అక్కడ తన అందమే తన శత్రువు అవుతుందని తెలీదు భారతికి. అదొక చిన్న ఫైనాన్స్ ఆఫీస్. అందరికీ అన్ని పనులు చేసి పెడుతూ చలాకీగా వుంది భారతి.

మధ్యలో గుండెలు బరువెక్కి, తట్టుకోలేక ఇంటికి వెళ్లి కూతురికి పాలిచ్చి వచ్చేది. మొదటి నెల గడిచి జీతం చేతిలో తీసుకుని ఇంటికి వెళ్లి నాన్న ముందు పెట్టింది.

“నీ దగ్గర ఉంచుకుని నీకవసరమైన వాటికి ఖర్చు చేసుకో” అన్నాడు రాఘవయ్య కూతురిని ప్రేమగా చూసి. అతని గుండె చెరువయ్యింది. బయటకు వస్తున్న దుఃఖాన్ని అదుపు చేసుకుని మొహం దాచుకున్నాడు.

నాలుగు నెలలు అలా గడిచి పోయాయి. ఆ రోజు ఆఫీస్‍లో కంపెనీ ఓనర్ ముందు కూర్చుని ఫైల్ ముందు పెట్టింది భారతి.

ఒక సెకను భారతిని చూసి “మీ కుటుంబ విషయాలు తెలిసి బాధ అనిపించింది” అన్నాడు జాలిగా.

తల వంచుకుంది భారతి.

“ఇంత అందంగా వున్నారు. మీ ఆయన ఎందుకలా చేసాడు, ఏంటి ప్రాబ్లెమ్” అన్నాడు భారతి తినేసేలా చూస్తూ.

అతని చూపులను గమనించిన భారతి కొంగు సరి చేసుకుంది.

“రేపు నేనింట్లో వుంటాను ఒక్కడినే. మా ఆవిడ లేదు. మీరు రాగలరా.. రేపు ఆఫీస్ కు రానవసరం లేదు. జీతం రెట్టింపు చేస్తాను. నీకు అన్నింటికీ నేనుంటాను” అన్నాడు చిన్నగా ఎవరికీ వినపడకుండా వెకిలిగా నవ్వుతూ.

అతన్ని భయంగా చూసింది భారతి.

ఒక వెర్రి నవ్వు నవ్వి నున్నని బట్ట తలను తడుముకుని, లావాటి కళ్ళద్దాలను సరి చేసుకున్నాడు అతను.

లేచి నిలబడి ఫైల్ తీసుకుని కేబిన్ లో నుండీ బయటకు వచ్చింది భారతి. కాళ్లల్లో బలం కోల్పోయినట్లు గా అనిపించి వెళ్లి తన కుర్చీలో కూలబడింది.

మరుసటి రోజు పొద్దున “ఏంటమ్మా ఆఫీస్‍కు టైం అవుతోంది.. చూసుకో “అంది అనసూయ, కూతురితో ఆడుకుంటున్న భారతిని చూసి.

“లేదమ్మా.. ఆ ఆఫీస్‍లో పని లేదు. మరొకటి వెదుక్కోవాలి” అంది తల్లి వేపు చూడకుండా.

ఆరు నెలలు గడిచి పోయాయి. ఏ ఉద్యోగం రాలేదు. జీవితం మీద ఆశ పోగొట్టుకుంది భారతి. ఒక రాత్రి నిద్ర పట్టలేదు భారతికి. పెళ్ళికి తాను కన్న కలలు గుర్తొచ్చాయి. చాలా సేపు బాధతో కళ్ళలో నుండీ నీరు కారిపోతూనే వున్నాయి. అందరూ నిద్ర పోయాక వెళ్లి చెరువులో దూకేయాలని లేచి నిలుచుంది భారతి. మంచాల మీద పడుకున్న చెల్లెళ్లను చూసి చప్పుడు కాకుండా, కూతురిని చేతుల్లోకి ఎత్తుకుంది. తనతో బాటు ముద్దులొలికే కూతురిని తీసుకెళ్లాలా వద్దా అని ఆలోచించింది. వదిలేసి తాను చనిపోతే తల్లి లేని కూతురిని ఎవరు చూస్తారు అనే ఆలోచన వచ్చి ఆగి పోయింది. కూతురితో బాటే చనిపోవటం మంచిదనుకుని, చేతుల్లో ముడుచుకుని పడుకున్న కూతురిని చూసింది. నిశ్చింతగా నిదురిస్తున్న కూతురిని చూసి మౌనంగా రోదిస్తూ గట్టిగా గుండెలకు హత్తుకుని కూర్చుండి పోయింది. ‘భగవాన్ నేను చేసిన పాపం ఏమిటి? నాకో దారి చూపించు’ అని గోడకు బిగించిన దేవుడి పటం చూసి మొక్కి కూతురిని గట్టిగా కౌగలించుకుని నిద్ర పోవటానికి యత్నించింది.

మరుసటి రోజు ఉదయం పోస్ట్‌మ్యాన్ తెచ్చిన ఉత్తరం చూసి సంతోషంతో కళ్ళలో నీరు తుడుచుకుని “నాన్నా.. నాకుద్యోగం వచ్చింది. ప్రభుత్వ ఉద్యోగం!” అని చెప్పి నాన్న చేతిలో ఆ ఉత్తరం పెట్టింది.

“ఎక్కడా.. ఏ వూరిలో” అన్నాడు రాఘవయ్య సంతోషంగా.

భారతి చెప్పిన వివరాలు విని “అంత దూరం అయితే ఎలా.. ఒంటరిగా ఉండాల్సి వస్తుంది కదమ్మా” అన్నాడు దిగాలుగా.. అన్నీ వింటున్న అనసూయ వచ్చి కూతురిని సంతోషంతో వాటేసుకుంది.

“ఏమీ కాదులే నాన్నా, ఎలాగైనా నాది ఒంటరి బ్రతుకే” అంది నవ్వుతూ.

అనసూయ కూతురిని పట్టుకుని సంతోషంతో ఏడవసాగింది. బయటనుంచి వచ్చిన చెల్లెళ్ళు కూడా ఆ ఉత్తరం చదివి కళ్ళలో నీరు కారిపోతుండగా అక్క చేతులు పట్టుకుని “కంగ్రాట్స్ అక్కా” అన్నారు.

“అంతా దేవుడి దయ” అని తృప్తిగా, కళ్ళు తన కొంగుతో తుడుచుకుంటూ దేవుడి పటం కేసి చూసింది. దేవుడు నవ్వుతూ కనిపించాడు

***

ఆఫీస్‌లో కూర్చున్న కాసేపటిలో, అక్కడ మొత్తం అయిదుగురు ఉద్యోగులు, అందులో తనతో కలిపి ఇద్దరు తప్ప మిగతా అందరూ పురుషులేనని తెలుసుకుంది భారతి. తన పక్క సీట్లో కూర్చున్న సీతను అడిగింది “ఇక్కడ ఇల్లేదైనా కిరాయికి దొరుకుతుందా” అని.

“చిన్న ఊరు కదా. కష్టం. కనుక్కుందాం. అంత వరకూ కొద్ది రోజులు మా ఇంట్లో వుండండి” అంది సీత. సీత ఇంట్లో కొన్ని రోజులు వుండి ఆ తర్వాత వేరే చిన్న ఇంట్లోకి మారి పోయింది భారతి.

వారాంతానికి ఊరికెళ్ళి ఇంట్లోకి అడుగు పెట్టి అనసూయ చేతుల్లో నుండి కూతురిని ఎత్తుకుని ముద్దులు కురిపించింది.

మరుసటి రోజు టిఫిన్ చేస్తూ “నాన్నా, ఇక పాపను తీసుకెళ్తాను” అంది అందరి వంక చూస్తూ.

తృప్తిగా కూతురిని చూసి లేచి వెళ్లి ఒక కవర్ భారతి చేతులో పెట్టి “ఇదుగోమ్మా డివోర్స్ కాగితాలు, లాయరు పంపించాడు” అన్నాడు రాఘవయ్య.

కవర్ తీసుకుని ఒక నిట్టూర్పు విడిచింది భారతి.

రెండవ రోజు కూతురిని వెంటబెట్టుకుని వెళ్లిపోయింది భారతి. భారతికి ఒక దారి దొరకటం ఇంట్లో అందరికీ ఊరట కలిగినప్పటికీ, ఒంటరిగా ఎలా ఉంటుందోనని మనసులో భయం మొదలయ్యింది.

భారతి పని చేసే ఊరు చిన్నదవటం మూలాన పాపను తాను లేని సమయంలో చూసుకొనటానికి రంగమ్మ అనే పెద్దావిడ సులభంగానే దొరికింది.

రెండు నెలలు ప్రశాంతంగా గడిచి పోయాయి. కానీ అది తుఫాను ముందు వుండే ప్రశాంతత మాత్రమే.

ఇంతలో ఎవరో తలుపు కొడుతున్నచప్పుడయింది.

“ఎవరూ” అని తలుపు వేపు చూసింది భారతి.

ఖద్దరు బట్టలు వేసుకున్న ఒక మధ్య వయస్కుడు నవ్వుతూ కనపడ్డాడు.

“ఎవరండీ, ఎవరు కావాలి?” అంది భారతి.

“నేను ఈ వూరికి సర్పంచ్‍ను. నా పేరు రాములు. మిమ్మలిని కలిసి పోదామని వచ్చాను.” అన్నాడు.

“రండి లోపలికి” అని చెప్పి కుర్చీ వేపు చూపించి కూర్చోమన్నట్లుగా సైగ చేసి.

దర్పం చూపిస్తూ కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నాడు రాములు.

“చెప్పండి” అంది భారతి ఎదురుగా వున్న ఇంకొక కుర్చీని దూరంగా జరుపుకుని కూర్చుంది.

“ ఏమీ లేదండి.. అలా ఒక సారి పలకరించి పోదామని వచ్చాను.” అన్నాడు చిన్న చిరునవ్వుతో.

అతని వాలకంలో ఏదో తేడా గమనించిన భారతి మొహం కాస్త గంభీరంగా పెట్టి “ఏదైనా పని ఉంటే ఆఫీస్‍కు రండి” అంది.

“నాకేమీ అవసరం లేదండి. మీరు కొత్తగా వచ్చారని, ఒక్కరే ఉంటారని తెలిసి కలిసి పోదామని వచ్చాను” అన్నాడు. అతని స్వరంలో యేవో అర్థాలు గోచరించాయి భారతికి.

“సరేనండి, నాక్కాస్త పనుంది” అంది లేచి నిలబడి.

“అలాగేనండి. మీవారెక్కడ?” అన్నాడు.

సమాధానం చెప్పే ఇష్టం లేనప్పటికీ బలవంతంగా అంది “మా వూర్లో వున్నారు”.

“ఏదైనా అవసరం ఉంటే కాల్ చేయండి, ఇదుగో నా కార్డు” అని వెకిలిగా నవ్వి, విజిటింగ్ కార్డు తీసి అక్కడున్న టేబుల్ పైన ఉంచి బయటకు అడుగులు వేసాడు రాములు.

అతను బయటకు వెళ్ళగానే ఆ కార్డు తీసి చెత్త బుట్టలో పారేసింది భారతి.

ఒక రోజు అనసూయ, రాఘవయ్య ఇద్దరూ భారతి ఇంటి ముందు ఆటో దిగారు. తల్లిదండ్రులతో వారం రోజులు హాయిగా గడిచి పోయాయి.

“రేపు మేమిక వెళ్లొస్తాం రా” అన్నాడు రాఘవయ్య భోజనం చేసి కూర్చుంటూ

“మళ్ళీ ఎప్పుడొస్తారు నాన్నా” అంది భారతి.

“వస్తాము లే కానీ ఒక విషయం మాట్లాడదామని వచ్చాము” అంది అనసూయ.

“ఏమిటమ్మా” అంది భారతి భృకుటి ముడివేసి.

“ఇలా ఒంటరి జీవితం ఎన్నాళ్ళు.. నీకు సంబంధాలు వస్తున్నాయి” అంది అనసూయ

“ఎందుకని.. ఉద్యోగం ఉందని వస్తున్నారా.. మరి నా కూతురుని చూసుకుంటారా?” అంది.

“నీ కూతురిని మేము చూసుకుంటాం. దాని గురించి వదిలేయి” అంది అనసూయ.

“నాకే పెళ్లి అవసరం లేదు. ఎవరు చేసుకున్నా సరే నా కూతురిని బాగా చూసుకుంటారని గ్యారెంటీ లేదు. నాకు ఈ జీవితానికి కూతురు చాలు.” అంది.

రాఘవయ్య మౌనంగా కూర్చుండి పోయాడు.

కాసేపటికి మళ్ళీ అంది భారతి “ఇక మీరు చెల్లెళ్ళ పెళ్లి సంబంధాలు చూడండి. నా జీవితం ఇలాగే చిన్న ఊరిలో ప్రశాంతంగా గడిపేస్తా” అంది.

అలాగే ప్రశాతంగా జీవితం గడుస్తుందని అనుకుంది భారతి. కానీ అలా జరగ లేదు.

ఒక రాత్రి మంచి నిద్రలో వుంది భారతి. అర్ధరాత్రి వున్నట్లుండి మెలకువ వచ్చి లేచి కూర్చుంది. ఎవరో పిలుస్తున్నట్లుగా అనిపించింది. మగత నిద్రలో ఏమీ అర్థం కాక తలుపు వేపు చూసింది. చిన్నగా ఎవరో తలుపు తడుతున్నారు.

“ఎవరూ?” అంది.

సమాధానం రాలేదు బయట నుండీ. గుండెలు వేగంగా కొట్టుకుంటుండగా వెళ్లి తలుపు తీయ కుండా మళ్ళీ ప్రశ్నించింది “ఎవరు” అని.

చిన్నగా గుస గుస గా వినిపించింది “నేనే.. రాములు..తలుపు తీయండి.”

“ఏంటి ఈ సమయంలో.. ఉదయం రండి’’ అంది కరకుగా.

“చెపుతాను.. ప్లీజ్ తలుపు తీయండి. ఎవరూ చూడటం లేదు.. భయం అక్కర లేదు.. కొద్దీ సేపుండి వెళ్ళిపోతాను ప్లీజ్” అన్నాడు

“మర్యాదగా చెప్తున్నాను వెళ్ళండి” అంది భారతి చిరాకుగా, తలుపు దగ్గరగా నిలబడి.

“నిన్ను, నీ కూతురిని కూడా బాగా చూసుకుంటాను.. తలుపు తీయ్” అన్నాడు మెల్లిగా.

కాసేపు ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది భారతి. తలుపు పక్కన వుండే కిటికీ తీసి, ఊపిరి గుండెల నిండా పీల్చుకుని “దొంగా దొంగా..దొంగా” అని అరవసాగింది.

బెంబేలెత్తి పోయాడు రాములు. వెంటనే అక్కడ నుండీ పరుగు లంకించుకున్నాడు. పడుతూ లేస్తూ పరుగెడుతున్న అతన్ని చూసి కడుపుబ్బ నవ్వసాగింది భారతి. అలా నవ్వుతూ నవ్వుతూనే కడుపులోనుండీ ఎగతన్నిన దుఃఖం గొంతులో పెద్ద చప్పుడుతో బద్దలయ్యింది.

చుట్టుపక్కల వాళ్ళు తలుపులు తీసుకుని బయటకు రాసాగారు. కళ్ళలోని నీరు తుడుచుకుని తలుపు తీసుకుని బయటకు వెళ్ళింది భారతి. ఎవరో తలుపు తీయటానికి ప్రయత్నిస్తుండటం గమనించి భయంతో అరిచానని చెప్పింది. కొందరు చుట్టూ చూసి వచ్చారు. కాసేపటికి అందరూ వెళ్లిపోయారు.

ఎవరి కైనా కాస్త చనువిచ్చి స్నేహంగా మసలుకుంటే, కొద్దినాళ్ళలో రెండవ పెళ్లి ప్రస్తావన తేవటం, కూతురుని ఎక్కడైనా హాస్టల్‍లో ఉంచేస్తే బావుంటుందని అనేవారు. కొందరేమో కూతురు లేకుంటే ఇంకా తేలికగా మంచి సంబంధం వచ్చేదన్నట్లుగా జాలి చూపించేవారు.

అద్దంలో చూసుకున్నప్పుడల్లా ‘అందాన్ని ఇచ్చిన దేవుడు కాస్త అదృష్టాన్నిస్తే ఎంత బాగుండేది’ అనుకుని నవ్వుకునేది. మంచి భర్త దొరకటం పూర్వ జన్మలో చేసుకున్న పుణ్యం అనుకునేది.

***

కూతురు స్వాతి కాలంతో పాటే ఎదగసాగింది.

తండ్రి లేని లోటు తెలీకుండా, తల్లీ తండ్రి తానే అయి కూతురిని పెంచసాగింది. కాలంతో బాటు ఎంతో మంది పెళ్లి చేసుకుంటానని వచ్చి, ఆ తరువాత భారతి నిరాసక్తత చూసి వెళ్లిపోయారు.

ఇరవై సంవత్సరాలు గడిచి పోయాయి. పాత తరం వెళ్లి పోయింది. నిత్యం పరుగులెత్తే యాంత్రిక జీవనం మొదలయ్యింది. దేనికీ వెరవని అమ్మాయిల రంగుల తరం కానరాసాగింది.

రోజులు గడుస్తున్నా కొద్దీ తండ్రి లేని లోటు తెలుసుకోసాగింది స్వాతి.

వయసుతో స్వాతిలో అందం కూడా పోగవుతూ వస్తోంది. కూతురికి జీవిత సత్యాలు చెప్తూ, కాలేజీ చదువు వరకూ తీసుకెళ్ళింది భారతి. తండ్రి లేడనే విషయం అప్పుడప్పుడూ బాధించేది స్వాతికి.

అమ్మ, తన తండ్రిని వదిలేసి రాకుండా అతడిని మంచి దారిలో పెట్టే ప్రయత్నం చేస్తే బావుండేది అనుకునేది. అలా జరిగితే తన జీవితం ఇంకా ఆనందమయంగా ఉండేది కదా అని ఆలోచించసాగింది. బహుశా తల్లి అందంగా ఉన్నందుకు అలా చేసిందేమో అని అనుమానం వచ్చింది.

కూతుర్లను తండ్రులు ఎంత ప్రేమిస్తారో, ఎంత ముద్దు చేస్తారో గమనించసాగింది. అలాంటి ప్రేమించే తండ్రి లేకుండా పోవటానికి కారణం తన తల్లే అనే అనుమాన బీజం స్వాతి మనసులో నాటుకుంది.

తల్లి తన పట్ల ఎందుకంత క్రమశిక్షణ అనే పేరుతో కఠినంగా ఉంటుందో అని ప్రశ్నించుకుంది. తల్లిని గమనించిన కొద్దీ తన మీద నమ్మకం లేక తనను ఎక్కడా ఒంటరిగా పంపటం లేదనే కోపం పెరిగి పోసాగింది. కాలేజీలో చేరే సమయానికి భారతి మాటను ఎదిరించటం అలవాటు చేసుకుంది స్వాతి.

కూతురిలో వస్తూన్న ఈ మార్పును గమనించిన భారతి ‘ఈ రోజుల్లో అమ్మాయిలంతా ఇంతే’ అని నవ్వుకుంది. తండ్రి జీన్స్ ఎక్కడికీ పోవు కదా అనుకుంది.

కానీ కూతురి మనస్తత్వంతో తనకు భవిష్యత్తులో కలిగే ప్రమాదాన్ని పసిగట్టలేక పోయింది.

ఇంజనీరింగ్ అయిపోయే సమయంలో కాలేజీ క్యాంపస్‍లో వుద్యోగం సంపాదించింది స్వాతి.

కూతురు పెళ్లి వయసుకు రాగానే అంతవరకూ ప్రేమలు, భాందవ్యాలు కురిపిస్తూ భారతితో సహాయం పొందిన బంధువులందరూ మెల్లిగా మొహం చాటెయ్యసాగారు. అందరి బుద్ధులను గమనించిన భారతి ఒంటరిగానే పెళ్లి ప్రయత్నాలు చేయసాగింది.

భారతి ప్రయత్నాలు సఫలమై స్వాతికి తగిన వరుడు దొరకగానే వివాహం నిశ్చయమైంది.

పెళ్లి పనులు ,అన్నింట్లో భారతికి స్నేహితులు సహాయం చేయసాగారు.

వివాహపు తేదీ దగ్గరయ్యే కొద్దీ స్వాతి కొత్త కొత్త కోరికలు తల్లి దగ్గర బయట పెట్ట సాగింది. అవన్నీ తన శక్తికి మించి భారమైనప్పటికీ వీలున్నచోటల్లా అప్పు చేసి అన్నీ కొనిపెట్టింది భారతి. అది చూసిన తల్లి అనసూయ, చెల్లెల్లు, భారతికి జాగ్రత్తలు చెప్పటానికి ప్రయత్నించారు. కానీ భారతి కూతురి మీద ప్రేమతో అవేవీ వినిపించు కోలేదు.

అప్పులన్నీ పోగా మిగిలిన కొద్దిపాటి నెల జీతం చూసుకుని, ఇక ఒక్కదానినేగా ఇంత చాలు,నాకేం ఖర్చుంటుంది అనుకుంది భారతి.

ఆ రోజు స్వాతి నుండి ఫోన్ వచ్చింది. సంతోషంగా అంది భారతి “చెప్పరా కన్నా బావున్నావా? టిఫిన్ చేశావా?”

“బావున్నానమ్మా.. ఈ నెలలో ఒక టూర్ వెళదామంటున్నారే మీ అల్లుడు.. కాస్త డబ్బులు పంపవే” అంది స్వాతి.

వచ్చిన జీతం నెలంతా తన ఇంటి ఖర్చులకు కూడా సరిపోవేమో అని భయపడుతూ వున్న సమయంలో ఇది వినగానే ఏం చేయాలో అర్థం కాలేదు భారతికి.

“ఎంత కావాలమ్మా?’’ అంది.

“డెబ్భై వేలు పంపు. పది రోజుల టూర్ కదా. సరి పోకుంటే మళ్ళీ ఫోన్ చేస్తా” అని లైన్ కట్ చేసింది స్వాతి .

“సరే ఇంకా ఏవిటి విషయాలు” అంది భారతి.

అటునుండి సమాధానం లేకపోయే సరికి మొబైల్ కేసి చూసి, బరువుగా నిట్టూర్చి, తన అన్ని బ్యాంకుల ఖాతాలలో వున్న డబ్బులన్నీపంపించేసింది భారతి.

ఆఫీస్ అయిపోగానే ఆటో గురించి, నిలబడి ఎదురు చూడ సాగింది. ఇంతలో భారతికి ఊపిరి ఆడటం కష్టంగా అనిపించి,అక్కడున్న బెంచీ మీద కూర్చుని బ్యాగులో వున్న బాటిల్ తీసుకుని నీరు తాగింది. చిన్నగా చెమటలు పట్టసాగాయి.

వెంటనే మొబైల్ తీసుకుని స్వాతికి ఫోన్ చేసింది. ఫోన్ రింగ వుతోంది కానీ స్వాతి నుండీ సమాధానం రాలేదు.

గుండెల్లో ఊపిరి తీసుకోవటం కష్టం అయ్యి, చుట్టూ చూసింది. జీన్స్ ప్యాంట్ వేసుకుని అక్కడ నిలబడి మొబైల్‍లో గేమ్స్ ఆడుతున్న కుర్రాడిని పిలిచింది. “బాబు హాస్పిటల్ తీసుకెళ్ళు. ప్లీజ్” అంది. ..నొప్పితో గొంతు పెగలటం లేదు భారతికి.

“సరేనండీ” అని ఆ కుర్రాడు దగ్గరలో వున్న ఆటో పిలిచి భారతిని కూర్చోపెట్టి తీసుకెళ్లాడు.

హాస్పిటల్ లో ఎమర్జెన్సీ వార్డులో పెట్టి కొన్ని టెస్ట్‌లు చేసి, గుండె జబ్బు అని తేల్చి, ఆపరేషన్ చేయాలి అని చెప్పారు. విషయం తెలిసిన స్వాతి హాస్పిటల్ కు వచ్చి డాక్టర్ల తో అన్నీ మాట్లాడ సాగింది. “ఎంతవుంది ఖర్చు.. అదే బిల్?” అని అడిగింది.

“అన్నీ కలిసి దాదాపుగా రెండు లక్షలు కావొచ్చు.” అన్నాడు డాక్టర్.

లేచి వెళ్లి భారతి మంచం వద్ద కూర్చుని “అమ్మా.. రెండు లక్షలు అవ్వొచ్చు అంటున్నారు. నీ ఇన్సురెన్సు పాలసీ సరిపోదు. ఇంకా యాభై వేలు కావాలి, ఉన్నాయా నీ వద్ద” అంది.

“ఇప్పుడేమీ లేవురా, ఇంకొద్ది రోజుల్లో వచ్చే నెల జీతం ముప్పై వేలు వస్తాయి.” అంది.

“ఎందుకలా, నీ జీతం లక్ష పైన కదా? వస్తున్న జీతం అంతా ఏం చేస్తున్నావో, ఏవిటో” అంది విసుగ్గా.

“పెళ్ళికి, చదువుకి చేసిన అప్పు ఇంకా పట్టుకుంటారు కదా’’ కళ్ళు మూసుకుని నీరసంగా సమాధానమిచ్చింది భారతి.

“సరేలే.” కోపంగా అని లేచి వెళ్లి అడ్వాన్స్ కట్టింది స్వాతి.

రెండు రోజుల తర్వాత ఆపరేషన్ జరిగి కోలుకుంది భారతి. చెల్లెల్లు, తల్లీ, తండ్రి హాస్పిటల్ కు వచ్చి చూసి వెళ్లారు. వద్దంటున్నా వినకుండా రెండు వేలు, వణుకుతున్న తన చేతులతో, కూతురి చేతుల్లో పెట్టాడు రాఘవయ్య. వారం తర్వాత భారతిని టాక్సీలో కూర్చోపెట్టుకుని బయలుదేరింది స్వాతి.

కారు బయలు దేరగానే తృప్తిగా నిద్ర లోకి జారుకుంది భారతి.

“అమ్మా లే ఇంక.. ఇల్లొచ్చింది” అన్న కూతురి మాట వినపడి నిద్రలో నుండీ తేరుకుని, కళ్ళు నులుముకుని బయటకు చూసి ఆశ్చర్యపోయింది భారతి.

అది తన ఊరిలో ఇల్లు. ‘అయితే కూతురు ఇక్కడికి తీసుకొచ్చిందా.. వాళ్ళ ఇంటికి తీసుకెళ్లలేదా’ అని బాధపడిపోయింది.

మరుసటి రోజు లేచి టిఫిన్, వంట చేసి పెట్టి, “అమ్మా, ఎవరైనా పని వాళ్ళను మాట్లాడుకో. నే వెళ్ళాలి. అక్కడ మీ అల్లుడు నే లేకుండా ఉండలేరు” అంది.

మెల్లిగా మంచం మీద లేచి కూర్చొని, కూతురిని తేరిపారా చూసింది భారతి. ‘ఎంత ప్రాణంగా పెంచాను దీన్ని. ఎందుకిలా మారిపోయింది’ అనుకుంది భారతి.

“సరేలే అమ్మా నువ్వెళ్ళి రా.. నే చూసుకుంటాను. నాకేం పర్వాలేదు” అంది.

“ఇంకో విషయం, నువ్ కొన్న ప్లాటు, ఇంటి పేపర్లు, ఫిక్స్డ్ డిపోసిట్స్ అన్నీ తీసి నాకివ్వు” అంది.

ఆ మాటతో కొయ్యబారి పోయింది భారతి. మళ్ళీ గుండెల్లో ఏదో తెలీని నొప్పి మొదలయ్యింది.

ఏమీ మాట్లాడకుండా వెనక్కి వొరిగి పడుకుంది.

“అమ్మా.. విన్నావా?” అంది రెట్టించిన స్వరంతో.

“నీ పెళ్ళికి ఫిక్స్డ్ డిపోసిట్స్ అన్నీ తీసేసాను.” అంది భారతి.

ఆ మాట విని వెళ్లిపోయింది స్వాతి.

కూతురు వెళ్ళిపోయిన కొద్దిసేపటికి ఇల్లంతా కలయ చూసింది. నీళ్లు తాగటానికి లేచి నీరసం ఆవహించి, నాలుగు అడుగులు వేయగానే చేత కాక అలాగే కింద కూర్చుండిపోయింది. కొద్దిసేపటికి లేచి నుంచుంది. కళ్ళు తిరుగుతున్నట్లనిపించింది. జీవితంలో మొదటిసారి ఒంటరితనం ఆవహించింది. మెల్లిగా గోడలు పట్టుకుని వెళ్లి నీరు తాగి వెళ్లి, మంచం మీద పడుకుని, చిన్ననాటి స్నేహితురాలు లతకు ఫోన్ చేసి అన్నీ టూకీగా చెప్పింది.

“ఇదుగో బయలుదేరుతున్నాను. గంటలో వస్తున్నా” అని పెట్టేసింది లత.

సరిగ్గా గంటలో కారులో నుండీ దిగి లోనికి వచ్చి గాఢంగా నిద్దరోతున్న భారతిని గమనించి, వంటింట్లోకి వెళ్లి పాత్రలన్నీ చూసింది లత. అన్నీ ఖాళీగా వున్నాయి. తాను తెచ్చిన పండ్లు తీసి కడిగి చిన్న ముక్కలు చేసి, తీసుకెళ్లి భారతి ఎదురుగా కుర్చీ వేసికుని కూర్చొని మెల్లిగా పిలిచింది.

లతను చూడగానే ప్రాణం లేచినట్లయి లేచి కూర్చుని నవ్వింది భారతి.

“ముందు ఇవి తినీ మాట్లాడు” అని చేతిలో పండ్ల ప్లేట్ ఇచ్చింది.

కళ్ళలో నీరు ఆపుకుంటూ తినసాగింది.

“స్వాతి, అమ్మా, నాన్నా రాలేదా?” అంది.

“స్వాతి వచ్చి దింపి వెళ్ళింది”

అది వినగానే ఆశ్చర్యంగా చూసింది లత. “అదేంటి.. ఇక్కడెవరూ లేరు. ఒక వారం కనీసం తన దగ్గర పెట్టుకోవటమో లేదా తాను ఇక్కడుండాలి కదా!”

“ఏమో దానికేం ఇబ్బందులో మరి, మనకు తెలీదుగా” అని కళ్ళు దించుకుంది భారతి. భారతి మొహం చూసిన లత మరేం మాట్లాడకుండా కూర్చుంది.

లత ఫోన్‍లో చెప్పిన విషయాలు విని అనసూయ, రాఘవయ్య బస్సులో బయలుదేరి వచ్చేసారు.

తండ్రిని చూడగానే లేచి వెళ్లి గట్టిగా కౌగించుకుని భోరున విలపించసాగింది భారతి.

“ఊరుకో అమ్మా.. భారతి.. నేనున్నాగా.. నీకేం కాదు.” అని సముదాయించింది అనసూయ.

నెల రోజుల సెలవు తర్వాత ఆఫీస్ కి వెళ్ళింది భారతి.

“మేడం చాలా నీరసంగా కనపడుతున్నారు. పైగా వున్నట్లుండి తలంతా తెల్ల వెంట్రుకలొచ్చాయి, దాంతో ఇంకా వయసు మీద పడ్డట్లుగా ఎక్కువగా కనపడుతోంది.” అంది తోటి సహోద్యోగి వేణి.

చిన్న నవ్వు నవ్వి “మరి నిజాన్ని దాచలేనుగా.ఇంకొన్ని సంవత్సరాలలో రిటైర్మెంట్ దగ్గరకు వచ్చానుగా” అంది భారతి.

“సరిగ్గా సమయానికి వచ్చేసారు మేడం, నాకు ట్రాన్స్‌ఫర్ అయ్యింది” అంటూ వచ్చాడు ప్రసాద్.

“అరె.. ఏ వూరికి?” అంది భారతి.

చెప్పాడు ప్రసాద్.

“అక్కడ మా అమ్మాయి ఉంటుంది.” అంది సంతోషంగా.

“మరింకేం.. మీరొచ్చినప్పుడు కలుస్తాను” అన్నాడు నిండుగా నవ్వుతూ. కాసేపు భారతిని చూసి మళ్ళీ అన్నాడు “చాలా నీరసించిపోయారు. మందులు సమయానికి వేసుకుని జాగ్రత్తగా వుండండి. ఆఫీస్ పని మీద అధికమైన, అనవసరమైన భారం వేసుకోకండి”

“థ్యాంక్ యు ప్రసాద్ గారు. అక్కడ ఇల్లు చూసుకున్నారా” అడిగింది భారతి.

“చూసుకున్నానండి. ఒక్కడినే కదా. చిన్న పోర్షన్ చాలు” అన్నాడు నవ్వుతూ.

“అవును కదా.. ఇన్ని రోజులు అడగలేదు.. మీరేమనుకోకుంటే ఒకటడగనా” అంది సంకోచిస్తూ.

“పర్వాలేదు అడగండి.. అయినా మనం కలిసి పనిచేస్తూ నాలుగు సంవత్సరాలు దాటింది.” అన్నాడు చిరునవ్వుతో.

ప్రసాద్ పెళ్లి చేసుకోలేదు. ఏనాడు ఆ విషయం గురించి చర్చించలేదు.

“మీరు ఒంటరిగా ఎందుకున్నారు. వివాహం చేసుకోలేదు?” ప్రశ్నార్థకంగా చూసింది భారతి.

అది విని కాసేపు కళ్ళు దించుకుని అన్నాడు “ఇద్దరు చెల్లెల్లు, ఒక తమ్ముడు. వారిని చదివించి పెళ్లి చేసేసరికి ఆలస్యమైంది. అప్పటికే నాకు నలభై దాటింది. నాకు ఆ సమయంలో ఇక సంబంధాలు.. అలా జీవితం ముగింపు కొచ్చింది” నిట్టూర్చాడు ప్రసాద్. అతని మొహంలో కాస్త దిగులు, బాధ గోచరించాయి.

“అయితే.. అమ్మా.. నాన్నా ఎక్కడా?” అంది భారతి మాట మారుస్తూ.

“నాన్న పోయారు.. అమ్మ నాతో వుంటుందిక” అన్నాడు గట్టిగా ఊపిరి పీలుస్తూ.

“నేను అమ్మాయి దగ్గరకు వచ్చినప్పుడు కలుద్దాం” అంది.

గత నాలుగు సంవత్సరాలు ప్రతీ విషయంలో భారతికి సహాయం చేసేవాడు. ఏనాడు హద్దులు మీరకుండా జాగ్రత్తగా మసలుకునేవాడు. నిజానికి ఆఫీసులో అందరికీ సహాయం చేసేవాడు. అతని సెండాఫ్ నాడు చాలా మంది బాధపడ్డారు.

నెల రోజుల పిమ్మట స్వాతి ఫోన్ చేసింది. వంట చేసుకుంటున్న భారతి ఫోన్ లేపగానే “అమ్మా.. మన ఇంటి పేపర్లు అన్నీ తీసి పెట్టావా?” అంది.

కొద్దీ సేపు భారతికేమీ అర్థం కాలేదు. “ఎందుకూ” అంది భారతి.

“ఏమీ లేదులే.. ఊరికే.. మా మామగారు సలహా ఇచ్చారు.” అంది స్వాతి.

మనసంతా పిండేసినట్లయ్యింది భారతికి.

“మళ్ళీ చేస్తాను” అని ఫోన్ పెట్టేసి పక్కనే వున్నకుర్చీలో కూర్చుంది. శరీరమంతా నిస్సత్తువ గా అనిపించింది.

కొన్ని రోజుల తర్వాత ఆఫీస్‍లో పనిలో ఉండగా స్వాతి ఫోన్ వచ్చింది. “చెప్పరా స్వాతి” అంది భారతి సంతోషంగా. కూతురి గొంతు వినగానే అన్నీ మరిచి పోయింది.

“వచ్చే వారం దసరా పండగకి ముందు రోజే వచ్చేయి.” అంది స్వాతి.

ఆ మాటతో అన్ని బాధలు పటాపంచలు అయ్యాయి భారతికి. “సరేనమ్మా అలాగే” అంది.

***

ఆటో దిగి కూతురింట్లోకి అడుగు పెట్టింది భారతి.

తల్లి చేతుల్లోనుండీ సూటుకేసు అందుకుని గదిలోకి తీసుకెళ్లింది స్వాతి.

ఉదయం మొబైల్ తీసుకుని చూస్తుండగా ప్రసాద్ పెట్టిన దసరా శుభాకాంక్షలు కనపడింది. తాను ఇక్కడే కూతురింట్లో వున్నట్లుగా సమాధానం పెట్టింది.

మరి కాసేపటిలో ప్రసాద్ నుండీ ఫోన్ వచ్చింది.

“హలో ప్రసాద్ గారు” అంది మర్యాదగా

“నమస్కారం భారతి గారు ఎక్కడా?” అభిమానంగా అన్నాడు ప్రసాద్ అటునుండి.

“ఇక్కడే మీ ఊరిలోనే. కూతురింటికి వచ్చాను.” అంది.

“చాలా సంతోషం. కలుస్తాను. మీకు ఇబ్బంది లేదంటే “

“అబ్బెబ్బే ఏమీ ప్రాబ్లెమ్ లేదు, అడ్రస్ పంపిస్తాను, లొకేషన్ మ్యాప్. రండి” అంది సంతోషంగా.

“సరే వచ్చాక మాట్లాడుతాను’’

ఫోన్ పెట్టేసి సంతోషంగా లేచి పూజ గదిలోకి వెళ్ళింది భారతి.

పదకొండు గంటల సమయంలో వచ్చాడు ప్రసాద్. కూతురిని, అల్లుడిని పరిచయం చేసింది. నమస్కారం చేసి వాళ్లిద్దరూ లోనికి వెళ్లిపోయారు.

హాల్‍లో ఇద్దరూ కూర్చుని ఆఫీస్ విషయాలు, అవీ ఇవీ కొద్దీ సేపు మాట్లాడాక వెళ్ళిపోయాడు ప్రసాద్ .

పండగ అయిపోయిన మరుసటి ఉదయం బస్సెక్కి వెళ్ళిపోయింది భారతి. ఆఫీసుకి వెళ్లి పని చేసుకుని సాయంత్రం ఇంటికెళ్ళేసరికి చీకటి పడింది.

లోపలి అడుగు పెట్టి ఇంట్లో లైట్లు వేసి, కాఫీ గ్లాసు తీసుకుని వచ్చి ముందు గదిలో కూర్చుంది.

ముందున్న మొబైల్ మ్రోగసాగింది. చేతులోకి తీసుకుని నెంబర్ చూసింది. ‘చెల్లెలు రాణి’ అనుకుని “రాణి.. పండగ బాగా జరిగిందా?” అడిగింది.

“బాగానే అయ్యింది. ఏంటి స్వాతి విశేషాలు?” అంది రాణి.

“అంతా బావున్నారు. రెండు రోజులుండి వచ్చేసాను”

“ఇంకా ఏంటి.. ఎవరొచ్చారక్కడికి.. అదే ఎవరో నీ ఫ్రెండ్‍ని పిలిచావటగా?”

ఆశ్చర్యపోయింది భారతి “నీకెలా తెలిసిందే?”

“స్వాతి ఫోన్ చేసి చెప్పింది..” మధ్యలో ఆగిపోయింది రాణి.

“అదేం పెద్ద విషయమని చెప్పింది” అయోమయంగా అడిగింది భారతి.

“ ఏదో లే.. రేపు నే వస్తాను. “

“సరే.. రా” అని ఫోన్ పెట్టేసి ‘ఏమిటి ఈ తలనొప్పి.. అసలేంటి స్వాతి ఇలా చేస్తోంది’ అని ఆలోచనలో పడింది భారతి.

మరుసటి రోజు పొద్దున్నే వచ్చేసింది రాణి.

“ఏంటి ప్రాబ్లెమ్. ఏమి జరిగిందే” అంది భారతి కంగారుగా.

“చెప్తాను.. ముందు అలా కూర్చో.. కంగారు పడకుండా’’

“సరే చెప్పు” భారతి మొహంలో ఆందోళన కనపడుతూ వుంది.

“ఎవరో ఒకతను వచ్చాడట కదా” అంది తల వంచుకుని.

“అవును.. నేనే పిలిచాను. అతను మా కలీగ్.. అయితే ఏంటి” అంది. భారతి హృదయం ఉడికి పోతోంది.

“ఏమిటో అది.. చాలా చెడుగా చెప్తోంది. అయినా అక్కడికెందుకు పిలిచావు. బయట ఎక్కడైనా కలిస్తే అయిపోయేది” అంది బాధతో సలహా ఇస్తూ.

“చెడు గానా!!” అంది భారతి. కాళ్ళ కింద భూమి కదులుతున్నట్లుగా అనిపించింది. కడుపులో నుండీ బాధ తన్నుకు రావటం మొదలయ్యింది.

“ఈ వయసులో ఇదేం పని.. నీ వరస ఏమీ నచ్చలేదని.. అల్లుడు కూడా తప్పు పట్టాడుట” అంది రాణి.

తల మీద వరసగా పిడుగులు పడుతున్నట్లుగా అనిపించి కుర్చీలో వెనక్కి వొరిగి కూర్చుంది భారతి.. హృదయంలో దుఃఖ సముద్రం ఉప్పొంగసాగింది. ఆమె కళ్లలోనుండీ కన్నీళ్ల నది ధారగా ప్రవహిస్తోంది.

రెండు రోజులు సరిగ్గా తినకుండా ఏడుస్తూ ఉండిపోయింది భారతి.

“అసలు దీని గురించే కదా నేను రెండో పెళ్లి చేసుకోకుండా ప్రాణాలన్నీ దీని మీద పెట్టుకుని ఇన్నేళ్లు బ్రతికింది” అంటూ ఏడుస్తూనే వుంది భారతి.

ఒక రోజు ఏం చేయాలో తెలీక భారతి పక్కన కూర్చోపెట్టుకుని “అక్కా.. నే దానికి నీ మనసు అర్థం అయ్యేలా చెప్తాను. నువ్వూరుకో” అని స్వాతికి ఫోన్ చేసింది. స్వాతి అటునుండి “హలో పిన్నీ” అంది.

“అదేరా.. నువ్వన్నమాటలకు అమ్మ బాధ పడుతోంది” అంది రాణి నచ్చచెప్తూ.

“బాధ ఎందుకు పిన్ని? నేను అన్నది నిజం. ఆయనతో ఈవిడకు.. నీకు తెలీదులే..” అంది స్వాతి.

“స్వాతి.. మీ అమ్మ ఒక ప్రభుత్వ ఉద్యోగి.. ఎవరో ఒకతను ఇంటికొచ్చినంత మాత్రాన నువ్వలా మీ అమ్మను అనుమానించటం తప్పు. పైగా మీ నాన్న వదలి వెళ్లిపోయినప్పటి నుండీ తానే తండ్రిలాగా చిన్నతనం నుంచీ నిన్ను పెంచి పెళ్లి చేసింది. ఎన్ని బాధలు పడిందో మేము చూసాం. నీవన్న మాటలు తెలిసి బాధపడింది. చిన్న వయసు అయ్యుండి కూడా, పెళ్లి చేసుకోకుండా జీవితం అంతా నీ గురించి అలాగే ఒంటరిగా ఉండిపోయింది” అంది రాణి.

“అప్పుడే చేసుకోవాల్సింది. ఎవరు వద్దన్నారు? ఇప్పటికైనా చేసుకోమను.. ఇలా చేసే కంటే అదే నయం” అంది స్వాతి విసురుగా, హేళనగా.

ఆ మాట విన్న రాణి విస్తు పోయి “సరే వుంటాను..కాస్త పనుంది” అని ఫోన్ పెట్టేసి భారతి వేపు చూసింది.

పక్కన కూర్చొని కూతురి మాటలు విన్న భారతికి గుండెలు పిండేసినట్లయ్యింది. కళ్ళు తిరిగిపోయాయి. కూతురి మాటలు విని కొయ్యబారి పోయింది.

***

గతాన్ని నెమరు వేసుకున్న భారతి తెల్లవారు జామున నిద్ర పోయి, కాస్త లేటుగా నిద్ర లేచింది. నీరసంగా లేచి ఆఫీసుకు బయలుదేరింది.

నెల రోజుల పాటు రాత్రుళ్ళు నిద్ర పట్టకుండా చాలా సేపు ఏడుస్తూ పడుకుంది భారతి. ఆఫీసులో అన్యమనస్కంగా పని చేసింది.

చాలా రోజులు తన జీవితం, భవిష్యత్తు గురించి ఆలోచించింది. ఆమెలో బ్రతకాలనే కోరిక పూర్తిగా నశించింది. ఆ రాత్రి వరండాలో కూర్చొని తను అనుభవించిన బాధాకరమైన జీవితం ఒకసారి నెమరు వేసుకుంది. అంతలో దూరంగా నది మీదున్న వంతెనపై నుండీ కూత వేసుకుంటూ వెళ్తున్న రైలు కనపడింది. వెంటనే ఒక ఆలోచన వచ్చి లేచి ట్రైన్ వేపు నడవసాగింది. అంతలో వరండాలో వున్న మొబైల్ మ్రోగసాగింది. ఒక సారి వెనక్కి తిరిగి చూసి వెళ్లి ఫోన్ తీసి “హలో” అంది. ఆమె గొంతు ఎక్కడో నూతిలో నుండీ వస్తున్నట్లుగా గమనించిన రాఘవయ్య “ఏరా తల్లి.. ఏంటి.. అలా వుంది గొంతు” అన్నాడు.

ఏమీ మాటలాడ కుండా మౌనంగా రోదించసాగింది భారతి.

“వినమ్మా తల్లీ.. నేను రేపుదయం వస్తున్నా.. నాకన్నీ చెప్పింది రాణి. నువ్వు ధైర్యంగా వుండు. నేనున్నానుగా.. రేపు వస్తున్నాను. సరేనా?”

“అలాగే నాన్నా” అని ఫోన్ పెట్టేసి ఇంట్లోకి అడుగులు వేసింది భారతి.

మరుసటి రోజు భార్యతో సహా వచ్చిన రాఘవయ్య వచ్చి కూతురిని కూర్చోపెట్టుకుని చాలా సేపు ధైర్యం చెప్పాడు.

“నేను.. మీ అమ్మ పెద్దవాళ్ళం అయిపోయాం. ఇంకా ఎన్నాళ్ళుంటామో ఏమో?..” అంటూ చెప్పసాగాడు రాఘవయ్య. చాలా సేపు ఎనో విషయాలు చెప్పాడు. అతను మాట్లాడుతున్నంతసేపు కళ్ళలో నీరు చెమరుస్తూనే వున్నాయి.

భారతి అదంతా విని ఆఖరున ఒక నిర్ణయానికి వచ్చింది. కూతురు చెప్పిన విషయం విని రాఘవయ్య కూతురి తల మీద చెయ్యి వేసి నిమిరి మనసులోనే ఆశీర్వదించాడు. తల్లి అనసూయ కూతురిని దగ్గరికి తీసుకుంది.

మరుసటి ఉదయం చీకటిలో లేచి దేవుడి గదిలో పూజ పూర్తి చేసి, చెల్లెలికి ఫోన్ కలిపింది. “రాణీ నేనొక నిర్ణయానికి వచ్చాను.. నేను వివాహం చేసుకుందామనుకుంటున్నా.. ఈ విషయం స్వాతికి కూడా చెప్పు” అంది.

“మంచి నిర్ణయం అక్కా.. అలాగే. అసలీ పని ఎప్పుడో చేయాల్సింది. జీవితం అంతా ఎదురీదావు. మా జీవితాలు ఒక దారికి రావటానికి సహాయం చేసావు. కూతురి బాధ్యత పూర్తి చేసావు. ఇక ఈ వయసులో నీకు తోడు అవసరం. అలాగే కానివ్వు” అని సంతోషంగా అని, ఫోన్ కట్ చేసి ఇంకొక నెంబర్ కలిపింది రాణి.

ఈ విషయం వినగానే స్వాతి నివ్వెర పోయింది. “పిన్నీ.. ఇదేంటి అమ్మ ఈ వయసులో, అసహ్యంగా. అసలు మీరందరూ ఎలా విన్నారు. ఎందుకూరుకున్నారు. అమ్మమ్మా, తాతయ్య ఏం చేస్తున్నారు. ఛీ ఛీ ఇదేం బాగా లేదు. నేనసలు ఒప్పుకోను” అంది పళ్ళు కొరుకుతూ.

“నిజమే, అయితే మీ అమ్మెప్పుడూ నీ గురించే తపిస్తూ జీవితం అంత నీకే ధార పోసింది. ఎవరెంత చెప్పినా, నీ చిన్నప్పుడు రెండవ పెళ్ళికి అసలు ఒప్పుకోలేదు. నీ మీద పిచ్చి ప్రేమతో, తండ్రి లేని పిల్లవని, నిన్ను కంటికి రెప్పలా చూసుకుంది. ఏనాడు తన ఆనందం, సుఖం పట్టించుకోలేదు. ఇప్పుడేమో ఒంటరి అయిపోయింది. తప్పేం లేదు.అమ్మ చేసేది కరెక్ట్” అంది రాణి.

అది విని ఫోన్ కట్ చేసింది స్వాతి.

కాసేపు ఆలోచించి ఇంకో ఫోన్ చేసింది స్వాతి. అటునుండి “ఏంటమ్మా చిన్న తల్లి.. అంతా క్షేమమేనా” అన్నాడు నవ్వుతూ రాఘవయ్య.

“తాతయ్యా.. అమ్మ?” అంది  ఆమె గొంతులో టెన్షన్ తెలుస్తోంది.

“అమ్మ.. ఒకే.. మీ ఆయన, నువ్వూ బావున్నారా?” అన్నాడు రాఘవయ్య నిండుగా నవ్వుతూ.

“మేం బాగానే వున్నాం. అమ్మ  జాగ్రత్త.” అంది ఏం చెప్పాలో తెలీక, ఉద్వేగంగా.

“నే చూసుకుంటా అమ్మలూ” అన్నాడు గంభీరంగా.

“సరే..” ఫోన్ పెట్టేసింది స్వాతి.

“నువ్వు చేయగలిగినదంతా చేసావు స్వాతి. ఇక కూల్ గా ఉంటే మంచిది. ఇక చాలు.” అన్నాడు భర్త స్వాతిని  హెచ్చరిస్తూ.

భర్త వేపు ఆలోచిస్తూ చూసింది స్వాతి..

***

ఆఫీసుకు బయలుదేరే ముందు ఒకసారి అద్దంలో చూసుకుని బయలుదేరింది భారతి. మరోసారి వెనక్కి తిరిగి మళ్ళీ అద్దంలో చూసుకుంది. తలంతా నెరిసింది అనుకుంది.

ఆ వారం పాటు ఆలోచించింది భారతి. మనసు గట్టి చేసుకుని ఫోన్ కలిపింది.

అటునుండి “హలో భారతి గారు.. బావున్నారా?” అన్నాడు అతను.

“బావున్నానండీ.. ఒక సారి మనం కలిస్తే బావుంటుందేమో” అంది భారతి.

ఒక క్షణం మౌనంగా వున్న తర్వాత సమాధానం చెప్పాడు “తప్పకుండా భారతి గారు.. వస్తాను” అతని స్వరంలో ఒక బాధ్యత ధ్వనించింది.

“నేను ఎదురు చూస్తుంటాను, త్వరగా వస్తే బావుంటుంది” అంది తృప్తిగా నవ్వుకుంటూ.

“అలా అయితే ఇదుగో ఇప్పుడే బయలుదేరతాను” అన్నాడు

***

ఇంకో ఫోన్ కలిపింది. అటునుండి రాఘవయ్య “చెప్పమ్మా భారతి” అన్నాడు.

“మీరు చెప్పినట్లుగానే ఫోన్ చేసాను నాన్నా.. అతను వస్తున్నారు. మీరు?” అడిగింది.

“ఇదుగో మేమూ బయలు దేరుతున్నాం, గంటలో వచ్చేస్తాము” అన్నాడు రాఘవయ్య.

ఒక గంట తర్వాత భారతి ఇంటి ముందు గదిలో అందరూ కూర్చొని అతని గురించి ఎదురు చూస్తున్నారు.

ఇంతలో గడపలోనుండీ లోపలికొచ్చిన వ్యక్తిని చూసి అందరూ లేచి నిలబడ్డారు.

“నాన్నగారు.. ఇతనే ప్రసాద్” అంది భారతి. అందరికీ నమస్కరించాడు ప్రసాద్.

ఆకాశంలో సాయం సంధ్య రంగులు పులుముకుంటోంది. పక్షులు తమ గూళ్లకు చేరుకోవటానికి ఎగిరిపోతూ వున్నాయి.

***

“హలో.. తాతయ్యా.. ఏమైంది చెప్పు.” అంది స్వాతి ఫోన్ గట్టిగా పట్టుకుని.

“అతను ఇంతకు ముందే వచ్చి వెళ్ళాడు. వచ్చే వారం రిజిస్టర్ మ్యారేజ్. అంతా సవ్యంగా జరుగుతోంది. నీ గురించే బాధల్లా.” అన్నాడు నిట్టూరుస్తూ.

“పరవాలేదు తాతయ్యా.. మామూలుగా చెప్తే తనీ అడుగు వేసేది కాదు. అందుకే కాస్త బాధ పెట్టాను అమ్మను. మీరెంత చెప్పినా వినలేదుగా. సరే.. నేను చిన్న దానిగా వున్నప్పుడు, పెళ్లి కానప్పుడు నా గురించి చాలా జీవితం ఎలాగూ పోగొట్టుకుంది. తనకు ఇక చాలు ఒంటరితనం. ఇప్పుడు, ఈ వయసులో తనకు ఒక తోడు అవసరం. చూసావుగా హార్ట్ ప్రాబ్లెమ్ వచ్చినపుడు ఒక్కత్తి రోడ్ మీద..” అంటూ బాధతో మాట్లాడ లేక ఆగిపోయింది.

“నువ్ బాధ పడకురా తల్లీ.. నువ్ చెప్పినట్లే చేసాం కదా. నీ ప్రవర్తనతో మీ అమ్మ బాగా బాధ పడింది” అన్నాడు మెల్లిగా.

“తప్పలేదు తాతయ్యా.. చూసావుగా.. మాములుగా మనం చెప్తే వినేదా? అందుకని ఇలా చేశా” అంది తృప్తిగా.

“వచ్చే నెల రెండవ తేదీ నిర్ణయించాము. ఎప్పుడొస్తావు మరి?”

“సరిగ్గా రిజిస్టర్ ఆఫీస్‍కి సమయానికి వచ్చేస్తా.. దండలు మార్చుకున్నాక కానీ మనం ఊపిరి పీల్చుకోలేం. కొంత డబ్బు నీకు పంపిస్తాను. దాంతో ఖర్చులు, సూత్రం చేయించు. ఇంకా అవసరం అయితే పంపిస్తాను.” అంది స్వాతి.

“అలాగే అమ్మా.” అన్నాడు రాఘవయ్య.

“వుంటాను తాతయ్యా.. అమ్మ జాగ్రత్త” అని ఫోన్ కట్ చేసి మెరుస్తున్న కళ్లతో సంతోషంగా భర్త వేపు చూసింది స్వాతి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here