ప్రాంతీయ సినిమా – 11: కోసలీకి ఆదివాసీ అండ

    4
    6

    [box type=’note’ fontsize=’16’] “1989లో తొలి కోసలీ సమాంతర సినిమా ప్రాణం పోసుకుంది. ప్రాణం పోసుకున్న దరిమిలా ఇప్పటి వరకూ ఇతర ప్రాంతీయ సినిమాల్లాగా కమర్షియలైజ్ అవకుండా దాని మౌలిక స్వరూపాన్ని కాపాడుకుంటోంది” అని సంబల్‌పురీ సినిమాల గురించి విశ్లేషిస్తున్నారు సికందర్ప్రాంతీయ సినిమా – 11: కోసలీకి ఆదివాసీ అండ” వ్యాసంలో. [/box]

    [dropcap style=”circle”]ఒ[/dropcap]కప్పుడు ప్రతీ మారుమూల ప్రాంతపు సమూహాలు సమాంతర సినిమాలతో తమ ఉనికిని చాటుకోవాలని ప్రయత్నించారు. వార్తా సంస్థలకి పట్టని తమ సమస్యలని ప్రపంచానికి ఏకరువు పెట్టాలని కృషి చేశారు. దేశంలో కమర్షియల్ సినిమాలు తొలి స్వర్ణ యుగం, మలి స్వర్ణ యుగం, వ్యాపార యుగం ముగిసి, ఇప్పుడు ప్రపంచీకరణ యుగంలోకి అడుగు పెట్టింది. కానీ ప్రాంతీయ సినిమాల సమాంతర – వాస్తవిక – కళాత్మక కథాచిత్రాల ఒకే యుగం, 1990 పూర్వార్ధంలోనే ముగిసిపోవడంతో, దీని దార్శనికుడైన శ్యాం బెనెగల్ కింకర్తవ్యం ఆలోచించారు. అలా 2000లో, సరీగ్గా ప్రపంచీకరణ ఋతుపవనాలు మొదలైన వాతావరణంలో, బాలీవుడ్ స్టార్స్ సమేత క్రాసోవర్ సినిమాలుగా సమాంతర సినిమాలకి కొత్త వూపిరి పోశారు బెనెగళ్.

    ఇలా సమాంతర సినిమా కమర్షియల్ విలువలు – కళాత్మక విలువల సంగమంగా క్రాసోవర్ సినిమాగా బెనెగళ్ చూపిన మార్గంలో, ఎక్కడెక్కడి యువ దర్శకులూ వచ్చేసి మరింత ముందుకు తీసికెళ్ళారు. ప్రపంచీకరణతో పుష్కలంగా వచ్చి పడుతున్న కార్పొరేట్ పెట్టుబడులు అందుబాటులోకి వచ్చి, కొత్త దర్శకులు కథలతో స్వేచ్ఛావిహారం చేయడం మొదలెట్టారు. దాంతో క్రాసోవర్ సినిమాల్ని కాస్తా మల్టీప్లెక్స్ సినిమాలుగా మార్చేశారు. ఇలా ప్రాంతీయ సినిమా దశల వారీగా పరిణామం చెందుతూ, ఒక పక్క జాతీయ భాషలో ప్రధాన స్రవంతి లోకొచ్చేసింది. మరోపక్క ప్రాంతీయంగానే, ఉపప్రాంతీయంగానే ఆయా స్థానిక భాషల్లో సమాంతర సినిమాలు మసాలా సినిమాలుగా మారిపోయాయి. ఇలా ప్రాంతీయ సినిమాల్ని మల్టీప్లెక్స్ సినిమాలుగా మార్చుకుని హిందీ సినిమాలూ బాగుపడినట్టే, హిందీ సినిమాల్ని ప్రాంతీయంగా మార్చుకుని సమాంతర సినిమాలూ బాగుపడుతున్నాయి. ఈ బాగుకి విషయపరంగా అర్థంపర్థం లేదనేది వేరే విషయం. ఐతే ఈ ఇచ్చి పుచ్చుకునే విధానంలో అటూ ఇటూ మల్టీప్లెక్స్ – ప్రాంతీయ ప్రేక్షకులూ ఖుష్ అయ్యారు, అవుతున్నారు. మధ్యలో ప్రాంతీయ జీవన పరిస్థితులు అనాధలుగా మిగిలిపోయాయి. వార్తా సంస్థలూ వదిలేసి, ప్రాంతీయ సినిమాలు కూడా వదిలేసి, ఎవరికి చెప్పుకోవాలో తెలీక సమస్యల సుడిగుండం అలాగే వుండిపోయింది. వీటి చిత్రీకరణలకి పూర్తిగా కాలం చెల్లిపోయింది.

    ఐతే ప్రాంతీయ సినిమా అనే ఒక స్వచ్ఛమైన కళారూపానికి ఇంత అన్యాయం జరిగిపోయినా, ఒకే ఒక్క చోట మాత్రం చెక్కుచెదరకుండా తన ఉనికిని కాపాడుకుంటోంది. అది కోసలీ భాష ప్రాంతీయ సినిమా. విచిత్రంగా 1990 పూర్వార్ధంలో సమాంతర – ప్రాంతీయ సినిమాల ఉద్యమం చల్లారుతున్న సమయంలోనే, 1989లో తొలి కోసలీ సమాంతర సినిమా ప్రాణం పోసుకుంది. ప్రాణం పోసుకున్న దరిమిలా ఇప్పటి వరకూ ఇతర ప్రాంతీయ సినిమాల్లాగా కమర్షియలైజ్ అవకుండా దాని మౌలిక స్వరూపాన్ని కాపాడుకుంటోంది.

    ఒరియాతో కలిసే కోసలీ భాషని సంబల్‌పురీ అనికూడా అంటారు. పశ్చిమ ఒరిస్సా లోని కోసలీ, సంబల్‌పూర్ ప్రాంతాల్లో మాట్లాడతారు. ఒరిస్సా కోస్తాలో కళింగ, ఉత్కళ ప్రాంతాలు ఇందులో భాగంగా వున్నాయి. ఇప్పుడు ఈ భాష మాట్లాడేవారి సంఖ్య అరులక్షలు. కోసలీ ప్రాంతీయ సినిమాల్ని సంబల్‌పురీ సినిమాలని కూడా పిలుస్తున్నారు.

    1989 లో తీసిన మొట్టమొదటి కోసలీ సినిమా ‘భూకా’ అంతర్జాతీయ ఖ్యాతి నార్జించింది. పశ్చిమ ఒరిస్సా ఆదివాసీల జీవన పరిస్థితులు ఇందులో చిత్రించారు. అభివృద్ధికి దూరంగా అనేక కష్టాలు పడుతున్న ఇక్కడి ఆదివాసీల కథని మౌలికంగా నాటకంగా ప్రదర్శించేవారు. మంగ్లు చరణ్ బిస్వాల్ అనే రచయిత నాటకాన్నే సవ్యసాచి మహాపాత్రా సినిమాగా దర్శకత్వం వహించారు. శరత్ పూజారీ, సంధు మెహర్ తదితరులు నటించారు. పాఠశాలలు, వైద్య శాలలు, విద్యుత్తు, మంచినీరు, రోడ్లు, పక్కా ఇళ్ళూ లేని దుర్భర పరిస్థితుల్లో జీవన పోరాటమెలా చేస్తున్నారో చూపించే ‘భూకా’ అంతర్జాతీయ సమాజాన్ని కదిలించింది. ఈ ఆదివాసీల బ్రతుకు తెరువు డప్పులు వాయించడం తప్ప మరేమీ కాదు. ఉన్నత వర్గాల శుభకార్యాల్లో డప్పులు వాయించి పొట్ట పోషించుకునేవారు. ఈ దైన్య స్థితిని కళ్ళకు కట్టినట్టు చిత్రీకరించడంతో అప్పటి గిజోన్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో, జ్యూరీ అవార్డుతో సత్కరించారు. ఇదీ కోసలీ ప్రాంతీయ సినిమాకి అంతర్జాతీయ గుర్తింపుతో శుభారంభ సన్నివేశం.

    నిజానికి అప్పట్లో ఓ మూడు నాల్గు లక్షల మంది ఈ భాష మాట్లాడే ప్రజలని దృష్టిలో పెట్టుకుని తొలి కోసలీ సినిమా తన ఉనికిని చాటుకోవడమే గొప్ప. అయితే ఆర్ధిక విజయావకాశాలు కన్పించక పోవడంతో, ప్రభుత్వ ప్రోత్సాహం కూడా లేకపోవడంతో, మరెవరూ మరో కోసలీ సినిమా నిర్మించే ఆలోచన తలపెట్టలేదు.

    పాతికేళ్ళు గడిచిపోయాయి. కోసలీ భాషకి ఇంకో సినిమా అంటూ లేకుండానే ఒక తరం గడిచిపోయింది. ప్రపంచీకరణ ప్రభావంతో కూడా ఎవరూ ముందుకు రాలేక పోయారు. అప్పటికి ప్రపంచీకరణ యుగం ప్రారంభమై ఒక దశాబ్దం గడిచిపోయింది. ఇంకప్పుడు 2010లో కోసలీ సినిమా తిరిగి ప్రాణం పోసుకోవడం మొదలెట్టింది…

     ‘ఉలుగులాన్’ (విప్లవం) అనే మరో వాస్తవిక సినిమా రెండో కోసలీ చలనచిత్రంగా 2010లో సంచలనం రేకెత్తించింది. దీని దర్శకుడు మెహమూద్ హుస్సేన్. నిర్మాత పూర్ణబసి సాహు. దీన్ని చారిత్రక సినిమాగా తీస్తూ, 18వ శతాబ్దపు నాగపూర్ పాలకుల దురంతాల్ని చిత్రించారు. మళ్ళీ పాతికేళ్ళకి, తొలి కోసలీ ‘భూకా’ తీసిన సవ్యసాచి మహాపాత్ర కూడా అస్త్ర శస్త్రాలు పైకి తీసి, 2011లో ‘సమియార్ ఖేల్’ తీశారు. ఈ రెండిటికీ ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వచ్చింది. ఆదివాసీ ప్రజానీకం – యువతరం ప్రపంచీకరణకి దూరంగా వుండి పోవడంవల్ల, వాళ్ళ అభిరుచులు ప్రభావితం కాకపోవడం వల్లా – మిగతా దేశంలో ప్రాంతీయ సినిమాల ట్రెండ్ మారిపోయినా, తమ ప్రాంతీయం కోసలీ సినిమాని కోసలీ వాస్తవిక సినిమాల్లాగే ఆదరించారు. తరం మారినా ఆదరణలో మార్పు లేదు.

    ఇక సవ్యసాచి తన విజృంభణ ఆపలేదు. కోసలీ సినిమా అంటే తనే అన్నట్టుగా ఒకదాని తర్వాత ఒకటి నిర్మిస్తూ అవార్డులు పొందుతూ పోయారు. 2013లో ‘సాలా బుడ్డా’ తీశారు. తన తండ్రి కపిలేష్ ప్రసాద్ మహాపాత్ర ఇదే పేరుతో రాసిన నవల ఆధారంగా దీన్ని తెర కెక్కించారు. 20వ శతాబ్దపు ఆరంభంలో వీరమిత్రదయా సింగ్ దేవ్ – ఆయన కింద పనిచేసే వ్యవసాయ కూలీలకీ సంబంధించిన ఇతివృత్తమిది.

    2014లో ‘సాలా బుడ్డా’ కి సీక్వెల్ గా ‘ఆదిమ్ విచార్’ తీశారు. ఆదివాసీల మధ్యకి విద్యావంతులైన వ్యక్తులొస్తే ఆదివాసీల జీవితాలు ఎలా చెదిరి పోతాయో ఇందులో చూపారు.

    2015 లో ‘పహాడా రా లుహా’ తీశారు. కోరాపుట్‌లో పారిశ్రామీకీకరణ వలన నిరాశ్రయులైన ఆదివాసుల కథతో ఇది తీశారు.

     

    ఇలా సవ్యసాచి మహాపాత్ర సినిమాల పరంపర తర్వాత, దర్శకుడు ప్రదీప్ భోల్ అందుకుని 2016 లో ‘చీనీ’ అనే కుటుంబ సినిమా తీశారు. ఐతే ఇది ఆదివాసీల కథతో కాదు. వ్యాధిగ్రస్తురాలైన చీనీ అనే గ్రామీణ బాలికతో ఆమె కుటుంబం పడే కష్టాలు ఇందులో కడు దయనీయంగా చూపించడంతో, కన్నీళ్లు పెట్టుకోని ప్రేక్షకుల్లేరు.

    2010లో పునఃప్రారంభం తర్వాత మొత్తం ఎనిమిది కోసలీ సినిమాలు ఇప్పటికి వచ్చాయి. ఐతే ఇవి వాటి మౌలిక స్వరూపాన్ని వదులుకోకపోవడమే వీటి గొప్పతనం. 2016 తర్వాత ఇప్పటి వరకూ మరో సినిమా లేక మౌనంగా వుంది కోసలీ సినిమా. కారణం తెలియదు. కానీ అవకాశం వుంది. ఇటు వైపు మళ్ళీ కొత్త దర్శకులు దృష్టి పెట్టాలేమో. ఏదేమైనా తీసిన తొమ్మిది సినిమాలతో గుణాత్మకంగా పతనం కాలేదు కోసలీ ప్రాంతీయ వాస్తవిక సినిమా.

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here