కాజాల్లాంటి బాజాలు-41: కొత్త పాఠాలు ఎక్కడ చెపుతారూ!

8
5

[box type=’note’ fontsize=’16’] ఉదయం లేస్తే చుట్టూ జరుగుతున్న సంఘటనలు ఒక్కొక్కసారి ఆనందాన్ని, ఇంకొక్కసారి సంభ్రమాన్నీ కలిగిస్తున్నాయని, వాటిని అక్షరమాలికలుగా చేసి సంచిక పాఠకులకు అందిద్దామనే ఆలోచనే ఈ శీర్షికకు నాంది అంటున్నారు ప్రముఖ రచయిత్రి జి.ఎస్. లక్ష్మి. [/box]

[dropcap]ఈ[/dropcap] రోజుల్లో బతకడానికి కావల్సిన మార్గాలు బోధించే స్కూల్ ఎక్కడైనా వుంటే ఎవరైనా కాస్త చెప్పండీ.. వెంఠనే చేరిపోతాను. ఇప్పుడు ఈ వయసులో నీకు బతకడానికి మార్గాలు తెలీవా అంటారా.. నిజమేనండీ.. నిజంగానే తెలీటంలేదు. ఎందుకంటే రోజులు మారిపోయినట్టున్నాయి. ఇదివరకులా వుంటే బతకలేనేమోననే భావనకి వచ్చేసేను.

అసలు సంగతేంటంటారా! ఇదిగో, చెపుతాగా.. నేను ఇంట్లోంచి బయటకెడితే రోడ్డు మీదా, పబ్లిక్ ప్లేసెస్ లోనూ కాస్త మర్యాద పాటిస్తాను. అలా చెయ్యడం వల్ల అక్కడివాళ్ళు నన్నొక చేతకానిదానికింద లెక్కకట్టేసి, నన్ను పక్కకి తోసేసి, వాళ్ల పనులు చేసేసుకుని వెళ్ళిపోతున్నారు.

అసలు జరిగిన విషయం యేంటంటే…

పొద్దున్న డయగ్నస్టిక్ లాబ్‌కి టెస్టులు చేయించుకుందుకు వెళ్ళేనా.. అంత పొద్దున్నే ఆటో యెక్కి పెద్దనోటిస్తే చిల్లర లేదంటాడని ఆటోకీ, అక్కడ టెస్టులకి కట్టడానికీ అన్నీ పధ్ధతిగా 500 నోట్లూ, 200 నోట్లూ, 100 నోట్లూ, 50 నోట్లూ, 10నోట్లూ ఇలా అన్నీ మళ్ళీ ఇబ్బంది పడకుండా పధ్ధతిగా తీసికెళ్ళేను. ఆ టెస్టులు చేసే దగ్గర కౌంటర్‌లో ఆవిడ బిల్లు వేస్తుంటే ఆలస్యం కాకుండా వుండడానికి నేను డబ్బులు తీసి చేత్తో పట్టుకున్నాను. ఇంతలో నా పక్కకి ఒక నడివయసతను వచ్చి, కౌంటర్‌లో ఉన్న అమ్మాయికి 100 నోటిచ్చి చిల్లర ఇమ్మన్నాడు. తన దగ్గర చిల్లర లేదని చెప్పిందా అమ్మాయి. అంతే.. బిల్లు కట్టడానికని పట్టుకున్న నా చేతిలో నోట్లలోంచి గభాలున రెండు 50 నోట్లు లాగేసుకుని, వందనోటు అక్కడ టేబుల్ మీద పడేసి వెళ్ళిపోయేడు. నేను తెల్లబోయేను. చిల్లర ఇమ్మని నన్ను అడగలేదు, తీసుకుంటూ ఎక్సూజ్ మీ అనలేదు, వెడుతూ థాంక్స్ చెప్పలేదు. ఏదో గూండాలాగా నా చేతిలో డబ్బులు లాగేసుకున్న అతన్ని చూసి బెదిరిపోయేను.

రోడ్డు మీద నడుస్తుంటే వెనకాల్నించి స్పీడుగా వచ్చి మెళ్ళో చెయిన్ లాక్కుపోయే వాళ్లని చూసేను. జేబుదొంగల్ని చూసేను. పర్సు దొంగల్ని చూసేను. కానీ ఇలా పక్కనున్న మనిషి చేతిలో పట్టుకున్న డబ్బులు దౌర్జన్యంగా లాగేసుకునే సాటి మనిషిని ఇదే చూడడం. అతన్ని తిట్టి, దెబ్బలాడాలన్న ఆలోచన కూడా లేనంత మొద్దుబారిపోయింది నా మెదడు. కానీ ఆ పెద్దమనిషి మటుకు ఇదేమీ పట్టించుకోకుండా పెళ్ళాంతో ఠీవిగా లోపలికెళ్ళిపోయేడు.

ఇదిలా జరిగిందా!.. వెజ్ ఫ్రెష్ షాప్‌లో ఇంకో సంఘటన..

పొద్దున్నే కూరలు కొనడానికి మా ఇంటి పక్కనున్న సూపర్ ఫ్రెష్‌కి వెళ్ళేనా.. ఎవరో ఒకతను పాతిక ముఫ్ఫైయేళ్ళుండొచ్చు, అప్పుడే మంచంమీంచి లేచి వచ్చినట్టున్నాడు.. జారిపోతున్నట్టున్న నిక్కరూ, వేళ్ళాడిపోతున్న టీ షర్టూ వేసుకున్నాడు. జుట్టు సంగతి చెప్పక్కర్లేదు, పక్కల్నంతా గొరిగించేసుకుని, నడినెత్తిమీద నిక్కపొడుచుకున్నట్టున్న నాలుగు వెంట్రుకలతో పిల్లలు కామిక్ స్టోరీల్లో చదివే కారెక్టర్‌లా వున్నాడు. దానికి పూర్తిగా వ్యతిరేకంగా ఇంత పొడుగ్గా గడ్డం పెంచేసేడు. ఉండవలసినచోట జుట్టు ఉండకుండా అఖ్ఖర్లేని చోట అంత గడ్డం పెంచేసిన ఆ శాల్తీ కూరల రేక్ ముందు అడ్డంగా నిలబడి చేతిలో మొబైల్ నుంచి ఏదో మాట్లాడుతూనే వున్నాడు. అతను రాక్ లోంచి కూరలు తీసుకోడూ, వెనకాలవాళ్లకి దారివ్వడూ. అదేంటో అతని స్వంతింట్లో వుండి మాట్లాడుతున్నట్టు అందరికీ అడ్డంగా అక్కడే నిలబడి అలా మాట్లాడుతూనే వున్నాడు. వెనకాల నలుగురు అతనెప్పుడు అక్కణ్ణించి కదుల్తాడా అని చూస్తున్నారు. అసలు అతనేం మాట్లాడుతున్నాడా అని కాస్త చెవటు అప్పగించేను.

“నో బుల్లూ, నువ్వు చెప్పినట్టు దొండకాయలు సన్నగా చిన్నగా లేవు. మన పక్క ఫ్లాట్ ఆంటీలాగా గుండ్రంగా, పొట్టిగా వున్నాయి, హ హ (తను వేసిన జోక్ కి మళ్ళీ వెధవ నవ్వోటీ.) పోనీ బెండకాయలు తెద్దావంటే మన పై ఫ్లాట్ నారాయణలాగా ముదిరిపోయున్నాయి.. హ హ (మళ్ళీ వెధవ నవ్వే). ఏం చైనూ!”

వీడి మొహం తగలెయ్యా.. పొద్దున్నే అందరికీ అడ్దంగా నిలబడి పెళ్ళాంతో కబుర్ల కాలక్షేపం చేస్తున్న అతన్ని చూస్తుంటే ఒళ్ళు మండిపోయింది. ఎక్కణ్ణించి మాట్లాడుతున్నాడో, ఏం మాట్లాడుతున్నాడో పట్టించుకోని అతన్ని చూస్తుంటే నాకు భలే ఆశ్చర్యమేసింది.

అంతా అయాక బిల్ కట్టడానికి నిలుచుంటే ఈ సదరు పెద్దమనిషే నా వెనకాల ఇంకా ఇద్దరున్నా వాళ్ళ నెత్తిలమీంచి, నన్ను దాటుకుని కౌంటర్ మీద బాస్కెట్ పెట్టేస్తున్నాడు. అసలేవిటితని ఉద్దేశం! వెనక్కి తిరిగి కోపంగా చూద్దామనుకున్నాను కానీ నాకున్న మర్యాదనే వెధవ అలవాటు నన్నా పని చెయ్యనివ్వలేదు.

సరే, అక్కణ్ణించి బాంక్‌కి వెళ్ళానా.. అక్కడ భాగోతం ఇంకోలా వుంది. నా అకౌంట్ గురించి కొన్ని సందేహాలుండి వాటి గురించి కనుక్కుందామని కౌంటర్ ముందు ఇంత పొడుగున్న క్యూలో నిలబడ్దాను. అదేమిటో, క్యూ యెంతకీ కదలటం లేదు. విషయమేమిటా అని చూస్తే కౌంటర్‌లో వున్నతను మొబైల్‌లో ఎవరితోనో మాట్లాడుతున్నాడు. ఇది చూసి నా వెనకాల నిలబడ్ద ఓ పెద్దమనిషి క్యూలోంచి బైట కెళ్ళిపోయేడు. ఇంక నిలబడలేక వెళ్ళిపోయేడనుకున్నాను కానీ, పక్క కిటికీ పక్కన కనిపించేడు. ఏం చేస్తున్నాడా అని కుతూహలంగా చూస్తే, చేతిలో మొబైల్ తీసుకుని ఎవరితోనో మాట్లాడ్దం మొదలుపెట్టేడు. అప్పుడే మొబైల్ కిందపెట్టి కౌంటర్ ముందున్న మనుషుల వైపు తిరిగిన బాంక్ ఉద్యోగి, మొబైల్ పిలుపు విని మళ్ళీ దాన్ని చెవికి అతికించేసుకున్నాడు. ఇవతల కిటికీ పక్కనించి ఈయన మొబైల్‌లో సందేహాలడగడం, కౌంటర్‌లో వున్నాయన జవాబు లివ్వడం అయిపోగానే, మొబైల్ జేబులో పెట్టెసుకుని, కిటికీ పక్కనుంచి ఆ పెద్దమనిషి బాంక్ నుంచి బయటకెళ్ళిపోయేడు. “హారినీ..” అనుకున్నాను. ఇలా నాలా క్యూలో నిలబడినవాళ్లందరూ తెలివితక్కువ దద్దమ్మలన్నమాట. ఎదురుగా వున్న మనిషికన్న ఎక్కడో వున్న మొబైల్‌లో మాట్లాడిన మనిషి సంగతే వీళ్ళు చూస్తారన్నమాట.

మరి చుట్టూ ఇలాంటి మంచీమర్యాదా తెలీని వాళ్ళున్నప్పుడు నేను కూడా అలా లేకపోతే ఎలా బతగ్గలనూ! అందుకే బతకడానికి కావల్సిన కొత్త మార్గాలు నేర్చుకుందుకు క్లాసులకి వెళ్ళాలనుకున్నాను.

ఆ క్లాసులో నాకేం నేర్పాలంటే,

  1. బైట కెళ్ళినప్పుడు నీట్‌గా తయారయి వెళ్ళక్కర్లేకుండా, చిరిగిపోయి, నలిగిపోయిన బట్టలతో మహదానందంగా ఎలా వెళ్ళొచ్చో…
  2. అక్కడ ఎంతమందున్నా సరే తోసుకుంటూ వెళ్ళి మన పని మనం ఎలా చేసుకొచ్చేయ్యాలో,
  3. పనున్నా లేకపోయినా మొబైల్ చెవికతికించేసుకుని ఏదోటి మాట్లాడుతూనే వుండడమెలాగో,
  4. పక్కనున్నవాళ్ళని పట్టించుకోకుండా ముందుకి తోసుకుని ఎలా వెళ్ళిపోవాలో,
  5. ఎవరికీ సారీ కానీ థాంక్స్ కానీ చెప్పకుండా ఎలా ఆపుకోవాలో,
  6. ఈ ప్రపంచంలో నేనే మొనగాణ్ణి, నాకెదురు వచ్చినవాళ్ళంతా వెధవలు అనే ఎక్స్‌ప్రెషన్ ఎలా యివ్వాలో,
  7. ఇంట్లో వండుకోకుండా రోజూ స్విగ్గీ నుంచీ, జొమాటో నుంచీ ఫుడ్ ఎలా తెప్పించుకోవాలో

ఇంకా ఇలాంటి ఈ రోజుల్లో బతకడానికి పనికొచ్చే విధానాలు నేర్పాలి.

అలాంటి స్కూల్ ఎక్కడైనా వుంటే చెప్పండి.. వెంఠనే చేరిపోతాను. మీకందరికీ ముందుగానే థాంక్స్.. అయ్యయ్యో అన్నట్టు థాంక్స్ చెప్పకూడదు కదూ! మర్చేపోయేను.

వెంఠనే చెప్పెయ్యండి.. చెప్పకపోయారో మీ పని నేనే చెపుతా.. (ఇలాగ అనడం నేర్చుకోవాలేమో..)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here