కూవం కాలువ – యువ శాస్త్రవేత్త

0
9

[box type=’note’ fontsize=’16’] పిల్లలన్నా, వారితో సావాసం చేయటమన్నా నాకెంతో ఇష్టం. తరగతి గదిలో, ఆటస్థలంలో, ఇంట్లో, ఎక్కడైనా సరే పిల్లల ఆటపాటలు ఉంటే సందడే సందడి. ఆ సందడి నాకెంతో ఇష్టం. ఉమయవన్ తమిళంలో రాసిన ‘పరక్కుమ్ యానై’ కథలు చదివిన తరువాత అవి బాగా నచ్చి వాటిని మన తెలుగు పిల్లలకు దగ్గర చేయాలనే ఉద్దేశంతో తెలుగులోకి అనువదించాను. అందులోని కథలే మీరిప్పుడు చదువుతున్నది! – రచయిత్రి (అనువాదకురాలు)

~ ~

పన్నెండేళ్ల లోపు పిల్లలకు ఈ పది కథలూ చాలా సరదాగా అనిపిస్తాయి. వీటిలో కల్పన ఉన్నా, పర్యావరణ స్పృహ, సమాజం పట్ల బాధ్యత అంతర్లీనంగా ఉన్నాయి. ఇవి నీతిని బోధించే కథలు కావు. గంభీరంగా ఉండవు. కాని, చిన్న చిన్న అంశాలతోనే ఎంతో పెద్ద విషయాన్ని పిల్లలకు అర్థమయేట్లుగా, వారు పాటించేటట్లుగా బోధపరుస్తాయి. అదే వీటి విలక్షణత. [/box]

[dropcap]ఆ[/dropcap] రోజు రాజా స్కూల్ నుండి ఇంటికి చేరేటప్పటికి ఎంతో పరవశంలో ఉన్నాడు. తాను ప్రపంచాన్ని జయించినంత గొప్ప ఆనందంతో గంతులు వేస్తున్నాడు. అతని ఆనంద పారవశ్యం చూసిన వాళ్ళ నాన్న “ఏమిటి సంగతి?” అన్నారు ముసిముసిగా నవ్వుతూ, తన ఆశ్చర్యాన్ని దాచుకుంటూ. తమ పాఠశాల యాజమాన్యం ఏర్పాటు చేస్తున్న ఒకానొక పోటీ గురించి, అందులో విజేతకు ‘డాక్టర్ అబ్దుల్ కలాం యువ శాస్త్రవేత్త’ అన్న బిరుదు ఇస్తారని ఎంతో ఉత్సాహంగా తండ్రికి చెప్పాడు రాజా.

రాజాకు డాక్టర్ అబ్దుల్ కలాం అంటే చెప్పలేని ఆరాధన, ఎంతో గౌరవం. అందుకే అతను ఇది తన ప్రతిభ నిరూపించుకునేందుకు ఇది ఒక గొప్ప అవకాశం అని భావించాడు. పోటీలో ఇవ్వబడిన అంశం ‘మద్రాసు నగరాన్ని అభివృద్ధి చేసే మార్గాలు’ అన్నది. రాజా పుట్టి పెరిగింది మద్రాసు నగరంలోనే కావడంతో వాడికి మద్రాసుతో చాలా సాన్నిహిత్యం ఉన్నదన్నమాట. ఈ పోటీలోని అత్యంత విశేషమైన విషయం ఏమిటంటే అభ్యర్థులలో ఎవరైనా సూచించిన ఏదైనా క్రొత్త ఆలోచన కనుక ప్రభుత్వానికి ఆమోదయోగ్య మయినదయితే దాన్ని వెంటనే ప్రభుత్వం అమలు చేస్తుందిట! అంటే, ఈ పోటీ కేవలం ఏదో ఒక పరియోజన కోసం పెట్టేది కాదు; ప్రజలకు ప్రయోజనం చేకూర్చే పోటీ! రాజా చాలా గంభీరంగా ఆలోచించడం మొదలుపెట్టాడు. ఈ పోటీలో నెగ్గి తీరాలి. అందుకు తాను ఎటువంటి పరియోజన చేయాలి అన్నదే అతని ఆలోచన.

రాజా చదువుకుంటున్న పాఠశాలలోని విద్యార్థులు పాఠశాలకు వచ్చేటప్పుడు, తిరిగి ఇంటికి వెళ్లేటప్పుడు కూవం నది దాటి మాత్రమే రావాలి. తానొక పుస్తకంలో ఎప్పుడో చదివిన విషయం ఒకటి రాజాకు బుర్రలో మెదిలింది. ఒకప్పుడు కూవం నది కాలువల ద్వారా మద్రాసు నగరానికి, వేరే ప్రదేశాలకు పెద్ద ఎత్తున వ్యాపారం జరిగేది. కూవం ఒక ప్రధాన రేవుమార్గంగా కూడా పేరు పొందినది. స్వర్గీయ స్వాతంత్ర్య సమరయోధుడు భారతీదాసన్ గారు కూడా పేముతో చేసిన తెప్పలపై కూవం నదిలో ప్రయాణం చేస్తూ ఉండేవారు. అంతే కాదు, బ్రిటీషువారి పరిపాలనా కాలంలో 1806వ సంవత్సరంలో అనేక ఇతర జలాశయాలను కలుపుతూ కూవం కాలువ ప్రారంభించబడింది అని కూడా రాజా చదివాడు. విజయవాడ నుండి విల్లుపురం (తమిళనాడు) వరకు 420 కి.మీ. పొడవును ఆవరించిన కాలువే కూవం కాలువ. ఈ కూవం కాలువ ప్రసిద్ధ నౌకా మార్గంగా బకింగ్ హామ్ కాలువతో సమాన ప్రాశస్త్యం పొందింది. 2004వ సంవత్సరంలో భారతదేశపు ఆగ్నేయ కోస్తా తీరాన్ని సునామి తాకినపుడు ఈ కూవం కాలువ ఎంతోమంది ప్రాణాలను కాపాడింది. ఈ వాస్తవం మొన్నీ మధ్యనే పరిశోధకుల ద్వారా వెలుగులోకి వచ్చింది.

అయితే ఇంతటి ప్రాముఖ్యత కలిగిన ఈ కూవం కాలువ పట్ల ప్రస్తుత కాలంలో ఎవ్వరూ తగినంత శ్రద్ధ వహించడం లేదు. కాలువను శుభ్రం చేయాలని కాని, మళ్లీ ఉపయోగకరంగా మార్చాలని కాని, దానికి పూర్వ వైభవం తీసుకురావాలని కాని ఎవరూ అనుకోవడం లేదు. పైపెచ్చు కాలువ ఇప్పుడు పాడుబడిపోయి నీరంతా కలుషితమై పోయింది. మద్రాసు నగరంలో 30 కి.మీ. మేర కాలువ పరిసర ప్రాంతాలలో నివాసం ఉంటున్న ప్రజలు ఈ జల కాలుష్యం వలన రోగగ్రస్తులయ్యారు. అక్కడి గాలి కూడా పీల్చుకోలేనంతగా తీవ్రమైన దుర్వాసనను వ్యాపింపజేసే ఈ ప్రాంతంలో నివసించడానికి సాహసం చేయలేకపోతున్నారు. ఇలా కూవం కాలువ తన కీర్తిని, ప్రాముఖ్యతను కోల్పోయి దుర్గంధపు మురుగు కాలువగా మారిపోవడం చూసిన రాజా ఎంతో ఆవేదన చెందాడు.

కూవం కాలువ దుస్థితికి ఎంతో బాధపడిన రాజా ఎలాగైనా సరే కాలువను పునరుద్ధరించాలని, దాని పూర్వవైభవాన్ని, అందాన్ని, ప్రాశస్త్యాన్ని దానికి తిరిగి తెచ్చి ఇవ్వాలని, అందుకోసం  తాను ఏమైనా చేయాలని దృఢ నిశ్చయానికి వచ్చాడు. ఇలా ఒక నిర్ణయానికి రావటమే తడవుగా తన స్నేహితులందరినీ పిలిచి, వాళ్ళతో చర్చించి ఒక చక్కని ప్రణాళికను తయారు చేసుకున్నాడు రాజా. వీలయినంత త్వరగా తమ ప్రణాళికను అమలు చేయాలన్న నిర్ణయానికి వచ్చారు ఆ మిత్ర బృందమంతా!

మొదటగా మురుగునీటి పారుదల మండలికి వెళ్లి అక్కడి అధికారులకు తమ ఆలోచనలను వివరించారు. కూవం కాలువలోని మురుగునీటిని వేరే దిశగా మళ్ళించడానికి తమకు సాయపడవలసినదిగా అధికారులను ప్రార్థించారు. అక్కడి నుండి రాజా మత్స్య శాఖకు వెళ్లి కూవం కాలువలోని మురికి నీటిని శుభ్రపరిచేందుకు కొన్ని వేల చేపలను కాలువలోనికి వదలవలసినదిగా అభ్యర్థించాడు. చేపలు నీటిలోని రోగకారక క్రిములను, కీటకాలను ఏరి ఏరి తిని వేయడం వల్ల నీరు శుభ్రపడుతుంది. నిజం చెప్పాలంటే ఇటువంటి విధానమంతా పూర్తి కావడానికి చాలా సమయం పడుతుంది. కాని ఇప్పుడు వేసవి సెలవలు కనుక రాజాకు, అతని మిత్రులకు ఎంతో సమయం కలసి వచ్చిందనే చెప్పాలి.

రాజా స్నేహితుడు హరి ఒక మత్స్యకారుని కొడుకు. రాజా హరివాళ్ళ నాన్న దగ్గరకు వెళ్లి ఆయన దగ్గర ఉన్న కాలువలోకి వెళ్లేందుకు ఒక చిన్న పడవను ఇవ్వగలరా అని వినయంగా అడిగాడు. నీరు శుభ్రంగా ఉన్నదీ లేనిదీ తెలిసేందుకు, నావ ప్రయాణానికి నీరు అనుకూలంగా ఉన్నదీ లేనిదీ తెలుసుకునేందుకే ఇలా అడిగాడు రాజా! ఆయన వెంటనే అంగీకరించారు. ఆశ్చర్యం! పడవ నీటిలోనికి ప్రవేశించగానే వాళ్లకు అంతా అనుకూలంగా ఉన్నదని అర్థమైపోయింది. మిత్రులందరికీ అవధులు లేని ఆనందం కలిగింది.

చూస్తూ ఉండగానే వేసవి సెలవలు పూర్తి అయినాయి. పాఠశాల పునఃప్రారంభం అయింది.  హరి తండ్రిగారు ఇచ్చిన చిన్న పడవలో రాజా, వాడి స్నేహితులు బడికి త్వరగా చేరుకున్నారు. ఇంతకుముందు వాళ్ళు పాఠశాలకు బస్సులో వచ్చేటప్పుడు రోడ్డు మీద రద్దీతో ఎప్పుడూ ఆలస్యమై పోయేది. కాని ఇవాళ గంట కొట్టే సమయానికన్నా ముందే పాఠశాలకు చేరుకున్నారు. ఎప్పుడూ స్కూలుకు ఆలస్యంగా వచ్చే ఈ పిల్లలందరూ ఇప్పుడు ప్రతిరోజు ఎంతో ముందుగానే రావటం గమనించారు వాళ్ల ప్రధానోపాధ్యాయులు. ఒక వారం రోజుల తర్వాత ఇక తన కుతూహలాన్ని అణచుకోలేని ఆయన పిల్లలను పిలిచి “మీరిలా పాఠశాల ప్రారంభ సమయానికన్నా ముందే ఎలా రాగలుగుతున్నా”రని వాళ్లను అడిగారు. పిల్లలందరూ ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ ముసిముసిగా నవ్వుకుని “మేము ఇప్పుడు స్కూలుకు బస్సులో రావడం లేదు, కూవం కాలువను ఒక చిన్న పడవలో దాటుకుని వస్తున్నా”మని ఆయనకు వివరంగా చెప్పారు.

ఈ సమాచారం వినగానే ప్రధానోపాధ్యాయులు దిగ్భ్రాంతి చెందారు! “ఆ మురికి నీటి గుంటలో పడవపై ప్రయాణం చేసి రావాలనే ఆలోచన మీకు ఎందుకు కలిగింది?” అంటూ ప్రశ్నించారు పిల్లలని. వారు ఆయనకు “మీరు అనుకుంటున్నట్టు కూవం ఒకప్పటి మురికి నీటి గుంట కానే కాదు. ఇప్పుడది ఒక పరిశుభ్రమైన జలాశయము” అని జవాబిచ్చారు. తామందరము ఆ కాలువను శుభ్రపరచి అందరికీ పనికి వచ్చేలా చేయాలని ఎలా నిర్ణయించుకున్నారో, ఆ పనిలో ఎలా విజయం సాధించారో ప్రధానోపాధ్యాయునికి తమ అనుభవాలను వివరంగా చెప్పారు. తమ వేసవి సెలవలన్నిటినీ తామందరూ ఈ ప్రాజెక్టు కోసమే వెచ్చించినట్లు కూడ వాళ్లు చెప్పారు. ఇప్పుడు కూవం కాలువను ప్రయాణానికి వాడుతున్నది తాము మాత్రమే కాదని, ఆ చుట్టుపక్కల చాలామంది ప్రజలు కూడా అని వివరించారు. ఇలా తాము చేసిన ఈ చిన్ని ప్రయత్నం వలననే ఇప్పుడు తామందరం పాఠశాలకు ఆలస్యం లేకుండా రాగలుగుతున్నామని ఎంతో సంబరంగా చెప్పారు.

విద్యార్థులు చెబుతున్న విషయాలు వింటూ ప్రధానోపాధ్యాయులు విస్తుపోయారు. వాళ్ల వంక ప్రశంసాపూర్వకంగా చూశారు. ప్రజోపయోగకరమైన ఇంత గొప్ప విషయాన్ని తన విద్యార్థులు ఎలా సాధించారో తెలుసుకున్న ఆయన హృదయం గర్వంతో, ఆనందంతో పొంగిపోయింది. ఆయన “రాజా! నీకు వచ్చిన ఈ ఆలోచనే ఒక అద్భుతం! నువ్వు, నీ మిత్రులు అందరూ కలసి సాధించిన ఈ ప్రాజెక్టును సైన్సు పోటీలలో మీ అంశంగా నమోదు చేసుకోండి” అని చెప్పారు. వారందరూ తమ అంగీకారం తెలిపారు. అయితే, పోటీలో తాము గెలుస్తామో లేదో ఖచ్చితంగా తెలియకపోయినా, దాన్ని గురించి వారు పట్టించుకోలేదు. ఎందుకంటే తాము చేసిన ఈ ఘనకార్యం ఎంత సఫలమైనదో, విజయవంతమైనదో వాళ్లందరికీ చాలా స్పష్టంగా తెలిసిపోయింది కనుక!

రాజా ఆలోచన అతనిని ‘యువ శాస్త్రవేత్త’గా గెలిపించింది అని చెప్పడంలో ఇక ఆశ్చర్యం ఏమీ లేదు! ప్రాజెక్టులోని ఏ ఏ కార్యక్రమాలు ఇంకా కొంత అసంపూర్తిగా మిగిలిపోయాయో వాటికి ఇకనుండి ప్రభుత్వ సహాయ సహకారాలు లభిస్తాయి! మద్రాసు నగరపు అతి అందమైన కూవం నది తన పూర్వవైభవాన్ని తిరిగి పొందటమే కాక, మరింత అందంగా, శుభ్రంగా ఒక క్రొత్త రూపం దాల్చింది. తనకు దక్కవలసిన గౌరవాన్ని తిరిగి చేజిక్కించుకున్నది. కూవం కాలువ నుండి బహిర్గతమయ్యే దుర్గంధంతో ప్రజలు అవమానభారంతో తలలు దించుకునే అవసరం లేదు. కాలుష్య భూతం ఇంక ఎప్పటికీ కాలువ ప్రతిష్ఠను అడ్డగించబోదు. తన స్నేహితులు తనకు ఇచ్చిన సహాయ సహకారాలకు రాజా వారందరికీ ఎంతగానో తన కృతజ్ఞతలు తెలుపుకొన్నాడు. పిల్లలందరికీ ఇప్పుడు ఒక విషయం ఎంతో స్పష్టంగా బోధపడింది. అదేమిటంటే – తమ తమ ఆలోచనలను సరైన సృజనాత్మక రీతిలో చూపెట్టినప్పుడు విజయం వరించి తీరుతుంది. తాము నివసించే ఈ ప్రపంచాన్ని అత్యంత అందంగా, కాలుష్యరహితంగా తీర్చిదిద్దడంలో తమను ఎవరూ ఆపలేరు గాక ఆపలేరు!

మూలం: ఉమయవన్ రామసామి

తెలుగు: వల్లూరు లీలావతి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here