కొరియానం – A Journey Through Korean Cinema-41

1
7

Be Go पल – 2 Continues

[dropcap]53[/dropcap] సంవత్సరాల క్రితం, జూన్ 1950లో, ఈ కుటుంబం దక్షిణ కొరియా రాజధాని సోల్ నగరంలో తమ జీవితాలను గుడుపుతుండేది. ఈ జిన్-టే కు తన తమ్ముడు ఈ జిన్-స్యుక్ అంటే ప్రాణం. తమ్ముడి కోసం ప్రాణాలు విడువటానికైనా రెడీ. తన గురించి కూడా ఆలోచించుకోకుండా తమ్ముడి కోసం ఏమైనా చేయటంలో తగ్గేదే లే టైప్.

అలా అని మన పాత సినిమాల తరహాలో చెల్లెమ్మా, తమ్ముడు తమ్ముడూ తమ్ముడూ (శోభన్ బాబు వాయ్స్ లో చదూకోండి) వైనం కాదు. కానీ ఆ అభిమానం మన మనసులను గుండెలను చెమర్చేలా దర్శకుడు ఒక్క సీక్వెన్స్‌లో చూపిస్తాడు. అనవసర డైలాగ్‌లు, ఓవర్ ఎమోషన్లు ఉండవు. మనకు కూడా అలాంటి అన్నయ్య ఉంటే బాగుండు అనిపిస్తుంది. అది అసాధ్యం కూడా కాదు.

ఇక్కడ ఇంకో విశేషం చెప్పుకోవాలి. అన్న ఎక్కడా తన తమ్ముడి కోసం నేను కష్టపడుతున్నాను, త్యాగం చేస్తున్నాను అన్న ఫీలింగ్ ఎక్కడా చూపడు. అదేదో తన స్వ సంపాదనను కేవలం తన మీద మాత్రమే వెచ్చిస్తున్నాను అన్నంత చులాగ్గా తమ్ముడి కోసం ఖర్చు చేస్తాడు.

దానికోసం అతనికున్న ఏకైక ఆధారం షూ షైన్ స్టాండ్.

ఆరోజు తమ్ముడిని చాలా ఖరీదైన వస్తువులు అమ్మే దుకాణం చుట్టూ తిప్పి, ఎప్పటి నుంచో కలలు కంటున్న వెండి పెన్ జిన్-టే కొనిపెడతాడు. తమ్ముడి షూ మీద చిన్న మరక ఉన్నా భరించలేడు. అందుకే ప్రపంచంలోనే అత్యంత గొప్ప షూ తన తమ్ముడి కోసం డిజైన్ చేసి తయారు చేసే పనిలో ఉంటాడు.

ఈ జిన్-టే కు ఒక ప్రేయసి. వయసొచ్చింది కదా. ఆ మాత్రం తప్పదు. ఆమె పేరు, యూంగ్-షిన్. అందమైనది మాత్రమే కాదు. స్వచ్ఛమైన మనసు కలది. మహా పట్టుదల కలిగిన ధైర్యవంతురాలు. ఇవేమీ మాటల్లో చెప్పరు. తెరమీద పాత్రలను చూడగానే మనకు అర్థమవుతుంది.

యూంగ్-షిన్ Lee’s Noodle Shop లో పని చేస్తుంటుంది.

ఇదిలా ఉండగా, ఆ సంవత్సరం జూన్ 25న, ఉత్తర కొరియా దక్షిణ కొరియాపై దండెత్తి వస్తుంది. దాంతో సరైన సైనిక దళాలు సంఖ్య లేనందున మన ఈ సోదరులిద్దరూ బలవంతంగా యుద్ధంలో పాల్గొనవలసి వస్తుంది.

వారు 1వ పదాతిదళ విభాగంలో పని చేయవలసి వస్తుంది. ఇంచన్ (Inchon) వద్ద విజయవంతమైన U.S. ఉభయచర ల్యాండింగ్ పై ఉత్తరం వైపుకు వెళ్లడానికి ముందు పుసాన్ పెరిమీటర్ వద్ద పోరాడతారు.. దక్షిణ కొరియా సైనికుడికి అత్యున్నత పురస్కారం అయిన టేగుక్ కార్డన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ మిలిటరీ మెరిట్ (Taeguk Cordon of the Order of Military Merit) సంపాదించగలిగితే, అతని తమ్ముడిని ఇంటికి పంపవచ్చని జిన్-టేకు ఒక ఉన్నతాధికారి చెప్తాడు.

దాంతో తమ్ముడి చదువుకు మిలిటరీ సర్వీస్ వల్ల ఆటంకం రాకుండా ఉండటానికి జిన్-టే అనేక ప్రమాదకరమైన మిషన్ల కోసం స్వచ్ఛందంగా రిజిస్టర్ చేసుకుని (కొన్ని తమ్ముడి బదులు కూడా) పనిచేస్తాడు.

అతని ధైర్య సాహసాలకు అతన్ని సార్జంట్‌ను చేస్తారు. ఈ సాహసం అంతా తమ్ముడి మీద అతని అంతులేని ప్రేమ వల్ల వచ్చింది. హృదయపు లోతుల్లో అతను సోల్ నగరంలో తమ్ముడి భవిష్యత్ గురించి కలలు కంటూ షూ పాలిష్ చేసుకునే అమాయక యువకుడే!

ప్యోంగ్యాంగ్ పట్టణం యుద్ధంలో అతని పరాక్రమం చివరకు జిన్-టే కలలు కన్న పతకం లభించేలా చేస్తుంది. కానీ జిన్-స్యుక్ అతన్ని చూసి మొదటిసారిగా భయపడతాడు. అంత క్రౌర్యాన్ని ఆ యుద్ధంలో చూపుతాడు అన్న.

ఈలోగా ఉత్తర కొరియాకు చైనా సహాయం వస్తుంది. అన్నదమ్ములు తన్నుకుంటే మధ్యలో అగ్గి రాజేసే మేనమామ పిల్లలలా. దాంతో అమెరికా సహాయమందిస్తున్న దక్షిణ కొరియా, ఐక్యరాజ్య సమితి సంకీర్ణ సైన్యాలు కాస్త వెనుకంజ వేయాల్సి వస్తుంది. వీరంతా సోల్ నగరానికి తిరిగి రావలసి వస్తుంది.

కానీ సోల్ నగరంలో, జిన్-టే ప్రేయసి యూంగ్-షిన్, కమ్యూనిస్ట్ ఆక్రమణ సమయంలో కమ్యూనిస్ట్ పార్టీలో చేరినట్లు అనుమానించబడుతుంది. దాంతో, దక్షిణ కొరియా మిలిటరీ ఆమెను అరెస్ట్ చేస్తుంది. సోదరులు వారిని ఆపడానికి ప్రయత్నిస్తారు. మొదటిసారి జీవితంలో తమ్ముడి కోసం కాకుండా ఒకరితో జిన్-టే పోరాడేది యూంగ్ కోసమే.

పోరాటంలో, యూంగ్-షిన్ కాల్చి చంపబడుతుంది. పులి మీద పుట్రలా ఆమెను రక్షించడానికి ప్రయత్నించినందుకు మిలిటరీ హీరో అయినా కూడా అతన్ని నమ్మకుండా జిన్-టే ను, అతని తమ్ముడు జిన్-స్యుక్ ను అరెస్టు చేస్తారు.

తన వల్ల తన తమ్ముడి జీవితం నాశనం కాకూడదని, మొత్తం నేరం తన మీద వేసుకుని తన సోదరుడిని విడుదల చేయమని జిన్-టే అభ్యర్థిస్తాడు. కానీ అతని అభ్యర్థనలు అరణ్యరోదనలుగా మారతాయి.

చేసిన అభ్యర్థన తిరస్కరించబడింది. ప్రియురాలు మరణించింది. ఇక్కడే మరో ఘోరం జరిగి, జిన్-టే ను మానవ మృగంగా మారుస్తుంది.

శత్రు దళాలు వీరున్న జైలుకు చేరుకున్నప్పుడు లోపల ఉన్న ఖైదీలతో జైలుకు నిప్పంటించమని భద్రతా కమాండర్ ఆదేశిస్తాడు. తన సోదరుడిని రక్షించడానికి ప్రయత్నిస్తూ, జిన్-టే స్పృహ కోల్పోతాడు. స్పృహ వచ్చాక జిన్-స్యుక్ కనపడడు. తమ్ముడు అగ్నిప్రమాదంలో చనిపోయాడని నమ్ముతాడు. అతని వేదన వర్ణనాతీతం.

ఇంత ఘోరం చేశాక ఆ జైల్ వార్డెన్ చైనీయులకు లొంగిపోతాడు. ఆగ్రహంతో జిన్-టే జైలు వార్డెన్ని చైనీస్ సైనికులు బంధించే ముందు హత్య చేస్తాడు.

నిజానికి, జిన్-స్యుక్ అన్నగారి సహాయ ప్రయత్నాల వల్ల తప్పించుకుంటాడు. కానీ బాగా గాయపడతాడు. తర్వాత తెలియకుండా సైనిక ఆసుపత్రికి తరలింపబడతాడు. అన్నదమ్ములు గతంలో పని చేసిన సైనికదళంలో పై స్థానంలో పనిచేసి వికలాంగుడిగా రిటైర్ అయిన అంకుల్ యాంగ్ రక్షిస్తాడు. అతను జిన్-టే చనిపోయాడనుకుంటాడు. తమ్ముడి మీద అతని ప్రేమ తెలుసు కనుక జిన్-స్యుక్‌ను కాపాడతాడు. అతని మీద గౌరవాభిమానాల వల్ల. ఎంతైనా వార్ హీరో కదా.

కొంత కాలం గడుస్తుంది.

జిన్-స్యుక్ కు తన అన్న ఇప్పుడు ఉత్తర కొరియా సైన్యంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఫ్లాగ్ యూనిట్ లో ప్రముఖ వీరుడిగా ఉన్నాడని తెలుస్తుంది. దాంతో జిన్-స్యుక్ తిరిగి సైన్యంలో చేరతాడు. ఎలాగైనా 38th Parallel వద్ద జరిగే పోరులో తనని కూడా చేరనిమ్మని కోరుతాడు. మిలిటరీ అతని అభ్యర్థనను నిరాకరిస్తుంది.

ఇక లాభం లేదనుకుని జిన్-స్యుక్ అన్నగారి కోసం సరిహద్దు దాటి ఉత్తర కొరియా సైన్యంలో చేరగోరతాడు. తాను జిన్-టే తమ్ముడిని అని చెప్తాడు. కానీ, జిన్-టే ఇంతకు మునుపే తన తమ్ముడిని అన్యాయంగా పొట్టన పెట్టుకున్న దక్షిణ కొరియాకు బుద్ధి చెప్పాలని మీ వైపు వచ్చానని చెప్పి ఉండటం వల్ల జిన్-స్యుక్‌ను నమ్మరు. అతన్ని దక్షిణ కొరియా గూఢచారిగా భావిస్తారు. చిత్రహింసలు పెడదామని తీసుకు వెళుతుంటే ఐక్యరాజ్య సమితి సంకీర్ణ సైన్యాలతో దక్షిణ కొరియా సైన్యం దాడి చేసి ఈ సైనిక స్థావరం మీద పట్టు బిగిస్తుంటే జిన్-టే ఆధ్వర్యంలోని ఉత్తర కొరియా దళాలు కమ్ముకుని వస్తాయి. అటు అన్న, ఇటు తమ్ముడు.

బాగా గాయాలు ఉన్నందున అన్న తమ్ముడిని గుర్తుపట్టడు. యుద్ధంలో అన్నదమ్ముల ముఖాముఖీ!

తరువాత?

చూస్తున్నంత సేపూ అన్నదమ్ముల అనుబంధానికీ, ఒకరిమీద మరొకరికున్న ప్రేమ, ఆప్యాయతలకు, వారి దేశ భక్తికి కళ్ళవెంట నీరు కారుతుంది. ఆనందం. ఉద్వేగం. బాధ. విషాదం. Nostalgic feeling. ఎక్కడా కృత్రిమంగా అనిపించకుండా దర్శకుడు కాంగ్ ఈ సినిమాను తీశాడు.

కొరియన్లు కాసుల వర్షం కురిపించారు. దాదాపు సంవత్సరం పాటూ థియేటర్లలో ఆడింది. షిరీ లో పోరాట సన్నివేశాలను గ్లోరిఫై చేసి చూపించిన దర్శకుడు, ఈ సినిమాలో యుద్ధకలిని అంతే ప్రభావవంతంగా చూపిస్తాడు. యుద్ధం ముఖ్యం కాదని శాంతి సౌహార్ద్రతలే ప్రధానమని చెప్తాడు.

ఇక్కడికి ఆపి ఆదాము దీర్ఘ శ్వాస తీసుకుంటాడు. ఈ కథ విన్న అవ్వ మనసు నిండుతుంది.

దర్శకుడి అంతరంగం వచ్చేవారం.

అంతవరకూ, తెలుగు వాళ్ళం కులాల పేరుతో తన్నుకు చద్దాం! న్యూస్ చానళ్ళకు కంటెంట్ కావాలి కదా!

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here