కోరికల నియంత్రణకు గీతా మార్గం

0
10

[dropcap]భ[/dropcap]గవద్గీత 2 వ అధ్యాయం 62 వ శ్లోకం

ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే

సంగాత్సంజాయతే కామః కామాత్క్రోధోభిజాయతే

ఇంద్రియార్ధములను ధ్యానించేటప్పుడు వాని పట్ల మానవులకు ఆసక్తి కలుగుతుంది. ఆ ఆసక్తి నుండి కామం (కోరికలు) వృద్ధి పొందగా, కామం నుండి క్రోధము ఉద్భవిస్తుంది అని పై శ్లోకం భావం.

ఈ కలియుగంలో మానవులు కామం (కోరికలు) బారినపడి ఏ విధంగా నాశనమై పోతారో ఈ శ్లోకం తెలియజేస్తోంది. ఈ కలియుగంలో మానవులు కోరికలు అనే చక్రభ్రమణంలో కొట్టుమిట్టాడుతూ తమ జీవితాలలో శాంతిని కోల్పోయి మానసిక ఆందోళనలకు గురవుతారని శ్రీ కృష్ణుడు అనాడే  ఊహించాడు. వాస్తవానికి నేడు జరుగుతున్నది కూడా అదే. మానవులకు కోరికలు నియంత్రణలో లేకుండా పోయి, వాటి సాధనకు రేయింబవళ్ళు అవిశ్రాంతంగా పరుగులు తీస్తునే వున్నాడు. కోరికలు అనేవి ఒడ్డుకు చేరే కెరటం వంటివి అని, ఒక కోరిక తీరాక, మరొక కోరిక వెంటనే పుట్టుకొస్తుంది, ఇవి అప్రహతిహతంగా  పుడుతునే వుంటాయి కాబట్టి కోరికలను  తీర్చుకోవడం బదులు నియంత్రించుకోవడం ఒక్కటే మార్గమని గీతాచార్యుడు బోధిస్తున్నాడు.
భగవంతుని భక్తిలో వుండని వారికి ఇంద్రియాల తాకిడి తీవ్రంగా బాధిస్తుంది. చూసినదల్లా కావాలనిపిస్తుంది. వాటిని సాధించాలంటే ఎంతో కొంత కష్టపడక తప్పదు. ఆ కోరిక తీరాక, ఒక్క క్షణం కూడా విరామం లేకుండా మరొక విషయం వైపు బుద్ధి మరలుతుంది. ఈ పరంపరకు ఒక అంతం అంటూ ఉండదు. కాబట్టి ఇవే ఇంద్రియాలను బుద్ధి అనే శక్తితో నిగ్రహించుకుని, వాటిని భగవంతుని ఆరాధన వైపు మరలిస్తే అప్పుడు వాటి ప్రభావం తగ్గి మనకు స్నేహితులుగా మారుతాయి. ఈ భౌతిక జగములో బ్రహ్మ రుద్రులు సహా సమస్త దేవతా లోకం ఇంద్రియార్ధములతో ప్రభావితం చెందినవారే అని అనేక పురాణ గాధలు తెలుపుతున్నాయి . కాబట్టి ఈ చిక్కు ముడి నుండి బయటపడడానికి భగవంతుని భక్తి భావనలో సదా నిమగ్నమై వుండడమే మంచి మార్గం.

భగవంతుని భక్తి సహచర్యంలో భక్తుడు సర్వ విధముల ఇంద్రియ భోగములను త్యజిస్తాడు. భగవంతుని  సేవ లోనే అతనికి సంపూర్ణ ఆనందం దొరుకుతుంది.

ఈ అలౌకిక స్థితిలో అతడిని ఇంద్రియాలు ఏమీ చెయ్యలేక అతనికి బానిస లవుతాయి. అదే భగవంతుని భక్తి యందు చిత్తశుద్ధితో మెలగనివారికి ఇంద్రియాల తాకిడి ఎక్కువగా ఉంటుంది. కోరికలు తీవ్రంగా బాధిస్తాయి. కోరిక తీరాక కలిగే స్వల్ప ఆనందం కంటే తీరనప్పుడు వచ్చే కోపమే వారిని బాధించి చివరకు అధః పాతాళానికి దిగజారుస్తుంది.

ఒకవేళ బలవత్తరమైన కోరిక కలిగి దానిని తప్పక తీర్చుకోవాలన్న ఆశ పుడితే, వెంటనే మనస్సును భగవత్ ధ్యానం వైపు దృష్టి మరల్చాలి. ధ్యానం, యోగాభ్యాసం, ప్రాణాయామం, సద్గ్రంథ పఠన,నామస్మరణ వంటి ఉత్కృష్ట కార్యకలాపాలపై దృష్టి చాలిస్తే, ఆ కోరిక తీర్చుకోవాలన్న ఆశ బలహీనమై పోతుంది. ఈ సాధన చేస్తూ పోతే కొంతకాలానికి కోరికలు పుట్టడం తగ్గిపోతాయన్నది గీతలో చూపిన మార్గం మనందరికీ అనుసరణీయం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here