కొరియానం – A Journey Through Korean Cinema-17

0
9

Damien In Omen, Mink In The Medium

[dropcap]జూ[/dropcap]న్ 17 1999.

ఎడ్జ్ బాస్టన్,

బర్మింగ్హామ్.

చీకట్లు ముసురుకుంటున్నాయి. వాతావరణం అద్భుతంగా ఉంది. చల్లని ఆ సాయంకాలం వేళ ఎవరైనా షికారుకెళ్ళాలనుకుంటారు. హాయిగా ఒక కుర్చీలో సాగిలపడి టీవీ చూస్తూ ఫామిలీతో ఆనందంగా గడపాలనుకుంటారు. కానీ అక్కడ ఆటగాళ్ళకు చెమటలు పడుతున్నాయి. ఆలోచనలన్నీ ఒక చోటే కేంద్రీకరించాలి. మరొక్క అరగంట గడిస్తే ఫలితం తేలుతుంది. ఫైనల్ కోసం ఇంగ్లండ్‌లో ఉండాలా? లేక, ఇంటికి వెళ్ళాలా అని.

ఇటువైపు మన మన ఇళ్ళలో కూర్చుని ఉత్కంఠభరితంగా జరుగుతున్న ఆ మ్యాచ్ చూస్తున్న మనకు కూడా చెమటలు పడుతున్నాయి. మనకు అంటే చూసేవారికి అని. ఆ సందర్భంలో చాలామంది ఆస్ట్రేలియా కన్నా దక్షిణాఫ్రికా గెలవాలనే తపన పడుతున్నారు. పైకి చూస్తే ఆస్ట్రేలియాదే పైచేయి. కానీ, వారికీ విజయానికీ మధ్య ఒక అడ్డుగోడ.

అతడే… లాన్స్ క్లూసెనర్.

“పెను తుఫాను తలొంచి చూసే తొలి నిప్పుకణం అతడే!”

అతడు సినిమాలో టైటిల్ సాంగ్‌లో వచ్చే ఈ వాక్యాన్ని క్లూసెనర్‌ను చూసే రాసి ఉంటాడు విశ్వా.

క్లూసెనర్ పేరు చెపితేనే బౌలర్లు వణికిపోతున్నారు. అటు బౌలింగైనా, ఇటు బ్యాటింగైనా లేదా ఫీల్డింగైనా, ఒక్క ముక్కలో ఆల్రౌండరంటే నిలువెత్తు రూపం. జెఫ్రీ బాయ్కాట్ మాటల్లో చెప్పాలంటే ద మోస్ట్ డేంజరస్ హార్డ్ హిట్టింగ్ బ్యాట్స్‌మన్. ఈ టోర్నీ మొదలైనప్పటి నుంచీ కేవలం ఒక్కసారే అతన్ని ప్రత్యర్థి బౌలర్లు ఔట్ చేయగలిగారు. క్రీజులో ఉండి జట్టుని గెలిపించకపోవటమన్నది లేనే లేదు. ఏ కెప్టెనైనా కోరుకునేది అలాంటి ఆటగాడినే. క్రితం మ్యాచుల్లో పాకిస్తాన్ మీద అతను ఆడిన ఆటకు కళ్ళు చెదిరిపోవాల్సిందే.

సౌతాఫ్రికన్ అభిమానులకతను ఒక హీమ్యాన్. అతను క్రీజులోకి వచ్చేసరికి ఆ జట్టుకు ముప్పై ఒక్క బంతుల్లో ముప్పై తొమ్మిది పరుగులు కావాలి. ఆస్టేలియాకు నాలుగు వికెట్లు కావాలి. షేన్ వార్న్ జట్టును గెలిపించేందుకు శాయశక్తులా కృషి చేశాడు. నాలుగు వికెట్లు సాధించాడు. వివాదాస్పదమైనా హ్యాన్సీ క్రోన్యేని ఔట్ చేశాడు. క్రోన్యే స్పిన్ బౌలింగుని సమర్థంగా ఆడగలడనే పేరుంది. అతను డకౌటవటం ఆసీస్ జట్టుకు కొండంత బలాన్నిచ్చింది.

కలిస్ లాంటి నిలదొక్కుకున్న ఆటగాడిని ఔట్ చేసి ఆ జట్టుకు సరైన ఊపునిచ్చాడు వార్నీ. ఇప్పుడు మన మధ్య లేడు కానీ అతను మనకు పంచిన జ్ఞాపకాలు ఎన్నో!

అరగంట పావుగంటైంది. క్లూసెనర్ తన ప్రతాపం చాటుతున్నాడు. ఇంతలో బౌచర్‌ని మెక్గ్రాత్ బౌల్డ్ చేశాడు. వచ్చింది స్టీవ్ ఎల్వర్దీ. నిజంగా వర్దీ ప్లేయర్. సమర్థుడైన సీమ్ బౌలరే కాకుండా కాస్తో కూస్తో బ్యాటును ఝళిపించగలడు. అతన్ని అడ్డుపెట్టుకునే క్లూసెనర్ లీగ్ స్టేజ్‌లో శ్రీ లంకను ఓడించాడు. అప్పటి డిఫెండింగ్ చాంపియన్ శ్రీ లంక.

పాల్ రైఫిల్, గ్లెన్ మెక్గ్రాత్ అతన్ని రనౌట్ చేయటంతో చివరి పది నిమిషాలకొచ్చింది కథ. కళ్ళ ముందు విజయం. క్లూసెనర్‌తో డొనాల్డ్. అతనో ట్రాజిక్ హీరో. విజయంపైన ఆస్ట్రేలియాకు మళ్ళా కాస్త ధీమా కలుగుతున్న సమయమది. క్లూసెనర్ సిక్స్ కొట్టాడు. సింగిలాపితే డొనాల్డ్ బ్యాటింగ్. కానీ క్లూసెనర్ క్రీజులోకి డొనాల్డ్‌ని రానివ్వలేదు. ఎవరూ ఊహించని రీతిలో సింగిల్ తీసి తనే బ్యాటింగ్ క్రీజు వైపు నిలిచాడు. Alan Donald was non-striker. ఎనిమిది నిమిషాలు. తరువాత non-winner.

డామియెన్ ఫ్లెమింగ్! 1990ల నాటి పిలకాయలకే కాదు. ఎనభైల్లో క్రికెట్ చూసి ప్రేమలో పడి ఆటను ఫాలో అయిన వారు అతన్ని మర్చిపోలేరు. చివరి ఓవర్ల స్పెషలిస్టు. అంతకు మూడేళ్ళ క్రితం మొహాలీలో జరిగిన ప్రపంచ కప్ సెమీ ఫైనల్‌లో ఇలాగే గెలుపు ముంగిట నిలబడి నువ్వా? నేనా? అన్న రీతిన ఆడుతున్న ఆస్ట్రేలియా వెస్టిండీస్ జట్ల మధ్య మ్యాచ్‌ను ఆసీస్ వైపు మరల్చేశాడు. అతనే ఇప్పుడు క్లూసెనర్‌కు బంతి వేయాల్సింది.

ఆరు నిమిషాలు.

మొదటి బంతి బౌండరీ దాటింది. క్లూసెనర్ కవర్స్ మీదుగా ఆడిన ఆ షాట్ ఇప్పటికీ చూసిన వారి కళ్ళముందు మెదులుతూనే ఉంటుంది. రియల్లీ సూపర్లేటివ్.

మూడు నిముషాలు. మరో అద్భుతమైన బంతి. అంతకు మించిన అద్భుతమైన షాట్. ఆరు బంతుల్లో తొమ్మిది పరుగులు కాస్తా నాలుగు బంతుల్లో ఒక పరుగు.

క్లూసెనర్ రిలాక్స్ అయ్యాడు. డొనాల్డ్ ఏడు నిమిషాలున్నా బంతినెదుర్కోలేదు. అతను వామప్ కాలేదు.

డామియెన్ ఫ్లెమింగ్ బంతిని విసిరాడు. మిడాన్లో లీమన్ రనౌట్ ఛాన్స్‌ని మిస్ చేశాడు. అంతా ఊపిరి బిగబట్టి చూస్తున్నారు.

ఒక్క నిమిషం. ఒకే ఒక్క నిమిషం. నాలుగో బంతి. ఎన్ని కోట్ల మంది ఆ క్షణాన చేస్తున్న పని ఆపేసి మరీ టీవీలకు కళ్ళప్పగించారు.

డామియెన్ ఫ్లెమింగ్ బంతిని విసిరాడు. అందరూ ఊపిరి బిగబట్టారు. సరైన స్థితిలో లేని డొనాల్డ్ క్లూసెనర్ పిలుపుని అందుకోలేదు. మార్క్ వా ఇటు వైపు డొనాల్డ్ క్రీజుని వదలటం గమనించి ఫ్లెమింగ్‌కి బంతి నందించ బోయాడు. రనౌట్ మిస్.

కానీ ఆ హడావిడిలో క్లూసెనర్ పరిగెత్తుకొచ్చేశాడు. అతనూ, డొనాల్డ్ ఒక వైపే ఉన్నారు. డామియెన్ బంతిని గిల్లీకి విసిరాడు. డొనాల్డ్ ఔట్.

అప్పుడు ఎందరి హృదయాలు మూగగా రోదించాయో. ఎన్ని రోజులపాటూ, వారాలపాటూ, నెలలపాటూ, సంవత్సరాల పాటూ ఆ మ్యాచ్ గురించి మాట్లాడుకున్నారో.

ఇప్పటికీ, ఆ చివరి బంతి, అప్పుడు జరిగిన సంఘటనలు చాలామంది మర్చిపోలేరు.

ఎందుకు?

మనం మన ఎమోషన్లను అంతగా invest చేశాం ఆ మ్యాచ్ మీద. ప్రత్యేకించి దక్షిణాఫ్రికా అంటే మనవారికి ఆ సమయంలో ఒకరకమైన సాఫ్ట్ కార్నర్.

ఆ మ్యాచ్‌ను ఇప్పటికీ వన్ డే మ్యాచ్‌ల చరిత్రలోనే అత్యుత్తమమైనదిగా పేర్కొన్నారు. 2019 వరల్డ్ కప్ ఫైనల్, 2006లో ఆస్ట్రేలియా 434 కొడితే దక్షిణాఫ్రికా 438 చేసి గెలిచిన మ్యాచ్‌లు కూడా అదే గుర్తింపు పొందినా, చరిత్రలో ఉన్న ప్రాధాన్యతను బట్టీ ఆ 1999 క్సూసెనర్ వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్‌నే గొప్పదిగా చెప్పి తీరాలి.

చూశారా? నేనైతే బంతి బంతినీ ఇప్పటికీ గుర్తు పెట్టుకున్నాను. ఆటలు ఆడుతూ, ఆటలు చూస్తూ వ్యక్తిత్వాన్ని ఎక్కువ మల్చుకున్న నాకు ఈ మ్యాచ్ తరువాత నా ఆలోచనా తీరే మారిపోయింది. విజేతలు ఎప్పుడూ ఎందుకు గెలుస్తుంటారు? కొందరు ఎంత ప్రయత్నించినా ఎందుకు విజేతలు కాలేరు అన్నదానికి సమాధానం లభించింది. అలాగే జనం ఎందుకు, ఎవరి మీద, ఎప్పుడు సానుభూతి చూపిస్తారు అన్నది కూడా అవగతమైంది.*

The Exorcist, The Omen, The Evil Dead లను సాధారణంగా మనవాళ్ళు చాలా గొప్ప హారర్ సినిమాల్లా చెప్తారు. విశేషించి The Omen లో jump scares, భీతావహమైన సన్నివేశాలు ఉండవు. వీలైనంతగా mind play మీదనే సినిమా నడుస్తుంది. The Exorcist అలా కాదు. అన్ని రకాల హారర్ టెక్నిక్స్ వాడేశారు.

Sam Raimi తీసిన The Evil Dead అయితే modern horror classic. ప్రతి నాలుగైదు నిముషాలకూ ఒక కొత్తరకం jump scare తో మనల్ని బాదేస్తాడు. కానీ విచిత్రంగా చూడగా చూడగా The Exorcist లో ఆ హారర్ సన్నివేశాలు చూడగా చూడగా అలవాటు పడతాం. ఈవిల్ డెడ్ లో ఒకప్పుడు ఝడిపించాయి అనే సీన్లు ఇప్పుడు చాలా నవ్వు వచ్చేలా ఉంటాయి. అయినా కూడా… we have to say that film aged well. అదే శామ్ రైమీ creativity ని పట్టి ఇస్తుంది.

ఒక సినిమా టెక్నిక్ వల్ల మన్లని తన గ్రిప్ లోకి తీసుకు వెళ్ళి భయపెడుతుంది. మరో సినిమా మన subconscious mind లో దూరి లోపలి భయాలను బైటకు తెచ్చి భయపెడుతుంది. మరో సినిమా, టైమ్లీగా కొత్త కొత్త jump scares వదులుతూ హడలగొడుతుంది.

మరి రాంగ్జాంగ్ ఏ విధంగా భయపెడుతుంది?

దృశ్యాత్మకంగా ఒకవైపు (బతికి ఉన్నకుక్కను ఉడకబెట్టి పీక్కుని తినే సీన్), మన subconscious mind లో దూరి మరోవైపు (చివరి దృశ్యం, నిమ్ మరణం), ఆ పైన కొన్ని చోట్ల షాకింగ్ jump scares తో. అసలు హారర్ సినిమాల వల్ల ఉపయోగం ఏమిటి? అసలు వాటిని కూడా క్లాసిక్స్ అనటమేంటి అని కొందరు అడుగుతారు. అంతర్జాతీయ సినిమాలో ఏ జాన్రాకు ఆ జాన్రాలో ప్రత్యేకంగా గొప్ప సినిమాలుగా ముద్ర పడినవి ఉంటాయి. మనవైపు అలా కాదు. ప్రత్యేకించి సాహిత్యంలో హారర్, సైన్స్ ఫిక్షన్, చివరికి డిటెక్టివ్-స్పై కథలను కూడా అసలు సాహిత్యంగా గుర్తించరు.

Subconscious mind లో ప్రత్యేకంగా సాహిత్యం సమాజ శ్రేయస్సు కొరకే, ఉద్యమాలకు మద్దతు కొరకే, వాదాలను వినిపించేందుకే అనే ఆలోచనలను జొప్పించి, సాహిత్యాన్ని గిరిగీసి సరిహద్దుల్లో ఉంచేశారు.

Horror fiction helps in psycho-analysis of people. They are very effective in showcasing what’s wrong with the society and how to right the wrongs. పైనంతా చెప్పుకున్న దక్షిణాఫ్రికా-ఆస్ట్రేలియా క్రికెట్ మ్యాచ్ ఎంత ప్రభావం చూపక పోతే జనం ఇప్పటికీ ఎందుకు అంత గుర్తు పెట్టుకుంటారు?

అదే ఐదో తరగతి సైన్సు పుస్తకంలో చదువుకున్న విషయం చెప్పమంటే ఎంతమందికి గుర్తు ఉంటుంది? Maths teaching చేయని వారికి, IT professionals కాని వారికి, రోజువారీ mathematics and logic వాడాల్సిన అవసరం రాని వారికి Tests of Divisibility ఎంతమందికి గుర్తుంటుంది? ఇచ్చిన సంఖ్య 11 తో భాగింపబడుతుందో లేదో చెప్పే సూత్రం ఎందరికి నాలుక మీద ఆడుతుంది?

కానీ, హారర్ సినిమాలు చూసి, పిల్లలకు చులాగ్గా అర్థమయ్యేలా mathematics పాఠాలు చెప్పిన లెక్కల మాస్టారు నాకు తెలుసు. ఎక్కడ నొక్కాలో అది తెలిసిన వ్యక్తి.

Australia vs South Africa World Cup 1999 semifinal, Exorcist, The Omen, Evil Dead, Rangjong ఇవన్నీ మన subconscious లో తిష్ట వేసుకుని కూర్చుంటాయి. అందుకే మన మీద అంత ప్రభావం చూపిస్తాయి.

అసలు నిజానికి ఆ మ్యాచ్‌ను మనం గుర్తు పెట్టుకోవాల్సింది దక్షిణాఫ్రికా తరఫున కాదు. ఆస్ట్రేలియా వైపు నుంచి. అప్పుడు ఎంతటి విపత్కర పరిస్థితుల్లో అయినా మనం విజయాన్ని ఎలా చేజిక్కించుకోవాలో తెలుస్తుంది.

The Exorcist ద్వారా నేర్చుకోవాల్సింది… of course అందరికీ తెలుసనుకోండి.

The Omen లో మన విశ్వాసం కన్నా భయం మనని ఎలా త్వరగా లొంగదీసుకుంటుందో చూపారు. అదే మన విశ్వాసం బలంగా ఉంటే కథలో Damien గెలిచేవాడు కాదు.

Evil Dead నిజానికి ఒక గొప్ప సెటైర్. అసలు మనం భయపడాల్సినంత విషయం ఏదీ ఉండదని, కేవలం ఏం జరుగబోతోందో మనకు తెలియక పోవటం వల్ల రాబోయే ప్రమాదాన్ని ఎలా ఎదుర్కోవాలో సన్నధ్ధులం కాలేదు కనుక భయపడతాం.

ఇక రాంగ్జాంగ్ విషయానికి వద్దాం…

వచ్చే వారం.

హలో! గమనించారా? ఆ ఎదుటి జట్ల బ్యాట్స్‌మన్ల మానసిక స్థితిని దెబ్బకొట్టి ఆస్ట్రేలియాను గెలిపించిన బౌలర్ పేరు కూడా… Damien. డామియెన్!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here