కొరగానివాడు

0
9

[dropcap]“మీ[/dropcap]తో వేగలేక చస్తున్నాను. దేనికీ కొరగారు. మిమ్మల్ని తీసుకువచ్చి నాకు అంటగట్టారు” అని ఓ క్షణం మావగారి ఫోటో చూస్తూ, “మావయ్య మన పెళ్ళి నాటికి మీ గురించి ఎన్ని అబద్దాలు చెప్పాడనీ, బుద్ధిమంతుడు అని చెప్పాడు తీరా చూస్తే, మీరు మందబుద్ధి మనిషని తెలుసుకున్నాను. చిన్న పిల్లల మనస్తత్వం అన్నారు. పెళ్లయ్యాక అది లౌక్యం లేని తనం అని తెలిసి గుండెలు బాదుకున్నాను. పైగా మిమ్మల్ని అమాయకుడు అని చెప్పారు. కానీ, ఇది అమాయకత్వం కాదు, దేనికీ కొరగానితనం అని తెలిసింది. నన్ను ఇంత మభ్యపెట్టిన వాడు నరకానికే వెళ్ళుంటాడు. నాకు మిమ్మల్ని ఇచ్చి కట్టబెట్టిన పాపం ఊరికే పోతుందా” అంది ఆ ఫోటో వంక కక్షగా చూస్తూ .

“ఉన్న నన్ను వేపుకు తింటున్నావ్ చాలదూ, మళ్ళీ పోయిన మా నాన్నని ఎందుకే అస్తమానూ మధ్యలోకి తీసుకు వస్తావ్. ముందు ఆ పెయిన్ బామ్ నా భుజానికి రాయి” అన్నాడు ఎడం చేత్తో కుడి చేతిని ఒత్తుకుంటూ

“సరిపోయింది. అంత బరువు ఒకేసారి మోసుకు రాకపోతే, కూరగాయలు కొన్ని తగ్గించి కొనవలసింది. అన్నీ ఒకేసారి వండుకు తినేయలేం కదా. అందుకే అనేది, దేనికీ కొరగారు అని.ఇంతకీ ఏవైపు నొప్పి” అడిగింది బామ్ అందుకుంటూ

ఆమెని ఓసారి ఎగాదిగా చూసి, ‘ఎడం చేత్తో కుడి చేతిని ఒత్తుకోవడం చూసి కూడా, ఏ చెయ్యి నొప్పి వస్తోందో అర్థం చేసుకోలేదు కానీ , పెద్ద మేధావి ఫోజు’ అని మనసులోనే అనుకుని “సంచి ఎక్కువగా కుడిచేత్తోనే మోసాను. అందుకే కుడి చెయ్యే నొప్పి వస్తోంది. ఆ చేతికే రాయి” అన్నాడు పై బొత్తం తీసి కాలర్ వదులు చేస్తూ.

కొరగారు అని లలిత ఎప్పుడూ మధుని విసుక్కుంటూనే ఉంటుంది. అలా అతన్ని ఆమె అనీ అనీ అదే ఆమెకి ఊతపదంగా మారిపోయింది. మధుకి కూడా ఆమె తిట్లకి అలవాటు పడిపోయి, మౌనంగా ఉండిపోయేవాడు. మొగుడు కొరగానివాడిగా ఉన్నా, ఇల్లంతా ఆమే చక్కదిద్దేస్తున్నట్టు అందరికీ గొప్పగా చెప్పుకుంటూ మురిసిపోయేది. వినేవారు ఆమె మొహంపై ఏవీ అనకపోయినా, చాటుగా ఆమెని ఒట్టి గయ్యాళి గంప, మొగుడిని వేపుకు తింటుంది అని చెవులు కొరుక్కుంటూనే ఉంటారు.అతని స్నేహితులు, బంధువులూ ఆమెని పద్ధతి మార్చుకోమని హెచ్చరించమనీ, మరీ ప్రతి దానికీ తల ఊపకుండా కొంచెం బింకంగా ఉండమనీ, మనస్కరిoచకపోయినా కాస్త కఠినంగా ఉంటే ఆమె చచ్చినట్టు దారిలోకి వస్తుందని చాలా సలహాలు ఇచ్చారు. కానీ మధు మాత్రం అవి వినేసి, చిన్న నవ్వు నవ్వి ఊరుకునేవాడు. అలా రెండు సంవత్సరాలు గడిచినా లలితలో చెంచాడు మార్పు రాలేదు. మొగుడ్ని డామినేట్ చేసి గొప్పగా ఫీల్ అయిపోతూనే ఉంది.

“చాలు, చాలు, చొక్కా అలా ఉంచండి రాస్తాను” అని మొహం చిరాగ్గా పెట్టి, కుడి బుజానికి బామ్ రాస్తోంది. ఇంతలో ఉన్నట్టుండి, పెద్ద గాలి వేయడంతో, మావగారి ఫోటో అటూ ఇటూ ఊగిపోయి నేల మీద డబేల్‌మంటూ పడిపోయి బళ్ళున పగిలిపోయింది. అతని ఫోటో కింద గోడకి ఆనించి ఉంచిన అతని చేతి కర్ర కూడా కింద పడిపోయింది.

“మనిషి పోయాక, ఏదో చిన్న ఫోటో పెట్టొచు కానీ, ఇలా సినిమా వాల్‌పోస్టరంత ఫోటోని అద్దం కట్టించి హాల్లో వేలాడదీస్తే పడిపోక ఏమౌతుంది. పైగా అతని చేతి కర్రొకటి. ఇంటికి వచ్చిన వాళ్ళు దాన్ని చూసి నవ్విపోతున్నారు” అని ఆమె అంటుండగానే, మధు లలిత వంక ఎర్రగా చూస్తూ “నా కొడుకుని అంటున్నావ్ సరే, మధ్యలో ప్రతిసారీ నన్నెందుకు లాగడం. పోయాక కూడా నన్ను ప్రశాంతంగా ఉండనివ్వా కోడలా” అంటూ లేచెళ్ళి ఆ చేతి కర్రని చేతిలోకి తీసుకున్నాడు మధు.

“ఏవిటి ఉన్నట్టుండి గొంతు బొంత కాకిలా మారింది, నడక కూడా నడ్డి పట్టేసినట్టు నడుస్తున్నారు” అడిగింది కోపంగా చూస్తూ

“మారింది నడక, గొంతు కాదు, మనిషి.. నేను మధుబాబుని కాదు, మీ మావయ్య పిల్లబాబుని” అని ఎర్రగా ఆమె వంక చూస్తూ “ఈరోజు నా చేతి కర్రతో నీ బుర్ర మీద కొట్టి నా కోపం తీర్చుకుంటాను” అంటూ కర్ర పైకెత్తాడు.

దాంతో లలిత భయంగా “అమ్మో దెయ్యం మావయ్య, మా ఆయనలో దూరాడు” అని పరిగెత్తి, గోడ దగ్గరకి వెళ్ళి ఆగిపోయి, “వద్దు మావయ్యా, తిట్టగానే నువ్ ఇలా చంద్రముఖిలా వస్తావని ఊహించలేదు. ఇంతకీ ఇప్పుడు నేనేం చేశానని” అడిగింది అమాయకంగా

“ఏం చేశానని అమాయకంగా అడుగుతున్నవా, పోయిన నన్ను రోజూ తిట్టుకోవడమే నీకో పనైపోయింది. ఇంటికి వచ్చిన వాళ్ళకి నా ఫోటో చూపించి జోకులు వేయడం, నా చేతి కర్రని మొక్కలు పాతడానిగ్గాను గోతులు తీయడానికి, బూజు కర్రకి కట్టి బూజు దులపడానికి, అవ్వ, ఆఖరికి కాలవ చెత్త అడ్డు తీయడానికి కూడా నా చేతి కర్రే వాడతావా. పోనీ అది పక్కన పెడితే, భర్త అని చూడకుండా తేలిగ్గా చూడటం, వాడిని కూరలో కరివేపాకులా తీసేయడం, ఏ మాట పడితే ఆ మాట అనడం నేను అసలు సహించలేకపోతున్నాను” చెప్పాడు పళ్ళు కొరికేస్తూ.

“అయ్యో లేదు మావయ్య, ఈ సారి నుండి మీ అబ్బాయిని ఏం అనను.బుద్ధిగా నడుచుకుంటాను, మదర్-ఇన్-లా ప్రోమీస్” అని నెత్తిన చేయి పెట్టుకుని “ఈ ఒక్కసారికీ నన్ను నమ్మి, ఆయన్ని వదిలి మీరు ఫోటోలోకి వెళ్ళండి మావయ్యా” బ్రతిమాలుతూ అంది

ఆమె మాటలకి, మధులో ఉన్న పిల్లబాబు కొంత శాంతించి, కర్ర పక్కన పడేసి “మీ ఆయన్ని వదలకపోతే బాధగా ఉందా” అడిగాడు.

“అవును మావయ్యా, మధ్యాహ్నం తోవాల్సిన గిన్నెలు అలానే ఉండిపోయాయ్ మరి” చెప్పింది కాస్త దిగులు స్వరంతో

“ఛీ, నువు మారవు, ఇక నుండి ఆ పనులు నువ్వే చేయి” పెద్ద గొంతుతో చెప్పాడు.

“సరే మావయ్యా, అలాగే” అంది. ఆ వెంటనే సొమ్మసిల్లి పడిపోయాడు మధు. దాంతో ముఖాన నీళ్ళు జల్లి, “లేవండీ” అంది.

అటూ,ఇటూ అనుమానంగా చూసి “ఏం జరిగింది లలితా, ఎందుకలా బిక్కచచ్చిపోయావ్” అడిగాడు.

“అబ్బే ఏం లేదు, జ్యూస్ ఏవైనా తెమ్మంటారా” అడిగింది భయంగా ఆ కర్ర వంక చూస్తూ.

“ఏంటి ఈ వినయం హఠాత్తుగా” అడిగాడు అనుమానంగా

“ఇప్పుడే వాట్సాప్‌లో ఓ ఫ్రెండ్ పెట్టిన స్టేటస్ చదివి నాలో ఈ మార్పు మొదలైంది లెండి” చెప్పిందామె.

“సరే, చల్లగా కొంచెం ఆరెంజ్ జ్యూస్ పట్టుకురా” అని పైకి అనేసి, ‘హమ్మయ్య, అప్పటికి మెరిసిన ఆలోచనతో ఆడిన నాటకం, ఈ రేంజ్‌లో సక్సెస్ అవుతుందని ఊహించలేదు. ఇక నుండి నేను కొరగాని మొగుడ్ని కాదు’ అనుకున్నాడు మధు, మనసులో తెగ సంబరపడిపోతూ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here