కొత్త కోక

0
8

[dropcap]“ఒ[/dropcap]రేయ్ చిన్న బాబూ! ఇంకా రెడీ అవ్వలేదా? అప్పుడే టైం తొమ్మిదైపోతోంది. కొట్టు తెరవాలి. సూరిగాడు కొట్టు తెరవడానికి వచ్చేస్తాడు.”

“సరే అన్నా! నువ్వు వెళ్లి  కొట్టు తియ్యి. నేను పావుగంటలో వచ్చేస్తా!” అన్నాడు చిన్నబ్బు.

పెద్దబ్బు, చిన్నబ్బు అన్నదమ్ములు. అసలు పేర్లు వెంకటాచారి, నరసింహాచారి.  ఇద్దరిదీ ఉమ్మడి బంగారం కొట్టు. షాప్ అంటే పెద్ద షోరూమ్ కాదు సుమండీ. వంశపారంపర్యంగా వస్తున్న కులవృత్తి. చిన్న షాప్. అయినా కస్టమర్స్ ఎక్కువే. బంగారు నగలను పురమాయిస్తే కంసాలిల చేత వస్తువులు చేయిస్తారు. వెండి వస్తువులు కూడా అమ్ముతారు. మంచి వ్యాపారం జరుగుతుంది. ఉదయం 10 నుంచి రాత్రి ఎనిమిదిన్నర వరకు ఒకటే రద్దీ. పెళ్లిళ్ల సీజన్ అయితే అసలు ఖాళీ ఉండదు. ఆ ఇద్దరు అన్నదమ్ములు కలిసి ఉంటారు. వారిది ఉమ్మడి కుటుంబం. ఆడవాళ్ళు కూడా అక్కచెల్లెళ్లలా కలిసిమెలిసి ఉంటారు. వెంకటాచారి క్యాష్ కౌంటర్ దగ్గర కూర్చుని అమ్మకాలు చూస్తాడు, నరసింహాచారి ఆర్డర్స్ తీసుకుని, కంసాలిని పిలిపించి, నగలు చేయిస్తాడు. ఇది వాళ్ళ దినచర్య.

మంగమ్మ వాళ్ళ ఇంట్లో పని చేస్తుంది. ఈ పని ఆ పని అని కాక, సొంత మనుషుల్లా ఉంటుంది. మంగమ్మకి ఇద్దరు కొడుకులు. పెద్దవాడి పేరు అప్పన్న. ఆటో రిక్షా అద్దెకు తీసుకుని నడుపుకుంటూ ఉంటాడు. చిన్నవాడు సూరన్న. వాడు బంగారం షాపు తుడుస్తాడు. తర్వాత కూలి పనికి పోతాడు. బంగారం కొట్టు తుడిస్తే వచ్చే మట్టిని కొంటాడు. ఆ మట్టిని జల్లెడ పడతారు. అలా జరిగినప్పుడు అక్కడ కిందపడిన కొన్ని రాళ్లు మిగులుతాయి. అవి ద్రావకంలో మూసపోసి చూస్తారు. అప్పుడప్పుడు కొద్దిగా బంగారం దొరుకుతుంది. దాన్ని మళ్లీ షాపు ఓనర్ కొంటారు. 500 రూపాయల ఖరీదు చేసే బంగారం వచ్చిందనుకోండి. దానిని వాళ్లు 300 రూపాయలకి కొంటారు. అక్కడ కూడా వాళ్ళకు కొంచెం లాభమే. ఎంతో కొంత వస్తుందిలే అని ఆశతో  అలాంటి రాళ్లు పట్టుకొని స్వాతి చినుకు కోసం ముత్యపు చిప్పలా  ఎదురుచూస్తూ ఉంటాడు సూరన్న. ఇప్పుడు తెలిసిందాండీ! మన పెద్దలు షాపు తీయడానికి, దుమ్ము తొలగించడానికి ఎందుకు కంగారు పడ్డారో.

ఆ రోజు మంగమ్మ పుట్టినరోజు. అన్నదమ్ములిద్దరూ మంచి చీర కొందామని అనుకున్నారు. పెద్దవాడు అప్పన్న, “ఒరేయ్ సూరిగా! నిన్ననే బియ్యం కొనేసాను. నా దగ్గర ఎక్కువ డబ్బులు లేవు. రెండు వందలు ఉన్నాయి” అన్నాడు. సూరన్న వెంటనే, “పర్వాలేదు పెద్దోడా! నేను ఇవాళ కొనే మట్టిలో తప్పక ఎంతో కొంత మన వాటా వస్తుందిలే. వెళ్లి, మంచి చీర కొంటాను” అన్నాడు. అన్నదమ్ములిద్దరూ ఆశపడ్డారు. మంగమ్మ పొద్దున్నే పనికి వెళ్లి పోయింది .

సూరిగాడు బంగారం  షాప్ దగ్గర నిలబడ్డాడు. వెంకటాచారి వచ్చి, “ఒరేయ్ సూరిగా, త్వరగా షాప్ క్లీన్ చేయాలి, ఆ తర్వాత మార్కెట్‌కి వెళ్ళాలి” అంటూ తాళాలు ఇచ్చాడు. “ఇయ్యాల అమ్మ పుట్టినరోజు. మట్టి తీసుకుని ద్రావకం కొట్టుకి వెళ్ళాలి. మార్కెట్‌కి వెళ్ళలేను” అని ప్రాధేయపడ్డాడు.

“నోరు ముయ్యిరా! నీకు ఒళ్లు బలిసి కొట్టుకుంటున్నావ్. నాకు ఎదురు చెప్తావా? ద్రావకం కొట్టుకు తర్వాత వెళ్ళి చావు. నీకు వేరే పని ఉంది” అన్నాడు వెంకటాచారి.  దానికి సూరి, “అయ్యా! నాకు మూడు వందల రూపాయలు ఇవ్వండి. తర్వాత బంగారం దొరికితే మినహాయించుకుని ఇద్దురు గాని” అన్నాడు .

“దేనికి రా?” అన్నాడు విసుగ్గా.

“అమ్మకు చీర కొంటానయ్యా” అన్నాడు సూరిగాడు. అంతే  డబ్బాలో రాళ్లు గిలకరించినట్టు నవ్వాడు, యజమాని. “తినడానికి ముద్ద లేదు. చీరలు కావాలి రా? ముందు పని చూడు” అని కసిరాడు.

చేసేదేమీ లేక సూరిగాడు షాపు తుడిచి మట్టి సంచిలో వేసి, “ఇదుగోండి. మట్టి  మీ దగ్గరే ఉంచండి. నేను మీ పని మీద వెళుతున్నాను” అంటూ సైకిల్ వేసుకుని వెళ్ళాడు.

వచ్చేసరికి 12 అయింది. ఇంక అప్పుడు ద్రావకం పోసి, బంగారు చేసే సత్తా లేక కళ్ళ నీళ్ళు తుడుచుకుని షాపులోనే కూర్చున్నాడు సూరన్న.

నరసింహాచారి దాన్ని గమనించి, “ఒరేయ్! సూరిగా!  ఇలా రా!” అని పిలిచాడు. లోపలికి తీసుకెళ్లి, “ఏరా  ఎందుకు ఏడుస్తున్నావు?” అన్నాడు.

వాడు వెక్కివెక్కి ఏడుస్తూ “చిన్న బాబు గారు! ఈయాల మా అమ్మ పుట్టినరోజు. చీర కొందామంటే డబ్బులు లేవు. ఇప్పుడు ఇంక పని చేయలేనయ్యా!” అంటూ భోరుమన్నాడు.

“ఓర్నీ అంతేగా? నేను ఇస్తా లే. అన్నకు చెప్పకు. ఎంత కావాలి?” అనగానే సూరన్నకి నోట మాట రాలేదు. కాళ్ల మీద పడి “ ₹300 చాలయ్యా” అన్నాడు. మళ్ళీ తానే, “బంగారం దొరికితే అందులో జమ చేసి కొందురు గాని” అన్నాడు.

“సరే లేరా!” అంటూ 300 రూపాయలు ఇచ్చాడు నరసింహాచారి. సూరన్నకి ఎక్కడలేని శక్తి వచ్చింది .

యజమాని దగ్గర మట్టి సంచి తీసుకుని, తన స్నేహితుడిని పిలిచి, “ఎలాగైనా నా కోసం దీన్ని ద్రావకంలో పోసి బంగారం చేయించరా!” అన్నాడు.

“అలాగే అన్నా నువ్వు పోయి రా” అన్నాడు సుబ్బిగాడు.

“ఒరేయ్ సుబ్బి! ఇవాళ అమ్మ పుట్టిన్రోజు, నీ బువ్వ మా  తోటే. మా ఇంట్లో!” అని చీర కొనడానికి వెళ్ళాడు. అన్న డబ్బులు, చిన్న దొర తనకు ఇచ్చిన డబ్బులు కలిపి చీరల దుకాణంకు చేరుకున్నాడు.

హుషారుగా జోరుగా సైకిల్ తొక్కుతూ ఇంటికి వెళ్లాడు. అప్పటికే అప్పన్న వచ్చేశాడు. ‘అదేంటి? అన్న అప్పుడే వచ్చాడు!’ అనుకొని లోపలికి వెళ్ళాడు సూరి. మంచం మీద పడుకొని ఉన్న తల్లిని చూసి నివ్వెరపోయాడు. “తమ్ముడు! కంగారు లేదు రా! అమ్మకి నీరసం వచ్చింది. డాక్టర్ దగ్గరికి తీసుకు వెళ్లి వచ్చాను” అన్నాడు. సంచీలోంచి చీర తీసి, “సరే అన్నా ఇదిగో అమ్మకి కోక” అన్నాడు  సూరి. “బాగుంది. దాచిపెడదాం, తర్వాత కడుతుంది లే!” అన్నయ్య చెప్పాడు. కాసేపు అయ్యేసరికి సుబ్బు వచ్చాడు.

“అన్నా! ఈ రోజు మెరుపు దొరకలే!” అన్నాడు. మెరుపు అంటే బంగారం. “సరేలే రేపు చూద్దాం” అనుకున్నారు వాళ్లు.

కానీ దొరికినా దొరక్కపోయినా మట్టికి డబ్బు ఇవ్వాలి కదా అనుకుంటూ సూరి గాడు, సరే అని సరిపెట్టుకున్నాడు. ఇది వాళ్ళ ఆశ. దొరుకుతుందనే ఆశతో వీళ్ళు, బంగారం ఎంతో కొంత చౌకగా  వస్తుందని యజమానులు,  గోతికాడ నక్కలా ఎదురు చూస్తారు. ఈ సందున  చిన్న ముక్క కూడా దొరకలేదు.

ఇలా మూడు రోజులయ్యాక, ఒకనాడు ఇంటికి వెళ్ళేసరికి, ఇల్లు తాళం పెట్టి ఉంది. అప్పన్న ఆటో పక్కనే పార్క్ చేసి ఉంది. పక్కింటి సత్తిబాబు వచ్చి “ఒరేయ్ సూరిగా! మీ అమ్మకి జబ్బు తిరిగేసేసింది. అన్న ఆసుపత్రికి తీసుకు వెళ్ళాడు” అన్నాడు.

“అయ్యో!” అంటూ సైకిల్ మీద సూరి ప్రభుత్వ దవాఖానకు పరుగున వెళ్ళాడు. వెళ్లేసరికి అంతా అయిపోయింది.

అప్పన్న బయట నిలబడి భోరుమంటూ, ఏడ్చాడు. “పోయిందిరా సూరీడూ,  ఇంక నాకు నువ్వు, నీకు నేను” అన్నాడు. ఆసుపత్రి వారి నిబంధనలు అన్నీ పూర్తి చేసుకుని, ఆమెను ఇంటికి తీసుకుని వచ్చారు.

ఆ గూడెంలో అందరూ బాధపడుతూ గుమిగూడారు. దహనానికి ఏర్పాట్లు గూడెం పెద్దలు చేశారు. కర్మకాండ అయాక  ఇంక తీసుకెళ్దాం అనేసరికి, సూరిగాడు ఏదో గుర్తుకు వచ్చిన వాడిలా “ఆగండి” అని గట్టిగా అరిచాడు. ఏమిటా అని అందరూ చూస్తూ ఉండగా, లోపలికి వెళ్లి కొత్త కోక తీసుకొచ్చాడు .

“ఇది అమ్మ కోసం కొన్నది.  ఆవిడ మీద వేయండి”  అంటూ సొమ్మసిల్లి పోయాడు

ఇది జీవనచిత్రం.

మనిషి ఆశాజీవి. రేపు బాగుంటుంది. ఎల్లుండి ఇంకా బాగుంటుంది అనుకుని బండి లాగించేస్తాడు.

సూరిగాడు అన్నతో అమ్మ వెళ్ళింది రా అన్నప్పుడు మిగిలింది అన్నాడు. “ఏం చేద్దాము లేరా ఊరుకో!”  అని అప్పన్న ఊరడించాడు.

ఇది వాస్తవం. జరిగిన కథ. జరుగుతున్న సత్యం. జరగబోయే నిశ్చయం. అందుకే కొత్త కోక తిరిగిరాని లోకాలకు తరలిపోయిన తల్లికి అంకితం.

గోరంత దీపం ఇల్లంతా వెలుగు, రేపు అనే ఆశ మనసుకి వెలుగు….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here